కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 3/15 పేజీలు 3-9
  • యేసు మానవ జీవితపు చివరి దినం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసు మానవ జీవితపు చివరి దినం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నీసాను 14, గురువారం సాయంకాలం
  • ఒక ప్రత్యేకమైన ఆచరణ
  • గెత్సేమనే తోటలో
  • నీసాను 14, శుక్రవారం ఉదయం
  • వేదనాభరితమైన మరణం
  • జీవంతో తిరిగిలేచాడు
  • ఈ విషయాలు మీకెలా వర్తిస్తాయంటే
  • యేసు భూమ్మీద గడిపిన చివరి రోజుల సజీవ చిత్రీకరణ
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • యేసు చంపబడడం
    నా బైబిలు కథల పుస్తకము
  • “గడియ వచ్చియున్నది!”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • యేసుక్రీస్తు చంపబడ్డాడు
    బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 3/15 పేజీలు 3-9

యేసు మానవ జీవితపు చివరి దినం

అది సా.శ. 33 నీసాను 14, శుక్రవారం అపరాహ్ణవేళ. కొంతమంది స్త్రీపురుషులు తమ ప్రియ మిత్రుడ్ని సమాధి చేయబోతున్నారు. వారిలో ఒకడైన నీకొదేము, సమాధి చేయడానికి భౌతికకాయాన్ని సిద్ధపర్చేందుకు అవసరమైన సుగంధ ద్రవ్యాలు తెచ్చాడు. యోసేపు అనే పేరుగల వ్యక్తి గాయపర్చబడిన, నలుగగొట్టబడిన ఆ కాయాన్ని చుట్టిపెట్టడానికి పరిశుభ్రమైన నారబట్టను తీసుకువచ్చాడు.

ఈ ప్రజలెవరు, వాళ్లు ఎవరిని సమాధి చేస్తున్నారు? ఇదంతా మీపై ప్రభావాన్ని చూపగలదా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం, ఆ ప్రాముఖ్యమైన దిన ఆరంభానికి మనం వెళదాము.

నీసాను 14, గురువారం సాయంకాలం

ప్రకాశమానమైన పూర్ణ చంద్రుడు మెళ్లిగా యెరూషలేము పైకి వస్తున్నాడు. జనసమ్మర్థంగల ఆ నగరం దినమంతా కష్టపడి పనిచేసిన తర్వాత మెల్లిగా సద్దుమణుగుతోంది. కాలుస్తున్న గొర్రెపిల్ల వాసన ఆ సాయంకాలం ఆ పరిసరాల్లో నిండిపోయింది. అవును, వేలాదిమంది ప్రజలు ఒక ప్రత్యేకమైన సంఘటన కోసం, అంటే పస్కా వార్షిక ఆచరణ కోసం సిద్ధమౌతున్నారు.

ఒక పెద్ద విడిది గదిలో, యేసుక్రీస్తు ఆయన 12 మంది అపొస్తలులు సిద్ధం చేయబడిన ఒక బల్ల ఎదుట కూర్చుని ఉండడాన్ని మనం చూస్తాం. వినండి! యేసు మాట్లాడుతున్నాడు. యేసు, “నేను శ్రమపడకమునుపు మీతో కూడ ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని” అంటున్నాడు. (లూకా 22:15) తన మతసంబంధమైన శత్రువులు తనను చంపాలనే ఉద్దేశంతో ఉన్నారని యేసుకు తెలుసు. కాని అది జరుగక ముందు, ఈ సాయంకాలం అతి ప్రాముఖ్యమైనదొకటి జరుగబోతుంది.

పస్కాను ఆచరించడం ముగిసిన తర్వాత యేసు, “మీలో ఒకడు నన్ను అప్పగించునని” చెబుతాడు. (మత్తయి 26:21) ఇది అపొస్తలులను కలవరపరుస్తుంది. అది ఎవరై ఉండవచ్చు? కొంత చర్చ జరిగిన తర్వాత, యేసు ఇస్కరియోతు యూదాతో, “నీవు చేయుచున్నది త్వరగా చేయుమని” చెబుతాడు. (యోహాను 13:27) ఇతరులు గుర్తించకపోయినప్పటికీ, యూదాయే నమ్మకద్రోహి. యేసుకు వ్యతిరేకంగా పన్నిన పథకంలో, పిరికితనంతో కూడిన తన పాత్రను నిర్వర్తించడానికి అతడు వెళ్లిపోతాడు.

ఒక ప్రత్యేకమైన ఆచరణ

యేసు ఇప్పుడు పూర్తిగా క్రొత్తదైన ఒక ఆచరణను అంటే తన మరణానికి జ్ఞాపకార్థంగా ఉండే ఆచరణను ప్రారంభిస్తాడు. యేసు ఒక రొట్టెను తీసుకుని కృతజ్ఞతలు తెలియజేసి, దాన్ని విరిచి ముక్కలుచేసి, “తీసికొని తినుడి,” “ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము” అని చెప్తాడు. వాళ్లంతా కొంచెం రొట్టె తిన్న తర్వాత, ఆయన ఎర్రని ద్రాక్షామద్యముతో నిండివున్న ఒక గిన్నె పట్టుకొని దాన్ని ఆశీర్వదిస్తాడు. యేసు, “ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన” అని వివరిస్తూ, “దీనిలోనిది మీరందరు త్రాగుడి” అని వారికి చెబుతాడు. మిగిలిన నమ్మకమైన 11మంది అపొస్తలులకు, “నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని” ఉపదేశిస్తాడు.—మత్తయి 26:26-28; లూకా 22:19, 20; 1 కొరింథీయులు 11:24, 25.

ఆ సాయంకాలం ఆయన తన నమ్మకమైన అపొస్తలులను జరుగనైయున్న దాని కోసం దయాపూర్వకంగా సంసిద్ధం చేసి, వారిపట్ల తనకున్న ప్రగాఢమైన ప్రేమను వ్యక్తపరుస్తాడు. “తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగల వాడెవడును లేడు. నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు” అని ఆయన వివరిస్తాడు. (యోహాను 15:13-15) అవును, యేసు శ్రమలలో ఆయనను హత్తుకుని ఉండడం ద్వారా తాము నిజమైన స్నేహితులమని ఆ 11 మంది అపొస్తలులు నిరూపించుకున్నారు.

చాలా రాత్రయ్యాక బహుశ మధ్య రాత్రి సమయంలో యేసు ఒక మరపురాని ప్రార్థన చేస్తాడు, ఆ తర్వాత వాళ్లు యెహోవాకు స్తుతి గీతాలు పాడతారు. ఆ తర్వాత, చల్లని గాలి వీస్తుండగా వాళ్లు ఆ రాత్రి ఆ నగరాన్ని విడిచి కిద్రోను వాగును దాటి వెళతారు.—యోహాను 17:1–18:1.

గెత్సేమనే తోటలో

కొంతసేపటి తర్వాత, యేసు ఆయన అపొస్తలులు గెత్సేమనే తోటలోకి వస్తారు. యేసు తన ఎనిమిదిమంది అపొస్తలులను తోట ద్వారం దగ్గరే ఉండమని, పేతురు యాకోబు యోహానులను మాత్రం తనతోపాటు ఒలీవ చెట్ల మధ్యన కొంతదూరం తీసుకువెళ్తాడు. ఆయన, “నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగియున్నది; మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని” ఆ ముగ్గురితో చెప్తాడు.—మార్కు 14:33, 34.

యేసు ప్రార్థన చేయడానికి తోట మధ్యలోకి వెళ్లగా ఆ ముగ్గురు అపొస్తలులు అక్కడే ఉండిపోతారు. ఆయన మహారోధనముతోనూ, కన్నీళ్లతోనూ, “తండ్రీ, యూ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చిత్తమైతే తొలగించుము” అని వేడుకుంటాడు. యేసు భుజస్కంధాలపై గంభీరమైన బాధ్యత ఉంది. యెహోవా అద్వితీయ కుమారుడు నేరస్థునిలా కొరత వేయబడినప్పుడు యెహోవా శత్రువులు ఏమనుకుంటారనేదాని గురించి ఆలోచించడం ఆయనకు ఎంతో వేదనభరితంగా ఉండివుండవచ్చు! తాను ఈ వేదనభరితమైన పరీక్షలో విఫలమౌతే అది తన ప్రియమైన పరలోక తండ్రిపై ఎంతటి అపవాదును తీసుకువస్తుందోననే తలంపు యేసుకు మరింత బాధాకరమైనదిగా ఉంది. యేసు తన చెమట రక్తబిందువుల వలె నేలమీద పడేటంత వేదనభరితంగానూ, ఆతురతతోనూ ప్రార్థిస్తాడు.—లూకా 22:42, 44.

యేసు ఇప్పుడే మూడవసారి ప్రార్థించడం ముగించాడు. దివిటీలు దీపాలు పట్టుకున్న మనుషులు ఇప్పుడు వాళ్లను సమీపిస్తున్నారు. వాళ్లకు ముందుగా నడుస్తున్న వ్యక్తి మరెవరో కాదు ఇస్కరియోతు యూదానే, అతడు తిన్నగా యేసు దగ్గరికి వస్తాడు. అతడు యేసును ముద్దుపెట్టుకుంటూ ‘బోధకుడా, నీకు శుభం!’ అని చెబుతాడు. “యూదా, నీవు ముద్దుపెట్టుకొని మనుష్యకుమారుని అప్పగించుచున్నావా?” అని యేసు అంటాడు.—మత్తయి 26:49; లూకా 22:47, 48; యోహాను 18:3.

అకస్మాత్తుగా, జరుగుతున్నదేమిటో అపొస్తలులు గ్రహిస్తారు. వారి ప్రభువు, ప్రియ స్నేహితుడు నిర్బంధించబడబోతున్నాడు! కాబట్టి పేతురు ఒక కత్తి తీసుకుని ప్రధాన యాజకుని దాసుని చెవిని తెగనరుకుతాడు. యేసు వెంటనే, “ఈ మట్టుకు తాళుడని” చెప్పి, ముందుకు వచ్చి ఆ దాసుని స్వస్థపర్చి పేతురుకిలా ఆజ్ఞాపిస్తాడు: “నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు.” (లూకా 22:50, 51; మత్తయి 26:52) అధికారులు, సైనికులు యేసును పట్టుకుని ఆయనను బంధిస్తారు. భయం వల్ల గందరగోళం వల్ల అపొస్తలులు యేసును విడిచిపెట్టి చీకట్లోకి పారిపోతారు.—మత్తయి 26:56; యోహాను 18:12.

నీసాను 14, శుక్రవారం ఉదయం

మధ్యరాత్రి గడిచి శుక్రవారం ఉదయం తెల్లవారు జాము అయ్యింది. యేసును మొదట, మాజీ ప్రధాన యాజకుడైన అన్న ఇంటికి తీసుకువెళ్తారు, అప్పటికింకా అన్న ఎంతో పలుకుబడిని, అధికారాన్ని కల్గివున్నాడు. అన్న ఆయనను ప్రశ్నించి, యూదుల న్యాయసభ సమావేశమైయున్న ప్రధాన యాజకుడైన కయప ఇంటికి తీసుకువెళ్లమంటాడు.

మతనాయకులు ఇప్పుడు, యేసుకు విరుద్ధంగా కేసు రూపొందించడానికి సాక్షుల కోసం ప్రయత్నిస్తారు. అయితే, అబద్ధ సాక్ష్యం ఇచ్చేవారు కూడా తమ సాక్ష్యం విషయంలో ఏకాభిప్రాయానికి రారు. ఆ సమయమంతటిలోనూ యేసు మౌనంగా ఉండిపోతాడు. పన్నాగాలను మార్చి కయప, “నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నా”నంటాడు. ఇది కాదనలేని వాస్తవం కాబట్టి యేసు ధైర్యంగా, “అవును నేనే; మీరు మనుష్యకుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశమేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని” సమాధానమిస్తాడు.—మత్తయి 26:63; మార్కు 14:60-62.

“వీడు దేవదూషణ చేసెను; మనకిక సాక్షులతో పని ఏమి?” అని కయప బిగ్గరగా అంటాడు. ఇప్పుడు కొంతమంది యేసును గుద్ది ఆయన ముఖము మీద ఉమ్మివేస్తారు. ఇతరులు ఆయనను అరచేతులతో కొట్టి, ఆయనను నిందిస్తారు. (మత్తయి 26:65-68; మార్కు 14:63-65) శుక్రవారం పొద్దుపొడిచిన వెంటనే, యూదుల న్యాయసభ తిరిగి సమావేశమౌతుంది, బహుశ రాత్రి జరిగిన చట్టవిరుద్ధమైన విచారణకు చట్టబద్ధమైనదనే రంగును పులమడానికై ఉండవచ్చు. మళ్లీ యేసు ధైర్యంగా తాను క్రీస్తునని, దేవుని కుమారుడనని సూచిస్తాడు.—లూకా 22:66-71.

తర్వాత, ప్రధాన యాజకులు, పెద్దలు యూదాలోవున్న రోమా గవర్నరైన పొంతి పిలాతుచే విచారణ చేయించేందుకు యేసును లాక్కెళ్తారు. యేసు జనమును తిరుగబడ ప్రేరేపిస్తున్నాడనీ, కైసరుకు పన్ను కట్టనవసరం లేదని చెప్తున్నాడనీ, ‘తానే క్రీస్తను ఒక రాజునని చెప్తున్నాడనీ’ వాళ్లు నిందారోపణ చేస్తారు. (లూకా 23:2; పోల్చండి మార్కు 12:17.) యేసును ప్రశ్నించిన తర్వాత, పిలాతు “ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడలేద[ని]” అంటాడు. (లూకా 23:4) యేసు గలిలయ వాడని పిలాతు విన్నప్పుడు అతడు యేసును, పస్కా పండుగ ఆచరించడానికి యెరూషలేములోవున్న గలిలయ పరిపాలకుడైన హేరోదు అంతిప దగ్గరికి పంపిస్తాడు. న్యాయం జరిగేలా చూడాలన్న కోరిక హేరోదుకు లేదు. యేసు ఒక అద్భుతం చేస్తే చూడాలని మాత్రమే అతడు ఎదురుచూస్తున్నాడు. యేసు ఆయన ఉత్సుకతను తీర్చకుండా నిశ్శబ్దంగా ఉండిపోవడంతో, హేరోదూ అతని సైనికులూ యేసును గేలి చేసి పిలాతువద్దకు వెనక్కు పంపించివేస్తారు.

పిలాతు మళ్లీ, “ఇతడు ఏ దుష్కార్యము చేసెను?” అని ప్రశ్నిస్తాడు. “ఇతనియందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతునని” అంటాడు. (లూకా 23:22) కాబట్టి అతడు, తోలుపట్టీలున్న కొరడాతో యేసును కొట్టిస్తాడు, ఆ దెబ్బలకు యేసు వీపు మీది కండరాలు చిట్లిపోయి విపరీతమైన బాధకల్గుతుంది. తర్వాత ఆ సైనికులు ఆయన తల మీద ముళ్ల కిరీటాన్ని పెట్టి నొక్కుతారు. వాళ్లు ఆయనను రెల్లుతో కొట్టి, ముళ్ల కిరీటం ఆయన తలలోకి గుచ్చుకుపోయేలా నొక్కుతారు. వర్ణింపనశక్యమైన ఈ బాధంతటిలోనూ, ఇలా అవమానించబడిన సమయమంతటిలోనూ యేసు అసాధారణమైన హూందాతనాన్నీ, మనోనిబ్బరాన్నీ ప్రదర్శిస్తాడు.

దెబ్బలుతినివున్న యేసు స్థితి బహుశ కొంత కనికరాన్ని కలిగించవచ్చుననే ఆశతో పిలాతు ఆయనను మళ్లీ ప్రజల ఎదుటకు తీసుకువస్తాడు. పిలాతు, “ఇదిగో ఈయనయందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియునట్లు ఈయనను మీయొద్దకు వెలుపలికి తీసికొని వచ్చుచున్నానని” అంటాడు. కాని ప్రధాన యాజకులు, “కొరతవేయుము కొరతవేయుము” అని కేకలు వేస్తారు. (యోహాను 19:4-6, NW) ప్రజలు మరీ ఒత్తిడి చేస్తుండడంతో, పిలాతు ఇక ఆశలు వదిలేసి, యేసును కొరతవేయడానికి అప్పగిస్తాడు.

వేదనాభరితమైన మరణం

ఇక ఉదయంవేళ ముగిసి బహుశ మధ్యాహ్నం కాబోతుంది. యేసును యెరూషలేము వెలుపల గొల్గొతా అనే స్థలానికి తీసుకువెళ్లారు. ఆయన చేతులు కాళ్లను పెద్ద మేకులతో హింసాకొయ్యకు కొట్టేశారు. హింసాకొయ్యను పైకి లేపుతుండగా శరీర బరువు మూలంగా, మేకులు కొట్టిన స్థలంలో కలిగే నొప్పిని మాటల్లో వర్ణించలేము. యేసునూ మరిద్దరు నేరస్థులనూ కొరతవేస్తుండగా చూడడానికి ప్రజలు గుంపుగా చేరతారు. చాలామంది యేసు గురించి దూషణకరంగా మాట్లాడతారు. “వీడు ఇతరులను రక్షించెను, తన్నుతానే రక్షించుకొనలేడు” అని ప్రధాన యాజకులూ, ఇతరులూ అపహసిస్తారు. సైనికులు, ఆయనతోపాటు కొరతవేయబడ్డ ఆ ఇద్దరు నేరస్థులు కూడా యేసును నిందిస్తారు.—మత్తయి 27:41-44.

యేసు మ్రాను మీద కొద్దిసేపు ఉన్నతర్వాత, హఠాత్తుగా మధ్యాహ్నం వేళ, ఆ ప్రాంతమంతటిలో మూడు గంటలపాటు దైవిక మూలం నుండి వచ్చిన అంధకారం అలుముకుంటుంది.a ఒక నేరస్థుడు మరో నేరస్థుడిని మందలించడానికి కారణం బహుశ ఇదే అయ్యుండవచ్చు. తర్వాత, అతడు యేసు వైపు తిరిగి, “నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొను”మని వేడుకుంటాడు. మృత్యువు ఆసన్నమౌతున్న సమయంలో ఎంతటి అమోఘమైన విశ్వాసం! “నేడు, నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాన[ని]” యేసు ప్రత్యుత్తరమిస్తాడు.—లూకా 23:39-43.

దాదాపు మధ్యాహ్నం మూడు గంటల వేళ, యేసు తన అంతం సమీపించిందని గ్రహిస్తాడు. ఆయన, “నేను దప్పిగొను చున్నా[ను]” అంటాడు. తర్వాత ఆయన ఎలుగెత్తి, “నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్య విడిచితివని” కేక వేస్తాడు. ఒకవిధంగా చెప్పాలంటే, తన యథార్థత పూర్తిగా పరీక్షించబడేందుకు అనుమతిస్తూ, తన తండ్రి తన నుండి తన కాపుదలను తీసివేసాడన్న విషయాన్ని యేసు గ్రహించగల్గుతాడు, ఆయన దావీదు మాటలను ఎత్తి చెప్తాడు. ఎవరో పుల్లని ద్రాక్షామద్యంలో ముంచిన స్పంజీని యేసు నోటికి అందిస్తారు. కొంచెం ద్రాక్షామద్యాన్ని పుచ్చుకున్న తర్వాత, యేసు ఎగశ్వాస తీస్తూ, “సమాప్తమైనదని” అంటాడు. తర్వాత ఆయన, “తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాన[ని]” చెప్పి తలవాల్చి, ప్రాణము విడుస్తాడు.—యోహాను 19:28-30; మత్తయి 27:46; లూకా 23:46; కీర్తన 22:1.

అప్పటికే సాయంకాలం కావచ్చింది గనుక, సూర్యాస్తమయమప్పుడు విశ్రాంతి దినం (నీసాను 15) ప్రారంభం కాకముందే యేసును సమాధి చేయడానికి హడావుడిగా ఏర్పాట్లు జరుగుతాయి. యేసు రహస్య శిష్యుడూ యూదుల సమాజమందిరంలో ప్రముఖ సభ్యుడూ అయిన అరిమతయియ వాడైన యోసేపు ఆయనను సమాధి చేయడానికి అనుమతి పొందుతాడు. రహస్యంగా యేసునందు విశ్వాసముంచిన నీకొదేము ముప్పై మూడు రోమా కిలోల సుగంధ ద్రవ్యాలను తీసుకుని వస్తాడు, ఈయన కూడా యూదుల సమాజమందిరంలో సభ్యుడే. వాళ్లు యేసు శరీరాన్ని సమీపంలోవున్న క్రొత్త సమాధిలో జాగ్రత్తగా ఉంచుతారు.

జీవంతో తిరిగిలేచాడు

మగ్దలేనే మరియ, ఇంకా కొంతమంది ఇతర స్త్రీలు ఆదివారం ఉదయం యేసు సమాధి దగ్గరికి వచ్చేసరికి ఇంకా చీకటిగానే ఉంటుంది. కాని చూడండి! సమాధికి అడ్డంగా ఉన్న బండ తొలగించబడింది. సమాధి ఖాళీగా ఉంది! మగ్దలేనే మరియ పేతురు యోహానులకు చెప్పడానికి పరుగెత్తుకు వెళ్తుంది. (యోహాను 20:1, 2) ఆమె అటు వెళ్లిన వెంటనే ఒక దేవదూత మిగతా స్త్రీలకు కనిపించి, “మీరు భయపడకుడి” అని చెప్తాడు. అంతేగాక ఆయనిలా అంటాడు: “త్వరగా వెళ్లి, ఆయన మృతులలోనుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి.”—మత్తయి 28:2-7.

వాళ్లు హడావుడిగా వెళ్తుండగా, దారిలో వాళ్లు మరెవరినో కాదు స్వయంగా యేసునే కలుస్తారు! ‘మీరు వెళ్లి, నా సహోదరులకు తెలుపుడని’ ఆయన వాళ్లకు చెప్తాడు. (మత్తయి 28:8-10) తర్వాత, మగ్దలేనే మరియ సమాధి దగ్గర ఏడుస్తున్నప్పుడు యేసు ఆమెకు కనిపిస్తాడు. ఆమె ఆనందాన్ని పట్టలేక ఈ సంతోషకరమైన వార్తను ఇతర శిష్యులకు చెప్పడానికి పరుగెడుతుంది. (యోహాను 20:11-18) వాస్తవానికి, మరుపురాని ఆ ఆదివారం నాడు, పునరుత్థానం చేయబడిన యేసు వేర్వేరు శిష్యులకు ఐదుసార్లు కనిపించి, నిజంగా ఆయన జీవంతో తిరిగి లేచాడన్నదానిలో సందేహం లేకుండా చేస్తాడు!

ఈ విషయాలు మీకెలా వర్తిస్తాయంటే

1,966 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు 21వ శతాబ్దారంభంలోవున్న మిమ్మల్ని ఇప్పుడు ఎలా ప్రభావితం చేయగలవు? ఆ సంఘటనల ప్రత్యక్ష సాక్షి ఇలా వివరిస్తున్నాడు: “మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.”—1 యోహాను 4:9, 10.

క్రీస్తు మరణం ఏవిధంగా “ప్రాయశ్చిత్తమై” ఉంది? అది దేవునితో మంచి సంబంధాన్ని సాధ్యం చేస్తుంది గనుక అది “ప్రాయశ్చిత్తమై” ఉంది. మొదటి మానవుడైన ఆదాము దేవునిపై తిరుగుబాటు చేసి, పాప మరణాలను తన సంతానానికి వారసత్వంగా ఇచ్చాడు. అయితే, మరో వైపున యేసు మానవజాతి పాప మరణాలకు మూల్యాన్ని చెల్లించేందుకు తన జీవితాన్ని క్రయధనంగా ఇచ్చి, దేవుడు కనికరాన్ని దయను చూపించడానికి ఆధారాన్ని కలుగజేశాడు. (1 తిమోతి 2:5, 6) యేసు పాపప్రాయశ్చిత్త బలియందు విశ్వాసముంచడం ద్వారా, పాపియైన ఆదాము నుండి మీరు వారసత్వంగా పొందిన దండన నుండి విడుదల పొందవచ్చు. (రోమీయులు 5:12; 6:23) తత్ఫలితంగా ఇది, ప్రేమగల మీ పరలోక తండ్రియైన యెహోవా దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగివుండే అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే, యేసు యొక్క సర్వోన్నతమైన బలి మీకు నిరంతర జీవితాన్ని ప్రసాదించగలదు.—యోహాను 3:16; 17:3.

ఇవి, ఇంకా సంబంధిత విషయాలు ఏప్రిల్‌ 1, గురువారం సాయంకాలం యేసుక్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ నిమిత్తం ప్రపంచవ్యాప్తంగా వేలాది స్థలాల్లో లక్షలాదిమంది ప్రజలు సమకూడినప్పుడు చర్చించబడతాయి. దానికి మీరూ ఆహ్వానితులే. మీరు ఎక్కడ ఎప్పుడు హాజరవ్వవచ్చో మీ ప్రాంతంలోని యెహోవాసాక్షులు సంతోషంగా మీకు చెప్తారు. మీరు హాజరు కావడం, యేసు మానవ జీవితపు చివరి దినాన మన ప్రేమగల దేవుడూ, ఆయన ప్రియకుమారుడూ చేసిన దాని పట్ల మీ మెప్పును తప్పకుండా అధికం చేస్తుంది.

[అధస్సూచీలు]

a ఆ అంధకారం సూర్యగ్రహణం వల్ల ఏర్పడినది కాదు; ఎందుకంటే యేసు పౌర్ణమి నాడు మరణించాడు. అమావాస్య సమయంలో భూమికి సూర్యునికి మధ్యకు చంద్రుడు వచ్చినప్పుడే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్య గ్రహణాలు కేవలం కొద్ది నిముషాలపాటు మాత్రమే ఉంటాయి.

[7వ పేజీలోని చిత్రం]

యేసు మరణం, పునరుత్థానం

సా.శ. 33 నీసాను

సంఘటనలు

మహాగొప్ప మనిషిb

14 గురువారము

సాయంకాలం పస్కా ఆచరణ; యేసు అపొస్తలుల పాదాలు కడుగుతాడు; యేసును అప్పగించడానికి యూదా బయటకు వెళ్లిపోతాడు; క్రీస్తు తన మరణ జ్ఞాపకార్థ ఆచరణను ప్రారంభిస్తాడు (అది ఈ సంవత్సరం ఏప్రిల్‌ 1, గురువారం, సూర్యాస్తమయం తర్వాత ఆచరించబడుతుంది); తన నిర్గమనం నిమిత్తం శిష్యులను సంసిద్ధం చేయడానికి బోధన

113, పేరా 2 నుండి; 117, పేరా 1

మధ్యరాత్రి నుండి తెల్లవారుజాము వరకు

ప్రార్థనచేసి, స్తుతికీర్తనలు పాడిన తర్వాత యేసు, అపొస్తలులు గెత్సేమనే తోటకు వెళతారు; యేసు మహా రోదనముతోనూ, కన్నీళ్లతోనూ ప్రార్థిస్తాడు; యూదా ఇస్కరియోతు పెద్ద సమూహంతో వచ్చి యేసును అప్పగిస్తాడు; యేసును బంధించి అన్న వద్దకు తీసుకువెళ్తుండగా అపొస్తలులు పారిపోతారు; యేసును యూదుల సమాజమందిరం ఎదుట నిలువబెట్టడానికి ప్రధాన యాజకుడైన కయప వద్దకు తీసుకువెళతారు; మరణ శిక్ష విధించబడుతుంది; మౌఖికంగా, శారీరకంగా హింసిస్తారు; పేతురు మూడు సార్లు యేసును ఎరుగనని అంటాడు

117 నుండి 120

శుక్రవారం ఉదయం

ఉదయం వేళ యేసును మళ్లీ యూదుల సమాజమందిరం ఎదుటకు తీసుకువస్తారు; పిలాతు వద్దకు తీసుకువెళ్తారు; హేరోదు వద్దకు పంపిస్తారు; మళ్ళీ పిలాతు వద్దకు తీసుకువెళ్తారు; యేసు కొట్టబడి, అవమానించబడి, హింసించబడతాడు; ఒత్తిడికి లొంగిపోయి పిలాతు ఆయనను కొరతవేయడానికి అప్పగిస్తాడు; ఉదయం మరణశిక్ష విధించడానికి గొల్గొతాకు తీసుకువెళ్లడం

121 నుండి 124

మధ్యాహ్నం

పన్నెండు గంటలు కావడానికి కాస్త ముందు కొరత వేయబడ్డాడు; పన్నెండు గంటల నుండి దాదాపు మూడు గంటల వేళ యేసు మరణించే వరకు అంధకారం అలుముకుంటుంది; భీభత్సకరమైన భూకంపం వస్తుంది; దేవాలయపు తెర రెండుగా చీలిపోతుంది

125, 126

అపరాహ్ణం

విశ్రాంతి దినానికి ముందు యేసు శరీరం ఒక తోటలోవున్న సమాధిలో ఉంచబడుతుంది

127, 1-7 పేరాలు

15 శుక్రవారం సాయంకాలం

విశ్రాంతి దినం ప్రారంభమౌతుంది

శనివారం

యేసు సమాధి వద్ద కాపలాదారులను ఉంచడానికి పిలాతు అనుమతినిస్తాడు

127, 8, 9 పేరాలు

16 ఆదివారం

ఉదయాన్నే యేసు సమాధి ఖాళీగా కనిపిస్తుంది; పునరుత్థానం చేయబడిన యేసు (1) సలోమి, యోహన్న, యాకోబు తల్లియైన మరియలతోసహా కొంతమంది శిష్యురాండ్రకు; (2) మగ్దలేనే మరియకు; (3) క్లెయొపాకు ఆయన సహచరుడికి; (4) సీమోను పేతురుకు; (5) సమకూడివున్న అపొస్తలులకు మరియు ఇతర శిష్యులకు కనిపిస్తాడు

127, 10వ పేరా నుండి 129, 10వ పేరా వరకు

[అధస్సూచీలు]

b ఇక్కడ ఇవ్వబడిన సంఖ్యలు జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకంలోని అధ్యాయాలను సూచిస్తాయి. యేసు తుది పరిచర్యను గురించిన లేఖనాధార వివరాలున్న చార్టు కోసం “ప్రతి లేఖనము ప్రేరేపించబడినది, ప్రయోజనకరమైనది” (ఆంగ్లం) అనే పుస్తకంలోని 290వ పేజీ చూడండి. ఈ పుస్తకాలను వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి ప్రచురించింది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి