క్రైస్తవ సమావేశాల్ని ప్రశంసించడం
“సమాజముగా కూడుట మానక, . . . ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.”—హెబ్రీయులు 10:24, 25.
1, 2. (ఎ) నిజ క్రైస్తవుల సమావేశానికి హాజరుకావడం ఎందుకు ఒక ఆధిక్యత? (బి) యేసు తన అనుచరులు సమావేశమయ్యేచోట ఏ భావంలో హాజరై ఉంటాడు?
క్రైస్తవ సమావేశానికి హాజరుకావడం ఎంతటి ఆధిక్యత, అది పదికన్నా తక్కువమందితో కూడినదైనా లేక కొన్ని వేలమంది యెహోవా ఆరాధికులతో కూడినదైనా సరే! ఎందుకంటే యేసు ఇలా అన్నాడు: “ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందు[ను].” (మత్తయి 18:20) నిజమే, యేసు ఆ వాగ్దానం చేస్తున్నప్పుడు, సంఘంలో నాయకత్వం వహించేవారు సరియైనవిధంగా నిర్వహించవలసిన న్యాయనిర్ణయ విషయాలను గురించి ఆయన చర్చిస్తున్నాడు. (మత్తయి 18:15-19) కానీ యేసు నామమున ప్రార్థనతో ప్రారంభమై, ముగించబడే అన్ని క్రైస్తవ సమావేశాలకూ ఆయన మాటలు సూత్రబద్ధంగా వర్తిస్తాయా? అవును. గుర్తుంచుకోండి, శిష్యుల్నిచేసే నియామకాన్ని తన అనుచరులకు ఇచ్చినప్పుడు యేసు, “ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని” వాగ్దానం చేశాడు.—మత్తయి 28:20.
2 క్రైస్తవ సంఘ శిరస్సు అయిన ప్రభువైన యేసుక్రీస్తు, విశ్వసనీయులైన తన అనుచరులు కూడుకునే సమావేశాలన్నింట్లోనూ ఎంతో ఆసక్తిని కలిగివున్నాడనడంలో సందేహమేమీ లేదు. అంతేగాక, ఆయన దేవుని పరిశుద్ధాత్మ ద్వారా వారితోకూడ ఉన్నాడని మనం నిశ్చయతను కలిగివుండవచ్చు. (అపొస్తలుల కార్యములు 2:33; ప్రకటన 5:6) యెహోవా దేవుడు కూడా మనం సమకూడడం పట్ల ఆసక్తి కలిగివున్నాడు. అటువంటి కూటాల ప్రాథమిక సంకల్పం, మనం “సమాజములలో” మన స్వరమెత్తి దేవునికి స్తుతులు చెల్లించడమే. (కీర్తనలు 26:12) సంఘ కూటాలకు మనం హాజరుకావడం ఆయనపట్ల మనకుగల ప్రేమకు ఒక నిదర్శనం.
3. ఏ ప్రాముఖ్యమైన కారణాలనుబట్టి మనం క్రైస్తవ సమావేశాలను మెప్పుదలతో చూస్తాము?
3 క్రైస్తవ సమావేశాలను మనం ఎందుకు మెప్పుదలతో చూస్తామన్నదానికి మరితర చక్కని కారణాలు ఉన్నాయి. యేసుక్రీస్తు తాను భూమిని విడిచివెళ్లడానికి ముందు, విశ్వాసగృహానికి చెందినవారికి తగినవేళకు కావాల్సిన ఆధ్యాత్మిక ఆహారాన్ని సరఫరా చేయడంలో ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన’ దాసునిగా పనిచేసేందుకు తన అభిషిక్త శిష్యులను నియమించాడు. (మత్తయి 24:45) అటువంటి ఆధ్యాత్మిక ఆహారపంపిణీ కార్యక్రమం సంఘ కూటాల ద్వారా, అలాగే పెద్ద సభలూ సమావేశాలద్వారా ప్రాముఖ్యంగా జరుగుతుంది. ఈ దుష్ట విధానాన్ని తప్పించుకుని, నీతియుక్తమైన దేవుని నూతన లోకంలో జీవితాన్ని సంపాదించుకోవాలని కోరుకునేవారందరికీ కీలకమైన సమాచారాన్ని అటువంటి సమావేశాలవద్ద అందించడానికి ప్రభువైన యేసుక్రీస్తు తన నమ్మకమైన దాసుడిని నడిపిస్తాడు.
4. ఏ ప్రమాదకరమైన “అలవాటు” బైబిలులో ప్రస్తావించబడింది, దాన్ని పెంపొందించుకోకుండా ఉండడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?
4 అందుకని, అపొస్తలుడైన పౌలు గమనించినటువంటి ఈ ప్రమాదకరమైన అలవాటును పెంపొందించుకోవడానికి ఏ క్రైస్తవుడూ సాహసించకూడదు: “కొందరు [“అలవాటుగా,” NW] మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.” (హెబ్రీయులు 10:24, 25) క్రైస్తవ సమావేశాలకు హాజరుకావడం ఒక ఆధిక్యత, అది ప్రయోజనాన్ని చేకూరుస్తుంది కూడాను. ఆ ఆధిక్యతను గురించీ, ప్రయోజనాల గురించీ ధ్యానించడం, అటువంటి సమావేశాలకు మనం నమ్మకంగాను, హృదయపూర్వకంగాను మద్దతునివ్వడానికి మనకు సహాయపడుతుంది.
క్షేమాభివృద్ధిని కలుగజేసే కూటాలు
5. (ఎ) కూటాల్లో మన సంభాషణ ఎటువంటి ప్రభావాన్ని కనపర్చాలి? (బి) ఆసక్తి చూపుతున్నవారిని కూటాలకు హాజరుకామని ఆహ్వానించడంలో ఎందుకు ఆలస్యం చేయకూడదు?
5 యెహోవా పరిశుద్ధాత్మ క్రైస్తవ కూటాల్లో చురుకుగా పనిచేయాలని క్రైస్తవులు ప్రార్థిస్తారు గనుక, హాజరయ్యే ప్రతి వ్యక్తీ ‘పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా’ ఆత్మకు అనుగుణ్యంగా పనిచేయడానికి తన శక్తికొద్దీ పనిచేయాలి. (ఎఫెసీయులు 4:30) అపొస్తలుడైన పౌలు ఆ ప్రేరేపిత మాటలను వ్రాసినప్పుడు, మన సంభాషణా సామర్థ్యాన్ని సరియైన రీతిలో ఉపయోగించడాన్ని గురించి చర్చిస్తున్నాడు. మనం మాట్లాడేది ఏదైనాసరే ఎల్లప్పుడు “వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన”దానిని కలుగజేసేందుకు ఉపయోగపడాలి. (ఎఫెసీయులు 4:29) క్రైస్తవ సమావేశాల్లో ఇది మరి విశేషంగా ప్రాముఖ్యమైనది. పౌలు తాను కొరింథీయులకు వ్రాసిన పత్రికలో కూటాలు క్షేమాభివృద్ధికరంగా, ప్రబోధాత్మకంగా, ప్రోత్సాహకరంగా ఉండాల్సిన అవసరతను నొక్కి చెప్పాడు. (1 కొరింథీయులు 14:5, 12, 19, 26, 31) ఆ విధంగా క్రొత్తగా హాజరౌతున్నవారితో సహా, అక్కడున్న ప్రతి ఒక్కరు అటువంటి కూటాలద్వారా ప్రయోజనం పొందుతారు. అంతేగాక ఆ క్రొత్తవారు “దేవుడు నిజముగా మీలో ఉన్నాడని” ఒక ముగింపుకు వస్తారు. (1 కొరింథీయులు 14:25) ఈ కారణాన, మనం అప్పుడప్పుడే ఆసక్తి చూపుతున్నవారిని మనతో సమకూడడానికి ఆహ్వానించడంలో ఆలస్యం చేయకూడదు. అలా ఆహ్వానిస్తే వారి ఆధ్యాత్మిక పురోభివృద్ధి మరింత వేగిరం అవుతుంది.
6. కూటాన్ని క్షేమాభివృద్ధికరంగా చేయడంలో సహాయం చేసే కొన్ని కారకాలు ఏవి?
6 ఏదైనా ఒక క్రైస్తవ కూటంలో ప్రసంగాలు, ఇంటర్వ్యూలు, లేక ప్రదర్శనలు ఉన్నవారు, తమ సంభాషణ క్షేమాభివృద్ధికరంగానూ, దేవుని లిఖిత వాక్యమైన బైబిలుకు అనుగుణ్యంగానూ ఉండేలా నిశ్చయపర్చుకోవాలి. మన సంభాషణ కచ్చితమైన రీతిలో ఉండడమే కాక, దేవుని యొక్క మరియు క్రీస్తు యొక్క ప్రేమపూర్వకమైన వ్యక్తిత్వాలకు అనుగుణ్యంగా మన భావనల్నీ, భావోద్వేగాల్నీ మనం వ్యక్తం చేయాలి. కూటంలో తమ తమ భాగాలను నిర్వర్తించేవారందరూ సంతోషము, దీర్ఘశాంతము, విశ్వాసము వంటి ‘దేవుని ఆత్మ ఫలాలను’ ప్రతిఫలించేందుకు కృషిచేస్తే అప్పుడు, హాజరైన ప్రతి ఒక్కరు తాము క్షేమాభివృద్ధి చెందినట్లు తప్పకుండా భావిస్తారు.—గలతీయులు 5:22, 23.
7. సమావేశాలు క్షేమాభివృద్ధికరంగా ఉండేందుకు హాజరైన ప్రతి ఒక్కరూ ఎలా దోహదపడవచ్చు?
7 సంఘ కూటాలను నిర్వహించేది కొద్దిమందే అయినప్పటికీ సమావేశము క్షేమాభివృద్ధికరంగా ఉండడానికి అందరూ దోహదపడవచ్చు. ప్రశ్నలకు జవాబివ్వడానికి ప్రేక్షకులకు తరచూ అవకాశాలు ఉంటాయి. మన విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించేందుకు ఇవి చక్కని సందర్భాలు. (రోమీయులు 10:9) మన వ్యక్తిగత తలంపులను ప్రచురపరచుకోవడానికో, వ్యక్తిగతంగా మనం సాధించిన ఘనకార్యాల్ని గురించి ప్రగల్భాలు చెప్పుకోవడానికో, లేక ఒక తోటి విశ్వాసిని విమర్శించడానికో వాటిని ఒక అవకాశంగా ఉపయోగించుకోకూడదు. అది దేవుని ఆత్మను దుఃఖపర్చదూ? తోటి విశ్వాసులతో ఉండే అభిప్రాయ భేదాల విషయంలో ప్రేమపూర్వకమైన స్ఫూర్తితో వ్యక్తిగతంగా వ్యవహరించడం ఉత్తమం. బైబిలు ఇలా చెబుతుంది: “ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకనినొకరు క్షమించుడి.” (ఎఫెసీయులు 4:32) ఈ చక్కని సలహాను అన్వయించుకోవడానికి క్రైస్తవ సమావేశాలు ఎంతటి అపూర్వమైన అవకాశాలను ఇస్తాయి! ఇందుకుగాను, చాలామంది కూటాలకు త్వరగా వచ్చి, అవి అయిపోయిన తర్వాత కూడా అక్కడే కాస్సేపు ఉండిపోతారు. ఇలా చేయడం క్రొత్తగా ఆసక్తి కనబరుస్తున్న వారికి కూడా సహాయకరంగా ఉంటుంది, వారికి తాము ఆహ్వానితులే అన్న భావన కలగాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ విధంగా, ‘ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచించడంద్వారా’ కూటాలు క్షేమాభివృద్ధికరంగా ఉండేలా చేయడంలో సమర్పిత క్రైస్తవులందరూ ఒక పాత్రను కలిగివున్నారు.
చక్కగా సిద్ధపడండి
8. (ఎ) కూటాలకు హాజరుకావడానికి కొంతమంది మెచ్చుకోదగిన ఏ త్యాగాలు చేస్తారు? (బి) ఒక గొఱ్ఱెలకాపరివలె యెహోవా ఎలాంటి మాదిరిని ఉంచుతున్నాడు?
8 కొంతమందికి క్రైస్తవ సమావేశాలకు హాజరుకావడం కాస్త సులభంగానే ఉన్నప్పటికీ, మరికొంతమందికైతే అలా హాజరుకావడానికి ఎడతెగని త్యాగాలు చేస్తూ పోవాల్సిందే. ఉదాహరణకు, తన కుటుంబ అవసరాలను తీర్చడానికి ఉద్యోగం చేయాల్సివచ్చే క్రైస్తవ తల్లి, ఉద్యోగస్థలాన్నుండి ఇంటికి సాధారణంగా చాలా అలసిపోయి వస్తుంది. వచ్చిన తర్వాత బహుశ ఆమే వంటచేసి, కూటాలకు సిద్ధపడడానికి తన పిల్లలకు సహాయం చేయాల్సి ఉంటుంది. ఇతర క్రైస్తవులు కూటాలకు రావడానికి బహుశ ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉంటుండవచ్చు, లేక అనారోగ్యాన్నిబట్టో లేక వృద్ధాప్యం మూలంగానో వారి హాజరు పరిమితమై ఉండవచ్చు. తన మందలోని ప్రతి గొఱ్ఱెకున్న ప్రత్యేక అవసరతలను ఒక ప్రేమపూర్వకమైన గొఱ్ఱెలకాపరి అర్థం చేసుకుంటున్నట్లే, కూటాలకు హాజరయ్యే ప్రతీ ఒక్క విశ్వాసి పరిస్థితినీ యెహోవా దేవుడు నిశ్చయంగా అర్థం చేసుకుంటాడు. “గొఱ్ఱెలకాపరివలె [యెహోవా] తన మందను మేపును. తన బాహువుతో గొఱ్ఱెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును” అని బైబిలు చెబుతుంది.—యెషయా 40:11.
9, 10. మనం కూటాలనుండి అత్యంత ఎక్కువ ప్రయోజనాన్ని ఎలా పొందవచ్చు?
9 కూటాలకు క్రమంగా హాజరు కావడానికి గొప్ప త్యాగాలు చేయాల్సివచ్చే వారు, అక్కడ పరిశీలించబోయే సమాచారాన్ని సిద్ధపడడానికి వెచ్చించగల్గే సమయం పరిమితంగా ఉంటుండవచ్చు. బైబిలును చదవడానికి మనకున్న వారపు పట్టికను పాటించడం మనం దైవపరిపాలనా పరిచర్య పాఠశాలకు హాజరుకావడాన్ని మరింత ప్రతిఫలదాయకం చేస్తుంది. అదేవిధంగా, కావలికోట పఠనమూ, సంఘ పుస్తక పఠనమూ వంటి ఇతర కూటాలకు ముందుగానే సిద్ధపడడం ఆ కూటాలను మరింత ప్రయోజనకరంగా చేస్తుంది. కుటుంబ బాధ్యతలకు సమయాన్ని వెచ్చించాల్సివచ్చేవారు, పఠించబోయే సమాచారాన్ని ముందుగానే చదవడంద్వారా, ఎత్తివ్రాయబడని లేఖనాల్లో కనీసం కొన్నింటినైనా పరిశీలించడంద్వారా ఈ ప్రాముఖ్యమైన బైబిలు చర్చల్లో అర్థవంతమైన భాగాన్ని కలిగివుండేందుకు మరింత సంసిద్ధంగా ఉంటారు.
10 కాస్తంత వెసులుబాటుగా ఉండి, సమయాన్ని వెచ్చించగల్గే పరిస్థితులుగల ఇతరులు కూటాలకు సిద్ధపడడంలో మరింత సమయాన్ని గడపవచ్చు. ఉదాహరణకు, వారు ఎత్తివ్రాయబడక, కేవలం ఉల్లేఖించబడి ఉన్న లేఖనాలపై పరిశోధన చేయవచ్చు. ఆ విధంగా కూటాలనుండి అత్యంత ఎక్కువ ప్రయోజనం పొందేలా అందరూ సిద్ధపడవచ్చు, తమ ప్రసంగాలద్వారా తమ వ్యాఖ్యానాలద్వారా సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగించడంలో ఒక చక్కని భాగం కలిగివుండవచ్చు. చక్కగా సిద్ధపడడంద్వారా పెద్దలూ, పరిచర్య సేవకులూ క్లుప్తమైన, సంక్షిప్తమైన జవాబులు ఇవ్వడంలో ఒక చక్కని మాదిరిని ఉంచుతారు. యెహోవా అందించే ఏర్పాట్లపట్ల గౌరవంతో, హాజరైనవారు కూటాలు జరుగుతున్న సమయంలో అవధానాన్ని ప్రక్కకు మళ్లించే పనులు చేయడాన్ని నివారిస్తారు.—1 పేతురు 5:3.
11. కూటాలకు సిద్ధపడి ఉండడానికి స్వయం-క్రమశిక్షణ ఎందుకు అవసరం?
11 మన ఆధ్యాత్మిక ఆరోగ్యానికి కీలకంకాని కార్యకలాపాలూ, వినోదవేడుకలూ మన సమయంలో చాలాభాగాన్ని తినేస్తుండవచ్చు. ఆలాగైతే, మనల్ని మనం పరీక్షించుకుని, మనం సమయాన్ని ఉపయోగించే పద్ధతిలో “అవివేకులు”గా ఉండడాన్ని మానుకోవాలి. (ఎఫెసీయులు 5:17) వ్యక్తిగత బైబిలు పఠనంలో, కూటాల సిద్ధపాటులో, అలాగే రాజ్య సేవలో మరింత ఎక్కువ సమయాన్ని వెచ్చించగల్గేలా, తక్కువ ప్రాముఖ్యమైన విషయాలకు ‘సమయాన్ని పోనివ్వక, సద్వినియోగం’ చేసుకోవడమే మన లక్ష్యమైవుండాలి. (ఎఫెసీయులు 5:15, 16) ఇది అన్ని వేళలా అంత సులభమైన విషయమేమీ కాదనీ, ఇందుకు స్వయం-క్రమశిక్షణ అవసరమనీ ఒప్పుకోవాల్సిందే. తమ సమయాన్ని జ్ఞానయుక్తమైన రీతిలో ఉపయోగించుకునే యౌవనులు భవిష్యద్ పురోభివృద్ధికి ఒక శ్రేష్ఠమైన పునాదిని కట్టుకుంటున్నారు. తన యౌవన సహచరుడైన తిమోతికి పౌలు ఇలా వ్రాశాడు: “నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని [పౌలు తిమోతికిచ్చిన సలహాలు] మనస్కరించుము, వీటియందే సాధకము చేసికొనుము.”—1 తిమోతి 4:15.
దేవుని వాక్యంలోని మాదిరులు
12. సమూయేలు కుటుంబం ఎటువంటి విశిష్టమైన మాదిరిని ఉంచింది?
12 సమూయేలు కుటుంబం ఉంచిన మంచి మాదిరిని పరిశీలించండి. దేవుని గుడారము షిలోహులో ఉన్నప్పుడు తోటి విశ్వాసులతో సమావేశమవ్వడానికి చేసిన ఏర్పాట్లలో ఈ కుటుంబం క్రమంగా పాల్గొంది. పండుగల ఆచరణలకు ప్రతి సంవత్సరం పురుషులు తప్పక హాజరుకావల్సి ఉంది. కానీ సమూయేలు తండ్రి ఎల్కానా తన కుటుంబమంతటినీ తీసుకుని, “షిలోహునందున్న సైన్యముల కధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేట తన పట్టణము విడిచి” వెళ్లేవాడు. (1 సమూయేలు 1:3-5) సమూయేలు స్వంత పట్టణమైన రామతయిమ్సోఫీము, “ఎఫ్రాయిము మన్యమందు” ఉన్న పర్వతశ్రేణిలోని ఆధునిక దిన రెంటిస్‌వద్ద బహుశ తీర ప్రాంతానికి సమీపంలో ఉండవచ్చు. (1 సమూయేలు 1:1) అందుకని షిలోహుకు ప్రయాణించడానికి దాదాపు 30 కిలోమీటర్లు ప్రయాణించాల్సివచ్చేది, ఆ రోజుల్లోనైతే ఇది ప్రయాసతో కూడినదే. “ఏటేట . . . యెహోవా మందిరమునకు పోవునపుడెల్ల” ఎల్కానా కుటుంబం నమ్మకంగా చేసినదదే.—1 సమూయేలు 1:7.
13. యేసు భూమిపైనున్న కాలంలో విశ్వసనీయులైన యూదులు ఎటువంటి మాదిరిని ఉంచారు?
13 యేసు కూడా ఒక పెద్ద కుటుంబంలో పెరిగి పెద్దయ్యాడు. ప్రతి సంవత్సరం ఆ కుటుంబం యెరూషలేములో పస్కా పండుగకు హాజరుకావడానికి నజరేతు నుండి దక్షిణదిక్కుగా దాదాపు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించేది. వారు ప్రయాణించడానికి వీలయ్యే మార్గాలు రెండు ఉన్నాయి. మెగిద్దో లోయలోనికి దిగి తర్వాత సమరయ ప్రాంతంగుండా దాదాపు 600 మీటర్ల ఎగువగా ప్రయాణించి మరలా యెరూషలేముకు చేరుకోవడం తిన్నగా ఉండే ఒక మార్గం. మరొక ప్రసిద్ధమైన మార్గం ఏదంటే, సా.శ. 33లో యెరూషలేముకు తాను చేసిన చివరి ప్రయాణానికి యేసు ఎంపిక చేసుకున్న మార్గం. ఈ మార్గంలో ప్రయాణించాలంటే, “యూదయ ప్రాంతములకును యొర్దాను అద్దరికిని” చేరుకునేంత వరకు సముద్ర మట్టానికి దిగువగా ఆయన యొర్దాను లోయలోనికి నడవాలి. (మార్కు 10:1) ఇక్కడినుండి “యెరూషలేమునకు వెళ్లే మార్గం” దాదాపు 30 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో 1,100 మీటర్లకుపైగా ఎగువకు ప్రయాణించడం చేరివుంది. (మార్కు 10:32) క్రమంగా, పండుగను విశ్వసనీయంగా ఆచరించే ప్రజలు గలిలయ నుండి యెరూషలేముకు ప్రయాసతో కూడిన ప్రయాణాన్ని చేసేవారు. (లూకా 2:44) ఆధునిక ప్రయాణ మాధ్యమాల మూలంగా క్రైస్తవ సమావేశాలకు చాలా సులభంగా హాజరుకాగలిగే ధనిక దేశాల్లోని నేటి యెహోవా సేవకుల్లో అనేకమందికి ఇది ఎంత చక్కని మాదిరి!
14, 15. (ఎ) అన్న ఎటువంటి మాదిరిని ఉంచింది? (బి) క్రొత్తగా కూటాలకు హాజరౌతున్న కొందరు ప్రదర్శించే చక్కటి వైఖరి నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
14 మరొక ఉదాహరణ, 84 ఏండ్ల విధవరాలైన అన్న. ఆమె “దేవాలయము విడువక” సేవచేసేదని బైబిలు చెబుతుంది. (లూకా 2:37) అంతేగాక, అన్న ఇతరుల విషయంలో ప్రేమపూర్వకమైన శ్రద్ధను కనపర్చేది. శిశువుగా ఉన్న యేసును చూసి, ఆ శిశువు వాగ్దానం చేయబడిన మెస్సీయా అని తెలుసుకున్నప్పుడు ఆమె ఏమి చేసింది? ఆమె దేవునికి కృతజ్ఞతలు తెలిపి, “యెరూషలేములో విమోచనకొరకు కనిపెట్టుచున్నవారందరితో [ఆ బిడ్డను] గూర్చి మాటలాడుచుండెను.” (లూకా 2:38) ఎంత చక్కటి వైఖరి, నేటి క్రైస్తవులకు ఒక మాదిరి!
15 అవును, అన్నకువలె, మనం కూటాలకు హాజరై వాటిలో పాల్గొనడమనేది ఎంత ఆహ్లాదకరంగా ఉండాలంటే, మనం ఎన్నడూ వాటిని మానివేయాలని కోరుకోకూడదు. చాలామంది క్రొత్తవారు ఇలాగే కూటాలపట్ల మెప్పుదలను కనపరుస్తారు. అంధకారం నుండి దేవుని అద్భుతమైన వెలుగులోనికి వచ్చినందున, వారు తాము నేర్చుకోగల్గినంత మేరకు నేర్చుకోవాలని కోరుకుంటారు, చాలామంది క్రైస్తవ కూటాలంటే గొప్ప ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తారు. మరోవైపు, సత్యంలో ఎంతోకాలం నుండి ఉన్నవారు ‘మొదట తమకున్న ప్రేమను వదలిపెట్టకుండా’ జాగ్రత్తగా ఉండాలి. (ప్రకటన 2:4) గంభీరమైన ఆరోగ్య సమస్యలు లేక ఒకరి స్వాధీనంలోలేని ఇతర కారకాలు అప్పుడప్పుడు కూటాలకు హాజరు కావడాన్ని పరిమితం చేయవచ్చు. కానీ భౌతికవాదం, వినోదం, లేక ఆసక్తి లేకపోవడం వంటివి మనం కూటాలకు సిద్ధపడకుండా, ఉదాసీనంగా, లేక క్రమంగా హాజరుకానివారిగా తయారయ్యేలా చేయడానికి అనుమతించకూడదు.—లూకా 8:14.
అత్యంత శ్రేష్ఠమైన మాదిరి
16, 17. (ఎ) ఆధ్యాత్మిక సమావేశాలపట్ల యేసుకు ఎలాంటి వైఖరి ఉంది? (బి) క్రైస్తవులందరూ ఏ మంచి అలవాటును పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి?
16 ఆధ్యాత్మిక సమావేశాలపట్ల మెప్పుదలను చూపించడంలో యేసు ఒక విశిష్టమైన మాదిరిని ఉంచాడు. 12 ఏండ్ల యుక్తవయస్సులో, ఆయన యెరూషలేములో ఉన్న దేవుని గృహంపట్ల తనకున్న ప్రేమను ప్రదర్శించాడు. ఆయన తలిదండ్రులు ఆయనెక్కడున్నాడో కనుగొనలేకపోయారు, చివరికి దేవాలయంలో బోధకులతో దేవుని వాక్యాన్ని ఆయన చర్చిస్తుండగా ఆయన్ను కనుగొన్నారు. తన తలిదండ్రులు చింతను కనుపర్చినప్పుడు యేసు గౌరవపూర్వకంగా ఇలా అడిగాడు: “నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరా?” (లూకా 2:49) విధేయతాపూర్వకంగా యౌవనుడైన యేసు తన తలిదండ్రులతో నజరేతుకు తిరిగివచ్చాడు. అక్కడాయన సమాజమందిరానికి క్రమంగా హాజరవుతూ ఆరాధన కొరకైన కూటాలపట్ల తన ప్రేమను ప్రదర్శించడంలో కొనసాగాడు. అందుకనే, ఆయన తన పరిచర్యను ప్రారంభించినప్పుడు బైబిలు ఇలా నివేదిస్తుంది: “ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక [“అలవాటు,” NW] చొప్పున విశ్రాంతిదినమందు సమాజమందిరము లోనికి వెళ్లి, చదువుటకై నిలు[చుండెను].” (ఇటాలిక్కులు మావి.) యేసు యెషయా 61:1, 2 వచనాలను చదివి, వాటి భావాన్ని వివరించిన తర్వాత, అక్కడున్నవారందరు ‘ఆయన నోటనుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు.’—లూకా 4:16, 22.
17 నేడు క్రైస్తవ కూటాలు అదే ప్రాథమిక నమూనాను అనుసరిస్తాయి. కూటాలను స్తుతికీర్తనతోనూ, ప్రార్థనతోనూ ప్రారంభించిన తర్వాత బైబిలులోని (లేక బైబిలు పఠన సమాచారంలో ఎత్తివ్రాయబడిన) వచనాలను చదివి వాటిని వివరించడం జరుగుతుంది. యేసుక్రీస్తు ఎలాగైతే అలవాటు చొప్పున హాజరయ్యాడో అలాగే ఆ విషయంలో ఆయనను అనుకరించే బాధ్యత నిజ క్రైస్తవులకు ఉంది. వారు తమ పరిస్థితులు అనుమతించినంత మేరకు క్రైస్తవ సమావేశాలకు క్రమంగా హాజరుకావడంలో ఆహ్లాదాన్ని అనుభవిస్తారు.
ఆధునిక దిన మాదిరులు
18, 19. కూటాలపట్లా, సభలపట్లా, సమావేశాలపట్లా అంతగా ధనికంకాని దేశాల్లోని సహోదరులు ఎటువంటి శ్రేష్ఠమైన మాదిరులను ఉంచారు?
18 అంత ధనికంకాని దేశాల్లో, మన సహోదర సహోదరీల్లో చాలామంది క్రైస్తవ సమావేశాలపట్ల మెప్పుదలను ప్రదర్శించడంలో ఒక చక్కని మాదిరిని ఉంచారు. మొజాంబిక్‌లో, ఒక జిల్లా కాపరి అయిన ఓర్లాండో, ఆయన భార్యయైన అమేల్యా ఒక సమావేశంలోని నియామకాల్ని నిర్వర్తించేందుకు ఒక ఎత్తైన పర్వతం మీదుగా దాదాపు 45 గంటలపాటు 90 కిలోమీటర్లు నడిచి వెళ్లారు. తర్వాత వారు అదే దారిన వెనక్కి వచ్చి తర్వాతి సమావేశంలో నియామకాలను పూర్తిచేయవల్సివచ్చింది. ఓర్లాండో వినయపూర్వకంగా ఇలా నివేదించాడు: “బావా సంఘంలోని సహోదరులతో పోల్చుకుంటే మేము చేసింది ఏమంత గొప్ప పనేమీ కాదని మేం భావించాము. వారు సమావేశానికి హాజరై తమ తమ గృహాలకు చేరుకోవడానికి కాలినడకన ఆరు రోజులపాటు 400 కిలోమీటర్లు ప్రయాణించాలి, వారిలో ఒక సహోదరునికి 60 ఏండ్లు!”
19 ప్రతివారం జరిగే సంఘ కూటాలపట్ల చూపాల్సిన మెప్పుదల విషయం ఏమిటి? కాష్వాష్వా నజాంబా అనే పేరుగల ఒక సహోదరి 70వ పడిలో ఉంది, ఆమె చాలా బలహీనురాలు. ఆమె నమీబియాలోవున్న రుండులోని రాజ్యమందిరానికి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కైసోసోసి అనే ఒక చిన్న గ్రామంలో నివసిస్తుంది. కూటాలకు హాజరై తిరిగిరావడానికి ఆమె అరణ్యమార్గంగుండా మొత్తం పది కిలోమీటర్లు నడుస్తుంది. ఆ మార్గంలో ఇతరులు దొంగలబారిన పడ్డారు, కానీ కాష్వాష్వా మాత్రం కూటాలకు వస్తూనే ఉంది. కూటాల్లో చాలాభాగం తనకు అర్థంకాని భాషలో నిర్వహించబడతాయి. మరి ఆమె కూటాలకు హాజరుకావడం నుండి ఎలా ప్రయోజనం పొందుతుంది? “లేఖనాలు చెప్పినప్పుడు నేను శ్రద్ధగా గ్రహించడంద్వారా ఆ ప్రసంగం ఏ విషయంపైనో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను” అని అంటుంది కాష్వాష్వా. కానీ ఆమెకు చదువురాదు, మరి లేఖనాలను ఎలా గ్రహిస్తుంది? “నాకు కంఠతా వచ్చిన లేఖనాలు చెబుతున్నప్పుడు నేను జాగ్రత్తగా అవధానాన్ని నిలుపుతాను” అని ఆమె జవాబిస్తోంది. సంవత్సరాలు గడిచేకొలది ఆమె తన మనస్సులో చాలానే లేఖనాలను నిలుపుకుంది. బైబిలును ఉపయోగించడంలో తన సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి ఆమె సంఘంచే ఏర్పాటు చేయబడిన ఒక అక్షరాస్యతా తరగతికి హాజరయ్యింది. “కూటాలకు హాజరుకావడమంటే నాకెంతో ఇష్టం” అని ఆమె అంటుంది. “నేర్చుకోవడానికి ఎప్పుడూ క్రొత్త విషయాలు ఉంటాయి. సహోదరీ సహోదరులతో సహవసించడానికి నేను ఉవ్విళ్లూరుతుంటాను. నేను వాళ్లందరితో మాట్లాడలేకపోయినా, వారు వచ్చి నన్ను పలకరిస్తుంటారు. అన్నింటికన్నా ప్రాముఖ్యంగా, నేను కూటాలకు హాజరుకావడం ద్వారా యెహోవా హృదయాన్ని సంతోషపరుస్తున్నానని నాకు తెలుసు.”
20. క్రైస్తవ సమావేశాలకు హాజరుకావడాన్ని మనం ఎందుకు మానుకోకూడదు?
20 కాష్వాష్వావలెనే భూవ్యాప్తంగా లక్షలాదిమంది యెహోవా ఆరాధికులు క్రైస్తవ కూటాలపట్ల అపూర్వమైన రీతిలో మెప్పుదలను ప్రదర్శిస్తున్నారు. సాతాను లోకం నాశనంవైపుకి పరిగెడుతుండగా, మనందరం ఒకటిగా సమావేశం కావడాన్ని మానుకునే సాహసం చేయకూడదు. బదులుగా, మనం ఆధ్యాత్మికంగా మెలకువగా ఉంటూ, కూటాలపట్లా, సభలపట్లా, సమావేశాలపట్లా ప్రగాఢమైన మెప్పుదలను ప్రదర్శిద్దాము. అలా చేయడంద్వారా యెహోవా హృదయాన్ని సంతోషపర్చడం మాత్రమే కాక, నిత్యజీవానికి నడిపించే దైవిక బోధనుండి మనం కూడా గొప్పగా ప్రయోజనం పొందుతాము.—సామెతలు 27:11; యెషయా 48:17, 18; మార్కు 13:35-37.
పునస్సమీక్షా ప్రశ్నలు
◻ క్రైస్తవ సమావేశాలకు హాజరుకావడం ఎందుకు ఒక ఆధిక్యత?
◻ కూటాలు క్షేమాభివృద్ధికరంగా ఉండేందుకు హాజరైన ప్రతి ఒక్కరూ ఎలా దోహదపడవచ్చు?
◻ యేసుక్రీస్తు ఎటువంటి విశిష్టమైన మాదిరిని ఉంచాడు?
◻ అంతగా ధనికంకాని దేశాల్లోని సహోదరులనుండి మనమే పాఠాన్ని నేర్చుకోవచ్చు?
[17వ పేజీలోని బాక్సు]
ప్రతివారం జరిగే కూటాలను వారు మెచ్చుకుంటున్నారు
బీదరికమూ, నేరమూ వంటివి పట్టిపీడిస్తున్న నగరాల్లో కోట్లాదిమంది ప్రజలు నివసిస్తున్నారు. అటువంటి పరిస్థితులు ఉన్నా, వారి మధ్య జీవిస్తున్న నిజ క్రైస్తవులు క్రైస్తవ కూటాలపట్ల ప్రశంసనీయమైన మెప్పుదలను కనపరుస్తున్నారు. దక్షిణ ఆఫ్రికాలో కావుటెంగ్‌లోవున్న సొవీటోలోని ఒక సంఘంలో సేవచేస్తున్న ఒక పెద్ద ఇలా నివేదిస్తున్నాడు: “60 మంది సాక్షులూ, బాప్తిస్మంపొందని ప్రచారకులూ ఉన్న ఒక సంఘంలో, కూటాలకు దాదాపు 70 నుండి 80 మంది హాజరౌతారు, కొన్నిసార్లు అంతకన్నా ఎక్కువే. కూటాలకు హాజరుకావడానికి సహోదర సహోదరీలు చాలా దూరాలు ప్రయాణించనవసరం లేకపోయినప్పటికీ, సొవీటోలోని ఈ ప్రాంత పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి. కూటానికి నడుచుకుంటూ వస్తున్న ఒక బ్రదర్‌ని వీపుమీద కత్తితో పొడిచారు. కనీసం ఇద్దరు సహోదరీలను వారిదగ్గరున్న వాటిని దోచుకుందామనే ఉద్దేశంతో పట్టుకున్నారు. కానీ వారు కూటాలకు హాజరుకావడాన్ని ఇవేమీ ఆపలేదు. ఆదివారాల్లో కూటాన్ని ప్రార్థనతో ముగించిన తర్వాత మేము కొంచెం సేపు పాటల ప్రాక్టీసు చేస్తాము. తర్వాతి వారంలోని కూటాల్లో పాడబోయే పాటలను పాడడానికి కనీసం 95 శాతంమంది క్రమంగా హాజరౌతారు. ఇలా చేయడం క్రొత్తవారు పాటలను నేర్చుకుని మాతోపాటు పాడేలా వారికి సహాయం చేస్తుంది.”
గ్రామాల్లో నివసించేవారికి ఇతర అవరోధాలు ఉన్నాయి, ఉదాహరణకు వారు వారానికి మూడుసార్లు కూటాలకు హాజరుకావడానికి చాలా దూరాలు నడవాల్సి వస్తుంది. బోట్స్‌వానాలో లోబాట్సేలోని రాజ్యమందిరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఆసక్తిగల ఒక జంట నివసిస్తోంది. గత సంవత్సరంగా వారు తమ ఇద్దరు పిల్లలతోసహా కూటాలకు హాజరవుతున్నారు. భర్త కుటుంబాన్ని పోషించడానికి బూట్లు కుడుతుంటాడు. కుటుంబ ఆదాయాన్ని కాస్త పెంచడానికి భార్య చిన్న చిన్న వస్తువులను అమ్ముతుంది, అది కూటాలకు అయ్యే ప్రయాణ ఖర్చులకు పనికి వస్తుంది.
ఈమధ్య వేసవిలో ఒక సాయంకాలంపూట సర్క్యూట్ పైవిచారణకర్తతో జరిగిన మీటింగ్ తర్వాత ఈ కుటుంబం రాత్రి 9 గంటలకు ఒక బస్టాపుకు చేరుకుంది. అక్కడంతా నిర్మానుష్యంగా ఉంది. వాతావరణం బాగుండకపోవడంతో బస్సులు అంతకు ముందే ఆగిపోయాయి. ఒక పోలీసు అధికారి తన వ్యానును ఆపి విషయమేమిటో అడిగాడు. వారి దుస్థితి తెలుసుకున్న తర్వాత వారిపైన జాలిపడి వారి ఇంటివరకూ పదిహేను కిలోమీటర్లు తన వ్యానులో తీసుకెళ్లాడు. బాప్తిస్మంపొందని ప్రచారకురాలైన భార్య తన భర్తతో ఇలా అంది: “చూడండి, మనం కూటాలకు మొదటి స్థానం ఇస్తే యెహోవా ఎల్లప్పుడూ దారిచూపిస్తాడు.” ఇప్పుడు, ఆ భర్త తాను కూడా సువార్త ప్రచారకునిగా కావాలనుకుంటున్నానని తన కోరికను వ్యక్తం చేశాడు.
[18వ పేజీలోని చిత్రం]
రుమేనియాలోని వీరివలే, సాక్షులు క్రైస్తవ సమావేశాలపట్ల మెప్పుదలను కనపర్చడంలో చక్కని మాదిరిని ఉంచుతున్నారు