కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 1/15 పేజీలు 23-28
  • దేవుని వాక్యంలోని మన విశ్వాసాన్ని బలపరచుకోవడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని వాక్యంలోని మన విశ్వాసాన్ని బలపరచుకోవడం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని వాక్యం సత్యం మన విశ్వాసానికి ఆధారం
  • “విశ్వాసమునకు కర్త”యైన వానిని అనుకరించండి
  • విశ్వాసం మూలంగా జీవించడం
  • యెహోవా వాగ్దానాలపై విశ్వాసం ఉంచండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • మీకు సువార్తలో నిజంగా విశ్వాసం ఉందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • “మా విశ్వాసము వృద్ధి పొందించు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • విశ్వాసం​—మనల్ని బలపర్చే లక్షణం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 1/15 పేజీలు 23-28

దేవుని వాక్యంలోని మన విశ్వాసాన్ని బలపరచుకోవడం

చాలా మంది ప్రజలు మరే పుస్తకాని కన్నా ఎక్కువగా బైబిలునే చదివారు. అయితే వారిలో ఎంతమంది అందులోని సందేశంలో విశ్వాసాన్ని కనబరచారు? “విశ్వాసము అందరికి లేదు” అని బైబిలే చెబుతుంది. (2 థెస్సలొనీకయులు 3:2) మనం విశ్వాసంతో జన్మించలేదన్నది స్పష్టమే. దానిని పెంపొందించుకోవడం తప్పనిసరి. కొంత మేరకు విశ్వాసమున్నవాళ్ళు కూడా దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. విశ్వాసం క్షీణించి మృతం కాగలదు. కనుక, “విశ్వాస[ములో] . . . ఆరోగ్యముగలవారై” ఉండేందుకు ప్రయత్నం అవసరమై ఉంది.—తీతు 2:2, అధఃసూచి.

అందుకే, యెహోవాసాక్షుల పరిపాలక సభ తమ 1997/98 జిల్లా సమావేశాల పరంపరకు “దేవుని వాక్యంలో విశ్వాసం” అనే అంశాన్ని మంచి కారణంతోనే ఎన్నుకుంది. లక్షలాది మంది సాక్షులు మరియు ఇతరులు అలా దేవుని వాక్యంలోని తమ విశ్వాసాన్ని బలపరచుకునేందుకు సమావేశమయ్యే ఆధిక్యతను పొందారు.

దేవుని వాక్యం సత్యం మన విశ్వాసానికి ఆధారం

సమావేశం యొక్క మొదటి రోజు అంశమిదే. హాజరైన అందరినీ ప్రశంసించడంతో అది ప్రారంభమైంది. సమావేశానికి హాజరై ఉండడం బైబిలు ఎడల ఉన్న గౌరవానికి తార్కాణం. అయితే, ‘దేవుని వాక్యాన్ని ప్రమాణ గ్రంథంగా ఉపయోగిస్తూ మనం మన విశ్వాసాలను సమర్థించుకోగలుగుతున్నామా? బైబిలునూ, సంఘ కూటాలనూ, బైబిలు ఆధార ప్రచురణలను తేలిగ్గా తీసుకోకుండా ఆధ్యాత్మిక భోజనాన్ని మెచ్చుకుంటామా? మనం ప్రేమలో, జ్ఞానంలో, వివేచనలో ఎదుగుతున్నామా?’ వంటి మన విశ్వాసం యొక్క నాణ్యతను గురించిన ఆలోచనను రేకెత్తించే ప్రశ్నలు వేయబడ్డాయి. “‘దేవుని వాక్యంలో విశ్వాసం’ అనే ఈ జిల్లా సమావేశం మనలను మనం పరిశోధించుకునేందుకూ, మనకు వ్యక్తిగతంగా ఉన్న విశ్వాసం యొక్క పరిమాణాన్ని, నాణ్యతను పరిశీలించుకునేందుకు సహాయపడేలా సిద్ధం చేయబడింది” అని పేర్కొని, కార్యక్రమాన్ని అందరూ జాగ్రత్తగా ఆలకించాలని ప్రసంగీకుడు ప్రోత్సహించాడు.

ముఖ్యాంశ ప్రసంగం పేరు: “వెలిచూపువలనకాక విశ్వాసము వలననే నడుచుకొనుట.” (2 కొరింథీయులు 5:7) “యెహోవాసాక్షులయ్యేవారి విశ్వాసం తేలికైనది కాదు” అని ప్రసంగీకుడు అన్నాడు. అది ఎంత నిజం! యథార్థమైన విశ్వాసం గ్రుడ్డిది కాదు. అది వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది. హెబ్రీయులు 11:1 ఇలా చెబుతుంది: “విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది.” “మనం నిజంగా విశ్వాసంతో నడవబోతున్నట్లయితే, మంచి పునాదిగల విశ్వాసం మనకు అవసరం” అని ప్రసంగీకుడు పేర్కొన్నాడు. మనం కనిపించేదాన్ని బట్టి కాక, విశ్వాసం వలన నడుస్తున్నాము కనుకనే, యెహోవా సంకల్పంలోని ప్రతిదానినీ ఆయన ఎలా ఎప్పుడు నెరవేరుస్తాడనే దానిని గురించిన వివరాలు మనకు అవసరం లేదు. ఆయన గురించి మనకు ఇప్పటికే తెలిసిన విషయాలు తన వాగ్దానాలను ప్రేమపూర్వకంగా నీతియుక్తంగా నెరవేర్చగల ఆయన శక్తి మీద మనకు పూర్తి నమ్మకాన్నిస్తాయి.

“క్రైస్తవ యౌవనులు—సంఘంలో ఒక ముఖ్యభాగం” అనే ప్రసంగం తాము యెహోవాకు ఎంత విలువైనవారు అన్న విషయాన్ని యౌవనస్థులకు గుర్తు చేసింది. వాళ్ళు పూర్తి బైబిలును చదవడం, సమర్పణ బాప్తిస్మాలకు అవసరమైన యోగ్యతలను చేరుకోవడం వంటి లక్ష్య సాధనల కోసం ప్రయత్నించడం ద్వారా ఆధ్యాత్మికంగా ఎదగాలని ప్రోత్సహించబడ్డారు. అదనపు విద్యాభ్యాసాన్ని పొందాలా అన్నది తమ తల్లిదండ్రులతో చర్చించి నిర్ణయించుకోవలసిన వ్యక్తిగత విషయం. ఒకవేళ దానిని చేపట్టినట్లయితే, మరెక్కువ ఫలకరంగా దేవుడ్ని సేవించడానికి అది తమను సంసిద్ధులను చేయాలన్నదే ఎల్లప్పుడూ ముఖ్య లక్ష్యమై ఉండాలి. మన విశ్వాసంతో సంబంధం గల ‘శ్రేష్ఠమైన కార్యములను వివేచించు [“నిశ్చయపరచు,” NW]’కున్నప్పుడు లౌకిక విద్యాభ్యాసం ప్రయోజనకరమైన ఉద్దేశాన్ని సాధిస్తుంది.—ఫిలిప్పీయులు 1:9, 10.

తరువాత జరిగిన మూడు ప్రసంగాల గోష్ఠి యొక్క అంశం “మీరు ఎవరి ప్రమాణాలు పాటిస్తారు?” దేవుని వాక్యంలో విశ్వాసం బైబిలు ప్రమాణాలను అనుసరించేందుకు మనలను కదిలిస్తుంది. క్రైస్తవులు యెహోవా నియమాలను సూత్రాలను అనుసరిస్తారు. ఉదాహరణకు, అసభ్యమైన నీచమైన భాషను ఉపయోగించకూడదని లేఖనాలు మనకు ఉద్బోధిస్తున్నాయి. (ఎఫెసీయులు 4:31, 32) ప్రసంగీకుడు ఇలా ప్రశ్నించాడు: “మీకు కోపం వచ్చినప్పుడు లేదా చికాకుపుట్టినప్పుడు మీ వివాహజతను లేదా మీ పిల్లలను తిట్టిపోస్తారా?” అది నిజంగా అక్రైస్తవమౌతుంది. మన వ్యక్తిగత రూపం విషయంలో కూడా దేవునికి ప్రమాణాలున్నాయి. క్రైస్తవులు “అణుకువ . . . గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల”ను ధరించాలి. (1 తిమోతి 2:9, 10) “అణుకువ” అనే పదం స్వగౌరవం, గౌరవభావం, సంయమనం, మితత్వం అనే తలంపునిస్తుంది. మనం ఇతరుల మీద మనకు గల ప్రేమవల్ల ప్రేరేపించబడతాం, బైబిలు సూత్రాల ద్వారా, సరైన విషయాలను గూర్చిన స్పృహ ద్వారా నడిపించబడతాం.

తర్వాతి రెండు ప్రసంగాల్లో హెబ్రీయులు 3:7-15 మరియు 4:1-16లోని ప్రతి వచనాన్ని పరిశీలించడం ఇమిడి ఉంది. ఈ బైబిలు భాగాలు “పాపమువలన కలుగు భ్రమచేత . . . కఠినపరచ”బడే ప్రమాదాన్ని గూర్చి మనలను హెచ్చరించాయి. (హెబ్రీయులు 3:13) పాపానికి వ్యతిరేకమైన మన పోరాటంలో మనమెలా సఫలీకృతులం కాగలం? యెహోవా తన వాక్యం ద్వారా మనకు సహాయం చేస్తాడు. నిజానికి, “దేవుని వాక్యము సజీవమై బలముగలదై . . . హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.”—హెబ్రీయులు 4:12.

సమావేశం యొక్క మొదటిరోజటి చివరి ప్రసంగం “సర్వమానవాళి కొరకైన గ్రంథం.” ఇది బైబిలు యొక్క ప్రామాణికతను, కచ్చితత్వాన్ని, మరియు ఆచరణాత్మక విలువనూ ఉన్నతపర్చింది. సర్వమానవాళి కొరకైన గ్రంథం అనే 32 పేజీల క్రొత్త బ్రోషూరు విడుదలను ప్రసంగీకుడు ప్రకటించినప్పుడు ఎంత థ్రిల్లింగ్‌గా ఉండిందో! విద్యావంతులైనప్పటికీ, బైబిలు గురించి అంతగా తెలియని ప్రజల కోసమే ఈ క్రొత్త ప్రచురణ ప్రత్యేకంగా తయారు చేయబడింది. “ప్రజలు తమకై తామే దేవుని వాక్యాన్ని పరిశీలించవలసిన అవసరం ఉంది. వాళ్ళు స్వయంగా పరిశీలిస్తే, సాటిలేని గ్రంథమైన బైబిలు నిజంగా సర్వమానవాళి కొరకైన గ్రంథమని వాళ్ళు గ్రహిస్తారని మనకు నమ్మకముంది!” అనే మాటలతో ఆ ప్రసంగం ముగిసింది.

“విశ్వాసమునకు కర్త”యైన వానిని అనుకరించండి

సమావేశపు రెండవ రోజటి ఈ అంశం “మన విశ్వాసానికి కర్త”యైన యేసుక్రీస్తు వైపుకు మన అవధానాన్ని తీసుకువెళ్ళింది. మనం “(ఆయన) అడుగుజాడలయందు నడుచుకొన”వలసిన అవసరం ఉంది. (హెబ్రీయులు 12:2; 1 పేతురు 2:21) ‘ప్రభువైన యేసు మీద విశ్వాసముంచండి, మీరు రక్షించబడతారు!’ అని క్రైస్తవ మత సామ్రాజ్యంలోని అనేకులకు చెప్పబడింది. అయితే విశ్వాసం మాత్రముంటే సరిపోతుందా? ‘క్రియలు లేని విశ్వాసము మృతము’ అని బైబిలు ఉద్ఘాటిస్తోంది. (యాకోబు 2:26) కనుక, మనం యేసు మీద విశ్వాసముంచడంతో పాటు, ఆయన చేసిన పనులను చేయాలి, ముఖ్యంగా దేవుని రాజ్యసువార్తను ప్రకటించడం ద్వారా ఆయన చేసినట్లే చేయాలి.

ఉదయం కార్యక్రమం సువార్త పని మీద కేంద్రీకరించబడింది. పౌలులాగే, రక్షణ సువార్తను ప్రకటించేందుకు మనం అత్యంతాసక్తితో ఉండాలి. (రోమీయులు 1:14-16) యేసు అన్నిచోట్ల ఉన్న ప్రజలకు ప్రకటించాడు. మనం క్రమంగా చేసే ఇంటింటి పరిచర్య ఫలాలను ఉత్పన్నం చేస్తున్నప్పటికీ, మనం ఇంటింటి పనిని చేస్తున్నప్పుడు చాలా మంది ప్రజలు ఇండ్లలో ఉండరు. (అపొస్తలుల కార్యములు 20:20) చాలా మంది పాఠశాలలోనో, పనిచేస్తూనో, కొనుగోలు చేస్తూనో, ప్రయాణం చేస్తూనో ఉంటారు. కనుక, బహిరంగ స్థలాల్లోనూ, ప్రజలు కనిపించే స్థలాలు ఎక్కడైనా సరే అక్కడంతా కూడా మనం ప్రకటించవలసిన అవసరం ఉంది.

“సత్యంలో వేరుపారి స్థిరపడండి” అనే ప్రసంగం బాప్తిస్మం పొందిన క్రొత్త శిష్యుల సంఖ్యను మనకు గుర్తు చేసింది. రోజుకు సరాసరి 1,000 మంది అన్నదే ఆ సంఖ్య! ఈ క్రొత్తవారు విశ్వాసంలో వేరుపారి స్థిరులవ్వడం చాలా ప్రాముఖ్యం. (కొలొస్సయులు 2:6, 7) అక్షరార్థ వేర్లు మొక్కకు ఆధారాన్ని లేక బలాన్ని ఇస్తూనే నీటినీ పోషక పదార్థాలను పీల్చుకుంటాయి అని ప్రసంగీకుడు వివరించాడు. అలాగే, మంచి పఠన అలవాట్ల ద్వారా, ఆరోగ్యకరమైన సహవాసం ద్వారా క్రొత్త శిష్యులు సత్యంలో స్థిరులు కాగలరు.

ఈ ఉపదేశం ముఖ్యంగా బాప్తిస్మ అభ్యర్థులకు సముచితమైనది. అవును, సమావేశం యొక్క రెండవ రోజున క్రొత్త శిష్యుల పెద్ద సమూహాలు యేసు మాదిరిని అనుకరిస్తూ బాప్తిస్మం పొందాయి. “దేవుని వాక్యంలో విశ్వాసం బాప్తిస్మమునకు నడిపిస్తుంది” అనే ప్రసంగం నీటిలో పూర్తిగా మునగడం పూర్వపు స్వార్థ జీవన శైలి విషయమై చనిపోవడానికి సరైన ప్రతీకమనీ, నీళ్ళలో నుండి వాళ్ళను పైకి లేపడం దేవుని చిత్తం కొరకు వాళ్ళు జీవింపజేయబడడానికి ప్రాతినిధ్యం వహిస్తుందనీ అభ్యర్థులకు గుర్తు చేసింది.

“విశ్వాసం నిమిత్తం గట్టిగా పోరాడండి” అనే ప్రసంగం బైబిలు పుస్తకమైన యూదాపై ఆధారపడింది. అనైతికత, తిరుగుబాటుతనము, మరియు విశ్వాసభ్రష్టత వంటి హానికరమైన ప్రభావాలను వ్యతిరేకించడం ద్వారా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలని మనం ప్రోత్సహించబడ్డాం. తరువాత, తల్లిదండ్రులు—ముఖ్యంగా తండ్రులు—“మీ కుటుంబ అవసరాలు తీర్చండి” అనే ప్రసంగంలో ప్రత్యేక అవధానాన్ని పొందారు. కుటుంబం యొక్క ఆధ్యాత్మిక, శారీరక, భావోద్వేగ అవసరాలను తీర్చడం లేఖనాధారమైన బాధ్యత. (1 తిమోతి 5:8) ఇందుకు సమయమూ, విషయాలను చర్చించుకోవడమూ, సాన్నిహిత్యం అవసరం. తమ పిల్లలను సత్యంలో పెంచేందుకు క్రైస్తవ తల్లిదండ్రులు చేసే కఠినయత్నాలన్నింటిలోనూ యెహోవా తప్పకుండా ఆనందిస్తాడు.

“యెహోవా మందిరమునకు వెళ్లుదము రండి” అనే తర్వాతి గోష్ఠి క్రైస్తవ కూటాల ఎడల మనకున్న మెప్పుదలను పెంపొందింపజేసింది. కూటాలు ఈ లోకపు చింతల నుండి ఉపశమనాన్నిస్తాయి. కూటాల్లో మనం పరస్పరం ప్రోత్సాహాన్నందించుకునే అవకాశముంది, మన తోటి విశ్వాసుల ఎడల ప్రేమను కనబరచుకోగలుగుతాం. (హెబ్రీయులు 10:24, 25) బోధకులముగా మన నైపుణ్యాలకు సానబెట్టేందుకు కూడా కూటాలు సహాయపడతాయి, అవి దేవుని సంకల్పాన్ని గూర్చిన మన అవగాహనను లోతైనవిగా చేస్తాయి. (సామెతలు 27:17) సంఘం నుండి మనలను మనం వేరు చేసుకోకుండా ఉందాం. “ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని” యేసు చెప్పిన మాటలను గుర్తుంచుకుందాం.—మత్తయి 18:20.

ఆ రోజటి చివరి ప్రసంగం “మీ విశ్వాసనాణ్యత—ఇప్పుడు పరీక్షించబడింది.” పరీక్షించబడని విశ్వాసం యొక్క విలువ నిరూపించబడకుండా, దాని నాణ్యత తెలియకుండా ఉండిపోతుంది. అది ఇంతవరకూ డబ్బుగా మారని చెక్కువంటిది. దాని మీద చూపించబడిన మొత్తం అంత విలువ దానికి నిజంగా ఉందా? అలాగే, మన విశ్వాసానికి సత్వం ఉందనీ, దానికి నిజమైన నాణ్యత ఉందనీ నిరూపించబడేందుకు అది పరీక్షించబడాలి. (1 పేతురు 1:6, 7) “ఒక్కోసారి, క్రైస్తవ మత గురువులూ, విశ్వాసభ్రష్టులూ మనపై నిందారోపణలను మోపేందుకూ, మన క్రైస్తవ విశ్వాసాలపై, మన జీవన విధానంపై తప్పుడు అభిప్రాయాలను కలిగించేందుకు వార్తా మాధ్యమాలను అలాగే, అధికారులను ఉపయోగించారు. . . . సాతాను చేత అంధులైనవారు మనలను భయపెట్టేందుకు, మనలను నిరాశపరచేందుకు, సువార్త నిమిత్తం మనం సిగ్గుపడేలా చేసేందుకు మనం అనుమతిస్తామా? సత్యం విషయమై చెప్పబడిన అబద్ధాలు మనం క్రమంగా కూటాలకు హాజరవ్వడాన్నీ, మన ప్రకటనా పనిని బాధించేందుకు మనం అనుమతిస్తామా? లేక మనం దృఢంగానూ, ధైర్యవంతులంగానూ ఉండి, యెహోవాను గురించిన, ఆయన రాజ్యాన్ని గురించిన సత్యాన్ని ప్రకటించడంలో కొనసాగాలని మునుపటి కన్నా మరింత దృఢ నిశ్చయతతో ఉంటామా?” అని ప్రసంగీకుడు అన్నాడు.

విశ్వాసం మూలంగా జీవించడం

సమావేశం యొక్క మూడవ రోజటి అంశం “ధర్మశాస్త్రముచేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలయనగా—నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును” అన్న పౌలు మాటలపై ఆధారపడి ఉంది. (గలతీయులు 3:11) “మనకాలము కొరకైన యోవేలు ప్రవచన వాక్కులు” అనే గోష్ఠి ఆ ఉదయం కార్యక్రమం యొక్క ఉన్నతాంశాల్లో ఒకటి. యోవేలు పుస్తకం మన కాలాన్ని సూచిస్తూ, అత్యవసర భావంతో ఇలా అంటోంది: “ఆహా, యెహోవా దినము వచ్చెనే అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయమువలెనే సర్వశక్తునియొద్దనుండి వచ్చును.” (యోవేలు 1:15) ఎడతెరపి లేకుండా వచ్చే మిడతల వలెనే, ఈ అంత్య కాలంలో రాజ్య ప్రకటనకు ఆటంకం కలిగించేందుకు అభిషిక్త క్రైస్తవులు దేనినీ అనుమతించలేదు.

యోవేలు పుస్తకం ఇలా చెబుతూ మనకు నిరీక్షణను కూడా ఇస్తుంది: “యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థనచేయు వారందరును రక్షింపబడుదురు.” (యోవేలు 2:32) దీనికి యెహోవా నామాన్ని ఉపయోగించడం కన్నా ఎక్కువ భావముంది. హృదయపూర్వక పశ్చాత్తాపం అవసరం. అందులో తప్పిదం వైపుకు మళ్ళకుండా ఉండడం ఇమిడి ఉంది. (యోవేలు 2:12, 13) జాగు చేసేందుకు సమయం లేదు, ఎందుకంటే, మోయాబీయలు, అమ్మోనీయుల విషయంలోనూ, యూదా రాజైన యెహోషాపాతు కాలంలో శేయీరు పర్వత ప్రాంతం విషయంలోను చేసినట్లుగానే త్వరలోనే జనాంగాలకు యెహోవా శిక్ష విధించబోతున్నాడు.—2 దినవృత్తాంతములు 20:1-30; యోవేలు 3:2, 12.

“యెహోవాకొరకు కనిపెట్టుకొని ఉండడం ద్వారా విశ్వాసాన్ని కనబరచండి” అనే ప్రసంగం ద్వారా అందరూ ప్రోత్సహించబడ్డారు. ఇప్పుడు, ఈ అంత్య దినాల ఆఖర్లో ఉన్న మనం యెహోవా చేసిన అనేక వాగ్దానాల నెరవేర్పును గుర్తుచేసుకోగలం. ఇంకా జరగనున్న విషయాల్లో మనం చాలా ఆసక్తితో ఉన్నాం. యెహోవా వాగ్దానం చేసిన ప్రతిదీ జరుగుతుందని జ్ఞాపకముంచుకుని యెహోవా ప్రజలు ఓపికతో ఉండడంలో కొనసాగాలి.—తీతు 2:13; 2 పేతురు 3:9, 10.

“మీ కంటిని తేటగా ఉంచుకోండి” అనే నాటకంతో ఉదయం కార్యక్రమం ముగిసింది. వాస్తవాలను గురించిన ఈ నాటకం భౌతిక విషయాలను అన్వేషించే విషయంలో మన దృక్పథమేమిటో పరిశీలించుకునేందుకు మనలను ప్రోత్సహించింది. మనమెక్కడ జీవించినా, మన జీవితం చింతలు లేనిదిగా ఉండాలని మనం కోరుకుంటున్నట్లయితే, మన కంటిని తేటగా ఉంచుకుని దేవుని రాజ్యంపై స్పష్టమైన అవధానాన్నుంచుకోవాలని యేసు చెప్పిన మాటలను మనం అనుసరించడం తప్పనిసరి.—మత్తయి 6:22.

బహిరంగ ప్రసంగం యొక్క ఆసక్తికరమైన అంశం “విశ్వాసం మరియు మీ భవిష్యత్తు.” అది ప్రపంచ సమస్యలను పరిష్కరించలేని మానవ నాయకుల అశక్తతకు రుజువునిచ్చింది. (యిర్మీయా 10:23) మానవ చరిత్ర—పెద్ద పరిమాణంలో వినాశకరమైన పరిమాణంలో—పునరావృతమౌతోంది. యెహోవాసాక్షులు భవిష్యత్తును గురించి ఎలా భావిస్తారు? నమ్మకస్థులైన మానవులకు దేవుని రాజ్యం క్రింద ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని మనం నమ్ముతాం. (మత్తయి 5:5) “యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి” అని చెబుతున్న ఆయన వాక్యంలో విశ్వాసముంచుతున్న వారందరి ప్రయోజనార్థం దేవుడు తన వాగ్దానాలను నెరవేరుస్తాడు.—యెషయా 55:6.

యేసు మన దినాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తాడు. “మనుష్యకుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమిమీద విశ్వాసము కనుగొనునా?” అని ఆయన ప్రశ్నించాడు. (లూకా 18:8) చివరి ప్రసంగం మొత్తం సమావేశ కార్యక్రమాన్ని పునఃసమీక్షించి, విశ్వాసం లేని లౌకిక ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పటికీ, దేవుని వాక్యంలో విశ్వాసం అనేది ఉనికిలో ఉందని ప్రతిధ్వనించే రుజువును కార్యక్రమం ఎలా ఇచ్చిందో కూడా చూపించింది.

అయినప్పటికీ, ‘దేవునిలోనూ, ఆయన వాక్యంలోనూ అచంచల విశ్వాసమున్నవారిలో నేనున్నానా?’ అని మనలను మనం ప్రశ్నించుకోవచ్చు. ఆ ప్రశ్నకు అవును అని జవాబిచ్చేందుకు “దేవుని వాక్యంలో విశ్వాసం” అనే జిల్లా సమావేశం మనకు సహాయం చేయాలి. తనలోనూ, తన ప్రేరేపిత వాక్యమైన బైబిలులోనూ మనకున్న విశ్వాసాన్ని బలపరచినందుకు యెహోవాకు మనమెంత కృతజ్ఞులమో!

[24వ పేజీలోని చిత్రం]

వేల కొలది ప్రతినిధులకు సౌకర్యాలను కలిగించేందుకు అనేక మంది స్వచ్ఛంద సేవకులు ఆనందంగా పనిచేశారు

[25వ పేజీలోని చిత్రం]

పరిపాలక సభలో ఒకరైన ఎల్‌. ఏ. స్వింగిల్‌ క్రొత్త బ్రోషూర్‌ను విడుదల చేయడం

[25వ పేజీలోని చిత్రం]

ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పెద్ద స్టేడియమ్‌లు ఉపయోగించబడ్డాయి

[26వ పేజీలోని చిత్రం]

అనేకులు యెహోవాకు తాము చేసుకున్న సమర్పణకు ప్రతీకగా బాప్తిస్మం తీసుకున్నారు

[27వ పేజీలోని చిత్రం]

సమావేశమైనవారు రాజ్యగీతాలను ఆనందంగా ఆలపించారు. ఇన్‌సెట్‌: “మీ కంటిని తేటగా ఉంచుకోండి” అనే నాటకం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి