వారు యెహోవా చిత్తాన్ని చేశారు
ఏలీయా సత్య దేవుణ్ణి ఉన్నతపర్చుతాడు
ఇశ్రాయేలీయులందరిలో ఆయన అత్యంత అనుమానితుడైన నేరస్థుడు. రాజు గనుక ఆయన్ని కనుగొనగలిగితే తప్పకుండా ఆయనకు మరణశిక్ష విధించబడుతుంది. ఇలా గాలించబడుతున్న వ్యక్తి ఎవరు? యెహోవా ప్రవక్తయైన ఏలీయా.
రాజైన అహాబు మరియు అన్యురాలైన అతని భార్య యెజెబెలు ఇశ్రాయేలు దేశంలో బయలు ఆరాధన వృద్ధి అయ్యేలా చేశారు. దాని ఫలితంగా, యెహోవా ఆ దేశంలో క్షామం కలుగజేశాడు, ఇప్పటికి ఇది నాలుగవ సంవత్సరం. కోపోద్రిక్తురాలైన యెజెబెలు యెహోవా ప్రవక్తలను చంపించనారంభించింది, అయితే అహాబుకు ప్రత్యేకంగా ఏలీయా కావాలి. మూడు కంటే ఎక్కువ సంవత్సరాల క్రితం, “నా మాటప్రకారము గాక, యీ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని” అహాబుతో చెప్పినది ఈ ఏలీయానే. (1 రాజులు 17:1) దాని ఫలితంగా వచ్చిన క్షామం ఇంకా కొనసాగుతోంది.
ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితిలో, ఏలీయాకు యెహోవా ఇలా చెబుతాడు: “నేను భూమి మీద వర్షము కురిపింపబోవుచున్నాను; నీవు వెళ్లి అహాబును దర్శించు[ము].” తనకు గొప్ప ప్రమాదం సంభవించవచ్చని తెలిసినప్పటికీ, ఏలీయా యెహోవా ఆజ్ఞను శిరసావహించాడు.—1 రాజులు 18:1, 2.
ఇద్దరు విరోధులు కలుసుకుంటారు
ఏలీయాను చూసి అహాబు, “ఇశ్రాయేలువారిని శ్రమపెట్టువాడవు నీవే కావా?” అని అన్నాడు. “నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవత ననుసరించు నీవును, నీ తండ్రి యింటివారును ఇశ్రాయేలువారిని శ్రమపెట్టువారై యున్నారు” అని ఏలీయా ధైర్యంగా సమాధానమిచ్చాడు. అప్పుడు, ‘బయలుదేవత ప్రవక్తలు నాలుగువందల ఏబదిమంది మరియు అషేరాదేవి ప్రవక్తలైన నాలుగువందల మందితో’ సహా ఇశ్రాయేలు వారందరూ కర్మెలు పర్వతం వద్ద సమకూడాలని ఏలీయా చెప్పాడు. తర్వాత ఏలీయా ప్రజలనుద్దేశించి ఇలా అన్నాడు: “యెన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడు [“గంతులు వేయు,” NW] చుందురు?a యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాని ననుసరించు[డి.]”—1 రాజులు 18:17-21.
ప్రజలు నిశ్శబ్దంగా ఉండిపోయారు. యెహోవాకు అనితర భక్తిని చెల్లించే విషయంలో తాము విఫలమయ్యామని వారు బహుశ తమ దోషాన్ని గుర్తించి ఉండవచ్చు. (నిర్గమకాండము 20:4, 5) లేదా యెహోవాకు మరియు బయలుకు కూడా తమ యథార్థతను చూపించడం ఎంతటి పాపకరమైనదనే విషయాన్ని వారు చూడలేనంతగా వారి మనస్సాక్షులు వాతవేయబడి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ, రెండు ఎడ్లను తీసుకురమ్మని ఏలీయా ప్రజలకు చెబుతాడు, ఒకటి బయలు ప్రవక్తల కొరకు మరొకటి తన కొరకు. రెండు ఎడ్లూ బలి నిమిత్తం సిద్ధం చేయబడాలి, అయితే వాటికి నిప్పంటించ కూడదు. “మీరు మీ దేవత పేరునుబట్టి ప్రార్థన చేయుడి; నేనైతే యెహోవా నామమునుబట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుటచేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము” అని ఏలీయా జనులతో చెబుతాడు.—1 రాజులు 18:23, 24.
యెహోవా ఉన్నతపర్చబడ్డాడు
బయలు ప్రవక్తలు “తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులువేయ మొదలుపెట్టిరి.” ఉదయమంతా వారు ఇలా కేకలు వేశారు: ‘బయలా, మా ప్రార్థన వినుము.’ అయితే బయలు జవాబివ్వలేదు. (1 రాజులు 18:26) అప్పుడు ఏలీయా వారిని ఎగతాళి చేయడం ప్రారంభించాడు: “వాడు దేవుడైయున్నాడు. పెద్దకేకలు వేయుడి.” (1 రాజులు 18:27) బయలు ప్రవక్తలు కత్తులతో శస్త్రాలతో తమ దేహాలను కోసుకోవడం కూడా ప్రారంభిస్తారు—తమ దేవుళ్ల అనుగ్రహాన్ని పొందేందుకు అన్యులు తరచూ చేపట్టే ఆచారమది.b—1 రాజులు 18:28.
ఇప్పుడు మధ్యాహ్నం దాటిపోయింది, మరి బయలు ప్రవక్తలు “ప్రకటనము చేయుచు వచ్చిరి”—ఈ సందర్భంలో ఆ వాక్యం, వారు వెర్రెత్తినట్లు, స్వయం నియంత్రణ లేకుండా ప్రవర్తించడంలో కొనసాగారు అనే అర్థాన్నిస్తుంది. మధ్యాహ్నం చాలా గడిచిన తర్వాత, ఏలీయా తుదకు ప్రజలందరికీ ఇలా చెబుతాడు: ‘నా దగ్గరకు రండి.’ ఏలీయా యెహోవా బలిపీఠాన్ని తిరిగి నిర్మించి, దానిచుట్టు కందకం త్రవ్వి, ఎద్దును తునకలుగా కోసి దాన్ని అర్పించడానికి బలిపీఠంపైనున్న కట్టెలమీద పెడుతుంటే అందరూ శ్రద్ధగా చూశారు. దాని తర్వాత, ఎద్దు, బలిపీఠం, కట్టెలు నీళ్లతో (మధ్యధరా సముద్రంనుండి తీసుకున్న సముద్రజలం అనడంలో సందేహమే లేదు) పూర్తిగా తడిపివేయబడతాయి మరియు కందకం నింపబడుతుంది. తర్వాత, ఏలీయా యెహోవాకు ఇలా ప్రార్థించాడు: “ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై యున్నావనియు, నేను నీ సేవకుడనై యున్నాననియు, ఈ కార్యములన్నియు నీ సెలవుచేత చేసితిననియు ఈ దినమున కనుపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము; యెహోవావైన నీవే దేవుడవైయున్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగచేయుదువనియు ఈ జనులకు తెలియునట్లుగా నా ప్రార్థన అంగీకరించుము.”—1 రాజులు 18:29-37.
హఠాత్తుగా, పరలోకం నుండి అగ్ని దిగివచ్చి, “దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను.” అదంతా గమనిస్తున్న జనులు వెంటనే సాగిలపడి “యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు” అని కేకలువేస్తారు. ఏలీయా ఆజ్ఞాపించగా బయలు ప్రవక్తలు పట్టబడి కీషోను వాగు దగ్గరకు కొనిపోబడి అక్కడ వధించబడతారు.—1 రాజులు 18:38-40.
మన కొరకు పాఠం
మానవాతీతం అన్పించే ధైర్యాన్ని ఏలీయా ప్రదర్శించాడు. అయినప్పటికీ, “ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే” అని బైబిలు రచయితయైన యాకోబు మనకు నిశ్చయతనిచ్చాడు. (యాకోబు 5:17) ఆయనకు కూడా కొంత వరకూ భయం, ఆదుర్దా కలిగాయి. ఉదాహరణకు, బయలు ప్రవక్తలను తాను నష్టపోయినందుకు ప్రతీకారం తీర్చుకుంటానని యెజెబెలు తర్వాత శపథం చేసినప్పుడు, ఏలీయా పారిపోయి, యెహోవాను ప్రార్థనలో ఇలా వేడుకున్నాడు: “యెహోవా, . . . ఇంతమట్టుకు చాలును, నా ప్రాణము తీసికొనుము.”—1 రాజులు 19:4.
యెహోవా ఏలీయాను చంపి ఆయన ప్రాణం తీసుకోలేదు. బదులుగా, ఆయన దయాపూర్వకంగా మద్దతును అనుగ్రహించాడు. (1 రాజులు 19:5-8) దేవుని సేవకులు నేడు బహుశ వ్యతిరేకత మూలంగా తీవ్రమైన మనస్తాపాన్ని ఎదుర్కొన్నప్పుడు యెహోవా అదే చేస్తాడని వాళ్లు నిశ్చయతను కలిగి ఉండగలరు. వాస్తవానికి, వారు యెహోవా సహాయం నిమిత్తం ప్రార్థిస్తే, వారు ఒకవేళ “ఎటుబోయినను శ్రమపడుచున్నను” వారు ‘ఇరికింపబడకుండా’ ఉండే విధంగా ఆయన వాళ్లకు “బలాధిక్యము”ను అందజేయగలడు. అలా ఏలీయాకు లభించిన విధంగా సహించేందుకు వారికి సహాయం లభిస్తుంది.—2 కొరింథీయులు 4:7, 8.
[అధస్సూచీలు]
a ఏలీయా ప్రస్తావించినది బయలు ఆరాధికుల ఆచారబద్ధమైన నాట్యాన్ని సూచిస్తుందని కొందరు పండితులు పేర్కొంటున్నారు. బయలు ప్రవక్తల నాట్యాన్ని వర్ణించేందుకై 1 రాజులు 18:26 నందు ‘గంతులువేయు’ అనే అక్షరార్థ భావాన్ని ఇచ్చే అదే హెబ్రీ పదం కనిపిస్తుంది.
b స్వయంగా తమ శరీరానికి గాయాలను చేసుకోవడం అనేది మానవబలి ఆచారానికి సంబంధించినదని కొందరు సూచిస్తున్నారు. ఈ రెండు క్రియలూ కూడా శరీరానికి నొప్పి కలిగించడం లేక రక్తాన్ని చిందించడం దేవుని అనుగ్రహాన్ని తెచ్చిపెడతాయనే విషయాన్ని సూచించాయి.