కృతజ్ఞతా స్ఫూర్తిని అలవర్చుకోండి
న్యూయార్క్ నగరంలోని ఒక వైద్యుడు విపత్కర పరిస్థితిలో ఉన్న మారీ ప్రాణాలను కాపాడాడు. కాని 50 ఏళ్ల మారీ వైద్యునికి కృతజ్ఞతలూ తెలుపలేదు, తన బిల్లూ చెల్లించలేదు. ఎంతటి కృతఘ్నత!
యేసు ఒకసారి ఒక గ్రామంలోకి ప్రవేశించినప్పుడు భయంకరమైన కుష్ఠు వ్యాధితో బాధపడుతున్న పదిమంది వ్యక్తులను కలిశాడని బైబిలు చెబుతుంది. వాళ్లు పెద్ద స్వరంతో, “యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని” కేకలు వేశారు. “మీరు వెళ్లి, మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని” యేసు వారికి ఆజ్ఞాపించాడు. కుష్టు రోగులు ఆయన చెప్పినదానికి అంగీకరించి వెళుతుండగా దారిలో వాళ్ల ఆరోగ్యం బాగవుతున్నట్లు వాళ్లు గమనించారు.
స్వస్థత పొందిన తొమ్మిదిమంది కుష్టురోగులు తమ దారిన వెళ్లిపోయారు. కాని సమరయుడైన ఒక కుష్టురోగి మాత్రం యేసును కలవడానికి తిరిగి వచ్చాడు. ఈ మునుపటి కుష్టు రోగి దేవుడ్ని స్తుతించి, యేసును కలిసి ఆయన పాదాల మీదపడి, ఆయనకు కృతజ్ఞతలు తెలిపాడు. సమాధానంగా యేసు ఇలా అన్నాడు: “పదిమంది శుద్ధులైరి కారా; ఆ తొమ్మండుగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చినవాడెవడును అగపడలేదా?”—లూకా 17:11-19.
“ఆ తొమ్మండుగురు ఎక్కడ?” అనే ప్రశ్న ద్వారా ఒక ప్రాముఖ్యమైన పాఠం నేర్పబడుతుంది. మారీలాగే తొమ్మిదిమంది కుష్ఠురోగుల్లో గంభీరమైన లోపం ఉంది—వాళ్లు కృతజ్ఞత చూపించలేదు. అలాంటి కృతఘ్నత నేడు చాలా ప్రబలంగా ఉంది. దీనికి కారణమేమిటి?
కృతఘ్నతకు మూల కారణం
కృతఘ్నత ప్రాథమికంగా స్వార్థం నుండి ఉత్పన్నమౌతుంది. మన మొదటి తలిదండ్రులైన ఆదాము హవ్వలనే చూడండి. యెహోవా వారిని దైవిక లక్షణాలతో సృష్టించి, అందమైన తోటగృహం, పరిపూర్ణతగల పరిసరాలు, అర్థవంతమైన సంతృప్తికరమైన పని వంటివాటితో సహా వారి ఆనందానికి అవసరమైనవన్నీ అనుగ్రహించాడు. (ఆదికాండము 1:26-29; 2:16, 17) అయినప్పటికీ, సాతాను వారిని స్వార్థపూరిత కోరికలతో శోధించాడు, ఆ ఒత్తిడికి లొంగిపోయి ఒక జంటగా వాళ్లు అవిధేయత చూపించి, యెహోవా అనుగ్రహాన్ని తిరస్కరించారు.—ఆదికాండము 3:1-5; ప్రకటన 12:9.
తన ప్రత్యేక సొత్తుగా ఉండడానికి దేవుడు ఎన్నుకున్న ప్రాచీన ఇశ్రాయేలు కాలంనాటి ప్రజలను కూడా పరిశీలించండి. సా.శ.పూ. 1513, నీసాను 14 రాత్రి ఇశ్రాయేలీయుల్లోని తలిదండ్రులందరూ ఎంత కృతజ్ఞతగా భావించి ఉండవచ్చు! ఆ విశేషమైన రాత్రి, దేవుని దూత “ఐగుప్తుదేశమందలి . . . తొలి సంతతియంత[టి]” పైకి మరణాన్ని తీసుకువచ్చాడు, కాని సరిగ్గా గుర్తువేయబడిన ఇశ్రాయేలు ఇండ్లను మాత్రం దాటిపోయాడు. (నిర్గమకాండము 12:12, 21-24, 30) ఎర్ర సముద్రం వద్ద ఫరో సైన్యం నుండి తప్పించబడినప్పుడు, కృతజ్ఞత నిండిన హృదయాలతో, ‘మోషేయు ఇశ్రాయేలీయులును యెహోవానుగూర్చి కీర్తన పాడిరి.’—నిర్గమకాండము 14:19-28; 15:1-21.
అయినప్పటికీ, ఐగుప్తును విడిచి వెళ్లిన కొన్ని వారాలకే, ‘ఇశ్రాయేలీయుల సమాజమంతయు సణిగెను.’ ఎంత త్వరగా వాళ్లు కృతఘ్నతా ఉరిలో చిక్కుకున్నారో కదా! వారు తమ దాస్య గృహమైన ఐగుప్తులో “మాంసము వండుకొను కుండలయొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము” తిన్నట్లు ఇప్పుడు తినలేకపోతున్నామని బాధపడిపోయారు. (నిర్గమకాండము 16:1-3) స్పష్టంగా, స్వార్థం కృతజ్ఞతాస్ఫూర్తిని అలవర్చుకోవడాన్ని, చూపించడాన్ని వ్యతిరేకిస్తుంది.
పాపియైన ఆదాము సంతానంగా మానవులందరూ కొంత స్వార్థంతో, కృతఘ్నతా వైఖరితో జన్మిస్తారు. (రోమీయులు 5:12) ఈ ప్రపంచ ప్రజల్లో ప్రస్ఫుటంగా ఉన్న స్వార్థంలో కృతఘ్నత కూడా ఒక భాగమే. మనం పీల్చుకునే గాలిలా, ఆ స్ఫూర్తి అంతటా ఉంది, అది మనపై ప్రభావం చూపుతుంది. (ఎఫెసీయులు 2:1, 2) కాబట్టి మనం కృతజ్ఞతా భావాన్ని అలవర్చుకోవలసిన అవసరం ఉంది. మనమలా ఎలా చేయగలం?
ధ్యానించడం ఆవశ్యకం!
కృతజ్ఞతను ఇలా నిర్వచించవచ్చు, “కృతజ్ఞతా భావం కల్గి ఉండడం; మేలు చేసిన వ్యక్తికి తిరిగి మేలు చేయాలనే వాత్సల్యపూరితమైన, స్నేహపూరితమైన అనుభూతి.” అనుభూతి అనేది యాంత్రికంగా కలిగేది కాదు; అది ఒక వ్యక్తిలో స్వతహాగా ఉత్పన్నమవ్వాలి. కృతజ్ఞత అనేది మంచి మర్యాద చూపించడం కంటే ఎక్కువే; అది హృదయంలో నుండి ఉద్భవించాలి.
మనం హృదయంలో నుండి కృతజ్ఞత కల్గివుండడాన్ని ఎలా నేర్చుకోవచ్చు? మనం భావించేదానికి ఎక్కువమటుకు కారణం మన తలంపుల ఎంపికేనని బైబిలు తెలియజేస్తుంది. (ఎఫెసీయులు 4:22-24) మనం పొందే అనుగ్రహాల గురించి మెప్పుకోలుగా ధ్యానించడంతో కృతజ్ఞతా భావం కల్గివుండడాన్ని నేర్చుకోవడం ప్రారంభమౌతుంది. మానసికారోగ్య రంగంలో పని చేసే డా. వేన్‌డైర్ దానికి అనుగుణ్యంగా ఇలా చెబుతున్నాడు: “మనం ముందు ఒక తలంపును అనుభవించకుండా ఆ అనుభూతిని (భావోద్వేగాన్ని) కల్గివుండలేము.”
ఉదాహరణకు, మన చుట్టూ ఉన్న సృష్టి ఎడల కృతజ్ఞత కల్గివుండడానికి సంబంధించిన విషయాన్ని తీసుకోండి. నిర్మలమైన నిశీధిలో నక్షత్రాలతో నిండివున్న నింగిని చూసినప్పుడు, మీరు అనుభవిస్తున్న దాని గురించి మీరెలా భావిస్తారు? రాజైన దావీదు తనకు కలిగిన ఆశ్చర్యాన్ని ఇలా వ్యక్తం చేశాడు: “నీ చేతిపనియైన నీ ఆకాశమును నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?” నిశ్శబ్ద నిశీధిలో నక్షత్రాలు దావీదుతో మాట్లాడి, ఇలా వ్రాయమని ఆయన్ను పురికొల్పాయి: “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.” నక్షత్రాలతో నిండిన నింగి దావీదు నెందుకంతగా కదిలించింది? ఆయనే ఇలా సమాధానమిస్తున్నాడు: “నీ క్రియలన్నియు ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను.”—కీర్తన 8:3, 4; 19:1; 143:5.
సృష్టి అద్భుతాల గురించి ఆలోచించడం యొక్క విలువను దావీదు కుమారుడైన సొలొమోను కూడా గుణగ్రహించాడు. ఉదాహరణకు, మన భూమికి సేదదీర్చడంలో వర్ష మేఘాలు వహించే పాత్రను గురించి ఆయనిలా వ్రాశాడు: “నదులన్నియు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుటలేదు; నదులు ఎక్కడనుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడు మరలిపోవును.” (ప్రసంగి 1:7) వర్షాలూ, నదులూ భూమిని శుభ్రపర్చిన తర్వాత, వాటిలోని నీరు మహా సముద్రాల్లో నుండి తిరిగి మేఘాల్లోకి చేరుతుంది. ఈ నీటిశుద్ధీకరణ, నీటిపునరావృతం లేకపోతే భూమి ఎలా ఉండివుండేది? ఈ తలంపుల గురించి ధ్యానిస్తూ సొలొమోను ఎంత కృతజ్ఞతాపూర్వకంగా భావించి ఉంటాడో కదా!
కృతజ్ఞతగల వ్యక్తి కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, పరిచయస్థులతో తనకు గల సంబంధాలను విలువైనవిగా ఎంచుతాడు. దయతో కూడిన వారి క్రియలు ఆయన అవధానాన్ని పొందుతాయి. దయతో కూడిన వారి క్రియలను ఆయన మెప్పుదలతో పరిగణించినప్పుడు, ఆయన హృదయం కృతజ్ఞతతో నిండుతుంది.
కృతజ్ఞత వ్యక్తం చేయడం
“థాంక్స్” అన్నది ఎంత చిన్న పదం! అలాంటి పదాన్ని ఉచ్చరించడం ఎంతో సులభం. అలా చేయడానికి అవకాశాలు కూడా కోకొల్లలుగా ఉంటాయి. మన కోసం తలుపు తెరిచి పట్టుకున్న వ్యక్తికి లేదా మనం పడేసుకున్నదేదైనా తీసిచ్చే వ్యక్తికి వాత్సల్యపూర్వకంగా యథార్థంగా థాంక్స్ చెబితే అది అతనికి ఎంత ఉత్తేజకరంగా ఉంటుందో కదా! ఆ మాటను వినడం ఒక దుకాణాదారుడి పనిని లేక హోటల్లో వెయిటర్ పనిని లేక పోస్టుమాన్ పనిని ఎంతో సులభతరం చేసి, మరింత ప్రతిఫలదాయకమైనదిగా చేయగలదు.
దయతో కూడిన క్రియల ఎడల కృతజ్ఞత వ్యక్తపర్చడానికి థాంక్యూ కార్డులను పంపడం అనుకూలమైన పద్ధతి. దుకాణాల్లో లభ్యమయ్యే కార్డుల్లో అనేకం భావాలను అందంగా వ్యక్తం చేస్తాయి. కాని మరింత స్నేహపూర్వకంగా ఉండేలా, మీ స్వంత దస్తూరితో మెప్పుదల మాటలను చేర్చడం ప్రేమపూర్వకమైనదై ఉండదా? కొంతమంది ముద్రిత కార్డును పంపే బదులు వ్యక్తిగతంగా వ్రాసినదాన్ని పంపడానికి ఇష్టపడతారు.—పోల్చండి సామెతలు 25:11.
బహుశా, మన కృతజ్ఞతను అందుకోవడానికి ఎక్కువ అర్హులు మన గృహంలో మనకు సన్నిహితంగా ఉండేవారే కావచ్చు. గుణవతియైన భార్య గురించి బైబిలు ఇలా చెబుతుంది: “ఆమె పెనిమిటి ఆమెను పొగడును.” (సామెతలు 31: 29) భర్త తన భార్య ఎడల వ్యక్తపర్చే హృదయపూర్వకమైన కృతజ్ఞతా వచనాలు ఇంట్లో సమాధాన సంతృప్తులతో కూడిన వాతావరణానికి దోహదపడవా? తన భార్య నుండి వాత్సల్యపూరితమైన మెప్పుతో కూడిన అభినందనను వినడానికి ఇంటికి తిరిగి వచ్చేందుకు భర్త కూడా ఇష్టపడడా? ఈ రోజుల్లో, వివాహం మీద ఒత్తిడులు ఎక్కువవుతున్నాయి, ఒత్తిళ్లు ఎక్కువైనప్పుడు ఉద్రేకాలు పెరుగుతాయి. కృతజ్ఞతగల వ్యక్తి ఖండితంగా ఉండకుండా మన్నించి, క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు.
యౌవనస్థులు కూడా తమ తలిదండ్రుల పట్ల హృదయపూర్వక మెప్పుదలను వ్యక్తపర్చవలసిన అవసరం ఉందని గమనించాలి. నిజమే, తలిదండ్రులు పరిపూర్ణులేమీ కాదు, కాని వాళ్లు మీకు చేసినదాని ఎడల కృతఘ్నత కల్గివుండడానికి అది ఎంతమాత్రం కారణం కారాదు. మీరు పుట్టిననాటి నుండి వాళ్లు మీ పట్ల చూపిన ప్రేమా శ్రద్ధలు వెలపెట్టి కొనగల్గేవి కాదు. వాళ్లు మీకు దేవుని జ్ఞానము గురించి బోధించి ఉంటే, కృతజ్ఞత కల్గివుండడానికి మీకు మరింత కారణం ఉంది.
“కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము” అని కీర్తన 127:3 తెలియజేస్తుంది. కాబట్టి తలిదండ్రులు తమ పిల్లల చిన్న చిన్న తప్పిదాలను బట్టి వారికి చీవాట్లు పెట్టే బదులు వారిని మెచ్చుకునే అవకాశాల కొరకు చూడాలి. (ఎఫెసీయులు 6:4) తమ సంరక్షణలో ఉన్న చిన్నపిల్లలు కృతజ్ఞతాస్ఫూర్తిని అలవర్చుకోవడానికి సహాయం చేసే ఎంతటి ఆధిక్యత వారికుందో కదా!—సామెతలు 29:21 పోల్చండి.
దేవుని ఎడల కృతజ్ఞత
యెహోవా దేవుడు “శ్రేష్ఠమైన ప్రతి యీవియూ సంపూర్ణమైన ప్రతి వరమును” ఇస్తాడు. (యాకోబు 1:17) ప్రత్యేకంగా, జీవమనే బహుమానం ప్రాముఖ్యమైనది, మనం ఒకవేళ జీవాన్ని కోల్పోతే, మనకున్న ప్రతిదీ లేక మనం పథకం వేసుకునే ప్రతిదీ విలువలేనిదౌతుంది. “[యెహోవా దేవుని] యొద్ద జీవపు ఊట కలదు” అని జ్ఞాపకముంచుకోమని లేఖనాలు మనల్ని కోరుతున్నాయి. (కీర్తన 36:5, 7, 9; అపొస్తలుల కార్యములు 17:28) దేవుని ఎడల కృతజ్ఞతాపూర్వకమైన హృదయాన్ని పెంపొందింపజేసుకోవాలంటే, మన శారీరక మరియు ఆధ్యాత్మిక జీవితాలను కాపాడడానికి ఆయన ఉదారంగా అనుగ్రహించే వాటి గురించి మనం ధ్యానించవలసిన అవసరం ఉంది. (కీర్తన 1:1-3; 77:11, 12) అలాంటి దృక్పథం మాటల్లోనూ చేతల్లోనూ మెప్పును కనపర్చడానికి మనల్ని పురికొల్పుతుంది.
దేవుని ఎడల మనకుగల కృతజ్ఞతను వ్యక్తపర్చడానికి ప్రార్థన ఒక స్పష్టమైన మార్గం. కీర్తనకర్తయైన దావీదు ఇలా ప్రకటించాడు: “యెహోవా నా దేవా, నీవు మాయెడల జరిగించిన ఆశ్చర్యక్రియలును మాయెడల నీకున్న తలంపులును బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి. నీకు సాటియైనవాడొకడును లేడు.” (కీర్తన 40:5) మనం కూడా అలాగే పురికొల్పబడుదము గాక.
దావీదు తాను ఇతరులతో మాట్లాడే మాటల ద్వారా కూడా దేవుని ఎడల తన మెప్పును చూపించాలనుకున్నాడు. ఆయనిలా అన్నాడు: “నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుతకార్యములన్నిటిని నేను వివరించెదను.” (కీర్తన 9:1) దేవుని గురించి ఇతరులతో మాట్లాడడం ద్వారా, ఆయన వాక్యంలోని సత్యాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా మనల్ని మనం వ్యక్తపర్చుకోవడం ఆయనకు మన కృతజ్ఞతను చూపించడానికి అత్యంత చక్కని మార్గం. జీవితంలోని ఇతర అంశాల్లో కూడా మరింత కృతజ్ఞత కల్గివుండడానికి ఇది మనకు సహాయం చేస్తుంది.
“స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను” అని యెహోవా చెబుతున్నాడు. ఆయన ఎడల మీకుగల హృదయపూర్వక కృతజ్ఞతను చూపించడం ద్వారా వచ్చే ఆనందాన్ని మీరు అనుభవించండి.—కీర్తన 50:23; 100:2.
[7వ పేజీలోని చిత్రం]
జీవం దేవుడనుగ్రహించిన బహుమానము. వ్యక్తిగత శ్రద్ధను జతచేయడం మర్చిపోకండి