ఒక కుష్ఠురోగిగా నా జీవితం—ఆనందమయమైనదీ ఆధ్యాత్మికంగా ఆశీర్వదింపబడినది
ఐజేయ అడగ్బోన చెప్పినది
నేను నైజీరియానందలి అకూరెలో పెరిగి పెద్దయ్యాను. మా కుటుంబం కర్రపెండలం, అరటికాయలు, కసావా, కోకో పండించేది. నేను పాఠశాలకు వెళ్లేందుకు మా నాన్న ఇష్టపడలేదు. “నువ్వో రైతువు. కర్రపెండలాన్ని పెంచేందుకు నీకు డిగ్రీలేం అక్కర్లేదులే” అని ఆయన నాతో అన్నాడు.
అయినా కూడా, నేను చదవడం నేర్చుకోవాలని ఎంతో ఇష్టపడ్డాను. సాయంకాలాల్లో, ఒక ట్యూషన్ టీచరు ఒక ఇంట్లోని పిల్లలకు పాఠాలు నేర్పిస్తుంటే నేను కిటికీ దగ్గర నిలబడి వినేవాణ్ణి. అది నాకు 12 ఏళ్లున్నప్పుడు 1940లోని సంగతి. ఆ పిల్లల తండ్రి నన్ను చూసినప్పుడు అతడు నామీద కేకలేసి నన్ను తరిమేసేవాడు. అయినా నేను మళ్లీ తిరిగి వెళ్లేవాణ్ణి. కొన్నిసార్లు ఆ టీచరు రానప్పుడు, నేను దొంగచాటుగా లోనకు వెళ్లి పిల్లలతో కలిసి వాళ్ల పుస్తకాలను చూసేవాణ్ణి. కొన్నిసార్లు వాళ్లు తమ పుస్తకాలు నాకు ఎరువిచ్చేవాళ్ళు. నేను చదవడం నేర్చుకున్నది ఆ విధంగానే.
నేను దేవుని ప్రజల్లో కలవడం
కొంత కాలానికి నాకు బైబిలు దొరికింది మరి నేను నిద్రపోయేముందు దాన్ని క్రమంగా చదివేవాణ్ణి. ఒక సాయంత్రం, యేసు శిష్యులు మనుష్యుల చేత ద్వేషించబడి హింసించబడతారని చూపిస్తున్న మత్తయి 10వ అధ్యాయాన్ని నేను చదివాను.
యెహోవాసాక్షులు మా ఇంటికి వచ్చారనీ, వాళ్ల ఎడల చాలా అవమానకరంగా వ్యవహరించడం జరిగిందనీ నాకు జ్ఞాపకముంది. యేసు ఈ ప్రజలను గురించే మాట్లాడి ఉంటాడని నాకు అనిపించింది. సాక్షులు మా ఇంటికి వచ్చిన తర్వాతి సారి, నేను వాళ్ల నుండి పత్రికలను తీసుకున్నాను. నేను వాళ్లతో సహవసించడం మొదలుపెట్టినప్పుడు, నేను ఎగతాళికి గురయ్యాను. అయినప్పటికీ, ప్రజలు నన్నెంత ఎక్కువ నిరుత్సాహపర్చాలని ప్రయత్నించారో, నేను సత్యమతాన్ని కనుగొన్నానని నేను అంతెక్కువ ఒప్పించబడి అందు విషయమై ఆనందించాను.
సాక్షులను గురించి నన్ను బాగా ప్రభావితం చేసిన విషయం ఏమిటంటే, మా ప్రాంతంలోని ఇతర మత గుంపుల వలె కాక, వాళ్లు తమ ఆరాధనను ప్రాంతీయ అన్యమతాచారాలూ పారంపర్యాలతో కలగలపలేదు. ఉదాహరణకు, మా కుటుంబం ఆంగ్లికన్ చర్చికి హాజరౌతున్నప్పటికీ, యెరూబ దేవుడైన ఓగున్ కొరకు మా నాన్న ఒక పూజా గృహాన్ని స్థాపించాడు.
మా నాన్న చనిపోయిన తర్వాత, నేను ఆ పూజా గృహాన్ని తీసుకోవలసి ఉంది. బైబిలు విగ్రహారాధనను ఖండిస్తుందని నాకు తెలుసు గనుక, నేను దాన్ని తీసుకోదల్చుకోలేదు. నేను యెహోవా సహాయంతో ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి సాధించి, 1954 డిసెంబరులో బాప్తిస్మం తీసుకున్నాను.
కుష్ఠువ్యాధి రావడం
ఆ సంవత్సరం తొలి భాగంలో, నా పాదాలు కాస్త వాచి స్పర్శ తెలియకుండా అవ్వడాన్ని గమనించాను. నేను మండే నిప్పుల మీద కాలు పెట్టినా, నాకు నొప్పి తెలిసేది కాదు. కొంత సమయం తర్వాత, నా నొసటిపై, పెదాలపై ఎర్రని అల్సర్లు కనిపించాయి. నాకు గానీ నా కుటుంబ సభ్యులకు గానీ సమస్యేమిటో అర్థం కాలేదు; అది ఎక్సిమా అని మేము అనుకున్నాము. నేను చికిత్స కొరకు 12 మంది నాటు వైద్యుల వద్దకు వెళ్లాను. తుదకు వాళ్లలో ఒకరు అది కుష్ఠు వ్యాధి అని మాకు చెప్పారు.
అది మాకెంతో దుఃఖాన్ని కలిగించింది! నాకు చాలా బాధ కలిగింది, నాకు సరిగా నిద్ర పట్టేది కాదు. నాకు నిద్రలో పీడకలలు వచ్చేవి. అయితే బైబిలు సత్యాలను గురించిన జ్ఞానము, మరియు యెహోవాపై ఆధారపడటమూ నేను భవిష్యత్తువైపు నమ్మకంతో చూసేందుకు నాకు సహాయం చేశాయి.
నేను ఒక సోదెగాని దగ్గరకు బలి అర్పించేందుకు వెళ్తే నాకు నయమౌతుందని ప్రజలు మా అమ్మకు చెప్పారు. అలాంటి పని యెహోవాను అప్రీతిపరుస్తుందని నాకు తెలుసు గనుక నేను వెళ్లేందుకు నిరాకరించాను. ఆ విషయంలో నేను దృఢ తీర్మానాన్ని కలిగున్నానని గుర్తించి, మా అమ్మ ఒక కోలా విత్తనాన్ని తీసుకుని దాన్ని నా నొసటికి ఒకసారి తాకించాలని ఆమె స్నేహితులు చెప్పారు. తర్వాత ఆమె ఆ కోలా విత్తనాన్ని నా పక్షాన బలుల్లో ఉపయోగించేందుకు సోదెగానికి ఇవ్వవచ్చు. నేను అందులో ఎంతమాత్రం భాగం వహించకూడదని అనుకున్నాను, నేను అలాగని మా అమ్మకి చెప్పాను. తుదకు నేను అన్యమతంలో భాగం వహించేలా చేసేందుకు ఆమె ఇక మరీ ప్రయత్నించలేదు.
నేను ఆసుపత్రికి వెళ్లే సరికల్లా, నా శరీరంలో కుష్ఠు వ్యాధి బాగా పాకిపోయింది. నా శరీరమంతటా అల్సర్లు వచ్చాయి. ఆసుపత్రిలో నాకు మందులు ఇచ్చారు, క్రమేపి నా చర్మం మామూలు స్థితికి వచ్చింది.
వాళ్లు నేను చనిపోయాననుకున్నారు
అయితే నా సమస్యలు ఇంకా అంతం కాలేదు. నా కుడి పాదం పూర్తిగా పాడైపోయింది, 1962లో దాన్ని తీసేయవలసి వచ్చింది. శస్త్రచికిత్స తర్వాత, వైద్యసంబంధమైన ఇబ్బందులు వచ్చిపడ్డాయి. నేను బ్రతుకుతానని వైద్యులు అనుకోలేదు. తెల్లజాతీయుడైన ఒక మిషనరీ ప్రీస్టు, నా అంత్య క్రియలు చేస్తానని వచ్చాడు. మాట్లాడేందుకు కూడా నాకు శక్తి సరిపోలేదు, అయితే నేను ఒక యెహోవాసాక్షినని నర్సు ఆయనకు చెప్పింది.
ఆ ప్రీస్టు నాకిలా చెప్పాడు: “నీవు మారి, పరలోకానికి వెళ్లేందుకు గానూ ఒక క్యాథలిక్వి కావాలనుకుంటున్నావా?” ఆ మాటలు నేను లోలోపలే నవ్వుకునేలా చేశాయి. జవాబిచ్చేందుకు నాకు శక్తినివ్వమని నేను యెహోవాకు ప్రార్థించాను. నేను శక్తంతా కూడదీసుకుని “వద్దు!” అని చెప్పగలిగాను. ఆ ప్రీస్టు వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు.
నా ఆరోగ్యం ఎంతగా క్షీణించిందంటే ఆసుపత్రి సిబ్బంది నేను చనిపోయాననే అనుకుంది. వాళ్లు నా ముఖాన్ని ఒక దుప్పటితో కప్పేశారు. మొదట ఒక వైద్యుడు లేక ఒక నర్సు నేను మరణించానని ధ్రువపర్చాలి గనుక వాళ్లు నన్ను మార్చురీకి తీసుకెళ్లలేదు. ఆ సమయంలో వైద్యులెవ్వరూ డ్యూటీలో లేరు, నర్సులందరూ ఒక పార్టీకి వెళ్లారు. అందుకు వాళ్లు నన్ను వార్డులోనే రాత్రంతా ఉంచారు. మర్నాటి ఉదయం వైద్యులు రౌండ్స్‌కి వచ్చినప్పుడు, నేను ఇంకా కప్పబడి ఉండి, అందరూ నేను చనిపోయానని అనుకున్నందున నా బెడ్ దగ్గరకు ఎవరూ రాలేదు. తుదకు, దుప్పటి కప్పబడి ఉన్న “శవం” కదులుతూ ఉందని ఎవరో గమనించారు!
అయితే నేను కోలుకున్నాను, 1963 డిసెంబరులో నైరుతి నైజీరియాలోని అబీయోకట కుష్ఠు ఆసుపత్రి సెటిల్మెంటుకు నన్ను తరలించారు. నేను అప్పటినుండీ అక్కడే నివసిస్తున్నాను.
నా ప్రకటనాపనికి వ్యతిరేకత
నేను సెటిల్మెంటుకు చేరుకునే సరికి అక్కడ 400 మంది కుష్ఠు వ్యాధిగ్రస్థులు ఉన్నారు, అక్కడ నేనొక్కడినే యెహోవాసాక్షిని. నేను సొసైటీకి ఉత్తరం వ్రాశాను, నన్ను కలవమని అకోమోజీ సంఘానికి నడిపింపునిస్తూ సొసైటీ త్వరితంగా ప్రతిస్పందించింది. కాబట్టి నేను ఎన్నడూ సహోదరులతో సంబంధాన్ని కోల్పోలేదు.
నేను సెటిల్మెంటుకు చేరుకున్న వెనువెంటనే ప్రకటించడం ప్రారంభించాను. ఆ ప్రాంతంలోని పాస్టరు ఆ విషయాన్ని బట్టి సంతోషించలేదు, ఆ క్యాంపులో ఇన్ఛార్జిగా ఉన్న సంక్షేమాధికారికి ఆయన నా గురించి రిపోర్టు చేశాడు. ఆ సంక్షేమాధికారి జర్మనీనుండి వచ్చిన ఒక పెద్ద వయస్సుగల వ్యక్తి. నేను చదువుకోలేదు మరియు బైబిలు నేర్పేందుకు నా వద్ద సర్టిఫికేట్ లేదు గనుక ప్రకటించే హక్కు నాకు లేదని ఆయన నాకు చెప్పాడు; బోధించే యోగ్యత నాకు లేదు గనుక నేను ప్రజలకు తప్పుగా బోధిస్తానని ఆయన అన్నాడు. నేను అలా చేయడంలో కొనసాగితే, నన్ను సెటిల్మెంట్నుండి బహిష్కరించవచ్చు, నాకు వైద్య చికిత్సనిచ్చేందుకు నిరాకరించవచ్చు. నేను దానికి జవాబుగా ఏమైనా చెప్పేందుకు ఆయన నన్ను అనుమతించలేదు.
తర్వాత ఎవరూ కూడా నాతో బైబిలు పఠించకూడదని ఆయన ఒక ఆజ్ఞ జారీ చేశాడు. దాని ఫలితంగా, మొదట ఆసక్తి చూపిన వారు నా వద్దకు రావడం మానేశారు.
నేను జ్ఞానాన్నీ నడిపింపునూ అడుగుతూ ప్రార్థనలో యెహోవా ఎదుట ఈ విషయాన్ని పెట్టాను. ఆ తర్వాతి ఆదివారం, సెటిల్మెంటులో ఉన్న బాప్టిస్టు చర్చికి నేను వెళ్లాను, అయితే నేను మత సర్వీసుల్లో భాగం వహించలేదు. సర్వీసు జరిగే సమయంలో ప్రశ్నలను అడిగేందుకు కూడా కొంత సమయాన్ని కేటాయించడం జరిగింది. నేను నా చెయ్యి పైకెత్తి ఇలా అడిగాను: “మరి మంచి ప్రజలందరూ పరలోకానికీ, చెడ్డ వాళ్లందరూ మరేదో స్థలానికి వెళ్లనైవుంటే, దేవుడు భూమిని నివాసస్థలంగా ఉండేలా చేశాడని యెషయా 45:18 ఎందుకు చెబుతుంది?”
సంఘంలోని వాళ్లందరూ గుసగుసలాడారు. తుదకు, దేవుని మార్గాలు అగమ్యములని ఆ మిషనరీ పాస్టర్ చెప్పాడు. దానితో, 144,000 మంది పరలోకానికి వెళ్తారనీ, దుష్టులు నాశనమౌతారనీ మరియు నీతిమంతులు భూమిపై నిరంతరమూ జీవిస్తారనీ చెప్పే లేఖనాలను చదవడం ద్వారా నేనడిగిన ప్రశ్నకు నేనే సమాధానం చెప్పాను.—కీర్తన 37:10, 11; ప్రకటన 14:1, 4.
నా సమాధానాన్ని మెచ్చుకుంటూ అందరూ చప్పట్లు కొట్టారు. తర్వాత పాస్టర్ ఇలా చెప్పాడు: “ఈ వ్యక్తికి నిజంగానే బైబిలు తెలుసుగనుక ఇంకోసారి చప్పట్లు కొట్టండి.” సర్వీస్ అయిపోయిన తర్వాత, కొందరు నా వద్దకు వచ్చి, “మీకు ఆ పాస్టరు కంటే బైబిలు ఎక్కువగా తెలుసు” అని నాతో అన్నారు.
నన్ను బహిష్కరించేందుకు ఒత్తిడి కొనసాగింది
అది నాకు ఎదురైన హింసలో అధిక శాతాన్ని తగ్గించింది, బైబిలు పఠించేందుకు మళ్లీ ప్రజలు నా వద్దకు రావడం ప్రారంభించారు. అయితే, నన్ను వ్యతిరేకించే వారు ఇంకా కొంతమంది ఉన్నారు, వారు నా పీడను వదిలించుకోవాలని సంక్షేమాధికారిపై ఒత్తిడి తెచ్చారు. చర్చి సర్వీస్ జరిగిన దాదాపు ఒక నెల తర్వాత, ఆయన నన్ను పిలిచి ఇలా చెప్పాడు: “నువ్వు ఎందుకు ఇలా ప్రకటిస్తూనే ఉన్నావు? నా దేశంలో ప్రజలకు యెహోవాసాక్షులంటే ఇష్టం లేదు, మరి ఇక్కడి పరిస్థితి కూడా అంతే. నువ్వు నాకు ఎందుకు సమస్యలు సృష్టించాలని అనుకుంటున్నావు? నేను నిన్ను బయటకు పంపించగలనని నీకు తెలియదా?”
నేనిలా సమాధానం చెప్పాను: “అయ్యా, నేను మిమ్మల్ని మూడు కారణాలనుబట్టి గౌరవిస్తున్నాను. మొదటిగా, మీరు నాకంటే పెద్దవారు గనుక, నెరిసిన వెండ్రుకలుగల వారిని గౌరవించాలని బైబిలు చెబుతుంది. నేను మిమ్మల్ని గౌరవించేందుకుగల రెండవ కారణం, మీరు మీ దేశాన్ని వదిలి మాకు సహాయం చేసేందుకు ఇక్కడికి వచ్చారు గనుక. మూడవది, కష్టాల్లో ఉన్న వారి ఎడల మీరు దయగా, ఉదారంగా ఉండి వారికి సహాయం చేస్తారు గనుక. అయితే మీరు ఏ హక్కుపై నన్ను బహిష్కరించగలనని అనుకుంటున్నారు? ఈ దేశాధ్యక్షుడు యెహోవాసాక్షులను బహిష్కరించడు. ఈ ప్రాంతంలోని పారంపర్య నాయకుడు మమ్మల్ని బహిష్కరించడు. ఒకవేళ మీరు నన్ను ఈ క్యాంపులోనుండి బయటకు తరిమినప్పటికీ, యెహోవా నా ఎడల తప్పక శ్రద్ధ తీసుకుంటాడు.”
నేను ఇంతకు ముందెన్నడూ ఆయనతో అలా సూటిగా మాట్లాడలేదు, మరి అది ఆయన్ను ప్రభావితం చేసిందని నేను చూడగలిగాను. ఆయన ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్లిపోయాడు. తర్వాత, నా గురించి ఎవరో ఫిర్యాదు చేసినప్పుడు, ఆయన విసుగ్గా ఇలా అన్నాడు: “నేను ఈ సమస్యలో మరింకెన్నడూ తలదూర్చను. ఆయన ప్రకటించడం వల్ల మీకేమైనా సమస్యలుంటే, దాని గురించి ఆయనతోనే మాట్లాడండి!”
అక్షరాస్యతా తరగతి
క్యాంపులోని బాప్టిస్టు చర్చికి హాజరయ్యే వారు నా ప్రకటనా పనిని వ్యతిరేకించడంలో కొనసాగారు. తర్వాత నాకో చక్కని తలంపు వచ్చింది. నేను సంక్షేమాధికారి వద్దకు వెళ్లి, నేను అక్షరాస్యతా తరగతిని ప్రారంభించవచ్చా అని అడిగాను. నాకు జీతమెంత కావాలని నన్ను అడిగినప్పుడు, నేను ఉచితంగానే బోధిస్తానని చెప్పాను.
వాళ్లు నాకు ఒక తరగతి గదినీ, బ్లాక్బోర్టునూ, చాక్పీస్నూ ఇచ్చారు, నేను క్యాంపులోని వాళ్లకు కొంతమందికి బోధించడం ప్రారంభించాను. మేము ప్రతిరోజూ తరగతులను జరుపుకునే వాళ్లం. మొదటి 30 నిమిషాలు నేను చదవడం నేర్పించేవాణ్ణి, తర్వాత నేను బైబిలు నుండి ఒక కథను చెప్పి దాన్ని వివరించే వాణ్ణి. దాని తర్వాత, మేము బైబిలు నుండి ఆ వృత్తాంతాన్ని చదివేవాళ్లం.
నీమోట అనే పేరుగల ఒక స్త్రీ కూడా విద్యార్థుల్లో ఉండేది. ఆమెకు ఆధ్యాత్మిక విషయాల్లో ప్రగాఢ ఆసక్తి ఉండేది, ఆమె చర్చిలోనూ మసీదులోనూ మతసంబంధ ప్రశ్నలు అడిగేది. ఆమెకు అక్కడ ఆ ప్రశ్నలకు సమాధానాలు లభించలేదు, అందుకు ఆమె ఆ ప్రశ్నలను అడిగేందుకు నా వద్దకు వచ్చేది. తుదకు, ఆమె తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకుంది. 1966లో మేము వివాహం చేసుకున్నాము.
నేటి మా సంఘంలోని చాలామంది ఆనాటి అక్షరాస్యతా తరగతిలోనే చదవడమూ వ్రాయడమూ నేర్చుకున్నారు. ఆ తరగతిని జరపాలని సలహా ఇచ్చేంత జ్ఞానం నాకు లేదు. యెహోవా ఆశీర్వాదముందనే విషయం స్పష్టమైంది. దాని తర్వాత నా ప్రకటనాపనిని ఆపేందుకు ఎవరూ ప్రయత్నించ లేదు.
క్యాంపులో ఒక రాజ్యమందిరం
నీమోటకు నాకు వివాహం జరిగే సమయానికి, క్రమంగా కూడుకుని కావలికోట పఠించేవాళ్ల సంఖ్య మా ఇద్దరితోపాటు నలుగురు. దాదాపు ఒక సంవత్సరం వరకూ, కుష్ఠువ్యాధి గాయాలు కడిగే గదిలో మేము కూడుకునే వాళ్లం. ఈ సరికల్లా నా స్నేహితునిగా మారిన ఆ సంక్షేమాధికారి, నాతో ఇలా చెప్పాడు: “మీరు మీ దేవుణ్ణి చికిత్స గదిలో ఆరాధించడం మంచిది కాదు.”
మేము ఖాళీగా ఉన్న కార్పెంటర్ షెడ్లో కూడుకోవచ్చని ఆయన చెప్పాడు. కొంత కాలానికి, ఆ షెడ్ రాజ్యమందిరంగా మార్చబడింది. 1992లో, ఆ పట్టణంలోని సహోదరుల సహాయంతో, మేము దాన్ని పూర్తి చేయగలిగాము. 24వ పేజీలోని చిత్రంలో మీరు చూసే విధంగా, ఆ హాలు ప్లాస్టరు చేసి రంగులు వేయబడి, కాంక్రీటు గచ్చూ మంచి పైకప్పూ ఉన్న పటిష్ఠమైన భవనం.
కుష్ఠు వ్యాధిగల వారికి ప్రకటించడం
33 సంవత్సరాలుగా నా ప్రకటనాప్రాంతం కుష్ఠు వ్యాధిగ్రస్తుల సెటిల్మెంటే. కుష్ఠువ్యాధి ఉన్న వారికి ప్రకటించడం ఎలా ఉంటుంది? ఆఫ్రికాలోని అనేకమంది ప్రజలు అన్నీ దేవుని నుండే వస్తాయని నమ్ముతారు. కాబట్టి వాళ్లకు కుష్ఠువ్యాధి వచ్చినప్పుడు, ఏదో విధంగా దేవుడే దానికి కారణమని వాళ్లు నమ్ముతారు. కొందరు తమ పరిస్థితిని గురించి తీవ్రంగా కలత చెంది ఉంటారు. ఇతరులు కోపంగా ఉంటారు, వాళ్లిలా అంటారు: “ప్రేమాదయలుగల దేవుని గురించి మాతో మాట్లాడకండి. ఒకవేళ అదే నిజమైతే, ఈ జబ్బు పోయేదే!” అప్పుడు, ‘దేవుడు కీడువిషయమై ఎవనిని శోధింపడు’ అని చెబుతున్న యాకోబు 1:13ను మేము చదివి, తర్కిస్తాము. తర్వాత వ్యాధి మానవులను బాధించేందుకు యెహోవా ఎందుకు అనుమతిస్తున్నాడో మేము వివరించి, ఎవ్వరూ రోగగ్రస్థులుగా ఉండని పరదైసు భూమిని గురించిన వాగ్దానాన్ని మేము సూచిస్తాము.—యెషయా 33:24.
అనేకులు సువార్తకు ఎంతో చక్కగా ప్రతిస్పందించారు. నేను క్యాంపుకు వచ్చినప్పటినుండీ, 30 కంటే ఎక్కువమంది ప్రజలు—అందరూ కుష్ఠు వ్యాధిగ్రస్తులే—సమర్పించుకుని బాప్తిస్మం తీసుకోవడానికి వారికి సహాయం చేసేందుకు యెహోవా నన్ను ఉపయోగించుకున్నాడు. అనేకులు స్వస్థత నొందిన తర్వాత తమ ఇండ్లకు తిరిగి వెళ్లారు, మరి కొంతమంది మరణించారు. మాకు ఇప్పుడు 18 మంది రాజ్యప్రచారకులు ఉన్నారు, మరి దాదాపు 25 మంది కూటాలకు క్రమంగా హాజరౌతున్నారు. మాలో ఇద్దరము పెద్దలము, మాకు ఒక పరిచర్య సేవకుడు ఒక క్రమ పయినీరు ఉన్నారు. ఈ క్యాంపులో అనేకులు నమ్మకంగా యెహోవాను సేవించడాన్ని చూడటం నాకెంతో ఆనందాన్ని కలిగించింది! నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒంటరివానిగా ఉంటానని నేను భయపడ్డాను, అయితే యెహోవా నన్ను అద్భుతమైన రీతిలో దీవించాడు.
నా సహోదరులకు సేవచేయడంలోని ఆనందం
నేను 1960 నుండి ఇటీవలి ఐదు సంవత్సరాల క్రితం వరకూ కుష్ఠు వ్యాధికి మందులు తీసుకున్నాను. నాకు ఇప్పుడు పూర్తిగా నయమైంది, మరి మా సంఘంలోని ఇతరులకు కూడా పూర్తిగా నయమైంది. కుష్ఠు వ్యాధి తన గుర్తును విడిచిపెట్టిపోయింది—నా కాలులో కొంత భాగం తీసేయబడింది, నేను నా చేతులను సరిగ్గా చాపలేను—అయినప్పటికీ ఆ వ్యాధి మాత్రం పూర్తిగా పోయింది.
నాకు నయమైంది గనుక, నేను క్యాంపు వదిలి ఇంటికి ఎందుకు తిరిగి వెళ్లడం లేదని కొందరు నన్ను అడిగారు. నేను ఇక్కడే ఉండిపోవడానికి చాలా కారణాలున్నాయి, అయితే నేను ఇక్కడ నా సహోదరులకు సహాయం చేయడంలో కొనసాగాలని కోరుకుంటున్నాను అన్నది ముఖ్యమైన కారణం. యెహోవా గొర్రెల ఎడల శ్రద్ధ వహించడంలోని ఆనందం, నేను తిరిగి వెళ్తే నా కుటుంబం ఇవ్వగల దేనికంటే కూడా ఎంతో గొప్పది.
నాకు కుష్ఠు వ్యాధి రాకముందే నేను యెహోవాను తెలుసుకోగలిగినందుకు నేనెంతో కృతజ్ఞత కలిగివున్నాను. లేకపోతే, నేను ఆత్మహత్య చేసుకుని ఉండేవాడినేమో. ఈ సంవత్సరాలన్నింటిలో అనేక సమస్యలు నాకు ఎదురయ్యాయి, అయితే నన్ను కాపాడింది మందులు కాదుగానీ యెహోవాయే. నేను గతాన్ని గురించి ఆలోచిస్తే నాకు ఆనందం కలుగుతుంది; అయితే దేవుని రాజ్యం క్రింద ఉండబోయే భవిష్యత్తును గురించి నేను ఆలోచించినప్పుడు నాకు మరింత ఆనందం లభిస్తుంది.
[25వ పేజీలోని బాక్సు]
కుష్ఠువ్యాధిని గూర్చిన వాస్తవాల పత్రం
అదేమిటి?
ఆధునిక దిన కుష్ఠు వ్యాధి, 1873లో అర్మేయర్ హాన్సన్ ద్వారా గుర్తించబడిన ఒక బేసిలస్ మూలంగా కలిగే వ్యాధి. ఆయన చేసిన కృషికి గుర్తింపుగా, వైద్యులు కుష్ఠు వ్యాధిని హాన్సన్ వ్యాధి అని కూడా పిలుస్తారు.
బేసిలస్ నరాలనూ, ఎముకలనూ, కళ్ళనూ, మరి కొన్ని భాగాలనూ పాడు చేస్తుంది. తరచూ పాదాలూ చేతులు స్పర్శ కోల్పోతాయి. ఈ వ్యాధిని గమనించకపోతే, అది ముఖాన్నీ ఇతర భాగాలను వికృతపర్చగలదు. దాని మూలంగా మరణించడం అరుదు.
దానికి చికిత్స ఉందా?
కుష్ఠు వ్యాధిలోని స్వల్పమైన రకం సోకిన ప్రజలకు ఏ విధమైన చికిత్సా లేకుండానే నయమౌతుంది. మరింత గంభీరమైన రకాలను మందులతో నయం చేయవచ్చు.
కుష్ఠు వ్యాధికి విరుగుడు మందు, 1950లలో పరిచయం చేయబడింది, అది చాలా నెమ్మదిగా పని చేసేది, మరి కుష్ఠు వ్యాధి బేసిలస్ దాన్ని నిరోధించగలిగినందుకు ఆ మందు పూర్తిగా నిరుపయుక్తం అయ్యింది. క్రొత్త మందులు వృద్ధి చెందాయి, తొలి 1980ల నుండీ, మల్టీ-డ్రగ్ థెరపీ (ఎమ్టీడీ, [బహుళ-మందుల చికిత్స]) ప్రపంచ వ్యాప్తంగా ప్రామాణిక చికిత్స అయ్యింది. ఈ చికిత్సలో డెప్సోన్, రైఫాంపసన్, మరియు క్లోఫాజిమీన్ అనే మూడు మందుల ఉపయోగం ఇమిడి ఉంటుంది. ఎమ్టీడీ బేసిలస్‌ను చంపుతుంది గానీ, అప్పటికే జరిగిన నష్టాన్ని మాత్రం పూరించలేదు.
ఈ వ్యాధిని నయం చేయడంలో ఎమ్టీడీ ఎంతో ప్రభావవంతమైనది. కుష్ఠు వ్యాధిగల వారి సంఖ్య 1985లో 1.2 కోట్లు ఉన్నది 1996 మధ్యభాగం కల్లా 13 లక్షలకు తగ్గింది.
అదెంత సాంక్రామికమైనది?
కుష్ఠు వ్యాధి అంత తీవ్రంగా సంక్రమించేది కాదు; అనేకమంది ప్రజలకు దాన్ని ఎదుర్కునేంత శక్తివంతమైన వ్యాధి నిరోధక వ్యవస్థలు ఉంటాయి. అయితే, ఆ వ్యాధి సోకిన వారితో ఎక్కువకాలం మరీ దగ్గరగా మసలడం మూలంగా అది వస్తుంది.
బేసిలస్ శరీరంలోనికి ఎలా ప్రవేశిస్తుంది అనే విషయాన్ని గురించి వైద్యులకు తెలియదు, అయితే అది చర్మం ద్వారా లేక ముక్కు ద్వారా వస్తుందని వాళ్లు అనుమానిస్తున్నారు.
భవిష్యత్ ఉత్తరాపేక్షలు
కుష్ఠు వ్యాధి 2000 సంవత్సరానికల్లా “పూర్తిగా నిర్మూలించబడవలసిన ప్రజా ఆరోగ్య సమస్య” అని లక్ష్యం ఏర్పరచుకోవడం జరిగింది. ఏ సమాజంలోనైనా కుష్ఠు వ్యాధి యొక్క కేసుల సంఖ్య ప్రతి 10,000 మంది వ్యక్తుల్లో ఒక్కరే వ్యాధి సోకిన వ్యక్తులై ఉంటారని దాని అర్థం. దేవుని రాజ్యం క్రింద అది పూర్తిగా తీసివేయబడుతుంది.—యెషయా 33:24.
మూలం: ప్రపంచ ఆరోగ్య సంస్థ; ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆంటీ-లెప్రసీ అసోసియేషన్స్; మరియు మాన్సన్స్ ట్రాపికల్ డిసీజెస్, 1996 సంపుటి.
[27వ పేజీలోని బాక్సు]
నేటి కుష్ఠు వ్యాధి బైబిలు కాలాల్లోని దానివంటిదేనా?
నేడు వైద్య పాఠ్యపుస్తకాలు కుష్ఠు వ్యాధిని నిర్దిష్ట పదాల్లో నిర్వచిస్తున్నాయి; దానిలో ఇమిడివున్న మైక్రోబ్కుగల వైజ్ఞానిక పేరు మైకోబాక్టీరియమ్ లెప్రే. అయితే బైబిలు వైద్య పాఠ్యపుస్తకం కాదు. అనేక బైబిలు అనువాదాల్లో “కుష్ఠు వ్యాధి” అని అనువదించబడిన హెబ్రీ మరియు గ్రీకు పదాలు మరింత సమగ్రమైన భావాన్ని కలిగి ఉన్నాయి. ఉదాహరణకు, బైబిలులోని కుష్ఠు వ్యాధి మనుష్యుల్లోనే కాక బట్టల్లో ఇళ్ళల్లో గమనించగల రోగలక్షణాలను ఉత్పత్తి చేసింది, అయితే బేసిలస్ అలా చేయదు.—లేవీయకాండము 13:2, 47; 14:34.
అంతే కాకుండా, నేడు కుష్ఠు వ్యాధిని గుర్తించేందుకు మానవుల్లో కలిగే రోగలక్షణాలు, బైబిలు కాలాల్లోని కుష్ఠువ్యాధిని గూర్చిన వివరణతో కచ్చితంగా సరిసమానంగా లేవు. వ్యాధి లక్షణాలు సమయం గడిచే కొలదీ మారుతుంటాయనే వాస్తవంలో దాని వివరణ ఉండవచ్చని కొందరు అంటున్నారు. బైబిలులో సూచించబడిన కుష్ఠు వ్యాధి అనేక విధాలైన వ్యాధులను వివరిస్తుందనీ, అందులో ఎమ్. లెప్రే ద్వారా వచ్చే వ్యాధి ఇమిడి ఉండవచ్చూ ఉండకపోవచ్చనీ ఇతరులు విశ్వసిస్తున్నారు.
కుష్ఠు వ్యాధి అని తరచుగా అనువదించబడిన గ్రీకు మరియు హెబ్రీ పదాలు “అదే జబ్బును లేక వివిధ రకాల జబ్బులను సూచిస్తాయి . . . అయితే మనం నేడు కుష్ఠు వ్యాధి అని పిలుస్తున్నది ఆ అనారోగ్యాన్నేనా అనేది ప్రశ్నించవలసిన విషయం. అయితే ఆ వ్యాధి యొక్క నిర్దిష్ట వైద్య గుర్తింపు [యేసు మరియు ఆయన శిష్యులు కుష్ఠు వ్యాధిగ్రస్తులను] స్వస్థపర్చడాన్ని గురించిన వృత్తాంతాల ఎడల మనకుగల గౌరవాన్ని ఎంతమాత్రం ప్రభావితం చేయవని” థియలాజికల్ డిక్షనరీ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ చెబుతుంది.
[24వ పేజీలోని చిత్రం]
కుష్ఠు వ్యాధిగ్రస్థుల క్యాంపులోని రాజ్యమందిరం వెలుపల సంఘం
[26వ పేజీలోని చిత్రం]
ఐజేయ అడగ్బోన, ఆయన భార్య నీమోట