నగరాల్లోని ఎత్తైన భవనాల—నుండి టండ్రాలోని అడవుల వరకూ ప్రజల వద్దకు వెళ్లండి
వర్షం కానీ, మంచు కానీ, వడగండ్ల వాన కానీ, తోడేళ్లు కానీ పర్వతాల్లోని సింహాలు గానీ, ప్రతికూల ప్రాంతాలు గానీ వారి దృఢ తీర్మానాన్ని నీరుగార్చలేకపోయాయి. ఆశ్చర్యచకితుల్ని చేసే వేగంతో తమ గుర్రాలను దౌడు తీయిస్తూ, వారు 3,000 కిలోమీటర్ల పచ్చిక బయళ్లను, పొంగిపొర్లుతున్న నదులనూ, లోతైన లోయలనూ దాటి అమెరికాలోని పశ్చిమ తీరానికి అత్యవసర ఉత్తరాలను తీసుకువెళ్లారు. వాళ్లెవరు?
వాళ్లు పోనీ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ధైర్యసాహసాలుగల యౌవన రౌతులు.a ఈ యౌవనుల్లో అంతటి దృఢ తీర్మానాన్ని కలిగించిందేమిటి? బహుశ సవాలుదాయకమైన, సాహసోపేతమైన ఆ పని చేయాలన్న కోరికా, మరియు ఉత్తరాలను చేరవేయడంలోని సంతృప్తే దానికున్న కారణం అయ్యుండవచ్చు. ఆసక్తికరంగా, ప్రతి రౌతూ తన జీను సంచిలో అత్యవసర ఉత్తరాలతో పాటూ ఒక బైబిలును కూడా తీసుకెళ్లేవాడు.
ఒక శతాబ్దంకంటే ఎక్కువ సమయం తర్వాత, కెనడా అంతటా ఉన్న 1,13,000 మంది అంకితభావంగల రాజ్యప్రచారకుల ద్వారా మరింత గొప్ప దృఢ తీర్మానం, ఉత్సాహం మరియు భక్తి భావాలు ప్రదర్శించబడుతున్నాయి. వారిని ప్రేరేపించేదేమిటి? దేవుని ఎడలా, పొరుగువారి ఎడలాగల ప్రేమ, రాజ్య సత్యాన్ని వారు ప్రచురణల ద్వారా మరియు మౌఖికంగా తెలియజేసేందుకు వారిని ప్రేరేపిస్తుంది. జీవాన్నిచ్చే ఈ సత్యం, పోనీ ఎక్స్‌ప్రెస్ ద్వారా అందించబడిన ఎలాంటి ఉత్తరాలకంటే కూడా చాలా అత్యవసరమైనది. అవును, వారందిస్తున్నది పోనీ ఎక్స్‌ప్రెస్ రౌతుల జీను సంచుల్లో ఉండిన అదే పుస్తకంలోని అంటే పరిశుద్ధ బైబిలులోని అమూల్యమైన రాజ్యవర్తమానమే.—సామెతలు 2:21, 22; యెషయా 2:2-4; 61:2; మత్తయి 22:37-39; 24:14.
యెహోవా ఎడలా ప్రజల ఎడలాగల ప్రేమ చేత ప్రేరేపించబడ్డారు
యెహోవాసాక్షులు రాజ్యాన్ని గురించి ప్రజలతో మాట్లాడేందుకు ఎంతో ఇష్టపడతారు. వాళ్లు నగరంలోని పెద్ద పెద్ద అపార్టుమెంటు భవనాల్లో, సుదూర టండ్రా సమాజాల్లో, విమానాశ్రయ టర్మినల్స్లో, వీధుల్లో మరియు ఇతర బహిరంగ స్థలాల్లో అలాగే టెలిఫోన్ ద్వారా ప్రజలతో మాట్లాడటాన్ని మీరు చూస్తారు. అలాంటి విభిన్న ప్రాంతాల్లో వారు ఎందుకు మాట్లాడతారు?
ఆర్థిక మరియు జనాభా సంబంధ పరిస్థితుల మూలంగా జీవన శైలిలో కలిగిన మార్పులు, ప్రజలను ఇళ్లల్లో కలుసుకోవడాన్ని అధిగమించలేని సవాలుగా చేస్తున్నాయి. అనేక సందర్భాల్లో, కుటుంబానికున్న ప్రాథమిక వస్తుపర అవసరతలను తీర్చేందుకు భార్యాభర్తలిరువురూ పని చేస్తారు, ఇందు మూలంగా తరచూ వారి ఆధ్యాత్మిక అవసరతలు అలక్ష్యం చేయబడతాయి. అలాంటి ఒత్తిళ్ళూ, కలతల మధ్య, వారికి నిరీక్షణనిచ్చే ప్రోత్సాహకర వర్తమానం ఎంతో అత్యవసరం. యెహోవాసాక్షులు ఇష్టపూర్వకంగా ప్రతిస్పందిస్తారు. వివేచననూ, దయనూ ఉపయోగిస్తూ, అన్ని విధాలైన ప్రజలకూ సువార్తను ప్రోత్సాహకరమైన రీతిలో అలాగే ఆలోచనను రేకెత్తించే రీతిలో అందించేందుకు వారు అవకాశాలను కల్పిస్తారు.—1 తిమోతి 2:3, 4.
ఇతర భాషల్లో: యేసు తన శిష్యులను ‘మీరు వెళ్లి శిష్యులనుగా చేయుడని’ ఆజ్ఞాపించినప్పుడు, అన్ని భాషలకు చెందిన ప్రజల వద్దకూ నిరీక్షణా వర్తమానాన్ని తీసుకెళ్లడంలో వారు చొరవనూ దృఢ తీర్మానాన్నీ కలిగి ఉండటాన్ని ఆయన అనుమతించాడు. (మత్తయి 28:19) అనేక ఇతర దేశాల్లో వలెనే, కెనడా కూడా వేర్వేరు సంస్కృతులూ భాషల బహుళ జాతి సమాజంగా మారింది, మరి అనేకమంది రాజ్య ప్రచారకులు క్రొత్త భాషలను నేర్చుకోవడం ద్వారా, ఆ పరిస్థితికి తగిన రీతిలో ప్రతిస్పందించారు.
ఉదాహరణకు, ఆల్బెర్టా నందలి ఎడ్మాంటన్‌లోని పూర్తికాల పరిచారకులైన దంపతులు, తమ నగరంలో మాండరిన్ చైనీస్ భాషను మాట్లాడే ప్రజలను చేరుకోవలసిన అవసరతను గమనించారు. అయితే, మొదట, ఆ దంపతులు ఆ భాషను నేర్చుకోవలసిన అవసరం ఉండినది, కాబట్టి మాండరిన్ భాష మాట్లాడే విశ్వవిద్యాలయ విద్యార్థిని వాళ్లు కలిశారు. అతడు వారికి ఆ భాష నేర్పేందుకూ అదే సమయంలో తాను వారినుండి బైబిలు సత్యాలను నేర్చుకునేందుకూ అంగీకరించాడు. అదెంతటి చక్కని పరిస్థితో కదా! కేవలం 24 నెలల్లోనే అంకితభావంగల ఈ ఇద్దరు రాజ్యప్రచారకులు మాండరిన్లో బోధించేందుకు యోగ్యతను సంపాదించుకున్నారు. అదే సమయంలో, వారి ఉపాధ్యాయుడు/విద్యార్థి క్రైస్తవ బాప్తిస్మానికి సంసిద్ధమయ్యాడు.
ఇతర నగరాల్లో కూడా, ప్రేమచేత ప్రేరేపించబడిన రాజ్యప్రచారకులు పోలిష్, రష్యన్ మరియు వియత్నమీస్ వంటి భాషలను నేర్చుకుంటుండగా అదే విధమైన అనుభవాలను వారుకూడా ఆనందిస్తున్నారు.
రోడ్డుపై: గత శతాబ్దానికి చెందిన, ఒంటరిగా ప్రయాణించిన పోనీ-ఎక్స్‌ప్రెస్ రౌతుల వలె, బ్రిటీష్ కొలంబియాలోని అంతర్గత ప్రాంతాల్లోని కొందరు రాజ్యప్రచారకులు ఒంటరి ప్రయాణికులు. కలపమొద్దులున్న తమ శక్తివంతమైన ట్రక్కులను అడవి ప్రాంతాల్లోనుండి కోతమిల్లుల వద్దకు నైపుణ్యవంతంగా నడుపుకుని తీసుకెళ్లే తమ లౌకిక పనికే వారి సమయంలోని చాలాభాగం వెచ్చించబడుతుంది. ఈ పనిలో భాగంగా, ఇతర ట్రక్కు డ్రైవర్లతో ట్రాఫిక్ గురించీ రోడ్లలోని ప్రమాదాల గురించీ సీబీ (సిటిజన్ బ్యాండ్) రేడియో ద్వారా ఎడతెగక సంప్రదిస్తూ ఉండవలసి ఉంటుంది.
సృజనాత్మకతగల ఈ రాజ్య ప్రచారకులు తమ సీబీ రేడియోలను ఒక వినూత్నమైన విధంగా ఉపయోగిస్తున్నారు. వారు ఇటీవలి సంఘటనలను ప్రస్తావిస్తూ సీబీలో చర్చలను ప్రారంభిస్తారు. తర్వాత వారు నైపుణ్యవంతంగా బైబిలును గురించి చెబుతారు. ఒక సందర్భంలో, మృతులకున్న నిరీక్షణను గురించి బైబిలు చెబుతున్న విషయాన్ని ఒక ట్రక్కు డ్రైవరుకు తెలియజేసినప్పుడు అతడు వెంటనే ప్రతిస్పందించాడు. (యోహాను 5:28, 29; అపొస్తలుల కార్యములు 24:15) ఒక రహదారి దుర్ఘటనలో తన తోటి డ్రైవరు మరణించడం అతణ్ణి కలతపర్చింది. అతడు బైబిలు పఠనాన్ని కృతజ్ఞతా పూర్వకంగా అంగీకరించాడు, ఇప్పుడు అతడు తోటి పనివారికీ, స్నేహితులకూ సువార్తను ప్రకటించడాన్ని వినవచ్చు. అంతే కాకుండా, అతడికి ఆనందం కలిగించిన మరొక విషయం ఏమిటంటే, అతడి మరణించిన స్నేహితుని భార్యతో కూడా బైబిలు పఠనం ప్రారంభమైంది. జీవాన్నిచ్చే సత్యపు వర్తమానాన్ని ఈ అసాధారణమైన రీతిలో అందించేందుకు చొరవ తీసుకున్నందుకు ఎంత చక్కటి ప్రతిఫలం లభించిందో కదా!
విమానం ద్వారా: అమూల్యమైన సత్య వర్తమానాన్ని అందించే విషయానికొచ్చినప్పుడు, ఆసక్తిగల రాజ్యప్రచారకులు చిన్న విమానాల ద్వారా ‘గ్రామంలోకి ప్రవేశిస్తూ’ ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్తారు. (మత్తయి 10:11, 12) కొంత కాలం క్రితం, తమ స్వంత ఖర్చులతో సువార్తను ప్రకటించాలనే ఆసక్తి చేత ప్రేరేపించబడిన వారై రెండు విమానాల గుంపులు, టండ్రా అడవుల విస్తృత ప్రాంతంలోని ప్రజల వద్దకు వెళ్లాయి. ఒక్కో విమానంలోని గుంపు, ఆర్కిటిక్ వృత్తానికి 250 కిలోమీటర్లంత సమీపానికి వెళ్తూ 14 వేర్వేరు సముదాయాల్లో క్రిందకు దిగుతూ దాదాపు 3,000 కిలోమీటర్లు ప్రయాణించింది. చాలా దూరాలచేత వేరుచేయబడిన సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను చేరుకునేందుకు ఈ అవిశ్రాంత ప్రచారకులు ఏడు దినాలు కొనసాగారు.
మరి అదంతా కూడా ప్రయోజనకరంగా ఉండినదా? ఈ సమాజాల్లోని వారిపై బైబిలు వర్తమానం చూపించిన అనుకూల ప్రభావాన్ని గురించి ఒక్కసారి ఆలోచించండి. సందర్శిస్తున్న ఈ పరిచారకులు, త్వరలో రాబోయే భవిష్యత్తులో భూపరదైసును స్థాపించాలనే యెహోవా సంకల్పాన్ని గురించి తెలియజేసినప్పుడు, వారు ఒక ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక అవసరతను పూరించడంలో సహాయపడ్డారు. (మత్తయి 5:3) సందేశకులు తిరిగి వెళ్లిపోయిన తర్వాత చాలా కాలంవరకు కూడా, ఆ సముదాయాల్లోని యథార్థహృదయులు, తమ చేతుల్లో ఉంచబడిన 542 బైబిళ్లూ బైబిలు పఠన సహాయకాలనూ అలాగే 3,000 పత్రికలనూ చదువగలరు.—అపొస్తలుల కార్యములు 12:24 పోల్చండి.
టెలిఫోన్ ద్వారా: వేలాదిమంది నగరవాసులు అత్యున్నత సాంకేతిక భద్రతా వ్యవస్థగల అపార్టుమెంటు భవనాల్లో నివసిస్తున్నారు. అయినప్పటికీ, సమర్పిత రాజ్యప్రచారకులు ఉత్సాహమూ, వివేచనలతో ముందుకు సాగుతున్నారు. ఈ ప్రజలు నివసిస్తున్న స్థలాలకు వారెలా వెళ్లగలుగుతున్నారు? ముఖాముఖిగా కలుసుకోవడాన్ని వారు ఇష్టపడినప్పటికీ, తరచూ అపార్ట్మెంట్ లాబీలోని ఇంటర్‌కమ్ విజయవంతంగా ఉపయోగించబడింది. ఇది సాధ్యంకానప్పుడు, వారు టెలిఫోన్ డైరెక్టరీని ఉపయోగించి, చేతివ్రేళ్ళకు పని చెబుతారు.
ఒక ఉదయం ఒక వృద్ధ వయస్కురాలు ఫోన్ ఎత్తింది. క్లుప్తమైన, మర్యాదపూర్వక పలకరింపు తర్వాత, ప్రజలు రాత్రుల్లో వీధుల్లో తిరిగినప్పటికీ సురక్షితంగా ఉండే సమయం వస్తుందని మీరు భావిస్తున్నారా అని ఆమెను అడగటం జరిగింది. భవిష్యత్తులో శాంతి వెల్లివిరుస్తుందని ఆమెకు అభయాన్నిచ్చేందుకు లేఖనాలను చదవడం జరిగింది. (కీర్తన 37:10, 11; దానియేలు 2:44; మత్తయి 6:9, 10) మనం దేవుని వాగ్దానాలను ఎందుకు నమ్మవచ్చనే విషయాన్ని ఆ తర్వాతి వారం అదే సమయంలో టెలిఫోన్ ద్వారా చర్చించేందుకు ఆమె అంగీకరించింది. ఒక బైబిలు పఠన సహాయకం నుండి పేరాలను చదివి ఉచితమైన ప్రశ్నలను అడగటం ద్వారా బైబిలును టెలిఫోన్లో ఒక నెలపాటు పఠించిన తర్వాత, ప్రతి వారం అనేక విభిన్న విషయాలను తెలియజేసినందుకు ఆ స్త్రీ రాజ్యప్రచారకురాలిని అభినందించింది. ఆమెకు పఠన పుస్తకాన్ని గురించి చెప్పి, ఆమెకు ఒక వ్యక్తిగత ప్రతిని అందించవలసిన సమయం వచ్చింది. ఇరువురూ కలుసుకునేందుకు ఏర్పాట్లు జరిగాయి. వాస్తవానికి, ప్రజల ఎడల తమకు గల ప్రేమను యెహోవాసాక్షులు ప్రదర్శించారు, యెహోవా ఈ క్రైస్తవ ప్రచారకులతో ఉన్నాడనే విషయాన్ని గుర్తించిన వారై ప్రజలు ఆ ప్రేమకు ప్రతిస్పందించారు.—1 కొరింథీయులు 14:25 పోల్చండి.
ముద్రిత సాహిత్యం ద్వారా: ప్రధానంగా ఫ్రెంచి మాట్లాడే ప్రజల ప్రాంతమైన క్యూబెక్‌లోని రాజ్యప్రచారకులు కూడా ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్తున్నారు. ఒక ప్రయాణ పరిచారకుడు ఇలా చెప్పాడు: “చర్చి యొక్క తీవ్రమైన వ్యతిరేకత మూలంగా అనేక సంవత్సరాలుగా సహోదరులు ఎలాంటి అభివృద్ధీ సాధించలేదు. సహోదరుల అవిరామ కృషి మూలంగానూ వారు పదే పదే దర్శించడం మూలంగానూ, అల్పసంఖ్యాకులు మాత్రమే చదివే, ప్రాథమికంగా ఎవరికీ తెలియని పుస్తకంగా పరిగణించబడిన బైబిలు ఇప్పుడు అనేకమంది ఇళ్లల్లో తనకొరకు స్థానాన్ని సంపాదించుకుంది.”
క్యూబెక్ సమాజంలో, వైద్య సముదాయంతో సహా అన్ని తరగతులనుండీ క్రొత్త సువార్తికులు రావడంతో ఉత్తేజకరమైన ప్రతిఫలాలు లభిస్తున్నాయి. ఒక వైద్యుడి విషయంలో అదే జరిగింది. ఒక రాజ్యప్రచారకురాలైన ఆయన భార్య బైబిలులోని నిరీక్షణను గురించి ఆయనతో తరచుగా చర్చించేది. అప్రమత్తుడైన ఒక సంఘపెద్ద, రక్తము నీ జీవమును ఎట్లు కాపాడగలదు? అనే బ్రోషూరు పఠనం జరుగుతున్నప్పుడు సంఘ కూటాలకు రమ్మని ఆ వైద్యుణ్ని ఆహ్వానించేందుకు చొరవ తీసుకున్నాడు. ఆయన రావడమే కాక కూటంలో భాగం వహించాడు కూడా. ఆ చర్చ యొక్క శ్రేష్ఠతనూ ఆధ్యాత్మిక గాఢతనూ బట్టి ప్రభావితుడై, ఆయన బైబిలు పఠనాన్ని అంగీకరించాడు. ఇప్పుడు ఆయన కూడా ఒక రాజ్యప్రచారకుడే.
ప్రజలను బైబిలు వైపుకు ఆకర్షించడంలో, పత్రికలను ప్రభావవంతంగా ఉపయోగించడం ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర వహించింది. ఎవరినైనా సత్యం వైపుకు ఆకర్షించేందుకు ఏ శీర్షిక ఉపకరిస్తుందో మనకు ఎన్నడూ తెలియదు. ఒక రాజ్యప్రచారకుడు, వర్తమానాన్ని వినేందుకు ఇష్టపడనప్పటికీ కీటకాల ప్రపంచంలో ఆసక్తి కలిగివున్న తన పొరుగు స్త్రీకి తేజరిల్లు! సంచికను అందించాడు. నవంబరు 22, 1992 (ఆంగ్లం) నాటి తేజరిల్లు!లోని “ఛాగాస్ డిసీజ్—ఎ కిస్ ఆఫ్ డెత్” అనే శీర్షికలోని ఛాయాచిత్రం ఆమెకు ఆసక్తిగా అనిపించింది. తాను చదివిన దాన్నిబట్టి ప్రభావితం చెంది, ఆమె మరిన్ని పత్రికలు కావాలని అడిగింది. ఒక బైబిలు పఠనం ప్రారంభించబడింది, మరి ఆ తర్వాత ఆరు నెలల్లోనే ఆమె ఇతరులకు సాక్ష్యమివ్వడం మొదలుపెట్టింది.
బహిరంగ స్థలాల్లో: విమానాశ్రయాల వంటి బహిరంగ స్థలాల్లో మాట్లాడేందుకు కనేడియన్ చట్టం అనుమతిస్తుంది. ఆలీఫాక్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో, తమ విమానాల కొరకు వేచి ఉన్న ప్రయాణికులను రాజ్యప్రచారకులు వివేచనతో సమీపించి వారిని సంభాషణలోకి దించుతారు. సంభాషణను బైబిలు వైపుకు మరల్చేందుకు సమయానుకూలమైన, దృష్టికోణాన్ని తెలుసుకునే ప్రశ్నలు ఉపయోగించబడతాయి. వారు ప్యాకెట్ సైజ్ బైబిలునూ సాహిత్యాన్నీ తమ వెంట తీసుకెళ్తారు గనుక, వారు ఆధ్యాత్మిక అవసరతల ఎడల ప్రతిస్పందించగలరు. ఈ విధంగా రాజ్యవర్తమానాన్ని విని సత్యపు విత్తనాలు మొలకెత్తేందుకు గానూ వాటిని తమ సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లిన వారిలో సర్జన్లు, వైజ్ఞానికులు, న్యాయవాదులు, పైలట్లు, మతనాయకులు, పోలీస్‌లు, టాక్సీ డ్రైవర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, సైనిక సిబ్బంది మరియు విదేశాలనుండి వచ్చిన రాజకీయవేత్తలు కూడా ఉన్నారు.—కొలొస్సయులు 1:6.
ఒకరోజు తెల్లవారు జామున విమానాశ్రయంలో, ఒక వ్యక్తి కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలను తీసుకున్నాడు. తర్వాత ఆయన ప్రశాంతమైన తగ్గు స్వరంలో ఇలా అన్నాడు: “ఓహ్, యెహోవాసాక్షులు!” అతనలా ఎందుకు ప్రతిస్పందించాడు? ఆ వ్యక్తి భక్తిగల ముస్లిమ్, అతడు కొంత సమయం క్రితమే విమానాశ్రయంలోని గదిలో నమాజు చేశాడు. తనకు జ్ఞానాన్నీ, అంతర్దృష్టినీ, సత్యాన్నీ ఇవ్వమని అతడు దేవుణ్ని వేడుకున్నాడు. తన ప్రార్థనకు యెహోవాసాక్షులు తక్షణ జవాబైయున్నారనే ఆలోచన అతడికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
వాస్తవంగానే, కెనడాలోని ధైర్యంగల రాజ్యప్రచారకులు, తాము అమూల్యమైన రాజ్యవర్తమానాన్ని అందించడంలో తమ దారికి దేన్నీ అడ్డురానివ్వరు. వారు విదేశీ భాషనూ, మెరకపల్లాలుగల రోత రోడ్లనూ, సుదూర సముదాయాలనూ, లేక అత్యున్నత భద్రతా వ్యవస్థగల నగర అపార్ట్మెంట్ భవనాలనూ చూసి నిరుత్సాహపడరు. యథార్థంగా సత్యాన్ని వెదికే వారికి జీవాన్ని గురించిన దేవుని వర్తమానాన్ని అందించాలని వారు తీర్మానించుకున్నారు. తమ తోటి పని వారి ప్రపంచవ్యాప్త సహోదరత్వంతో పాటు ‘మీరు వెళ్లి శిష్యులనుగా చేయుడనే’ యేసు ఆజ్ఞకు వారు నిస్వార్థంగా విధేయులౌతారు.—మత్తయి 28:19.
[అధస్సూచి]
a పోనీ ఎక్స్‌ప్రెస్ అనేది, అమెరికాలో 1860 నుండి 1861 వరకూ కేవలం 18 నెలల పాటూ కొనసాగిన తపాలా సేవ.
[27వ పేజీలోని బాక్సు]
సఫలీకృతులైన రాజ్యప్రచారకులు టెలిఫోన్‌ను ఉపయోగిస్తున్నారు
కొందరు ఇలా చెప్పారు: “హలో. నా పేరు [మీ పేరు చెప్పండి]. శాంతిని ఎలా సాధించవచ్చనే విషయాన్ని గురించి నేను మీ బిల్డింగ్‌లోని ప్రజలతో క్లుప్తంగా మాట్లాడుతూ ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా శాంతి ఎప్పటికైనా వస్తుందని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] మీకు ఈజీగా ఉండేందుకు, నేను సర్వే చేయడానికో లేక వస్తువులు అమ్మేందుకో మాట్లాడుతున్న వ్యక్తిని కాదు. బదులుగా, దేవుడు వాస్తవానికి శాంతిని తీసుకువస్తాడనే విషయాన్ని పరిశుద్ధ లేఖనాల నుండి నేను అందరికీ చెబుతున్నాను.” తర్వాత సంభాషణ క్లుప్త లేఖన చర్చతో ముందుకు కొనసాగవచ్చు.
ఇతరులు ఇలా చెప్పారు: “గుడ్ ఈవినింగ్. నా పేరు [మీ పేరు చెప్పండి]. నేను మీ ప్రాంతంలోని స్వచ్ఛంద సేవకుణ్ని. మీ భవనంలో నివసిస్తున్న వారి అభిప్రాయాలను నేను కనుక్కుంటున్నాను. మన ప్రాంతంలో నేర దౌర్జన్యాలు అధికమవ్వడం దృష్ట్యా అనేకులు వ్యక్తిగత భద్రత విషయమై చింత కలిగివున్నారు. మీకు కూడా ఈ విషయం చింత కలిగిస్తుందా? [ప్రతిస్పందించనివ్వండి.] యావత్ ప్రపంచం సురక్షితంగా ఉన్నట్లు భావించే సమయం ఎప్పటికైనా వస్తుందని మీరు భావిస్తున్నారా?” జవాబు చెప్పనివ్వండి, తర్వాత లేఖనాధార వర్తమానంతో ముందుకు కొనసాగండి.