కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 1/15 పేజీలు 3-7
  • సంక్షోభం నడుమ—క్రైస్తవత్వం ఆచరణలో

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సంక్షోభం నడుమ—క్రైస్తవత్వం ఆచరణలో
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కాంగోలో యుద్ధం
  • అవసరాన్ని మదింపు చేసుకోవడం
  • ప్రజలు ఉదారంగా ఇచ్చారు
  • కాంగోలో పంపకం
  • సాక్షులు కానివారికి సహాయం
  • శరణార్థి శిబిరాలు
  • రువాండానందలి విషాదకర సంఘటనా బాధితులను సంరక్షించుట
    తేజరిల్లు!—1995
  • సహాయక చర్యలు చేపట్టడం పవిత్రసేవలో ఒక భాగం
    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
  • ‘సంతోషంతో యెహోవాను సేవించేలా’ పరదేశులకు సహాయం చేయడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • పరిష్కారం ఏమిటి?
    తేజరిల్లు!—1996
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 1/15 పేజీలు 3-7

సంక్షోభం నడుమ—క్రైస్తవత్వం ఆచరణలో

1994 ఏప్రిల్‌లో ఒకరోజున అకస్మాత్తుగా సమస్యలన్నీ వచ్చిపడ్డాయి. విమానం కూలిపోవడంవల్ల బురుండీ మరియు రువాండా ప్రెసిడెంట్లు చనిపోయారు. రువాండాలో కొన్ని గంటల్లోనే భయంకరమైన హింస చెలరేగింది. ఆ తర్వాత, మూడు నెలల కన్నా కాస్త ఎక్కువ కాలవ్యవధిలో 5,00,000 కన్నా ఎక్కువ మంది రువాండావాసులు—పురుషులు, స్త్రీలు, పిల్లలు—చనిపోయారు. కొంత మంది ప్రజలు ఆ కాలాన్ని “జాతి నిర్మూలనము”గా పేర్కొంటారు.

రువాండాలోని 75 లక్షల మంది నివాసుల్లో సగం మంది పారిపోవలసి వచ్చింది. ఇందులో పొరుగు దేశాల్లో ఆశ్రయాన్ని పొందిన 24 లక్షల మంది కూడా ఉన్నారు. అది ఆధునిక చరిత్రలో అతి పెద్ద, అతి వేగంగా జరిగిన శరణార్థుల నిర్గమనం. జైర్‌లో (ఇప్పుడు కాంగో డెమోక్రాటిక్‌ రిపబ్లిక్‌), టాన్జానియాలో, బురుండీలో శరణార్థుల శిబిరాలు అతివేగంగా స్థాపించబడ్డాయి. ఆ శిబిరాల్లో కొన్ని 2,00,000 మంది ప్రజలకు ఆశ్రయాన్నిచ్చాయి. అవి ప్రపంచంలోకెల్లా అతి పెద్ద శిబిరాలు.

తమ జీవితాల్లో బైబిలు సూత్రాలను అన్వయించుకునే శాంతిప్రియులైన జనమైన యెహోవాసాక్షుల్లోని అనేకులు కూడా ఆ శరణార్థుల్లో ఉన్నారు. వారు ఏ దేశంలో నివసించినా, తాటస్థ్యాన్ని నిష్కర్షగా పాటిస్తూ, “వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును” అని యెషయా 2:4లో కనిపించే మాటల్లోవున్న సూత్రాన్ని అన్వయించుకుంటారు. రువాండాలోని జాతినిర్మూలనలో పాల్గొనని మతగుంపుగా యెహోవాసాక్షులు సర్వవ్యాప్తంగా గుర్తించబడ్డారు.

తన అనుచరులు “లోకసంబంధులు కారు” అని యేసుక్రీస్తు చెప్పాడు. అయితే, వారు “లోకములో ఉన్నారు” గనుక, జనముల సంక్షోభాల నుండి ఎల్లప్పుడూ తప్పించుకోలేరు. (యోహాను 17:11, 14) రువాండాలో జాతినిర్మూలన జరిగిన సమయంలో, దాదాపు 400 మంది సాక్షులు తమ ప్రాణాలను కోల్పోయారు. దాదాపు 2,000 మంది సాక్షులు మరియు రాజ్య సందేశంలో ఆసక్తిగల వ్యక్తులూ శరణార్థులయ్యారు.

యెహోవాసాక్షులు లోక సంబంధులు కారని అంటే విపత్తులు సంభవించినప్పుడు వాళ్లు చేతులు కట్టుకుని కూర్చుంటారని భావమా? కాదు! “సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనము లేక యున్నప్పుడు, మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యక—సమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము? ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును” అని దేవుని వాక్యం చెబుతుంది. (యాకోబు 2:15-17) పొరుగు ప్రేమ విభిన్న మత విశ్వాసాలున్నవారికి కూడా సహాయం చేసేందుకు యెహోవాసాక్షులను పురికొల్పుతుంది.—మత్తయి 22:37-40.

రువాండాలో విపత్కర పరిస్థితులను ఎదుర్కుంటున్న తమ తోటి విశ్వాసులకు సహాయపడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు ఆశించినప్పటికీ, సహాయ కార్యక్రమాల సమన్వయం పశ్చిమ యూరప్‌కు నియమించబడింది. 1994 వేసవిలో, ఆఫ్రికాలోని తమ క్రైస్తవ సహోదర సహోదరీలకు సహాయం చేసేందుకు సాక్షుల స్వచ్ఛంద సేవకుల ఒక బృందం యూరప్‌ నుండి వేగంగా ముందుకు వచ్చింది. రువాండా శరణార్థుల కోసం చక్కగా సంస్థీకరించబడిన శిబిరాలూ, తాత్కాలిక ఆసుపత్రులు నెలకొల్పబడ్డాయి. పెద్ద పరిమాణంలో వస్త్రాలు, రగ్గులు, ఆహారమూ, బైబిలు సాహిత్యం విమానం ద్వారా గానీ, ఇతర మార్గాల ద్వారా గానీ చేరవేయడం జరిగింది. 7,000 కన్నా ఎక్కువ మంది బాధితులు—ఆ సమయంలో రువాండాలో ఉన్న యెహోవాసాక్షుల సంఖ్యకన్నా దాదాపు మూడు రెట్లు ఎక్కువ—ఆ సహాయ కార్యక్రమాల ద్వారా ప్రయోజనం పొందారు. ఆ సంవత్సరం డిసెంబర్‌ నెల వచ్చేసరికి, అనేక మంది యెహోవాసాక్షులతో సహా, వేలకొలది శరణార్థులు తమ ఇండ్లను పునఃనిర్మించుకుని, తమ దైనందిన జీవితాన్ని పునరారంభించుకునేందుకు రువాండాకు తిరిగి చేరుకున్నారు.

కాంగోలో యుద్ధం

డెమోక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలోని తూర్పు ప్రాంతంలో 1996లో యుద్ధం మొదలైంది. ఈ ప్రాంతానికి సరిహద్దులు రువాండా మరియు బురుండీ. అక్కడ మానభంగాలూ, హత్యలూ మళ్ళీ జరిగాయి. దూసుకువెళ్తున్న బుల్లెట్ల మధ్య నుండీ, మండుతున్న గ్రామాల నుండీ ప్రజలు బ్రతుకు జీవుడా అంటూ పారిపోయారు. యెహోవాసాక్షులు ఆ సంక్షోభంలో చిక్కుకున్నారు, సుమారు 50 మంది చనిపోయారు. కొందరు గురి తప్పిన బుల్లెట్ల చేత చనిపోయారు. మరితరులు ఒక ప్రత్యేక గుంపుకు చెందినవారవ్వడం వల్లా, లేదా వాళ్ళు శత్రువులని అపార్థం చేసుకోవడంవల్లా చంపబడ్డారు. 150 మంది సాక్షులు నివసించిన ఒక గ్రామం అగ్నితో నిర్మూలం చేయబడింది. మరితర గ్రామాల్లో డజన్ల లెక్కన ఇండ్లూ, కొన్ని రాజ్య మందిరాలు కాల్చివేయబడ్డాయి. ఇండ్లనూ, వస్తువులను కోల్పోయిన సాక్షులు ఇతర ప్రాంతాలకు తరలివెళ్ళగా అక్కడ ఉన్న తోటి ఆరాధకులు వాళ్ళకు సహాయం చేశారు.

యుద్ధం తర్వాత కరవులు ఏర్పడతాయి, ఎందుకంటే, యుద్ధం వల్ల పంటలు పాడైపోతాయి, ఆహార నిల్వలు దోచుకోబడతాయి, రవాణా మార్గాలు అస్థవ్యస్తమవుతాయి. లభ్యమయ్యే ఆహారానికేమో చాలా ధర ఉంటుంది. 1997 మే ఆరంభంలో కిసాంగనీలో, ఒక కిలో బంగాళా దుంపల ధర దాదాపు వంద రూపాయలు, చాలా మంది ప్రజలు కొనుక్కోలేనంత ధర అది. అధికసంఖ్యాకులు రోజుకు ఒక పూట భోజనాన్ని మాత్రమే కొనుక్కోగలిగారు. అవును, ఆహార కొరత మూలంగా రోగాలు వస్తాయి. మలేరియాను అతిసార వ్యాధులను, ఉదర సంబంధ సమస్యలను ఎదుర్కొనే శరీర శక్తిని కుపోషణ బలహీనపరుస్తుంది. ముఖ్యంగా పిల్లలు వాటితో బాధపడి మరణిస్తారు.

అవసరాన్ని మదింపు చేసుకోవడం

యూరప్‌లోని యెహోవాసాక్షులు ఈ అవసరాలకు మళ్ళీ వెంటనే ప్రతిస్పందించారు. 1997 ఏప్రిల్‌ అయ్యేసరికి ఇద్దరు వైద్యులతో సహా యెహోవాసాక్షుల సహాయ కార్యక్రమ జట్టు మందులతోను, డబ్బుతోను రంగంలోకి ప్రవేశించింది. గోమాలోని స్థానిక సాక్షులు అవసరమైన సహాయాన్ని వెంటనే ఇవ్వగల్గేలా పరిస్థితిని మదింపు చేసేందుకు సహాయ కార్యక్రమ కమిటీలను అప్పటికే సంస్థీకరించేశారు. ఆ జట్టు ఆ నగరంలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ అన్వేషణలు జరిపింది. బహు దూరపు ప్రాంతాల నుండి నివేదికను సంపాదించేందుకు సందేశకులను పంపడం జరిగింది. గోమాకు పశ్చిమాన 1,000 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరంలో ఉన్న కిసాంగనీ నుండి కూడా సమాచారం సేకరించబడింది. దాదాపు 700 మంది సాక్షులు నివసిస్తున్న గోమాలో సహాయ కార్యక్రమాల సమన్వయానికి స్థానిక సహోదరులు తోడ్పడ్డారు.

గోమాలోని ఒక క్రైస్తవ పెద్ద ఇలా అన్నాడు: “మాకు సహాయం చేసేందుకు, ఎంతో దూరం నుండి వచ్చిన సహోదరులను చూసి కదిలించబడ్డాం. వాళ్ళు రాక ముందు, మేము ఒకరికొకరం సహాయం చేసుకున్నాం. సహోదరులు తమ పల్లె పొలిమేర్ల నుండి పారిపోయి గోమాలోకి రావలసి వచ్చింది. కొందరు తమ ఇండ్లను కోల్పోయారు, వాళ్ళు తమ పొలాలను కూడా వదిలిపెట్టారు. మేము వాళ్ళను మా ఇండ్లకు తీసుకువెళ్ళి, మా వస్త్రాలను, మా దగ్గరవున్న కొద్దిపాటి ఆహారాన్ని వాళ్ళతో పంచుకున్నాం. మేము స్థానికంగా ఎక్కువేమీ చేయలేకపోయాం. మాలో కొందరు కుపోషణ వల్ల బాధపడ్డారు.

“అయితే, యూరప్‌లోని మన సహోదరులు తీసుకువచ్చిన డబ్బు సరిపోనటువంటి, చాలా ధరవున్న ఆహార పదార్థాలను కొనుక్కునేందుకు మాకు సహాయపడింది. సరిగ్గా అన్నీ నిండుకున్న విషమ సమయంలో ఆహారపదార్థాలు చేరుకున్నాయి. ఆ సమయంలో అనేకుల ఇండ్లలో తినడానికి ఏమీ లేవు. సాక్షులకూ, సాక్షులు కాని వాళ్ళకు కూడా మేము ఆహారాన్ని పంచిపెట్టాం. ఆ సమయంలో ఆ సహాయం అందకపోతే, మరెక్కువ మంది, మరి ముఖ్యంగా పిల్లలు చనిపోయివుండేవారు. యెహోవా తన ప్రజలను కాపాడాడు. సాక్షులు కాని వాళ్ళు చాలా ముగ్ధులయ్యారు. అనేకులు మన మధ్యవున్న ఐకమత్యాన్ని గురించీ, ప్రేమను గురించీ కామెంట్‌ చేశారు. మనదే సత్య మతమని కొందరు ఒప్పుకున్నారు.”

స్థానికంగా ఆహారపదార్థాలు కొనడం జరిగినప్పటికీ, వైద్య నిర్వహణ జరిగినప్పటికీ, ఇంకా చాలా అవసరాలుండేవి. వస్త్రాలు, రగ్గులు, అలాగే, మరెక్కువ ఆహారపదార్థాలు మరియు మందుల సరఫరాల అవసరత ఉండేది. పాడైన ఇండ్లను పునర్నిర్మించుకునేందుకు కూడా సహాయం అవసరమైంది.

ప్రజలు ఉదారంగా ఇచ్చారు

యూరప్‌లోని సహోదరులు సహాయం చేయడానికి మళ్ళీ ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. ఇక్కడి సహాయ అవసరతను ఫ్రాన్స్‌లోని లూవీఆర్స్‌లో ఉన్న యెహోవాసాక్షుల కార్యాలయం రాన్‌ వ్యాలీలోనూ, అలాగే నార్‌మాన్‌డీలోనూ, అలాగే పారిస్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఉన్న సంఘాలకు తెలియజేసింది. “కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును అని యీ విషయమై చెప్పవచ్చును. సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును” అన్న మరో లేఖనాధార సూత్రం అన్వయించదగిన సమయమది.—2 కొరింథీయులు 9:6, 7.

వేలాది మంది ఇచ్చే ఆ అవకాశాన్ని ఆనందంగా ఉపయోగించుకున్నారు. వస్త్రాలు, షూలూ, మరితర వస్తువులూ ఉన్న పెట్టెలూ, సంచీలూ రాజ్యమందిరాల్లోకి కుప్పలుతెప్పలుగా వచ్చాయి. తర్వాత అవి ఫ్రాన్స్‌లోని యెహోవాసాక్షుల బ్రాంచ్‌ ఆఫీస్‌లోకి తరలించబడ్డాయి. “జైర్‌కు సహాయపడండి” అనే ప్రాజెక్ట్‌లోని తర్వాతి చర్యలో భాగం వహించేందుకు 400 మంది స్వచ్ఛంద సేవకులు అక్కడ సిద్ధంగా ఉన్నారు. విరాళంగా ఇవ్వబడిన వస్తువులు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతుండగా, ఈ స్వచ్ఛంద సేవకులు వస్త్రాలను వేరు చేసి, మడిచి, పెట్టెల్లో ప్యాక్‌ చేసి ఒక ప్యాలట్‌లో 30 పెట్టెల చొప్పున సర్దేశారు. పిల్లలు ఆఫ్రికాలోని తమ చిన్నారి సహోదరులను, సహోదరీలను గురించి తలంచి ఆటవస్తువులను—మెరుస్తున్న కార్లను, బొంగరాలను, బొమ్మలను, టెడ్డీబేర్లను—పంపారు. ఇతర నిత్యావసర వస్తువులతోపాటు వాటిని కూడా ప్యాక్‌ చేశారు. మొత్తం మీద, 12 మీటర్ల కొలత గల తొమ్మిది కంటైనర్లను నింపి కాంగోకు రవాణా చేశారు.

బెల్జియమ్‌, ఫ్రాన్స్‌, మరియు స్విట్జర్‌లాండ్‌లలోని వేలాదిమంది సాక్షుల తోడ్పాటుతో మధ్యాఫ్రికాకు ఎంత సహాయం అందించబడింది? 1997 జూన్‌ అయ్యేసరికి, మొత్తం 500 కిలోల మందులు, 10 టన్నుల హైప్రొటీన్‌ బిస్కట్‌లు, 20 టన్నుల ఇతర ఆహార పదార్థాలు, 90 టన్నుల వస్త్రాలు, 18,500 జతల షూలు, 1,000 రగ్గులు పంపించబడ్డాయి. బైబిలు సాహిత్యం కూడా పంపబడింది. ఇదంతా కూడా ఎంతో ప్రశంసించబడింది. ఇది శరణార్థులను సాంత్వనపరచింది, తమ శ్రమలను సహించేందుకు వాళ్ళకు సహాయపడింది. సరఫరాకు అయిన ఖర్చు దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు. అలాంటి విరాళాలు యెహోవాకు సేవ చేసేవారి మధ్య ఉన్న సహోదరత్వానికీ, ప్రేమకూ తార్కాణం.

కాంగోలో పంపకం

అలా వస్తువులు కాంగోకు చేరుకోవడం మొదలుపెట్టేసరికి, స్థానిక సహాయ కార్యక్రమ కమిటీతో పనిచేసేందుకు ఫ్రాన్స్‌ నుండి ఇద్దరు సహోదరులూ, ఒక సహోదరీ వచ్చేశారు. కాంగోలోని సాక్షుల కృతజ్ఞతా వ్యక్తీకరణలను గురించి జాస్‌లన్‌ ఇలా చెప్పింది: “మేము అనేక ప్రశంసా లేఖలను అందుకున్నాం. ఒక పేద సహోదరి నాకు మాలకైట్‌ ఆభరణాన్ని ఇచ్చింది. మరి కొందరు తమ సొంత ఫొటోలను మాకిచ్చారు. మేము బయలుదేరుతుండగా సహోదరీలు నన్ను ముద్దుపెట్టుకుని, కౌగిలించుకుని ఏడ్చారు. నేను కూడా ఏడ్చేశాను. అనేకులు ‘యెహోవా మంచివాడు. యెహోవా మన గురించి తలస్తాడు’ వంటి కామెంట్లు చేశారు. చూపించబడిన ఔదార్యానికంతటికీ యెహోవాకే ఘనతనివ్వాలి అని వాళ్ళు గ్రహించారు. మేము ఆహారాన్ని పంచిపెడుతున్నప్పుడు, సహోదర సహోదరీలు రాజ్య గీతాలతో యెహోవాను కీర్తించారు. ఆ సందర్భం ఎంతో కదిలించేదిగా ఉంది.”

లోయీక్‌ అనే డాక్టర్‌ ఆ జట్టులోని ఒక సభ్యుడు. అనేకులు రాజ్యమందిరంలోకి వచ్చి, సహాయాన్ని పొందేందుకుగాను తమ వంతు కోసం ఓపికగా వేచివున్నారు. తను కూడా ఏమైనా చేయాలనుకున్న ఒక కాంగో సహోదరి డాక్టర్‌ కోసం వేచివున్న వారి కోసమని 40 డోనట్‌లను చేసి విరాళంగా ఇచ్చింది. అయితే చికిత్స కోసం వేచివున్నవారి సంఖ్య 80 కావడంతో ఒక్కొక్కరికి సగం డోనట్‌ చొప్పున ఇవ్వడం జరిగింది.

సాక్షులు కానివారికి సహాయం

మానవత్వంతో కూడిన ఈ సహాయం అందజేయబడింది కేవలం యెహోవాసాక్షులకు మాత్రమే కాదు. 1994లో అనేకులు ప్రయోజనం పొందినట్లే, ఇతరులు కూడా ప్రయోజనం పొందారు. “కాబట్టి మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము” అని గలతీయులు 6:10 చెబుతున్నదానికి అనుగుణ్యంగా ఉందిది. (ఇటాలిక్కులు మావి.)

గోమాకు సమీపాన ఉన్న అనేక ప్రాథమిక పాఠశాలలకూ, అనాథ శరణాలయానికి కూడా సాక్షులు మందులను, వస్త్రాలను పంచిపెట్టారు. ఆ అనాథ శరణాలయం 85 మంది పిల్లల గృహము. అక్కడి పరిస్థితిని మదింపు చేసుకునేందుకు మునుపు వెళ్ళిన సహాయ కార్యక్రమ జట్టు ఆ అనాథ శరణాలయాన్ని సందర్శించి, 50 బాక్సుల నిండా హైప్రొటీన్‌ బిస్కట్‌లనూ, మరియు వస్త్రాలనూ, అలాగే 100 రగ్గులనూ, మందులనూ, ఆటవస్తువులనూ సరఫరా చేస్తామని వాగ్దానం చేసింది. పిల్లలు ప్రాంగణంలో వరుసగా నిలబడి, సందర్శకుల కోసం పాటలు పాడారు. తర్వాత, తాము ఆడుకునేందుకు ఒక ఫుట్‌బాల్‌ తెచ్చిస్తారా అని ప్రత్యేకంగా అడిగారు.

అనేక వారాల తర్వాత, సహాయ కార్యక్రమ జట్టు తాము సరఫరా చేస్తామని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చింది. ఆ ఔదార్యాన్ని బట్టీ, తనకివ్వబడిన బైబిలు సాహిత్యంలో తాను చదివినదానిని బట్టీ ముగ్ధుడైన ఆ అనాథ శరణాలయ డైరెక్టర్‌ తాను ఒక యెహోవాసాక్షి అవ్వాలన్న కోరిక తనలో మొలకెత్తిందని చెప్పాడు. పిల్లలకు ఒక ఫుట్‌బాల్‌ ఇవ్వబడిందా? ఫ్రాన్స్‌ నుండి వచ్చిన సహాయ కార్యక్రమ జట్టు సమన్వయకర్తయైన క్లాడ్‌ ఇలా జవాబిచ్చాడు. “లేదు, మేము వాళ్ళకు రెండు ఫుట్‌బాల్‌లను ఇచ్చాం.”

శరణార్థి శిబిరాలు

సహాయం కాంగోకు మాత్రమే పరిమితం చేయబడలేదు. వేల కొలది శరణార్థులు యుద్ధం జరుగుతున్న ప్రాంతం నుండి సమీపానవున్న గ్రామంలోనికి పారిపోయారు. అక్కడ సత్వరంగా మూడు శరణార్థి శిబిరాలు స్థాపించబడ్డాయి. వాళ్ళకు ఏ సహాయం చేయవచ్చో చూసేందుకు గాను సాక్షులు అక్కడికి కూడా ప్రయాణమయ్యారు. ఈ నివేదిక తయారయ్యేసరికి, ఈ శిబిరాలు 2,11,000 మంది శరణార్థులకు ఆశ్రయాన్నిచ్చాయి. ఈ శరణార్థుల్లో అనేకులు కాంగో నుండి వచ్చినవారే. వారిలో దాదాపు 800 మంది సాక్షులు మరియు వారి పిల్లలు, అలాగే రాజ్య సువార్తలో ఆసక్తివున్న వ్యక్తులు ఉన్నారు. ఆ శిబిరాల్లో వెంటనే పరిష్కరించవలసిన సమస్య ఆహార కొరతనే. ఒక శిబిరంలో, మూడు రోజులకు సరిపడే ఆహారపదార్థమే ఉంది. అందులో ఉన్న బీన్స్‌ మూడు సంవత్సరాల క్రితంవి.

అయినప్పటికీ, సాక్షులు మంచి స్ఫూర్తితో ఉన్నారు. వాళ్ళ దగ్గర బైబిలు సాహిత్యం చాలా కొంచెమే ఉన్నప్పటికీ, వాళ్ళు తమను తాము ఆధ్యాత్మికంగా నిర్మించుకునేందుకు ఆరుబయట కూటాలను క్రమంగా జరుపుకునేవారు. ఆ శిబిరంలో ఉన్న ఇతరులతో దేవుని రాజ్యసువార్తను ప్రకటించడంలో కూడా వాళ్ళు చాలా బిజీగా ఉండేవారు.—మత్తయి 24:14; హెబ్రీయులు 10:24, 25.

సాక్షుల అన్వేషణ జట్టులో ఒక డాక్టర్‌ కూడా ఉన్నాడు. ప్రతి శిబిరంలోను కేవలం కొన్ని రోజులు ఉండడానికే అధికారులు వారికి అనుమతినిచ్చినప్పటికీ, వాళ్లు వైద్య సంప్రదింపులు జరిపారు. క్రైస్తవ పెద్దల చేతికి డబ్బును, మందులను అప్పజెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. అలా సహోదరులు మనుగడ సాగించగలిగారు. శిబిరాల్లో ఉన్న సాక్షులు త్వరగా స్వదేశానికి తిరిగి చేరుకోవాలని కూడా ఆ జట్టు కోరుకుంది.

భవిష్యత్తు విషయమేమిటి? యేసుక్రీస్తు మన దినాలను గురించి గొప్ప సంక్షోభం ఉండే కాలమనీ, యుద్ధాల ద్వారా, ఆహార కొరత ద్వారా గుర్తించబడే కాలమనీ ముందే చెప్పాడు. (మత్తయి 24:7) దేవుని రాజ్యం మాత్రమే ఇప్పుడు భూమి మీద ఉన్న కష్టాలను అంతం చేస్తుందని యెహోవాసాక్షులకు తెలుసు. దాని పరిపాలన క్రింద, విధేయత గల మానవజాతి కోసం మన భూ గృహం శాంతి, సమృద్ధి, నిత్య సంతోషాల పరదైసుగా మారుతుంది. (కీర్తన 72:1, 3, 16) ఈలోగా, ఆ పరలోక రాజ్య సువార్తను సాక్షులు ప్రకటిస్తారు, అలాగే అవసరాల్లో తోటి ఆరాధకులకూ, ఇతరులకూ సహాయం చేయడంలో కొనసాగుతారు.

[4వ పేజీలోని చిత్రం]

1994 నుండి, కేవలం యూరప్‌లోని యెహోవాసాక్షులే ఆఫ్రికాలోని గ్రేట్‌ లేక్స్‌ రీజియన్‌కు 190 టన్నుల కన్నా ఎక్కువ ఆహారపదార్థాలనూ, వస్త్రాలనూ, మందులనూ, మరితర సహాయ సరఫరాలను పంపించారు

[6వ పేజీలోని బాక్సు]

ఆచరణలో పెట్టబడిన క్రైస్తవ ప్రేమ

ఫ్రాన్స్‌లోని “జైర్‌కు సహాయపడండి” ప్రాజెక్ట్‌లో ఆతురతతో భాగం వహించినవారిలో రూట్‌ డానే కూడా ఉంది. ఆమె చిన్న పిల్లగా ఉన్నప్పుడు, తన క్రైస్తవ విశ్వాసం కారణంగా నాజీ కాన్‌సెన్‌ట్రేషన్‌ క్యాంపులో వేయబడింది. ఆమె ఇలా కామెంట్‌ చేసింది: “ఆఫ్రికాలోని మన సహోదర సహోదరీల కోసం ఏమైన చేయడానికి మేము చాలా సంతోషించాం! అయితే నన్ను రెండింతలు సంతోషపరచిన విషయం ఒకటుంది. 1945లో మేము జర్మనీ నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, మాకు సొంతంగా ఏమీ లేవు. మేము వేసుకున్న బట్టలు కూడా మా సొంతం కావు. అయితే, త్వరలోనే అమెరికాలోని మన ఆధ్యాత్మిక సహోదరుల నుండి మాకు భౌతిక సహాయం లభించింది. కనుక, ఈ సహాయ కార్యక్రమం ఎన్నో సంవత్సరాల క్రితం మాకు చూపబడిన దయను తిరిగి చూపించే అవకాశాన్ని నాకిచ్చింది. క్రైస్తవ ప్రేమను ఆచరణలో పెట్టే సహోదరులున్న పెద్ద కుటుంబంలో భాగమై ఉండడం ఎంతటి ఆధిక్యతో!”—యోహాను 13:34, 35.

[7వ పేజీలోని చిత్రం]

త్వరలో—అందరికీ అన్నీ సమృద్ధిగా ఉండే భూ పరదైసు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి