సత్యానికన్నా మిన్నయైనదేదీ లేదు
జీ. ఎన్. ఫాన్ డర్ బేల్ చెప్పినది
నేను 1941 జూన్‌లో గెస్టపోకు అప్పగించబడ్డాను, జర్మనీలోని బెర్లిన్‌కు సమీపానున్న సాక్సన్‌హౌజన్ కాన్సన్‌ట్రేషన్ క్యాంపుకు నన్ను తీసుకెళ్ళారు. అక్కడ 38190 సంఖ్యగల ఖైదీగా, 1945 ఏప్రిల్‌లో అప్రతిష్ఠాకరమైన మరణ యాత్ర ప్రారంభమయ్యే వరకూ నేను అక్కడే ఉన్నాను. అయితే ఆ సంఘటనలను నేను వివరించే ముందు, నేను ఒక ఖైదీని ఎందుకయ్యానో నన్ను వివరించనివ్వండి.
నేను, 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన కొద్ది కాలానికే నెదర్లాండ్స్ నందలి రోటర్‌డామ్‌లో జన్మించాను. నాన్నగారు రైల్‌రోడ్డ్ కొరకు పని చేసేవారు, మా చిన్న ఇల్లు రైల్వే ట్రాక్ సమీపాన ఉండేది. 1918లో యుద్ధం అంతం కాబోతుండగా, అనేక అంబులెన్స్ ట్రైన్‌లని పిలువబడేవి పెద్ద శబ్దం చేస్తూ ఇంటి ముందుగా వెళ్లడాన్ని నేను చూసేవాడ్ని. అవి నిస్సందేహంగా, యుద్ధ భూమి నుండి ఇంటికి తీసుకొని పోబడుతున్న గాయపడిన సైనికులతో నిండి ఉండేవి.
నాకు 12 ఏళ్లు ఉన్నప్పుడు నేను ఉద్యోగం వెదుక్కునేందుకు పాఠశాలకు వెళ్లడం మానేశాను. ఎనిమిది సంవత్సరాల తర్వాత, ప్రయాణికుల నౌకలో స్టీవర్డుగా పని చేసేందుకు నేను నియమింపబడ్డాను, తర్వాతి నాలుగు సంవత్సరాలూ నేను నెదర్లాండ్స్‌కూ అమెరికాకూ మధ్య ప్రయాణం చేశాను.
మేము 1939 వేసవిలో న్యూయార్క్‌నందలి నౌకాశ్రయంలో ఆగినప్పుడు, మరొక ప్రపంచ యుద్ధం జరుగనైయుందనే భయం ప్రారంభమైంది. అప్పుడు ఒక వ్యక్తి మా నౌకలోకి వచ్చి, ఒక నీతియుక్తమైన ప్రభుత్వాన్ని గురించి చెబుతున్న ప్రభుత్వం (ఆంగ్లం) అనే పుస్తకాన్ని నాకిచ్చినప్పుడు నేను దాన్ని సంతోషంగా తీసుకున్నాను. రోటర్‌డామ్‌కు తిరిగి వచ్చిన తర్వాత, సముద్రంపై జీవించడం ఇక ఎంత మాత్రం సురక్షితంగా అనిపించడం లేదు గనుక నేలపై పని చేసేందుకు నేను పని కొరకు వెదకడం ప్రారంభించాను. సెప్టెంబరు 1న, జర్మనీ పోలండ్‌ను ఆక్రమించుకుంది, దేశాలు రెండవ ప్రపంచ యుద్ధంలో మునిగిపోయాయి.
బైబిలు సత్యాన్ని నేర్చుకోవడం
1940 మార్చినెలలో ఒక ఆదివారం ఉదయం, వివాహితుడైన మా అన్నయ్యను దర్శించేందుకు నేను వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు, ఒక యెహోవాసాక్షి వారి తలుపు తట్టాడు. నా వద్ద ఇప్పటికే ప్రభుత్వం పుస్తకం ఉందని నేను ఆయనకు చెప్పాను, పరలోకం గురించీ అక్కడికి ఎవరు వెళ్తారనేదాని గురించీ నేను ఆయన్ని అడిగాను. నాకు ఎంత స్పష్టమైన, సహేతుకమైన జవాబు లభించిందంటే, ‘సత్యమంటే ఇదే’ అని నేను మనస్సులో అనుకున్నాను. నేను ఆయనకు నా చిరునామా ఇచ్చి, నన్ను దర్శించేందుకు మా ఇంటికి రమ్మని ఆయనను ఆహ్వానించాను.
మేము బైబిలు విషయాలు లోతుగా చర్చించిన కేవలం మూడు సందర్శనాల తర్వాత, నేను సాక్షితోపాటూ ఇంటింటి ప్రకటనాపనిలో భాగంవహించడం ప్రారంభించాను. మేము ప్రాంతాన్ని చేరుకున్న తర్వాత, ఎక్కడనుండి ప్రారంభించాలో ఆయన నాకు చూపించాడు, నేను నా అంతట నేను ప్రకటించాను. ఆ రోజుల్లో అనేకమంది క్రొత్త వారిని ప్రకటనాపనికి ఆ విధంగానే పరిచయం చేసేవారు. వీధిలో కనిపించకుండా ఉండేందుకు, నేను ఎల్లప్పుడూ ఇంటి లోపలికి వెళ్లి ప్రచురణలను అందించాలని నాకు సలహా ఇవ్వబడింది. యుద్ధం జరుగుతుండిన తొలి దినాల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరత ఉండేది.
మూడు వారాల తర్వాత, 1940 మే 10వ తారీఖున, జర్మన్ సైన్యం నెదర్లాండ్స్‌ను ఆక్రమించింది, యెహోవాసాక్షుల సంస్థ నిషేధించబడిందని రైక్ కమీషనరైన జైసింక్వార్ట్ మే 29న ప్రకటించాడు. మేము చిన్న గుంపులుగా కూడుకునే వాళ్ళం, మా కూటాల స్థలాలను రహస్యంగా ఉంచేందుకు ఎంతో జాగ్రత్త వహించేవాళ్లం. ప్రయాణ పైవిచారణ కర్తల సందర్శనాలు మమ్మల్ని ప్రత్యేకంగా బలపర్చేవి.
నేను అధికంగా పొగ త్రాగేవాడ్ని, నాతో బైబిలు పఠించిన సాక్షికి నేను సిగరెట్‌ను ఆఫర్ చేసినప్పుడు ఆయన పొగ త్రాగడనే విషయాన్ని నేను తెలుసుకున్నాను, మరి “నేను పొగ త్రాగడం ఎన్నటికీ మానుకోలేను!” అని నేను అన్నాను. అయితే, అలా జరిగిన కొంత కాలానికే, నేను వీధిలో నడిచి వెళ్తుండగా, ‘నేను ఒక సాక్షిగా ఉండాలంటే నేను నిజమైన సాక్షిగా ఉండాలని’ నేను అనుకున్నాను. ఇక మళ్లీ నేను ఎన్నడూ పొగ త్రాగలేదు.
సత్యం విషయంలో దృఢ తీర్మానం తీసుకోవడం
1940 జూన్‌లో, అంటే మా అన్నయ్యగారి ఇంట్లో నేను సాక్షిని కలిసిన తర్వాత మూడు నెలలకంటే తక్కువ కాలంలో, నేను యెహోవాకు నా సమర్పణను సూచించాను మరియు బాప్తిస్మం పొందాను. కొన్ని నెలల తర్వాత, 1940 అక్టోబరులో నేను పయినీరుగా పూర్తికాల పరిచర్యలో ప్రవేశించాను. ఆ సమయంలో, పయినీరు వేస్ట్ కోట్ అని పిలువబడేది నాకు ఇవ్వబడింది. పుస్తకాలనూ చిన్న పుస్తకాలనూ పెట్టుకునేందుకు అందులో అనేక జేబులు ఉండేవి, మరి దాన్ని ఒక కోటులోపల వేసుకోవచ్చు.
జర్మను వారు ఆక్రమించుకోవడం ప్రారంభమైనప్పటి నుండీ కూడా, యెహోవాసాక్షులను ఒక క్రమపద్ధతిలో వెంటాడి అరెస్టు చేయడం జరిగింది. 1941 ఫిబ్రవరిలో ఒక ఉదయాన, కొద్దిమంది ఇతర సాక్షులతో పాటూ నేను ప్రాంతీయ పరిచర్య చేస్తున్నాను. వారు ఒక ఇళ్ల బ్లాకుకు ఒక వైపున సాక్ష్యమిస్తుంటే, అటు వైపునుండి వచ్చి వాళ్లను కలుసుకునేలా నేను మరొక వైపునుండి సాక్ష్యమిస్తూ వస్తున్నాను. కొంత సమయానికి, వారికి ఎందుకు ఆలస్యమౌతుందో చూద్దామని నేను వెళ్లాను, అక్కడ ఒక వ్యక్తి నన్ను కలిసి, “మీ వద్ద కూడా ఈ చిన్న పుస్తకాలు ఏమైనా ఉన్నాయా?” అని అడిగాడు.
“ఉన్నాయి” అని నేను సమాధానమిచ్చాను. అతను వెంటనే నన్ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. దాదాపు నాలుగు వారాల వరకూ నన్ను నిర్బంధంలో ఉంచారు. అధికారుల్లో చాలామంది స్నేహపూర్వకంగా ఉన్నారు. ఒక వ్యక్తిని గెస్టపోకు అప్పగించనంత వరకూ కూడా, తాను బైబిలు ప్రచురణలను ఇక ఎంతమాత్రం పంచిపెట్టనని ఒక వ్రాత పూర్వక ప్రకటనపై సంతకం చేస్తే చాలు అతను విడుదల చేయబడవచ్చు. అటువంటి ప్రకటనపై సంతకం చేయమని నన్ను అడిగినప్పుడు, “మీరు నాకు ఒక కోటి గుల్డెన్‌లో లేక రెండు కోట్ల గుల్డెన్‌లో (నెదర్లాండ్స్‌లో చలామణిలో ఉన్న డబ్బు) ఇచ్చినా, నేను మాత్రం సంతకం చేయను” అని నేను సమాధానమిచ్చాను.
కొంత కాలం అలాగే ఉంచిన తర్వాత, నన్ను గెస్టపోకు అప్పగించారు. అప్పుడు నన్ను జర్మనీలోని సాక్సన్‌హౌజన్ కాన్సన్‌ట్రేషన్ క్యాంపుకి తీసుకెళ్లారు.
సాక్సన్‌హౌజన్‌లో జీవితం
నేను 1941 జూన్‌లో సాక్సన్‌హౌజన్‌కు చేరుకునే సరికి, అప్పటికే అక్కడ దాదాపు 150 మంది సాక్షులున్నారు, వారిలో చాలామంది జర్మనీ వారే. క్రొత్త ఖైదీలమైన మమ్మల్ని క్యాంపులోని ఐసొలేషన్ అని పిలువబడే భాగానికి తీసుకెళ్లారు. అక్కడ మన క్రైస్తవ సహోదరులు మా ఎడల శ్రద్ధ వహించి త్వరలో రాబోతున్న పరిణామాలను ఎదుర్కొనేందుకు మమ్మల్ని సిద్ధం చేశారు. ఒక వారం తర్వాత, నెదర్లాండ్స్ నుండి సాక్షుల మరొక గుంపు వచ్చింది. మొదట బరాక్‌ల ఎదురుగా ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకూ ఒకే స్థలంలో నిలబడటమే మాకు నియామకంగా ఇవ్వబడింది. కొన్నిసార్లు ఖైదీలు ఒక వారం రోజుల పాటూ లేక మరి ఎక్కువ రోజులు అలా ప్రతి రోజు చేయవలసి వచ్చేది.
అలాంటి కఠినమైన పరిస్థితుల్లోను, సంస్థీకరింపబడి ఉండి ఆధ్యాత్మిక పోషణను తీసుకోవలసిన అత్యంతావసరతను సహోదరులు గుర్తించారు. ప్రతిరోజు ఒక బైబిలు లేఖనంపై వ్యాఖ్యానాలను సిద్ధం చేసే పనిని ఎవరికైనా అప్పగించేవారు. తర్వాత, అసెంబ్లీ మైదానంలో సాక్షులు వ్యక్తిగతంగా అతన్ని సమీపించి అతను సిద్ధం చేసిన వాటిని వినేవారు. ఏదో ఒక విధంగా ప్రచురణలు క్రమంగా క్యాంపులోకి దొంగతనంగా తీసుకురాబడేవి, వాస్తవానికి మేము ప్రతి ఆదివారం సమావేశమై ఈ బైబిలు ప్రచురణలను కలిసి పఠించేవాళ్లం.
1941 వేసవిలో అమెరికానందలి సెయింట్ లూయిస్ సమావేశంలో విడుదలైన పిల్లలు (ఆంగ్లం) అనే పుస్తకం యొక్క ఒక ప్రతి ఎలాగో సాక్సన్‌హౌజన్‌కి దొంగచాటుగా తీసుకురాబడింది. ఆ పుస్తకాన్ని వారు గుర్తించి దాన్ని నాశనం చేయకుండా ఉండేందుకుగానూ మేము దాన్ని విడి భాగాలుగా చేసి, దాన్ని అందరూ వంతులవారీగా చదివేందుకు ఆ భాగాలను సహోదరులకు పంపిణీ చేశాము.
కొంత కాలం తర్వాత, మేము జరుపుకుంటున్న కూటాలను గురించి క్యాంపు అధికారులు కనుగొన్నారు. కాబట్టి సాక్షులను విభజించి వేర్వేరు బరాక్‌లలో ఉంచారు. ఇతర ఖైదీలకు ప్రకటించేందుకు ఇది మాకు మంచి అవకాశాన్నిచ్చింది, మరి దాని ఫలితంగా పోలండ్, ఉక్రెయిన్‌లకు చెందిన అనేకమంది ఖైదీలూ మరితర ఖైదీలూ సత్యాన్ని అంగీకరించారు.
యెహోవాసాక్షులు బీల్‌ఫార్‌షర్‌లని పిలువబడేవారు. వారి యథార్థతను విచ్ఛిన్నం చేయడం లేక వారిని చంపేయడం తమ సంకల్పమనే విషయాన్ని నాజీలు రహస్యంగా ఏమీ ఉంచలేదు. దాని మూలంగా, మాపై తీవ్రమైన ఒత్తిడిని తీసుకొచ్చేవారు. మా విశ్వాసాన్ని వదిలేస్తున్నామని ప్రకటించే పత్రంపై సంతకం చేస్తే మేము విడుదల చేయబడతామని మాకు చెప్పారు. “నేను స్వేచ్ఛగా ఉంటే, యెహోవాసేవలో నేను మరింత చేయగలను” అని కొందరు సహోదరులు తర్కించనారంభించారు. కొంతమంది సంతకం చేసినప్పటికీ, మన సహోదరుల్లో అనేకమంది అంత లేమినీ, అవమానాలనూ మరియు కష్టాలనూ అనుభవిస్తుండినప్పటికీ నమ్మకంగా ఉన్నారు. రాజీపడిన వారిలో కొంతమందిని గురించి మరి ఎన్నడూ మాకు సమాచారం లభించలేదు. అయితే ఇతరులు తర్వాత సర్దుకున్నారు మరి వారు ఇప్పటికీ చురుకైన సాక్షులుగా ఉన్నారనే విషయం ఎంతో సంతోషకరమైనది.
ఒక బెత్తంతో 25 దెబ్బలు కొట్టడం వంటి శారీరక దండన ఖైదీలకు ఇవ్వబడుతున్నప్పుడు మేము దాన్ని చూడాలని మమ్మల్ని బలవంతపెట్టేవారు. నలుగురు వ్యక్తులను ఉరితీయడాన్ని చూసేందుకు మమ్మల్ని ఒకసారి బలవంతపెట్టారు. అలాంటి అనుభవాలు ఒక వ్యక్తిపై నిజంగా ప్రభావాన్ని చూపుతాయి. నేను ఉండే బరాక్‌లోనే ఉండే ఎత్తరి, అందగాడూ అయిన ఒక సహోదరుడు నాతో ఇలా అన్నాడు: “నేను ఇక్కడికి రాకముందు, రక్తాన్ని చూసినప్పుడు వెంటనే స్పృహ తప్పేవాడ్ని. అయితే ఇప్పుడు నేను గట్టిపడ్డాను.” మేము గట్టిపడ్డామేమో కానీ, మేము మొద్దుబారిపోలేదు. మమ్మల్ని హింసించిన వారి ఎడల క్రోధంగానీ లేక ద్వేషంగానీ నాకు లేదని నేను చెప్పగలను.
ఒక కామండోతో (పని సిబ్బంది) కొంత కాలం కలిసి పని చేసిన తర్వాత, తీవ్రమైన జ్వరం మూలంగా నన్ను ఆసుపత్రిలో చేర్పించారు. నార్వేకు చెందిన ఒక దయగల డాక్టరూ మరియు చెకోస్లవేకియాకు చెందిన ఒక నర్సు నాకు సహాయం చేశారు, బహుశ వారి దయాగుణమే నా జీవితాన్ని కాపాడింది.
మరణ ప్రస్థానం
1945 ఏప్రిల్ కల్లా, జర్మనీ యుద్ధంలో ఓడిపోబోతోందనే విషయం స్పష్టమైంది. పశ్చిమ ప్రత్యర్థులు పశ్చిమం వైపు నుండి, సోవియట్ వారు తూర్పునుండి త్వరితగతిన వస్తున్నారు. కాన్సన్‌ట్రేషన్ క్యాంపుల్లో ఉన్న వందల వేల మందిని చంపేసి కొద్ది దినాల్లోనే ఎలాంటి రుజువులూ లేకుండా వారి శవాలను కనిపించకుండా చేయడం నాజీలకు పూర్తిగా అసాధ్యమైన పని. కాబట్టి అనారోగ్యంతో ఉన్న వారిని చంపేసి, మిగతా ఖైదీలను అతి సమీపంలోని నౌకాశ్రయానికి తరలించాలని వారు నిర్ణయించారు. అక్కడ వాళ్లను నౌకల్లోకి ఎక్కించి, సముద్రం మధ్యలో నౌకలను ముంచేయాలని వారు పథకం వేసుకున్నారు.
సాక్సన్‌హౌజన్ నుండి దాదాపు 26,000 మంది ఖైదీల యాత్ర ఏప్రిల్ 20 రాత్రి ప్రారంభమైంది. మేము క్యాంపు వదిలి వచ్చే ముందు, అనారోగ్యంతో ఉన్న మన సహోదరులను ఇన్‌ఫర్మరీ నుండి రక్షించాం. వాళ్లను తీసుకెళ్లేందుకు ఒక బండిని సంపాదించడం జరిగింది. అక్కడ మొత్తం ఆరు వేర్వేరు దేశాలకు చెందిన 230 మందిమి ఉన్నాం. అనారోగ్యంతో ఉన్న వారిలో, నెదర్లాండ్స్‌లో సేవను విస్తృతం చేసేందుకు ఎంతో తోడ్పడిన బ్రదర్ ఆర్థర్ వ్రింక్లర్ కూడా ఉన్నారు. సాక్షులమైన మేము ఆ యాత్రలో చివరన ఉన్నాం, మరి మేము కొనసాగుతూనే ఉండమని ఒకరినొకరము ప్రోత్సహించుకున్నాము.
మొదట, మేము 36 గంటలు ఆగకుండా నడిచాము. నేను నడుస్తున్నప్పుడు, నా దైన్యస్థితి మరియు అలసట మూలంగా వాస్తవంగా నేను నిద్రలోకి జారుకున్నాను. అయితే వెనకే ఉండిపోవడం లేక విశ్రాంతి తీసుకోవడం అన్న ప్రశ్నే లేదు ఎందుకంటే అలా చేస్తే గార్డులు చంపేస్తారు. రాత్రుల్లో మేము మైదానంలో లేక అడవుల్లో నిద్రపోయాం. మావద్ద బొత్తిగా ఆహారం లేదు. ఆకలి బాధ మరీ ఎక్కువైనప్పుడు, స్వీడిష్ రెడ్ క్రాస్ మాకు ఇచ్చిన టూత్‌పేస్టులు నేను నాకేసేవాడ్ని.
ఒక స్థాయిలో, రష్యాకు చెందిన దళాలు మరియు అమెరికాకు చెందిన దళాలు ఎక్కడున్నాయనే విషయంలో జర్మనీ గార్డులు తికమకపడ్డారు గనుక, మేము అడవుల్లో నాలుగు దినాలు ఉండగలిగాం. ఇది సమయోచితంగానే జరిగింది, ఎందుకంటే దాని మూలంగా, మమ్మల్ని మా జలసమాధి వైపుకు తీసుకెళ్లే నౌకలను ఎక్కేందుకు మేము లూబెక్ అఖాతం వద్దకు తగిన సమయంలో చేరుకోలేక పోయాం. తుదకు, 12 రోజుల తర్వాత, అంటే దాదాపు 200 కిలోమీటర్ల నడక తర్వాత, మేము క్రివిట్స్ అడవులకు చేరుకున్నాం. లూబెక్ నుండి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉండే నగరమైన ష్ప్వేరీన్‌కు అది ఎంతో దూరంలో లేదు.
సోవియట్ సైన్యాలు మాకు కుడి వైపున అమెరికా సైన్యాలు మాకు ఎడమ వైపునా ఉన్నాయి. పెద్ద తుపాకుల చప్పుడు మరియు రైఫిళ్ల ఎడతెగని శబ్దం ద్వారా, మేము సరిహద్దుకు సమీపంలో ఉన్నామని మేము తెలుసుకున్నాం. జర్మనీ సైనికులు భీతిల్లారు; కొందరు పారిపోయారు, మరి ఇతరులు తమను గుర్తుపట్టకుండా ఉండేందుకు తమ సైనిక దుస్తులను తీసేసి, చనిపోయిన ఖైదీల దుస్తులను వేసుకున్నారు. ఆ గందరగోళం మధ్య, సాక్షులమైన మేము నడిపింపు కొరకు ప్రార్థించేందుకు సమావేశమయ్యాము.
నడిపింపు ఇస్తున్న సహోదరులు మేము మర్నాడు ఉదయాన్నే బయల్దేరి అమెరికా సైనికుల దిశగా వెళ్లాలని నిర్ణయించారు. మరణ ప్రస్థానం ప్రారంభించిన ఖైదీల్లో దాదాపు సగం మంది మార్గమధ్యంలో చనిపోవడం లేక చంపబడటం జరిగినప్పటికీ, సాక్షులందరూ బ్రదికే ఉన్నారు.
కెనడా సైనిక సిబ్బందిలో కొందరు, నా సహోదరి ఒకామె నివసిస్తుండిన నైమెగన్ నగరానికి నాకు లిఫ్ట్ ఇచ్చారు. అయితే నేను అక్కడికి చేరుకున్న తర్వాత, ఆమె అక్కడనుండి వెళ్లిపోయిందనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. కాబట్టి నేను రోటర్‌డామ్‌కు వెళ్లేందుకు నడక ప్రారంభించాను. దారిలో నాకు వ్యక్తిగత వాహనాల నుండి లిఫ్టు లభించడం ఎంతో సంతోషకరమైన విషయం. అవి నన్ను నా గమ్యస్థానానికి తీసుకెళ్లాయి.
సత్యం నా జీవితమై ఉంది
నేను రోటర్‌డామ్‌కు చేరుకున్న రోజే మళ్లీ పయినీరు పని కొరకు నేను అప్లై చేశాను. మూడు వారాల తర్వాత నేను జట్‌ఫన్ నగరంలో నా నియామకంలో ఉన్నాను, నేను అక్కడ తర్వాతి ఒకటిన్నర సంవత్సరం సేవ చేశాను. ఆ సమయంలో, నేను నా శరీర దారుఢ్యాన్ని కొంత తిరిగి పొందాను. అప్పుడు నన్ను ప్రాంతీయ పైవిచారణ కర్తగా నియమించారు, ప్రయాణ పరిచారకులు అలా పిలువబడతారు. కొన్ని నెలల తర్వాత, న్యూయార్క్ నందలి దక్షిణ లాంసింగ్‌లోని వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్‌కు నేను ఆహ్వానించబడ్డాను. 1949 ఫిబ్రవరిలో ఆ పాఠశాల యొక్క 12వ తరగతి నుండి గ్రాడ్యుయేట్‌నైన తర్వాత, నేను బెల్జియంకు నియమించబడ్డాను.
బెల్జియంలో పరిచర్య యొక్క వివిధ అంశాల్లో నేను సేవ చేశాను, బ్రాంచి కార్యాలయంలో దాదాపు ఎనిమిది సంవత్సరాలు మరియు ప్రయాణ పనిలో ప్రాంతీయ పైవిచారణకర్తగా అలాగే జిల్లా పైవిచారణకర్తగా దశాబ్దాలపాటు పని చేయడం కూడా అందులో ఇమిడి ఉన్నాయి. 1958లో, నేను జూస్‌టీన్‌ను వివాహం చేసుకున్నాను, ఆమె నా ప్రయాణ సహవాసి అయ్యింది. ఇప్పుడు, నా వృద్ధాప్య సంవత్సరాలలో, సబ్‌స్టిట్యూట్ ప్రయాణ పైవిచారణకర్తగా కొంత పరిమితంగానైనా నేను ఇప్పటికీ సేవ చేయగలుగుతున్నందుకు ఆనందిస్తున్నాను.
నేను నా పరిచర్యను గురించి సింహావలోకనం చేసుకుంటే, “సత్యానికన్నా మిన్నయైనదేదీ లేదు” అని నేను వాస్తవంగా చెప్పగలను. అయితే ఎల్లవేళలా పరిస్థితి అంత సులభంగా లేదు. నా పొరపాట్లనుండి తప్పిదాలనుండి నేర్చుకోవలసిన అవసరతను నేను గుర్తించాను. కాబట్టి నేను యౌవనస్థులతో మాట్లాడేటప్పుడు, “మీరు కూడా పొరపాట్లు చేస్తారు బహుశ గంభీరమైన పాపం కూడా చేస్తుండవచ్చు, అయితే వాటి విషయమై అబద్ధాలు చెప్పకండి. మీ తలిదండ్రులతో లేక ఒక పెద్దతో ఆ విషయాలను చర్చించండి, తర్వాత అవసరమైన సర్దుబాట్లను చేసుకోండి.”
బెల్జియంలో నేను చేసిన దాదాపు 50 సంవత్సరాల పూర్తికాల పరిచర్యలో, నేను ఒకప్పుడు చిన్న పిల్లలుగా చూసిన వారు ఇప్పుడు పెద్దలుగానూ ప్రాంతీయ పైవిచారణ కర్తలుగానూ సేవ చేయడాన్ని చూసే ఆధిక్యత నాకు లభించింది. ఆ దేశంలో ఉండిన 1,700 లేక అంతకంటే ఎక్కువ మంది రాజ్య ప్రచారకులు 27,000కు పెరగడాన్ని కూడా నేను చూశాను.
“యెహోవా సేవ చేయడం కంటే మరింత దీవెనకరమైన మార్గం మరేదైనా ఉంటుందా?” అని నేను అడుగుతాను. అలాంటిది ముందెన్నడూ లేదు, ఇప్పుడూ లేదు, మరెన్నడూ ఉండదు. మేము నిత్యమూ యెహోవా సేవ చేస్తూ ఉండేందుకు ఆయన నాకూ నా భార్యకూ నడిపింపునిచ్చి మమ్మల్ని దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను.
[26వ పేజీలోని చిత్రం]
1958లో మా వివాహం జరిగిన కొంతకాలానికి నా భార్యతో