కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 12/15 పేజీలు 16-21
  • రక్షణ కొరకు నోటితో ఒప్పుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రక్షణ కొరకు నోటితో ఒప్పుకోండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “అంత్యదినములలో”
  • రక్షణ కొరకు ప్రార్థన
  • ‘విశ్వాస వాక్యమును’ ఒప్పుకోవడం
  • యెహోవా నామమును బట్టి ప్రార్థించడం
  • ప్రచారకుల ‘సుందరమైన పాదములు’
  • మీ “రక్షణనిరీక్షణ”ను ఉజ్వలంగా ఉంచుకోండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • ఎవరు “రక్షింపబడుదురు”?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • రక్షణ నిజంగా దాని భావమేమిటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • “ఆపదకాలమున” ఎవరు తప్పించుకొందురు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 12/15 పేజీలు 16-21

రక్షణ కొరకు నోటితో ఒప్పుకోండి

“ప్రభువు [“యెహోవా,” NW] నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును.”—రోమీయులు 10:13.

1. చరిత్రంతటిలో, ఏ హెచ్చరికలు చేయబడ్డాయి?

చరిత్ర అనేక ‘యెహోవా దినాలను’ గురించి వర్ణిస్తోంది. నోవహు కాలంనాటి జలప్రళయమూ, సొదొమ గొమొఱ్ఱాల నిర్మూలనా, సా.శ.పూ. 607లోనూ సా.శ. 70లోనూ యెరూషలేము నాశనాలూ యెహోవా యొక్క గొప్ప, భయంకరమైన దినాలు. అవి, యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారికి తీర్పు తీర్చిన దినాలై ఉన్నాయి. (మలాకీ 4:5; లూకా 21:22) ఆ దినాల్లో, అనేకులు తమ దుష్టత్వాన్నిబట్టి నాశనమయ్యారు. కాని కొందరు తప్పించుకున్నారు. రానైయున్న విపత్తును గురించి దుష్టులకు తెలియజేస్తూ, రక్షణను కనుగొనడానికి నీతిమంతులకు అవకాశాన్నిస్తూ యెహోవా హెచ్చరికలు ప్రకటింపజేశాడు.

2, 3. (ఎ) పెంతెకొస్తు పండుగలో ఏ ప్రవచనార్థక హెచ్చరిక ఉదాహరించబడింది? (బి) సా.శ. 33 పెంతెకొస్తు నాటి నుండి, యెహోవా నామమును బట్టి ప్రార్థించడానికి ఏమి అవసరమైంది?

2 సా.శ. 70లో జరిగిన యెరూషలేము నాశనం దీనికి ఒక విశేషమైన ఉదాహరణగా ఉంది. దాదాపు 900 సంవత్సరాల క్రితమే ఆ సంఘటన గురించి ప్రవచిస్తూ, ప్రవక్తయైన యోవేలు ఇలా వ్రాశాడు: “ఆకాశమందును భూమియందును మహత్కార్యములను, అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెదను. యెహోవాయొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజో హీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును.” అలాంటి భయంకరమైన కాలాన్ని ఎవరైనా ఎలా తప్పించుకోగలరు? ప్రేరేపింపబడిన యోవేలు ఇలా వ్రాశాడు: “యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండమీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారుందురు, శేషించినవారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయువారందరును రక్షింపబడుదురు.”—యోవేలు 2:30-32.

3 సా.శ. 33 పెంతెకొస్తు నాడు అపొస్తలుడైన పేతురు యెరూషలేములోని యూదుల మరియు యూదా మతప్రవిష్టుల సమూహంతో మాట్లాడుతూ, తమ కాలంలో దీని నెరవేర్పును నిరీక్షించవచ్చునని తన శ్రోతలకు చూపిస్తూ, యోవేలు యొక్క ఈ ప్రవచనాన్ని ఉదాహరించాడు: “పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమిమీద సూచక క్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెదను. యెహోవా ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును. అప్పుడు ప్రభువు [“యెహోవా,” NW] నామమును బట్టి ప్రార్థన చేయు వారందరును రక్షణ పొందుదురు.” (అపొస్తలుల కార్యములు 2:16-21) పేతురు మాటలు వింటున్న సమూహమంతా మోషే ధర్మశాస్త్రం క్రింద ఉన్నదే గనుక వాళ్లకు యెహోవా నామము తెలుసు. కాబట్టి ఇక మీదట, యెహోవా నామమును బట్టి ప్రార్థించడంలో మరెక్కువ ఇమిడి ఉంటుందని పేతురు వివరించాడు. చంపబడి, అమర్త్యమైన పరలోక జీవితానికి పునరుత్థానం చేయబడిన యేసు నామమున బాప్తిస్మం తీసుకోవడం విశేషంగా దీనిలో ఇమిడివుంది.—అపొస్తలుల కార్యములు 2:37, 38.

4. క్రైస్తవులు ఏ సందేశాన్ని అంతటా ప్రకటిస్తున్నారు?

4 పెంతెకొస్తు నాటి నుండి, పునరుత్థానుడైన యేసును గురించిన వాక్యాన్ని క్రైస్తవులు వ్యాప్తి చేశారు. (1 కొరింథీయులు 1:23) మానవులు యెహోవా దేవుని ఆధ్యాత్మిక కుమారులుగా దత్తత తీసుకోబడగలరని, ‘యెహోవా గుణాతిశయములను ప్రచురము చేసే’ ఆధ్యాత్మిక జనాంగమైన “దేవుని” క్రొత్త “ఇశ్రాయేలు”లో భాగం కాగలరనీ వాళ్లు తెలియజేశారు. (1 పేతురు 2:9; గలతీయులు 6:16) మరణం వరకు నమ్మకంగా ఉన్నవారు యేసుతోపాటు ఆయన పరలోక రాజ్యంలో తోటి వారసులుగా అమర్త్యమైన పరలోక జీవితాన్ని వారసత్వంగా పొందుతారు. (మత్తయి 24:13; రోమీయులు 8:15, 16; 1 కొరింథీయులు 15:50-54) అంతేగాక, ఈ క్రైస్తవులు యెహోవా యొక్క గొప్ప భయంకరమైన దిన రాకడను ప్రకటించవలసి ఉండిరి. ఆ సమయం వరకు యెరూషలేముపైకి, దేవుని ప్రజలమని చెప్పుకుంటున్నవారిపైకి వచ్చిన ఏ విపత్తుకన్నా కూడా గొప్పదైన శ్రమ యూదా ప్రపంచంపైకి రాబోతుందని వాళ్లు హెచ్చరించవలసి ఉండిరి. అయితే తప్పించుకునే వారుంటారు. ఎవరు? యెహోవా నామమును బట్టి ప్రార్థించేవారు.

“అంత్యదినములలో”

5. ప్రవచనం యొక్క ఏ నెరవేర్పులు నేడు జరుగుతున్నాయి?

5 అనేక విధాల్లో, ఆనాటి పరిస్థితులు నేడు మనం చూస్తున్నవాటికి ముంగుర్తుగా ఉన్నాయి. “అంత్యకాలము” అనీ, “యుగసమాప్తి” అనీ, “అంత్యదినముల”నీ బైబిల్లో సూచించబడిన ప్రత్యేకమైన కాలవ్యవధిలో 1914 నుండీ మానవజాతి జీవిస్తోంది. (దానియేలు 12:1, 4; మత్తయి 24:3-8; 2 తిమోతి 3:1-5, 13) మన శతాబ్దంలో, క్రూరమైన యుద్ధాలూ, అదుపులేని దౌర్జన్యమూ, సాంఘికజీవనం యొక్క, పర్యావరణం యొక్క వినాశనమూ బైబిలు ప్రవచనానికి విశేషమైన నెరవేర్పునిచ్చాయి. ఇవన్నీ యేసు ప్రవచించిన సూచనలోని భాగమే. యెహోవా యొక్క అంతిమ, తప్పక రానైయున్న, భయంకరమైన దినాన్ని మానవజాతి ఎదుర్కోబోతుందని ఇవన్నీ సూచిస్తున్నాయి. ఇది, ‘లోకారంభము నుండి ఇప్పటి వరకు కలుగనటువంటి, ఇక ఎప్పుడును కలుగబోనటువంటి శ్రమ’ యొక్క చరమాంకమైన అర్మగిద్దోను యుద్ధంలో పరాకాష్టకు చేరుతుంది.—మత్తయి 24:21; ప్రకటన 16:16.

6. (ఎ) దీనులను కాపాడడానికి యెహోవా ఎలా చర్య గైకొంటున్నాడు? (బి) ఎలా తప్పించుకోవాలనేదాన్ని గురించిన పౌలు ఉపదేశాన్ని మనమెక్కడ కనుగొంటాము?

6 వినాశన దినం అంతకంతకూ సమీపిస్తుండగా, దీనులను రక్షించడానికి యెహోవా చర్య తీసుకుంటున్నాడు. ఈ “అంత్యకాలము”లో, దేవుని ఆధ్యాత్మిక ఇశ్రాయేలులో మిగిలినవారిని ఆయన సమకూర్చుకున్నాడు. తర్వాత, 1930ల నుండి, “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలోనుండియు . . . యెవడును లెక్కింపజాలని యొక గొప్పసమూహము”ను సమకూర్చడంపై తన భూసంబంధ సేవకుల అవధానాన్ని మళ్లించాడు. ఒక గుంపుగా వీరు “మహాశ్రమలనుండి” సజీవంగా బయటికి వస్తారు. (ప్రకటన 7:9, 14) కానీ ప్రతి పురుషుడు లేక స్త్రీ తాను తప్పించుకోవడం గురించి ఎలా నిశ్చయత కలిగివుండవచ్చు? అపొస్తలుడైన పౌలు ఆ ప్రశ్నకు ఉత్తరమిస్తున్నాడు. రోమీయులు 10వ అధ్యాయంలో, తప్పించుకోవడానికి ఆయన చక్కని ఉపదేశాన్నిస్తున్నాడు—ఆ ఉపదేశం ఆయన కాలంలో అన్వయించుకోబడింది మరియు అది మళ్లీ మన కాలానికి కూడా అన్వయిస్తుంది.

రక్షణ కొరకు ప్రార్థన

7. (ఎ) రోమీయులు 10:1, 2 నందు ఏ నిరీక్షణ గుర్తించబడింది? (బి) ఎందుకు ఇప్పుడు “సువార్త” మరింత విస్తృతంగా ప్రకటించబడేలా యెహోవా చేస్తాడు?

7 పౌలు రోమీయులకు పత్రిక వ్రాసే సమయానికి, యెహోవా అప్పటికే ఇశ్రాయేలును ఒక జనాంగంగా తిరస్కరించాడు. అయినప్పటికీ, అపొస్తలుడు ఇలా నొక్కిచెప్పాడు: “ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై యున్నవి.” యూదులు తాము రక్షణ పొందగలిగేలా, వ్యక్తిగతంగా దేవుని చిత్తాన్ని గూర్చిన కచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నది ఆయన నిరీక్షణయై ఉండింది. (రోమీయులు 10:1, 2) అంతేగాక, “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” అని యోహాను 3:16 నందు సూచించబడినట్లుగా, విశ్వాసముంచే యావత్‌ మానవ లోకమూ రక్షించబడాలన్నది యెహోవా ఆకాంక్ష. యేసు విమోచనా క్రయధన బలి ఆ గొప్ప రక్షణ కొరకు మార్గాన్ని తెరిచింది. నోవహు దినంలోలాగే మరియు ఆ తర్వాత వచ్చిన ఇతర తీర్పు దినాల్లోలాగే, రక్షణ మార్గాన్ని సూచిస్తూ యెహోవా “సువార్త” ప్రకటింపజేశాడు.—మార్కు 13:10, 19, 20.

8. పౌలు మాదిరిని అనుకరిస్తూ, నిజ క్రైస్తవులు నేడు ఎవరికి కటాక్షాన్ని అందజేస్తున్నారు మరియు ఎలా?

8 పౌలు యూదుల ఎడలా మరియు అన్యుల ఎడలా తన కటాక్షాన్ని చూపిస్తూ, అవకాశం లభించినప్పుడెల్లా ప్రకటించాడు. ఆయన ‘యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించేవాడు.’ ఎఫెసు నందలి పెద్దలకు ఆయనిలా చెప్పాడు: “ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను, ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు, దేవుని యెదుట మారుమనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెనని, యూదులకును గ్రీసుదేశస్థులకును ఏలాగు సాక్ష్యమిచ్చుచుంటినో యిదంతయు మీకు తెలియును.” (అపొస్తలుల కార్యములు 18:4; 20:20, 21) అదే విధంగా, నామకార్థ క్రైస్తవులకేగాక ప్రజలందరికీ, “భూదిగంతముల వరకు” ప్రకటించడంలో యెహోవాసాక్షులు నేడు తమను తాము వినియోగించుంటున్నారు.—అపొస్తలుల కార్యములు 1:8; 18:5.

‘విశ్వాస వాక్యమును’ ఒప్పుకోవడం

9. (ఎ) రోమీయులు 10:8, 9 ఎలాంటి విశ్వాసాన్ని ప్రోత్సహిస్తుంది? (బి) మనం మన విశ్వాసాన్ని ఎప్పుడు మరియు ఎలా ఒప్పుకోవాలి?

9 రక్షణ కొరకు దృఢమైన విశ్వాసం అవసరం. ద్వితీయోపదేశకాండము 30:14ను ఉదాహరిస్తూ పౌలు ఇలా ప్రకటించాడు: “వాక్యము నీయొద్దను, నీ నోటను నీ హృదయములోను ఉన్నది; అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే.” (రోమీయులు 10:8) మనం ఆ ‘విశ్వాస వాక్యమును’ ప్రకటిస్తుండగా, అది మన హృదయాల్లో ఇంకా ఇంకా లోతుగా నాటుకుపోతుంది. పౌలు విషయంలో అలాగే జరిగింది, ఆ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవడంలో ఆయనలాగే ఉండాలనే మన నిశ్చయతను ఆయన చెప్పిన ఈ తరువాతి మాటలు బలపరుస్తాయి: “యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.” (రోమీయులు 10:9) బాప్తిస్మమప్పుడు ఇతరుల ఎదుట ఇలా ఒప్పుకోవడమేగాక, అది కొనసాగే ఒప్పుకోలై ఉండాలి, అంటే సత్యం యొక్క ఘనమైన కోణాలన్నిటిని గూర్చిన ఉత్సాహవంతమైన బహిరంగ సాక్ష్యమై ఉండాలి. అలాంటి సత్యం మన సర్వోన్నత ప్రభువైన యెహోవా దేవుని అమూల్యమైన నామంపైనా, మన మెస్సీయ రాజూ విమోచకుడూ ప్రభువైన యేసు క్రీస్తుపైనా, అద్భుతమైన రాజ్య వాగ్దానాలపైనా కేంద్రీకరింపబడుతుంది.

10. రోమీయులు 10:10, 11 అనుసారంగా, మనం ఈ ‘విశ్వాసవాక్యముతో’ ఎలా వ్యవహరించాలి?

10 “ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా, ఆయనయందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది” అని అపొస్తలుడైన పౌలు చెబుతున్నట్లుగా, ఈ ‘విశ్వాస వాక్యమును’ అంగీకరించని, అన్వయించుకోని వారెవరికైనా రక్షణ కలుగదు. (రోమీయులు 10:10, 11) మనం ఈ ‘విశ్వాస వాక్యము’ గురించి కచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, ఇతరులకు దాన్ని చెప్పేందుకు మనం పురికొల్పబడేలా దాన్ని మనం మన హృదయాల్లో పెంపొందించుకుంటూ ఉండాలి. యేసు తానే మనకిలా గుర్తు చేస్తున్నాడు: “వ్యభిచారమును పాపమునుచేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలనుగూర్చియు సిగ్గుపడువాడెవడో, వానినిగూర్చి మనుష్యకుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతో కూడ వచ్చునప్పుడు సిగ్గుపడు[ను].”—మార్కు 8:38.

11. సువార్త ఎంత విస్తృతంగా ప్రకటించబడాలి మరియు ఎందుకు?

11 ప్రవక్తయైన దానియేలు ప్రవచించినట్లుగా, ఈ అంత్యకాలములో రాజ్య సాక్ష్యం భూదిగంతములకు చేరుతుండగా, ‘బుద్ధిమంతులు ఆకాశమండలములోని జ్యోతులవలె’ వెలుగుతూ కనిపిస్తున్నారు. వారు ‘నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు అనేకులను త్రిప్పుతున్నారు’ మరియు వాస్తవంగానే నిజమైన జ్ఞానము విస్తృతమయ్యింది, ఎందుకంటే ఈ అంత్యకాలాన్ని గురించిన ప్రవచనాలపై యెహోవా మునుపెన్నటికన్నా ఎక్కువ వెలుగును ప్రసరింపజేస్తున్నాడు. (దానియేలు 12:3, 4) సత్యాన్ని నీతిని ప్రేమించేవారందరూ తప్పించుకోవడానికి ఆవశ్యకమైన రక్షణ సందేశం ఇక్కడుంది.

12. ప్రకటన 14:6 నందు వర్ణించబడిన దేవదూత పనితో రోమీయులు 10:12 ఎలా పొందిక కలిగివుంది?

12 అపొస్తలుడైన పౌలు ఇంకా ఇలా చెబుతున్నాడు: “యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువైయుండి, తనకు ప్రార్థన చేయువారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు.” (రోమీయులు 10:12) నేడు సువార్త భూవ్యాప్తంగా మరింత విస్తృతంగా అంటే ప్రజలందరికీ, భూదిగంతాలవరకు ప్రకటించబడవలసి ఉంది. “భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆ యా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త”ను మనకు అప్పగిస్తూ ప్రకటన 14:6 నందలి దేవదూత ఆకాశమధ్యమున ఎగురుతూనే ఉన్నాడు. ప్రతిస్పందించే వారికి ఇదెలా ప్రయెజనకరంగా ఉంటుంది?

యెహోవా నామమును బట్టి ప్రార్థించడం

13. (ఎ) మన 1998 వార్షిక వచనం ఏది? (బి) నేడు ఈ వార్షిక వచనం ఎందుకు మరింత తగినదై ఉంది?

13 యోవేలు 2:32ను ఉదహరిస్తూ, పౌలు ఇలా ప్రకటిస్తున్నాడు: “ప్రభువు [“యెహోవా,” NW] నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును.” (రోమీయులు 10:13) 1998 కొరకు యెహోవాసాక్షుల వార్షిక వచనంగా ఆ మాటలను ఎంపికచేసుకోవడం ఎంత సముచితమో కదా! యెహోవా యందు నమ్మకముంచి, ఆయన నామాన్ని, అది వేటికి గుర్తుగా ఉందో ఆ ఘనమైన సంకల్పాలను తెలియజేస్తూ ముందుకు కొనసాగడం మునుపెన్నటికన్నా ఇప్పుడు ఎక్కువ ప్రాముఖ్యమైనదిగా ఉంది! మొదటి శతాబ్దంలోలాగే, ప్రస్తుత కలుషిత విధానం యొక్క చివరి దినాల్లో, “మూర్ఖులగు ఈ తరమువారికి వేరై రక్షణపొందుడని” ప్రతిధ్వనించే కేక బయలు వెడలుతోంది. (అపొస్తలుల కార్యములు 2:40) తమకు అలాగే తాము బహిరంగంగా ప్రకటించే సువార్తను వినే వారికి రక్షణ కలిగించమని యెహోవాకు ప్రార్థించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దైవ భయంగల ప్రజలకు బూరధ్వని వంటి ఆహ్వానమిది.—1 తిమోతి 4:16.

14. రక్షణ కొరకు మనం ఏ దుర్గానికి ప్రార్థించాలి?

14 యెహోవా గొప్ప దినం ఈ భూమిపై ప్రారంభమైనప్పుడు ఏమి జరుగుతుంది? అనేకులు రక్షణ కొరకు యెహోవా వైపు చూడరు. సామాన్య మానవజాతి, “మీరు మామీద పడి ఆయన సన్నిధికిని గొఱ్ఱెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండలతోను” చెబుతారు. (ప్రకటన 6:15, 16) వారి నిరీక్షణ ఈ విధానం యొక్క పర్వతంలాంటి సంస్థలపైనా, సంస్థాపనాలపైనా ఉంటుంది. అత్యంత గొప్ప ఆశ్రయదుర్గమైన యెహోవా దేవుని యందు వాళ్లు తమ నమ్మకాన్ని ఉంచితే ఎంత బాగుంటుందో కదా! (ద్వితీయోపదేశకాండము 32:3, 4) రాజైన దావీదు ఆయన గురించి ఇలా చెప్పాడు: “యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు.” యెహోవా “మన రక్షణ దుర్గము.” (కీర్తన 18:2; 95:1) ఆయన నామము “బలమైన దుర్గము,” అది మాత్రమే రానైయున్న సంక్షోభ సమయంలో మనల్ని కాపాడగల్గేంత బలమైన “దుర్గము.” (సామెతలు 18:10) కాబట్టి, యెహోవా నామమును బట్టి విశ్వాసంగా, యథార్థంగా ప్రార్థించడాన్ని నేడు సజీవంగా ఉన్న మొత్తం ఆరు వందల కోట్ల ప్రజలలో సాధ్యమైనంత మందికి నేర్పించడం ఆవశ్యకం.

15. విశ్వాసానికి సంబంధించి రోమీయులు 10:14 ఏమి సూచిస్తుంది?

15 తగిన విధంగానే, అపొస్తలుడైన పౌలు ఇలా ప్రశ్నిస్తున్నాడు: “వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు?” (రోమీయులు 10:14) రక్షణ కొరకు యెహోవాకు ప్రార్థించేందుకు ‘విశ్వాస వాక్యమును’ తమ స్వంతం చేసుకోవడానికి సహాయం అవసరమైనవారు ఇంకా కోట్లాదిమంది ఉన్నారు. విశ్వాసం ఎంతో ప్రాముఖ్యం. మరో పత్రికలో పౌలు ఇలా చెబుతున్నాడు: “విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.” (హెబ్రీయులు 11:6) అయితే మరి ఇంకా లక్షలాదిమంది దేవునియందు ఎలా విశ్వాసముంచుతారు? రోమీయులకు వ్రాసిన పత్రికలో పౌలు ఇలా అడుగుతున్నాడు: “విననివానిని ఎట్లు విశ్వసించుదురు?” (రోమీయులు 10:14) వాళ్లు వినడానికి యెహోవా ఏదైనా మార్గాన్ని ఏర్పాటు చేశాడా? కచ్చితంగా ఆయన ఏర్పాటు చేశాడు! పౌలు తర్వాతి మాటలను వినండి: “ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు?”

16. దైవిక ఏర్పాటులో, ప్రకటించేవారు ఎందుకు అవసరం?

16 ప్రకటించేవారు అవసరమన్నది పౌలు వాదన నుండి తేటతెల్లమౌతుంది. “యుగసమాప్తి వరకు” పరిస్థితి ఇలాగేవుంటుందని యేసు సూచించాడు. (మత్తయి 24:14; 28:18-20) రక్షించబడేందుకు యెహోవా నామమును బట్టి ప్రార్థించడానికి ప్రజలకు సహాయం చేసేందుకైన దైవిక ఏర్పాటులో ప్రకటించడం ఒక ఆవశ్యకమైన భాగం. దేవుని అమూల్యమైన నామమును ఘనపర్చడానికి క్రైస్తవమత సామ్రాజ్యంలోని అధికసంఖ్యాకులు ఏమీ చేయడం లేదు. వివరించ శక్యంకాని త్రిత్వ సిద్ధాంతమందలి మిగిలిన రెండింటితో మిళితం చేసి యెహోవా గుర్తింపును అనేకులు తికమకపరిచారు. అంతేగాక అనేకులు, కీర్తన 14:1 మరియు 53:1 నందు చెప్పబడిన వ్యక్తుల ఈ వర్గంలోకి వస్తారు: “దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు.” రానైయున్న గొప్ప శ్రమనుండి వారు రక్షించబడాలంటే యెహోవా జీవంగల దేవుడని వాళ్లు తెలుసుకోవాలి, ఆయన నామము వేటికి గుర్తుగా ఉందో అవన్నీ వాళ్లు అర్థం చేసుకోవాలి.

ప్రచారకుల ‘సుందరమైన పాదములు’

17. (ఎ) పౌలు పునఃస్థాపన ప్రవచనాన్ని ఉదాహరించడం ఎందుకు తగినది? (బి) ‘సుందరమైన పాదములు’ కలిగివుండడంలో ఏమి ఇమిడివుంది?

17 అపొస్తలుడైన పౌలు మరో ప్రాముఖ్యమైన ప్రశ్న వేస్తున్నాడు: “ప్రకటించువారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై—ఉత్తమమైనవాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడియున్నది.” (రోమీయులు 10:15) పౌలు ఇక్కడ, పునఃస్థాపన ప్రవచనంలో ఒక భాగమైయున్న యెషయా 52:7ను ఉదాహరిస్తున్నాడు. ఆ ప్రవచనం 1919 నుండి మన కాలానికి అన్వర్తించబడింది. నేడు మరోసారి యెహోవా, “సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు” వానిని పంపిస్తున్నాడు. విధేయతాపూర్వకంగా, దేవుని అభిషిక్త “కావలివారు” మరియు వారి సహవాసులు ఆనందంగా కేకలు వేస్తున్నారు. (యెషయా 52:7, 8) నేడు రక్షణ ప్రకటిస్తున్నవారి పాదములు వారు ఇంటింటికీ నడుస్తుండగా అలసిపోయి, మట్టిగొట్టుకుపోయి కూడా ఉండవచ్చు, కాని వాళ్ల ముఖాలు ఆనందంతో ఎంతగా ప్రకాశిస్తాయో కదా! దుఃఖిస్తున్న వారికి సమాధాన ఉపశమనాల సువార్తను ప్రకటించేందుకూ, రక్షణను దృష్టిలో ఉంచుకుని యెహోవా నామమును బట్టి ప్రార్థించడానికి సహాయం చేస్తూ ఓదార్చేందుకు యెహోవా తమను నియమించాడని వారికి తెలుసు.

18. సువార్తను ప్రకటించడం వల్ల వచ్చే చివరి ఫలితాన్ని గురించి రోమీయులు 10:16-18 ఏమి చెబుతుంది?

18 ప్రజలు ‘వినిన దానిని విశ్వసించినా’ లేక దానికి అవిధేయత చూపించడానికి ఎంపిక చేసుకున్నా, పౌలు యొక్క ఈ మాటలు మాత్రం నిజమౌతాయి: “వారు వినలేదా? విన్నారు గదా? వారి స్వరము భూలోకమందంతటికిని, వారిమాటలు భూదిగంతములవరకును బయలువెళ్లెను.” (రోమీయులు 10:16-18) అవును, ఆయన సృష్టి కార్యములలో కనిపిస్తున్నట్లుగా, “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి,” అలాగే భూమిపైనున్న ఆయన సాక్షులు ‘దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకు యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును’ ప్రకటించాలి.—కీర్తన 19:1-4; యెషయా 61:2.

19. నేడు ‘యెహోవా నామమును బట్టి ప్రార్థించేవారికి’ ఏమి లభిస్తుంది?

19 యెహోవా యొక్క గొప్ప భయంకరమైన దినము అంతకంతకూ సమీపిస్తుంది. “ఆహా, యెహోవా దినము వచ్చెనే అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయమువలెనే సర్వశక్తునియొద్దనుండి వచ్చును.” (యోవేలు 1:15; 2:31) కోట్లాదిమంది సువార్తకు అత్యవసరంగా ప్రతిస్పందించి యెహోవా సంస్థకు రావాలన్నది మన ప్రార్థన. (యెషయా 60:8; హబక్కూకు 2:3) ఇతర యెహోవా దినాలు అంటే నోవహు దినమూ, లోతు దినమూ, మతభ్రష్ట ఇశ్రాయేలు మరియు యూదా దినాలూ దుష్టులపైకి వినాశనాన్ని తెచ్చాయని గుర్తుంచుకోండి. యెహోవా ప్రళయ వాయువు భూమిపైనుండి దుష్టత్వాన్ని తుడిచివేసి, నిత్య శాంతితో కూడిన పరదైసుకు మార్గాన్ని సుగమం చేసే అత్యంత గొప్ప శ్రమ యొక్క అంచున మనమిప్పుడు నిలబడివున్నాము. ‘యెహోవా నామమును బట్టి విశ్వాసంగా ప్రార్థన చేసేవారిలో’ మీరూ ఒకరై ఉంటారా? అలాగైతే ఆనందించండి! మీరు రక్షించబడతారని దేవుడు స్వయంగా చేస్తున్న వాగ్దానం మీకుంది.—రోమీయులు 10:13.

మీరెలా సమాధానమిస్తారు?

◻ సా.శ. 33 పెంతెకొస్తు తర్వాత ఏ క్రొత్త విషయాలు ప్రకటించబడ్డాయి?

◻ ‘విశ్వాస వాక్యము’ ఎడల క్రైస్తవులు ఎలా అవధానాన్నివ్వాలి?

◻ ‘యెహోవా నామమును బట్టి ప్రార్థించడం’ అంటే ఏమిటి?

◻ రాజ్య సందేశకులకు ఏ భావంలో ‘సుందరమైన పాదములు’ ఉన్నాయి?

[18వ పేజీలోని చిత్రం]

దేవుని ప్రజలు ఆయన గుణాతిశయములను ప్యూర్టోరికో, సెనెగల్‌, పెరూ, పాపువా న్యూ గినియాలలో—అవును భూగోళవ్యాప్తంగా ప్రకటిస్తున్నారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి