కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 2/1 పేజీలు 29-31
  • అది పొగడ్తా లేక ముఖస్తుతా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అది పొగడ్తా లేక ముఖస్తుతా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పొగడ్త మరియు ముఖస్తుతి నిర్వచించబడ్డాయి
  • లేఖనాధార దృక్కోణం
  • ముఖస్తుతి—ఒక ఉచ్చు
  • ముఖస్తుతి నుండి కాపుదలలు
  • పొగడ్త యోగ్యమైన చోట
  • యెహోవాను స్తుతిద్దాం రండి!
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • మన దేవుడైన యెహోవాను స్తుతించండి!
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • పిల్లల్ని ఎలా పొగడాలి
    తేజరిల్లు!—2016
  • యౌవనులారా, యెహోవాను స్తుతించండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 2/1 పేజీలు 29-31

అది పొగడ్తా లేక ముఖస్తుతా?

“మీక్రొత్త హేర్‌స్టైల్‌లో మీరు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు!” అని ఎవరైనా మీతో అంటారు. అది పొగడ్తా లేక ముఖస్తుతా? “ఆ సూట్‌ మీకు అద్భుతంగా ఉంది!” పొగడ్తా లేక ముఖస్తుతా? “ఇంత రుచికరమైన భోజనం నేనింతవరకూ తినలేదు!” అది పొగడ్తా లేక ముఖస్తుతా? అలాంటి మెచ్చుకోలు మాటలను మనం అందుకున్నప్పుడు, వాళ్ళు యథార్థంగా సత్యవంతంగా ఆ మాటలు పలికారా లేక వాళ్లు అలా భావించనప్పటికీ మనల్ని ప్రీతిపర్చేందుకు అలా చెబుతున్నారా అని మనం ఆశ్చర్యపోవచ్చు.

ఒక వ్యక్తి మనకు చెప్పేది వాస్తవంగా పొగడ్తా లేక ముఖస్తుతా అనే విషయాన్ని మనమెలా తెలుసుకోగలం? అలా తెలుసుకోవడం అవసరమా? మనకు చెప్పబడిన దాన్ని గురించి అంతగా ఆలోచించకుండా అలాగే స్వీకరించి అది మనకు కలిగించే ఆనందాన్ని సరదాగా అనుభవించలేమా? మనం ఇతరులను పొగిడినప్పటి సంగతేమిటి? మన ఉద్దేశాలను మనం ఎన్నడైనా పరీక్షించుకున్నామా? ఈ ప్రశ్నలను గురించి ఆలోచించడం, మనం వివేచన కలిగి ఉండి యెహోవా దేవునికి ఘనతను తెచ్చే రీతిలో మన నాలుకను ఉపయోగించేందుకు మనకు సహాయం చేయగలదు.

పొగడ్త మరియు ముఖస్తుతి నిర్వచించబడ్డాయి

పొగడ్త అంటే అంగీకారం లేక మెప్పుకోలు యొక్క ఒక వ్యక్తీకరణ అని అర్థం మరియు ఆ పదం ఆరాధనను లేక ఘనతను ఇవ్వడాన్ని కూడా సూచించగలదు. చివరి రెండు అర్థాలు యెహోవా దేవునికి మాత్రమే చెల్లించగల పొగడ్తను గురించి సూచిస్తున్నాయన్నది స్పష్టమే. ప్రేరేపిత కీర్తనల గ్రంథకర్త పురికొల్పిన విధంగా, ఇది సత్యారాధన యొక్క సంపూర్ణమైన భాగం: “[అది] మంచిది. . . . మనోహరము స్త్రోత్రముచేయుట ఒప్పిదము.” “సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక.”—కీర్తన 147:1; 150:6.

అయితే, మానవులను పొగడకూడదని దీని అర్థం కాదు. మెప్పుకోలు, అంగీకారం లేక అనుకూలమైన తీర్పు అనే భావంలో అలా చేయవచ్చు. యేసు ఇచ్చిన ఒక ఉపమానంలో, ఒక యజమాని తన సేవకునితో ఇలా అంటాడు: “భళా, నమ్మకమైన మంచి దాసుడా.”—మత్తయి 25:21.

మరో వైపు, ముఖస్తుతి అబద్ధము, యథార్థహీనత లేక అతిగా పొగడటం అని నిర్వచించబడింది, ముఖస్తుతి చేసే వ్యక్తి సాధారణంగా స్వార్థపూరిత సంకల్పాలనే కలిగి ఉంటాడు. ఇతరుల నుండి అభిమానాన్ని లేక వస్తుపరమైన ప్రయోజనాలను సంపాదించేందుకు లేదా ముఖస్తుతి చేస్తున్న వ్యక్తికి వారు ఏదో రుణపడ్డారనే భావనను కలిగించేందుకు నేర్పరితనంతో కూడిన మెప్పుకోలు మాటలు లేక ఇచ్చకపు మాటలు పలకడం జరుగుతుంది. కాబట్టి ముఖస్తుతి చేసేవారు స్వార్థం చేత ప్రేరేపించబడతారు. యూదా 16 ప్రకారం “వారు . . . లాభమునిమిత్తము మనుష్యులను కొనియాడు”చుందురు.

లేఖనాధార దృక్కోణం

తోటి మానవులను పొగడటాన్ని గురించిన లేఖనాధార దృక్కోణం ఏమిటి? ఈ విషయంలో మనం అనుసరించేందుకు యెహోవా ఒక మాదిరిని ఉంచాడు. మనం యెహోవా చిత్తాన్ని చేస్తే మనం పొగడబడతామని బైబిలులో మనకు చెప్పబడింది. “ప్రతివానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును” అని అపొస్తలుడైన పౌలు చెబుతున్నాడు. పరీక్షింపబడిన మన విశ్వాస లక్షణం “మెప్పు . . . కలుగుటకు కారణమగును” అని పేతురు మనకు చెబుతున్నాడు. యెహోవా మానవులను పొగడుతాడనే వాస్తవం, యథార్థంగా పొగడటం దయగల, ప్రేమపూర్వకమైన, ప్రయోజనకరమైన మరియు అలక్ష్యం చేయకూడని ఒక క్రియ అనే విషయాన్ని మనకు చూపుతుంది.—1 కొరింథీయులు 4:5; 1 పేతురు 1:7.

బైబిలు ప్రకారం, మనకు పొగడ్త లభించగల మరొక మూలం, మన మంచి ప్రవర్తనను గమనించి మనలను యథార్థంగా మెచ్చుకొనే ప్రభుత్వ అధికారులు. “మేలుచేయుము, అప్పుడు వారిచేత మెప్పు పొందుదువు” అని మనకు చెప్పబడింది. (రోమీయులు 13:3) తాము చెప్పేదాన్ని యథార్థంగా విశ్వసించే మరియు మనలను పొగడటంలో ఎలాంటి నీచమైన సంకల్పాలనూ కలిగిలేని ప్రజలనుండి కూడా మనం పొగడ్తను అందుకోవచ్చు. సామెతలు 27:2 నందు ప్రేరేపిత లేఖనాలు ఇలా చెబుతున్నాయి: “నీ నోరు కాదు అన్యుడే . . . నిన్ను పొగడదగును.” మానవులనుండి పొగడ్తను అంగీకరించడం సరైన విషయమని ఇది సూచిస్తుంది.

ముఖస్తుతి చేయడం లేక చేయించుకోవడం విషయంలో ఇది వాస్తవం కాదు. ముఖస్తుతి మాటలు యెహోవాకు ఎందుకంత అప్రీతికరమైనవి? ఒక విషయం ఏమంటే అది యథార్థత లేనిది, యెహోవా యథార్థతా రాహిత్యాన్ని ఖండిస్తాడు. (సామెతలు 23:6, 7 పోల్చండి.) అంతేకాకుండా, అది నమ్మదగినది కాదు. దేవుని అనంగీకారాన్ని లెక్క చేయని ప్రజలను వర్ణిస్తూ, కీర్తనల గ్రంథకర్త ఇలా చెబుతున్నాడు: “అందరు ఒకరితో నొకరు అబద్ధములాడుదురు. మోసకరమైన మనస్సుగలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని . . . కోసివేయును.”—కీర్తన 12:2, 3.

అన్నిటికంటే మిన్నగా ముఖస్తుతి ప్రేమరహితమైనది. అది స్వార్థం చేత పురికొల్పబడింది. ముఖస్తుతి చేసే వాళ్లను గురించి మాట్లాడిన తర్వాత, వారిలా అంటున్నారని కీర్తనల గ్రంథకర్త అయిన దావీదు వ్రాస్తున్నాడు: “మా నాలుకలచేత మేము సాధించెదము. మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడు?” యెహోవా అటువంటి స్వార్థపరులను, ‘బాధపడువారిని బలాత్కరించే వారని’ వర్ణిస్తున్నాడు. ముఖస్తుతి చేసే వారి నాలుకలు ఇతరులను కట్టుటకు కాదు గానీ, వారిని బలాత్కరించేందుకూ బాధపెట్టేందుకూ ఉపయోగింపబడ్డాయి.—కీర్తన 12:4, 5.

ముఖస్తుతి—ఒక ఉచ్చు

“తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు.” జ్ఞానియైన రాజగు సొలొమోను అలాగని చెబుతున్నాడు, మరి అది ఎంత వాస్తవమో కదా! (సామెతలు 29:5) పరిసయ్యులు ముఖస్తుతితో యేసుకు ఉచ్చును బిగించడానికి ప్రయత్నించారు. వారిలా అన్నారు: “బోధకుడా, నీవు సత్యవంతుడవై యుండి, దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్యపెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము.” అదెంత పొగడ్తతో కూడినదిగా అనిపిస్తుందో కదా! వారి మెత్తని మాటల చేత యేసు మోసపోలేదు. ఆయన సత్యవంతమైన బోధలను వారు విశ్వసించలేదనీ, కానీ కైసరుకు పన్ను చెల్లించే విషయంపై ఆయన మాటల ద్వారా ఆయనను పట్టుకునేందుకే వారు ప్రయత్నిస్తున్నారని ఆయనకు తెలుసు.—మత్తయి 22:15-22.

మొదటి శతాబ్దపు హేరోదు యేసుకు పూర్తి భిన్నంగా ఉన్నాడు. కైసరయ పట్టణంలో అతడు బహిరంగంగా ప్రసంగించినప్పుడు, “ఇది దైవస్వరమేకాని మానవస్వరముకాదని” అంటూ ప్రజలు ప్రతిస్పందించారు. అలాంటి పచ్చి అబద్ధపు పొగడ్త విషయమై ప్రజలను మందలించే బదులు, హేరోదు ముఖస్తుతిని అంగీకరించాడు. యెహోవా దూత వెంటనే ప్రతిదండన చేశాడు, హేరోదు పురుగులు పడి మరణించాడు.—అపొస్తలుల కార్యములు 12:21-23.

పరిణతిగల ఒక క్రైస్తవుడు ముఖస్తుతి ఎందుకు చేయబడుతుందో గమనించేందుకు అప్రమత్తంగా ఉంటాడు. న్యాయ నిర్ణయ విషయంలో ఇమిడివున్న వ్యక్తి పొగడ్తలలో ముంచెత్తుతూ ఉన్నప్పుడు, బహుశ ఒక పెద్దని మరొక పెద్దతో పోల్చుతూ మీరు ఎంత దయగల వారూ మరియు జాలిగల వారని అనేంత వరకూ పరిస్థితి పోయినప్పుడు సంఘ పెద్దలు ప్రాముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి.

ఒక యౌవనస్థుడు అనైతిక ప్రేరేపకురాలి ద్వారా ఎలా లోబరచుకోబడ్డాడనే విషయాన్ని వివరిస్తూ, ముఖస్తుతి తీసుకురాగల మరొక సమస్యను బైబిలు స్పష్టంగా చూపిస్తుంది. (సామెతలు 7:5, 21) ఈ హెచ్చరిక నేటి పరిస్థితికి ఎంతో సంగతంగా ఉంది. ప్రతి సంవత్సరం క్రైస్తవ సంఘం నుండి బహిష్కరించబడే వారిలో, అనేకులు అనైతిక ప్రవర్తన మూలంగానే తీసివేయబడుతున్నారు. అలాంటి ఘోరమైన పాపంలోకి పడిపోవడమనేది ముఖస్తుతితో ప్రారంభం అయివుండవచ్చా? మానవులకు మెప్పుకోలు మరియు మంచిగా మాట్లాడటం అనేది ఎంతో ఇష్టం గనుక, ముఖస్తుతి చేసే పెదవులనుండి వచ్చే మెత్తని మాటలు అనైతిక ప్రవర్తనను అడ్డగించాలనే ఒక క్రైస్తవుని తీర్మానాన్ని సన్నగిల్లజేయవచ్చు. అలాంటి వాటికి విరుద్ధంగా అప్రమత్తంగా ఉండకపోతే, అవి గంభీరమైన పరిణామాలకు దారితీయవచ్చు.

ముఖస్తుతి నుండి కాపుదలలు

ముఖస్తుతి మాటలు, ఆ మాటలు ఎవరి కొరకు పలుకబడుతున్నాయో వారి స్వప్రీతినీ లేక అహాన్నీ తృప్తిపరచుతాయి. తన స్వంత యోగ్యత గురించి అతిశయోక్తితో కూడిన అభిప్రాయాన్ని అది ఇస్తుంది, ఇతరులకంటే తాను ఏదో రీతిలో ఉన్నతుడనని భావించేలా చేస్తుంది. తత్త్వవేత్తయైన ఫ్రాంస్వా డె లా రాష్‌ఫూకో ముఖస్తుతిని “నిరుపయుక్తత విషయమై పంపిణీకి నోచుకోని” దొంగ నోట్లతో పోల్చాడు. కాబట్టి, “తన్ను తాను ఎంచుకొనతగిన దానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, తాను స్వస్థబుద్ధిగల వాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని . . . మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను” అని అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఆచరణాత్మక హెచ్చరికను వినడమే తమను తాము కాపాడుకునేందుకు ఒక మార్గము.—రోమీయులు 12:3.

మన చెవులకు వినసొంపుగా ఉండే విషయాలను వినాలని మనకు సహజంగానే అనిపించినప్పటికీ, మనకు అనేక సమయాల్లో అవసరమయ్యేది బైబిలు ఆధారిత సలహాలు మరియు క్రమశిక్షణయే. (సామెతలు 16:25) రాజైన అహాబు తనకు నచ్చిన విషయాలనే వినాలని కోరుకున్నాడు; “ప్రవక్తలు [అహాబు యొక్క ముఖస్తుతి మాటలు మాటలాడుతున్న ప్రవక్తలు] మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని” ప్రవక్తయైన మీకాయాను రాజు సేవకులు అడిగారు. (1 రాజులు 22:13) యథార్థమైన మాటలు వినేందుకూ తన తిరుగుబాటు మార్గాలను మార్చుకునేందుకూ అహాబు సుముఖత చూపి ఉంటే, ఇశ్రాయేలుకు యుద్ధంలో అంత నష్టం కలుగడాన్నీ మరియు తన స్వంత మరణాన్నీ అతను నివారించగలిగి ఉండేవాడు. మన స్వంత ఆధ్యాత్మిక సంక్షేమం నిమిత్తమై, వినసొంపైన ఇచ్చకపు మాటలతో మనమెంత అద్భుతమైన వారమో మనకు చెప్పే వాళ్ళ కొరకు వెదికే బదులు సత్యపు సూటైన మార్గంలో మనం నిలిచి ఉండేందుకు మనకు సహాయం చేయాలని ఇష్టపడే నియమిత క్రైస్తవ పెద్దల స్థిరమైనవే అయినప్పటికీ ప్రేమపూర్వకమైనవైన సలహాలకు వెంటనే ప్రతిస్పందించాలి.—2 తిమోతి 4:3 పోల్చండి.

క్రైస్తవులు ఏ కారణాన్నిబట్టి కూడా ఎన్నడూ ముఖస్తుతిని ఆశ్రయించరు. నమ్మకమైన ఎలీహు వలె, వారు తీర్మానపూరితంగా ఇలా ప్రార్థన చేస్తారు: “నేను ఎవరియెడలను పక్షపాతినై యుండను. నేను ఎవరికిని ముఖస్తుతికై బిరుదులు పెట్టను. ముఖస్తుతి చేయుట నా చేత కాదు. అట్లు చేసినయెడల నన్ను సృజించినవాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును.” తర్వాత, పౌలు వలె వారు ఇలా చెప్పగలుగుతారు: “మేము ఇచ్చకపు మాటలనైనను, ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు.”—యోబు 32:21, 22; 1 థెస్సలొనీకయులు 2:5, 6.

పొగడ్త యోగ్యమైన చోట

“మూసచేత వెండిని కొలిమిచేత బంగారును తాను పొందిన కీర్తిచేత నరుని పరిశోధింపవచ్చును” అని అంటూ పొగడ్త ఒక కొలమానంగా పనిచేయగలదని ప్రేరేపిత సామెత చూపుతోంది. (సామెతలు 27:21) అవును, ఒక వ్యక్తి పడిపోయేందుకు దారి తీస్తూ, ఇతరులకంటే తాను ఉన్నతుడనే భావాలనూ లేక గర్వాన్ని పొగడ్త పెంపొందించవచ్చు. మరో వైపు, తాను చేసిన ఏదైనా విషయాన్నిబట్టి తనకు ఘనత లభించినప్పుడు అందు విషయమై యెహోవాకు తాను రుణపడి ఉన్నానని అతను అంగీకరిస్తే అది అతని సంస్కారాన్నీ వినయాన్నీ బయల్పర్చగలదు.

యోగ్యమైన ప్రవర్తన లేక సాఫల్యం విషయమై యథార్థమైన పొగడ్త, అలా పొగిడే వారినీ వాటిని అందుకునే వారినీ కూడా ప్రోత్సహిస్తుంది. అది ఒకరి పట్ల మరొకరికి స్నేహపూర్వకమైన మరియు చక్కని మెప్పుదలను వృద్ధి చేస్తుంది. పొగడదగిన లక్ష్యాల కొరకు కృషి చేయడాన్ని అది ప్రోత్సహిస్తుంది. పిన్నల ఎడల యోగ్యమైన మెప్పుదలను వ్యక్తం చేయడం వారు మరింత కష్టించి పని చేయాలనుకునేలా చేస్తుంది. వారి నుండి అపేక్షించబడే ప్రమాణాలకు తగినట్లు జీవించాలనే లక్ష్యాన్ని వారు కలిగి ఉంటుండగా అది వారి వ్యక్తిత్వాన్ని మలిచేందుకు సహాయం చేయవచ్చు.

కాబట్టి మనం ఎన్నడూ ముఖస్తుతి చేయకుండా లేక ఇతరులు చేయాలని అపేక్షించకుండా ఉందాము. పొగడ్తను అందుకునే సమయంలో మనం సాత్వికంతో ఉందాము. కాబట్టి, “సమయోచితమైన మాట యెంత మనోహరము!” అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుని, యెహోవాను మన ఆరాధనలో క్రమంగా స్తుతించుదాం మరియు ఇతరులను యథార్థంగా మెచ్చుకోవడం మరియు గుణగ్రహించడం రూపంలో వారిని పొగడుదాము. ఉదారంగానూ మరియు పూర్ణహృదయంతోనూ మెచ్చుకుందాము.—సామెతలు 15:23.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి