ఛరిష్మా—మానవునికి స్తుతి లేక దేవునికి మహిమా?
“ఒక పరిపాలకుడు తన ప్రజలకంటే శ్రేష్ఠంగా ఉండటమే కాదు, అతను వారిని సమ్మోహితులను చేయగలగాలి” అని ప్రఖ్యాత గ్రీకు జనరల్ అయిన జెనోఫోన్ వ్రాశాడు. అలాంటి “సమ్మోహనా శక్తి”ని నేడు అనేకులు ఛరిష్మా అంటారు.
మానవ పరిపాలకులకు అందరికీ ఛరిష్మా ఉంటుందనలేము. అయితే దాన్ని కలిగి ఉన్న వారు మాత్రం, ప్రజల భక్తి శ్రద్ధలను చూరగొనేందుకూ స్వలాభం నిమిత్తం ప్రజానీకాన్ని నేర్పుతో ఉపయోగించుకునేందుకూ తమ సామర్థ్యాన్ని వాడుకుంటారు. ఇటీవలి అపఖ్యాతిగల ఉదాహరణ బహుశ అడాల్ఫ్ హిట్లర్ అనే చెప్పవచ్చు. “[1933లో] జర్మనీ ప్రజల్లో అనేకుల అభిప్రాయంలో, నిజమైన ఛరిష్మా ఉన్న నాయకునికుండే తేజస్సును హిట్లర్ కలిగి ఉన్నాడు—లేక త్వరలో పొందబోతున్న వాడు” అని ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద థర్డ్ రైక్ అనే తన పుస్తకంలో విలియమ్ ఎల్. షైరర్ వ్రాస్తున్నాడు. “వారు రాబోయే పన్నెండు పీడాభరిత సంవత్సరాల్లోనూ, అతని మాటే దైవవాక్కు అన్నట్లు అతన్ని గుడ్డిగా అనుసరించనై ఉన్నారు.”
తమ ఎడల భక్తి కలిగి ఉండేందుకు ప్రజలను ప్రేరేపించి, తమ అనుచరులపై వినాశనాన్ని తెచ్చిన ఛరిష్మాగల నాయకులు మత ప్రపంచంలో కూడా కోకొల్లలుగా ఉన్నారు. “ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి—నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు” అని యేసు హెచ్చరించాడు. (మత్తయి 24:4, 5) ఛరిష్మాగల అబద్ధ క్రీస్తులు కనిపించింది కేవలం మొదటి శతాబ్దంలోనే కాదు. 1970లలో, తాను “పీపుల్స్ టెంపుల్ యొక్క మెస్సీయనని” జిమ్ జోన్స్ ప్రకటించుకున్నాడు. “ప్రజలపై విచిత్రమైన శక్తిని కలిగివుండిన ఛరిష్మాగల చర్చిసభ్యుని”గా అతను అభివర్ణించబడ్డాడు, 1978లో అతను చరిత్రలోకెల్లా అతి పెద్ద సామూహిక ఆత్మహత్యాకాండను పురికొల్పాడు.a
ఛరిష్మా అనేది ప్రమాదకరమైన వరముగా కాగలదని ఇది చూపిస్తుంది. అయితే, అందరి ప్రయోజనం నిమిత్తం అందరికీ అందుబాటులో ఉన్న, దేవుని నుండి వచ్చిన మరొక విధమైన వరమును గురించి లేక వరాలను గురించి బైబిలు మాట్లాడుతుంది. ఈ వరానికున్న గ్రీకు పదం ఖరిస్మా, అది బైబిలులో 17 సార్లు ఉపయోగించబడింది. ‘పొందే అర్హతలేకపోయినా అయాచితంగా లభించిన వరము, దాన్ని సంపాదించుకోలేని మరియు దాన్ని పొందే యోగ్యత లేని వ్యక్తికి ఇవ్వబడినది, దేవుని కృపాబాహుళ్యత మూలంగా లభించినది, మరియు ఒక వ్యక్తి యొక్క స్వప్రయత్నం ద్వారా సాధించలేనిది మరియు పొందలేనిది’ అని ఒక గ్రీకు పండితుడు దాన్ని నిర్వచిస్తున్నాడు.
కాబట్టి లేఖనాధార దృక్కోణంలో, ఖరిస్మా అనేది దేవుని కృపాబాహుళ్యత మూలంగా లభించిన వరం. దేవుడు మనకు దయతో ఇచ్చిన వరాల్లో కొన్ని ఏమిటి? ఆయనకు ఘనతను తెచ్చేందుకు మనం వాటిని ఎలా ఉపయోగించగలం? ఈ ఘనమైన వరాల్లో మూడింటిని ఇప్పుడు పరిశీలిద్దాము.
నిత్యజీవము
అన్నిటికంటే గొప్ప వరం నిస్సందేహంగా నిత్యజీవమనే వరమే. రోమా సంఘానికి పౌలు ఇలా వ్రాశాడు: “పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము [ఖరిష్మా] మన ప్రభువైన క్రీస్తుయేసు నందు నిత్యజీవము.” (రోమీయులు 6:23) “జీతము” (మరణం) అనేది మనం సంపాదించుకున్నది అనే విషయం గమనార్హం, మన పాపభరితమైన ప్రవృత్తి ద్వారా అయిష్టంగానే అయినా మనం దాన్ని సంపాదించుకున్నాం. మరో వైపు, దేవుడు అనుగ్రహించే నిత్యజీవం మాత్రం మనం మన స్వంత యోగ్యత మూలంగా ఎన్నడూ సంపాదించుకోలేనిది అంటే మనం దానికి పూర్తిగా అయోగ్యులం అన్నమాట.
నిత్యజీవ వరాన్ని బహుమూల్యంగా ఎంచి దాన్ని ఇతరులతో పంచుకోవాలి. ప్రజలు యెహోవాను తెలుసుకునేందుకూ వారు ఆయన్ను సేవించేందుకూ అలా నిత్యజీవ వరాన్ని పొందేందుకూ మనం వారికి సహాయపడగలం. ప్రకటన 22:17 ఇలా చెబుతుంది: “ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.”
జీవాన్నిచ్చే జలం వైపుకు మనం ఇతరులను ఎలా నడిపించగలం? ముఖ్యంగా మన పరిచర్యలో బైబిలును చక్కగా ప్రభావవంతంగా ఉపయోగించడం ద్వారానే. నిజమే, ప్రపంచంలోని కొన్ని భాగాల్లో ప్రజలు ఆధ్యాత్మిక విషయాలను గురించి చదవరు లేక ఆలోచించరు; అయినప్పటికీ, ఎవరికైనా “విను బుద్ధి” పుట్టించే అవకాశాలు ఎల్లవేళలా ఉంటాయి. (యెషయా 50:4) “దేవుని వాక్యము సజీవమై బలముగలదై” ఉంది గనుక, ఈ విషయంలో బైబిలు యొక్క ప్రేరణాత్మకశక్తి యందు మనం విశ్వాసముంచగలము. (హెబ్రీయులు 4:12) బైబిలందించే ఆచరణాత్మక జ్ఞానమైనా, అది అందించే ఆదరణ మరియు నిరీక్షణ అయినా, లేక జీవిత సంకల్పాన్ని గురించిన దాని వివరణ అయినా, దేవుని వాక్యం హృదయాన్ని స్పృశించి ప్రజలను జీవమార్గంపై నడిపించగలదు.—2 తిమోతి 3:16, 17.
దానికితోడు, బైబిలు ఆధారిత ప్రచురణలు “రమ్ము” అని చెప్పేందుకు మనకు సహాయం చేయగలవు. ఆధ్యాత్మిక అంధకారం అలుముకుని ఉన్న ఈ సమయంలో తన ప్రజలపై ‘యెహోవా ఉదయిస్తాడని’ ప్రవక్తయైన యెషయా ప్రవచించాడు. (యెషయా 60:2) వాచ్ టవర్ సొసైటీ ప్రచురణలు యెహోవా నుండి వచ్చే ఈ దీవెనలను ప్రతిబింబిస్తాయి, ఆధ్యాత్మిక జ్ఞానోదయానికి మూలమైన యెహోవా వైపుకు ప్రతి సంవత్సరం వేలకొలది మంది ప్రజలను అవి నడిపిస్తున్నాయి. వాటి పుటల్లో ఎక్కడా కూడా వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వబడదు. కావలికోట ఉపోద్ఘాతం వివరిస్తున్న విధంగా, “కావలికోట ఉద్దేశము యెహోవా దేవున్ని విశ్వాధిపతిగా ఘనపరచడమే. . . . మానవజాతి నిత్యజీవాన్ని పొందే మార్గాన్ని తెరవడానికై తన రక్తాన్ని చిందించి ఇప్పుడు దేవుని రాజుగా పరిపాలిస్తున్న యేసుక్రీస్తునందు విశ్వాసాన్నిది ప్రోత్సహిస్తోంది.”
తన పరిచర్యలో అనేక సంవత్సరాలు ఎంతో ఘననీయమైన విజయాన్ని సాధించిన ఒక పూర్తికాల క్రైస్తవ పరిచారకురాలు, ప్రజలను దేవునికి సన్నిహితులను చేసేందుకు సహాయం చేయడంలో కావలికోట మరియు తేజరిల్లు! యొక్క విలువను గురించి వ్యాఖ్యానిస్తూ, “కావలికోట మరియు తేజరిల్లు!లను నా బైబిలు విద్యార్థులు చదవడం ప్రారంభించినప్పుడు వాళ్లు త్వరితగతిన అభివృద్ధి సాధిస్తారు. ప్రజలు యెహోవాను గురించి తెలుసుకునేందుకు వారికి సహాయం చేయడంలో అవి ఎంతో విలువైన సహాయకమని నేను ఆ పత్రికలను దృష్టిస్తాను.”
సేవాధిక్యతలు
ప్రత్యేక అవధానం పొందదగిన మరొక వరాన్ని పొందిన ఒక క్రైస్తవ శిష్యుడు తిమోతి. అపొస్తలుడైన పౌలు ఆయనకిలా చెప్పాడు: “పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచనమూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును [ఖరిస్మా] అలక్ష్యము చేయకుము.” (1 తిమోతి 4:14) ఆ వరము ఏమిటి? ప్రయాణ పైవిచారణకర్తగా తిమోతి యొక్క నియామకం అందులో ఇమిడివుంది, ఆయన బాధ్యతాయుతంగా శ్రద్ధ వహించవలసిన ఒక సేవాధిక్యత అది. అదే వాక్యభాగంలో, పౌలు తిమోతిని ఇలా ప్రేరేపించాడు: “చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. నిన్నుగూర్చియు నీ బోధనుగూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు.”—1 తిమోతి 4:13, 16.
పెద్దలు కూడా నేడు తమ సేవాధిక్యతలను అమూల్యమైనవిగా దృష్టించాల్సి ఉంది. పౌలు పేర్కొన్న విధంగా, ‘తమ బోధనుగూర్చి జాగ్రత్త కలిగివుండటం’ వారలా చేసేందుకు గల ఒక మార్గం. ఛరిష్మాగల ప్రాపంచిక నాయకులను అనుకరించే బదులు, వారు తమ వైపుకు కాక దేవుని వైపుకు అవధానాన్ని నడిపిస్తారు. వారి మాదిరికర్తయైన యేసు, నిస్సందేహంగా అయస్కాతంలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న గొప్ప బోధకుడు, అయినప్పటికీ ఆయన వినయస్వభావంతో తన తండ్రికి మహిమను చెల్లించాడు. “నేను చేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే” అని ఆయన ప్రకటించాడు.—యోహాను 5:41; 7:16.
తన బోధలకు అధికారిక మూలంగా దేవుని వాక్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా యేసు తన పరలోక తండ్రిని మహిమపరచాడు. (మత్తయి 19:4-6; 22:31, 32, 37-40) పైవిచారణకర్తలు ‘ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొన’ వలసిన అవసరతను గురించి పౌలు అదే విధంగా నొక్కి చెప్పాడు. (తీతు 1:9) తమ ప్రసంగాలను లేఖనాలపై దృఢంగా ఆధారితం చేసుకోవడం ద్వారా వారు కూడా, “నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుట లేదు” అని పలికిన యేసు వలె చెప్పగలరు.—యోహాను 14:10.
పెద్దలు ‘నమ్మదగిన బోధను’ ఎలా ‘గట్టిగా చేపట్ట’ గలరు? తమ ప్రసంగాలనూ, కూటాల నియామకాలనూ దేవుని వాక్యంపై కేంద్రీకరించడం ద్వారా, వారు ఉపయోగించే లేఖనాలను వివరించి వాటిని నొక్కి చెప్పడం ద్వారా వారలా చేయగలరు. నాటకీయమైన ఉపమానాలను లేక ఆశ్చర్యకరమైన కథలను ప్రాముఖ్యంగా ఎక్కువగా ఉపయోగించడం ద్వారా ప్రేక్షకుల అవధానాన్ని దేవుని వాక్యం నుండి ప్రక్కకు తీసుకెళ్లవచ్చు, ప్రసంగీకుని వ్యక్తిగత సామర్థ్యాల వైపుకు మరలించవచ్చు. బైబిలు యొక్క లేఖనాలు, మరో వైపు హృదయాలను చేరుకుని ప్రేక్షకులను ప్రేరేపించగలవు. (కీర్తన 19:7-9; 119:40; పోల్చండి లూకా 24:32.) అలాంటి ప్రసంగాలు మనుష్యులకు తక్కువ అవధానాన్ని ఇచ్చి దేవునికి ఎక్కువ ఘనతను తెస్తాయి.
పెద్దలు మరింత ప్రభావవంతమైన బోధకులవ్వగల మరొక మార్గం ఒకరి నుండి మరొకరు నేర్చుకోవడమే. పౌలు తిమోతికి సహాయం చేసిన విధంగా, ఒక పెద్ద మరొకతనికి మద్దతు నివ్వగలడు. “ఇనుముచేత ఇనుము పదునగును. అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును.” (సామెతలు 27:17; ఫిలిప్పీయులు 2:3) పెద్దలు ఆలోచనలను మరియు సలహాలను పంచుకోవడం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఇటీవలనే నియుక్తుడైన ఒక పెద్ద ఇలా వివరిస్తున్నాడు: “అనుభవం గల ఒక పెద్ద తాను బహిరంగ ప్రసంగాన్ని ఎలా సిద్ధం చేస్తాడో నాకు చూపించేందుకు సమయాన్ని వెచ్చించాడు. తాను సిద్ధం చేసిన సమాచారంలో ఆయన అలంకారిక ప్రశ్నలను, ఉపమానాలనూ, ఉదాహరణలను, లేక క్లుప్త అనుభవాలను అలాగే తాను జాగ్రత్తగా పరిశోధించిన లేఖన సముదాయాలనూ ఆయన అందులో ఇమిడ్చాడు. నిరాసక్తంగా ఉండే మూస విధానపు ప్రసంగాన్ని నివారించేందుకు నా ప్రసంగాల్లో వైవిధ్యాన్ని ఎలా నింపాలో నేను ఆయన నుండి నేర్చుకున్నాను.”
సేవాధిక్యతలు గల మనమందరమూ, అంటే పెద్దలమైనా, పరిచర్య సేవకులమైనా లేక పయినీర్లమైనా మనం మన వరాన్ని బహుమూల్యంగా ఎంచాల్సిన అవసరం ఉంది. తన మరణానికి కొంతకాలం ముందు, “నీకు కలిగిన దేవుని కృపావరము [ఖరిస్మా] ప్రజ్వలింప చేయవలెనని” పౌలు తిమోతికి జ్ఞాపకం చేశాడు, అది తిమోతి విషయంలో ఆత్మ యొక్క ఏదో ప్రత్యేకమైన వరమై వుంది. (2 తిమోతి 1:6) ఇశ్రాయేలీయుల గృహాల్లో, మంట తరచూ ఎర్రని నిప్పుల రూపంలోనే ఉండేది. మంటలను లేక మరింత వేడిని పుట్టించేందుకు వాటిని ‘ప్రజ్వలింపజేయడం’ సాధ్యమయ్యేది. అలా మనం మన నియామకంలో పూర్తిగా నిమగ్నమై పోవాలని, మనకు ఇవ్వబడిన ఆధ్యాత్మిక వరం ఏదైనా దాన్ని మంటల వలె ప్రజ్వలింపజేయాలని మనం ప్రోత్సహించబడుతున్నాము.
పంచుకోవలసిన ఆధ్యాత్మిక వరాలు
రోమునందలి తన సహోదరుల ఎడల పౌలు కలిగి ఉన్న ప్రేమ, ఇలా వ్రాసేందుకు ఆయనను పురికొల్పింది: “మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగియున్న విశ్వాసముచేత, అనగా మనము ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణ పొందవలెనని ఆత్మసంబంధమైన కృపావరమేదైనను [ఖరిస్మా] మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను.” (రోమీయులు 1:11, 12) మన మాటల ద్వారా ఇతరుల విశ్వాసాన్ని దృఢపర్చగల మన సామర్థ్యాన్ని పౌలు ఆధ్యాత్మిక వరంగా దృష్టించాడు. అలాంటి ఆధ్యాత్మిక వరాలను ఇచ్చిపుచ్చుకోవడం అనేది విశ్వాసానికి మద్దతును చేకూర్చుకోవడానికీ మరియు పరస్పర ప్రోత్సాహానికీ దారి తీయగలవు.
మరి ఇది తప్పకుండా అవసరం. మనం జీవిస్తున్న ఈ దుష్ట విధానంలో, మనం ఏదో ఒక విధంగా ఒత్తిడిని అనుభవిస్తాం. అయితే పరస్పరం ప్రోత్సహించుకోవడం మనం ముందుకు కొనసాగేందుకు మనకు సహాయం చేయవచ్చు. పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం అనే భావన—అంటే ఇవ్వడమూ మరియు తీసుకోవడమూ కూడా—ఆధ్యాత్మిక శక్తిని నిలుపుకునేందుకు ఎంతో ప్రాముఖ్యం. నిజమే, మనందరికీ అప్పుడప్పుడూ ప్రోత్సాహం అవసరం, అయితే మనందరం కూడా ఒకరినొకరం దృఢపర్చుకోగలం.
కృంగిపోయివున్న తోటి విశ్వాసులను గుర్తించేందుకు మనం అప్రమత్తంగా ఉంటే, ‘దేవుడు మనలను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు’ మనం సమర్థులం కాగలము. (2 కొరింథీయులు 1:3-5) ఆదరణకు గల గ్రీకు పదం (పారాక్లెసిస్) అక్షరార్థంగా “ఒకరి ప్రక్కన ఉండడానికి పిలవడం” అనే భావాన్ని కలిగి ఉంది. అది అవసరమైనప్పుడు, మనం మన సహోదరునికి లేక సహోదరికి చేదోడు వాదోడుగా ఉంటూ వారి ప్రక్కనే ఉంటే, నిస్సందేహంగా మనకు అది అవసరమైనప్పుడు మనం కూడా అదే విధమైన ప్రేమపూర్వక మద్దతును అందుకుంటాము.—ప్రసంగి 4:9, 10; పోల్చండి అపొస్తలుల కార్యములు 9:36-41.
మన పెద్దల ప్రేమపూర్వక కాపరి సందర్శనాలు కూడా ఎంతో ప్రయోజనకరమైనవి. అవధానం అవసరమైన విషయంపై లేఖనాధార సలహాలు ఇచ్చేందుకు అప్పుడప్పుడూ వారు దర్శించినప్పటికీ, అనేక కాపరి సందర్శనాలు ప్రోత్సాహానికీ ‘హృదయములలో ఆదరణపొంద’డానికీ సందర్భాలు. (కొలొస్సయులు 2:1) విశ్వాసాన్ని బలపర్చేవైన అటువంటి సందర్శనాలు పైవిచారణ కర్తలు చేసినప్పుడు, వారు వాస్తవానికి ఆధ్యాత్మిక వరాన్ని ఇస్తున్నారు. పౌలు వలె, ఇటువంటి ప్రత్యేక విధమైన ఇచ్చుట అనేది ప్రతిఫలదాయకంగా ఉందని వారు కనుగొంటారు, మరి తమ సహోదరుల కొరకు వారు ‘మిగుల అపేక్షను’ వృద్ధి చేసుకుంటారు.—రోమీయులు 1:12.
ఈ క్రింది అనుభవాన్ని చెబుతున్న స్పెయిన్‌నందలి ఒక పెద్ద విషయంలో ఇది వాస్తవమైంది: “11 సంవత్సరాల రీకార్డో అనే అబ్బాయికి మీటింగుల్లో మరి సంఘ విషయాల్లో అంతగా ఆసక్తి లేనట్లు కనిపించేది. తమ కుమారుణ్ని దర్శించేందుకు నేను రీకార్డో తలిదండ్రులను అనుమతి అడిగాను, వారు అందుకు ఆనందంగా అంగీకరించారు. వాళ్ల ఇల్లు పర్వతాల్లో ఉండేది, మా ఇంటి నుండి వాళ్ల ఇంటికి వెళ్లేందుకు కారులో ఒక గంట సేపు ప్రయాణించాల్సి ఉంటుంది. అతని ఎడల నేను చూపిన ఆసక్తిని బట్టి రీకార్డో ఎంతో ఆనందించాడు, మరి అతను వెంటనే ప్రతిస్పందనను చూపాడు. అతను త్వరలోనే బాప్తిస్మం పొందని ప్రచారకుడయ్యాడు, సంఘంలోని ఒక ఉత్సాహవంతుడైన సభ్యుడయ్యాడు. ముభావంగా ఉండే వాడు కాస్తా, చాలా ఆనందాన్ని కలిగి ఉండే, మరింత చొరవ తీసుకునే స్వభావి అయ్యాడు. సంఘంలోని అనేకులు, ‘రీకార్డోలో ఎందుకింత మార్పు వచ్చింది?’ అని అన్నారు. వాళ్లు అతన్ని మొదటిసారి గమనించారా అన్నట్లు ఉంది. ఆ ప్రాముఖ్యమైన కాపరి సందర్శనాన్ని గురించి ఆలోచిస్తూ, రీకార్డోకన్నా నేను ఎక్కువ ప్రయోజనాన్ని పొందానని నేను భావిస్తున్నాను. ఆ కుర్రాడు రాజ్యమందిరంలోని ప్రవేశిస్తుంటే అతని ముఖం ఆనందంతో వెలిగిపోతుంటుంది, అతను పరుగెత్తుకుంటూ వచ్చి నన్ను పలకరిస్తాడు. అతని ఆధ్యాత్మిక పురోభివృద్ధిని చూడటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.”
నిస్సందేహంగా, ఇటువంటి కాపరి సందర్శనాలు గొప్పగా ఆశీర్వదించబడ్డాయి. అటువంటి సందర్శనాలు, “నా గొఱ్ఱెలను కాయుమని” యేసు చేసిన విజ్ఞప్తికి అనుగుణంగా ఉన్నాయి. (యోహాను 21:16) అయితే, అలాంటి ఆధ్యాత్మిక వరాలను ఇవ్వగలిగేది కేవలం పెద్దలే కాదు. సంఘంలోని ప్రతి ఒక్కరూ కూడా ప్రేమ చూపేందుకూ సత్కార్యాలు చేసేందుకు ఇతరులను పురికొల్పవచ్చు. (హెబ్రీయులు 10:23, 24) పర్వతాన్ని అధిరోహించే వారు ఒకరితో మరొకరికి తాడును ఎలా కట్టుకుని ఉంటారో మనం కూడా ఆధ్యాత్మిక బంధాలతో కలుపబడి ఉన్నాము. మనం చేసేది మరియు చెప్పేది ఇతరులను తప్పనిసరిగా ప్రభావితం చేస్తుంది. కర్కశమైన మాట లేక కఠినమైన విమర్శ మనలను ఐక్యపరచే బంధాలను బలహీనపర్చవచ్చు. (ఎఫెసీయులు 4:29; యాకోబు 3:8) మరో వైపున, ప్రోత్సాహాన్ని అందించే శ్రేష్ఠమైన మాటలు మరియు ప్రేమపూర్వక మద్దతు తమ సమస్యలను అధిగమించేందుకు మన సహోదరులకు సహాయం చేయగలవు. ఈ విధంగా మనం ఆధ్యాత్మిక వరాల నిత్య విలువను పంచుకొంటుంటాము.—సామెతలు 12:25.
దేవుని మహిమను మరింత ఎక్కువగా ప్రతిబింబించడం
ప్రతి క్రైస్తవునిలో ఛరిష్మా కొద్దో గొప్పో ఉంటుందన్నది స్పష్టమే. మనకు అమూల్యమైన నిత్యజీవ నిరీక్షణ ఇవ్వబడింది. మనం ఒకరితో నొకరం పంచుకోగల ఆధ్యాత్మిక వరాలను కూడా కలిగివున్నాము. సరైన లక్ష్యాల వైపుకు వెళ్లేందుకు ఇతరులను ప్రేరేపించేందుకూ లేక పురికొల్పేందుకు మనం ప్రయత్నించగలం. సేవాధిక్యతల రూపంలో కొందరు అదనపు వరాలను కలిగి ఉన్నారు. ఇవన్నీ కూడా దేవుని కృపాబాహుళ్యతకు నిదర్శనాలు. మనం కలిగి ఉన్న ఎలాంటి వరమైనా అది మనం దేవునినుండి అందుకున్నదే గనుక మనం అతిశయించేందుకు మనకు ఎలాంటి కారణమూ లేదు.—1 కొరింథీయులు 4:7.
క్రైస్తవులముగా, ‘“శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును” ఇచ్చిన యెహోవాకు ఘనతను తెచ్చేందుకు నేను కలిగి ఉన్న ఏ కొద్దిపాటి ఛరిష్మానైనా నేను ఉపయోగిస్తానా? (యాకోబు 1:17) నేను యేసును అనుకరిస్తూ నా సామర్థ్యాలు మరియు పరిస్థితులకు అనుగుణంగా ఇతరులకు నేను పరిచర్య చేస్తానా?’ అని మనలను మనం ప్రశ్నించుకోవడం మనకు ఎంతైనా మంచిది.
ఈ విషయంలో మనకున్న బాధ్యతను అపొస్తలుడైన పేతురు ఇలా సంక్షిప్తంగా చెబుతున్నాడు: “దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, యొక్కొకడు కృపావరము [ఖరిస్మా] పొందిన కొలది యొకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించినయెడల దైవోక్తులను బోధించునట్టు బోధింపవలెను; ఒకడు ఉపచారము చేసినయెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తుద్వారా మహిమపరచబడును.”—1 పేతురు 4:10, 11.
[అధస్సూచి]
a జిమ్ జోన్స్‌తోసహా మొత్తం 913 మంది ప్రజలు మరణించారు.
[23వ పేజీలోని చిత్రసౌజన్యం]
Corbis-Bettmann
UPI/Corbis-Bettmann