“అది అన్నిటికన్నా శ్రేష్ఠమైన క్రొత్త నిబంధన ఇంటర్లీనియర్”
దకింగ్డమ్ ఇంటర్లీనియర్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద గ్రీక్ స్క్రిప్చర్స్ను డా. జెసన్ బెడున్ అలా వర్ణించాడు. ఆయనిలా వివరిస్తున్నాడు:
“[అమెరికా] బ్లూమింగ్టన్ నందలి ఇండియానా విశ్వవిద్యాలయంలోని మతపర అధ్యయనాల విభాగం కొరకు ఒక కోర్సును బోధించడం నేను ఈ మధ్యే ముగించాను. . . . ఇది ప్రాథమికంగా సువార్తల్లో ఒక కోర్సు. ద కింగ్డమ్ ఇంటర్లీనియర్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద గ్రీక్ స్క్రిప్చర్స్ రూపంలో మీ సహాయం మాకందింది, నా విద్యార్థులు దాన్ని తమ తరగతి పాఠ్యపుస్తకాల్లో ఒకటిగా ఉపయోగించారు. ఈ చిన్న గ్రంథ ప్రతులు ఆ కోర్సుకు ఎంతో విలువైనవిగా ఉండినవి నా విద్యార్థులకు అవి ఎంతో నచ్చాయి.”
తన కాలేజీ కోర్సుల్లో డా. బెడున్ కింగ్డమ్ ఇంటర్లీనియర్ అనువాదాన్ని ఎందుకు ఉపయోగించాడు? ఆయనిలా సమాధానమిస్తున్నాడు: “క్లుప్తంగా చెప్పాలంటే, అది అన్నిటికన్నా శ్రేష్ఠమైన ఇంటర్లీనియర్ క్రొత్త నిబంధన. నేను ఆధునిక బైబిలు అధ్యయనాల్లో ఉపయోగించబడే లేఖనాలు మరియు పరికరాలను గురించి ఎంతో తెలిసిన, తర్ఫీదు పొందిన బైబిలు పండితుణ్ని, నేను ఒక యెహోవాసాక్షిని కాదు మరి. అయితే నేను మంచి శ్రేణికి చెందిన ప్రచురణలను చూసినప్పుడు నేను వాటిని ఇట్టే గుర్తించగలను, మీ ‘నూతనలోక బైబిలు అనువాద కమిటీ’ నిజంగా శ్రేష్ఠమైన పని చేసింది. మీ ఇంటర్లీనియర్ ఆంగ్ల అనువాదం ఏ స్థాయిలో కచ్చితంగా మరియు సారూప్యత కల్గి ఉందంటే, గ్రీకు మాట్లాడే ప్రపంచానికీ మన ప్రపంచానికీ మధ్యనున్న భాషాపర, సాంస్కృతికపరమైన మరియు భావనాత్మకమైన వ్యత్యాసాలను గంభీరంగా పరిగణించేలా అది పాఠకులను బలవంతం చేస్తుంది. మీ నూతనలోక అనువాదం గ్రీకు భాష ఎడల తన యథార్థత విషయంలో పారంపర్య తప్పుడు అనువాదాలను నివారించిన ఉన్నత శ్రేణికి చెందిన, అక్షరార్థ అనువాదం. నేడు ఉపయోగంలో ఉన్న అనేక విజయవంతమైన అనువాదాలకంటే కూడా అది అనేక రీతుల్లో ఉన్నతమైనది.”
దేవుని వాక్యాన్ని ప్రేమించే వారు బైబిలు యొక్క ఆదిమ గ్రీకు పాఠంతో పరిచయాన్ని పొందేందుకు సహాయం చేయడానికని యెహోవాసాక్షులు ద కింగ్డమ్ ఇంటర్లీనియర్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద గ్రీక్ స్క్రిప్చర్స్ను ప్రచురించారు. దానిలో, పేజీలోని ఎడమ చేతి వైపున (బి. ఎఫ్. వెస్ట్కాట్ మరియు ఎఫ్. జె. ఎ. హార్ట్ల ద్వారా సంకలనం చేయబడిన) ఆదిమ గ్రీకులో క్రొత్త నిబంధన ఉంటుంది. గ్రీకు పాఠం యొక్క వాక్యాల క్రింద ప్రతి పదానికీ ఇవ్వబడిన అక్షరార్థ ఆంగ్ల అనువాదం కనుగొనబడుతుంది. కుడిచేతి వైపున్న ఇరుకైన కాలమ్లో పరిశుద్ధ లేఖనాల నూతనలోక అనువాదం ఉంటుంది, అది ఇంటర్లీనియర్ అనువాదాన్ని బైబిలు యొక్క ఆధునిక ఆంగ్ల అనువాదంతో పోల్చి చూసేందుకు మీకు వీలు కలిగిస్తుంది.