“సమస్త దేశాల ప్రజలను శిష్యులనుగా చేయండి”
“కాబట్టి మీరు వెళ్లి, సమస్త దేశాల ప్రజలను శిష్యులనుగా చేయండి; తండ్రి యొక్క, కుమారుని యొక్క మరియు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మ మివ్వండి.” మత్తయి 28:19 నందున్న యేసు ఆజ్ఞను నూతన లోక అనువాదము అలా అనువదించింది. అయితే ఈ అనువాదాన్ని విమర్శించడం జరిగింది. ఉదాహరణకు, ఒక మతపర కరపత్రం ఇలా పేర్కొంటుంది: “గ్రీకు పాఠం అనుమతించే ఏకైక అనువాదం ఇదే: ‘సమస్త దేశాలను శిష్యులనుగా చేయండి!’” ఇది సత్యమా?
“సమస్త దేశాలను శిష్యులనుగా చేయండి” అనే ఈ అనువాదం అనేక బైబిలు అనువాదాల్లో కనిపిస్తుంది మరియు అది గ్రీకు భాష యొక్క అక్షరార్థ అనువాదం. కాబట్టి, “సమస్త దేశాల ప్రజలను శిష్యులనుగా చేయండి . . . వారికి బాప్తిస్మ మివ్వండి” అనే అనువాదానికి ఉన్న ఆధారమేమిటి? పూర్వాపర సందర్భమే. ‘వారికి బాప్తిస్మమివ్వండి’ అనే పదాలు స్పష్టంగా దేశాలకు కాక వ్యక్తులకు వర్తిస్తాయి. జర్మనీకి చెందిన పండితుడైన హాన్స్ బ్రూన్స్ ఇలా పేర్కొంటున్నాడు: “‘వారికి’ అనే [పదం] దేశాలను (గ్రీకు స్పష్టమైన తేడాను చూపిస్తుంది) కాక ఆ దేశాలలోని ప్రజలను సూచిస్తుంది.”
అంతే కాకుండా, యేసు ఇచ్చిన ఆజ్ఞ నెరవేర్చబడిన విధానాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆసియా మైనరులోని ఒక నగరమైన దెర్బేలో పౌలు, బర్నబాలు చేసిన పరిచర్యను గురించి మనమిలా చదువుతాం: “వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకొనియకును అంతియొకయకును తిరిగివచ్చి[రి.]” (అపొస్తలుల కార్యములు 14:21) పౌలు మరియు బర్నబాలు దెర్బే నగరాన్ని కాదు గానీ దెర్బేలోని కొంతమంది ప్రజలను శిష్యులనుగా చేశారనే విషయాన్ని గమనించండి.
అదే విధంగా, అంత్య సమయానికి సంబంధించి, దేశాలు మొత్తం దేవుణ్ణి సేవిస్తాయని కాదు గానీ “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలోనుండియు” వచ్చే “గొప్పసమూహము” సేవిస్తుందని ప్రకటన గ్రంథం ప్రవచించింది. (ప్రకటన 7:9) అలా, నూతన లోక అనువాదము “దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము” యొక్క ఆధారపడదగిన అనువాదమని సమర్థించబడింది.—2 తిమోతి 3:16.