అవి తమ సృష్టికర్తను నిశ్శబ్దంగా స్తుతిస్తున్నాయి
సూర్యాస్తమయాలు సహజంగానే అద్భుతంగా ఉంటాయి. అయితే ఇటలీలోని టస్కనీలో ఉన్న ఆపువన్ ఆల్ప్స్లోని ఈ పర్వతం వెనుకగా సూర్యుడు అస్తమించే దృశ్యం నిజంగా నిరుపమానమైనది.
కొంత దూరం నుండి వీక్షిస్తే సూర్యుడు ఈ పర్వతం వెనుకగా దిగుతుండడానికి బదులుగా దాని లోపలికే జాలువారుతున్నట్లు అనిపిస్తుంది. ఎందుకు? ఎందుకంటే ఈ పర్వత శిఖరంపై ఎవరో ఉలితో చెక్కినట్లుగా ఉన్న ఒక కమాను సహజంగానే ఉంది. నిజానికి, ఈ శిఖరం రంధ్రంగల పర్వతం అనే అర్థంగల మోంటే ఫోరాటో అనే పేరును సంపాదించుకుంది. భూమి పరిభ్రమణం మూలాన ప్రతి సంవత్సరం రెండుసార్లు మాత్రమే, కమానుగుండా చూసేవారికి సూర్యుడు మోంటే ఫోరాటోలోనికి జాలువారుతూ ఉన్నట్లు అనిపిస్తుంది.
సృష్టిలోని ఇతరవాటికి మల్లేనే, నిర్జీవమైన ఆకాశములు తమ సృష్టికర్తను స్తుతిస్తున్నాయి. ఎలా? ఒక అందమైన చిత్రం దాన్ని వేసిన చిత్రకారునికి ప్రశంసలు తెచ్చిన చందానే. నిజానికి, ఆకాశంలోని నక్షత్రాదులు యెహోవా శక్తిని గూర్చి, బుద్ధిని గూర్చి, ఆయన ప్రభావాన్ని గూర్చి మాట్లాడుతున్నాయి. కీర్తనల రచయిత మాటల్లో చెప్పాలంటే, “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.” (కీర్తన 19:1; 69:34) సూర్యుడు ఇంకా ఇతర నిర్జీవ వస్తువులు తమ సృష్టికర్తను స్తుతిస్తున్నప్పుడు మనమింకెంత ఎక్కువగా స్తుతించాలి!—కీర్తన 148:1, 3, 12, 13.