ఫిలేమోను, ఒనేసిము క్రైస్తవ సహోదరత్వంలో ఐక్యమైవున్నారు
అపొస్తలుడైన పౌలు వ్రాసిన దైవ ప్రేరేపిత పత్రికల్లో ఒకటి, ఇద్దరు వ్యక్తులు ఇమిడివున్న ఒక సున్నితమైన సమస్యతో వ్యవహరిస్తుంది. ఒకరు ఫిలేమోను, రెండవ వ్యక్తి ఒనేసిము. వీరిద్దరు ఎవరు? వారి విషయంలో పౌలు ఎందుకు ఆసక్తి కనపర్చాడు?
పత్రిక గ్రహీత అయిన ఫిలేమోను ఆసియా మైనరులోని కొలొస్సయి నివాసి. ఆ ప్రాంతంలోని అనేక ఇతర క్రైస్తవులకు భిన్నంగా, ఫిలేమోనుకు పౌలు వ్యక్తిగతంగా తెలుసు. అపొస్తలుని ప్రకటనాపని మూలంగా ఆయన సువార్తను హత్తుకున్నాడు. (కొలొస్సయులు 1:1; 2:1) పౌలుకు ఆయన ‘ప్రియమైన జతపనివానిగా’ తెలుసు. ఫిలేమోను విశ్వాసానికీ ప్రేమకూ మాదిరిగా ఉన్నాడు. ఆయన తన తోటి క్రైస్తవులకు ఆతిథ్యమిచ్చేవానిగా సేదదీర్పునిచ్చేవానిగా ఉన్నాడు. ఫిలేమోను సంపన్నుడని స్పష్టమౌతుంది. ఎందుకంటే ఆయన ఇల్లు స్థానిక సంఘ కూటాల కొరకు ఉపయోగించుకోగల్గినంత పెద్దదిగా ఉంది. పౌలు పత్రికలో సంబోధించబడిన మరిద్దరు వ్యక్తులైన అప్ఫియ, అర్ఖిప్పులు ఫిలేమోను భార్యా కుమారుడై ఉండవచ్చని సూచించబడింది. ఫిలేమోనుకు ఒనేసిము అనే పేరుతో కనీసం ఒక్క బానిస అయినా ఉన్నాడు.—ఫిలేమోను 1, 2, 5, 7, 19బి, 22.
రోములో ఒక శరణార్థి
ఒనేసిము ఇంటినుండి 1,400 కంటే ఎక్కువ కిలోమీటర్ల దూరంలో పౌలుతో రోములో ఎందుకున్నాడో లేఖనములు మనకు చెప్పడం లేదు. అక్కడినుండే దాదాపు సా.శ. 61లో ఫిలేమోను పత్రిక వ్రాయబడింది. అయితే పౌలు ఫిలేమోనుకు ఇలా చెప్పాడు: “[ఒనేసిము] నీకు ఏ నష్టమైనను కలుగజేసినయెడలను, నీకు ఏమైన ఋణమున్నయెడలను, అది నా లెక్కలో చేర్చుము.” (ఫిలేమోను 18) ఒనేసిము తన యజమానియైన ఫిలేమోనుతో సమస్యల్లో ఉన్నాడని ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఇద్దరు మనుష్యుల్ని సమాధానపర్చాలన్న లక్ష్యంతో పౌలు ఆ పత్రిక వ్రాశాడు.
ఒనేసిము రోముకు పారిపోయేందుకు కావాల్సిన డబ్బుకొరకు ఫిలేమోను దగ్గర దొంగతనంచేసి ఆ తర్వాత శరణార్థి అయ్యాడని కొందరు సూచించారు. అక్కడాయన జనసమూహంలో అజ్ఞాతంగా జీవించవచ్చని ఉద్దేశించాడు.a గ్రీసు-రోము కాలంలో పలాయితులు తమ యజమానులకు మాత్రమే గాక ప్రజా పరిపాలనా వ్యవస్థకు కూడా ఒక పెద్ద సమస్యనే ఏర్పర్చారు. రోము నగరమే పలాయితులైన బానిసలకు “శరణాలయంగా ప్రసిద్ధికెక్కింది” అని చెప్పబడుతుంది.
పౌలుకు ఒనేసిము ఎలా ఎదురయ్యాడు? బైబిలు మనకు చెప్పడం లేదు. అయితే, స్వేచ్ఛాస్వాతంత్ర్యాల క్రొత్త మోజు తీరిపోయిన తర్వాత, బహుశ ఒనేసిము తాను చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నట్లు గ్రహించివుండవచ్చు. రోము నగరంలో ఒక ప్రత్యేక పోలీసు దళం శరణార్థి బానిసలను వేటాడేది, వారు చేసిన నేరం ప్రాచీన చట్టం ఎరిగిన అత్యంత గంభీరమైన నేరాల్లో ఒకటి. గెర్హార్ట్ ఫ్రెడ్రిక్ ప్రకారం: “పలాయితులైన బానిసలు పట్టుబడినప్పుడు వారి నుదుటిమీద ఇనుప ముద్ర వేసేవారు. వారిని తరచూ చిత్రహింసలకు గురిచేసేవారు . . . ఇతర బానిసలు వారి మాదిరిని అనుకరించకుండా ఉండేందుకు వారిని సర్కస్‌లోని క్రూర జంతువులకు వేసేవారు, లేక సిలువవేసేవారు.” బహుశ ఒనేసిము దగ్గరున్న దోపిడీ సొమ్మంతా అయిపోయిన తర్వాత, దాక్కోవడానికి కాస్త స్థలం కొరకో లేక ఉద్యోగం కొరకో వ్యర్థంగా వెదికి వేసారిన తర్వాత ఆయన రక్షణనివ్వమనో లేక మధ్యవర్తిత్వం నెరపమనో పౌలును అడిగివుంటాడని ఫ్రెడ్రిక్ అభిప్రాయపడుతున్నాడు. ఆయన పౌలును గురించి ఫిలేమోను ఇంట్లో వినివుంటాడు.
ఒనేసిము ఉద్దేశపూర్వకంగానే తన యజమాని స్నేహితుల్లో ఒకరి దగ్గరికి పారిపోయి ఉంటాడనీ, ఏదో కారణంచేత న్యాయయుక్తంగానే తన మీద కోపంగా ఉన్న తన యజమానితో ఆ స్నేహితుని పేరు ప్రతిష్ఠల ఆధారంగా తిరిగి సత్సంబంధాల్ని ఏర్పరుచుకునేందుకు ప్రయత్నించి ఉంటాడనీ మరితరులు నమ్ముతారు. అటువంటిది “సమస్యల్లో ఉన్న బానిసలకు సాధారణంగాను విస్తృతంగాను వ్యాపించి ఉన్న చిట్టచివరి ఆశ్రయం” అని చరిత్ర మూలాలు సూచిస్తున్నాయి. అలాగైతే, ఒనేసిము దొంగతనము చేసింది “బహుశ మధ్యవర్తియైన పౌలు దగ్గరికి చేరుకునేందుకేగాని, పారిపోవడానికి కాదు అన్నది మరింత ఎక్కువ సంభవనీయంగా ఉంది” అని బ్రయన్ రాప్స్కీ అనే విద్వాంసుడు అంటున్నాడు.
పౌలు సహాయం అందిస్తాడు
పారిపోవడానికి కారణం ఏదైనప్పటికీ కోపంతో ఉన్న తన యజమానితో సమాధానపడడానికి ఒనేసిము స్పష్టంగానే పౌలు సహాయాన్ని కోరాడు. ఇది పౌలుకు సమస్యను తెచ్చిపెట్టింది. ఇక్కడున్నదేమో శరణార్థి నేరస్థుడైన అవిశ్వాసియైన ఒక మాజీ బానిస. మరి తన క్రైస్తవ స్నేహితుడు తన చట్టబద్ధమైన హక్కును ఉపయోగించుకుని తీవ్రమైన శిక్షపడేలా చేయకుండా ఆయనను ఒప్పించడం ద్వారా అపొస్తలుడు ఈయనకు సహాయం చేయాలా? పౌలు ఏమి చేయాలి?
పౌలు ఫిలేమోనుకు వ్రాసే సమయానికి పలాయితుడు ఈ అపొస్తలుడి దగ్గర కొంతకాలం ఉన్నాడని స్పష్టమౌతుంది. ఒనేసిము ఒక ‘ప్రియ సహోదరుడయ్యాడని’ పౌలు చెప్పగలిగేంత కాలం ఒనేసిము ఆయన దగ్గర ఉన్నాడు. (కొలొస్సయులు 4:8, 9) ఒనేసిముతో తనకున్న ఆధ్యాత్మిక సంబంధం గురించి పౌలు, “నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను” అని చెప్పాడు. ఫిలేమోను ఊహించగల అన్ని సంభావ్య పరిణామాల్లో ఇది అన్నింటికన్నా అనూహ్యమైనది అయ్యుండవచ్చు. మునుపు ఆ బానిస “నిష్‌ప్రయోజనమైనవాడే” అయినా ఆయన ఒక క్రైస్తవ సహోదరునిగా తిరిగివస్తున్నాడని అపొస్తలుడు అన్నాడు. ఇప్పుడు ఒనేసిము “లాభకరమైన”వాడయ్యాడు లేక “ప్రయోజనకరమైనవాడాయెను,” ఆ విధంగా ఆయన సార్థకనామధేయుడయ్యాడు.—ఫిలేమోను 1, 8-12.
ఖైదులో ఉన్న పౌలుకు ఒనేసిము చాలా ప్రయోజనకరంగా ఉన్నాడు. నిజానికి, పౌలు ఆయన్ను తన దగ్గరే ఉంచుకునేవాడే, కానీ అది చట్టవిరుద్ధమే కాక ఫిలేమోను హక్కులను అతిక్రమించినట్లు కూడా అవుతుంది. (ఫిలేమోను 13, 14) ఫిలేమోను ఇంట్లో కూడుకునే సంఘానికి పౌలు దాదాపు అదే సమయంలో వ్రాసిన మరో పత్రికలో ఒనేసిమును గూర్చి, “నమ్మకమైన ప్రియసహోదరుడైన ఒనేసిమును మీయొద్దకు పంపుచున్నాను; ఇతడు మీయొద్దనుండి వచ్చినవాడే” అని అన్నాడు. ఒనేసిము తన నమ్మకత్వాన్ని అప్పటికే రుజువుపర్చుకున్నాడని ఇది సూచిస్తుంది.—కొలొస్సయులు 4:7-9.b
ఒనేసిమును దయతో స్వీకరించమని పౌలు ఫిలేమోనును ప్రోత్సహించాడు. కానీ ఆయనను అలా చేయమనో లేక తన బానిసకు స్వేచ్ఛను ప్రసాదించమనో ఆయనకు ఆజ్ఞాపించడానికి పౌలు తన అపొస్తలత్వ అధికారాన్ని ఉపయోగించలేదు. తమ స్నేహం మూలాన లేక పరస్పర ప్రేమ మూలాన ఫిలేమోను తాను అడిగిన దానికన్నా “ఎక్కువగా” చేస్తాడని పౌలు నిశ్చయతతో ఉన్నాడు. (ఫిలేమోను 21) ఆ ‘ఎక్కువ’ ఏమిటో అస్పష్టంగా వదిలివేయబడింది ఎందుకంటే కేవలం ఫిలేమోను మాత్రమే ఒనేసిము విషయమై ఏమి చేయాలన్నది సరిగ్గా నిర్ణయించగలడు. ఈ పలాయితుడు ‘పౌలుకు అప్పటికే చేస్తున్న సహాయాన్ని ఇంకా కొనసాగించేలా ఆయన్ను తిరిగి వెనక్కి పంపివేయమన్న’ కోరిక ఆయన మాటల్లో దాగివుందని కొందరు భాష్యం చెప్పారు.
ఒనేసిము విషయంలో పౌలు చేసిన విజ్ఞాపనలను ఫిలేమోను మన్నించాడా? అందుకాయన అంగీకరించాడన్న దాన్లో సందేహం లేదు, ఇది కొలొస్సయిలోని ఇతర బానిసల యజమానులను అప్రసన్నపర్చి ఉండవచ్చు. వారు ఒనేసిముకు తగిన శిక్ష పడాలని కోరుకుని ఉండవచ్చు, ఎందుకంటే అలా జరిగివున్నట్లైతే తమ స్వంత బానిసలు ఆయన మాదిరిని అనుకరించకుండా ఉండేందుకు అది హెచ్చరికగా ఉండేది.
ఒనేసిము—మారిన మనిషి
ఏదేమైనా, ఒనేసిము కొలొస్సయికి నూతన వ్యక్తిత్వంతో తిరిగివచ్చాడు. ఆయన ఆలోచనా దృక్పథం సువార్త శక్తితో మార్పుచెందింది, నిస్సందేహంగా ఆయన ఆ పట్టణంలోని క్రైస్తవ సంఘంలో విశ్వసనీయుడైన సభ్యునిగా తయారయ్యాడు. ఫిలేమోను ఒనేసిముకు చివరికి స్వేచ్ఛను ప్రసాదించాడా అన్నది లేఖనాల్లో వెల్లడి చేయబడలేదు. అయినా, ఆధ్యాత్మిక దృక్కోణం నుండి చూస్తే మాజీ పలాయితుడు ఇప్పుడు స్వేచ్ఛాజీవి అయ్యాడు. (1 కొరింథీయులు 7:22 పోల్చండి.) నేడు అనేకమంది అదే విధంగా రూపాంతరము చెందుతున్నారు. ప్రజలు బైబిలు సూత్రాలను తమ జీవితాల్లో అన్వయించుకున్నప్పుడు పరిస్థితులు, వ్యక్తిత్వాలు మారతాయి. మునుపు సమాజానికి నిష్ప్రయోజకులుగా పరిగణించబడ్డవారు ఆదర్శ పౌరులు కావడానికి సహాయం పొందారు.c
సత్యంలోనికి మారడం ఎంత గొప్ప తేడాను చూపించింది! మునుపటి ఒనేసిము ఫిలేమోనుకు “నిష్‌ప్రయోజనమైనవాడే” అయినా క్రొత్త ఒనేసిము నిస్సందేహంగా తన పేరుకు తగ్గట్టే జీవిస్తూ “లాభకరమైన” వ్యక్తి అయివుంటాడు. ఫిలేమోను, ఒనేసిము ఇద్దరూ క్రైస్తవ సహోదరత్వంలో ఐక్యమైవుండడం నిశ్చయంగా ఒక ఆశీర్వాదమే.
[అధస్సూచీలు]
a రోమా చట్టం సెర్వస్ ఫ్యూజిటివస్ (శరణార్థి బానిస)ను, ‘మళ్లీ ఎన్నడూ తిరిగిరాకూడదనే ఉద్దేశంతో తన యజమానిని విడిచిపెట్టిన వ్యక్తి’ అని నిర్వచిస్తుంది.
b తుకికు, ఒనేసిములు కొలొస్సయికి చేసిన తిరుగు ప్రయాణంలో పౌలు వ్రాసిన మూడు పత్రికలను వారికి అప్పగించడం జరిగిందన్నది స్పష్టం. ఈ మూడు పత్రికలు ఇప్పుడు బైబిలు ప్రామాణిక పుస్తకాల్లో చేర్చబడ్డాయి. ఫిలేమోనుకు వ్రాసిన ఈ పత్రికతోపాటు ఎఫెసీయులకు, కొలొస్సయులకు పౌలు వ్రాసిన పత్రికలను వారు తీసుకెళ్లారు.
c ఉదాహరణల కొరకు దయచేసి తేజరిల్లు!, జూలై 8, 1996, పేజీలు 15-20; ఏప్రిల్ 8, 1997, పేజీలు 26-28; కావలికోట, ఆగస్టు 1, 1989, (ఆంగ్లం) పేజీలు 30-1; ఫిబ్రవరి 15, 1997, పేజీలు 21-4 చూడండి.
[30వ పేజీలోని బాక్సు]
రోమా చట్టం క్రింద బానిసలు
రోమా చట్టం క్రింద సా.శ. మొదటి శతాబ్దంలోని బానిసలు పూర్తిగా తమ యజమాని దయాదాక్షిణ్యాలపై ఆధారపడేవారు. యజమానుల చిత్తచాపల్యానికి, వారి భోగాలకు, వారి కోపతాపాలకు అనుగుణ్యంగా నడుచుకునేవారు. వ్యాఖ్యానకర్త అయిన గెర్హార్ట్ ఫ్రెడ్రిక్ ప్రకారం, “అటు ప్రాథమికంగానూ, ఇటు చట్టపరంగానూ చూస్తే బానిస ఒక వ్యక్తి కాదు, ఒక వస్తువు. దాన్ని యజమాని ఎలాగైనా ఉపయోగించుకునేవాడు. . . . [ఆయనను] ఇంట్లోని పెంపుడు జంతువులతోను ఉపకరణాలతో సమానంగా చూసేవాడు. పౌరచట్టం కూడా ఎటువంటి విలువనూ ఇచ్చేది కాదు.” ఒక బానిస తాను అనుభవించిన అన్యాయాలకు ఎటువంటి చట్టబద్ధమైన పరిహారాన్నీ కోరలేడు. ప్రాథమికంగా, ఆయన కేవలం తన యజమాని ఆజ్ఞలను శిరసావహించాల్సిందే. కుపితుడైన యజమాని విధించే శిక్షలకు అంతే ఉండదు. చిన్న తప్పిదానికి కూడా ఆయన జీవన్మరణాలను ప్రసాదించే తన శక్తిని ఉపయోగించేవాడు.*
ధనికులకు ఎన్నో వందలమంది బానిసలు ఉన్నప్పటికీ కాస్త క్రింది తరహా కుటుంబాల్లో కూడా ఇద్దరు ముగ్గురు బానిసలు ఉండివుండవచ్చు. “ఇంటిబానిసలు చేసే పనులు ఎంతో వైవిధ్యం గలవై ఉండేవి” అని విద్వాంసుడైన జాన్ బార్క్లే అంటున్నాడు. “బానిసలు ద్వారపాలకులుగా, వంటలు చేసేవారిగా, వెయిటర్లుగా, శుభ్రంచేసేవారిగా, కొరియర్లుగా, వార్తాహరులుగా, పిల్లల్ని చూసుకునేవారిగా, వారిని సాకేవారిగా, అన్నిరకాల వ్యక్తిగత సహాయకులుగా పనిచేసేవారు. మరింత ధనికుల ఇండ్లల్లో పెద్దపెద్ద ఇండ్లల్లోని వివిధ రకాల ప్రొఫెషనల్‌ల గురించి ఇక చెప్పనక్కర్లేదు. . . . వాస్తవికమైన మాటల్లో చెప్పాలంటే, ఒక ఇంటిబానిస జీవితం చాలామట్టుకు తన యజమాని స్వభావంపై ఆధారపడివుండేది, అది రెండు విధాలుగా ప్రభావం చూపేది: క్రూరుడైన యజమాని ఉంటే పరిమితిలేని దౌష్ట్యానికి గురికావడము, అయితే దయగల, ఔదార్యవంతుడైన యజమాని ఉంటే జీవితం సహనయోగ్యంగాను ఆశాజనకంగాను ఉండేది. క్రూరమైన వ్యవహారానికి గురికావడం గురించి ప్రామాణిక సాహిత్యంలో ప్రసిద్ధిచెందిన ఉదాహరణలు ఉన్నాయి, అయితే కొందరు యజమానులూ బానిసల మధ్య ఉన్న అనురాగంతో కూడిన భావాలకు సాక్ష్యమిస్తూ కూడా అనేక ఉదాహరణలు ఉన్నాయి.”
*ప్రాచీన కాలాల్లోని దేవుని ప్రజల్లో బానిసత్వంపై, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన లేఖనములపై అంతర్దృష్టి (ఆంగ్లం), సంపుటి 2, పేజీలు 977-9 చూడండి.