ఎందుకు కృతజ్ఞులమై ఉండాలి?
హార్లీ వెన్నెముక సంబంధ శస్త్ర చికిత్స చేయించుకున్నాడు గనుక మెకానిక్కుగా తన పనిని మానేసి క్లర్కుగా పని చేయవలసి వచ్చింది. ఈ మార్పు గురించి ఎలా భావిస్తున్నావని హార్లీని అడిగినప్పుడు, ఆయనిలా చెప్పాడు: “యంత్రాలతో పని చేయలేకపోతున్నందుకు నాకు అప్పుడప్పుడూ బాధనిపిస్తుంది. కానీ, యథార్థంగా చెప్పాలంటే, నేను నా మునుపటి పనిలో కన్నా ప్రస్తుత పనిలో ఎంతో ఆనందిస్తున్నాను.”
తన సంతృప్తికి కారణం చెబుతూ, హార్లీ ఇలా అంటున్నాడు: “నాతోపాటు పనిచేస్తున్న ప్రజల దృక్పథమే దానికి కారణం. నేను మునుపు ఉద్యోగం చేస్తుండిన స్థలంలోలా కాకుండా, నా ప్రస్తుత సూపర్‌వైజరూ తోటిపనివాళ్లూ నేను చేసే పనిని ఎంతో మెచ్చుకుంటారు, వాళ్లు అస్సలు ప్రశంసించకుండా ఉండరు. ఇది ఎంతో తేడా చూపించింది.” తాను ఉపయోగకరమైన వాడినన్న, అవసరమైన వాడినన్న అనుభూతితో, హార్లీ ఇప్పుడు సంతోషంగా పనిచేసుకుంటున్నాడు.
తగిన సందర్భంలో, మెప్పుదల మాటలు లేక కృతజ్ఞతా వచనాలు నిజంగా హృదయాన్ని ఉత్తేజపరుస్తాయి. అయితే మరో వైపున, కృతఘ్నత ఎంతో నిస్తేజమైనదై ఉండగలదు. దాని గురించి షేక్స్‌పియర్ ఇలా పేర్కొన్నాడు, “వీచవే శీతల పవనమా, వీచవే, నీవు మానవుని కృతఘ్నత అంత నిర్దయురాలివి కావులే.” విచారకరంగా, అనేకులు అలాంటి నిర్దయకు గురయ్యారు.
కృతఘ్నత విషయంలో జాగ్రత్త
నేటి ప్రపంచంలో యథార్థంగా వ్యక్తపర్చబడే కృతజ్ఞతా వచనాలు అరుదైపోతున్నాయి. ఉదాహరణకు, ఒక రచయిత ఇలా ఒక ప్రశ్న లేవదీశాడు: “ఒక పెళ్లి కుమార్తెకు 200 పెళ్లి పత్రికల మీద చిరునామా వ్రాయడానికి సమయం లభించినప్పుడు, వచ్చిన 163 కానుకలకు కృతజ్ఞతా వచనాలు వ్రాయడానికి ఆమెకు సమయమెందుకు ఉండదూ?” తరచూ కేవలం “థాంక్స్” అనే చిన్న పదం కూడా చెప్పరు. నేను ముందు అనే దృక్పథం కృతజ్ఞత స్థానాన్ని తీసుకోవడం చాలా ఎక్కువగా జరుగుతుంది. ఈ పరిస్థితి అంత్య దినాలకు ఒక సూచనగా ఉంది. “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము, . . . మనుష్యులు స్వార్థప్రియులు . . . కృతజ్ఞతలేనివారు” అవుతారని అపొస్తలుడైన పౌలు హెచ్చరించాడు.—2 తిమోతి 3:1, 2.
ఇతర సందర్భాల్లో, ముఖస్తుతి కృతజ్ఞత స్థానాన్ని తీసుకుంటుంది. కృతజ్ఞతా వచనాలు వ్యక్తిగత లాభం గురించి ఆలోచించకుండా హృదయపూర్వకంగా రావాలి. అయితే, సాధారణంగా యథార్థతలేని విపరీతమైన ముఖస్తుతి ఉన్నత స్థానానికి వెళ్లాలనే లేదా నిర్దిష్ట వ్యక్తిగత లాభాలు పొందాలనే దురుద్దేశం నుండి ఉత్పన్నమౌతుంది. (యూదా 16) అలాంటి ఇంపైన మాటలు అవి అందుకునే వారిని మోసగిస్తాయి అంతేగాక అలాంటి మాటలు చెప్పడానికి గర్వాహంకారాలే కారణం. కాబట్టి మరి, యథార్థత లేని ముఖస్తుతికి బలవ్వాలని ఎవరు మాత్రం కోరుకుంటారు? కాని యథార్థమైన కృతజ్ఞత నిజంగా ఉత్తేజాన్నిస్తుంది.
కృతజ్ఞతను వ్యక్తం చేసే వ్యక్తి అలా చేయడం నుండి ప్రయోజనం పొందుతాడు. హృదయంలో కృతజ్ఞత కల్గివుండడాన్ని బట్టి ఆయనకు కలిగే మంచి భావన, అతని ఆనందానికి శాంతికి దోహదపడుతుంది. (పోల్చండి సామెతలు 15:13, 15.) కృతజ్ఞత అనుకూల లక్షణం గనుక అది కోపం, అసూయ, ఆగ్రహం వంటి ప్రతికూల భావాల నుండి అతడిని కాపాడుతుంది.
“కృతజ్ఞులై యుండుడి”
థాంక్స్ చెప్పమనీ, కృతజ్ఞతా స్ఫూర్తిని అలవర్చుకోమని బైబిలు మనల్ని పురికొల్పుతుంది. పౌలు ఇలా వ్రాశాడు: “ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.” (1 థెస్సలొనీకయులు 5:16-18) పౌలు కొలొస్సయ్యులకు ఇలా ఉపదేశించాడు: “క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండ నియ్యుడి; . . . మరియు కృతజ్ఞులై యుండుడి.” (కొలొస్సయులు 3:15) హృదయపూర్వక కృతజ్ఞతాభావం దైవిక లక్షణమని సూచిస్తూ, అనేక కీర్తనల్లో కృతజ్ఞతా వచనాలు ఉన్నాయి. (కీర్తన 27:4; 75:1) స్పష్టంగా, మనం అనుదిన జీవితాంశాల్లో కృతజ్ఞతాభావాన్ని కనబరిస్తే యెహోవా దేవుడు సంతోషిస్తాడు.
కృతజ్ఞతలేని ఈ ప్రపంచంలోని ఏ కారకాలు మనం కృతజ్ఞతాభావాన్ని అలవర్చుకోవడాన్ని కష్టతరం చేస్తాయి? అనుదిన జీవితంలో మనం కృతజ్ఞతా భావాన్ని ఎలా ప్రదర్శించవచ్చు? ఈ ప్రశ్నలు తర్వాతి శీర్షికలో చర్చించబడతాయి.