“ఆసక్తిగల రాజ్య ప్రచారకులు” జిల్లా సమావేశం నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందడం
1 ఉత్తేజవంతమైన కార్యక్రమం: ఇటీవల జరిగిన జిల్లా సమావేశంలో ఎంతో ఉత్తేజకరమైన కార్యక్రమాలను మనం ఆస్వాదించాము కదా! దేవుని రాజ్యాన్ని ఆసక్తితో ప్రకటించేందుకు మరింత సన్నద్ధులం కావాలన్న ఒకే ఉద్దేశంతో మనమందరం సమకూడాము. “ప్రకటించడానికి” అనే పదాన్ని మొదటి ప్రసంగీకుడు ఎలా వివరించాడో మీకు గుర్తుందా? “యెహోవా మనతో ఉన్నాడని తెలుసుకొని నిర్భయంగా ఉండండి” అనే ప్రసంగంలో మనం ఏయే విషయాలపై పరిశోధన చెయ్యాలని ప్రోత్సహించబడ్డామో మీరు జ్ఞాపకం చేసుకోగలరా? ఇప్పటి వరకు మీరు ఎవరెవరి నిజ జీవిత కథలను పరిశీలించారు?
2 “వివిధ కష్టాల వల్ల మన విశ్వాసం ఎంత దృఢంగా ఉందన్నది పరీక్షించబడుతుంది” అనే గోష్ఠి హింసను యెహోవా ఎందుకు అనుమతిస్తాడో తెలియజేసే మూడు ముఖ్యమైన కారణాలను తెలియజేసింది. అవేవో మీరు చెప్పగలరా? మన క్రైస్తవ తటస్థతకు లేఖనాధారం ఏమిటి? తటస్థంగా ఉండడం వల్ల ఎదురయ్యే సమస్యలకు సిద్ధంగా ఉండేందుకు మనమేమి చెయ్యాలని ప్రోత్సహించబడ్డాం? మనం కష్టాలను నమ్మకంగా సహించడం యెహోవాకు ఎలా స్తుతిని తెస్తుంది?
3 “కష్ట సమయాల్లో స్థిరంగా ఉండండి” నాటకంలో ప్రత్యేకించి ఏ సన్నివేశాలు మిమ్మల్ని బలపరిచాయి? మనం యిర్మీయా వలె నమ్మకంగా ఎలా ఉండగలం?
4 “ఈ లోకపు నటన గతించుచున్నది” అనే బహిరంగ ప్రసంగం యెహోవా భయంకరమైన మహాదినానికి దారితీసే ఏయే సంఘటనల గురించి, త్వరలోనే సంభవించనున్న ఏ గమనార్హమైన మార్పుల గురించి వివరించింది? “ఆసక్తిగల రాజ్య ప్రచారకులుగా సత్క్రియలను ఎక్కువగా చేయండి” అనే ముగింపు ప్రసంగంలో విన్న సమాచారాన్ని మీరు మీ సొంత పరిచర్యకు ఎలా అన్వయించుకున్నారు?
5 అన్వయించుకోవలసిన ముఖ్యాంశాలు: “కృతజ్ఞులై ఉన్నారని చూపించండి” అనే ప్రసంగంలో వివరించబడినట్లుగా మనం మన హృదయపూర్వక కృతజ్ఞతను యెహోవాకు ఎలా తెలియజేయవచ్చు? “ఆసక్తితో ప్రజ్వలిస్తున్న రాజ్య ప్రచారకులు” అనే ముఖ్యాంశ ప్రసంగంలో ఎవరి ఆసక్తిని మనం అనుకరించాలని ప్రోత్సహించబడ్డాము? మనం ఎలా ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆహ్వానించబడ్డాము?
6 “యెహోవాను స్మరించుకుంటూ నడవడానికి మీకా ప్రవచనం మనల్ని బలపరుస్తుంది” అనే గోష్ఠిలో మనం యెహోవా అనుగ్రహాన్ని పొందడానికి పాటించవలసిన మూడు విషయాలు ప్రాముఖ్యంగా చెప్పబడ్డాయి, అవి ఏమిటి? అవి సాధించగలిగేవేనా? (మీకా 6:8) “మీ హృదయాన్ని కాపాడుకోవడం ద్వారా స్వచ్ఛతను కాపాడుకోండి” అనే ప్రసంగాన్ని బట్టి మనం ఏ మార్గాల్లో నైతికంగా పరిశుభ్రంగా ఉండాలి? “మోసపోకుండా జాగ్రత్త పడండి” అనే ప్రసంగం ఏ విషయాల్లో మనం మోసపోకూడదని, ఇతరులను మోసగించకూడదని మనల్ని హెచ్చరించింది?
7 “తమ పరిచర్యను మహిమపరిచే రాజ్య ప్రచారకులు” అనే గోష్ఠిలోని ఏయే ఆచరణాత్మక విషయాలను మీరు మీ పరిచర్యలో అన్వయించుకోవడం ప్రారంభించారు? “ఆధ్యాత్మిక సంభాషణ బలపరుస్తుంది” అనే ప్రసంగంలో ఫిలిప్పీయులు 4:8 వ వచనం విశ్లేషించబడింది. మన సంభాషణలను ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించినవిగా చేసుకోవడానికి ఆ లేఖనం మనకెలా దోహదపడుతుంది, అలా మనమెప్పుడు చెయ్యాలి?
8 “కష్టకాలాల్లో యెహోవాపై సంపూర్ణ నమ్మకంతో ఉండండి” అనే ప్రసంగం మనం విషాదకరమైన ఘటనలను, ఆర్థిక సమస్యలను, అనారోగ్యాన్ని, కుటుంబ సమస్యలను, నిరంతరం జరిగే పొరపాట్లను ఎలా ఎదుర్కోవచ్చో చర్చించింది. అలాంటి పరిస్థితులను మనం ఎదుర్కొన్నప్పుడు యెహోవాపై మన నమ్మకాన్ని ఎలా చూపించవచ్చు?
9 కొత్త ఆధ్యాత్మిక నిధులు: ఏకైక సత్య దేవుణ్ణి ఆరాధించండి (ఆంగ్లం) అనే పుస్తకాన్ని పొందిన మనం ఎంతో ఆనందించాం. ఆ పుస్తకపు ఉద్దేశం గురించి వివరిస్తూ చేసిన ప్రకటన మిమ్మల్ని ఎలా ప్రభావితం చేసింది? శిష్యులను చేసే మన పనిలో అది రెండవ అధ్యయన పుస్తకంగా ఏ విధంగా సహాయకరంగా ఉండగలదు?
10 దాని తర్వాత మనం యెహోవాకు సన్నిహితమవ్వండి (ఆంగ్లం) అనే అందమైన పుస్తకాన్ని అందుకున్నాం. దానిలోని కొన్ని ప్రత్యేక శీర్షికలు ఏవి? ఏ చిత్రాలు మీకు బాగా నచ్చాయి? దాన్ని చదవడం వల్ల మీరు యెహోవాకు మరింత సన్నిహితమయ్యారా? ఈ పుస్తకం నుండి ఇంకా ఎవరు కూడా ప్రయోజనం పొందవచ్చు?
11 “ఆసక్తిగల రాజ్య ప్రచారకులు” జిల్లా సమావేశం, ఈ కష్ట సమయాలను ఎదుర్కోవడానికి కావలసిన ఆధ్యాత్మిక ప్రోత్సాహాన్ని మనకు ఇచ్చింది. విశేషమైన ఈ ఆధ్యాత్మిక ఏర్పాటు నుండి మనం పూర్తి ప్రయోజనం పొందేందుకు అక్కడ చెప్పబడినదాన్ని జ్ఞాపకముంచుకోవడానికి, మనం పొందిన ఆధ్యాత్మిక ప్రోత్సాహానికి కృతజ్ఞతతో ఉండడానికి, మనం నేర్చుకున్న వాటిని అన్వయించుకోవడానికి మన శాయశక్తులా ప్రయత్నిద్దాం. (2 పేతు. 3:14) అలా చేయడం వల్ల, మహిమంతా యెహోవాకు చెందేలా, మన యథార్థతను కాపాడుకోవడానికీ మన ప్రభువైన యేసుక్రీస్తును అనుకరించే ఆసక్తిగల రాజ్య ప్రచారకులుగా ఉండడానికీ మనం బలం పుంజుకుంటాం.—ఫిలి. 1:9-11.