కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 12/15 పేజీలు 22-27
  • గుప్త ధనం వెలుగులోకి వచ్చింది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • గుప్త ధనం వెలుగులోకి వచ్చింది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • రష్యన్‌ బైబిలు అవసరత
  • అనువాద ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి
  • బైబిలు అనువాదాలకు మరణ ఘాతమా?
  • పావ్‌స్కీ చేసిన అనువాద ప్రయత్నం
  • దేవుని నామాన్ని ఘనపర్చడం
  • మఠాధిపతి మాకార్‌యాస్‌
  • మాకార్‌యాస్‌ ధైర్యంగా నిలబడటం
  • చివరకు ప్రచురించబడింది!
  • మాకార్‌యాస్‌ బైబిలు నేడు
  • దేవుని వాక్యం నిరంతరం నిలుస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • దేవుని వాక్య ప్రేమికులకు ఒక మైలురాయి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • రష్యాను పునఃదర్శించుట
    తేజరిల్లు!—1995
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 12/15 పేజీలు 22-27

గుప్త ధనం వెలుగులోకి వచ్చింది

మాకార్‌యాస్‌ బైబిలు కథ

ఒక పరిశోధకుడు 1993లో రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ నందలి జాతీయ గ్రంథాలయంలో ఆర్థడాక్స్‌ రివ్యూ పత్రికల పాతబడిన రంగు వెలసిపోయిన కాగితాల దొంతరను చూశాడు. 1860 నుండి 1867 వరకు ప్రచురింపబడిన ఆ పత్రిక పుటల్లో, రష్యా ప్రజానీకం నుండి ఒక శతాబ్దం కంటే ఎక్కువకాలం వరకూ దాచి ఉంచబడిన ధనం నిక్షిప్తమై ఉంది. అది పూర్తి హెబ్రీ లేఖనాలు లేక “పాత నిబంధన” యొక్క రష్యన్‌ భాషా అనువాదం.

ఆ లేఖనాల అనువాదకులు మఠాధిపతి మాకార్‌యాస్‌ అని పిలువబడే మికాయీల్‌ యాకోవ్లెవ్‌యిచ్‌ గ్లుకారెఫ్‌ మరియు గ్యిరాస్యిమ్‌ ప్యిట్రోవ్యిచ్‌ పావ్‌స్కీ అనే వారే. వారిరువురూ రష్యన్‌ ఆర్థడాక్స్‌ చర్చిలోని ప్రముఖ సభ్యులే కాకుండా భాషా పండితులు కూడా. ఈ పురుషులు గత శతాబ్దపు తొలి భాగంలో తమ పని ప్రారంభించినప్పుడు, పూర్తి బైబిలు రష్యన్‌ భాషలోకి అప్పటికింకా అనువదించబడలేదు.

నిజమే, ఆధునిక దిన రష్యన్‌ భాషకు ముందు వాడుకలోవున్న స్లవోనిక్‌ భాషలో ఆ బైబిలు ఉంది. అయితే 19వ శతాబ్దపు మధ్య భాగానికల్లా, స్లవోనిక్‌ భాష మతసంబంధ కూటాల్లో తప్ప అసలు ఉపయోగంలో లేదు, మరి మత సంబంధ కూటాల్లో కూడా కేవలం మత గురువులు మాత్రమే దాన్ని ఉపయోగించేవారు. లాటిన్‌ మృత భాషగా మారిన చాలా కాలం తర్వాత కూడా రోమన్‌ కాథోలిక్‌ చర్చి బైబిలును లాటిన్‌ భాషలోనే ఉంచేందుకు ప్రయత్నించిన పశ్చిమ ప్రాంతంలో కూడా అదే విధమైన పరిస్థితి ఉనికిలో ఉండేది.

మాకార్‌యాస్‌ మరియు పావ్‌స్కీలు బైబిలును సామాన్య ప్రజల అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నించారు. కాబట్టి ఎంతోకాలంగా మరుగున పడిపోయిన వారి పనిని కనుగొనడం, రష్యానందలి భాషాపరమైన మరియు మతపరమైన సంపద యొక్క ఒక ప్రాముఖ్యమైన భాగాన్ని సరి చేయడాన్ని వీలుపర్చింది.

అయితే, అసలు మాకార్‌యాస్‌ మరియు పావ్‌స్కీలు ఎవరు? బైబిలును సామాన్య ప్రజల భాషలోకి అనువదించాలనే వారి ప్రయత్నాలు ఎందుకంత వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి? వారి వృత్తాంతం బైబిలును ప్రేమించేవారందరికీ ఎంతో ఆసక్తికరంగా మరియు విశ్వాసాన్ని దృఢపర్చేదిగా ఉంటుంది.

రష్యన్‌ బైబిలు అవసరత

సామాన్య ప్రజల భాషలో బైబిలు లభ్యం కావలసిన అవసరతను మొదట గమనించిన వారు మాకార్‌యాస్‌ మరియు పావ్‌స్కీలు మాత్రమే కాదు. ఓ వంద సంవత్సరాల పూర్వమే, రష్యా దేశ చక్రవర్తియైన పీటర్‌ I లేక పీటర్‌ ది గ్రేట్‌ కూడా ఆ అవసరతను గమనించాడు. గమనార్హంగా, ఆయన పరిశుద్ధ లేఖనాలను గౌరవించాడు మరియు “బైబిలు ఇతర ఏ పుస్తకాలకన్నా కూడా ఉత్కృష్టమైనది, మానవునికి దేవుని ఎడల మరియు తన పొరుగువాని ఎడలగల కర్తవ్యానికి సంబంధించిన ప్రతి విషయాన్నీ అది కలిగి ఉంది” అని ఆయన చెప్పినట్లు ఉల్లేఖించబడుతోంది.

అలా, 1716లో పీటర్‌ తన స్వంత ఖర్చుతో ఆమ్‌స్టర్‌డమ్‌లో ఒక బైబిలును ప్రచురించ వలసిందిగా తన రాజసభకు ఆజ్ఞాపించాడు. ప్రతి పుటలో కూడా ఒక నిలువు విభాగంలో రష్యన్‌ భాషా పాఠం మరియు మరొక నిలువు విభాగంలో డచ్‌ భాషా పాఠం ఉండేలా ఏర్పాటు చేయడం జరిగింది. సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత, 1717లో క్రైస్తవ గ్రీకు లేఖనాలు లేదా “క్రొత్త నిబంధన” భాగం కూడా సిద్ధమైంది.

మరి 1721కల్లా హెబ్రీ లేఖనాల నాలుగు సంపుటుల డచ్‌ భాషా ప్రకరణం కూడా సిద్ధం చేయబడింది. ఒక నిలువు విభాగాన్ని తర్వాత రష్యన్‌ భాషతో నింపేందుకు గానూ ఖాళీగా ఉంచడం జరిగింది. పీటర్‌ ఆ బైబిళ్లను, ముద్రణ విషయంలో తుది నిర్ణయం తీసుకునేందుకూ మరియు పంపిణీ చేసే విషయాలను చూసుకునేందుకూ రష్యన్‌ ఆర్థడాక్స్‌ చర్చి యొక్క “పవిత్ర సినోడ్‌కు” అంటే చర్చి యొక్క అత్యంత ఉన్నతమైన మతాధికారానికి అందించాడు. అయితే సినోడ్‌ ఆ పనిని తుదముట్టించ లేదు.

నాలుగు కంటే తక్కువ సంవత్సరాల తర్వాత, పీటర్‌ మరణించాడు. మరి ఆయన బైబిళ్ల సంగతేమైంది? రష్యన్‌ భాష కొరకని ఉంచబడిన ఖాళీ నిలువు విభాగాలు ఎన్నడూ నింపబడలేదు. ఆ బైబిళ్లను ఒక నేలమాళిగలో గుట్టలుగా పేర్చారు, అవి అక్కడే చెదపట్టి పాడైపోయాయి మరి వాటిలో పాడుకాని ఒక్క ప్రతి కూడా మిగలలేదు! “మిగిలిన వాటినన్నిటినీ వర్తకులకు అమ్మాలని” సినోడ్‌ నిర్ణయం తీసుకుంది.

అనువాద ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి

బ్రిటీష్‌ మరియు విదేశీ బైబిలు సొసైటీ సభ్యుడైన జాన్‌ పాటర్‌సన్‌ 1812లో రష్యాకు వచ్చాడు. బైబిలు సొసైటీని ఏర్పాటు చేయడంలో సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ నందలి జ్ఞానసంపన్నుల ఆసక్తిని పాటర్‌సన్‌ పురికొల్పాడు. మరి డిశంబరు 6, 1812 నందు అంటే పోరాటానికి వస్తున్న నెపోలియన్‌ I దళాలను రష్యన్‌ సైన్యం ప్రతిఘటించిన సంవత్సరంలో రష్యన్‌ బైబిల్‌ సొసైటీ కొరకైన హక్కులపత్రాన్ని చక్రవర్తియైన అలెగ్జాండర్‌ I అంగీకరించాడు. “రష్యా ప్రజలు కూడా తమ మాతృభాష అయిన రష్యన్‌లో దేవుని వాక్యాన్ని చదువుకునే అవకాశాన్ని పొందాలని” పరిపాలక సినోడ్‌కు సలహా ఇవ్వమని ఆ సొసైటీ అధ్యక్షుడైన రాకుమారుడగు అలెగ్జాండర్‌ గాలిట్సిన్‌కు చక్రవర్తి 1815లో ఆజ్ఞాపించాడు.

హెబ్రీ లేఖనాలను నేరుగా ఆదిమ హెబ్రీనుండి రష్యా భాషలోకి అనువదించేందుకు అనుమతి ఇవ్వబడటం ఎంతో మెచ్చుకోదగిన విషయం. హెబ్రీ లేఖనాలను స్లవోనిక్‌ భాషలోకి అనువదించేందుకు ప్రాచీన గ్రీకు సెప్టాజింట్‌ ఆధారంగా ఉపయోగించబడింది. అనువాదానికి ముఖ్య సూత్రాలు ఖచ్చితత్వం, స్పష్టత మరియు స్వచ్ఛత అని బైబిలును రష్యా భాషలోకి అనువదించబోయే వారికి చెప్పడం జరిగింది. బైబిలును రష్యా భాషలో అందించాలనే ఈ తొలి ప్రయత్నాలు ఏమయ్యాయి?

బైబిలు అనువాదాలకు మరణ ఘాతమా?

చర్చి మరియు ప్రభుత్వంలోని పారంపర్య దృక్పథాలు త్వరలోనే విదేశీ మత, రాజకీయ ప్రభావాల విషయమై అప్రమత్తమయ్యాయి. ఆరాధనా సంబంధ భాష అయిన స్లవోనిక్‌ బైబిలు వర్తమానాన్ని రష్యన్‌ భాషకన్నా మరింత శ్రేష్ఠంగా వ్యక్తం చేయగలదని కొందరు చర్చి నాయకులు పేర్కొన్నారు.

అలా రష్యన్‌ బైబిల్‌ సొసైటీ 1826లో రద్దు చేయబడింది. బైబిలు సొసైటీ ద్వారా ఉత్పత్తి చేయబడిన అనేక వేల అనువాద ప్రతులు కాల్చివేయబడ్డాయి. దాని ఫలితంగా, బైబిలు రెండవ స్థానానికి దిగజారిపోగా, ఆచారాలూ మతకర్మలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. రోమన్‌ కాథోలిక్‌ చర్చి స్థాపించిన నమూనాను అనుసరిస్తూ, 1836లో సినోడ్‌ ఇలా ఆజ్ఞాపించింది: “భక్తిగల సభికులు లేఖనాలను వినేందుకు అనుమతించబడుతున్నారు, అయితే ఎవరూ కూడా లేఖనాల్లో కొంతభాగాన్ని ప్రాముఖ్యంగా పాత నిబంధనను నడిపింపు లేకుండా చదివేందుకు అనుమతించబడలేదు.” బైబిలు అనువాదానికి మరణ ఘాతం తగిలిందనిపిస్తుంది.

పావ్‌స్కీ చేసిన అనువాద ప్రయత్నం

ఈ మధ్యలో, హెబ్రీ భాషా పండితుడైన గ్యిరాస్యిమ్‌ పావ్‌స్కీ రష్యన్‌ భాషలోకి హెబ్రీ లేఖనాలకు అనువదించే పనిని చేపట్టాడు. మరి 1821లో ఆయన కీర్తనల గ్రంథాన్ని అనువదించడం ముగించాడు. చక్రవర్తి దాన్ని వెంటనే అంగీకరించాడు, మరి 1822 జనవరికల్లా కీర్తనల గ్రంథం ప్రజానీకం ఉపయోగించేందుకు విడుదల చేయబడింది. అది వెంటనే అంగీకరించబడింది మరియు 12 సార్లు దాన్ని మళ్లీ అచ్చువేయాల్సి వచ్చింది, అంటే మొత్తం 1,00,000 ప్రతులు!

పావ్‌స్కీ పండిత ప్రతిభ ఆయనకు అనేక భాషా పండితుల మరియు వేదాంతుల గౌరవాన్ని గడించింది. ఆయన తన చుట్టూ ఉండిన కుతంత్రాల చేత ప్రభావితం చెందని సూటైన మరియు యథార్థపరుడైన వ్యక్తిగా అభివర్ణించబడ్డాడు. రష్యన్‌ బైబిలు సొసైటీని చర్చి వ్యతిరేకించినప్పటికీ, మరియు అది విదేశీ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించిందని కొందరు భావించారన్న వాస్తవం ఉన్నప్పటికీ, పావ్‌స్కీ తన ప్రసంగాల్లో బైబిలు వచనాలను రష్యా భాషలోకి అనువదించడంలో కొనసాగాడు. ఆయనను అభిమానించే ఆయన విద్యార్థులు ఆయన వచనాలను వ్రాసి ఉంచారు, మరి కొంత కాలానికే ఆయన అనువాదాన్నంతటిని సంకలనం చేయగలిగారు. మరి 1839కల్లా పూర్వపరిశీలకుల అనుమతి లేకుండానే ధైర్యంగా అకాడమీ ముద్రణాలయంలో తమకైతాము 150 ప్రతులను అచ్చువేశారు.

పావ్‌స్కీ యొక్క అనువాదం పాఠకులపై ఎంతో గొప్ప ప్రభావాన్ని చూపింది, మరి దాని కొరకైన డిమాండు పెరుగుతూ పోయింది. మరి 1841లో ఆ అనువాదం ఆర్థడాక్స్‌ మత సిద్ధాంతంనుండి వైదొలగిపోయిందని పేర్కొంటూ ఈ అనువాదం వలన కలిగే “ప్రమాదాన్ని” గురించి ఒక అజ్ఞాత ఫిర్యాదు చేయబడింది. రెండు సంవత్సరాల తర్వాత సినోడ్‌ ఈ ఆజ్ఞను జారీ చేసింది: “జి. పావ్‌స్కీ అనువదించిన పాత నిబంధనకు సంబంధించి ఉనికిలో ఉన్న చేవ్రాత మరియు అచ్చు ప్రతులను అన్నింటినీ జప్తు చేసి వాటిని నాశనం చేయండి.”

దేవుని నామాన్ని ఘనపర్చడం

అయినప్పటికీ, బైబిలు అనువాదంలో ఆసక్తిని పావ్‌స్కీ మళ్లీ రగిలించాడు. మరొక ప్రాముఖ్యమైన వివాదం విషయంలో కూడా ఆయన భవిష్యత్‌ అనువాదకులకు ఒక ప్రాముఖ్యమైన దృష్టాంతాన్ని స్థాపించాడు—అదే దేవుని నామం.

రష్యన్‌ పరిశోధకుడైన కార్సున్‌స్కీ ఇలా వివరించాడు: ‘దేవుని స్వంత నామం ఆయన నామాలలోకెల్లా అతి పరిశుద్ధమైన יהוה అనే నాలుగు హెబ్రీ అక్షరాలతో కూడినది మరియు అది ఇప్పుడు యెహోవా అని ఉచ్చరించబడుతోంది.’ బైబిలు యొక్క ప్రాచీన ప్రతుల్లో, దేవుని ఆ విశిష్ట నామం కేవలం హెబ్రీ లేఖనాల్లోనే వేల కొలదిసార్లు కనిపిస్తుంది. అయితే, ఆ దైవిక నామం మనం వ్రాయలేనంత లేక ఉచ్చరించలేనంత పవిత్రమైనదని యూదులు తప్పుగా విశ్వసించడం ప్రారంభించారు. దీని గురించి కార్సున్‌స్కీ ఇలా వ్యాఖ్యానించాడు: ‘మాటలో లేక వ్రాతలో, “ప్రభువు” అని సాధారణంగా అనువదించబడే అదొనాయ్‌ అనే పదాన్ని దానికి బదులు ఉపయోగించేవారు.’

దైవిక నామాన్ని ఉపయోగించడాన్ని మానుకోవడం మూఢనమ్మకంతో కూడిన భయం మూలంగానే కానీ దైవిక భయంతో కాదనే విషయం స్పష్టం. దైవిక నామాన్ని ఉపయోగించడాన్ని బైబిలు ఎక్కడా కూడా నిరుత్సాహపర్చడం లేదు. దేవుడు తానే మోషేతో ఇలా చెప్పాడు: “మీ పితరుల దేవుడైన యెహోవా . . . మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము.” (నిర్గమకాండము 3:15) లేఖనాలు పదే పదే ఆరాధికులను ఇలా పురికొల్పుతున్నాయి: “యెహోవాను స్తుతించుడి ఆయన నామమును ప్రకటించుడి.” (యెషయా 12:4) అయినప్పటికీ, బైబిలు అనువాదకులు అనేకమంది యూదా ఆచారాన్ని అనుసరించడాన్ని ఎన్నుకుని దైవిక నామాన్ని ఉపయోగించడాన్ని విడిచిపెట్టారు.

అయితే పావ్‌స్కీ ఈ పారంపర్యాచారాన్ని అనుసరించలేదు. ఆయన అనువదించిన కీర్తనలలోనే యెహోవా అనే నామం 35 కంటే ఎక్కువసార్లు కనిపిస్తుంది. ఆయన ప్రదర్శించిన ధైర్యం ఆయన సమకాలీనుల్లో ఒకరిపై ఎంతో గణనీయమైన ప్రభావాన్ని చూపనై ఉంది.

మఠాధిపతి మాకార్‌యాస్‌

అసాధారణమైన భాషా నిపుణతలుగల రష్యన్‌ ఆర్థడాక్స్‌ మిషనరీ అయిన మఠాధిపతి మాకార్‌యాసే ఆ సమకాలీనుడు. ఆయన ఏడేళ్ల పసి ప్రాయంలోనే, చిన్న రష్యన్‌ పాఠాలను లాటిన్‌ భాషలోకి అనువదించ గలిగేవాడు. ఆయనకు ఇరవయ్యేళ్లు నిండేసరికి, ఆయనకు హెబ్రీ, జర్మన్‌ మరియు ఫ్రెంచి భాషలు తెలుసు. అయితే, దీన స్వభావం మరియు దేవుని ఎడల తనకున్న బాధ్యతను గురించి ఆయన కలిగివున్న స్పష్టమైన దృష్టి అతి నమ్మకమనే ఉరిలో చిక్కుకోకుండా ఆయనకు సహాయం చేశాయి. ఆయన పదే పదే ఇతర భాషాప్రవీణుల మరియు పండితుల సలహాలను కోరేవాడు.

మాకార్‌యాస్‌ రష్యాలో మిషనరీ కార్యకలాపాన్ని పునరుద్ధరించాలనుకున్నాడు. క్రైస్తవత్వాన్ని రష్యాలోని ముస్లిముల వద్దకూ యూదుల వద్దకూ తీసుకెళ్లే ముందు, చర్చి “పాఠశాలలను స్థాపించడం ద్వారా మరియు రష్యన్‌ భాషలో బైబిళ్లను పంచిపెట్టడం ద్వారా సామాన్య ప్రజలకు జ్ఞానోదయాన్ని కలిగించాలి” అని ఆయన భావించాడు. హెబ్రీ లేఖనాలను రష్యా భాషలోకి అనువదించేందుకు తాను అనుమతి పొందగలననే నమ్మకంతో మాకార్‌యాస్‌ 1839 మార్చి నెలలో, సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ చేరుకున్నాడు.

మాకార్‌యాస్‌ అదివరకే బైబిలులోని యెషయా మరియు యోబు గ్రంథాలను అనువదించాడు. అయితే, హెబ్రీ లేఖనాలను రష్యా భాషలోకి అనువదించడానికి సినోడ్‌ ఆయనకు అనుమతినిచ్చేందుకు నిరాకరించింది. వాస్తవానికి, హెబ్రీ లేఖనాలను రష్యా భాషలోకి అనువదించాలనే తలంపునే తననుండి దూరంగా తీసేయమని ఆయనకు చెప్పడం జరిగింది. మరి 1841 ఏప్రిల్‌ 11వ తేదీన, మాకార్‌యాస్‌ “టామ్‌స్కీలోని బిషప్‌ ఇంట్లో మోకాళ్లూని, ప్రార్థించడం ద్వారా తన మనస్సాక్షిని శుభ్రం చేసుకునేందుకు మూడు నుండి ఆరు వారాలు ప్రాయశ్చిత్తం చేయాలని” ఆజ్ఞాపిస్తూ సినోడ్‌ ఒక ఉత్తరువు జారీ చేసింది.

మాకార్‌యాస్‌ ధైర్యంగా నిలబడటం

మరి 1841 డిశంబరు నుండి 1842 జనవరి వరకూ, మాకార్‌యాస్‌ ప్రాయశ్చిత్తం చేశాడు. అయితే ఒక్కసారి అది ముగిసిన తర్వాత, ఆయన వెంటనే హెబ్రీ లేఖనాలను అనువదించడం ప్రారంభించాడు. పావ్‌స్కీ ద్వారా అనువదించబడిన హెబ్రీ లేఖనాల అనువాద ప్రతిని తీసుకుని తన స్వంత అనువాదాన్ని సరి చూసుకునేందుకు దాన్ని ఉపయోగించాడు. పావ్‌స్కీ వలె ఆయన దైవిక నామాన్ని మరుగుపర్చేందుకు నిరాకరించాడు. వాస్తవానికి, యెహోవా అనే నామం మాకార్‌యాస్‌ అనువాదంలో 3,500 కంటే ఎక్కువసార్లు కనిపిస్తుంది!

మాకార్‌యాస్‌ తన అనువాద ప్రతులను సానుభూతిగల తన స్నేహితులకు పంపించాడు. కొన్ని చేవ్రాత ప్రతులు పంపిణీ చేయబడినప్పటికీ చర్చి ఆయన అనువాదాన్ని ప్రచురించడాన్ని ఎడతెగక ఆటంకపరచింది. మాకార్‌యాస్‌ తన బైబిలును విదేశాల్లో ప్రోత్సహించడానికి పథకం సిద్ధం చేశాడు. ఆయన బయల్దేరవలసిన రోజుకు ముందు సాయంత్రం, ఆయన అనారోగ్యం పాలై కొంత కాలానికి అంటే 1847 సంవత్సరంలో మరణించాడు. ఆయన బైబిలు అనువాదం ఆయన జీవిత కాలమంతటిలో ఎన్నడూ ప్రచురించబడలేదు.

చివరకు ప్రచురించబడింది!

తుదకు, రాజకీయ మరియు మతపరమైన పవనాలు క్రొత్త మలుపులు తిరిగాయి. దేశంలో క్రొత్త స్వేచ్ఛా వాయువు వ్యాపించింది, మరియు 1856కల్లా రష్యా భాషలో బైబిలును అనువదించేందుకు సినోడ్‌ మరొకసారి అనుమతించింది. మెరుగుపడిన ఈ వాతావరణంలో, 1860 నుండి 1867 వరకూ ఆర్థడాక్స్‌ రివ్యూ అనే పత్రికలలో ఎన్‌ ఎక్స్‌పెరిమెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఇంటూ ది రష్యన్‌ లాంగ్వేజ్‌ అనే శీర్షిక క్రింద మాకార్‌యాస్‌ బైబిలు దఫాలవారీగా ప్రచురించబడింది.

రష్యన్‌ మత సాహిత్యంలో పండితుడైన, చెర్నీగోవ్‌కు చెందిన ఆర్చ్‌ బిషప్‌ ఫిలారెట్‌, మాకార్‌యాస్‌ బైబిలును ఇలా పొగిడాడు: “ఆయన అనువాదం హెబ్రీ ప్రతి అనుసారంగా నమ్మకంగా ఉంది, అనువాదం కొరకు ఉపయోగించబడిన భాష స్వచ్ఛంగా ఉంది, ఆ అంశానికి అనుగుణంగా ఉంది.”

అయితే, మాకార్‌యాస్‌ బైబిలు సామాన్య ప్రజానీకం కొరకు ఎన్నడూ విడుదల చేయబడలేదు. వాస్తవానికి దాన్ని గురించి పూర్తిగా మర్చిపోవడం జరిగింది. మరి 1876లో హెబ్రీ మరియు గ్రీకు లేఖనాలు ఉన్న పూర్తి బైబిలు, సినోడ్‌ అంగీకారంతో రష్యన్‌ భాషలోకి తుదకు అనువదించబడింది. ఈ పూర్తి బైబిలు తరచూ సినోడల్‌ అనువాదం అని పిలువబడింది. హాస్యాస్పదమైన విషయం ఏమంటే, పావ్‌స్కీ అనువదించిన బైబిలుతో సహా మాకార్‌యాస్‌ అనువాదమే ఈ “అధికారిక” రష్యన్‌ ఆర్థడాక్స్‌ చర్చి అనువాదానికి ప్రముఖ మూలంగా పని చేసింది. అయితే హెబ్రీ భాషలో కనిపించిన ప్రతీచోటా కాకుండా ఈ అనువాదంలో దైవిక నామం కేవలం కొన్ని స్థలాల్లోనే కనిపిస్తుంది.

మాకార్‌యాస్‌ బైబిలు నేడు

మరి 1993 వరకూ మాకార్‌యాస్‌ బైబిలు అజ్ఞాతంలో ఉండిపోయింది. ఉపోద్ఘాతంలో పేర్కొనబడిన విధంగా, రష్యన్‌ జాతీయ గ్రంథాలయంలోని అరుదైన పుస్తకాల విభాగంలో పాత ఆర్థడాక్స్‌ రివ్యూ పత్రికలలో దాని ప్రతి ఒకటి కనుగొనబడింది. ఈ బైబిలును ప్రజలకు అందజేయడం ఎంత విలువైన విషయమో యెహోవాసాక్షులు గుర్తించారు. మాకార్‌యాస్‌ బైబిలు యొక్క ఒక ప్రతిని, ప్రచురించడానికి వీలయ్యే విధంగా సిద్ధం చేసేందుకు రష్యాలోని యెహోవాసాక్షుల మతపరమైన సంస్థకు ఆ గ్రంథాలయం అనుమతినిచ్చింది.

రష్యా అంతటా మరియు రష్యన్‌ భాషను మాట్లాడే ఇతర అనేక దేశాల్లో ఆ బైబిలును పంపిణీ చేసేందుకు దాని దాదాపు 3,00,000 ప్రతులు అచ్చువేయబడటానికి అప్పుడు యెహోవాసాక్షులు ఏర్పాటు చేశారు. హెబ్రీ లేఖనాల అధిక భాగాన్ని మాకార్‌యాస్‌ అనువదించిన దానితో పాటూ, ఈ బైబిలు యొక్క సంపుటి పావ్‌స్కీ అనువదించిన కీర్తలన గ్రంథాన్నీ అలాగే ఆర్థడాక్స్‌ చర్చి ఆమోదించిన గ్రీకు లేఖనాల సినోడల్‌ అనువాదాన్నీ అది కలిగి ఉంది.

ఈ సంవత్సరం జనవరిలో, రష్యా నందలి సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన ఒక వార్తా సదస్సులో దాన్ని విడుదల చేశారు. (26వ పేజీ చూడండి.) ఈ క్రొత్త బైబిలు సహాయంతో రష్యన్‌ పాఠకులు తప్పకుండా జ్ఞానం పొంది, ఆధ్యాత్మికంగా వికసిస్తారు.

అలా ఈ బైబిలును ప్రచురించడం ఒక మతపరమైన మరియు సాహితీ పరమైన విజయం! అది “గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును” అని చెబుతున్న యెషయా 40:8 నందలి మాటల సత్యత్వాన్ని గూర్చిన విశ్వాసాన్ని దృఢపర్చే జ్ఞాపిక.

[26వ పేజీలోని బాక్సు/చిత్రం]

బైబిలు విమర్శకుల పొగడ్తలందుకుంది

“సాహిత్యపు మరొక స్మారక గ్రంథం విడుదల చేయబడింది: అదే మాకార్‌యాస్‌ బైబిలు.” కామ్‌సోమ్‌లస్కాయా ప్రావదా అనే వార్తాపత్రిక ఈ ఉపోద్ఘాతంతో మాకార్‌యాస్‌ బైబిలు ఆవిష్కరణను ప్రకటించింది.

రష్యన్‌ భాషలో మొదటి బైబిలు దాదాపు “120 సంవత్సరాల క్రితం” వరకూ కనిపించలేదని పేర్కొన్న తర్వాత, ఆ పత్రిక ఇలా విచారం వ్యక్తం చేసింది: “పరిశుద్ధ పుస్తకాలను సులభంగా చదువగల భాషలో అనువదించడానికి చర్చి అనేక సంవత్సరాలు వ్యతిరేకించింది. అనేక అనువాదాలను నిరాకరించిన తర్వాత, 1876లో చర్చి ఒక దాన్ని చివరకు అంగీకరించింది, అది సినోడల్‌ అనువాదం అని పిలువబడింది. అయితే, దాన్ని చర్చీల్లోకి తీసుకురావడం అనుమతించబడలేదు. అక్కడ, నేటికి కూడా కేవలం స్లవోనిక్‌ భాషలోని బైబిలు మాత్రమే అంగీకరించబడుతుంది.”

మాకార్‌యాస్‌ బైబిలును ప్రచురించడం ఎంత విలువైనదో సూచిస్తూ, సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ ఎకో అనే వార్తాపత్రిక ఇలా వ్యాఖ్యానించింది: “సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ రాష్ట్ర విశ్వవిద్యాలయానికీ, హెర్ట్‌జెన్‌ పెడాగోగన్‌ విశ్వవిద్యాలయానికీ మరియు మతపర చరిత్ర యొక్క రాష్ట్ర వస్తు ప్రదర్శనశాలకూ చెందిన అధికారిక పండితులు బైబిలు యొక్క ఈ సరిక్రొత్త సంపుటిని బహుగా కొనియాడారు.” గత శతాబ్దంలోని మొదటి అర్థ భాగంలో మాకార్‌యాస్‌ మరియు పావ్‌స్కీలు బైబిలును రష్యన్‌ భాషలోకి అనువదించడాన్ని గురించి ప్రస్తావిస్తూ, ఆ వార్తాపత్రిక ఇలా పేర్కొన్నది: “రష్యాలో ఆ సమయం వరకూ మత గురువులకు మాత్రమే అర్థమయ్యే స్లవోనిక్‌ భాషలోనే బైబిలు చదువబడుతూ ఉండేది.”

యెహోవాసాక్షులు మాకార్‌యాస్‌ బైబిలును విడుదల చేయడాన్ని గురించి, ఈ సంవత్సరం తొలి భాగంలో సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ నందు జరిగిన ఒక వార్తా సదస్సులో నివేదించబడింది. స్థానిక దినపత్రిక అయిన న్యెవ్‌స్కోయ వ్రెమ్‌యా ఇలా వ్యాఖ్యానించింది: “రష్యా మరియు పీటర్స్‌బర్గ్‌ యొక్క సాంస్కృతిక జీవితంలో ఎంతో ప్రాముఖ్యతగల వాస్తవంగా ఆ సంపుటిని ఉన్నతపర్చాలని అధికారిక పండితులు నొక్కి చెబుతున్నారు. ఈ మత సంస్థ యొక్క కార్యకలాపాలను గురించి ఒకరు ఏమని భావించినప్పటికీ, ఇప్పటివరకూ తెలియని ఒక బైబిలు అనువాదాన్ని ప్రచురించడం నిస్సందేహంగా ఎంతో గొప్ప ప్రయోజనకరమైన విషయం.”

సామాన్య ప్రజలు చదివి అర్థం చేసుకోగలిగే ఒక భాషలో దేవుని వాక్యం అందుబాటు చేయబడినప్పుడు దేవుణ్ణి ప్రేమించే వారందరూ ఆనందిస్తారనే విషయంలో సందేహమే లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రష్యా భాష మాట్లాడే కోట్లాది మంది ప్రజలకు మరొక బైబిలు అనువాదం అందుబాటులోకి తీసుకురాబడిందనే విషయాన్ని బట్టి అన్ని ప్రాంతాల్లోని బైబిలు ప్రేమికులూ ఆనందిస్తారు.

[చిత్రం]

ఈ వార్తా సదస్సులో మాకార్‌యాస్‌ బైబిలు ఆవిష్కరణ ప్రకటించబడింది

[23వ పేజీలోని చిత్రం]

ఆ గుప్త ధనం లభించిన రష్యన్‌ జాతీయ గ్రంథాలయం

[23వ పేజీలోని చిత్రం]

బైబిలును రష్యన్‌ భాషలో ప్రచురించేందుకు పీటర్‌ ది గ్రేట్‌ ప్రయత్నించాడు

[క్రెడిట్‌ లైను]

Corbis-Bettmann

[24వ పేజీలోని చిత్రం]

బైబిలును రష్యన్‌ భాషలోకి అనువదించేందుకు తోడ్పడిన గ్యిరాస్యిమ్‌ పావ్‌స్కీ

[25వ పేజీలోని చిత్రం]

మఠాధిపతి మాకార్‌యాస్‌, రష్యన్‌ భాషలోని క్రొత్త బైబిలుకు ఈయన పేరు పెట్టబడింది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి