కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 1/15 పేజీలు 8-13
  • ‘వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకోవడం’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకోవడం’
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నోవహు సుస్థాపితమైన విశ్వాసంతో చర్యగైకొన్నాడు
  • అబ్రాహాము విశ్వాసము
  • మోషేను కదిలించిన విశ్వాసం
  • “మీ హృదయములను స్థిరపరచుకొనుడి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • యెహోవా ఆయన్ని ‘నా స్నేహితుడు’ అని పిలిచాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • దేవుడు అబ్రాహాము విశ్వాసాన్ని పరీక్షించడం
    నా బైబిలు కథల పుస్తకము
  • అబ్రాహాము మరియు శారా—మీరు వాళ్ళ విశ్వాసాన్ని అనుకరించవచ్చు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 1/15 పేజీలు 8-13

‘వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకోవడం’

“వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొనుచున్నాము.”—2 కొరింథీయులు 5:6.

1. ‘విశ్వాసం వలన నడుచుకొనుట’ అంటే ఏమిటి?

దేవుని వాక్యంలోని నిర్దేశకాలకు అనుగుణ్యంగా మనం ప్రార్థన చేసిన ప్రతిసారీ, మనకు కనీసం కొంత విశ్వాసం ఉందని సూచిస్తాం. దేవుని రాజ్యం గురించి మనం ఇతరులకు సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించినప్పుడు, అది కూడ విశ్వాసం ఉందని చూపిస్తుంది. మన జీవితాలను యెహోవాకు సమర్పించుకున్నప్పుడు, ‘విశ్వాసం వలన నడుచుకోవడం’ మన కోరిక అని, అంటే విశ్వాసంచేత నడిపించబడే జీవిత గమనాన్ని వెంబడించడమే మన కోరిక అని మనం నిదర్శనాన్ని ఇస్తున్నాము.—2 కొరింథీయులు 5:6; కొలొస్సయులు 1:9, 10.

2. సంఘ కార్యకలాపాల్లో పాల్గొనడం ఒకరికి విశ్వాసం ఉందనేందుకు రుజువు కానవసరం లేదెందుకని?

2 మనం ఒకవేళ నిజంగానే ఆ విధంగా జీవించాలని అనుకుంటే మనకు సుస్థాపితమైన విశ్వాసం అవసరము. (హెబ్రీయులు 11:1, 6) ఉన్నతమైన నైతిక ప్రమాణాల కారణంగాను, సాక్షులమధ్య వారు చూసే ప్రేమ మూలంగాను చాలామంది ప్రజలు యెహోవాసాక్షులవైపు ఆకర్షితులౌతున్నారు. వారికిది చాలా మంచి ప్రారంభమే, కానీ దీనర్థం అటువంటి ప్రజలకు విశ్వాసం ఉందని కాదు. మరితరుల విషయంలో, విశ్వాసంలో స్థిరంగా ఉన్న వివాహజత లేదా తలిదండ్రులు ఉండవచ్చు. వారిని తాము ప్రేమించడం మూలాన వారు పాల్గొనే కొన్ని కార్యకలాపాల్లో వీరు భాగం వహించవచ్చు. గృహంలో అటువంటి ప్రభావం ఉండడం నిజంగా ఒక ఆశీర్వాదమే, కానీ ఇది కూడా దేవునిపట్ల వ్యక్తిగతంగా కలిగివుండాల్సిన ప్రేమకూ, వ్యక్తిగత విశ్వాసానికీ ప్రత్యామ్నాయం కాదు.—లూకా 10:27, 28.

3. (ఎ) మనకు సుస్థాపితమైన విశ్వాసం ఉండాలంటే, మనకు వ్యక్తిగతంగా బైబిలును గూర్చి ఏ దృఢ నమ్మకం ఉండాలి? (బి) బైబిలు దైవప్రేరేపితమైనదని కొందరు ఇతరులకన్నా త్వరగా ఎందుకు నమ్ముతారు?

3 నిజముగా విశ్వాసంవలన నడుచుకునేవారు బైబిలు దేవుని వాక్యమని దృఢ నమ్మకంతో ఉన్నారు. పరిశుద్ధ లేఖనాలు వాస్తవంగానే “దైవావేశము వలన” కలిగినవని అనడానికి సాక్ష్యాధారాలు సమృద్ధిగా ఉన్నాయి.a (2 తిమోతి 3:16, 17) ఈ విషయంలో ఒక వ్యక్తికి నమ్మకం కుదరడానికి ఎన్ని సాక్ష్యాధారాల్ని పరిశీలించాలి? అది అతని నేపథ్యంపైన ఆధారపడుతుండవచ్చు. ఒక వ్యక్తిని పూర్తిగా తృప్తిపర్చేది మరో వ్యక్తిని ఒప్పించకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో, ఒక వ్యక్తికి త్రోసిపుచ్చలేని సాక్ష్యాధారాల్ని ఎన్ని చూపించినప్పటికీ సహేతుకమైన ముగింపుకు చేరుకోవడానికి ఇంకా నిరాకరించవచ్చు. ఎందుకు? ఆయన హృదయలోతుల్లో పాతుకుపోయివున్న అభిప్రాయాలే అందుకు కారణం. (యిర్మీయా 17:9) ఆ విధంగా, దేవుని సంకల్పాల్లో ఆసక్తి ఉన్నట్లు ఒక వ్యక్తి చెప్పుకున్నప్పటికీ, ఆయన హృదయం లోకస్థుల ఆమోదాన్ని పొందాలని ఆకాంక్షించవచ్చు. బైబిలు ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న జీవన విధానాన్ని విడనాడేందుకు ఆయన సుముఖంగా ఉండకపోవచ్చు. అయితే, ఎవరికైనా సత్యంపట్ల నిజమైన ఆకలివున్నట్లైతే, తనపట్ల తాను నిజాయితీగా ఉన్నట్లైతే, ఆయన సాత్వికుడైతే బైబిలు దేవుని వాక్యమని ఆయన సకాలంలో గ్రహిస్తాడు.

4. విశ్వాసాన్ని సంపాదించుకోవాలంటే ఒక వ్యక్తి ఏమి చేయవలసిన అవసరం ఉంది?

4 తరచూ, బైబిలును పఠించడంలో సహాయం పొందుతున్న ప్రజలు కేవలం కొద్ది నెలల్లోనే, అది దేవుని వాక్యమనడానికి కావాల్సినదానికన్నా ఎక్కువ రుజువును అప్పటికే చూసినట్లు గ్రహిస్తారు. ఒకవేళ ఇది తమ హృదయాలను తెరిచి యెహోవాచే ఉపదేశించబడడానికి వారిని కదిలించినట్లైతే, అప్పుడు వారి ఆంతరంగిక ఆలోచనలు, వారి కోరికలు, వారి ఉద్దేశాలు తాము నేర్చుకునే దాన్నిబట్టి క్రమంగా రూపుదిద్దబడతాయి. (కీర్తన 143:10) మనుష్యుడు “హృదయములో” విశ్వసిస్తాడని రోమీయులు 10:10 చెబుతుంది. అటువంటి విశ్వాసము ఒక వ్యక్తి నిజంగా ఎలా భావిస్తున్నాడో వ్యక్తపరుస్తుంది, అది ఆయన జీవన విధానంలో స్పష్టమౌతుంది.

నోవహు సుస్థాపితమైన విశ్వాసంతో చర్యగైకొన్నాడు

5, 6. నోవహు విశ్వాసం దేని మీద ఆధారపడివుంది?

5 నోవహుకు సుస్థాపితమైన విశ్వాసము ఉంది. (హెబ్రీయులు 11:7) అందుకు ఆయనకు ఏ ఆధారం ఉంది? నోవహువద్ద దేవుని వాక్యం ఉంది, లిఖిత రూపంలో కాదు గాని, వాగ్రూపంలో ఉంది. ఆదికాండము 6:13 ఇలా చెబుతుంది: “దేవుడు నోవహుతో [ఇలా చెప్పెను:]—సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది.” ఒక ఓడను నిర్మించమని యెహోవా నోవహును నిర్దేశించాడు, దాని నిర్మాణానికి సంబంధించిన వివరణలను కూడా ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు ఇంకా ఇలా అన్నాడు: “ఇదిగో నేనే జీవవాయువుగల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండ నాశము చేయుటకు భూమిమీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును.”—ఆదికాండము 6:14-17.

6 దీనికి ముందు వర్షము కురిసిందా? బైబిలు చెప్పడం లేదు. ఆదికాండము 2:5 ఇలా చెబుతుంది: “దేవుడైన యెహోవా భూమిమీద వాన కురిపించలేదు.” కానీ ఇది నోవహు దినాల గురించిన వర్ణన కాదు గాని, అంతకుముందు ఎంతో పూర్వానికి సంబంధించిన విషయాల గురించి చర్చిస్తూ, అటుతర్వాత ఎన్నో శతాబ్దాల తర్వాత జీవించిన మోషే వ్యక్తం చేసిన విధానం మాత్రమే. ఆదికాండము 7:4లో చూపించబడినట్లుగా, యెహోవా నోవహుతో మాట్లాడేటప్పుడు వర్షము కురుస్తుందని చెప్పాడు, ఆయన చెప్పింది నోవహు అర్థంచేసుకున్నాడన్నది స్పష్టమౌతుంది. అయినా, నోవహు విశ్వాసం తాను చూడగలిగే దానిలో లేదు. నోవహు ‘అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడ్డాడు’ అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. తాను “జలప్రవాహము”ను, లేదా నూతన లోక అనువాదము (ఆంగ్లం) ఆదికాండము 6:17నందలి అధస్సూచిలో చెబుతున్నట్లుగా “ఆకాశ మహాసముద్రము”ను భూమిపైకి రప్పించబోతున్నానని దేవుడు నోవహుతో చెప్పాడు. అప్పటివరకు అటువంటిది ఎన్నడూ జరగలేదు. కానీ నోవహు కన్నులకు కనిపిస్తున్న సృష్టియంతా, అటువంటి వినాశకరమైన జలప్రళయాన్ని దేవుడు నిజముగానే రప్పించగలడన్న దానికి రుజువుగా నిలబడింది. విశ్వాసమువలన కదిలించబడి నోవహు ఓడను నిర్మించాడు.

7. (ఎ) దేవుడు చేయమని తనకు ఆజ్ఞాపించినది చేయడానికిగాను నోవహుకు ఏమి అవసరం లేకుండినది? (బి) నోవహు విశ్వాసాన్ని పరిశీలించడం మూలంగా మనం ఎలా ప్రయోజనం పొందాము, మన విశ్వాసము ఇతరులకు ఎలా ఆశీర్వాదముగా ఉండగలదు?

7 జలప్రళయము ప్రారంభమయ్యే తేదీని దేవుడు నోవహుకు చెప్పలేదు. కానీ నోవహు దీన్ని సాకుగా తీసుకుని, ఓడ నిర్మించే పనినీ ప్రకటించే పనినీ తన జీవితంలో రెండవ స్థానానికి నెట్టివేసి, చూద్దాంలే అన్న దృక్పథాన్ని అలవర్చుకోలేదు. తగినంత సమయమిచ్చి, ఓడలోనికి ఎప్పుడు ప్రవేశించాలో దేవుడు నోవహుకు చెప్పాడు. ఈలోగా, నోవహు “అట్లు చేసెను, దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.” (ఆదికాండము 6:22) నోవహు వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొన్నాడు. ఆయనలా చేసినందుకు మనమెంత కృతజ్ఞులమై ఉన్నాము! ఆయన విశ్వాసము మూలంగానే నేడు మనం సజీవంగావున్నాము. మన విషయంలో కూడా, మనం ప్రదర్శించే విశ్వాసం మన భవిష్యత్తుపైన మాత్రమే కాక మన పిల్లల భవిష్యత్తుపైనా, మన చుట్టూ ఉన్న ప్రజల భవిష్యత్తుపైనా గట్టి ప్రభావాన్ని చూపించగలదు.

అబ్రాహాము విశ్వాసము

8, 9. (ఎ) అబ్రాహాము తన విశ్వాసాన్ని దేనిమీద ఆధారం చేసుకున్నాడు? (బి) యెహోవా అబ్రాహాముకు ఏ రీతిలో ‘ప్రత్యక్షమయ్యాడు’?

8 మరొక ఉదాహరణ—అబ్రాహాము. (హెబ్రీయులు 11:8-10) అబ్రాహాము తన విశ్వాసాన్ని దేనిమీద ఆధారం చేసుకున్నాడు? తాను పెరిగి పెద్దయిన కల్దీయుల దేశంలోని ఊరనే పట్టణం విగ్రహారాధనతోను భౌతికవాదంతోను నిండిపోయి ఉండేది. కానీ అబ్రాహాము దృక్పథాలను ఇతర ప్రభావాలు తీర్చిదిద్దాయి. నోవహు కుమారుడైన షేముతో అబ్రాహాము తప్పక సహవాసం చేసివుంటాడు, అబ్రాహాము 150 ఏండ్లవాడయ్యేంత వరకు షేము జీవించివున్నాడు. యెహోవా, “ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును” అయివున్నాడని అబ్రాహాముకు పూర్తి నమ్మకం ఏర్పడింది.—ఆదికాండము 14:22.

9 అబ్రాహాముపై గొప్ప ప్రభావం చూపినది మరొకటి కూడా ఉంది. “అబ్రాహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతమియలో ఉన్నప్పుడు” యెహోవా “అతనికి ప్రత్యక్షమై—నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి, నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను.” (అపొస్తలుల కార్యములు 7:2, 3) యెహోవా అబ్రాహాముకు ఏ రీతిలో ‘ప్రత్యక్షమయ్యాడు’? అబ్రాహాము దేవుడ్ని ప్రత్యక్షముగా చూడలేదు. (నిర్గమకాండము 33:20) అయితే, యెహోవా అబ్రాహాముకు ఒక కలలో ప్రత్యక్షమై అద్భుత రీతిలో తన మహిమను ప్రదర్శించి ఉండవచ్చు, లేకపోతే ఒక దూతనో ప్రతినిధినో పంపి ఉండవచ్చు. (ఆదికాండము 18:1-3; 28:10-15, లేవీయకాండము 9:4, 6, 23, 24 పోల్చండి.) యెహోవా అబ్రాహాముకు ప్రత్యక్షమైన విధానం ఏదైనప్పటికీ విశ్వసనీయుడైన ఈ వ్యక్తి, దేవుడు తన ముందు ఒక అమూల్యమైన ఆధిక్యతను ఉంచుతున్నాడని నమ్మకంతో ఉన్నాడు. అబ్రాహాము విశ్వాసంతో ప్రతిస్పందించాడు.

10. అబ్రాహాము విశ్వాసాన్ని యెహోవా ఎలా బలపర్చాడు?

10 అబ్రాహాము విశ్వాసం, దేవుడు తనను వెళ్లమన్న దేశపు వివరాలపై ఆధారపడలేదు. ఆ దేశం తనకు ఎప్పుడు ఇవ్వబడుతుందనేది తెలుసుకోవడంపై కూడా అది ఆధారపడలేదు. యెహోవా సర్వశక్తిమంతుడు అని ఆయనకు తెలుసు కాబట్టి ఆయనకు విశ్వాసం ఉంది. (నిర్గమకాండము 6:3) అబ్రాహాముకు సంతానం కల్గుతుందని యెహోవా ఆయనకు చెప్పాడు, కానీ కొన్నిసార్లు, అదెలా సాధ్యమా అని అబ్రాహాము ఆలోచించాడు. ఆయన వృద్ధుడౌతున్నాడు. (ఆదికాండము 15:3, 4) నక్షత్రాలను చూచి చేతనైతే లెక్కించమని చెప్పడం ద్వారా యెహోవా అబ్రాహాము విశ్వాసాన్ని బలపర్చాడు. “నీ సంతానము ఆలాగవునని” దేవుడు చెప్పాడు. అబ్రాహాము విచలితుడయ్యాడు. సంభ్రమాన్ని పుట్టించే ఆకాశంలోని ఆ నక్షత్రాలను సృష్టించినవాడు ఏమైతే వాగ్దానం చేశాడో దానిని నెరవేర్చగలడన్నది స్పష్టం. అబ్రాహాము “యెహోవాను నమ్మెను.” (ఆదికాండము 15:5, 6) అబ్రాహాము విశ్వాసం కనపర్చింది తాను వింటున్నది చెవులకు ఇంపుగా ఉండడం మూలాన కాదు; ఆయనకు సుస్థాపితమైన విశ్వాసం ఉంది.

11. (ఎ) అబ్రాహాముకు 100 ఏళ్లు దగ్గరపడుతుండగా, వృద్ధురాలైన శారాకు ఒక కుమారుడు కల్గుతాడన్న దేవుని వాగ్దానానికి ఆయన ఎలా ప్రతిస్పందించాడు? (బి) తన కుమారుడిని బలిగా అర్పించడానికి మోరీయా పర్వతం దగ్గరికి తీసుకువెళ్లే విషయంలో ఇమిడివున్న పరీక్షను అబ్రాహాము ఎటువంటి విశ్వాసంతో ఎదుర్కొన్నాడు?

11 అబ్రాహాముకు 100 ఏళ్లు దగ్గర పడుతున్నప్పుడు, ఆయన భార్య శారా 90 ఏళ్ల దరిదాపులో ఉంది. అబ్రాహాము శారా ద్వారా ఒక కుమారుని కంటాడని యెహోవా మళ్లీ తన వాగ్దానాన్ని పేర్కొన్నాడు. అబ్రాహాము తమ పరిస్థితి గురించి వాస్తవికంగా ఆలోచించాడు. “అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను.” (రోమీయులు 4:19-21) దేవుని వాగ్దానం విఫలం కానేరదని అబ్రాహాముకు తెలుసు. తర్వాత, తన కుమారుడైన ఇస్సాకును మోరీయా దేశానికి తీసుకెళ్లి అక్కడ ఆయనను బలిగా అర్పించమని అబ్రాహాముతో దేవుడు చెప్పినప్పుడు విశ్వాసం మూలంగా ఆయన విధేయత చూపించాడు. (ఆదికాండము 22:1-12) కుమారుడు పుట్టేలా అద్భుతం చేసిన దేవుడు, ఆ కుమారునికి సంబంధించి చేసిన ఇతర వాగ్దానాలను నెరవేర్చడానికిగాను అతన్ని మళ్లీ సజీవునిగా చేయగలడన్న పూర్తి నమ్మకం అబ్రాహాముకు ఉంది.—హెబ్రీయులు 11:17-19.

12. అబ్రాహాము ఎంత కాలము విశ్వాసమువలన నడుచుకున్నాడు, ఆయనకూ, దృఢమైన విశ్వాసం కనపర్చిన ఆయన కుటుంబ సభ్యులకూ ఏ బహుమానం వేచివుంది?

12 కేవలం అప్పుడప్పుడు మాత్రమేగాక తన జీవిత పర్యంతము తాను విశ్వాసమువలన నడిపించబడుతున్నానని అబ్రాహాము చూపించాడు. వాగ్దానం చేయబడిన దేశపు భూభాగంలో కొంచెం కూడా అబ్రాహాము తన జీవితకాలంలో దేవుని నుండి స్వాస్థ్యముగా పొందలేదు. (అపొస్తలుల కార్యములు 7:5) అయినా, అబ్రాహాము అలసిపోయి కల్దీయుల దేశమైన ఊరుకు తిరిగి వెళ్లిపోలేదు. దేవుడు తనను నడిపించిన దేశంలో తన మరణం వరకు 100 ఏళ్లపాటు ఆయన గుడారాల్లో నివసించాడు. (ఆదికాండము 25:7) ఆయన గురించి, ఆయన భార్య శారాను గురించి, వారి కుమారుడు ఇస్సాకు గురించి, వారి మనుమడు యాకోబు గురించి హెబ్రీయులు 11:16 ఇలా అంటుంది: “తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారినిగూర్చి సిగ్గుపడడు; ఏలయనగా ఆయన వారికొరకు ఒక పట్టణము సిద్ధపరచియున్నాడు.” అవును, యెహోవా తన మెస్సీయా రాజ్యం యొక్క భూపరిధిలో వారి కొరకు స్థలాన్ని సిద్ధంచేశాడు.

13. నేడు యెహోవా సేవకుల్లో ఎవరు అబ్రాహాము వంటి విశ్వాసం ఉన్నట్లు రుజువుపరుస్తున్నారు?

13 నేడు యెహోవా సేవకుల్లో అబ్రాహాము వంటివారు ఉన్నారు. వారు ఎన్నో సంవత్సరాలుగా విశ్వాసమువలననే నడిచారు. దేవుడిచ్చిన శక్తిద్వారా వారు కొండల్లా కనబడే అవరోధాల్ని అధిగమించారు. (మత్తయి 17:20) దేవుడు తాను వాగ్దానం చేసిన స్వాస్థ్యాన్ని ఎప్పుడు ఇస్తాడన్నది వారికి తెలియనందున వారు తమ విశ్వాసంలో ఊగిసలాడడం లేదు. యెహోవా వాక్యము ఎన్నడూ విఫలం కానేరదని వారికి తెలుసు, అంతేగాక ఆయన సాక్షుల్లో ఒకరిగా లెక్కించబడడం ఒక అమూల్యమైన ఆధిక్యతయని కూడా వారు భావిస్తారు. మీరూ అదే విధంగా భావిస్తున్నారా?

మోషేను కదిలించిన విశ్వాసం

14. మోషే విశ్వాసానికి పునాది ఎలా వేయబడింది?

14 విశ్వాసంగల వ్యక్తుల్లో మరొక ఉదాహరణ మోషే. ఆయన విశ్వాసానికి పునాది ఏమిటి? ఆ పునాది బాల్యంలోనే వేయబడింది. ఫరో కుమార్తె నైలు నదిలో తేలుతున్న జమ్ముపెట్టెలో మోషేను కనుగొని తన కుమారునిగా స్వీకరించినప్పటికీ, హెబ్రీయురాలైన ఆ పిల్లవాని కన్నతల్లి యోకెబెదు ఆ పిల్లవానికి పాలిచ్చి తొలి సంవత్సరాలలో తన సంరక్షణలో ఉంచుకుంది. యెహోవాపట్ల ప్రేమను, అబ్రాహాముకు యెహోవా చేసిన వాగ్దానాలపట్ల మెప్పుదలను ఆ పిల్లవాని మనస్సులో నాటుతూ యోకెబెదు వానికి చక్కగా విద్యాబోధ చేసిందని స్పష్టమౌతుంది. అటుతర్వాత, ఫరో ఇంటిలోని సభ్యునిగా మోషే ‘ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించాడు.’ (అపొస్తలుల కార్యములు 7:20-22; నిర్గమకాండము 2:1-10; 6:20; హెబ్రీయులు 11:23) అయితే మోషే అంతటి ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ ఆయన హృదయం బానిసలుగా ఉన్న దేవుని ప్రజలవైపే ఉంది.

15. తనను తాను యెహోవా ప్రజలలో ఒకనిగా గుర్తింపజేసుకోవడంలో మోషే ఏమి చేశాడని మనం అర్థంచేసుకుంటున్నాము?

15 తన 40వ ఏట, అన్యాయంగా బాధించబడుతున్న ఒక ఇశ్రాయేలీయుడిని కాపాడడానికి మోషే ఒక ఐగుప్తీయుడిని చంపేశాడు. ఈ సంఘటన, మోషే దేవుని ప్రజలను ఎలా దృష్టించాడో చూపించింది. నిజానికి, “మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి . . . ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు.” ఐగుప్తు రాజ దర్బారులోని సభ్యునిగా “అల్పకాలము పాప భోగము అనుభవించ”డానికి బదులు, ఆయన దురాచారానికి గురౌతున్న దేవుని ప్రజలలో ఒకనిగా గుర్తించబడడానికి విశ్వాసమువలన కదిలించబడ్డాడు.—హెబ్రీయులు 11:24, 25; అపొస్తలుల కార్యములు 7:23-25.

16. (ఎ) మోషేకు యెహోవా ఏ నియామకాన్ని ఇచ్చాడు, దేవుడు ఆయనకు ఎలా సహాయం చేశాడు? (బి) తన నియామకాన్ని నెరవేర్చడంలో మోషే విశ్వాసాన్ని ఎలా కనపర్చాడు?

16 తన ప్రజలకు సేదదీర్పును తీసుకురావడానికి చర్యగైకొనేందుకు మోషే ఉత్సుకతతో ఉన్నాడు, కానీ వారి విడుదల కొరకైన దేవుని సమయం ఇంకా రాలేదు. మోషే ఐగుప్తు నుండి పారిపోవలసి వచ్చింది. తర్వాత 40 సంవత్సరాలకుగానీ, ఐగుప్తుకు తిరిగివెళ్లి ఆ దేశం నుండి ఇశ్రాయేలీయులను బయటికి విడిపించుకురమ్మని యెహోవా మోషేకు ఒక దూత ద్వారా నియామకాన్ని ఇవ్వలేదు. (నిర్గమకాండము 3:2-10) మోషే ఎలా ప్రతిస్పందించాడు? ఇశ్రాయేలీయులను విడిపించడంలో యెహోవాకున్న శక్తి విషయంలో ఆయన సందేహాన్ని వ్యక్తపర్చలేదు, కానీ దేవుడు తన ముందుంచిన పాత్రను పోషించడానికి తాను యోగ్యుడను కానని ఆయన భావించాడు. యెహోవా ప్రేమపూర్వకంగా, మోషేకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందించాడు. (నిర్గమకాండము 3:11–4:17) మోషే విశ్వాసము దృఢపడింది. ఐగుప్తుకు తిరిగి వెళ్లి, యెహోవాను ఆరాధించడానికి ఫరో ఇశ్రాయేలును పంపించకపోతే ఐగుప్తు మీదికి రాబోయే తెగుళ్లను గురించి ఆయన ముఖాముఖిగా ఫరోను మళ్లీమళ్లీ హెచ్చరించాడు. ఆ తెగుళ్లను రప్పించడానికి మోషే దగ్గర వ్యక్తిగతంగా ఏ శక్తులూ లేవు. ఆయన వెలిచూపు వలన కాక విశ్వాసమువలననే నడుచుకున్నాడు. ఆయన విశ్వాసం యెహోవాపైనా ఆయన వాక్యంపైనా ఉంది. ఫరో మోషేను భయపెట్టాడు. కానీ మోషే అలాగే పట్టుదలతో ముందుకు సాగిపోయాడు. “విశ్వాసమునుబట్టి అతడు అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై, రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను.” (హెబ్రీయులు 11:27) మోషే పరిపూర్ణుడు కాడు. ఆయన పొరపాట్లు చేశాడు. (సంఖ్యాకాండము 20:7-12) అయితే, దేవుని నుండి నియామకాన్ని పొందిన తర్వాత మాత్రం ఆయన పూర్తి జీవితము విశ్వాసమువలననే నడిపించబడింది.

17. దేవుని నూతన లోకాన్ని చూసేందుకు నోవహు, అబ్రాహాము, మోషేలు జీవించి ఉండకపోయినా విశ్వాసమువలననే నడుచుకోవడం వారి విషయంలో దేనికి దారితీసింది?

17 మీ విశ్వాసము కూడా నోవహు, అబ్రాహాము, మోషేల విశ్వాసమువలె ఉండును గాక. వారు తమ దినాల్లో దేవుని నూతన లోకాన్ని చూడలేదన్నది నిజమే. (హెబ్రీయులు 11:39, 40) దేవుని నియామక కాలం అప్పటికింకా రాలేదు; ఆయన సంకల్పం యొక్క ఇతర అంశాలు ఇంకా నెరవేరాల్సి ఉంది. అయినా, దేవుని వాక్యంలో వారి విశ్వాసం ఊగిసలాడలేదు, మరి వారి పేర్లు దేవుని జీవ గ్రంథంలో ఉన్నాయి.

18. పరలోకంలో జీవించడానికి పిలుపును అందుకున్నవారు విశ్వాసము వలననే నడుచుకోవడం ఎందుకు అవసరం?

18 “దేవుడు మనకొరకు మరి శ్రేష్ఠమైనదానిని ముందుగా సిద్ధపరచెను” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. అంటే, క్రీస్తుతోపాటు పరలోకంలో జీవించడానికి పిలువబడిన పౌలువంటి ఇతరుల కోసం దేవుడు మరి శ్రేష్ఠమైనదానిని ముందుగా సిద్ధపరిచాడు. (హెబ్రీయులు 11:39, 40) 2 కొరింథీయులు 5:6లో “వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొనుచున్నాము” అనే మాటల్ని పౌలు వ్రాసినప్పుడు ప్రత్యేకంగా వీరినే మనస్సులో ఉంచుకున్నాడు. పౌలు ఆ మాటల్ని వ్రాసిన సమయానికి వారిలో ఎవ్వరూ పరలోక జీవిత బహుమానాన్ని ఇంకా పొందలేదు. వారు దానిని తమ భౌతిక కళ్లతో చూడలేదు, కానీ దానికి సంబంధించి వారి విశ్వాసము సుస్థాపితమై ఉంది. క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు, పరలోక జీవితంతో ఆశీర్వదించబడేవారిలో ఆయన ప్రథమఫలము. ఆయన పరలోకానికి ఆరోహణం కాకమునుపు ఆయనను 500 మంది సాక్షులు చూశారు. (1 కొరింథీయులు 15:3-8) తమ పూర్తి జీవితగమనాన్ని ఆ విశ్వాసం ఆధారంగా నడిపించడానికి వారికి సరిపడినన్ని కారణాలు ఉన్నాయి. విశ్వాసంవలననే నడవడానికి మనకు కూడా దృఢమైన కారణాలు ఉన్నాయి.

19. హెబ్రీయులు 1:1, 2లో చూపించబడినట్లుగా, దేవుడు మనతో ఎవరిద్వారా మాట్లాడాడు?

19 మండుతున్న పొదవద్ద మోషేతో మాట్లాడినట్లు, యెహోవా నేడు తన ప్రజలతో ఒక దేవదూత ద్వారా మాట్లాడడం లేదు. దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడాడు. (హెబ్రీయులు 1:1, 2) దేవుడు ఆయన ద్వారా ఏమి చెప్పాడో దాన్ని బైబిలులో వ్రాయింపజేశాడు. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు మాట్లాడే భాషల్లోనికి అనువదించబడింది.

20. నోవహు, అబ్రాహాము, మోషేలకన్నా మన పరిస్థితి ఎలా ఎక్కువ అనుగ్రహపాత్రమైనది?

20 మన దగ్గర నోవహు, అబ్రాహాము, మోషేలు కలిగివున్నదానికన్నా ఎంతో ఎక్కువ ఉంది. మన దగ్గర పూర్తి దేవుని వాక్యం ఉంది—దానిలో చాలాభాగం ఇప్పటికే నెరవేరింది. ప్రతివిధమైన పరీక్షల్లోనూ తమను తాము యెహోవా యొక్క విశ్వసనీయమైన సాక్షులుగా రుజువు చేసుకున్న స్త్రీపురుషుల గురించి బైబిలు చెబుతున్న దానంతటి దృష్ట్యా, హెబ్రీయులు 12:1, 2 వచనాలు ఇలా ప్రోత్సహిస్తున్నాయి: “మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, . . . మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము.” మన విశ్వాసము ఏదో స్వల్పమైన విషయంగా ఎంచాల్సింది కాదు. “సుళువుగా చిక్కులబెట్టు పాపము” విశ్వాసరాహిత్యమే. ‘విశ్వాసమువలననే నడుచుకోవడానికి’ మనం గట్టి పోరాటం పోరాడాల్సివుంది.

[అధస్సూచి]

a వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం) చూడండి.

మీ వ్యాఖ్యానం ఏమిటి?

▫ ‘విశ్వాసం వలన నడుచుకొనుటలో’ ఏమి ఇమిడివుంది?

▫ నోవహు విశ్వాసము చూపించిన విధానం నుండి మనము ఎలా ప్రయోజనం పొందవచ్చు?

▫ అబ్రాహాము విశ్వాసము ప్రదర్శించిన విధానం మనకు ఎలా సహాయం చేస్తుంది?

▫ బైబిలు మోషేను విశ్వాసానికి ఒక ఉదాహరణగా ఎందుకు చూపిస్తుంది?

[10వ పేజీలోని చిత్రం]

అబ్రాహాము విశ్వాసమువలనే నడుచుకున్నాడు

[10వ పేజీలోని చిత్రం]

మోషే, అహరోనులు ఫరో ఎదుట ఉన్నప్పుడు విశ్వాసాన్ని ప్రదర్శించారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి