మన ప్రియమైనవారి కోసం ముందుగా పథకం వేయడం
ఒక ఆఫ్రికా వార్తాపత్రికలో ఆనీ విచార గాథ ఇటీవల కనిపించింది. ఆనీ భర్త ఒక వ్యాపారస్థుడు. ఆయన 1995లో చనిపోయినప్పుడు ఆయనకున్న ఆస్తి 15 వాహనాలు; అనేక బ్యాంక్ అకౌంట్లు; దాదాపు 4,000 (అమెరికా) డాలర్ల డబ్బు; ఒక దుకాణం; ఒక బార్; మూడు పడక గదులున్న ఒక ఇల్లు. కానీ ఆయన వీలునామా పత్రాన్ని వ్రాసి ఉంచలేదు.
ఆనీ మరిది ఆ ఆస్తినీ, డబ్బునూ లాగేసుకుని ఆమెనూ, ఆమె ఆరుగురు పిల్లలనూ ఇంటినుండి గెంటేశాడని నివేదించబడింది. ఏ దిక్కూలేని ఆమె తన పిల్లలతోపాటు ఇప్పుడు తన అన్నగారింట్లో ఉంటోంది. స్కూల్ ఫీజులకు గానీ, స్కూల్ యూనిఫారమ్లకు గానీ డబ్బు లేనందువల్ల నలుగురు పిల్లలు చదువు మానుకోవలసి వచ్చింది.
ఆనీ హైకోర్టుకు అప్లై చేసింది. ఆమెకు కొంత ఆస్తినీ, ఒక వాహనంతో సహా ఇచ్చేయాలని కోర్టు తీర్పునిచ్చింది. కానీ ఏదీ తిరిగి ఇవ్వబడలేదు. హైకోర్టు తీర్పు ప్రకారం చేయమని తన మరిదిని బలవంతపెట్టే లిఖిత ఉత్తర్వు కోసం ఆమె మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి.
మరణాన్ని గురించి ఎందుకు ఆలోచించాలి?
తను మరణిస్తే ఏమి చేయాలో కుటుంబ శిరస్సు పథకం వేయకపోతే ఏమి జరుగుతుందో ఆనీ కథ వివరిస్తుంది. మరణించినప్పుడు, మానవులందరూ “తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు.” (కీర్తన 49:11) అంతేకాక, తమ ఆస్తులను ఏమి చేస్తున్నారనే విషయాన్ని మృతులు నియంత్రించలేరు. (ప్రసంగి 9:5, 10) తన సొత్తు విషయంలో తన ఉద్దేశమేమిటో తెలిపేందుకు ఒక వ్యక్తి మరణానికి ముందే అన్ని ఏర్పాట్లూ చేయాలి.
మనం అనుకోని సమయంలో చనిపోవచ్చని మనకందరికీ తెలిసినప్పటికీ, బ్రతికివుండే తమ ప్రియమైనవారి కోసం ముందుగా ఏర్పాట్లు చేయడంలో అనేకులు విఫలులౌతున్నారు. మన చర్చ ఆఫ్రికాలోని కొన్ని సంస్కృతులపై అవధానముంచుతున్నప్పటికీ, మిగిలిన భూభాగంలోనూ అలాంటి సమస్యలు ఉనికిలో ఉన్నాయి.
ఒకవేళ మీరు చనిపోతే మీ ఆస్తిని ఏమి చేయాలనే విషయంలో మీరు చర్యలను తీసుకుంటారా అన్నది వ్యక్తిగతమైన విషయం. (గలతీయులు 6:5) అయితే, ఒకరు ఇలా అడగవచ్చు: ‘ఒక వ్యక్తి బ్రతికివున్నప్పుడు తన భార్యను, పిల్లలనూ ప్రేమిస్తాడు, పోషిస్తాడు, కానీ ఒకవేళ తను చనిపోతే కూడా వాళ్ళు సురక్షితంగా ఉండేందుకు తగిన ఏర్పాట్లను చేయడెందుకని?’ మనం చనిపోతామన్న సాధ్యతను గురించి తలంచడానికి మనలో అనేకులం ఇష్టపడం, మన మరణం సంబంధంగా పథకం వేయడానికి అస్సలు ఇష్టపడం అన్నదే ముఖ్యకారణం. చాలా కొద్దిమంది మాత్రమే మరణ విషయంలో పథకం వేస్తారు. వాస్తవానికి, “రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరివంటివారే” అని బైబిలు చెబుతున్నట్లు, మనమెప్పుడు చనిపోతామో ముందుగా చెప్పలేం.—యాకోబు 4:14.
మరణం సంభవిస్తే జరగవలసిన విషయాలను పథకం వేయడం ఆచరణాత్మకం. బ్రతికివుండేవారి ఎడల ఉన్న ప్రేమపూర్వక శ్రద్ధను అది చూపిస్తుంది. విషయాలను మనం ఏర్పాటు చేయకపోతే, ఇతరులు చేస్తారు. బహుశా మనమెరుగని వ్యక్తులు మన ఆస్తి విషయంలోను, మన అంత్యక్రియల విషయంలోనూ నిర్ణయం తీసుకుంటారు. అలా ముందుగా ఏర్పాటు చేయని కేసుల్లో, కొన్ని దేశాల్లో, మన డబ్బూ, ఆస్తీ ఎవరికి చెందాలి అనే విషయం ప్రభుత్వమే తీర్మానిస్తుంది. ఇతర ప్రాంతాల్లో బంధువులు తీర్మానిస్తారు, దానితో తరచూ గొడవలు జరుగుతాయి, అది కుటుంబ సభ్యుల మధ్య ద్వేషాన్ని రగిలిస్తుంది. అంతేకాక, తీర్మానించబడిన విషయం మీరనుకుని ఉండగల దానికి ఎంతో భిన్నంగా ఉండవచ్చు.
ఆస్తిని లాక్కోవడం
భర్త చనిపోయినప్పుడు భార్య చాలా కష్టాలపాలవుతుంది. తన భర్తను కోల్పోయిందన్న బాధకు తోడు, ఆమెకు చెందవలసిన ఆస్తి దోచుకోబడుతుంది. ఆనీ విషయంలో ఇదెలా జరిగిందో మొదట వివరించబడింది. భార్యలు ఎలా ఎంచబడుతున్నారన్న విషయం కూడా ఆస్తి దోచుకోబడడానికి కొంత కారణం కాగలదు. కొన్ని సంస్కృతుల్లో, ఒక వ్యక్తి యొక్క భార్య ఆ కుటుంబంలో సభ్యురాలిగా ఎంచబడదు. మరోలా చెప్పాలంటే, ఆమె పరాయిదే, ఆమె తన పుట్టింటికి తిరిగి వెళ్ళవచ్చు, లేదా మళ్లీ మరో పెళ్ళి చేసుకోవచ్చు. దానికి విరుద్ధంగా, కొన్ని సంస్కృతుల తలంపు ప్రకారం, ఒక వ్యక్తి యొక్క అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తల్లిదండ్రులు అతనిని ఎన్నడూ ఎడబాయరు. ఆయన మరణిస్తే, ఆయనవన్నీ ఆయన భార్యకూ పిల్లలకూ కాక, తమకే చెందుతాయనీ ఆయన కుటుంబంలోని వాళ్ళు అనుకుంటారు.
భార్య మీద నమ్మకంలేని భర్తలు అలాంటి తలంపును ప్రోద్బలపరుస్తారు. మైక్ తన వ్యాపార వ్యవహారాలను తన సహోదరులతో మాత్రమే చర్చించేవాడు. ఆయన ఆస్తులేవో వాళ్ళకు తెలుసు, కాని ఆయన భార్యకు తెలియదు. ఆయన మరణించినప్పుడు, ఆయన సహోదరులు ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె భర్త ఋణస్తులు తిరిగి ఇవ్వవలసి ఉండిన డబ్బును డిమాండ్ చేశారు. ఆమెకు అసలు దాని గురించి తెలియను కూడా తెలియదు. తర్వాత, వాళ్ళు ఆమె కోసం ఆమె భర్త కొన్న ఫోటోకాపీయర్లనూ, టైప్రైటర్లనూ బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. చివరికి ఆయన అన్నదమ్ములు ఆ ఇంటినీ, అందులో ఉన్న సమస్తాన్నీ తీసేసుకున్నారు. ఈ విధవరాలు తన చిన్నారితోపాటు కట్టుబట్టలతో ఇల్లు వదిలి వెళ్ళవలసి వచ్చింది.
“వారిద్దరును ఏకశరీరమగుదురు”
క్రైస్తవ భర్తలు తమ భార్యలను ప్రేమించి, వారిని నమ్మదగినవారిగా పరిగణిస్తారు. అలాంటి భర్తలు “పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు” అన్న లేఖనాధార సలహాను హృదయంలోనికి తీసుకుంటారు. “పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు” అన్న దైవ ప్రేరేపిత మాటలతో ఈ భర్తలు ఏకీభవిస్తారు కూడా.—ఎఫెసీయులు 5:28, 31.
“ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును” అని వ్రాసిన క్రైస్తవ అపొస్తలుడైన పౌలుతో కూడా దైవభక్తిగల భర్తలు ఏకీభవిస్తారు. (1 తిమోతి 5:8) ఈ సూత్రానికి అనుగుణ్యంగా, ఒక క్రైస్తవుడు సుదూర ప్రయాణానికి పథకం వేస్తే, ఆయన దూరంగా ఉన్నప్పుడు తన కుటుంబానికి సరైన సంరక్షణ ఉండేలా ఏర్పాట్లు చేస్తాడు. అలాగే, ఒకవేళ ఆయన చనిపోతే, ఆయన భార్యా, పిల్లల కోసం సంరక్షణ ఏర్పాట్లు చేయడం సహేతుకం కాదా? అనూహ్య దుర్ఘటనలకు సిద్ధం కావడం ఆచరణాత్మకమే కాక, ప్రేమపూర్వకం కూడా.
అంత్యక్రియల సంబంధమైన ఆచారాలు
క్రైస్తవ భర్తలు ఈ విషయానికి సంబంధించిన మరో కారకాన్ని కూడా పరిగణించవలసి ఉంది. విధవరాలు తన భర్తను, ఆస్తిని, బహుశా తన పిల్లలను కూడా కోల్పోయానని దుఃఖిస్తుండగా, దానికి తోడు పారంపర్య దుఃఖాచారణ చేయాలని కొన్ని సమాజాలు ఆమెను బలవంతపెడ్తాయి. విధవరాలు తన భర్త శవంతో పాటు ఆ చీకటి గదిలోనే నిద్రపోవాలని కొన్ని ప్రాంతాల్లోని పారంపర్యాలు చెబుతాయని నైజీరియాలోని ద గార్డియన్ అనే వార్తాపత్రిక విలపిస్తోంది. మరి కొన్ని ప్రాంతాల్లో విధవరాండ్రు దాదాపు ఆరునెలల దుఃఖాచరణ వరకూ తమ ఇంటిని వదిలిపెట్టి ఎక్కడికీ వెళ్ళకూడదు. ఆ సమయంలో వాళ్ళు స్నానం చేయకుండా ఉండడం తప్పనిసరి. భోజనానికి ముందు లేక తర్వాత చేతులు కడుక్కోవడం కూడా నిషిద్ధమే.
అలాంటి ఆచారాలు ముఖ్యంగా క్రైస్తవ విధవరాండ్రకు సమస్యలను తెచ్చిపెడ్తాయి. దేవుడ్ని ప్రీతిపరచాలన్న వాళ్ళ కోరిక బైబిలు బోధలకు అనుగుణ్యంగా లేని ఆచారాలను విడిచిపెట్టడానికి వారిని కదిలిస్తుంది. (2 కొరింథీయులు 6:14, 17) అయితే ఒక విధవరాలు ఈ ఆచారాలను అనుసరించనందువల్ల హింసలపాలవ్వవచ్చు. ఆమె తన ప్రాణరక్షణ కొరకు పారిపోవలసిన అవసరం కూడా రావచ్చు.
చట్టబద్ధమైన చర్యలను గైకొనడం
“శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు” అని బైబిలు జ్ఞానయుక్తంగా చెబుతుంది. (సామెతలు 21:5) కుటుంబ శిరస్సు ఎలాంటి యోచనలు చేయవచ్చు? తన మరణానంతరం తన ఆస్తిని ఎలా పంచిపెట్టాలో తెలియజేసే వీలునామాను లేదా డాక్యుమెంటునూ ఒక వ్యక్తి తయారు చేయడం అనేక సమాజాల్లో సాధ్యమే. అందులో తన అంత్యక్రియల ఏర్పాట్లను గురించి కూడా ఇమడ్చవచ్చు. తన అంత్యక్రియల సంబంధంగా, దుఃఖాచరణ ఆచారాల విషయంలో తన వివాహజత ఏమి చేయాలి (లేదా ఏమి చేయకూడదు) అనే వివరాలను ఆ డాక్యుమెంట్లో ప్రత్యేకంగా చెప్పవచ్చు.
లీఆ అనే స్త్రీ భర్త 1992లో మరణించాడు. ఆమె ఇలా అంటోంది: “నాకు ఐదుగురు పిల్లలు—నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. మావారు తను చనిపోవడానికి కొంత కాలం ముందు అనారోగ్యానికి గురయ్యారు. ఆయన అనారోగ్యం పాలుకాకముందే, ఆయన సొత్తంతా నాకూ, నా పిల్లలకూ దక్కాలనుకుంటున్నానని వ్రాసి పెట్టారు. అందులో ఇన్సురెన్స్ డబ్బూ, పొలం, పాడి పశువులు, ఇల్లూ ఉన్నాయి. ఆయన వీలునామాపై సంతకం పెట్టి నాకు ఇచ్చేశారు. . . . మావారు మరణించాక, ఆయన పిత్రార్జితంలో భాగం కావాలని బంధువులు వచ్చి అడిగారు. ఆయన తన సొంత డబ్బుతో పొలం కొన్నారనీ, వాళ్ళకు అందులో ఏ హక్కూ లేదనీ చెప్పాను. లిఖితపూర్వక వీలునామాను చూసినప్పుడు వాళ్ళు దానితో ఏకీభవించారు.”
కుటుంబంతో విషయాలను చర్చించడం
ఒక వ్యక్తి తన నమ్మకాలను గురించి, అభిలాషలను గురించి తన కుటుంబంవారితో మాట్లాడకపోతే సమస్యలు తలెత్తవచ్చు. ఒక గ్రామంలో ఒక వ్యక్తి మరణించినప్పుడు అంత్యక్రియలు స్థానిక ఆచారాల ప్రకారం జరగాలని ఆయన బంధువులు పట్టుపట్టిన విషయాన్ని పరిశీలించండి. వాళ్ళు అతని భార్యనీ, ఆమె పిల్లలను బెదిరించినప్పుడు, వాళ్ళు ఆయన మృతదేహాన్ని విస్తృత కుటుంబ సభ్యులకు వదిలిపెట్టడం తప్పనిసరైంది. ఆమె ఇలా విలపిస్తోంది: “నా భర్త తన అంకుళ్ళలో లేదా కజిన్లలో కనీసం ఒక్కరికైనా తన అంత్యక్రియలు ఎలా జరగాలనుకుంటున్నాడో చెప్పివుంటే, ఆ కుటుంబం తమ సాంప్రదాయిక అంత్యక్రియాచారాల విషయమై పట్టుపట్టకపోయి ఉండేది.”
కొన్ని సమాజాల్లో లిఖిత డాక్యుమెంటులాగే మౌఖిక సమ్మతి కూడా కట్టుబడేలా చేస్తుంది. స్వాజీలాండ్లో సాంప్రదాయిక అంత్యక్రియలనూ, దుఃఖాచార పద్ధతులనూ ప్రోద్బలపరచే ప్రాంతాల్లో ఇది నిజం. ఇది తెలిసిన ఐసక్ అనే ఒక క్రైస్తవుడు యెహోవాసాక్షులు కానటువంటి తన బంధువులనందరినీ సమావేశపరచి, తన మరణం తర్వాత ఏమి చేయాలని తను కోరుకుంటున్నాడో చర్చించాడు. నిర్దిష్ట ఆస్తి ఎవరికి చెందాలో చెప్పి, తన అంత్యక్రియలు ఎలా జరగాలో స్పష్టంగా వివరించాడు. ఆయన మరణించిన తర్వాత, ఆయన అభిలాషల ప్రకారమే అన్నీ నిర్వహించబడ్డాయి. ఐసక్ను క్రైస్తవులు చేసినట్లే సమాధి చేశారు, ఆయన భార్య చక్కగా సంరక్షించబడింది.
మీ కుటుంబాన్ని కాపాడండి
మీరు చనిపోయిన తర్వాత మీ కుటుంబ సంరక్షణ కోసం మీరు ఏం చేస్తారన్నది వ్యక్తిగత విషయం. అయితే ఎడ్వార్డ్ అనే ఒక క్రైస్తవుడు ఇలా అంటున్నాడు: “నా కుటుంబంలోని ఎనిమిది మంది సభ్యుల కోసం నేను ఒక జీవిత భీమా పాలసీని తీసుకున్నాను. నా బ్యాంక్ అక్కౌంట్కు నా భార్యే సంతకం చేసింది. కనుక నేను చనిపోతే, ఆ అక్కౌంట్ నుండి ఆమె డబ్బు డ్రా చేయగలదు. . . . నా కుటుంబ ప్రయోజనార్థం నేను వీలునామాను కూడా వ్రాసిపెట్టాను. నేను చనిపోతే, నేను విడిచిపెట్టే ఆస్తంతా నా భార్యా పిల్లలకే చెందుతుంది. నేను నా వీలునామాను ఐదు సంవత్సరాల క్రితమే వ్రాసేశాను. దానిని వకీలు తయారు చేశాడు. నా భార్య దగ్గరా, నా కుమారుని దగ్గరా దాని నకలు ఉంది. నా అంత్యక్రియల విషయంలో మా విస్తృత కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోకూడదని నేను నా వీలునామాలో ప్రత్యేకంగా పేర్కొన్నాను. నేను యెహోవా సంస్థకు చెందినవాడను. కనుక నా అంత్యక్రియలను నిర్వహించడానికి కేవలం ఒకరో ఇద్దరో సాక్షులే ఉన్నా చాలు. నేను దీనిని మా విస్తృత కుటుంబ సభ్యులతో చర్చించాను.”
ఒక అర్థంలో చెబితే, అలాంటి ఏర్పాట్లు చేయడం మీ కుటుంబానికి మీరిచ్చే కానుకే. నిజమే, మరణం సంభవించిన తర్వాత జరగవలసినవాటిని పథకం వేయడం చాక్లేట్లనో, పువ్వుల గుత్తినో కానుకగా ఇచ్చినట్లు కాదనుకోండి. అయితే, అది మీ ప్రేమను తెలియజేస్తుంది. మీరు వాళ్ళతోపాటు ఇక ఉండని సమయంలో కూడా ‘మీ యింటివారు సంరక్షించబడాలని’ మీరు కోరుకుంటున్నారని అది నిరూపిస్తుంది.
[21వ పేజీలోని బాక్సు]
యేసు తన తల్లి కోసం ఏర్పాటు చేశాడు
“ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్యయైన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువయొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి—అమ్మా, యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను, తరువాత శిష్యుని చూచి—యిదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియనుండి ఆ శిష్యుడు [యోహాను] ఆమెను తన యింట చేర్చుకొనెను.”—యోహాను 19:25-27.
[22వ పేజీలోని చిత్రం]
అనేకులు తమ కుటుంబాలను సంరక్షించేందుకు సాలోచనగా చట్టబద్ధమైన ఏర్పాట్లను చేస్తారు