మనుష్యులకు దాసులా లేక దేవుని సేవకులా?
“యెహోవాసాక్షుల్ని కొంతమేరకు మెచ్చుకోవచ్చు.” అలాగని జేయర్, గ్రూబ్లర్, ఎంటూజీయాస్టన్ (దార్శనికులు, ఆలోచనాపరులు, ఔత్సాహికులు) అనే ఒక జర్మన్ పుస్తకం అంటుంది. సాక్షుల గురించి కాస్త విమర్శనాత్మకంగా ఉన్నప్పటికీ, అది ఇలా ఒప్పుకుంటుంది: “మొత్తానికి, వాళ్లు నిరాక్షేపణీయమైన మధ్యతరగతి జీవితాలను గడుపుతుంటారు. వాళ్లు శ్రద్ధగా, మనస్సాక్షిపూర్వకంగా ఉద్యోగాలు చేసుకుంటారు, నెమ్మదిగల పౌరులు, నిజాయితీగా పన్నులు చెల్లిస్తారు. వాళ్లు పిచ్చిగా ధనసంపాదనలో పడరు. . . . సమావేశాల్లో వారి క్రమశిక్షణ ప్రశంసనీయం. వారి స్వయం-త్యాగస్ఫూర్తి వేరే ఏ మతగుంపుకీ తీసిపోదు; పరిచర్య విషయంలోనైతే వారిని మించినవారు లేరు. అయితే మన కాలంలోని ఏ క్రైస్తవ చర్చికన్నా ఏ గుంపుకన్నా వారిని ఉన్నతులనుగా చేసేదేమిటంటే, వారిలో అధిక సంఖ్యాకులు తమ సిద్ధాంతాలను గురించి తాము ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి అపాయంలో ఉన్నా కృత నిశ్చయతతో ప్రకటించడమే.”a
అంత అనుకూలమైన గుణగ్రహణ ఉన్నప్పటికీ, యెహోవాసాక్షులను చాలా విభిన్నమైన దృక్కోణంలో చూపించడానికి ప్రయత్నిస్తూ కొన్ని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాల్లో, సాక్షులు దశాబ్దాలుగా తమ మత సేవలను బహిరంగంగా నిర్నిరోధంగా నిర్వర్తిస్తూనే వచ్చారు. కోట్లాది ప్రజలకు వారి గురించి తెలుసు, వారిని గౌరవిస్తారు, అంతేగాక తమ మతాన్ని అవలంబించే హక్కు వారికి ఉందని ఒప్పుకుంటారు. మరైతే, యెహోవాసాక్షులు ఎవరన్న దానిగురించి అనిశ్చయత అసలు ఎందుకు ఉంది?
బహుశ అనిశ్చయతకు ఒక కారణం, ఇటీవలి కాలాల్లో అనేక ఇతర మత గుంపులు పిల్లలపై అత్యాచారాలూ, సామూహిక ఆత్మహత్యలూ, ఉగ్రవాద దాడులూ వంటివాటిలో పాల్గొనడం అయ్యుండవచ్చు. అయితే ఇటువంటి వక్ర ప్రవర్తనలు సర్వవ్యాప్తంగా ఉన్నాయి, కేవలం మతనిష్ఠగల వారిలోనే కాదు. అయితే, మతం విషయంలో మాత్రం చాలామంది సంశయవాదులుగా తయారౌతున్నారు, కొందరు ప్రతికూలంగా కూడా అవుతున్నారు.
మనుష్యులను అనుసరించడంలోని ప్రమాదాలు
“మతతెగ” అన్నది, “ఏదైనా విభిన్న తరహా సిద్ధాంతానికీ, లేక ఒక నాయకునికీ అంటిపెట్టుకుని ఉండే గుంపు” అని నిర్వచించబడింది. అదేవిధంగా, ఏదైనా “కల్ట్”కు చెందినవారు “ఒక వ్యక్తిపట్ల, ఒక ఆలోచనా దృక్పథంపట్ల, లేక ఒక వస్తువుపట్ల ప్రగాఢ భక్తిని” కలిగివుంటారు. నిజానికి మానవ నాయకులకూ, వారి ఆలోచనా దృక్పథాలకూ బలంగా అంటిపెట్టుకుని ఉండే ఏ మతగుంపు సభ్యులైనా మనుష్యులకు దాసులయ్యే ప్రమాదం ఉంది. నాయకునివైపు మొగ్గుచూపేంతగా, నాయకునితో ఉండే బలమైన సంబంధం అనారోగ్యకరమైన భావోద్వేగ, ఆధ్యాత్మిక పరాధీనతకు నడిపించగలదు. చిన్నప్పటినుండే అటువంటి తెగపరమైన వాతావరణంలో పెరిగిన వ్యక్తి విషయంలో ఈ ప్రమాదం మరింత జటిలం అవుతుండవచ్చు.
మతం విషయంలో అటువంటి చింతలు ఉన్నవారికి నమ్మదగ్గ సమాచారం కావాలి. యెహోవాసాక్షులు, తన సభ్యులను దాసులనుగా చేసి, వారిని అధికారపూర్వకంగా అదుపుచేస్తూ, వారి స్వాతంత్ర్యాన్ని అనుచితంగా పరిమితంచేసి, వారిని పూర్తి సమాజంతోనే పొసగనివారినిగా తయారుచేసే ఒక మత సంస్థకు చెందుతారు అని కొందరికి చెప్పబడివుండవచ్చు.
ఇటువంటి చింతలు నిరాధారమైనవని యెహోవాసాక్షులకు తెలుసు. అందుకని, మీకైమీరే పరిశీలించుకోమని వారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. జాగ్రత్తగా పరిశీలించిన పిమ్మట మీరు మీ స్వంత నిర్ధారణలకు రండి. సాక్షులు వారు చెప్పుకుంటున్నట్లే దేవుని సేవకులా, లేక మనుష్యుల దాసులా? వారి బలానికి మూలం ఏమిటి? 12-23 పేజీల్లోవున్న రెండు శీర్షికలు అటువంటి ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబులను ఇస్తాయి.
[అధస్సూచి]
a 1950లోని అసలు ఎడిషన్లో పైమాటలు లేవు. 1982లోని రివైజ్డ్ ఎడిషన్లో ఈ మాటలను ముద్రించడం, ప్రజలు యెహోవాసాక్షులను మరింత బాగా అర్థం చేసుకోవడంవైపు మొగ్గుచూపుతుండడాన్ని వెల్లడిస్తుంది.