యేసు భూమ్మీద గడిపిన చివరి రోజుల సజీవ చిత్రీకరణ
అది సా.శ. 33వ సంవత్సరం, యూదుల నీసాను నెలలోని ఏడవ రోజు. మీరు రోమా ప్రాంతమైన యూదయలో సంఘటనలను గమనిస్తున్నట్లు ఊహించుకోండి. యేసుక్రీస్తు, ఆయన శిష్యులు యెరికోనూ, దాని పచ్చిక బయళ్లనూ దాటి, దుమ్ముతో నిండిన మెలికలు తిరిగివున్న దారిలో ప్రయాసతో నడుస్తున్నారు. ఆ సంవత్సరపు పస్కా ఆచరణ కొరకు యెరూషలేముకు వెళ్లేందుకు చాలామంది ఇతర ప్రయాణికులు కూడా అదే మార్గంలో ప్రయాణిస్తున్నారు. అయితే, క్రీస్తు శిష్యుల మనస్సుల్లో, అలసట కలిగించే, ఏటవాలుగావున్న మార్గంలో ప్రయాణించడంకన్నా మరొకటుంది.
రోమా కాడి నుండి తమను తప్పించగల మెస్సీయ కోసం యూదులు పరితపిస్తున్నారు. ఎంతోకాలంగా ఎదురు చూసిన ఆ రక్షకుడు నజరేతువాడైన యేసేనని అనేకులు విశ్వసిస్తున్నారు. మూడున్నర సంవత్సరాలుగా ఆయన దేవుని రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రోగులను స్వస్థపర్చి, ఆకలిగొన్న వారికి ఆహారం అనుగ్రహించాడు. అవును, ఆయన ప్రజలకు ఓదార్పును తెచ్చాడు. కాని మతనాయకులు మాత్రం యేసు తమ గురించి చేస్తున్న తీవ్రమైన అధిక్షేపణలకు చిరాకుపడుతూ, ఆయనను చంపించాలని నిశ్చయించుకున్నారు. అయినప్పటికీ, ఆయన ఆ కణకణలాడుతున్న రోడ్డు మీద తన శిష్యులకు ముందుగా కృత నిశ్చయంతో నడుస్తున్నాడు.—మార్కు 10:32.
దూరాన సూరీడు ఒలీవల కొండ వెనుకగా దిగుతుండగా, యేసూ ఆయన సహచరులూ బేతనియ గ్రామాన్ని చేరుకుంటారు, తర్వాతి ఆరు రాత్రులను వాళ్లు అక్కడే గడపాల్సివుంది. అక్కడ వాళ్లను ఆహ్వానించడానికి వాళ్ల ప్రియ స్నేహితులైన లాజరు, మరియ, మార్త ఉన్నారు. ఆ సాయంకాలపు చల్లదనం వారికి ప్రయాణ బడలిక నుండి సేదదీర్పునిస్తుంది, ఆ సాయంకాలమే నీసాను 8 నాటి సబ్బాతు ప్రారంభమౌతుంది.—యోహాను 12:1, 2.
నీసాను 9
సబ్బాతు తర్వాత యెరూషలేములో కార్యకలాపాల సందడి ప్రారంభమైంది. పస్కా కొరకు వేలాదిమంది సందర్శకులు ఇప్పటికే నగరంలోకి వచ్చి చేరారు. కాని మనం వినే కోలాహలం సాధారణంగా సంవత్సరంలోని ఈ కాలంలో వినిపించేదానికంటే ఎక్కువగానే ఉంది. ఉత్సుకతగల జనాలు ఇరుకైన వీధులగుండా నగరద్వారాల దగ్గరికి ఆత్రంగా వెళ్తున్నారు. క్రిక్కిరిసి ఉన్న ద్వారాలగుండా వాళ్లు తోసుకుని వెళ్లేసరికి, వాళ్లకు ఎంత చక్కటి దృశ్యం కనిపిస్తుందో కదా! బేత్పగే నుండి వస్తున్న రోడ్డు మీదుగా ఆనందభరితులైన అనేకమంది ప్రజలు ఒలీవల కొండ దిగివస్తున్నారు. (లూకా 19:37) దీనంతటి భావమేమిటి?
చూడండి! నజరేయుడైన యేసు గాడిదపిల్లనెక్కి వస్తున్నాడు. ప్రజలు ఆయనకు ముందుగా రోడ్డు మీద బట్టలు పరుస్తున్నారు. ఇతరులు అప్పుడే కోసిన ఖర్జూరపు మట్టలు ఊపుతూ, ఆనందంగా ఇలా కేకలు వేస్తున్నారు: “జయము, ప్రభువు [“యెహోవా,” NW] పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక!”—యోహాను 12:12-15.
జనసమూహం యెరూషలేమును సమీపిస్తుండగా, యేసు నగరం వైపు చూసి, తీవ్రంగా కదిలిపోయాడు. ఆయన దుఃఖించనారంభించి, ఈ నగరం నాశనం చేయబడుతుందని ఆయన ప్రవచించడాన్ని మనం వింటాము. కొంతసేపటి తర్వాత యేసు ఆలయం దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన జనసమూహానికి బోధించి, తన దగ్గరికి వస్తున్న గ్రుడ్డివారిని, కుంటివారిని స్వస్థపర్చాడు.—మత్తయి 21:14; లూకా 19:41-44, 47.
ప్రధాన యాజకులూ శాస్త్రులూ దీన్ని గమనించక పోలేదు. యేసు చేసిన అద్భుత కార్యాలను, జనసమూహాల ఆనందోత్సాహాన్ని చూసి వాళ్లకెంత కోపమొచ్చిందో కదా! పరిసయ్యులు తమ ఆగ్రహాన్ని అణచుకోలేక, “బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని” అడుగుతారు. “వీరు ఊరకుండినయెడల ఈ రాళ్లు కేకలు వేయునని” యేసు సమాధానమిచ్చాడు. అక్కడనుండి వెళ్లేముందు యేసు, దేవాలయంలో సాగుతున్న వ్యాపార కార్యకలాపాలను గమనిస్తాడు.—లూకా 19:39, 40; మత్తయి 21:15, 16; మార్కు 11:11.
నీసాను 10
యేసు ఆ రోజు ఉదయాన్నే ఆలయానికి వస్తాడు. నిన్న, తన తండ్రియైన యెహోవా దేవుని ఆరాధనను బాహాటంగా సొమ్ము చేసుకోవడాన్ని చూసి ఆయన ఉగ్రుడయ్యాడు. కాబట్టి, ఆలయంలో క్రయవిక్రయాలు చేస్తున్నవారందరిని ఆయన అత్యంతావేశంతో బయటికి వెళ్లగొట్టడం మొదలుపెడతాడు. తర్వాత ఆయన అత్యాశాపరులైన రూకలు మార్చేవారి బల్లలను, గువ్వలమ్మేవారి పీఠములను పడేస్తాడు. యేసు బిగ్గరగా ఇలా అన్నాడు: “నా మందిరము ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడియున్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చే[స్తున్నారు].”—మత్తయి 21:12, 13.
ప్రధాన యాజకులూ, శాస్త్రులూ, ప్రధానులూ యేసు చర్యలను, బహిరంగ బోధను సహించలేకపోతారు. ఆయనను చంపాలని వాళ్లెంత ఆత్రంగా ఉన్నారో కదా! కాని వారికి జనసమూహం ఆటంకమైంది, ఎందుకంటే ప్రజలు యేసు బోధను బట్టి ఆశ్చర్యపోతూ, వాళ్లు “ఆయన వాక్యమును వినుటకు, ఆయనను హత్తుకొని యుండిరి.” (లూకా 19:47, 48) సాయంకాలమౌతుండగా, రాత్రిపూట విశ్రాంతి తీసుకోవడానికి యేసూ ఆయన సహచరులూ తిరిగి బేతనియకు ఆహ్లాదకరంగా నడుచుకుంటూ వెళ్ళారు.
నీసాను 11
అది తెల్లవారుజాము, ఒలీవల కొండ మీదుగా యెరూషలేమును చేరడానికి యేసూ ఆయన శిష్యులూ అప్పటికే ప్రయాణం మొదలు పెట్టారు. వాళ్లు ఆలయం దగ్గరికి చేరుతుండగా, ప్రధాన యాజకులూ ఇతర పెద్దలూ యేసును ఎదుర్కోవడానికి ఆత్రంగా ఉన్నారు. ఆలయంలోని రూకలు మార్చేవారి మీదా, వర్తకుల మీదా ఆయన తీసుకున్న చర్య వాళ్ల మనస్సుల్లో ఇంకా మెదులుతూనే ఉంది. ఆయన శత్రువులు ద్వేషపూరితంగా ఇలా అడుగుతారు: “ఏ అధికారమువలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారమెవడు నీకిచ్చె[ను]?” యేసు ఇలా ఎదురు ప్రశ్న వేశాడు: “నేనును మిమ్ము నొక మాట అడుగుదును; అది మీరు నాతో చెప్పినయెడల, నేనును ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడనుండి కలిగినది? పరలోకమునుండి కలిగినదా, మనుష్యులనుండి కలిగినదా?” వ్యతిరేకులంతా దగ్గర చేరి ఇలా తర్కించుకుంటారు: “మనము పరలోకము నుండి అని చెప్పితిమా, ఆయన—ఆలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనల నడుగును; మనుష్యులవలననని చెప్పితిమా, జనులకు భయపడుచున్నాము; అందరు యోహానును ప్రవక్త అని యెంచుచున్నా[రు].” కారణం చెప్పలేక, వాళ్లు, “మాకు తెలియదని” పేలవంగా సమాధానమిస్తారు. యేసు ప్రశాంతంగా ఇలా జవాబు చెప్పాడు: “ఏ అధికారమువలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అదియు మీతో చెప్పను.”—మత్తయి 21:23-27.
యేసు చెప్పినదాన్నిబట్టి ఆయనను బంధించగలిగేలా ఆయనను మాటలలో చిక్కుపరచి, పట్టుకోవాలని ఆయన శత్రువులు ఇప్పుడు ప్రయత్నిస్తారు. వాళ్లిలా అడిగారు, “కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? కాదా?” యేసు ఇలా తిప్పి కొట్టాడు: “పన్నురూక యొకటి నాకు చూపు[డి].” తర్వాత ఆయనిలా ప్రశ్నించాడు: “ఈ రూపమును పైవ్రాతయు ఎవరి[వి]?” అందుకు వాళ్లు “కైసరువని” జవాబిచ్చారు. వాళ్లను కలవరపరుస్తూ, యేసు అందరూ వినగలిగేలా స్పష్టంగా ఇలా చెప్పాడు: “ఆలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించు[డి].”—మత్తయి 22:15-22.
తిరుగులేని తర్కంతో తన శత్రువుల నోళ్లు మూయించి, యేసు ఇప్పుడు జనసమూహం ఎదుటా, తన శిష్యుల ఎదుటా ఎదురు దాడికి ఉద్యుక్తుడయ్యాడు. శాస్త్రులను పరిసయ్యులను ఆయన నిర్భయంగా అధిక్షేపించడాన్ని ఇప్పుడు వినండి. ఆయనిలా అంటాడు, “వారి క్రియలచొప్పున చేయకుడి; వారు చెప్పుదురే గాని చేయరు.” ఆయన అంధులైన మార్గదర్శకులనీ వేషధారులనీ ధైర్యంగా వారిపై ముద్రవేస్తూ, వారి మీదికి రాబోయే శ్రమల పరంపరను ప్రకటిస్తాడు. యేసు ఇలా అడుగుతాడు, “సర్పములారా, సర్పసంతానమా, నరకశిక్షను [“గెహెన్నాను,” NW] మీరేలాగు తప్పించుకొందురు?”—మత్తయి 23:1-33.
ఈ తీవ్రమైన అధిక్షేపణల భావం, యేసుకు ఇతరులలోని మంచి గుణాల గురించి తెలియదని కాదు. తర్వాత, ప్రజలు ఆలయంలోని కానుక పెట్టెల్లో డబ్బులు వేయడాన్ని ఆయన చూశాడు. అవసరతలో ఉన్న ఒక విధవరాలు తన జీవనమంతటినీ అంటే, ఎంతో తక్కువ విలువగల రెండు చిన్న నాణేలను వేయడాన్ని చూడడం ఎంత కదిలించేదిగా ఉందో కదా! “తమకు కలిగిన సమృద్ధిలోనుండి” పుష్కలంగా కానుకలు వేసినవారి కంటే ఆమె ఎంతో ఎక్కువ వేసిందని యేసు వాత్సల్యపూరితమైన మెప్పుదలతో అంటాడు. ఒక వ్యక్తి ఎంత చేయగలిగినప్పటికీ యేసు కృపాబాహుళ్యంతో ఎంతో మెచ్చుకుంటాడు.—లూకా 21:1-4.
యేసు ఇప్పుడు చివరిసారిగా ఆలయాన్ని విడిచి వెళ్తున్నాడు. “అందమైన రాళ్లతోను అర్పితములతోను శృంగారింపబడియున్నదని” ఆయన శిష్యుల్లో కొందరు దాని వైభవాన్ని గురించి వ్యాఖ్యానిస్తారు. వాళ్లు ఆశ్చర్యపోయేలా, “రాతిమీద రాయి యుండకుండ అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవని” యేసు సమాధానమిచ్చాడు. (లూకా 21:5, 6) రద్దీగావున్న నగరంలో నుండి యేసు బయటికి వస్తుండగా ఆయన అపొస్తలులు ఆయనను అనుసరిస్తూ, ఆయన చెప్పిన దాని భావమేమై ఉంటుందా అని ఆలోచిస్తుంటారు.
కొంతసేపటి తర్వాత యేసు, ఆయన అపొస్తలులు ఒలీవల కొండ మీద కూర్చుని, అక్కడి ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. వాళ్లు యెరూషలేమునూ దాని ఆలయం యొక్క వైభవోపేతమైన దృశ్యాన్నీ వీక్షిస్తుండగా, పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ యేసు చెప్పిన ఆశ్చర్యకరమైన ప్రవచనాన్ని వివరించమని కోరతారు. వాళ్లిలా అడుగుతారు, “ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పు.”—మత్తయి 24:3; మార్కు 13:3, 4.
దానికి సమాధానంగా నైపుణ్యంగల బోధకుడు నిజంగా విశేషమైన ప్రవచనాన్ని చెప్తాడు. ఆయన తీవ్రమైన యుద్ధాలు, భూకంపాలు, ఆహార కొరతలు, తెగుళ్లను గూర్చి ప్రవచిస్తాడు. భూవ్యాప్తంగా రాజ్య సువార్త ప్రకటించబడుతుందని కూడా యేసు ప్రవచిస్తాడు. “అటుతరువాత,” ఆయనిలా హెచ్చరించాడు: “లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు.”—మత్తయి 24:7, 14, 21; లూకా 21:10, 11.
‘తన రాకడను గూర్చిన సూచనలోని’ ఇతర అంశాల గురించి యేసు చర్చిస్తుండగా నలుగురు అపొస్తలులూ శ్రద్ధగా వింటారు. “మెలకువగా నుండ[డం]” యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెబుతాడు. ఎందుకు? “ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక” అని ఆయన చెప్తాడు.—మత్తయి 24:42; మార్కు 13:33, 35, 37.
యేసుకూ ఆయన అపొస్తలులకూ ఇది మరపురాని దినం. వాస్తవానికి, ఇది, యేసు బంధించబడి, విచారించబడి, మరణ దండన విధించబడడానికి ముందు బహిరంగ పరిచర్యలో గడిపిన చివరి దినం. ఆలస్యమైపోతుంది గనుక, దగ్గర్లోనే ఉన్న బేతనియకు కొండమీదుగా వెళ్లడానికి వాళ్లు నడవడం మొదలు పెడతారు.
నీసాను 12, 13
యేసు నీసాను 12న తన శిష్యులతో ప్రశాంతంగా గడుపుతాడు. మతనాయకులు తనను నిశ్చయంగా చంపాలనుకుంటున్నారని ఆయన గ్రహిస్తాడు, తరువాతి సాయంకాలం తన పస్కా ఆచరణను వాళ్లు ఆటంకపర్చడం ఆయనకిష్టం లేదు. (మార్కు 14:1, 2) తర్వాతి రోజు, నీసాను 13న ప్రజలు పస్కా కొరకు తుది ఏర్పాట్లు చేసుకోవడంలో నిమగ్నమై ఉన్నారు. మధ్యాహ్నం వేళ, యెరూషలేములోని ఒక మేడగదిలో వారి కోసం పస్కాను సిద్ధం చేయమని యేసు పేతురును, యోహానును పంపించాడు. (మార్కు 14:12-16; లూకా 22:8) సూర్యాస్తమయానికి కొంచెం ముందు యేసు, ఇతర పదిమంది అపొస్తలులూ తమ చివరి పస్కా ఆచరణ కొరకు వారిని అక్కడ కలుస్తారు.
నీసాను 14, సూర్యాస్తమయం తర్వాత
పూర్ణ చంద్రుడు ఒలీవల కొండ మీదుగా పైకి వస్తుండగా, యెరూషలేముమీద పల్చని వెన్నెలకాంతి పరుచుకుంటోంది. అన్నీ అమర్చివున్న ఒక పెద్ద గదిలో, సిద్ధం చేయబడివున్న బల్లదగ్గర యేసూ పన్నెండుమందీ చేరగిలబడి ఉన్నారు. “నేను శ్రమపడకమునుపు మీతో కూడ ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని” అని ఆయన అంటాడు. (లూకా 22:14, 15) కొంతసేపటి తర్వాత యేసు లేచి తన పైవస్త్రాన్ని ఒక ప్రక్కన పెట్టడం చూసి అపొస్తలులు ఆశ్చర్యపోతారు. ఒక తువాలు, ఒక గిన్నెలో నీళ్లూ తీసుకుని, ఆయన వాళ్ల కాళ్లు కడగడం మొదలు పెడతాడు. దీనమైన సేవ చేయడంలో ఎంతటి మరపురాని పాఠం!—యోహాను 13:2-15.
అయితే, ఈ పురుషులలో ఒకరు—యూదా ఇస్కరియోతు—తనను మత నాయకులకు అప్పగించడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేశాడని యేసుకు తెలుసు. అర్థంచేసుకొనదగినట్లుగానే, ఆయన చింతా క్రాంతుడౌతాడు. “మీలో ఒకడు నన్ను అప్పగించునని” ఆయన వెల్లడి చేస్తాడు. అది విని అపొస్తలులు ఎంతో దుఃఖితులౌతారు. (మత్తయి 26:21, 22) పస్కాను ఆచరించిన తర్వాత, “నీవు చేయుచున్నది త్వరగా చేయుమని” యేసు యూదాకు చెప్తాడు.—యోహాను 13:27.
యూదా వెళ్లిపోయిన తర్వాత, యేసు రానున్న తన మరణ జ్ఞాపకార్థకంగా ఒక భోజనాన్ని ప్రవేశపెడతాడు. ఆయన ఒక పులియని రొట్టె తీసుకుని, ప్రార్థనలో కృతజ్ఞతలు తెలియజేసి, దాన్ని విరిచి, దానిలో పాలుపంచుకోమని 11 మందికి ఉపదేశిస్తాడు. “ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని” ఆయన చెబుతాడు. ఆ తర్వాత ఆయన ఎర్రని ద్రాక్షారసమున్న పాత్ర తీసుకుంటాడు. ప్రార్థన చేసిన తర్వాత, ఆయన ఆ పాత్రను వారికి అందించి, దానిలో నుండి త్రాగమని చెబుతాడు. యేసు ఇంకా ఇలా అన్నాడు: “ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము.”—లూకా 22:19, 20; మత్తయి 26:26-28.
ఆ విశేషమైన సాయంకాలాన, యేసు తన నమ్మకమైన అపొస్తలులకు ఎన్నో విలువైన పాఠాలు బోధించాడు, వాటిలో సహోదర ప్రేమకున్న ప్రాముఖ్యతను తెల్పేది ఒక పాఠం. (యోహాను 13:34, 35) వాళ్లు “ఆదరణకర్త”ను అంటే పరిశుద్ధాత్మను పొందుతారని ఆయన వారికి అభయమిస్తాడు. ఆయన వారికి చెప్పిన విషయాలన్నీ అది వాళ్లకు జ్ఞాపకం చేస్తుంది. (యోహాను 14:26) ఆ తర్వాత, సాయంకాలాన యేసు వారి కోసం తీవ్రంగా ప్రార్థించడాన్ని వినడం వారికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉండవచ్చు. (యోహాను 17వ అధ్యాయం) స్తుతి గీతాలను పాడిన తర్వాత, వాళ్లు మేడగదిని విడిచి, యేసుతోపాటూ రాత్రి మూడవ జామున చల్లగాలిలో బయటికి బయలుదేరారు.
యేసూ, ఆయన అపొస్తలులూ కిద్రోను వాగును దాటి, తమకు ఇష్టమైన స్థలాల్లో ఒకటైన గెత్సేమనే తోటవైపుకు వెళ్లడం ప్రారంభించారు. (యోహాను 18:1, 2) ఆయన అపొస్తలులు వేచివుండగా, యేసు ప్రార్థించడానికి ఇంకొంత దూరం వెళ్తాడు. సహాయం కోసం ఆయన దేవునికి హృదయపూర్వకంగా విన్నపాలు చేస్తుండగా, ఆయన భావోద్వేగ ఒత్తిడి వర్ణనాతీతంగా ఉంది. (లూకా 22:44) తాను విఫలమౌతే, తన ప్రియ పరలోక తండ్రి మీదకి నింద వస్తుందన్న తలంపే ఆయనకు చెప్పలేనంత మానసిక వ్యధను కలిగిస్తుంది.
యేసు ప్రార్థించడం ముగించాడో లేదో, యూదా ఇస్కరియోతు కత్తులు, గుదియలు, కాగడాలు పట్టుకునివున్న ఒక గుంపుతోపాటు వచ్చాడు. యూదా యేసును ముద్దుపెట్టుకుంటూ, “బోధకుడా, నీకు శుభమని” అంటాడు. యేసును బంధించడానికి ఇది వారికి ఒక ఆనవాలు. హఠాత్తుగా, పేతురు తన కత్తి దూసి ప్రధాన యాజకుని సేవకుని చెవి నరికివేస్తాడు. యేసు ఆ వ్యక్తి చెవిని బాగు చేస్తూ, “నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు” అని చెబుతాడు.—మత్తయి 26:47-52.
ఆ తర్వాతి సంఘటనలు ఎంత త్వరగా జరిగిపోతాయో! యేసును బంధించి తీసుకు వెళ్తారు. భయాందోళనలతో, అపొస్తలులు తమ యజమానిని విడిచిపెట్టి పారిపోతారు. మునుపటి ప్రధాన యాజకుడైన అననీయ వద్దకు యేసును తీసుకు వెళ్తారు. ఆ తర్వాత, ఆయనను విచారణ కొరకు, ప్రస్తుత ప్రధాన యాజకుడైన కయపవద్దకు తీసుకువెళ్తారు. ఉదయం తొలి జామున, యేసు దేవదూషణ చేశాడని యూదుల న్యాయసభ ఆయన మీద అబద్ధ నిందారోపణ చేస్తుంది. తర్వాత, కయప ఆయనను రోమా గవర్నరైన పొంతి పిలాతు దగ్గరికి పంపిస్తాడు. ఆయన యేసును గలిలయ పరిపాలకుడైన హేరోదు అంతిప వద్దకు పంపిస్తాడు, హేరోదూ ఆయన కాపలాదారులూ యేసును గేలి చేస్తారు. తర్వాత ఆయన మళ్లీ పిలాతు వద్దకు పంపబడతాడు. యేసు నిర్దోషిత్వాన్ని పిలాతు ధృవీకరిస్తాడు. కానీ యేసుకు మరణ శిక్ష విధించమని యూదా మత నాయకులు ఆయనపై ఒత్తిడి చేస్తారు. అవమానించి, శారీరకంగా హింసించిన తర్వాత, యేసును గొల్గొతాకు తీసుకు వెళ్లి, అక్కడ ఆయన్ను నిర్దయగా మేకులతో హింసా కొయ్యకు కొడతారు. ఆయన వేదనభరితమైన మరణం పొందాడు.—మార్కు 14:50–15:39; లూకా 23:4-25.
యేసు మరణం ఆయన జీవితానికి శాశ్వత ముగింపును తెచ్చి ఉంటే అది, చరిత్రలో అతి దుఃఖకరమైన విషయమై ఉండేది. సంతోషకరంగా, అలా జరుగలేదు. సా.శ. 33 నీసాను 16న ఆయన మృతులలో నుండి లేపబడ్డాడని తెలుసుకుని ఆయన శిష్యులు విభ్రాంతి చెందారు. కొన్ని రోజులయ్యాక, యేసు మళ్లీ సజీవంగా ఉన్నాడని 500 కంటే ఎక్కువమంది తెలుసుకోగలిగారు. ఆయన పునరుత్థానం చేయబడిన 40 రోజుల తర్వాత, ఆయన పరలోకానికి ఆరోహణమవ్వడాన్ని ఆయన నమ్మకమైన అనుచరుల గుంపు చూసింది.—అపొస్తలుల కార్యములు 1:9-11; 1 కొరింథీయులు 15:3-8.
యేసు జీవితం మరియు మీరు
ఇది మిమ్మల్ని—వాస్తవానికి మనందర్నీ ఎలా ప్రభావితం చేస్తుంది? యేసు పరిచర్యా మరణ పునరుత్థానాలు యెహోవా దేవుడ్ని ఘనపరుస్తాయి, ఆయన ఘన సంకల్ప నెరవేర్పుకు అవి ఎంతో ప్రాముఖ్యమైనవి. (కొలొస్సయులు 1:18-20) యేసు బలి ఆధారంగా మన పాపాలు క్షమించబడి, తద్వారా యెహోవా దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కల్గివుండడం సాధ్యమౌతుంది, గనుక అవి మనకు ఎంతో ప్రాముఖ్యమైనవి.—యోహాను 14:6; 1 యోహాను 2:1, 2.
మృతులపై కూడా ప్రభావం పడుతుంది. యేసు పునరుత్థానం, దేవుని వాగ్దత్త పరదైసు భూమిపైకి వారిని తిరిగి జీవానికి తీసుకురావడానికి మార్గాన్ని తెరుస్తుంది. (లూకా 23:39-43; 1 కొరింథీయులు 15:20-22) అలాంటి విషయాల గురించి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే, మీకు సమీపంలో ఉన్న యెహోవాసాక్షుల రాజ్య మందిరం వద్ద, 1998 ఏప్రిల్ 11న క్రీస్తు మరణ జ్ఞాపకార్థానికి హాజరవ్వమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.
[6వ పేజీలోని బాక్సు]
“దొంగల గుహ”
అత్యాశాపరులైన వర్తకులు దేవుని ఆలయాన్ని “దొంగల గుహ”గా మార్చారని చెప్పడానికి యేసుకు తగినంత కారణం ఉంది. (మత్తయి 21:12, 13) ఆలయ పన్ను కట్టడానికి, ఇతర ప్రాంతాలకు చెందిన యూదులూ యూదామత ప్రవిష్టులూ తమ విదేశీ డబ్బుకు బదులు అంగీకృత ద్రవ్యం మార్పిడి చేసుకోవలసి ఉండేది. రూకలు మార్చేవారు తమ వ్యాపారాన్ని పస్కాకు ఒక నెల ముందు అంటే, అదారు 15న రోమా ప్రభుత్వ ప్రాంతంలో ప్రారంభించేవారని మెస్సీయయైన యేసు జీవితం మరియు కాలాలు (ఆంగ్లం) అనే తన పుస్తకంలో ఆల్ప్రెడ్ ఎడెర్షైమ్ వివరిస్తున్నాడు. అదారు 25 మొదలుకొని, వాళ్లు యెరూషలేములోని ఆలయ ప్రాంతంలోకి వచ్చి, అక్కడికి వచ్చి చేరే యూదుల నుండీ యూదా మతప్రవిష్టుల నుండీ విపరీతమైన లాభాలు ఆర్జించేవారు. మార్పిడి చేయబడిన ప్రతిసారీ రుసుము వసూలు చేస్తూ డీలర్లు పుష్కలంగా లాభాలను గడించేవారు. యేసు వారిని దొంగలనడం, వారు వసూలు చేసే రుసుము చాలా ఎక్కువగా ఉండేదనీ, అందుకే వారు పేదవారినుండి డబ్బు గుంజుతున్నట్లుగా ఉండేదని సూచిస్తుంది.
కొంతమంది బలి ఇవ్వడానికి తమ స్వంత జంతువులను తెచ్చుకోలేకపోయేవారు. అలా తెచ్చుకున్న వారెవరైనా ఆ జంతువును ఆలయం వద్ద తనిఖీ చేసే వ్యక్తితో తనిఖీ చేయించుకోవాలి, దానికి అతడు రుసుము తీసుకుంటాడు. అంతదూరం తీసుకువచ్చిన తర్వాత జంతువు నిరాకరించబడే ప్రమాదాన్ని తప్పించుకోవాలని చాలామంది, ఆలయం వద్దవుండే అవినీతిపరులైన వర్తకుల నుండి, లేవీయుల ప్రమాణానికి తగినదని “ఆమోదింపబడిన” దానిని కొనుక్కునేవారు. “సామాన్యుడు అక్కడ విపరీతంగా దోచుకోబడేవాడు” అని ఒక విద్వాంసుడు చెబుతున్నాడు.
ఒకప్పటి ప్రధాన యాజకుడైన అన్నకు, ఆయన కుటుంబానికి ఆలయ వర్తకులతో వ్యాపార సంబంధాలు ఉండేవనడానికి రుజువుంది. రబ్బీల వ్రాతలు “అన్న కుమారుల [ఆలయ] అంగళ్ల” గురించి మాట్లాడుతున్నాయి. రూకలు మార్చేవారి నుండీ, ఆలయ ప్రాంతంలోనే జంతువుల అమ్మకం నుండీ వచ్చే డబ్బు వారి ముఖ్య ఆదాయాల్లో ఒకటై ఉండేది. వర్తకులను తరిమి వేయడంలో యేసు తీసుకున్న చర్య “యాజకుల గౌరవంపైనే కాదు వారి జేబుల మీద కూడా దెబ్బ తీయడానికి ఉద్దేశించబడినదని” ఒక పండితుడు చెబుతున్నాడు. కారణం ఏదైనప్పటికీ, ఆయన శత్రువులు ఆయనను నిశ్చయంగా చంపాలని అనుకున్నారు!—లూకా 19:45-48.
[4వ పేజీలోని చిత్రం]
యేసు మానవ జీవితపు చివరి రోజులు
నీసాను సా.శ. 33: సంఘటనలు (మహాగొప్ప మనిషి*)
7 శుక్రవారం: యేసూ ఆయన శిష్యులూ యెరికో నుండి యెరూషలేముకు ప్రయాణిస్తారు (హెబ్రీ దినాలు సాయంకాలం నుండి తర్వాతి సాయంకాలానికి లెక్కించబడినప్పటికీ, నీసాను 7, 1998 ఏప్రిల్ 5 ఆదివారం వస్తుంది) (101, పేరా 1)
8 శుక్రవారం సాయంకాలం: యేసూ ఆయన శిష్యులూ బేతనియకు వస్తారు; సబ్బాతు ప్రారంభమౌతుంది (101, 2-4 పేరాలు)
శనివారం: సబ్బాతు (సోమవారం, ఏప్రిల్ 6, 1998) (101,పేరా 4)
9 శనివారం సాయంకాలం: కుష్టురోగియైన సీమోనుతో భోజనం; మరియ యేసును అచ్చ జటామాంసితో అభిషేకిస్తుంది; యేసును చూడడానికి ఆయన చెప్పేది వినడానికి అనేకమంది యెరూషలేము నుండి వస్తారు (101, 5-9 పేరాలు)
ఆదివారం: యెరూషలేములోకి విజయోత్సాహ ప్రవేశం; ఆలయంలో బోధిస్తాడు (102)
10 సోమవారం: తెల్లవారుజాము యెరూషలేములోకి ప్రయాణం; ఆలయాన్ని శుద్ధి చేస్తాడు; యెహోవా పరలోకం నుండి మాట్లాడతాడు (103, 104)
11 మంగళవారం: యెరూషలేములో, ఉపమానాలను ఉపయోగించి ఆలయంలో బోధిస్తాడు; పరిసయ్యులను ఖండిస్తాడు; విధవరాలి చందాను గమనిస్తాడు; తన భవిష్యద్ ప్రత్యక్షత గురించి సూచన ఇస్తాడు (105 నుండి 112, పేరా 1)
12 బుధవారం: బేతనియలో శిష్యులతో ప్రశాంతమైన దినం; యూదా అప్పగించడానికి ఏర్పాట్లు చేస్తాడు (112, 2-4 పేరాలు)
13 గురువారం: పేతురు యోహానులు యెరూషలేములో పస్కా కొరకు సిద్ధం చేస్తారు; యేసూ ఇతర పది మంది అపొస్తలులూ మధ్యాహ్న సూర్యాస్తమయానికి అక్కడికి చేరుకుంటారు (శనివారం, ఏప్రిల్ 11, 1998) (112,పేరా 5 నుండి 113, పేరా 1)
14 గురువారం సాయంకాలం: పస్కా ఆచరణ; యేసు అపొస్తలుల కాళ్లు కడుగుతాడు; యూదా యేసును అప్పగించడానికి బయటికి వెళతాడు; క్రీస్తు తన మరణ జ్ఞాపకార్థాన్ని ప్రారంభిస్తాడు (ఏప్రిల్ 11, 1998 శనివారం సూర్యాస్తమయం తర్వాత) (113,పేరా 2 నుండి 117)
మధ్య రాత్రి తర్వాత: గెత్సేమనే తోటలో అప్పగింత, బంధించడం; అపొస్తలులు పారిపోతారు; ప్రధాన యాజకులూ న్యాయసభ ఎదుట విచారణ; పేతురు యేసును ఎరుగనని అంటాడు (118 నుండి 120 వరకు)
శుక్రవారం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు: మళ్లీ న్యాయసభ ఎదుట; పిలాతు దగ్గరికి, తర్వాత హేరోదు దగ్గరికి, మళ్లీ పిలాతు దగ్గరికి; మరణ శిక్ష విధించబడడం; మ్రానుపై వ్రేలాడదీయబడడం; భూస్థాపన (121 నుండి 127, పేరా 7)
15 శనివారం: సబ్బాతు; యేసు సమాధి వద్ద కాపలాదారులను ఉంచడానికి పిలాతు అనుమతినిస్తాడు (127, 8-10 పేరాలు)
16 ఆదివారం: యేసు పునరుత్థానం చేయబడ్డాడు (128)
* జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకంలోని అధ్యాయాలను సూచించే సంఖ్యలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. యేసు తుది పరిచర్యకు సంబంధించిన లేఖనాధార వివరణలున్న చార్టు కొరకు, “ప్రతి లేఖనము దైవ ప్రేరేపితమైనది, ప్రయోజనకరమైనది” (ఆంగ్లం) అనే పుస్తకంలోని 290వ పేజీ చూడండి. ఈ పుస్తకాలను వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించింది.