తలిదండ్రులారా—మీ పిల్లల్ని కాపాడండి!
నైజీరియా నందలి ఒక ఉన్నత పాఠశాలలో, లైంగిక దుర్నీతికి పేరు పొందిన ఒక అమ్మాయి, తన తోటి విద్యార్థినులకు లైంగిక విషయాల గురించి ఉపన్యాసాలివ్వడానికి ఇష్టపడేది. పొగాకు పదార్థం కలిపిన ఘాటైన బీరు గర్భస్రావానికి మందని ఆమె చెప్పేది. అశ్లీల సాహిత్యం నుండి తాను ఎంపిక చేసుకుని చెప్పే కథలు, ఆమె తోటి విద్యార్థులనేకులను మరులుగొల్పేవి. కొంతమంది లైంగిక ప్రయోగాలు చేయడం ప్రారంభించారు, వారిలో ఒకమ్మాయి గర్భం దాల్చింది. గర్భస్రావం చేసుకోవడానికి ఆమె బీరు/పొగాకు మిశ్రమాన్ని త్రాగింది. కొన్ని గంటల్లోనే, ఆమె రక్తం కక్కుకోవడం మొదలెట్టింది. కొన్ని రోజుల తర్వాత, ఆమె హాస్పిటల్‌లో చనిపోయింది.
నేటి ప్రపంచంలో, యౌవనస్థులనేకమంది లైంగిక విషయాల గురించి ఎడతెగకుండా మాట్లాడుతూ, అమాయక శ్రోతలను నాశనానికి నడిపిస్తారు. యౌవనస్థులు తమను కాపాడే కచ్చితమైన జ్ఞానాన్ని కనుగొనడానికి ఎవరివైపు చూడాలి? “ప్రభువు [“యెహోవా,” NW] యొక్క శిక్షలోను బోధలోను” తమ పిల్లలను పెంచవలసిన బాధ్యతగల దైవిక తలిదండ్రుల వైపు వారు చూడగల్గడం ఎంత మంచిది!—ఎఫెసీయులు 6:4.
లైంగిక విద్య ఎడల ఆఫ్రికా దృక్పథాలు
ప్రపంచవ్యాప్తంగా, అనేకమంది తలిదండ్రులు తమ పిల్లలతో లైంగిక విషయాల గురించి చర్చించడం కష్టమని భావిస్తారు. ప్రాముఖ్యంగా ఆఫ్రికాలో ఇది వాస్తవం. సియ్యారా లియోన్‌లో ఉండే డోనల్డ్ అనే ఒక తండ్రి ఇలా పేర్కొంటున్నాడు: “ఆ విషయాలు మాట్లాడటమన్నది అసలెప్పుడూ జరగదు. అలా చేయడం ఆఫ్రికా సాంప్రదాయం కాదు.” నైజీరియాకు చెందిన కాన్ఫిడెంట్ అనే స్త్రీ ఇలా అంగీకరిస్తోంది: “నా తలిదండ్రులు లైంగిక విషయాలను ఎన్నడూ బహిరంగంగా ప్రస్తావించకూడదన్నట్లు భావిస్తారు; అది సాంప్రదాయపరంగా నిషిద్ధం.”
కొన్ని ఆఫ్రికా సంస్కృతుల్లో, శిశ్నం, వీర్యం, లేక ఋతుస్రావం వంటి లైంగిక సంబంధిత పదాలను ప్రస్తావించడమే అసభ్యమైన విషయంగా పరిగణించబడుతుంది. ఒక క్రైస్తవ తల్లి తన కుమార్తె “లైంగికత” అనే పదాన్ని ఉపయోగించడాన్ని కూడా నిషేధిస్తుంది, అయితే తన కుమార్తె “వ్యభిచారం” అనే పదాన్ని మాత్రం ఉపయోగించవచ్చని ఆమె అంటుంది. దానికి భిన్నంగా, దేవుని వాక్యమైన బైబిలు లైంగికత గురించి, లైంగికావయవాల గురించి సూటిగా మాట్లాడుతుంది. (ఆదికాండము 17:11; 18:11; 30:16, 17; లేవీయకాండము 15:2) దీని ఉద్దేశం విభ్రాంతికి గురిచేయాలనో లేక ఉత్తేజం రేకెత్తించాలనో కాదు గాని దేవుని ప్రజలను కాపాడి వారికి ఉపదేశించాలన్నదే.—2 తిమోతి 3:16.
కొంతమంది తలిదండ్రులు వెనుకంజ వేయడానికి సంస్కృతిపరమైన నిషేధాలే కాకుండా, మరో కారణం ఏమిటో నైజీరియా నందలి ఒక తండ్రి ఇలా వ్యక్తపర్చాడు: “నేను నా పిల్లలతో లైంగిక విషయాల గురించి మాట్లాడితే, లైంగిక దుర్నీతికి పాల్పడేలా అది వారిని పురికొల్పుతుంది.” కానీ గౌరవనీయమైన, బైబిలు-ఆధారిత లైంగికపరమైన సమాచారం పిల్లలు తొందరపడి ప్రయోగాలు చేసేలా ప్రోత్సహిస్తుందా? లేదు, అది ఎంత మాత్రం అలా చేయదు. వాస్తవానికి, యౌవనస్థులకు దాని గురించి ఎంత తక్కువ జ్ఞానం ఉంటే అంత ఎక్కువగా వాళ్లు సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉండవచ్చు. “[కచ్చితమైన విషయపరిజ్ఞానంపై ఆధారపడిన] జ్ఞానము ఆశ్రయాస్పదము” అని బైబిలు తెలియజేస్తుంది.—ప్రసంగి 7:12.
యేసు ఉపమానంలో, బుద్ధిగల ఒక వ్యక్తి భవిష్యత్తులో వచ్చే తుఫానులను ముందే ఊహించి తన ఇంటిని బండ మీద కట్టుకుంటాడు, కాని బుద్ధిలేని వ్యక్తి ఇసుక మీద కట్టుకుని నాశనాన్ని అనుభవిస్తాడు. (మత్తయి 7:24-27) అలాగే, తమ పిల్లలు ఈ ప్రపంచపు హీనమైన లైంగిక ప్రమాణాలకు లొంగిపోయేలా తుఫాను వంటి ఒత్తిళ్లను ఎదుర్కుంటారని తెలుసుకుని, వివేకవంతులైన క్రైస్తవ తలిదండ్రులు దృఢంగా ఉండేందుకు వారికి సహాయపడే కచ్చితమైన జ్ఞానావగాహనలతో వారిని బలపరుస్తారు.
అనేకమంది తలిదండ్రులు తమ పిల్లలతో లైంగిక విషయాల గురించి ఎందుకు చర్చించరనేదానికి మరో అదనపు కారణాన్ని ఒక ఆఫ్రికా స్త్రీ ఇలా వివరించింది: “నేను యౌవనస్థురాలిగా ఉన్నప్పుడు, సాక్షులైన నా తలిదండ్రులు నాతో లైంగిక విషయాల గురించి చర్చించలేదు, కాబట్టి ఈ విషయాలను నా పిల్లలతో చర్చించాలన్న తలంపు నాకు కలుగలేదు.” అయితే, 10 లేక 20 సంవత్సరాల క్రితం నాటికంటే నేడు యౌవనస్థులపై ఎక్కువ ఒత్తిళ్లు ఉన్నాయి. ఇందులో ఆశ్చర్యపడాల్సినదేమీ లేదు. “అంత్యదినములలో . . . దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు” అని దేవుని వాక్యం ముందే తెలియజేసింది.—2 తిమోతి 3:1, 13.
సమస్యను మరింత జటిలం చేస్తున్న మరో వాస్తవం ఏమిటంటే, అనేకమంది పిల్లలు విముఖంగా ఉంటున్నారు లేదా తమ తలిదండ్రులతో మనస్సు విప్పి మాట్లాడ లేకపోతున్నారు. చిన్న చిన్న విషయాల్లో కూడా ఇరు వైపుల నుండి సంభాషణ తరచూ అంత బాగా జరగడం లేదు. 19 ఏళ్ల ఒక యువకుడు ఇలా వాపోయాడు: “నేను విషయాలను నా తలిదండ్రులతో చర్చించను. నేనూ మా నాన్నా అంత బాగా సంభాషించుకోము. నేను చెప్పేది ఆయన శ్రద్ధగా వినరు.”
లైంగిక విషయాల గురించి వివరాలడగడం చెడు పరిణామాలకు దారితీయగలదని కూడా అనేకమంది యౌవనస్థులు భయపడవచ్చు. 16 ఏళ్ల ఒకమ్మాయి ఇలా చెప్పింది: “లైంగిక విషయాల ఎడల నా తలిదండ్రుల ప్రతిస్పందనను చూసి నేను ఆ విషయాలను వారితో చర్చించను. కొంతకాలం క్రితం మా అక్కయ్య లైంగిక విషయాల గురించి మా అమ్మను కొన్ని ప్రశ్నలడిగింది. అమ్మ అక్క సమస్యల్లో అక్కకు సహాయం చేయకపోగా, అక్కను అనుమానించింది. అమ్మ తరచూ నన్ను పిలిచి అక్క గురించి అడిగేది, కొన్నిసార్లు అక్క నైతికత గురించి వ్యంగ్యంగా దూషించేది. అమ్మ ప్రేమను పోగొట్టుకోవడం నాకిష్టం లేదు, అందుకని నేను నా సమస్యల్ని అమ్మకు చెప్పను.”
ఎందుకు బోధించాలి?
లైంగిక విషయాల గురించి మన పిల్లలకు తగినంత మేరకు బోధించడం సరైన చర్యే కాదు, అది దయతో కూడిన చర్య కూడా. తమ పిల్లలకు లైంగిక విషయాల గురించి తలిదండ్రులు బోధించకపోతే, ఇతరులు బోధిస్తారు, అదీ సాధారణంగా తలిదండ్రులు అనుకున్నదాని కన్నా ముందే అలా జరుగవచ్చు, అంతేగాక అది కూడా దైవిక సూత్రాలకు అనుగుణ్యంగా మాత్రం కాదు. 13 ఏళ్ల ఒకమ్మాయి వ్యభిచారం చేసింది, ఎందుకంటే ఆమె తన కన్యాత్వాన్ని కోల్పోకపోతే ఆ తర్వాత భవిష్యత్తులో విపరీతమైన నొప్పి కలుగుతుందని ఆమె తోటి విద్యార్థుల్లో ఒకరు ఆమెకు చెప్పారు. “నీ యోనిమీది పొరను వాళ్లు కత్తెరతో కత్తిరిస్తారు” అని ఆమెకు చెప్పబడింది. తాను విన్నదాని గురించి తన క్రైస్తవ తల్లితో ఎందుకు చెప్పలేదని ఆమెను అడిగినప్పుడు, పెద్ద వాళ్లతో అలాంటి విషయాల గురించి ఎన్నడూ చర్చించడం జరగలేదని ఆ అమ్మాయి సమాధానమిచ్చింది.
నైజీరియాకు చెందిన ఒకమ్మాయి ఇలా చెప్పింది: “లైంగికత అన్నది సాధారణ మానవులందరూ పాల్గొనవలసిన అంశమని నా స్కూల్లోని స్నేహితులు నన్ను ఒప్పించడానికి ప్రయత్నించారు. నేను ఇప్పుడు లైంగికతలో పాల్గొనకపోతే, నాకు 21 ఏళ్లు వచ్చినప్పుడు, నా స్త్రీత్వంపై నాశనకరమైన ప్రభావాన్ని చూపే అస్వస్థతను నేను అనుభవిస్తానని వాళ్లు నాకు చెప్పారు. కాబట్టి, అలాంటి భయంకరమైన ప్రమాదాన్ని తప్పించుకోవడానికి, పెళ్లికి ముందే నేను లైంగిక సంబంధాలు పెట్టుకోవడం మంచిదని వాళ్లు చెప్పారు.”
ఆమె, ఆమె తలిదండ్రులు పరస్పరం చక్కగా సంభాషించుకునే వారు గనుక, తాను ఇంటివద్ద నేర్చుకునేదానికి ఇది వ్యతిరేకంగా ఉందని ఆమె వెంటనే గుర్తించగలిగింది. “ఎప్పటిలాగే నేను ఇంటికి వెళ్లి, స్కూల్లో వాళ్లు చెప్పింది మా అమ్మతో చెప్పాను.” ఆ అమ్మాయి తల్లి ఆ అబద్ధ సమాచారం తప్పని నిరూపించింది.—పోల్చండి సామెతలు 14:15.
లైంగిక విషయాల్లో పిల్లలు దైవిక జ్ఞానాన్ని సంపాదించుకునేందుకు వారికి సహాయం చేయడానికి అవసరమైన జ్ఞానాన్నివ్వడం ద్వారా, పిల్లలు ప్రమాదకరమైన పరిస్థితులను గ్రహించడానికి, వారిని తప్పుదారి పట్టించే ప్రజలను గుర్తించడానికి తలిదండ్రులు వారిని ఆయత్తపరుస్తారు. సుఖరోగాలు మరియు అవాంఛిత గర్భధారణల హృదయవేదన నుండి వారిని కాపాడడానికి ఇది సహాయం చేస్తుంది. వారు స్వగౌరవాన్ని కల్గివుండడానికి, ఇతరుల నుండి వారు గౌరవాన్ని సంపాదించుకోవడానికి ఇది దోహదపడుతుంది. అపోహల నుండి, వ్యాకులత నుండి ఇది వారిని స్వతంత్రులను చేస్తుంది. ఒకవేళ వాళ్లు ఆ తర్వాత వివాహం చేసుకుంటే వారి ఆనందానికి దోహదపడుతూ, సరైన లైంగికత ఎడల ఆరోగ్యదాయకమైన అనుకూలమైన దృక్పథాన్ని పెంపొందింపజేస్తుంది. దేవుని ఎదుట అంగీకృత స్థానాన్ని కాపాడుకోవడానికి ఇది వారికి సహాయం చేయగలదు. తమ ఎడల చూపబడిన ప్రేమపూర్వక శ్రద్ధను పిల్లలు గమనించినప్పుడు, వారు తమ తలిదండ్రులను మరింత ఎక్కువగా గౌరవించడానికి, ప్రేమించడానికి ఇది వారిని పురికొల్పగలదు.
చక్కని సంభాషణ
తలిదండ్రులు తమ పిల్లల అవసరతలకు తగిన ఉపదేశాన్నిచ్చేందుకు ఇరు వైపుల నుండి సంభాషణ అవసరం. రోగి జబ్బు గురించి సరిగ్గా తెలుసుకోకుండా ఒక వైద్యుడు మందు సిఫారసు చేయడానికి ప్రయత్నించడం ఎలా ఉంటుందో అలాగే, తమ పిల్లల మనస్సుల్లోనూ హృదయాల్లోనూ ఏముందో తలిదండ్రులకు తెలియకపోతే, జ్ఞానయుక్తమైన ఉపదేశం కూడా ప్రయోజనకరంగా ఉండదు. ప్రభావవంతమైన ఉపదేశకులుగా ఉండేందుకు, నిజంగా తమ పిల్లలు ఏమి ఆలోచిస్తున్నారో, ఎలా భావిస్తున్నారో తలిదండ్రులు తెలుసుకోవాలి. తమ పిల్లలు ఎదుర్కుంటున్న ఒత్తిళ్లను, సమస్యలను, వారిని బాధిస్తున్న ప్రశ్నలను వాళ్లు అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. పిల్లలు చెప్పేది జాగ్రత్తగా వినడం, ‘వినుటకు వేగిరపడువారిగా, మాటలాడుటకు నిదానించువారిగా’ ఉండడం ప్రాముఖ్యము.—యాకోబు 1:19; సామెతలు 12:18; ప్రసంగి 7:8.
తలిదండ్రులు తమ పిల్లలతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకొని దాన్ని కాపాడుకోవడానికి సమయం, సహనం, కృషి అవసరమౌతాయి, అలాంటి సంబంధం ఉన్నప్పుడు పిల్లలు తమ అంతర్గత భావాలను వ్యక్తపర్చడానికి వెనుకాడరు. అయితే, పిల్లలు తలిదండ్రుల మధ్య అలాంటి బంధం ఉండడం ఎంత బాగుంటుందో కదా! పశ్చిమాఫ్రికాకు చెందిన, ఐదుమంది పిల్లలున్న ఒక తండ్రి ఇలా చెబుతున్నాడు: “నేను తండ్రినే కాదు, ఆంతరంగికుడ్ని కూడా. లైంగిక విషయాలతో సహా పిల్లలు నాతో అన్ని అంశాల గురించి స్వేచ్ఛగా చర్చిస్తారు. మా అమ్మాయిలు కూడా నాతో ఆంతరంగిక విషయాలు చెబుతారు. వారి సమస్యల గురించి చర్చించడానికి మేము సమయం తీసుకుంటాము. వాళ్లు తమ ఆనందాన్ని కూడా నాతో పంచుకుంటారు.”
ఆయన కుమార్తెల్లో ఒకరైన బోలా ఇలా చెబుతుంది: “మేము మా నాన్న నుండి ఏ రహస్యాలు దాచము. నాన్న దయగలవాడు, సానుభూతి గలవాడు. మేము ఏదైనా తప్పు చేసినా ఆయన మమ్మల్ని భయపెట్టడు లేక మాతో కఠినంగా వ్యవహరించడు. కోపం తెచ్చుకునే బదులు, విషయాన్ని విశ్లేషించి, మేము ఏమి చేయాలో లేక మేము ఏమి చేయకుండా ఉండవలసిందో ఆయన మాకు చూపిస్తాడు. ఆయన తరచూ యూత్ మరియు కుటుంబ సంతోషం పుస్తకాల నుండి సూచిస్తాడు.”a
సాధ్యమైతే, తలిదండ్రులు తమ పిల్లలు చాలా చిన్నవారిగా ఉన్నప్పుడే వారితో లైంగిక సంబంధ విషయాల గురించి మాట్లాడడాన్ని ప్రారంభించడం మంచిది. తరచూ కష్టతరమైనవిగా ఉండే యౌవనప్రాయంలో చర్చలను కొనసాగించడానికి ఇది పునాది వేస్తుంది. చర్చలను లేత వయస్సులోనే ప్రారంభించకపోతే, ఆ తర్వాత చర్చలను ప్రారంభించడం కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉంటుంది, కాని అలా చేయడం సాధ్యమే. ఐదుమంది పిల్లల తల్లి ఇలా చెప్పింది: “నేను ఆ విషయాల గురించి మాట్లాడడానికి కృషి చేసేదాన్ని, నాకు గాని పిల్లవానికి గాని ఇబ్బందికరంగా ఉండనంత వరకూ అలా కృషి చేసేదాన్ని.” మీ పిల్లల సంక్షేమం ప్రమాదంలో ఉంది గనుక, అలాంటి కృషి నిజంగా తగినదే.
సురక్షితంగా, సంతోషంగా
తమను కాపాడే జ్ఞానాన్నిచ్చి తమను ప్రేమపూర్వకంగా సంసిద్ధులను చేసిన తలిదండ్రులను పిల్లలు మెచ్చుకుంటారు. ఆఫ్రికాలోని కొంతమంది యెహోవా సాక్షులు చేసిన ఈ వ్యాఖ్యానాలను పరిశీలించండి:
24 ఏళ్ల వయస్సులో, మోజీసోలా ఇలా చెప్పింది: “నేనెప్పటికీ మా అమ్మకు కృతజ్ఞురాలిని. ఆమె అవసరమైన లైంగిక విద్యాభ్యాసాన్ని నాకు సరైన సమయంలో ఇచ్చింది. చాలాకాలం క్రితం ఆమె నాతో ఆ విషయాల గురించి చర్చిస్తున్నప్పుడు నేను కొంత ఇబ్బంది పడినప్పటికీ, మా అమ్మ చేసిన మేలు ఏమిటో నేనిప్పుడు గ్రహించగల్గుతున్నాను.”
ఇనీవోబంగ్ ఇలా జతచేసింది: “లైంగిక విషయాల గురించి తగిన తర్ఫీదునివ్వడం ద్వారా అమ్మ నాకు ఏమి చేసిందనే దాని గురించి నేను పునరావలోకనం చేసుకున్నప్పుడల్లా సంతోషిస్తాను. నేను స్త్రీత్వంలోకి ప్రవేశించడానికి అది ఎంతో ప్రాముఖ్యమైన సహాయకంగా ఉండింది. నేను నా భవిష్యద్ పిల్లలకు అలాగే చేస్తానని వాగ్దానం చేస్తున్నాను.”
పంతొమ్మిదేళ్ల కూన్లె ఇలా చెప్పాడు: “లోకసంబంధమైన స్త్రీలు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనమని చేసే ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి నా తలిదండ్రులు నాకు సహాయం చేశారు. వాళ్లు నాకు తర్ఫీదునివ్వకపోయి ఉంటే, నేను దుర్నీతికి పాల్పడివుండే వాడిని. వాళ్లు చేసినదాన్ని నేను ఎప్పుడూ మెచ్చుకుంటాను.”
క్రిస్టియానా ఇలా చెబుతుంది: “లైంగిక విషయాల గురించి మా అమ్మతో సంభాషించడం వల్ల నేను ఎన్నో ప్రయోజనాలు పొందాను. నేను మరణకరమైన వ్యాధుల నుండి అవాంఛిత గర్భధారణ నుండి తప్పించుకోగల్గాను, నేను నా చెల్లెల్లూ తమ్ముళ్లూ అనుసరించడానికి మంచి మాదిరి నుంచగలిగాను. నేను ప్రజల నుండి గౌరవాన్ని సంపాదించుకోగలిగాను, నేను భవిష్యత్తులో వివాహం చేసుకుంటే నా భర్త కూడా నన్ను గౌరవిస్తాడు. మరింత ప్రాముఖ్యంగా, యెహోవా దేవుని ఆజ్ఞను పాటించినందుకు నాకు ఆయనతో మంచి సంబంధం ఉంది.”
ముందు ప్రస్తావించబడిన బోలా ఇలా చెబుతోంది: “నా తోటి విద్యార్థిని ఒకామె, లైంగిక సంబంధమనేది వివాహానికి కట్టుబడి ఉండకుండా ఆనుభవించేదని చెప్పేది. ఆమెకదొక సరదా. అయితే, ఆమె గర్భందాల్చి, మాతోపాటు ఉన్నత పాఠశాల పరీక్షలు వ్రాయలేకపోయినప్పుడు అది సరదా కాదని ఆమె గ్రహించింది. నాకు నడిపింపునివ్వడానికి నాకు మంచి నాన్న లేకపోయివుంటే, బహుశా నేను కూడా ఆమెలాగే కఠినమైన అనుభవాల ద్వారా విషయాలను నేర్చుకోవలసి వచ్చేది.”
ఈ లైంగికోన్మాద లోకంలో “రక్షణార్థమైన జ్ఞానము” కల్గివుండడానికి క్రైస్తవ తలిదండ్రులు తమ పిల్లలకు సహాయం చేయడం ఎంతటి ఆశీర్వాదం! (2 తిమోతి 3:15) వారిచ్చే బైబిలు-ఆధారిత ఉపదేశం, దేవుని దృష్టిలో పిల్లలను అలంకరించి, సౌందర్యవంతులను చేసే అమూల్యమైన హారం వంటిది. (సామెతలు 1:8, 9) పిల్లలు భద్రతను అనుభవిస్తారు, తలిదండ్రులు ప్రగాఢమైన సంతృప్తిని పొందుతారు. తన యౌవనస్థులతో ఎప్పుడూ స్వేచ్ఛగా సంభాషించడానికి కృషి చేసే, ఆఫ్రికాకు చెందిన ఒక తండ్రి ఇలా చెబుతున్నాడు: “మాకు మనశ్శాంతి ఉంది. యెహోవాకు ఏది ప్రీతికరమైనదో మా పిల్లలకు తెలుసని మాకు నమ్మకముంది; లోకస్థులు వాళ్లను తప్పుదోవ పట్టించలేరు. కుటుంబానికి దుఃఖం కలుగజేసే పనులు వాళ్లు చేయరని మాకు నమ్మకముంది. మా పిల్లలు మా నమ్మకాన్ని వమ్ము చేయనందుకు నేను యెహోవాకు కృతజ్ఞతలు తెల్పుతున్నాను.”
[అధస్సూచి]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి ప్రచురించినవి.
[10వ పేజీలోని చిత్రం]
తలిదండ్రుల నుండి బైబిలు-ఆధారిత సమాచారాన్ని పొందే క్రైస్తవ యౌవనస్థులు, ఇతర యౌవనులు చెప్పే విరూపిత కథలను నిరాకరించగల్గుతారు