యెహోవా ఆశీర్వాదాలను మీరు నిజంగా విలువైనవిగా ఎంచుతున్నారా?
కెనీచీ అనే ఓ మధ్యవయస్సుగల వ్యక్తి జలుబుకు మందు తీసుకునేందుకు మందుల దుకాణానికి వెళ్లాడు. అతను ఆ మందు వేసుకున్నప్పుడు ఎలర్జిక్ రియాక్షనై అతని శరీరమంతటా దురద బొబ్బలూ పొక్కులూ వచ్చాయి. ఆ మందుల దుకాణదారు తన అవసరతల ఎడల నిజంగా శ్రద్ధ వహించాడా అని కెనీచీ సందేహించడంలో ఆశ్చర్యం లేదు.
ఆ మందుల దుకాణదారును కెనీచీ దృష్టించిన విధంగానే కొందరు యెహోవా దేవుని గురించి భావించవచ్చు. సర్వశక్తిగల దేవుడైన యెహోవా వ్యక్తిగతంగా తమ ఎడల నిజంగా ఆసక్తి కలిగి ఉన్నాడనే విషయాన్ని వాళ్లు సందేహిస్తారు. దేవుడు మంచి వాడని వారు గుర్తించినప్పటికీ, ఆయన మన ఎడల వ్యక్తిగతంగా శ్రద్ధ వహిస్తాడనే విషయంలో వారు నిశ్చయత కల్గిలేరు. వారి పరిస్థితులు బాగోలేనప్పుడు లేదా వారు బైబిలు సూత్రాలను హత్తుకుని ఉండటం మూలంగా కష్టతరమైన సమస్యలను ఎదుర్కొన్నప్పుడు ప్రాముఖ్యంగా ఇది వాస్తవమై ఉంటుంది. వివేచన లోపించడం మూలంగా, వారు తమ సమస్యలను అవేవో దేవుని లోపాలు అన్నట్లు భావిస్తూ అనుకోని రీతిలో కెనీచీకి వచ్చిన దురద బొబ్బలూ పొక్కుల వలె దృష్టిస్తారు.—సామెతలు 19:2, 3.
యెహోవాను అసంపూర్ణ మానవులకు పోల్చరాదు. మానవుల జ్ఞానం, సామర్థ్యం ఎంతో పరిమితమైనవి. కెనీచీ విషయంలో మందుల దుకాణదారు చేసిన విధంగా, మానవులు ఇతరుల వాస్తవికమైన అవసరతలను వివేచించడంలో విఫలమౌతారు. దానికి భిన్నంగా, యెహోవా దృష్టిని ఏదీ తప్పించుకోలేదు. యెహోవా మనకు తరచూ సహాయం చేస్తాడు, అయితే మనం ఆ వాస్తవాన్ని గుర్తించం, గుణగ్రహించం. ఎందుకంటే మనకున్న అనేక ఆశీర్వాదాలను అలక్ష్యం చేస్తూ, మనకు లేని వాటిని గూర్చే ఆలోచించే అలవాటు మనకుంటుంది. మనం ఎదుర్కొనే ఏ సమస్యల గురించైనా యెహోవాను వెంటనే నిందించే బదులు యెహోవా నుండి మనకు లభించిన, మనం అనుభవిస్తున్న ఆశీర్వాదాలను గురించి వివేచించేందుకు మనం ప్రయత్నించాలి.
“ఆశీర్వాదం” అనేది “సంతోషాన్ని లేక సంక్షేమాన్ని అధికం చేసే విషయం”గా నిర్వచించబడగలదు. యెహోవా నుండి వచ్చే ఆశీర్వాదాల విషయంలో ఇది ప్రత్యేకంగా నిజమనే వాస్తవాన్ని మీరు గుణగ్రహిస్తారా?
సాటిలేని సంరక్షకుడు
తన భర్త మంచి సంరక్షకుడని ఒక భార్య అన్నప్పుడు, కుటుంబ సంతోషం మరియు సంక్షేమం నిమిత్తం తగినంత ఆహారాన్నీ, గృహాన్నీ, మరియు వస్త్రాలనూ అందజేస్తూ కుటుంబం యొక్క అవసరతల ఎడల ఆయన తగిన రీతిలో శ్రద్ధ వహిస్తున్నాడన్నదే ఆమె అభిప్రాయం. మన సంరక్షకునిగా యెహోవా ఎంత శ్రేష్ఠంగా ఉన్నాడు? మానవుని గృహమైన మన భూగ్రహంవైపు ఒకసారి పరిశీలించి చూడండి. అది సూర్యుని నుండి 15,00,00,000 కిలోమీటర్ల దూరంలో ఉంది, అంటే భూమిపై ప్రాణికోటి మనుగడను సాధ్యపర్చేందుకు తగిన వాతావరణం కొరకై సరైన దూరాన ఉందన్నమాట. మన భూగోళం 23.5-డిగ్రీలు ఒరగటం అనేది పరిపూర్ణంగా రూపకల్పన చేయబడింది, దాని ఫలితంగా పుష్కలమైన పంటలను పండించేందుకు విభిన్న రుతువులు మారుతున్నాయి. తద్వారా, భూమి 500 కోట్ల కంటే ఎక్కువమంది ప్రజలను పోషిస్తోంది. యెహోవా వాస్తవంగానే అద్భుతమైన సంరక్షకుడు!
అంతే కాకుండా, వ్యక్తిగతంగా యెహోవా మన ఎడలా మన సంక్షేమం ఎడలా శ్రద్ధ కలిగి ఉన్నాడని బైబిలు మనకు నిశ్చయతనిస్తోంది. కొంచెం ఆలోచించండి, యెహోవాకు వందల కోట్ల నక్షత్రాలన్నిటి పేర్లూ తెలుసు, మరి ఆయన సెలవు లేకుండా ఒక్క పిచ్చుక కూడా నేలనుపడదు. (యెషయా 40:26; మత్తయి 10:29-31) ఆయనను ప్రేమించే మానవుల ఎడల మరియు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తాన్ని పెట్టి ఆయన కొన్న మానవుల ఎడల ఆయనకు ఇంకా ఎంత ఎక్కువ ప్రేమ ఉండవచ్చో కదా! (అపొస్తలుల కార్యములు 20:28) “యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువకాదు” అని ప్రకటించిన జ్ఞానియైన వ్యక్తి వాస్తవమే వ్రాశాడు.—సామెతలు 10:22.
మనలను ఐశ్వర్యవంతులను చేసే ఆశీర్వాదాలు
ఎంతో గొప్ప విలువగలది మనవద్ద ఉంది, అందునుబట్టి మనం ఎంతో కృతజ్ఞులమై ఉండవలసి ఉన్నాము. అది ఏమిటి? “వేలకొలది వెండి బంగారు నాణెములకంటె నీ విచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు” అని చెప్పినప్పుడు బైబిలు దాన్ని గుర్తిస్తుంది. (కీర్తన 119:72; సామెతలు 8:10) శ్రేష్ఠమైన బంగారం ఎంతో విలువైనదైనప్పటికీ యెహోవా ధర్మశాస్త్రం దానికంటే ఎంతో ఎక్కువ కోరదగినది. సత్యాన్ని యథార్థంగా వెదికే వారికి యెహోవా అనుగ్రహించే వివేచన మరియు అంతర్దృష్టితో పాటు ఆయన ధర్మశాస్త్రాన్ని గురించిన కచ్చితమైన జ్ఞానం ఎంతో విలువైనది. అవి మనల్ని మనం కాపాడుకునేందుకు, కష్టంతో కూడిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు, సమస్యలతో విజయవంతంగా వ్యవహరించేందుకూ అలా మనం సంతృప్తిగా మరియు సంతోషంగా ఉండేందుకు మనకు సహాయం చేస్తాయి.
అది చాలా చిన్న పిల్లల విషయంలో కూడా వాస్తవమే. ఒక చిన్న పాప యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించడం ద్వారా తన సమస్యలను ఎలా పరిష్కరించుకోగలిగిందో గమనించండి. అకెమీ అనే పాప టోక్యోకు సమీపంలో నివసిస్తుంది. ఆమె అమ్మా నాన్నలు ఆమెకు శిక్షణనిచ్చే విషయంలో బైబిలు సూత్రాలను అన్వయించారు, మరియు యెహోవా ఎడలా పొరుగువారి ఎడలా ప్రేమను వృద్ధి చేసుకునేందుకు వారు తమ కుమార్తెకు మాట ద్వారా, మాదిరి ద్వారా సహాయం చేశారు. పాఠశాలవద్ద ఆమె ఎదుర్కొనే సమస్యలను ముందే గుర్తించి వారు తమకు వీలైనంత శ్రేష్ఠంగా ఆమెను సిద్ధం చేసేందుకు ప్రయత్నించారు. అయితే, అకెమీ ప్రాథమిక పాఠశాలలో చేరినప్పుడు, ఆమె తన భోజనానికి ముందు ప్రార్థన చేసుకొనేదీ కొన్ని లేఖన విరుద్ధమైన కార్యకలాపాలను ఆమె చేసేదికాదు గనుక ఆమె “భిన్నంగా” ఉన్నట్లు తోటి తరగతివారు కొంతమంది దృష్టించేవారు. ఆమె త్వరలోనే, పీడించే గుంపు చేత దాడికి గురైంది. పాఠశాల తర్వాత ఆ గుంపు ఆమెను చుట్టుముట్టి ఆమె చెంపలు వాయించి ఆమె చేతులను వెనక్కి విరిచి ఆమెను ఆటపట్టించేది.
ఈ చిన్ని అకెమీ ప్రతీకారం తీర్చుకోలేదు, ఆమె తనను పీడిస్తున్న ప్రజలను తప్పించుకు తిరగాలని కూడా ప్రయత్నించలేదు. బదులుగా, తాను నేర్చుకున్న వాటిని అన్వయించుకునేందుకు ప్రయత్నించింది. ఆమె చక్కని ప్రవర్తన మరియు ధైర్యం ఫలితంగా ఆమె తన తోటి విద్యార్థుల్లో అనేకమంది గౌరవాన్ని చూరగొన్నది. వారు ఆ సంగతిని వాళ్ల టీచర్ దృష్టికి తీసుకువచ్చారు, ఆనాటి నుండీ కూడా అకెమీ తన పాఠశాలలో ఎన్నడూ పీడించబడలేదు.
క్లిష్ట పరిస్థితితో విజయవంతంగా వ్యవహరించేందుకు అకెమీకి ఏది సహాయం చేసింది? ఆమె తలిదండ్రులు ఆమెలో పొందుపరచిన యెహోవా నుండి వచ్చిన కచ్చితమైన జ్ఞానం, అంతర్దృష్టి మరియు బుద్ధి ఆమెకు సహాయం చేశాయి. యేసు చూపిన సహనం గురించి ఆమెకు బాగా తెలుసు, ఆయన మాదిరిని అనుకరించేందుకు ఆమెనది పురికొల్పింది. కొంతమంది ప్రజలు తెలియక తప్పులు చేస్తారనే విషయాన్ని వివేచించేందుకు బైబిలు ఆమెకు సహాయం చేసింది, మరియు తనను పీడించే వారు చేసే చెడును ద్వేషించినప్పటికీ వారిని ద్వేషించకుండా ఉండేందుకు అది ఆమెను ప్రోత్సహించింది.—లూకా 23:34; రోమీయులు 12:9, 17-21.
తమ పిల్లలు దాడికి గురవ్వడం, ఏడిపించబడటం చూడాలని ఏ తలిదండ్రులూ కోరుకోరనే విషయం వాస్తవమే. అయినప్పటికీ, జరిగిన సంగతిని గురించిన పూర్తి వివరాలను అకెమీ తలిదండ్రులు తెలుసుకున్నప్పుడు వాళ్లు ఎంత గర్వంగా భావించి ఉంటారో మీరు ఊహించగలరా. అలాంటి పిల్లలు నిజంగా యెహోవా ఇచ్చిన ఆశీర్వాదాలు.—కీర్తన 127:3; 1 పేతురు 1:6, 7.
యెహోవా కొరకు సహనంతో వేచివుండటం
అయితే, యెహోవా ఆశీర్వాదాలను అందుకునే ముందు మీరు కొన్నిసార్లు ఆయన సమయం కొరకు వేచి ఉండాలి. యెహోవాకు మీ పరిస్థితి గురించి తెలుసు మరియు మీకు అది ఎంతో మేలు చేసే సమయంలోనే ఆయన ప్రతి అవసరాన్నీ తీరుస్తాడు. (కీర్తన 145:16; ప్రసంగి 3:1; యాకోబు 1:17) మీకు పళ్లంటే ఇష్టం ఉండవచ్చు, అయితే ఇంకా పక్వానికిరాని కాయలను మీ అతిథేయి మీకు పెడితే మీరెలా భావిస్తారు? ఒక ఆపిల్ పండైనా, నారింజ పండైనా లేక మరే ఇతర పండైనా కూడా అది మాగి, రసంతో తీయగా ఉన్నప్పుడే మీరు దాన్ని తినేందుకు ఇష్టపడతారు. అదే విధంగా, యెహోవా మీ అవసరతలను సరైన సమయంలో తీరుస్తాడు—మరీ త్వరగా కాదూ లేక మరీ ఆలస్యంగానూ కాదు.
యోసేపు అనుభవాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎలాంటి తప్పిదం చేయనప్పటికీ ఆయన ఐగుప్తీయుల చెరసాలలో బందీ అయ్యాడు. ఫరో యొక్క పానదాయకుడైన తోటి ఖైదీ, తాను విడిపించబడతానని ఎదురుచూశాడు మరియు యోసేపు సంగతిని ఫరో దృష్టికి తీసుకువస్తానని వాగ్దానం చేశాడు. అయితే అతను విడిపించబడిన తర్వాత యోసేపు గురించి పూర్తిగా మర్చిపోయాడు. యోసేపు విడువబడినట్లు అనిపించింది. అయితే, పూర్తిగా రెండేళ్లు గడిచిన తర్వాత, ఆయన చివరకు చెరసాల నుండి విడిపించబడ్డాడు మరి తుదకు ఐగుప్తులో ఫరో తరువాతి పరిపాలకుడయ్యాడు. అసహనంగా భావించే బదులు, యోసేపు యెహోవా కొరకు వేచి ఉన్నాడు. దాని విషయమై ఆయన దీవించబడ్డాడు, ఆయన దీవించబడిన విధానం ఇశ్రాయేలీయులకు అలాగే ఐగుప్తీయులకు ప్రాణరక్షణకరమైనదైంది.—ఆదికాండము 39:1–41:57.
మశషీ ఉత్తర జపాన్లోని ఒక సంఘంలో పెద్దగా సేవ చేస్తుండేవాడు. ఆయన యోసేపులా చెరసాలలో ఉండలేదు, కానీ ఆయన యెహోవా కొరకు ఎదురుచూడవలసి వచ్చింది. ఎందుకు? యోగ్యతగల క్రైస్తవ పరిచారకులకు తర్ఫీదిచ్చే పాఠశాలయైన మినిస్టీరియల్ ట్రైనింగ్ స్కూల్ జపాన్లో ప్రారంభమైనప్పటి నుండీ కూడా, ఆయన దానికి హాజరవ్వాలనే మనఃపూర్వక లక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఆధిక్యతను గురించి ఆయన ఎడతెగక ప్రార్థించాడు. మరి మశషీకి అంత తీవ్రమైన కోరిక ఉన్నప్పటికీ ఆయన పిలువబడలేదు గానీ ఆయన తోటి పయినీరు సహవాసి ఆహ్వానింపబడ్డాడు. మశషీ ఎంతో నిరాశకు గురయ్యాడు.
ఏదేమైనప్పటికీ, ఆయన తన భావావేశాలతో వ్యవహరించేందుకు చర్యలు తీసుకున్నాడు. ఆయన దీనత్వం కలిగి ఉండటం, భావావేశాలను అదుపు చేసుకోవడం వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తూ బైబిలును మరియు వాచ్ టవర్ సొసైటీ ప్రచురించిన ప్రచురణలను పఠించాడు. ఆయన తన ఆలోచనావిధానాన్ని సరి చేసుకున్నాడు, అలా తన నియామకంలో మరింత ఎక్కువ సంతృప్తిని అనుభవించాడు. తర్వాత, ఆయన ఏమాత్రం ఊహించని సమయంలో, పాఠశాలకు ఆహ్వానాన్ని అందుకున్నాడు.
సహనం మరియు దీనత్వం వంటి లక్షణాలను వృద్ధి చేసుకున్నవాడై ఆయన పాఠశాల నుండి మరింత ఎక్కువ ప్రయోజనాన్ని పొందాడు. తర్వాత, ప్రయాణ కాపరి నియామకంలో తన సహోదరులకు సేవ చేసే ఆధిక్యత మశషీకి ఇవ్వబడింది. అవును, మశషీకి ఏం కావాలో యెహోవాకు తెలుసు అందుకే అది అత్యంత ఎక్కువ మంచిని సాధించగల సమయంలో ఆయన దాన్ని అందించాడు.
ఆయన ఆశీర్వాదాలను వెదకండి
కాబట్టి, యెహోవా ఆ మందుల దుకాణదారులా లేడు. మనం యెహోవా యొక్క శ్రద్ధనూ ఆసక్తినీ గుర్తించడంలో విఫలమైనప్పటికీ, ఆయన దయతో కూడిన చర్యలు విభిన్న రూపాల్లో మనకు అందుతాయి—మనకు మరింత మంచిని చేయగల సమయాల్లో మరియు మార్గాల్లో అవి వస్తాయి. కాబట్టి ఆయన ఆశీర్వాదాలను వెదకడంలో కొనసాగండి. కృతజ్ఞులై ఉండేందుకు ఇప్పటికే మీకు ఎన్నో కారణాలు ఉన్నాయని జ్ఞాపకముంచుకోండి. భూమిపై జీవితాన్ని కొనసాగించేందుకు అవసరమైన ప్రాథమిక విషయాలు మీకు ఇవ్వబడ్డాయి. యెహోవాను గురించిన, ఆయన పరిపూర్ణ మార్గాలను గురించిన జ్ఞానం మీకు ఇవ్వబడింది. మీకు అంతర్దృష్టి ఇవ్వబడింది. మరి మీరు వివేచనను సంపాదించారు. ఇవన్నీ కూడా మీ సంక్షేమానికీ సంతోషానికీ దోహదపడతాయి.
యెహోవా యొక్క ఆశీర్వాదాలను మరింత ఎక్కువగా అనుభవించేందుకు, బైబిలును క్రమంగా పఠించడంలో కొనసాగండి. ఆయన ప్రేరేపిత వాక్యంలో ఉన్న రత్నాలవంటి బోధలను అర్థం చేసుకుని వాటిని అన్వయించుకునేందుకు సహాయం చేయమని యెహోవాను అర్థించండి. మీకు ఏమీ కొదవ కాకుండా ఉండే విధంగా అవి మిమ్మల్ని వాస్తవంగా ఐశ్వర్యవంతులను చేస్తాయి. అవును, అవి ఇప్పుడు మీ సంతోషం మరియు సంతృప్తికి మరియు రాబోయే నూతన ప్రపంచంలో సంపూర్ణ జీవితానికీ దోహదపడతాయి.—యోహాను 10:10; 1 తిమోతి 4:8, 9.
[23వ పేజీలోని చిత్రం]
యెహోవా ఆశీర్వాదం బంగారం కంటే ఎంతో ప్రశస్తమైనది