బలమైన క్రైస్తవ వారసత్వానికి కృతజ్ఞురాలిని
గెన్ గూచ్ చెప్పినది
‘గొప్పవాడైన యెహోవా తన మహిమలో సింహాసనాసీనుడైవున్నాడు’ అనే మాటలున్న కీర్తనను స్కూల్లో పాడేదాన్ని. ‘ఈ యెహోవా ఎవరు?’ అని నేను తరచూ అనుకునేదాన్ని.
మా నానమ్మా తాతయ్యా దైవభయంగల వ్యక్తులు. ఈ శతాబ్దపు తొలికాలంలో, వాళ్ళు బైబిలు విద్యార్థులతో సహవసించారు. యెహోవాసాక్షులు అప్పట్లో అలా పిలువబడేవారు. మా నాన్న వ్యాపారంలో బాగా రాణించాడు. కానీ తనకు అందించబడుతూ వచ్చిన క్రైస్తవ వారసత్వాన్ని మాత్రం తన ముగ్గురు పిల్లలకూ మొదట్లో అందజేయలేదు.
నాకు, మా అన్నయ్య డోగ్లస్‌కు, మా చెల్లి ఆన్‌కూ హిస్ వర్క్స్, హు ఈస్ గాడ్? అనే చిన్న పుస్తకాలను మా నాన్న ఇచ్చినప్పుడు నాకు తెలిసింది యెహోవా అనేది సత్యదేవుని పేరని. (కీర్తన 83:18) నాకు పులకింత కలిగింది! అయితే నాన్నకు ఆసక్తిని తిరిగి రేకెత్తించినదేమిటి?
1938లో, దేశాలు యుద్ధానికి సిద్ధమౌతుండడాన్ని నాన్న చూసినప్పుడు ప్రపంచ సమస్యలను పరిష్కరించేందుకు మానవ ప్రయత్నాలకు మించినదేదో అవసరమని ఆయన గ్రహించాడు. యెహోవాసాక్షులు ప్రచురించిన ఎనిమీస్ అనే పుస్తకాన్ని నానమ్మ ఆయనకిచ్చింది. దాన్ని చదివి, మానవుని అసలు శత్రువు అపవాదియైన సాతాను అనీ, దేవుని రాజ్యం మాత్రమే ప్రపంచ శాంతిని తీసుకురాగలదనీ ఆయన తెలుసుకున్నాడు.a—దానియేలు 2:44; 2 కొరింథీయులు 4:4.
యుద్ధం ఆసన్నమవ్వగా, ఉత్తర లండన్‌లోని వుడ్ గ్రీన్‌లోని యెహోవాసాక్షుల రాజ్య మందిరంలో జరిగే కూటాలకు మా కుటుంబం హాజరుకానారంభించింది. 1939 జూన్‌లో, అప్పట్లో వాచ్ టవర్ సొసైటీ అధ్యక్షుడైన జోసఫ్ ఎఫ్. రథర్‌ఫర్డ్ ఇవ్వనున్న “ప్రభుత్వము మరియు శాంతి” అనే బహిరంగ ప్రసంగాన్ని వినేందుకు సమీపంలో ఉన్న అలెక్సాండ్రా ప్యాలస్‌కు వెళ్ళాం. న్యూయార్క్ సిటీలోని మడిసన్ స్క్వయర్ గార్డెన్‌లో రథర్‌ఫర్డ్ ఇచ్చిన ప్రసంగం రేడియో ద్వారా లండన్‌కూ మరితర ముఖ్య నగరాలకు ప్రసారం చేయబడింది. మేము ఆ ప్రసంగాన్ని ఎంత స్పష్టంగా విన్నామంటే, న్యూయార్క్‌లో ఒక రౌడీ మూక ఆటంకం కలిగించినప్పుడు, అది మేమున్న ఆడిటోరియమ్‌లోనే జరుగుతోందా అన్నట్లు చుట్టూ కలియజూశాను!
బైబిలు సత్యం కొరకైన నాన్న ఆసక్తి
ప్రతి శనివారం సాయంకాలం మా కుటుంబమంతా కూడా బైబిలు పఠనంలో కలిసి భాగం వహించాలనే నిర్ణయానికి మా నాన్న వచ్చాడు. మరుసటి రోజు కొరకు కావలికోటలో పట్టికవేయబడిన అంశంపై మా పఠనం కేంద్రీకరించబడేది. ఆ పఠనాలు చూపించిన ప్రభావాన్ని సోదాహరణగా చెప్పాలంటే, కావలికోట మే 1, 1939లో (ఆంగ్లం) చర్చించబడిన యెహోషువాను గురించిన, హాయి నగరం పట్టబడడాన్ని గురించిన వృత్తాంతం ఇప్పటికీ నా మనస్సులో స్పష్టంగా ఉంది. ఆ వృత్తాంతం వల్ల ఆకర్షితురాలినైన నేను దానికి సంబంధించి ఇవ్వబడిన ప్రతి లేఖనాన్ని నా సొంత బైబిలులో పరిశీలించి చూశాను. అలాంటి పరిశోధన చాలా ఆసక్తికరంగా ఉందని కనుగొన్నాను—ఇప్పుడు కూడా అంతే.
నేర్చుకున్న విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన బైబిలు బోధలు నా హృదయంలో నాటుకుపోయినట్లు అనిపించింది. ఒక రోజు మా నాన్న నాకు బైబిలు ప్రసంగ రికార్డునూ, ఫోనోగ్రాఫ్‌నూ, మేము బైబిలు పఠనానికి ఉపయోగించే చిన్నపుస్తకాన్నీ, ఒక పెద్దావిడ చిరునామానూ ఇచ్చారు. నేను ఆమెను సందర్శించాలని నాన్నగారు చెప్పారు.
“నేను వెళ్ళి ఏమని చెప్పాలి, నేనేమి చేయాలి?” అని అడిగాను.
“నువ్వు చేయవలసిందల్లా, గ్రామఫోన్ రికార్డు వినిపించడం, ప్రశ్నలు చదవడం, ఆమెతో జవాబులు చదివించడం, ఆ తర్వాత లేఖనాలు చదవడమూ. అంతే” అని నాన్నగారు అన్నారు.
నేను ఆయన చెప్పినట్లు చేశాను. ఈ విధంగా నేను బైబిలు పఠనాన్ని ఎలా నిర్వహించాలో నేర్చుకున్నాను. అలా నేను పరిచర్యలో లేఖనాలను ఉపయోగించడం ద్వారా, వాటిని ఇంకా బాగా అర్థం చేసుకోగలిగాను.
యుద్ధకాలంలో సవాలు
1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యింది. ఆ తరువాతి సంవత్సరం నేను యెహోవాను సేవించేందుకు నన్ను నేను సమర్పించుకున్న దానికి గురుతుగా బాప్తిస్మం తీసుకున్నాను. అప్పుడు నా వయస్సు కేవలం 13 సంవత్సరాలే. నేను పయినీర్ అవ్వాలని అప్పుడు నిర్ణయించుకున్నాను. పూర్తికాల పరిచారకులు పయినీర్లు అని పిలువబడుతారు. నేను 1941లో చదువు మానేసి, లీచెస్టర్ సమావేశంలో డోగ్లస్‌తో పూర్తికాల ప్రకటన పనిలో చేరాను.
ఆ తర్వాతి సంవత్సరం, మా నాన్న మత సూత్రాల కారణాన్నిబట్టి యుద్ధంలో చేరడానికి నిరాకరించినందుకు జైలులో వేయబడ్డాడు. పిల్లలమైన మేము మా అమ్మకు చేయూతగా ఉండేందుకు, యుద్ధం జరుగుతున్న ఆ క్లిష్ట సమయంలో మా ఇంటి బాధ్యతలు చూసుకోవడంలో ఆమెకు సహాయపడేందుకు కలిసికట్టుగా ముందుకు వచ్చాం. అయితే, తర్వాత, మా నాన్న జైలు నుండి విడుదలయ్యారో లేదో అంతలోనే సైనిక సేవలో చేరాలన్న పిలుపు డోగ్లస్‌కు అందింది. “తండ్రిలాగే కుమారుడు జైలునెందుకు ఎంచుకున్నాడు” అనే హెడ్డింగ్ స్థానిక వార్తాపత్రికలో కనిపించింది. నిజ క్రైస్తవులు తోటిమానవులను చంపడంలో ఎందుకు పాలుపంచుకోరో వివరించే అవకాశం లభించడంతో మంచి సాక్ష్యం ఇవ్వబడింది.—యోహాను 13:35; 1 యోహాను 3:10-12.
ఆ యుద్ధకాలంలో, పూర్తికాల పరిచర్యచేస్తున్న చాలా మంది సాక్షులు మా ఇంటికి తరచూ వచ్చేవాళ్ళు. నిర్మాణాత్మకమైన వారి బైబిలు ఆధార చర్చలు చెరగని ముద్రను వేశాయి. ఆ నమ్మకస్థులైన క్రైస్తవ సహోదరులు ఎవరంటే జాన్ బార్ మరియు ఆల్బర్ట్ ష్రోడర్. వాళ్ళు ఇప్పుడు యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యులు. మా తల్లిదండ్రులు నిజంగా మంచి ఆతిథేయులుగా ఉండేవారు. మేము కూడా అలాగే ఉండేలా వాళ్ళు మాకు నేర్పారు.—హెబ్రీయులు 13:2.
ప్రత్యుత్తరం ఇచ్చేందుకు సిద్ధం
నేను పయినీరింగ్ చేయనారంభించిన కొద్దికాలానికే, ఇంటింటి పరిచర్యలో హిల్డను కలిశాను. ఆమె కోపంగా ఇలా అరిచింది: “నా భర్త నీలాంటివాళ్ళ ప్రయోజనార్థం యుద్ధంలో పోరాడుతున్నాడు! యుద్ధం కోసం నువ్వు ఏ ప్రయత్నమూ చేయడం లేదెందుకని?”
“నేనేమి చేస్తున్నానో మీకు ఎంత మేరకు తెలుసు? నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానో మీకు తెలుసాండీ?” అని అడిగాను.
“సరే, నువ్వు లోపలికి వచ్చి చెప్పు” అని ఆమె జవాబిచ్చింది.
జరుగుతున్న భయంకరమైన కృత్యాలవలన, తరచూ దేవుని పేరటే జరుగుతున్న అలాంటి కృత్యాలవలన కష్టాలననుభవిస్తున్న వారికి నిజమైన నిరీక్షణను కలిగిస్తున్నామని విశదీకరించి చెప్పగల్గాను. హిల్డ ఎంతో మెప్పుదలతో ఆలకించి, నా మొదటి మరియు క్రమంగా పఠించే బైబిలు విద్యార్థిని అయ్యింది. ఆమె ఇప్పటికీ 55 కన్నా ఎక్కువ సంవత్సరాలుగా క్రియాశీల సాక్షిగా ఉంటోంది.
యుద్ధానంతరం, నైరుతి ఇంగ్లండ్‌లోని డొర్‌చస్టర్ నగరంలో క్రొత్త పయినీర్ నియామకం నాకు లభించింది. నేను మొదటిసారిగా ఇంటి నుండి దూరంగా వెళ్ళాను. మా చిన్న సంఘం 16వ శతాబ్దపు కట్టడమైన “ద ఓల్డ్ టీ హౌస్” అని పిలువబడే రెస్టారెంట్‌లో కలిసేది. ప్రతి కూటం కోసం మేము బల్లలను కుర్చీలను మళ్ళీ అరేంజ్ చేసుకోవలసి వచ్చేది. నాకలవాటైన రాజ్యమందిరానికి దీనికి చాలా తేడా ఉంది. అయినప్పటికీ, అదే ఆధ్యాత్మిక ఆహారమూ, క్రైస్తవ సహోదర సహోదరీల ప్రేమపూర్వక సహవాసమూ లభించేవి.
ఇంతలో మా తల్లిదండ్రులు లండన్‌లో దక్షిణభాగాన ఉన్న టన్‌బ్రిజ్ వెల్స్‌కు తరలివెళ్ళారు. నేనూ, నాన్నా, ఆన్ కలిసి పయినీరింగ్ చేయగల్గేందుకు నేను ఇంటికి తిరిగి వెళ్ళాను. మా సంఘంలో సాక్షుల సంఖ్య అతిత్వరగా 12 నుండి 70 దాకా పెరిగింది. కనుక, రాజ్యప్రచారకుల అవసరం ఎక్కువున్న దక్షిణ తీరమైన బ్రైటన్‌కు వెళ్ళమని మా కుటుంబాన్ని కోరడం జరిగింది. చాలా మంది ఆసక్తితో మా పయినీర్ కుటుంబంతో చేరారు. యెహోవా మా పనిని అత్యధికంగా ఆశీర్వదించడాన్ని మేము చూశాం. అక్కడున్న సంఘం త్వరగా మూడు సంఘాలుగా పెరిగింది!
అనుకోని ఆహ్వానం
1950 వేసవిలో, న్యూయార్క్ నగరంలో యాంకీ స్టేడియమ్‌లో జరిగిన దైవపరిపాలనా అభివృద్ధి అంతర్జాతీయ సమావేశానికి హాజరయ్యేందుకు బ్రిటన్ నుండి వచ్చిన 850 మంది ప్రతినిధుల్లో మా కుటుంబమూ ఉంది. అనేక దేశాల నుండి ఆ సమావేశం కోసం వచ్చిన అనేక మంది పయినీర్లకు న్యూయార్క్‌లో దక్షిణ లాన్‌సింగ్‌కు సమీపానవున్న వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్‌కు హాజరయ్యేందుకు దరఖాస్తులు పంపబడ్డాయి. నాకూ, డోగ్లస్‌కూ, ఆన్‌కూ కూడా దరఖాస్తులు అందాయి! నేను పూరించిన నా దరఖాస్తును తపాలాలో వేస్తూ, ‘ఇప్పుడు నిజంగా ఆ పని చేశాను! నా జీవితం ఏ దిశకు పయనిస్తుందో ఏమో?’ అని అనుకోవడం నాకు గుర్తుంది. అయినా, “చిత్తగించుము నేనున్నాను నన్ను పంపు” అన్నదే నేను తీసుకున్న నిర్ణయం. (యెషయా 6:8) ఆ సమావేశం తర్వాత, 16వ గిలియడ్ తరగతికి హాజరయ్యేందుకు అక్కడే ఉండిపొమ్మన్న ఆహ్వానం డోగ్లస్ మరియు ఆన్‌లతోపాటు నాకు కూడా లభించినప్పుడు నేను పులకించిపోయాను. మేము ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా మిషనరీలుగా పంపబడే అవకాశముందని మాకందరికీ బాగా తెలుసు.
మేము కుటుంబసమేతంగా సమావేశాన్ని ఆస్వాదించిన తర్వాత, మా తల్లిదండ్రులు తామిరువురు మాత్రమే ఇంగ్లండ్‌కు వెళ్ళవలసిన సమయం వచ్చింది. మొరిటేనీయా స్టీమర్ మీద వాళ్ళు ఇంటికి తిరుగు ప్రయాణం మొదలుపెడుతుండగా, మేము ముగ్గురం పిల్లలం చేతులూపి వీడ్కోలు చెప్పాం. ఆ వీడ్కోలు ఎంత భావోద్వేగాన్ని కలిగించిందో!
మిషనరీ నియామకాలు
గిలియడ్ 16వ తరగతికి ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన 120 మంది విద్యార్థులున్నారు. అందులో కొందరు నాజీ కాన్‌సెన్‌ట్రేషన్ క్యాంపుల్లో యాతనలను అనుభవించినవాళ్ళు కూడా ఉన్నారు. మా క్లాస్ స్పానిష్‌లో జరిగింది కనుక, దక్షిణ అమెరికాలోవున్న స్పానిష్ భాష మాట్లాడే ప్రజలుండే దేశాల్లోకి మమ్మల్ని నియమిస్తారని అనుకున్నాం. డోగ్లస్ జపాన్‌కీ, నేను, ఆన్ సిరియాకీ నియమించబడ్డామని గ్రాడ్యుయేషన్ రోజున మాకు తెలిసినప్పుడు మాకు కలిగిన ఆశ్చర్యాన్ని ఊహించండి. అలా అమ్మాయిలం మేమిద్దరమూ అరబిక్ భాష నేర్చుకోవలసి వచ్చింది. మా నియామకం లెబనన్‌కు మారినప్పటికీ మేము ఆ భాష నేర్చుకోవలసి ఉండింది. మేము వీసాల కోసం ఎదురు చూస్తున్నాం. ఈలోగా, వాచ్ టవర్ సొసైటీలో అరబిక్ కావలికోటను టైప్‌సెట్ చేసే సహోదరుడు జార్జ్ షకషీరీ వారానికి రెండుసార్లు మాకు అరబిక్ క్లాస్ తీసుకునేవాడు.
మేము తరగతిలో అధ్యయనం చేసిన బైబిలు దేశానికి వెళ్ళడం ఎంత ఉత్తేజకరంగా ఉండిందో! కీత్ మరియు జోయిస్ చూ, ఎడ్న స్టాక్‌హవుస్, ఆలివ్ టర్నర్, డొరీన్ వొర్‌బర్‌టన్, డొరస్ వుడ్ మాతోపాటు అక్కడికి వచ్చారు. మేము ఎంతో సంతోషంగల మిషనరీ కుటుంబంగా అయ్యాం! అక్కడి భాషను మెరుగుపర్చుకోవడంలో సహాయపడేందుకు స్థానిక సాక్షి ఒకరు మా మిషనరీ హోమ్‌ను సందర్శించేది. ప్రతిరోజూ, మా అరబిక్ క్లాసుల పీరియడ్‌లో, మేము క్లుప్త అందింపులను అభ్యసించేవాళ్ళం, ఆ తర్వాత మేము బయల్దేరి, ప్రకటనా పనిలో ఆ అందింపును ఉపయోగించేవాళ్ళం.
మేము సంస్థాపిత సంఘమున్న ట్రిపొలిలో మొదటి రెండు సంవత్సరాలు గడిపాం. కూటాల్లోనూ, అలాగే బహిరంగ పరిచర్యలోనూ పాల్గొనేందుకు స్థానిక సాక్షుల భార్యాపిల్లలకు నేనూ, ఆన్, జోయిస్, ఎడ్న, డొరీన్, డొరస్ సహాయం చేసేవాళ్ళం. అప్పటివరకు, మన క్రైస్తవ సహోదర సహోదరీలు స్థానిక ఆచారాలను అనుసరిస్తూ కూటాల్లో కలిసి కూర్చునేవాళ్ళు కాదు. ఆ క్రైస్తవ సహోదరీలు చాలా అరుదుగా మాత్రమే ఇంటింటి పరిచర్యలో పాల్గొనేవాళ్ళు. మా బహిరంగ ప్రకటనా పనిలో భాష విషయమై మాకు వాళ్ళ సహాయం అవసరముండింది. ఈ పనిలో వాళ్ళు కూడా భాగం వహించాలని మేము వాళ్ళను ప్రోత్సహించాం.
పురాతన నగరమైన సీదోనులో ఉన్న యెహోవాసాక్షుల చిన్న గుంపుకు సహాయపడేందుకు నన్నూ, ఆన్‌ను తర్వాత అక్కడికి నియమించారు. ఎంతో కాలం గడవకముందే, రాజధానియైన బేరూట్‌కు తిరిగివెళ్ళమని మమ్మల్ని కోరడం జరిగింది. అక్కడవున్న అర్మేనియన్ భాష మాట్లాడే సముదాయంలో బైబిలు సత్యపు విత్తనాలు నాటబడుతూ వచ్చాయి. కనుక వారికి సహాయపడేందుకు మేము ఆ భాషను నేర్చుకున్నాం.
నియామకంలో మార్పులు
ఇంగ్లండ్ వదిలిపెట్టకముందు నేను విల్‌ఫ్రడ్ గూచ్‌ను కలవడం జరిగింది. ఆయన ఆసక్తిగల, సానుభూతి గల సహోదరుడు, ఆయన లండన్ బేతేలులో సేవచేసినవాడు. విల్ఫ్ గిలియడ్ 15వ తరగతి విద్యార్థి. ఆ తరగతివారు 1950లో యాంకీ స్టేడియమ్ సమావేశంలో పట్టభద్రులయ్యారు. నైజీరియాలోని వాచ్ టవర్ సొసైటీ బ్రాంచ్ ఆఫీస్‌లో ఆయనకు నియామకం ఇవ్వబడింది. కొంతకాలం మేము ఉత్తరాలు వ్రాసుకున్నాం. 1955లో, లండన్‌లో జరిగిన “ట్రయమ్‌ఫన్ట్ కింగ్డమ్” అనే సమావేశానికి మేమిరువురమూ హాజరయ్యాం. ఆ తర్వాత త్వరలోనే మా ఇద్దరి వివాహం నిశ్చయమైంది. ఆ తర్వాతి సంవత్సరం, ఘానాలో మేము పెళ్ళి చేసుకున్నాం. నైజీరియాలోని లేగాస్‌లో ఆయన మిషనరీ నియామకంలో నేనూ చేరాను.
నేను ఆన్‌ను లెబనన్‌లో వదిలిపెట్టి వచ్చిన తర్వాత, జెరూసలేమ్‌లో బైబిలు సత్యాన్ని నేర్చుకున్న ఒక మంచి క్రైస్తవ సహోదరుడ్ని ఆమె పెళ్ళి చేసుకుంది. నేనూ, డోగ్లస్, ఆన్ వివిధ దేశాల్లో వివాహం చేసుకున్నందువల్ల, మా తల్లిదండ్రులు మా పెళ్ళిళ్ళకు హాజరు కాలేక పోయారు. అయినప్పటికీ, మేమందరమూ మన దేవుడైన యెహోవాకు సంతోషంగా సేవచేస్తున్నామని తెలుసుకుని వాళ్ళు తృప్తిపడ్డారు.
నైజీరియాలోని పని
లేగాస్‌లోని బ్రాంచ్ ఆఫీస్‌లో, ఎనిమిది మందివున్న మా బ్రాంచ్ కుటుంబ సభ్యుల గదులను శుభ్రం చేసే పని, అలాగే, వాళ్ళ కోసం భోజనం తయారు చేసే పనీ, వాళ్ళ బట్టలుతికే పనీ నాకు నియమించబడింది. నేను భర్తనే కాక, వెంటనే ఒక కుటుంబాన్ని కూడా పొందినట్లు నాకు అనిపించింది!
నేనూ, విల్పూ యొరబా భాషలో క్లుప్తమైన బైబిలు అందింపులను నేర్చుకున్నాం. మేము చేసిన ప్రయత్నాలకు ప్రతిఫలం లభించింది. అప్పట్లో మేము కలిసిన ఒక యువ విద్యార్థి యొక్క ఒక కుమారుడూ, ఒక కుమార్తే ఇప్పుడు నైజీరియాలోని దాదాపు 400 మంది సభ్యులున్న పెద్ద బేతేలు కుటుంబంలో సేవ చేస్తున్నారు.
1963లో, న్యూయార్క్‌లోని, బ్రూక్లిన్‌లో ఇవ్వబడనున్న ప్రత్యేక నిర్దేశాల పది నెలల కోర్సుకు హాజరయ్యేందుకు విల్ఫ్‌కు ఆహ్వానం లభించింది. దాన్ని పూర్తి చేసిన తర్వాత, అనుకోకుండా ఆయన తిరిగి ఇంగ్లండ్‌కు నియమించబడ్డాడు. నేను నైజీరియాలో ఉన్నాను, 14 రోజుల్లో లండన్‌కు వెళ్ళి విల్ఫ్‌ను కలుసుకొమ్మన్న నోటీస్ నాకందింది. నేను మిశ్రిత భావాలతో బయల్దేరాను. నైజీరియా చాలా సంతోషకరమైన నియామకంగా ఉండేది మరి. విదేశాల్లో 14 సంవత్సరాలు సేవచేసిన తర్వాత, మళ్ళీ ఇంగ్లండ్‌లో జీవితానికి సర్దుకుపోవడానికి సమయం పట్టింది. అయినప్పటికీ, వార్ధక్యానికి చేరుకుంటున్న మా తల్లిదండ్రులకు మరోసారి సమీపంగా ఉండగలిగినందుకు, వాళ్ళను చూసుకోగలిగినందుకు మేము కృతజ్ఞులముగా ఉండేవాళ్ళం.
మన నిరీక్షణ వల్ల సంరక్షించబడుతున్నాం
1980 నుండి, విల్ఫ్ జోన్ పైవిచారణకర్తగా అనేక దేశాలకు ప్రయాణం చేస్తుండగా ఆయన వెంట వెళ్ళే ఆధిక్యత నాకు లభించింది. నేను ముఖ్యంగా నైజీరియాకు మళ్ళీ ఎప్పుడెళ్తామా అని ఎదురుచూసేదాన్ని. తర్వాత, మేము స్కాన్‌డినావియా, వెస్ట్ ఇండీస్, మరియు లెబనన్‌తో సహా మధ్య ప్రాచ్యానికి కూడా వెళ్ళాం. సంతోషకరమైన స్మృతులను పునరావలోకనం చేసుకోవడమూ, నాకు తెలిసిన కౌమారప్రాయంలోని పిల్లలు ఇప్పుడు క్రైస్తవ పెద్దలుగా సేవ చేయడాన్ని చూడడమూ ప్రత్యేక విధమైన పులకింత కలిగించేవి.
విచారకరంగా నా ప్రియమైన భర్త 1992 వసంతంలో చనిపోయాడు. ఆయనకు అప్పుడు కేవలం 69 సంవత్సరాలు. అది మరీ అకస్మాత్తుగా జరిగినందువల్ల, అది చాలా గట్టి దెబ్బే. పెళ్ళయి 35 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ పరిస్థితికి సర్దుకునేందుకు సమయం పట్టింది. కానీ, ప్రపంచవ్యాప్త క్రైస్తవ కుటుంబం నుండి నేను ఎంతో సహాయాన్నీ, ప్రేమనూ పొందాను. నేను తలపోసుకునేందుకు అనేక సంతోషకరమైన అనుభవాలున్నాయి.
నా తల్లిదండ్రులిరువురూ క్రైస్తవ యథార్థతకు ఉన్నతమైన మాదిరినుంచారు. అమ్మ 1981లోనూ, నాన్న 1986లోనూ మరణించారు. డోగ్లస్ మరియు ఆన్ యెహోవాను సేవించడంలో కొనసాగుతున్నారు. డోగ్లస్, ఆయన భార్యా లండన్‌లో నాన్నను చూసుకునేందుకు లండన్‌కు తిరిగివెళ్ళి, తర్వాత అక్కడే ఉండిపోయారు. ఆన్, ఆమె కుటుంబమూ అమెరికాలో ఉన్నారు. దైవదత్తమైన నిరీక్షణనూ వారసత్వాన్నీ మేమందరమూ ఎంతో మెచ్చుకుంటాం. జీవించివున్నవారు పునరుత్థానం పొందిన ప్రియమైనవారితో పాటు యెహోవా భూసంబంధమైన కుటుంబ సభ్యులుగా సదాకాలం కలిసి సేవించే సమయం కోసం ‘నమ్మకంగా ఎదురుచూడడంలో’ మేము కొనసాగుతున్నాం.—విలాపవాక్యములు 3:24, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం.
[అధస్సూచి]
a మా నాన్న పేరు అర్నెస్ట్ బీవర్. ఆయన జీవిత చరిత్ర కావలికోట మార్చి 15, 1980లో (ఆంగ్లం) వచ్చింది.
[23వ పేజీలోని చిత్రం]
ఎడమవైపు పై నుండి సవ్యదిశగా
ఎన్‌ఫీల్డ్ రాజ్యమందిరంలో మాదిరి పఠనాన్ని ప్రదర్శిస్తున్న 13 ఏండ్ల గ్వెన్
లెబనన్‌లోని ట్రిపోలీలో 1951లో మిషనరీ కుటుంబం
గ్వెన్ చనిపోయిన తన భర్త విల్ఫ్‌తో