మీరు వాళ్లకు తగిన గౌరవాన్నిస్తారా?
ఆఫ్రికాలోని నల్లజాతీయులు జంతువుల్లా తరుమబడి, ఊహించలేనంత రోతా కంపూగల స్థలంలోకి తోయబడి, జీవంలేని సామగ్రిలా ఓడల్లో ఉత్తర దక్షిణ అమెరికాలకు రవాణా చేయబడ్డారు. వాళ్లలో కనీసం సగం మంది తమ గమ్యస్థానాన్ని చేరకముందే మరణిస్తారని అనుకునేవారు. కుటుంబ సభ్యులు ఒకరినొకరు మరెన్నడూ కలుసుకోలేని విధంగా నిర్దయగా వేరు చేయబడ్డారు. మానవుడు తన తోటి మానవుని ఎడల అమానుషంగా ప్రవర్తించిన ఘట్టాలలో బానిస వ్యాపారం అంధకారమయ ఉపాఖ్యానమై ఉండినది. ఆత్మరక్షణలేని ప్రాంతీయ ప్రజలను శక్తిమంతులైన విదేశీ విజయ యోధులు క్రూరంగా లోబరచుకున్నప్పుడు అటువంటివే ఇతర సంఘటనలు జరిగాయి.
వాస్తవానికి, ఒక వ్యక్తికి తగిన గౌరవాన్నివ్వకుండా అతన్ని అవమానించడం, భౌతిక గాయాలను కలిగించడం కంటే మరింత క్రూరమైనది. అది మానవ స్ఫూర్తినే వినాశనం చేస్తుంది. అనేక దేశాల్లో బానిసత్వం రద్దు చేయబడినప్పటికీ, గౌరవించడమనేది ఇప్పటికీ నిర్లక్ష్యం చేయబడుతోంది, బహుశ మరింత కుటిల మార్గాల్లో.
మరో వైపు, నిజ క్రైస్తవులు ‘తమనువలె తమ పొరుగువారిని ప్రేమింపవలెనని’ యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞను శిరసావహించేందుకు కృషి చేస్తారు. కాబట్టి, ‘నేను ఇతరులకు వారికి తగిన మర్యాదనూ గౌరవాన్నీ ఇస్తానా?’ అని వారు తమను తాము ప్రశ్నించుకుంటారు.—లూకా 10:27.
గౌరవం దృష్టాంతపర్చబడింది
ఒక నిఘంటువు ప్రకారం, గౌరవం అంటే యోగ్యంగా, ఘనపర్చబడి లేక ఉన్నతపర్చబడి ఉండే లక్షణం లేక స్థితి. విశ్వ సర్వాధిపతియైన యెహోవా దేవుని హోదా యొక్క ఎంత చక్కని వర్ణనో కదా అది! వాస్తవానికి, లేఖనాలు యెహోవాను ఆయన సర్వాధిపత్యాన్ని గౌరవంతో ముడిపెడుతున్నాయి. మోషే, యెషయా, యెహెజ్కేలు, దానియేలు, అపొస్తలుడైన యోహాను, మరియు ఇతరులు మహోన్నతుని యొక్క, ఆయన పరలోక ప్రాంగణం యొక్క ప్రేరేపిత దర్శనాలను చూడగల ఆధిక్యతను పొందారు మరియు వారి వివరణలు అత్యధిక మహోన్నతత్వాన్నీ హుందాతనాన్నీ చూపించాయి. (నిర్గమకాండము 24:9-11; యెషయా 6:1; యెహెజ్కేలు 1:26-28; దానియేలు 7:9; ప్రకటన 4:1-3) స్తోత్ర ప్రార్థనలో, రాజైన దావీదు ఇలా చెప్పాడు: “యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి.” (1 దినవృత్తాంతములు 29:11) నిజంగా, యోహోవా దేవునికంటే ఎక్కువగా మరితరులు ఎవరూ ఘనతనూ మహిమనూ పొందేందుకు అర్హులు కారు.
మానవుణ్ణి తన పోలికలోనూ తన స్వరూపంలోనూ సృష్టించడంలో, యెహోవా మానవులకు కొంత యోగ్యతనూ, ఆత్మగౌరవాన్నీ మరియు హోదానూ అనుగ్రహించాడు. (ఆదికాండము 1:26) కాబట్టి, ఇతరులతో మన వ్యవహారాల్లో, మనం ప్రతి వ్యక్తికీ వారికి తగినంత గౌరవాన్నీ మర్యాదనూ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనం ఇలా చేసినప్పుడు, వాస్తవానికి మనం మర్యాదకు మూలం యెహోవా దేవుడని అంగీకరిస్తున్నాము.—కీర్తన 8:4-9.
కుటుంబ సంబంధాల్లో గౌరవం
వివాహితుడైన అపొస్తలుడైన పేతురు ప్రేరేపించబడిన వాడై, “యెక్కువ బలహీనమైన ఘటమని” తమ భార్యలను “సన్మానిం”చాలని క్రైస్తవ భర్తలకు సలహా ఇచ్చాడు. (1 పేతురు 3:7; మత్తయి 8:14) “భార్య భర్తను గౌరవించాలి” అని అపొస్తలుడైన పౌలు సలహా ఇచ్చాడు. (ఎఫెసీయులు 5:33, పవిత్ర గ్రంథం—వ్యాఖ్యాన సహితం) కాబట్టి, వివాహ బంధంలో తమ జతను గౌరవించి సన్మానించడం బైబిలు కోరుతున్న అవసరత. దీన్ని ఏ విధాలుగా చూపవచ్చు?
పెరిగే మొక్కకు నీరు ఎలా శక్తినిస్తుందో, అదే విధంగా భార్యాభర్తలు బహిరంగంగా అలాగే ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా వారిరువురి మధ్య ఆహ్లాదకరమైన మాటలు మరియు దయతోకూడిన సంజ్ఞలు ఉంటే అవి వారి సన్నిహిత సంబంధాన్ని పెంచి పోషించగలవు. దానికి విరుద్ధంగా, టీవీ హాస్య నాటకాల్లో తరచూ వినిపించేటువంటి కఠినమైన, అవమానకరమైన మౌఖిక దాడి లేక మర్యాద లేని మాటలు, అవమానపరిచే వ్యంగ్య మాటలు వినాశకరమైనవి. అవి అయోగ్యులమనే భావనలనూ, కృంగుదలనూ, ఉక్రోషాన్నీ, సులభంగా నయం చేయలేని భావోద్రేక గాయాలనూ కూడా కలిగించగలవు.
ఇతరులకు వారికి తగిన మర్యాదనివ్వడమంటే, మనం ముందే ఏర్పర్చుకున్న భావాలలోకి వారిని మలచకుండా ఉండేందుకు ప్రయత్నించడం లేక ఇతరులతో అయుక్తంగా పోల్చడం వంటివి చేయకుండా, వారు ఏమై ఉన్నారో దాన్ని అంగీకరించడం అని కూడా అర్థం. ఇది ఆలూ మగల మధ్య ఎంతో ప్రాముఖ్యం. సంభాషణ మరియు వ్యక్తీకరణలు ధారాళంగా ఉన్నప్పుడు మరి వాటిని చనువుగా వ్యక్తం చేస్తే తమను విమర్శిస్తారనీ లేక దూషిస్తారనీ ఎవరూ భయపడనప్పుడు, సన్నిహితత్వం వర్ధిల్లుతుంది. వివాహంలో ఒక వ్యక్తి తాను ఏమై ఉన్నాడో అందునుబట్టి అంగీకరించబడితే, ఆ ఇల్లు క్రూరమైన, కఠినమైన బయటి ప్రపంచంనుండి ఎంతో కాపుదలనిచ్చే స్థలంగా ఉంటుంది.
పిల్లలు తమ తలిదండ్రులను గౌరవించి వారికి విధేయత చూపాలన్న లేఖనాధార ఆజ్ఞలు వారికి ఇవ్వబడ్డాయి. దానికి ప్రతిగా, జ్ఞానవంతులైన ప్రేమగల తలిదండ్రులు తమ పిల్లల గౌరవాన్ని గుర్తించడం ఎంతో మంచిది. మంచి ప్రవర్తనను చక్కగా మెచ్చుకోవడం, దానికి తోడు అవసరమైనప్పుడు తలిదండ్రులిచ్చే క్రమశిక్షణ, “ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను” వారిని పెంచేందుకు ఎంతో సహాయపడతాయి. అదే పనిగా విమర్శించడం, వారిపై కేకలేయడం, “మూర్ఖుడా” లేక “బుద్ధిహీనుడా” వంటి అవమానకరమైన పేర్లుపెట్టి పిలవడం వాళ్లకు చికాకు కలిగిస్తుంది.—ఎఫెసీయులు 6:4.
ముగ్గురు కుమారులనూ, ముగ్గురు కుమార్తెలనూ పెంచుతున్న ఒక క్రైస్తవ పెద్దయైన ఒక తండ్రి ఇలా చెబుతున్నాడు: “రాజ్యమందిరంలో అవసరమైన క్రమశిక్షణను ఇచ్చేటప్పుడు మేము వీలైనంత నెమ్మదిగా ఇచ్చేందుకు ప్రయత్నించాము. మెల్లగా మోచేత్తో పొడవటం లేక హెచ్చరిస్తున్నట్లు గుడ్లురిమి చూడటం సాధారణంగా సరిపోయేది. మరింత గంభీరమైన క్రమశిక్షణ అవసరమైతే, మేము మా ఇంట్లో ఏకాంతంగా ఇతర పిల్లలనుండి దూరంగా తీసుకెళ్లి ఇచ్చేవాళ్లం. పిల్లలు ఇప్పుడు పెరిగి పెద్దవాళ్లు అవుతున్నారు గనుక, వాళ్లకు క్రమశిక్షణనివ్వడంలో ప్రతి ఒక్కరికీ వారి వ్యక్తిగత అవసరతల ప్రకారంగా దేవుని వాక్యంనుండి ప్రేమపూర్వకమైన, జ్ఞానయుక్తమైన సలహాలను ఇవ్వడం ఇమిడి ఉంటుంది. ఈ వ్యక్తిగత విషయాల్లో మేము గోప్యతను కలిగి ఉండేందుకు ప్రయత్నిస్తాము, అలా పిల్లల్లో ప్రతి ఒక్కరూ తమకంటూ కొంత ప్రైవసీనీ మర్యాదనూ కలిగి ఉండే హక్కుకు మేము గౌరవాన్ని చూపిస్తాము.”
కుటుంబంలో కూడా మాటల్లో క్రియల్లో మంచి మర్యాదలను చూపడాన్ని అలక్ష్యం చేయకూడదు. చనువు “ప్లీజ్,” “థాంక్యూ,” “ఎక్స్‌క్యూజ్‌మీ,” మరియు “అయాం సారీ” వంటి పదాలను అలక్ష్యం చేసేలా చేయకూడదు. మన స్వంత మర్యాదను కలిగి ఉండేందుకూ అలాగే ఇతరులను గౌరవించేందుకూ కూడా మంచి మర్యాదలు ప్రాముఖ్యం.
క్రైస్తవ సంఘంలో
“ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును” అని యేసు చెప్పాడు. (మత్తయి 11:28) పీడితులూ, కృంగిన వారూ చివరకు చిన్న పిల్లలు కూడా యేసు వైపుకు ఆకర్షించబడ్డారు. అహంకారులైన, స్వయంనీతిపరులైన మతనాయకులూ ఆ కాలంలోని నాయకులూ వాళ్లను తిరస్కరించారు. అయితే యేసులో తమకు తగిన గౌరవాన్నిచ్చే వ్యక్తిని వారు చూశారు.
యేసును అనుకరిస్తూ, మనం కూడా మన తోటి విశ్వాసులకు విశ్రాంతినిచ్చే వారిగా ఉందాము. మన మాటలూ క్రియల ద్వారా వారిని ప్రోద్బలపర్చేందుకు లభించే అవకాశాలను మనం వెదకాలని దాని అర్థం. మన సంభాషణలో దయగల మరియు అనుకూల వ్యాఖ్యానాలను మనం నిజాయితీగా విరివిగా ఉపయోగించడం ఎల్లప్పుడూ సరియైనదే. (రోమీయులు 1:11, 12; 1 థెస్సలొనీకయులు 5:11) మనం ఏమి మాట్లాడతామూ అలాగే ఆ మాటల్ని ఎలా మాట్లాడతామూ అనే విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటే మనం వాళ్ల భావాల విషయమై సున్నితంగా ఉన్నామని మనం చూపిస్తాము. (కొలొస్సయులు 4:6) క్రైస్తవ కూటాలకు తగిన రీతిగా ముస్తాబై వెళ్లడం కూడా మన దేవుని మర్యాద ఎడలా, ఆయన ఆరాధన ఎడలా మరియు తోటి ఆరాధకుల ఎడలా మనం ప్రగాఢమైన గౌరవాన్ని కలిగి ఉన్నామనే విషయాన్ని ప్రతిబింబిస్తుంది.
యేసు ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు కూడా ఆయన వారిని గౌరవించాడు. ఇతరులకు ఇబ్బంది కలిగేలా చేస్తూ లేక వాళ్లను అవమానిస్తూ ఆయన ఎప్పుడూ తననుతాను ఘనపర్చుకోలేదు. ఒక కుష్ఠు వ్యాధిగ్రస్థుడు స్వస్థత కోరి ఆయన వద్దకు వచ్చినప్పుడు, అతడు అపరిశుభ్రంగా ఉన్నాడనీ, అయోగ్యుడనీ యేసు అతడిని పక్కకు నెట్టివేయలేదు, లేక తన వైపుకు అవధానాన్ని మళ్లించి పెద్ద ఆర్భాటం చేయలేదు. బదులుగా, “ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని” కుష్ఠు వ్యాధిగ్రస్థుడు యేసును వేడుకున్నప్పుడు, “నాకిష్టమే” అని అంటూ ఆయన ఆ కుష్ఠు వ్యాధిగ్రస్థున్ని గౌరవించాడు. (లూకా 5:12, 13) అవసరతల్లో ఉన్న వారికి సహాయం చేయడం మాత్రమే కాక వారు మనకు భారంగా లేరు గానీ వారెంతో కోరదగిన వారనీ మరియు ప్రియమైన వారనీ వారికి అభయాన్నివ్వగలగటం ఎంత అద్భుతమైన అవకాశమో కదా! ఈ లోకంలో బిడియస్థులు, కృంగిన వారు, వికలాంగులు సాధారణంగా అలక్ష్యం చేయబడతారు లేక అవమానించబడతారు. అయితే వారు తమ క్రైస్తవ సహోదర సహోదరీల మధ్య ఉన్నప్పుడు నిజమైన సహవాసాన్నీ, అంగీకారాన్నీ కనుగొనాలి. ఈ విధమైన స్ఫూర్తిని పెంపొందించేందుకు మనం మనకు వీలైనదంతా చేయాలి.
యేసు తన శిష్యులను “తనవారిని”గా ప్రేమించాడు, మరి వారిలో లోపాలూ వ్యక్తిగత అవలక్షణాలు ఉన్నప్పటికీ ఆయన “వారిని అంతమువరకు ప్రేమించెను.” (యోహాను 13:1) ఆయన వారిలో స్వచ్ఛమైన హృదయాలనూ తన తండ్రి యెడల సంపూర్ణ భక్తినీ చూశాడు. అదే విధంగా, మన తోటి ఆరాధకుల ఆలోచనావిధానం మన వలె లేనంత మాత్రాన లేక వారి అలవాట్లూ లేక వ్యక్తిత్వాలు మనకు విసుగు పుట్టించినంత మాత్రాన వారికి చెడు సంకల్పాలు ఉన్నాయని మనం ఎన్నడూ అనుకోకూడదు. మన సహోదరులకు తగిన గౌరవాన్నివ్వడం, వారు కూడా యెహోవాను ప్రేమిస్తున్నారనీ మరియు వారు ఆయన్ను స్వచ్ఛమైన సంకల్పాలతోనే సేవిస్తున్నారనీ నమ్మి, మనం వారిని ప్రేమించి వారు ఎలాగున్నారో అదే విధంగా వారిని అంగీకరించేందుకు మనలను పురికొల్పుతుంది.—1 పేతురు 4:8-10.
పెద్దలు ప్రాముఖ్యంగా, తాము ఎవరి ఎడల శ్రద్ధ వహించవలసి ఉందో వారికి అనవసరంగా చింతలు కలిగించకుండా ఉండేందుకు జాగ్రత్త వహించాలి. (1 పేతురు 5:2, 3) పాపంలో పడిపోయిన ఒక సంఘ సభ్యుణ్ణి కలిసినప్పుడు, ఇబ్బంది కలిగించే ప్రశ్నలను అనవసరంగా అడగటాన్ని నివారించి తమ మాటలకు దయనూ పరిగణనూ జత చేయడం పెద్దలకు ఎంతో మంచిది. (గలతీయులు 6:1) గంభీరమైన దిద్దుబాటు లేక క్రమశిక్షణ అవసరమైనప్పుడు కూడా, తప్పిదస్థునికున్న మర్యాదనూ ఆత్మగౌరవాన్నీ వారు అలక్ష్యం చేయకుండా వారు అతణ్ణి ఘనపర్చడంలో గౌరవించడంలో కొనసాగుతారు.—1 తిమోతి 5:1, 2.
వ్యక్తిగత గౌరవాన్ని కలిగివుండటం
దేవుని రూపంలోనూ, ఆయన వలెనూ సృష్టించబడిన మనం, మన అనుదిన జీవితాల్లో దేవుని హోదాతో పాటు ఆయన కలిగున్న ఇతర అద్భుతమైన లక్షణాలను మనకు వీలైనంతగా ప్రతిబింబించాల్సిన అవసరం ఉంది. (ఆదికాండము 1:26) అదే విధంగా, “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను” ఆజ్ఞను పాటించడంలో వ్యక్తిగత మర్యాద మరియు ఆత్మగౌరవం యొక్క సమతూకమైన పాళ్లు అవసరం. (మత్తయి 22:39) ఇతరులు మనలను గౌరవించాలనీ మరియు మనకు మర్యాద చూపాలనీ మనం కోరుకుంటే, మనం దానికి యోగ్యులమని మనం ప్రదర్శించాలన్నదే వాస్తవం.
ఆత్మగౌరవం మరియు వ్యక్తిగత మర్యాదను కాపాడుకోవడంలోని ఒక ప్రాముఖ్యమైన కారకాంశం స్వచ్ఛమైన మనస్సాక్షిని కలిగి ఉండడమే. కలుషితమైన మనస్సాక్షీ మరియు దోషులమనే భావన పదే పదే కలగటమూ, మనం అయోగ్యులమనే భావాలనూ, నిస్సహాయతనూ మరియు కృంగుదలనూ సులభంగా కలిగిస్తాయి. కాబట్టి, ఒక వ్యక్తి ఒక గంభీరమైన తప్పు చేస్తే, “ప్రభువు సముఖమునుండి విశ్రాంతికాలము”లను ఆనందించేలాగున పశ్చాత్తాపాన్ని చూపేందుకూ మరియు పెద్దల ఆధ్యాత్మిక సహాయాన్ని పొందేందుకూ త్వరితంగా చర్యలు తీసుకోవాలి. వారు ఆనందించే ఆ ఉపశమనంలో తన వ్యక్తిగత మర్యాదా మరియు ఆత్మగౌరవం తిరిగి లభించడం కూడా చేరి ఉన్నాయి.—అపొస్తలుల కార్యములు 3:19.
బైబిలు నుండి తర్ఫీదు పొందిన మన మనస్సాక్షిని కలతపర్చే లేక బలహీనపర్చే దేనినీ అనుమతించకుండా మనం దాన్ని కాపాడుకునేందుకు ఎడతెగని చర్యలను తీసుకోవడం ఎంతైనా మంచిది. మన జీవితంలోని అన్ని విషయాల్లోనూ, అంటే తినడం, త్రాగడం, వ్యాపారం, వినోదం, వ్యతిరేకలింగ వ్యక్తులతో వ్యవహారంలో మనం ఆత్మనియంత్రణను ప్రదర్శించడం, మనం స్వచ్ఛమైన మనస్సాక్షిని కలిగి ఉండేందుకు సహాయపడుతుంది మరియు మన జీవితాల్లో దేవుని మహిమనూ ఘనతనూ ప్రతిబింబించేందుకు మనకు తోడ్పడుతుంది.—1 కొరింథీయులు 10:31.
మనం చేసిన తప్పిదాలవల్ల దోషిననే భావన మనలో ఎంతకూ తగ్గిపోకపోతే అప్పుడేమిటి? లేక మనం అనుభవించిన దుర్వ్యవహారాలను గురించిన జ్ఞాపకాలు మనకు బాధ కలిగించడంలో కొనసాగితే అప్పుడేమిటి? ఇవి మన వ్యక్తిగత మర్యాదను అణచివేసి మనకు తీవ్రమైన కృంగుదలను కలిగించగలవు. “విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును” అని రాజైన దావీదు కీర్తన 34:18 నందు పలికిన మాటలు ఎంత ఊరటనిస్తున్నాయో కదా! తన సేవకులు కృంగుదలతోనూ అయోగ్యులమనే భావనలతోనూ వ్యవహరిస్తున్నప్పుడు యెహోవా వారికి సహాయం చేసేందుకు ఎంతో సంసిద్ధంగా ఉంటాడు. ఆధ్యాత్మిక యోగ్యతగల క్రైస్తవ తలిదండ్రులు, పెద్దలు మరియు సంఘంలోని పరిణతిగల ఇతరులనుండి సహాయాన్ని కోరడంతో పాటు ఆయనకు విన్నవించుకోవడం, మన ఆత్మగౌరవాన్నీ వ్యక్తిగత మర్యాదనూ కాపాడుకునేందుకు మూలం.—యాకోబు 5:13-15.
మరో వైపు, వ్యక్తిగత మర్యాద మరియు అహంకారం మధ్యగల గీతను దాటకుండా మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. “తన్ను తాను ఎంచుకొనతగిన దానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, తాను స్వస్థబుద్ధిగల వాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని” లేఖనాలు సలహా ఇస్తున్నాయి. (రోమీయులు 12:3) ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవడం మంచిదైనప్పటికీ, మనం మన యోగ్యతను అతిగా చెప్పుకోవాలనీ లేక ఇతరుల ఎదుట తమ సిగ్గు దక్కించుకునేందుకు కొందరు తీసుకునే స్వార్థపూరితమైన విపరీత చర్యలతో మనం మర్యాదను గలిబిలి పర్చాలనీ అనుకోము.
అవును, ఇతరులకు తగిన గౌరవాన్ని వారికివ్వడం ఒక క్రైస్తవ అవసరత. మన కుటుంబ సభ్యులూ తోటి క్రైస్తవులందరూ కూడా మన నుండి గౌరవాన్నీ, ఘనతనూ మర్యాదనూ పొందే అర్హతను కలిగి ఉన్నారు మరియు వారు అందుకు యోగ్యులు. యెహోవా మనందరికీ గౌరవాన్నీ ఘనతనూ తగిన పాళ్లలో ఇచ్చాడు, మనందరమూ దాన్ని అంగీకరించి కాపాడుకోవలసిన అవసరం ఉంది. అయితే అన్నిటికంటే మిన్నగా, మన పరలోక తండ్రియైన యెహోవా దేవునికున్న అసమానమైన మహిమా ఘనతల ఎడల ప్రగాఢమైన భక్తిని పెంపొందించుకోవాలి.
[31వ పేజీలోని చిత్రం]
యౌవనులు వికలాంగులైన వారికి గౌరవం చూపగలరు