రువాండానందలి విషాదకర సంఘటనా బాధితులను సంరక్షించుట
రువాండా, ఆఫ్రికానందలి మధ్యప్రాంతంలో ఉంది, అందుకే అది “ఆఫ్రికాయొక్క స్విట్జర్లాండు” అని పిలువబడింది. ఆ దేశం పైనుంచి విమానంలో వెళ్తూ, పచ్చగా ఏపుగా పెరిగిన ఆకుపచ్చదనాన్ని చూసిన ప్రజలకు అది ఒక ఏదెను తోట అనే భావాన్ని కలిగించింది. రువాండాను ఒక పరదైసు అని వర్ణించడంలో ఆశ్చర్యంలేదు.
ఒకప్పుడు, ఒక వృక్షంను నరికితే, దానికి ప్రతిగా రెండు వృక్షాలను నాటే వారు. సంవత్సరంలో ఒకరోజు అడవుల పునరుద్ధరణ దినంగా ప్రకటించబడేంది. రహదార్లవెంట ఫల వృక్షాలను నాటటం జరిగింది. దేశంలో ప్రయాణించడం సులభంగా, సుగమంగా లేకుండా వుండేది. వేర్వేరు మండలాలను రాజధాని కిగాలీతో కలిపే ముఖ్య రహదార్లన్నీ తారు రోడ్లే. ఆ రాజధాని అతి వేగంగా వృద్ధిచెందుతుంది. అక్కడ సగటు కూలిపనివాడు నెలాఖారుకెల్లా తనకు సరిపడేంత సంపాదించగలిగే వాడు.
యెహోవాసాక్షుల క్రైస్తవ పరిచర్యకూడా అదేవిధంగా రువాండాలో వర్థిల్లుతూనేవుండేది. ఈ సంవత్సర ఆరంభంలో, దేశంలో అధికంగా ఉన్న 80 లక్షల కాథోలిక్కుల వద్దకు 2,600 మంది సాక్షులు సువార్త తీసుకువెళ్లడంలో పాల్గొన్నారు. (మత్తయి 24:14) మార్చి నెలలో ప్రజల గృహాల్లో సాక్షులు 10,000 కంటె ఎక్కువ బైబిలు పఠనాలను నిర్వహించారు. కిగాలీ మరియు దాని చుట్టుప్రక్కల ప్రాంతాల్లో 15 సంఘాలుండేవి.
“నవంబరు 1992లో నేను 18 సంఘాల్లో సేవ చేశాను. కాని మార్చి 1994లో వాటి సంఖ్య 27కు పెరిగింది. ప్రతి సంవత్సరం పయినీర్ల (పూర్తికాల పరిచారకుల) సంఖ్యకూడ పెరుగుతూనే ఉంది,” అని యెహోవాసాక్షుల ప్రయాణకాపరి ఒకరు పేర్కొన్నారు. మార్చి 26, 1994 శనివారం నాడు, క్రీస్తు మరణ జ్ఞాపకార్థ దినానికి 9,834 మంది హాజరయ్యారు.
అనుకోకుండా, ఒకరాత్రిలోనే, యీ పరిస్థితి అంతా రువాండాలో విషాదకరంగా మారిపోయింది.a
నెలకొనివున్న శాంతికి ఆకస్మిక ముగింపు
ఏప్రిల్ 6, 1994న సాయంకాల సమయం 8:00, ప్రాంతంలో హుటు జాతికి చెందినవారైన రువాండా మరియు బురుండి దేశాలాధ్యక్షులు కిగాలీ విమాన ప్రమాదంలో మరణించారు. ఆ రాత్రంతాకూడ పోలీసుల ఈలలు రాజధాని అంతా వినబడ్డాయి, రహదార్లన్నీ అడ్డగించబడ్డాయి. ప్రాతఃకాల సమయంలో సైనికులు మరియు పెద్ద కత్తులను ధరించిన సాయుధులు టుట్సీ ప్రజలను చంపటం ప్రారంభించారు. నాటాబానా యూజీన్—కిగాలీలో యెహోవాసాక్షుల నగరాధ్యక్షుడు—ఆయన భార్య, ఆయన కుమారుడు మరియు ఆయన కుమార్తె మొదటిగా హతమార్చబడ్డారు.
యెహోవాసాక్షుల ఒక యూరోపియన్ కుటుంబం తమ పొరుగువారైనా టుట్సీలనేకులకు బైబిలు పఠనాలు నిర్వహించేవారు. అందులోని తొమ్మిది మంది యిండ్లను పరిశోధించి చంపే వాళ్లనుండి తప్పించుకోడానికొరకు యూరోపియన్ల యింటిలో ఆశ్రయాన్ని పొందారు. ఐరోపా వారైన గాడ్ఫ్రే, జేనీ బింట్ మరియు హెంక్ వాన్ బూసీల్ కిగాలీలోని మిషనరీ గృహంలో నివసిస్తున్నారు. వాళ్ల పొరుగువారైన టుట్సీవారితో బైబిలు పఠనం చేస్తుండేవారు.
కొన్ని నిమిషాల్లో దాదాపు 40 మంది దోపిడీదార్లు యింట్లో ప్రవేశించి, అక్కడున్న వస్తువులను చెల్లాచెదరు చేస్తూ, ముక్కలు ముక్కలు చేశారు. విచారకరంగా, పొరుగువారైన టుట్సీలు చంపబడ్డారు. అయితే, యితరులు తమ స్నేహితులను రక్షించాలని ప్రయత్నించినప్పటికీ, తమ ప్రాణాలను తప్పించుకోటానికి అనుమతించబడ్డారు.
ఈ నరమేధం రెండు వారాలపాటు సాగింది. తుదకు 5,00,000 మంది లేదా అంతకంటే ఎక్కువమంది రువాండా వారు చంపబడినట్లు అంచనా వేయబడింది. వేలాదిమంది, ముఖ్యంగా టుట్సీలు వాళ్ల జీవితాలను కాపాడుకొనే నిమిత్తం అక్కడనుండి పారిపోయారు. యెహోవాసాక్షుల జెయిరేలోని బ్రాంచి కార్యాలయం ఫ్రాన్స్‌లోని ఆ సహోదరులకు తమకు అవసరమున్న సహాయ సామాగ్రిని గురించి తెలియజేసింది. “మేము ఒక పెట్టెనిండా పాత బట్టలు కావాలని అడిగాము, అయితే ఫ్రాన్సులోని సహోదరులు అయిదు పెట్టెలనిండా వాటిలో అధికంగా క్రొత్త బట్టలను మరియు షూస్‌ను పంపించారు,” అని జెయిరే బ్రాంచి వివరిస్తుంది. జూన్ 11న ఈ 65 టన్నుల బట్టలు పంపబడ్డాయి. కెన్యా బ్రాంచికూడా ఆ శరణార్థులకు బట్టలను, మందులను అలాగే వాళ్ల ప్రాంతీయ భాషలో కావలికోట పత్రికలను పంపించింది.
జూలై నాటికి రువాండన్ పేట్రియాటిక్ ఫ్రంట్ అని పిలువబడే టుట్సీ ఆధీనంలోని సమూహాలు, హుటుల ఆధీనంలోని ప్రభుత్వ సమూహాలను ఓడించాయి. ఆ తరువాత, హుటూ వారు లక్షలాదిమంది దేశాన్ని వదిలి పారిపోవటం ప్రారంభించారు. ఇరవై లేదా దానికంటె ఎక్కువ లక్షల మంది రువాండావాళ్లు పొరుగుదేశాలలో హడావిడిగా స్థాపించిన శిబిరాలకు తరలివెళ్లడంతో గందరగోళం ఏర్పడింది.
వారు ఒకరికొకరు సహాయం చేసుకోడానికి ప్రయత్నించారు
కిగాలీలోని యెహోవాసాక్షుల అనువాద కార్యాలయంలో పనిచేసే ఆరుగురిలో యిద్దరు టుట్సీవారైనా అనాని మెబాందా మరియు ముకాగిసగారా డెనీస్. వారిని కాపాడడానికి హుటు సహోదరులు చేసిన ప్రయత్నాలు కొన్ని వారాలపాటు విజయవంతంగా కొనసాగాయి. అయితే 1994 మే నెల చివరిలో యీ యిద్దరు టుట్సీ సాక్షులు చంపబడ్డారు.
యెహోవాసాక్షులు తాము ఆపదల్లో చిక్కుకొని, తమ ప్రాణాలను తెగించి వేరే తెగలకు చెందిన తమ తోటి క్రైస్తవులను కాపాడడానికి కృషిచేశారు. (యోహాను 13:34, 35; 15:13) ఉదాహరణకు, చంతాల్ ముకాబాలిసా టుట్సీకి చెందినది. రువాండ పేట్రియాటిక్ ఫ్రంట్ సభ్యులు తాను ఉంటున్న స్టేడియంలో హుట్సుల కోసం వెదుకుతుండగా, హుటు స్నేహితుల పక్షంగా ఆమె జోక్యం చేసుకొంది. ఆమె ప్రయత్నాలకు తిరుగుబాటుదార్లు చికాకు చూపినప్పటికీ, ఒక వ్యక్తి మాత్రం ఆశ్చర్యంతో యిలా అన్నాడు: “మీ యెహోవాసాక్షులు నిజంగా అచంచలమైన సహోదరత్వాన్ని కలిగివున్నారు. అందుకే మీ మతం శ్రేష్ఠమైంది!”
జాతివైషమ్యాలనుండి వేరైవుండుట
ఆఫ్రికాలోని యీ ప్రాంతంలో వేలాది సంవత్సరాలుగా పాతుకుపోయిన యీ జాతివైషమ్యాలనుండి యెహోవాసాక్షులు పూర్తిగా వేరై ఉన్నారని చెప్పడం లేదు. ఫ్రాన్సునుండి వచ్చి సహాయ కార్యక్రమంలో పనిచేస్తున్న ఒక సాక్షి యిలా పేర్కొన్నాడు: “వర్ణించటానికి అసాధ్యమైన ఈ మానవవధకు తోడ్పడిన యీ ద్వేషంనుండి, కలుషితంకాకుండా ఉండటానికి మన క్రైస్తవ సహోదరులుకూడా ఎంతో ప్రయాసతోకూడిన ప్రయత్నం చేయవలసి ఉంది.
“తమ కళ్ల ముందే తమ కుటుంబాలు వధింపబడిన సహోదరులను మేము కలిశాం. ఉదాహరణకు, ఒక క్రైస్తవ సహోదరి ఆమె భర్త చంపబడేనాటికి వారి వివాహమై రెండు రోజులు మాత్రమే అయింది. కొంతమంది సాక్షులు తమ పిల్లలు తమ తల్లిదండ్రులు చంపబడడం చూశారు. ఇప్పుడు ఉగాండాలో ఉన్న ఒక సహోదరి, తన భర్తతో సహా తన కుటుంబమంతా, నరమేధం చేయబడటం ఆమె చూసింది. ఇదంతాకూడ యెహోవాసాక్షుల ప్రతి కుటుంబంలోని వారు భౌతికంగాను, భావోద్రేకంగాను బాధను అనుభవించిన వాటిని స్పష్టంగా చూపిస్తుంది.”
మొత్తంమీద, తెగలమధ్య జరిగిన దౌర్జన్యంలో 400 మంది సాక్షులు చంపబడ్డారు. అయితే వాళ్లలో ఎవరూ తోటిసాక్షి చేతుల్లో మరణించలేదు. అయితే టుట్సీ మరియు హుట్సు జాతుల రోమన్ కాథోలిక్కులు మరియు ప్రొటస్టెంట్ చర్చీల్లోని వాళ్లు వేలాదిమందిని హతమార్చారు. యిక్కడ చూపబడినట్లు, ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షులు యుద్ధాల్లోను, విప్లవాల్లోను, లేక యీ లోకంలోని అటువంటి యితర సంఘర్షణల్లోను భాగం వహించరు.—యోహాను 17:14, 16; 18:36; ప్రకటన 12:9.
వివరించశక్యంకాని బాధ
గడిచిన వేసవికాలంలో, ప్రపంచమంతటా ప్రజలు దాదాపు నమ్మశక్యంకాని మానవ బాధలను చిత్రాలద్వారా చూచుటకు వత్తిడి చేయబడ్డారు. వేలాది మంది రువాండా శరణార్థులు ప్రవాహాలుగా పొరుగు దేశాలకు వెళ్లి, అక్కడ అతి అపరిశుభ్ర పరిస్థితుల్లో జీవించారు. సహాయం చేయడానికి ఫ్రాన్సునుండి వచ్చిన ఒక యెహోవాసాక్షి, జూలై 30న తాను ప్రాతినిధ్యం వహించిన గుంపు చూచిన పరిస్థితిని యీ విధంగా వివరిస్తున్నాడు.
“మేము అతి భయానకమైన దృశ్యాలను చూడవలసి వచ్చింది. అనేక కిలోమీటర్లవరకు, మృతదేహాలు రహదారివెంట వున్నాయి. మత సంబంధ సమాధులన్నీ వేలాది మృతదేహాలతో నింపబడ్డాయి. మనుషుల గుట్టల దగ్గరనుండి మేము నడుస్తుండగా వచ్చిన దుర్గంధం భరింపరానంతగా ఉంది, పిల్లలు మృతదేహాల పక్కనే ఆడుకుంటున్నారు. పిల్లలు జీవించి ఉండి తల్లిదండ్రుల మృతదేహాలకు అంటిపెట్టుకొని ఉండటం చూశాం. అటువంటి దృశ్యాలు, మరలా మరలా ఉత్పన్నమవుతూ గాఢమైన ముద్రను మిగుల్చుతున్నాయి. అది చూసిన ఎవరికైనా తాము పూర్తిగా నిస్సహాయులమన్న భావం తీవ్రంగా కలుగుతుంది, మరియు అంత తీవ్రమైన భయానక, నిర్జనతను చూసి ఎవ్వరూ కూడా కదిలింపబడకుండా ఉండలేరు.”
జూలై మధ్య భాగంలో లక్షలకొలది మంది శరణార్థులు జెయిరేకు తరలి వెళ్లుచుండగా, జెయిరేలోని సాక్షులు సరిహద్దు ప్రాంతానికి వెళ్లి తమ క్రైస్తవ సహోదరులు మరియు ఆసక్తిగలవారు గుర్తుపట్టటానికి బైబిలు సాహిత్యాలను పట్టుకొన్నారు. రువాండానుండి వచ్చిన శరణార్థులందరికి గోమాలోవున్న రాజ్యమందిరాన్ని యిచ్చారు, అక్కడనే వారికి సంరక్షణ అందించబడింది. తగిన సౌకర్యాలు, సరిపోయినన్ని మందులు లేకపోయినప్పటికీ, వైద్యరీత్యా అనుభవంవున్న సాక్షులు రోగులకున్న బాధను తగ్గించుటకు చాల కష్టపడి పనిచేశారు.
బాధను తగ్గించుటకు త్వరగా ప్రతిస్పందించుట
శుక్రవారం, జూలై 22న ఆఫ్రికానుండి ప్రమాదంలో సహాయం కోరే సంకేతాన్ని ఫ్రాన్సులోని యెహోవాసాక్షులు ఫాక్సు ద్వారా అందుకున్నారు. రువాండానుండి తప్పించుకుంటున్న తమ క్రైస్తవ సహోదరుల భయంకరమైన దుస్థితిని అది వివరించింది. వినతి పత్రాన్ని అందుకున్న అయిదు లేక పది నిముషాలల్లోనే, సరుకుల విమానంలో సహాయార్థమైన వస్తువులను పంపటానికి సహోదరులు నిర్ణయించుకొన్నారు. ఇది వారాంతంలో మిక్కుటమైన సిద్ధపాటును కలిగిస్తూ, అంత ఎక్కువ సహాయ సామాగ్రిని అంత తక్కువ సమయంలో వ్యవస్థీకరించుటయందు అనుభవం లేకపోయినందున అది గణనీయమైన విషయము.
సహాయ నిధుల అవసరానికి మహత్తరమైన ప్రతిస్పందన లభించింది. కేవలం ఫ్రాన్సు, బెల్జియం మరియు స్విట్జర్లాండులోని సాక్షులనుండే 16,00,000 డాలర్లకన్నా ఎక్కువ సహాయం లభించింది. ఫ్రాన్సులోని లూవైర్స్ నందలి యెహోవాసాక్షుల కార్యాలయంలో సిద్ధం చేయబడి, పెట్టెలలో పెట్టి, లేబుల్స్ వేయబడిన యీ సహాయ సామాగ్రిలో ఆహారం, మందులు, జీవించటానికి కావలసిన వస్తువులు ఉన్నాయి. బెల్జియంనందలి ఓస్టెండ్నకు ఈ సామాగ్రినంతటినీ పంపడానికి దానిని సిద్ధం చేయటానికి సాక్షులు రాత్రింబగళ్లు పనిచేశారు. బుధవారం, జూలై 27న ఎయిర్పోర్టునందు 35 టన్నుల సరుకును జెట్‌లోకి ఎక్కించటం జరిగింది. దాని మరుసటిరోజుననే ముఖ్యంగా వైద్యసంబంధమైన వస్తువులతో తక్కువ సరుకు పంపించబడింది. మరి రెండు రోజుల తరువాత, అనగా శనివారం, బాధితులకు మరొక విమానంలో అధికంగా వైద్య సంబంధమైన వస్తువులు పంపించబడ్డాయి.
పెద్ద ఎత్తున పంపబడిన సరుకులకంటే ముందుగా ఒక వైద్యునితోసహా, ఫ్రాన్సునుండి వచ్చిన సాక్షులు గోమాకు వెళ్లారు. సోమవారం, జూలై 25న, డా. హెన్రీ టాలేట్ గోమాకు వెళ్ళేసరికి, 20 మంది సాక్షులు అప్పటికే కలరా వలన మరణించారు, తక్కిన వాళ్లు అనుదినం క్షీణించసాగారు. బుజుమ్బూరా, బురుండీలనుండి ఆ సరుకులు వెళ్లాలి, అంటే 250 కిలోమీటర్ల దూరంనుండి రావాలి కాబట్టి, అది జూలై 29, శుక్రవారం ఉదయానికి గాని గోమాకు చేరలేదు.
వ్యాధితో పోరాడుట
ఈ మధ్యకాలంలో, గోమా ప్రాంతంలోనున్న చిన్న రాజ్యమందిరమున్న ఫ్లాటులో దాదాపు 1,600 మంది సాక్షులు, వాళ్ల స్నేహితులు క్రిక్కిరిసివున్నారు. వీళ్లందరికి ఒకే మరుగుదొడ్డి, నీళ్లు లేవు, ఆహారం కొద్దిగానే వుంది. కలరా వచ్చిన డజన్ల మంది రాజ్యమందిరంలో క్రిక్కిరిసి వున్నారు. మరణాల సంఖ్య వేగంగా పెరిగింది.
కలరా ఒక వ్యక్తిని పూర్తిగా నిర్జలీకరింపజేస్తుంది. కళ్లు నిర్జీవంగా తయారయి, బయటికి వస్తాయి. రీహైడ్రెషన్ థెరపీని సకాలంలో ప్రారంభిస్తే, ఆ వ్యక్తి రెండు రోజులలోపుననే మరల కోలుకోగలుగుతాడు. అందుకని, అందుబాటులో ఉన్న కొద్ది మందులతోనే సహోదరులు మళ్లీ కోలుకునేలా చేయడానికి ప్రయత్నాలు జరిగాయి.
దానికి తోడు, వ్యాధి యితరులకు రాకుండా రక్షించేందుకు రోగులను దూరంగా ఉంచడానికి సహోదరులు ప్రయత్నించారు. గోమాలోని భయంకరమైన పరిస్థితుల్లోనుండి శరణార్ధులను తరలించడానికి వారు పూనుకున్నారు. మృతదేహాలనుండి వచ్చే దుర్గంధం వ్యాపించివున్న గాలినుండి, ఆ మట్టినుండి దూరంగా ఉండటానికి కివ్యూ నది దగ్గరలోనున్న ప్రాంతమందు ఒక అనుకూలమైన స్థలాన్ని కనుగొన్నారు.
మరుగుదొడ్డులను త్రవ్వటం ప్రారంభించారు, పారిశుద్ధ్యాన్ని గురించి కచ్చితమైన పద్ధతులను విధించటం జరిగింది. మరుగుదొడ్డి ఉపయోగించిన తరువాత చేతులను ఒక పాత్రలోని బ్లీచ్తోను నీళ్లతోను కడుగుకోవాలనేదికూడా యిందులో యిమిడివుంది. వాటి ప్రాముఖ్యతను నొక్కి చెప్పినప్పుడు, ప్రజలు ఏమి చేయాలో వాటిని చేయటానికి అంగీకరించారు. త్వరలోనే మరణాల సంఖ్య తగ్గుతూ, వ్యాధి తగ్గుముఖం పట్టింది.
సహాయ వస్తువుల పెద్ద షిప్మెంట్ శుక్రవారం, జూలై 29న, వచ్చినప్పుడు గోమాలోని రాజ్యమందిరంవద్ద ఒక చిన్న ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 60 పడకలను, అలాగే నీళ్లను శుభ్రపర్చే ఏర్పాటుకూడా చేయబడింది. మరి అదనంగా, కివ్యూ నది ఒడ్డున ఉన్న సాక్షుల కొరకు గుడారాలను వేయటానికి డేరాలను తీసుకొని వెళ్లడం జరిగింది. స్వల్ప కాలములోనే, 50 గుడారాలను సువ్యవస్థితంగాను, వరుస క్రమంగాను వేయటం జరిగింది.
ఒకే సమయంలో 150 మంది సాక్షులు మరియు వారి స్నేహితులు తీవ్రంగా రోగగ్రస్తులయ్యారు. వారిలో 40 కంటే ఎక్కువమంది ఆగస్టు మొదటి వారంలో గోమానందు మరణించారు. అయితే వైద్య సదుపాయాలు మరియు తగిన సహాయం సకాలంలో అందజేయటంవలన అనేకమంది ప్రాణాలను కాపాడుకోగలిగారు మరియు గొప్ప బాధనుకూడ అరికట్టడం జరిగింది.
కృతజ్ఞతగల ఆత్మీయ ప్రజలు
శరణార్థులైన సాక్షులు వాళ్లకోసం చేసిన వాటన్నింటి నిమిత్తం ఎంతో ప్రశంసను చూపారు. ఇతర దేశాల్లోని క్రైస్తవ సహోదరులు చూపిన ప్రేమను బట్టి, మరియు నిజంగా తాము అంతర్జాతీయ సహోదరత్వానికి చెందినవారని స్పష్టంగా నిరుపించబడిన దానిని బట్టి కదిలింపబడ్డారు.
కష్టాలున్నప్పటికీ, ఈ శరణార్థులు తమ ఆత్మీయతను కాపాడుకోగలిగారు. నిజానికి, ఒక పరిశీలకుడు గమనించినదేమనగా “వాళ్లకు అన్నీ తీవ్రంగా అవసరమైనప్పటికీ కూడా, వాళ్లు భౌతిక సంబంధమైన సహాయాన్ని అందుకోటానికన్న ఆత్మీయ ఆహారాన్ని అందుకోటానికి యిష్టపడ్డారు.” వాళ్లు కోరినట్లుగా, బైబిలు పఠన సహాయకమైన మీరు నిరంతరము పరదైసు భూమిపై జీవించగలరు అనే పుస్తకాల 5,000 కాపీలు రువాండా భాషయైన కిన్యారావాదాలోన వివిధ శరణార్థుల గుడారాలకు అందించడం జరిగింది.b
ఈ శరణార్థులు ప్రతిదినం బైబిలు వచనాన్ని పరిశీలించేవారు, మరియు సంఘ కూటాలనుకూడా వారు నిర్వహించారు. పిల్లలకొరకు పాఠశాల తరగతులను నడుపుటకు కూడ తగిన ఏర్పాట్లు చేయబడ్డాయి. పారిశుద్ధ్య నియమాలను గురించిన సూచనలు యిస్తూ, వాటిని పాటించడంపైనే మనుగడ ఆధారపడి ఉందని చెప్పడానికి ఈ తరుణాన్ని ఉపాధ్యాయులు ఉపయోగించుకున్నారు.
శ్రద్ధ తీసుకోవడంలో కొనసాగడం
వందలకొలది శరణార్థులైన సాక్షులు గోమాలోనే కాక రుట్సురా వంటి యితర ప్రాంతాల్లో కూడా ఉన్నారు. ఈ సహోదరులకు కూడా అదేమాదిరిగా సహాయం అందించబడింది. జూలై 31న ఏడుగురు సాక్షులుగల డెలిగేషన్, గోమాకు ఉత్తరభాగాన ఉన్న 450 మంది శరణార్థులైన సాక్షులున్న బుకావ్యూకు వెళ్లింది. వీరిలో చాలామంది బురుండినుండి వచ్చినవాళ్లే. అక్కడకూడా కలరా వ్యాధి తలెత్తింది, సహోదరులమధ్య ఎటువంటి మరణాలు సంభవించకుండా ఉండడానికి సహాయం ఏర్పాటు చేయబడింది.
దాని మరుసటిరోజుననే ఆ బృందం సుమారు 150 కిలోమీటర్ల దూరం రహదారి గుండా ఉవ్యూకు, జెయిరేకు ప్రయాణించారు, రువాండానుండి బురుండివరకున్న ఆ దారిలోని ఏడు స్థలాల్లో 1,600 మంది సాక్షులు ఉన్నారు. ఈ వ్యాధినుండి తమను తామెలా కాపాడుకోవాలో ఉపదేశాలివ్వబడ్డాయి. ఆ బృందం కనుగొన్న విషయాలపై ఆధారపడిన నివేదికలో యిలా ఉంది: “ఇంతవరకు మేము చేసినదంతాకూడ కేవలం ప్రారంభం మాత్రమే, యిప్పుడు మా సహాయాన్ని పొందుతున్న 4,700 మంది వ్యక్తులకు యింకా కొన్ని నెలల వరకు సహాయం అవసరముంటుంది.”
ఆగష్టుకెల్లా వందలాది మంది సాక్షులు రువాండాకు చేరుకున్నట్లుగా నివేదికలందాయి. అయినప్పటికీ ప్రత్యేకంగా అన్ని గృహాలు మరియు వాళ్ల వస్తువులు దోచుకోబడ్డాయి. కాబట్టి యిప్పుడు యిండ్లను మరియు రాజ్యమందిరాలను నిర్మించడమనే సవాలు ముందుంది.
దేవుని సేవకులు రువాండాలో భయంకరమైన బాధలననుభవించిన వారికొరకై ఎడతెగక ప్రార్థించుటలో కొనసాగుతున్నారు. ఈ యుగసమాప్తి సమీపిస్తుండగా, దౌర్జన్యం పెరుగుతూనేవుంటుందని మనకు తెలుసు. ఏమైనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగావున్న యెహోవాసాక్షులు తమ క్రైస్తవ తటస్థతను కాపాడుకోవడంలోను, నిజమైన వాత్సల్యాన్ని చూపుటలోను విడువకుండా కొనసాగుతారు.
[అధస్సూచీలు]
a డిశంబరు 15, 1994, కావలికోటలో “రువాండా నందలి విషాదకర సంఘటనకు—ఎవరు బాధ్యులు?” అనే శీర్షికను చూడండి.
b వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ న్యూయార్క్ ఇన్కార్పొరేటెడ్ ప్రచురించింది.
[12వ పేజీలోని చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
రువాండా
కిగాలీ
ఉగాండా
జెయిరే
రుహూరూ
గోమా
కీవూ నది
బుకావ్యూ
ఉవీరా
బురుండి
బుజుంబురా
[15వ పేజీలోని చిత్రాలు]
ఎడమవైపు: నాటాబానా యూజీన్ మరియు ఆయన కుటుంబమంతా వధించబడ్డారు. కుడివైపు: ముకాగిసగారా డెనీస్, టుట్సీ, హుటు సహోదరులు ఆమెను కాపాడాలని ప్రయత్నించినప్పటికీ, చంపబడింది
[16,17వ పేజీలోని చిత్రాలు]
పైన: గోమాలోని రాజ్యమందిరమందున్న రోగులపట్ల శ్రద్ధ వహించడం. క్రింద ఎడమవైపున: 35 టన్నుల సహాయ వస్తువులను సాక్షులు సిద్ధం చేసి వాటిని సరుకుల జెట్నందు పంపుట. క్రింద: సాక్షులు తరలింపబడిన కివ్యూ నది ఒడ్డు. క్రింద కుడివైపున: జెయిరేలోని రాజ్యమందిరమందు రువాండా శరణార్థులు