కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 4/15 పేజీలు 28-30
  • సైన్యాలు మనకు ఎల్లప్పుడూ అవసరమౌతాయా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సైన్యాలు మనకు ఎల్లప్పుడూ అవసరమౌతాయా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • భౌగోళిక “పోలీసు” కొరకైన కోరిక
  • “సైన్యములకధిపతియగు యెహోవా”
  • దేవుని సైన్యాలు యుద్ధరంగంలోకి ప్రవేశిస్తాయి
  • యుద్ధం లేని లోకాన్ని ఊహించుకోండి
  • నిజమైన శాంతి—ఏ మూలం నుండి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ‘సత్యాన్ని శాంతిని ప్రేమించండి’!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 4/15 పేజీలు 28-30

సైన్యాలు మనకు ఎల్లప్పుడూ అవసరమౌతాయా?

సైన్యాల కొరకు మానవ వనరుల్లో చాలా ఎక్కువ మొత్తం ఖర్చు చేయబడింది, అవి మానవుని సంతోషంలో అధిక భాగాన్ని హరించాయి కూడా. అందుకే కొంతమంది ప్రజలు ఇలా ఆలోచించారు, ‘సైన్యాలను రద్దు చేయడాన్ని అనుమతించే విధమైన ప్రపంచ భద్రతను మానవజాతి ఎన్నటికైనా సాధిస్తుందా?’ ఇప్పుడు సామూహిక వినాశనాస్త్రాలు భూమిపైని జీవ రాశులన్నింటినీ అంతరింపజేయడాన్ని సాధ్యం చేయగలిగినందున, ఈ ప్రశ్న మరింత అత్యావశ్యకమౌతుంది. సైన్యాలు లేని ప్రపంచం కొరకు నిరీక్షించడం ఎంత మేరకు వాస్తవికంగా ఉంటుంది?

మంచి అంతర్జాతీయ సంబంధాలు నమ్మకాన్ని ఉత్పన్నం చేసినప్పుడు, అది నిరాయుధీకరణకు దారితీయగలదని అనేక పూర్వపు దృష్టాంతాలు నిరూపించాయి. ఉదాహరణకు, కెనడా అమెరికాల మధ్యనున్న సాధారణ స్నేహభావం మూలంగా, వారి 5,000 కిలోమీటర్ల పొడవున్న సరిహద్దును దాదాపు ఒకటిన్నర శతాబ్దాల పాటుగా సైన్యాలు పరిరక్షించడం లేదు. నార్వే స్వీడన్‌లు కూడా అదే విధమైన సామరస్యాన్ని సాధించాయి, అలాగే అనేక ఇతర దేశాలు కూడా సాధించాయి. దేశాలన్నింటి మధ్యా ఒప్పందాన్ని స్థాపించడం, సైన్యాలు లేని లోకాన్ని తీసుకురాగలదా? మొదటి ప్రపంచ యుద్ధంలోని బీభత్సాల మూలంగా, ఆ ఆలోచన అపూర్వ జనాదరణను సంతరించుకుంది.

మరి 1918లో శాంతి సాధించబడినప్పుడు, “దేశాలన్నీ ఆయుధ ఉపయోగాన్ని సాధారణంగా తగ్గించనారంభించడాన్ని సాధ్యపర్చాలన్నది” వర్సేలీస్‌ శాంతి ఒప్పందానికున్న సంకల్పల్లో ఒకటి. ఆ తర్వాతి సంవత్సరాల్లో, యుద్ధ నివారణ వాదం జనాదరణ పొందింది. యుద్ధం అనేది ఒక దేశం ఎదుర్కొనే పరిస్థితుల్లోకెల్లా ఎంతో భయానకమైనదనీ, కాబట్టి అది ఓటమిని ఎదుర్కొనడం కంటే కూడా చాలా ఘోరమైనదనీ కొంతమంది యుద్ధ నివారణ వాదులు సిద్ధాంతీకరించారు. అయితే, గత శతాబ్దాల్లో పలు ప్రాంతాల్లోని యూదులు, తమపై దాడి చేస్తున్న వారిని ఎదుర్కునేందుకు ఆయుధాలను అంతగా ఉపయోగించలేదు, అయినప్పటికీ వారిని నిర్మూలించాలనే క్రూరమైన ప్రయత్నాలు కొనసాగాయని సూచిస్తూ, యుద్ధ నివారణ వాదాన్ని వ్యతిరేకించిన వారు పై విషయాన్ని నిరాకరించారు. తమను అమెరికాలకు బానిసలనుగా తెచ్చినవారికి విరుద్ధంగా ప్రతిఘటించేందుకు ఆఫ్రికావారికి ఎలాంటి అవకాశమూ లేకపోయింది, అయినప్పటికీ వాళ్లు అనేక శతాబ్దాలుగా క్రూరంగా హింసించబడ్డారు.

అయితే, రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో, దేశాలకు భద్రత అవసరమని యుద్ధ నివారణ వాదులు అనేకమంది తీర్మానించారు. కాబట్టి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి స్థాపించబడినప్పుడు, నిరాయుధీకరణపై కాక దాడి చేయడాన్ని నివారించేందుకైన అంతర్జాతీయ సహకారంపై ఎక్కువ అవధానాన్ని నిలపడం జరిగింది. ఆ విధంగా కల్పించబడిన భద్రత, దేశాలు నిరాయుధీకరణ వైపుకు పయనించేందుకు వారికి నమ్మకాన్నిస్తుందని సభ్య దేశాలు ఆశించాయి.

మరొక సమస్య మరింత స్పష్టంగా తెలియవచ్చింది. తరచూ తనను సురక్షితం చేసుకునేందుకు ఒక దేశం తీసుకునే చర్యలు, దాని పొరుగు దేశం అభద్రతా భావానికి గురయ్యేలా చేశాయి. ఈ విషవలయం ఆయుధాల పోటీకి దారి తీసింది. అయితే ఇటీవల, ప్రముఖ దేశాల మధ్య మెరుగుపడిన సంబంధాలు నిరాయుధీకరణను గురించిన నిరీక్షణను బలపర్చాయి. అయితే, ఆ తర్వాత జరిగిన గల్ఫ్‌ యుద్ధమూ పూర్వపు యుగోస్లేవియాలోని సమస్యలూ నిరాయుధీకరణను గురించి అనేకులకున్న ఆశలను తునాతునకలు చేశాయి. దాదాపు ఐదు సంవత్సరాల క్రితం, టైమ్‌ పత్రిక ఇలా వ్యాఖ్యానించింది: “ప్రచ్ఛన్న యుద్ధం అంతమైనప్పటికీ, అప్పటినుండి ప్రపంచం మరింత తక్కువ కాదు గానీ మరింత ఎక్కువ ప్రమాదకరమైన స్థలంగా మారింది.”

భౌగోళిక “పోలీసు” కొరకైన కోరిక

అందరినీ కాపాడేందుకు తగినంత శక్తిగల ఏకైక ప్రపంచాధికారం మానవజాతికి అవసరమని, పరిశీలకులు అనేకులు చెబుతారు. ఐక్యరాజ్య సమితి గానీ, ప్రముఖ ప్రపంచ సైనిక శక్తులు గానీ దీన్ని సాధించే సామర్థ్యాన్ని కలిగి లేరు గనుక, భవిష్యత్తు గురించి ఎలాంటి నిరీక్షణా లేదని కొందరు భావిస్తారు. అయితే మీరు బైబిలును దేవుని వాక్యంగా అంగీకరిస్తే, సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ అత్యావశ్యక అవసరతను తీర్చుతాడా అని మీరు ఆలోచించి ఉండవచ్చు.

“ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు” అని బైబిలు పిలుస్తున్న వాడు న్యాయాన్ని నెలకొల్పేందుకు సైనిక శక్తిని ఉపయోగిస్తాడా? ఒకవేళ ఉపయోగిస్తే, ఏ సైన్యాన్ని ఉపయోగిస్తాడు? నేటి సైన్యాల్లో అనేకం తమకు దేవుని మద్దతు ఉందని చెప్పుకుంటాయి, అయితే అవి నిజంగానే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాయా? లేక తాను కల్పించుకుని శాంతి భద్రతలను స్థాపించేందుకు దేవుడు మరో మార్గాన్ని దేన్నైనా కలిగి ఉన్నాడా?—2 కొరింథీయులు 13:11.

సర్వశక్తిగల దేవుడు ఆదాము హవ్వలను ఏదెనులోనుండి బహిష్కరించడం ద్వారా, వారు తిరిగి రావడాన్ని నివారించేందుకు కెరూబులను నియమించడం ద్వారా మొదటి తిరుగుబాటుతో వ్యవహరించాడు. తన సర్వాధికారానికి వ్యతిరేకంగా వచ్చే తిరుగుబాటునంతటినీ అణచివేయడమే తన సంకల్పమని కూడా ఆయన ప్రకటించాడు. (ఆదికాండము 3:15) దేవుడు ఒక సైన్యాన్ని ఉపయోగించడం అందులో ఇమిడి వుంటుందా?

తన తీర్పులను నెరవేర్చేందుకు దేవుడు సైన్యాలను ఉపయోగించిన సందర్భాలను గురించి బైబిలు చెబుతుంది. ఉదాహరణకు, కనాను దేశంలోని రాజ్యాల్లోనివారు పశువులతో లైంగిక సంపర్కం చేసేవారు, శిశు బలులర్పించేవారు, క్రూరమైన యుద్ధాలు చేసేవారు, వారిని సమూలంగా నిర్మూలించాలని దేవుడు ఆజ్ఞాపించి, తన తీర్పులను నెరవేర్చేందుకు యెహోషువ సైన్యాన్ని ఉపయోగించాడు. (ద్వితీయోపదేశకాండము 7:1, 2) అదే విధంగా, దేవుడు తన అంతిమ తీర్పు దినాన దుష్టత్వాన్ని అంతటినీ ఎలా నాశనం చేయబోతున్నాడనే దానికి ఉదాహరణగా, ఫిలిష్తీయులకు విరుద్ధంగా దేవుడు ఇచ్చిన తీర్పును రాజైన దావీదు సైన్యం నెరవేర్చింది.

ఆ సందర్భాలు ఉపదేశాలనిచ్చాయి. ప్రజలకు భద్రతనిచ్చేందుకు తాను ఒక సైన్యాన్ని ఉపయోగించగలడని యెహోవా ప్రదర్శించాడు. వాస్తవానికి, తన పరిపాలనకు విరుద్ధంగా విశ్వవ్యాప్త నిష్పత్తిలో సంభవించిన తిరుగుబాటుతో వ్యవహరించే తనదైన అసమానమైన సైన్యాన్ని యెహోవా కలిగివున్నాడు.

“సైన్యములకధిపతియగు యెహోవా”

బైబిలు “సైన్యములకధిపతియగు యెహోవా” అనే వ్యక్తీకరణను 250 కంటే ఎక్కువసార్లు ఉపయోగిస్తుంది. ఈ వ్యక్తీకరణ సాధారణంగా, దూతల విస్తృత సమూహాలపై అధిపతిగా దేవునికున్న స్థానాన్ని సూచిస్తుంది. ఒక సందర్భంలో ప్రవక్తయైన మీకాయా, రాజైన అహాబుకూ రాజైన యెహోషాపాతుకూ ఇలా చెప్పాడు: “యెహోవా సింహాసనాసీనుడై యుండగా పరలోకసైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమపార్శ్వమునను నిలిచి యుండుట నేను చూచితిని.” (1 రాజులు 22:19) ఇక్కడ దేవదూతల సైన్యాలను గురించి చెప్పబడింది. తన ప్రజలను కాపాడేందుకు యెహోవా ఈ సైన్యాలను ఉపయోగించాడు. దోతాను నగరం చుట్టుముట్టబడినప్పుడు, ఎలీషా సేవకుడు ఆశలు వదిలేశాడు. అయితే, అతడికి అభయాన్నిచ్చేందుకు, తన ఆత్మ ప్రాణుల సైన్యపు అద్భుతమైన దర్శనాన్ని దేవుడతనికి కలుగజేశాడు. “యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు . . . పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథములచేతను నిండియుండుట చూచెను.”—2 రాజులు 6:15-17.

దేవుడు నేడు సైన్యాలకు మద్దతునిస్తాడని అలాంటి సందర్భాల భావమై ఉందా? క్రైస్తవమత సామ్రాజ్యానికి చెందిన కొన్ని సైన్యాలు, తాము దేవుని సైన్యాలని చెప్పుకోవచ్చు. అనేకులు వాటిని ఆశీర్వదించమని పాదిరీ వర్గాన్ని అడిగారు. అయితే క్రైస్తవమత సామ్రాజ్య సైన్యాలు తరచూ ఒక దానికి విరుద్ధంగా మరొకటి, తోటి విశ్వాసులకు విరుద్ధంగా పోరాడాయి. ఈ శతాబ్దానికి చెందిన రెండు ప్రపంచ యుద్ధాలూ, క్రైస్తవులమని చెప్పుకున్న సైన్యాల మధ్యనే ప్రారంభమయ్యాయి. ఇది ఎంతమాత్రం దేవుని పని కాదు. (1 యోహాను 4:20) తాము శాంతి కొరకు పోరాడుతున్నామని అటువంటి సైనిక శక్తులు చెప్పుకున్నప్పటికీ, ఈ ప్రపంచంలోని అశాంతిని తీసేయాలనే ప్రయత్నంలో అలాంటి సైన్యాలను సంస్థీకరించాలని యేసు తన అనుచరులకు ఉపదేశించాడా?

యేసు తన శిష్యులతో ప్రార్థిస్తుండిన తోటలో, సాయుధులైన గుంపు ఆయనపై చేతులు వేసినప్పుడు శాంతికి తీవ్రమైన భంగం వాటిల్లింది. ఆయన శిష్యుల్లో ఒకరు ఆ గుంపులోని ఒక వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. ఒక ప్రాముఖ్యమైన సూత్రాన్ని వివరించేందుకు యేసు ఆ సందర్భాన్ని ఉపయోగించాడు. ఆయనిలా చెప్పాడు: “నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువమంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా?” యేసు అధీనంలో చాలా పెద్ద సైన్యముంది, అయితే అందులో ఒక సైనికునిగా పేతురు ఎన్నుకోబడలేదు, ఆ మాటకొస్తే ఏ ఇతర మానవుడూ ఎన్నుకోబడలేదు. బదులుగా, పేతురూ మరియు యేసు యొక్క ఇతర అనుచరులు “మనుష్యులను పట్టుజాలరు”లుగా పని చేసేందుకు పిలువబడ్డారు. (మత్తయి 4:19; 26:47-53) కొన్ని గంటల తర్వాత, యేసు ఆ పరిస్థితిని పిలాతుకు వివరించాడు. ఆయనిలా చెప్పాడు: “నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురుగాని నా రాజ్యము ఇహసంబంధమైనది కా[దు].” (యోహాను 18:36) భూమిపై స్థాపించబడిన దావీదు రాజ్యం వలె కాక, యేసుకు దేవుడిచ్చిన రాజ్యం పరలోకంలో ఉంది, అది భూమిపై శాంతిని నెలకొల్పుతుంది.

దేవుని సైన్యాలు యుద్ధరంగంలోకి ప్రవేశిస్తాయి

దేవుని సైన్యాలు త్వరలోనే చర్య తీసుకుంటాయి. త్వరలో జరుగనున్న పోరాటాన్ని వర్ణిస్తూ, ప్రకటన గ్రంథం యేసును “దేవుని వాక్యము” అని పిలుస్తుంది. మనమిలా చదువుతాము: “పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది.” ఈ ప్రతిఘటన ‘భూరాజుల మరియు వారి సేనల’ అంతానికే దారితీస్తుందని బైబిలు చెబుతుంది. దేవుని ఎడల తమ యథార్థతను ప్రదర్శించడంలో విఫలమయ్యే ఇతరుల గురించి, ప్రవచనం ఇంకా ఇలా జత చేస్తుంది: “కడమ వారు గుఱ్ఱముమీద కూర్చున్న వాని . . . ఖడ్గముచేత వధింపబడిరి.” అపవాదియైన సాతాను కూడా నిష్క్రియునిగా చేయబడతాడు. సైన్యాలు లేని శాంతియుతమైన లోకం వచ్చేందుకు ఇది నిజంగానే వీలు కలిగిస్తుంది.—ప్రకటన 19:11-21; 20:1-3.

యుద్ధం లేని లోకాన్ని ఊహించుకోండి

సైన్యాలు ఎంతమాత్రం అవసరం కానంత సురక్షితమైన లోకాన్ని మీరు ఊహించుకోగలరా? ఒక బైబిలు కీర్తన ఇలా చెబుతోంది: “యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమిమీద నాశనములు కలుగజేయువాడు. ఆయనే భూదిగంతములవరకు యుద్ధములు మాన్పువాడు.”—కీర్తన 46:8, 9.

అదెంతటి ఉపశమనాన్ని కలిగిస్తుందో కదా! సైన్యాల కొరకూ వాటి ఆయుధాల కొరకూ డబ్బు చెల్లించవలసిన తీవ్రమైన భారంనుండి చిట్టచివరకు విడుదల చేయబడిన మానవ సమాజానికుండే అవకాశాలను ఒకసారి ఊహించుకోండి! ప్రజలు ప్రతి ఒక్కరి జీవన పరిస్థితులను మెరుగుపర్చుకునే విషయంలో, భూమిని శుభ్రం చేయడంలో మరియు దాన్ని తిరిగి సస్యశ్యామలం చేయడంలో తమ శక్తులను ఉపయోగించగలరు. మానవజాతికి నిజంగా ఉపయోగకరంగా ఉండే వస్తువులను ఆవిష్కరించేందుకు సరిక్రొత్త అవకాశాలు ఉంటాయి.

“ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అను మాటగాని నాశనము అను మాటగాని వినబడదు” అనే ఈ వాగ్దానం ప్రపంచ వ్యాప్తంగా నెరవేరుతుంది. (యెషయా 60:18) దైన్య పరిస్థితుల్లోని క్యాంపుల్లో నివసించేందుకు తమ ఇళ్లనూ ఆస్తులనూ వదిలిపెట్టి యుద్ధ క్షేత్రాలనుండి వెళ్లిపోవలసిందిగా లక్షలాది శరణార్థి గుంపులు మరెన్నడూ ఒత్తిడి చేయబడవు. దేశాల మధ్య జరిగే పోరాటాల్లో చంపబడిన లేక అంగవిహీనులు చేయబడిన తమ ప్రియమైన వారి విషయమై ప్రజలు మరెన్నడూ అంగలార్చరు. యెహోవా పరలోక రాజు శాశ్వతమైన ప్రపంచ శాంతిని స్థాపిస్తాడు. “అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపోవువరకు క్షేమాభివృద్ధి కలుగును. కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణమును విమోచించును.”—కీర్తన 72:7, 14.

ద్వేషించడాన్ని కాదు గానీ దేవుని ప్రేమపూర్వక మార్గాలను అనుకరించడాన్ని నేర్చుకున్న ప్రజల మధ్య జీవితం మరెంతో హాయిగా ఉంటుంది. దేవుని వాక్యం మనకిలా ముందుగానే చెబుతుంది: “నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.” యెహోవాను ఎరిగి ఆయనను ప్రేమించే ప్రజల మధ్య జీవించడం ఎలా ఉంటుంది? అదే పుస్తకం ఇలా ప్రవచిస్తుంది: “నీతి సమాధానము కలుగజేయును నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు.”—యెషయా 11:9; 32:17, 18.

శాంతికి శత్రువులైన వారందర్నీ నిర్మూలించి ఈ భూమిని శుభ్రపర్చేందుకు దేవుని సైన్యాలు సంసిద్ధంగా ఉన్నాయని, బైబిలు జ్ఞానంపై నిర్మింపబడిన విశ్వాసంగల ప్రజలు వివేచిస్తారు. “అంత్యదినములలో” ఏది సంభవించాలని బైబిలు చెబుతుందో దాన్ని అన్వయించుకునేందుకు ఈ జ్ఞానం వారికి నమ్మకాన్నిస్తుంది. అదేమిటంటే: “వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.”—యెషయా 2:2-4.

యెహోవాసాక్షులుగా మారిన, అనేక దేశాలనుండి వచ్చిన ప్రజలు ఇప్పటికే ‘యుద్ధముచేయ నేర్చుకొనుట’ నుండి దూరంగా ఉన్నారు. దేవుని పరలోక సైన్యాలు ఇవ్వనైయున్న కాపుదలయందు వారు తమ నమ్మకాన్ని నిలిపారు. వారితో పాటూ బైబిలును పఠించడం ద్వారా, మీరు కూడా అదే విధమైన నమ్మకాన్ని వృద్ధి చేసుకోగలరు.

[28వ పేజీలోని చిత్రసౌజన్యం]

U.S. National Archives photo

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి