కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w92 8/1 పేజీలు 13-18
  • “ఆపదకాలమున” ఎవరు తప్పించుకొందురు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “ఆపదకాలమున” ఎవరు తప్పించుకొందురు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “యిష్టవస్తువులు” ఎట్లు తేబడును
  • ‘వెదకుడి, వెదకుడి, వెదకుడి’
  • మిఖాయేలు చర్య గైకొనుట
  • యెహోవా ఉగ్రత దినం రాకముందే ఆయనను వెదకండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • రక్షణ కొరకు నోటితో ఒప్పుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • యెహోవా తీర్పుదినం ఆసన్నమైంది!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
w92 8/1 పేజీలు 13-18

“ఆపదకాలమున” ఎవరు తప్పించుకొందురు?

“యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థనచేయు వారందరును రక్షింపబడుదురు.”—యోవేలు 2:32.

1. దానియేలు, మలాకీ ప్రకారము, రానైయున్న “ఆపదకాలమున” రక్షణకొరకు తీర్చబడిన వారి గుర్తుయేమిటి?

మన కాలము కొరకు ఎదురుచూస్తూ ప్రవక్తయైన దానియేలు ఇలా వ్రాశాడు: “అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని యీ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును; అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారెవరో వారు తప్పించుకొందురు.” (దానియేలు 12:1) నిజముగా ఇవి ఓదార్పుకరమైన మాటలే! మలాకీ 3:16 కూడా ప్రకటించుచున్నట్లు తన అంగీకారముగల ప్రజలను యెహోవా జ్ఞాపకము చేసికొనును: “అప్పుడు, యెహోవా యందు భయభక్తులుగలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను.”

2. యెహోవా నామముపై ధ్యానముంచుట వలన కలుగు ఫలితమేమి?

2 యెహోవా నామముపై ధ్యానముంచుట ఆయనను గూర్చి ఆయన క్రీస్తును గూర్చి, మహాగొప్పవైన ఆయన రాజ్య సంకల్పములను గూర్చి కచ్ఛితమైన జ్ఞానము సంపాదించుటకు నడిపించును. ఆ విధముగా, ఆయన ప్రజలు ఆయనను పూజ్యభావముతో చూచుటకు, ఆయనతో సన్నిహిత సమర్పిత సంబంధములోనికి ప్రవేశించుటకు మరియు ఆయనను ‘తమ పూర్ణ హృదయముతోను, పూర్ణవివేకముతోను, పూర్ణ బలముతోను’ ప్రేమించుటను నేర్చుకొందురు. (మార్కు 12:33; ప్రకటన 4:11) భూమిపైనున్న దీనులందరు నిత్యజీవము పొందుటకు, యేసుక్రీస్తు బలిద్వారా యెహోవా కృపగల ఏర్పాటుచేసెను. కావున, యేసు జన్మమప్పుడు పరలోక సైన్యములు దేవుని స్తుతించిన మాటలనే వీరును నమ్మకముగా ప్రతిధ్వనించవచ్చును. దేవుని వారిట్లు స్తుతించిరి: “సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానము కలుగునుగాక.”—లూకా 2:14.

3. ఈ భూమికి సమాధానము వచ్చుటకు ముందుగా, యెహోవాచేయు ఏ పని ముందు జరుగవలెను?

3 ఆ సమాధానము అనేకమంది ప్రజలు తలంచుదానికంటె సమీపముగా ఉన్నది. అయితే యెహోవా విధించు తీర్పు మొదట అవినీతిమయమైన లోకము మీదికి రావలెను. ఆయన ప్రవక్తయగు జెఫన్యా ఇలా ప్రకటించెను: “యెహోవా మహా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది.” అది ఎటువంటి దినము? ఆ ప్రవచనమింకను ఇట్లనుచున్నది: “ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు. ఆ దినము ఉగ్రతదినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ముదినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ముదినము, మేఘములును గాఢాంధకారమును కమ్ముదినము. ఆ దినమున ప్రాకారములుగల పట్టణముల దగ్గరను, ఎత్తయిన గోపురముల దగ్గరను యుద్ధఘోషణయు బాకానాదమును వినబడును. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోవుచున్నాను; వారు గ్రుడ్డి వారివలె నడిచెదరు.”—జెఫన్యా 1:14-17; హబక్కూకు 2:3; 3:1-6, 16-19 కూడ చూడుము.

4. దేవుని తెలిసికొని ఆయనను సేవింపుమనే ఆహ్వానమునకు ఈనాడు ఎవరు ప్రత్యుత్తరమిచ్చుచున్నారు?

4 సంతోషదాయక మేమనగా, దేవుని తెలిసికొని ఆయనను సేవించుటకు ఇవ్వబడుచున్న అట్టి ఆహ్వానమునకు ఈనాడు లక్షలాదిమంది ప్రత్యుత్తరమిస్తున్నారు. క్రొత్త నిబంధనలోనికి తీసికొనబడిన అభిషక్తులను గూర్చి ఇట్లు ప్రవచింపబడినది: “అల్పులేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదే యెహోవా వాక్కు.” (యిర్మీయా 31:34) వీరు ఆధునిక-దిన సాక్ష్యపు పనిని ముందుకు తీసుకువెళ్లిరి. ఇప్పుడు అంతకంతకు అభిషక్తుల శేషమువారు తమ భూసంబంధమైన జీవితమును చాలించుచుండగా, “వేరే గొఱ్ఱెల” “గొప్ప సమూహము” వారు ముందువచ్చి ఆయన ఆలయ యేర్పాటునందు ‘దివారాత్రము దేవునికి పవిత్రసేవ చేయుచున్నారు.’ (ప్రకటన 7:9, 15; యోహాను 10:16) ఈ అమూల్యమైన ఆధిక్యత ననుభవించు వారిలో నీవును ఒకడవై యున్నావా?

“యిష్టవస్తువులు” ఎట్లు తేబడును

5, 6. నాశనమునకు సమస్త జనాంగములు కదిలింపబడుటకు ముందు, రక్షణార్థమైన ఏ పని జరుగును?

5 మనమిప్పుడు హగ్గయి 2:7ను చూద్దాం. అక్కడ తన ఆత్మీయ ఆరాధనా మందిరమును గూర్చి యెహోవా ప్రవచించుచు, ఆయనిట్లనుచున్నాడు: “నేను అన్యజనులనందరిని కదిలింపగా అన్యజనులందరియొక్క యిష్టవస్తువులు తేబడును; నేను ఈ మందిరమును మహిమతో నింపుదును.” ‘అన్యజనులనందరిని కదిలించుట’ జనాంగములపై యెహోవా విధించిన తీర్పును సూచించుచున్నదని బైబిలు ప్రవచనములు చూపుచున్నవి. (నహూము 1:5, 6; ప్రకటన 6:12-17) కావున, హగ్గయి 2:7లో యెహోవా ప్రవచించిన ఆ చర్య జనాంగములు ఉనికిలో లేకుండా కదిలించబడుటతో—నిర్మూలించబడుటతో ముగింపుకు చేరును. అయితే ‘అన్యజనులందరి యొక్క యిష్టవస్తువు లనబడిన’ వారి విషయమేమి? వారిని తెచ్చుటకు ఆ కడవరి నాశనకరమైన కదిలింపు వరకు వారు వేచియుండవలసిందేనా? ఎంతమాత్రము కాదు.

6 “యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండమీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారుందురు, శేషించినవారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థనచేయు వారందరును రక్షింపబడుదురు” అని యోవేలు 2:32 చెప్పుచున్నది. యెహోవా వారిని పిలుచును, కాగా వారు మహాశ్రమల ముగింపు సమయమునకు ముందు యేసు బలియందలి విశ్వాసముతో ఆయన నామమునుబట్టి ప్రార్థించుదురు. (యోహాను 6:44; అపొ. కార్యములు 2:38, 39 పోల్చుము.) సంతోషకరమైన విషయమేమంటె, అమూల్యమైన ఆ గొప్ప సమూహము, ఇప్పుడు నలభైలక్షలకు పైగాయుండి, హార్‌మెగిద్దోనులో ‘జనాంగములు కదిలింపబడుటను’ ఎదురుచూస్తూ యెహోవా ఆరాధనా మందిరమునకు ‘వచ్చుచున్నారు.’—ప్రకటన 7:9, 10, 14.

7. ‘యెహోవా నామమునుబట్టి ప్రార్థనచేయుటలో’ ఏమి ఇమిడియున్నది?

7 ఈ తప్పించుకొనువారు ఎట్లు యెహోవా నామమునుబట్టి ప్రార్థనచేయుదురు? దీనికి యాకోబు 4:8 ఒక సూచనచేస్తూ ఇట్లనుచున్నది: “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి.” మార్గమందు నాయకత్వము తీసికొనిన అభిషక్త శేషము వలెనే, హార్‌మెగిద్దోను తప్పించుకొను గొప్ప సమూహములో భాగమై యుండుటకు నిరీక్షించువారు నిర్ణయాత్మకముగా వుండవలెను. రక్షింపబడుటకు నీవు నిరీక్షించుచున్నట్లయిన, స్వచ్ఛపరచు యెహోవా వాక్యమునుండి నీవు ఎక్కువగా నేర్చుకొని ఆయన నీతి కట్టడలను నీ జీవితములో అన్వయించవలెను. నీ జీవితమును యెహోవాకు సమర్పించుకొని, దానిని నీటి బాప్తిస్మముద్వారా చూపించుటలో నీవు నిర్ణయాత్మకముగా వుండవలెను. నీవు యెహోవాకు విశ్వాసముతో ప్రార్థించుటలో ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుటయు చేరియున్నది. రోమీయులు 10వ అధ్యాయము, 9, 10 వచనములలో పౌలు ఈ విధముగా వ్రాయుచున్నాడు: “యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.” ఆ పిమ్మట 13వ వచనములో అపొస్తలుడు యోవేలు ప్రవచనమును నొక్కితెల్పుచు, “ప్రభువు (యెహోవా NW) నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడో వాడు రక్షింపబడును” అని అనెను.

‘వెదకుడి, వెదకుడి, వెదకుడి’

8. (ఎ) జెఫన్యా ప్రవక్త ప్రకారము, రక్షణ కొరకు యెహోవా ఏమికోరును? (బి) జెఫన్యా 2:3లో “ఒకవేళ” అనుమాట మనకు ఏ హెచ్చరికను అందజేయుచున్నది?

8 జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 2, 3 వచనములకు త్రిప్పినట్లయిన, రక్షణకొరకు యెహోవా ఏమి కోరుచున్నాడో మనమక్కడ చదువుదుము: “విధినిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రతదినము రాకమునుపే కూడిరండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధుల ననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి, మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.” “ఒకవేళ” అను మాటను గమనించండి. ఒకసారి రక్షింపబడితే ఇక రక్షింపబడినట్లే అను విషయము కాదు. ఆ దినమందు మనము దాచబడుట ఆ మూడు సంగతులను నిర్విరామముగా చేయుటపై ఆధారపడియున్నది. మనము యెహోవాను వెదకవలెను, నీతిని వెదకవలెను, దీనత్వమును వెదకవలెను.

9. దీనత్వమును వెదకువారు ఎట్లు ప్రతిఫలము పొందుదురు?

9 దీనత్వమును వెదకినందుకు లభ్యమగు ప్రతిఫలము నిజముగా అద్భుతకరము! 37వ కీర్తన 9-11 వచనములలో మనమిట్లు చదువుదుము: “యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు . . . దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు.” మరి నీతిని వెదకుట విషయమేమి? 29వ వచనము ఇట్లనుచున్నది: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.” యెహోవాను వెదకుటనుగూర్చి 39, 40 వచనములు మనకిట్లు ఉపదేశించుచున్నవి: “యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధకలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యెహోవా శరణుజొచ్చియున్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలోనుండి వారిని విడిపించి రక్షించును.”

10. యెహోవాను వెదకుటకు, దీనత్వమును వెదకుటకు తిరస్కరించుటలో ఎవరు పేరుగాంచియున్నారు?

10 క్రైస్తవమత సామ్రాజ్యపు శాఖలు యెహోవాను వెదకుటలో విఫలమైనవి. వారి మతనాయకులు ఆయన ప్రశస్తమైన నామమును సహితము నిరాకరించుచు, అహంకారముతో దానిని తమ బైబిలు భాషాంతరములలో నుండి తొలగించివేసిరి. వారు పేరులేని ప్రభువును లేక దేవుని ఆరాధించుటకు, అన్యమత త్రిత్వమును పూజించుటకు కోరుకొనుచున్నారు. అంతేకాకుండ, క్రైస్తవమత సామ్రాజ్యం నీతిని వెదకుట లేదు. దానిని హత్తుకొనిన అనేకులు అదుపుతప్పిన జీవన విధానములను అంగీకరించుచున్నారు లేక వాటికి మద్దతునిచ్చుచున్నారు. యేసువలె దీనత్వమును వెదకుటకు బదులు, వారు డంబమును, ఉదాహరణకు దూరదర్శినిలో, భోగలాలసమైన తరచు లైంగిక అవినీతికరమైన జీవితమును ప్రదర్శించుచున్నారు. చర్చిసభ్యుల సొమ్ము తిని మతనాయకులు బలుస్తున్నారు. యాకోబు 5:5లోని మాటల ప్రకారము, వారు “భూమిమీద సుఖముగా జీవించి భోగాసక్తులైరి.” యెహోవా దినము సమీపించుచుండగా, తమకు ఈ ప్రేరేపిత మాటలు అన్వయించుటను వారు నిశ్చయముగా కనుగొందురు: “ఉగ్రతదినమందు ఆస్తి (విలువైన వస్తువులు NW) అక్కరకు రాదు.”—సామెతలు 11:4.

11. పాపపురుషుడు ఎవరు, మరియు అతడెట్లు ఘోరమైన రక్తాపరాధమును పోగుచేసెను?

11 సా.శ. మొదటి శతాబ్దములో యెహోవా దినము వచ్చేసినదని తలంచుచు కొంతమంది క్రైస్తవులు ఉత్తేజపడిరని అపొస్తలుడైన పౌలు థెస్సలొనీకయులకు వ్రాసిన రెండవ పత్రికలో వివరించుచున్నాడు. అయితే మొదట గొప్ప భ్రష్టత్వము సంభవించి, “పాపపురుషుడు” బయటపడవలెనని పౌలు హెచ్చరించెను. (2 థెస్సలొనీకయులు 2:1-3) ఇప్పుడు ఈ 20వ శతాబ్దములో, ఆ విస్తారమైన మతభ్రష్టత్వమును, దేవుని దృష్టిలో క్రైస్తవమత సామ్రాజ్యపు మతనాయకుల ధర్మవిరుద్ధతను మనము బాగుగా గుర్తించగలము. 1914నుండి ఈ అంత్యదినములలో, ‘నాగటినక్కులను ఖడ్గములుగా సాగగొట్టుటను’ బలపరచుటద్వారా ఆ మతనాయకులు ఘోరమైన రక్తాపరాధమును పోగుచేసిరి. (యోవేలు 3:10) అమర్త్యమైన మానవ ఆత్మ, పాపవిమోచన లోకం, నరకాగ్ని బాధ, శిశు బాప్తిస్మము, త్రిత్వము వంటి అబద్ధబోధలను వారు ఎడతెగక బోధించిరి. యెహోవా తన న్యాయ తీర్పును విధించినప్పుడు వారెక్కడ నిలుతురు? సామెతలు 19:5 ఇట్లనుచున్నది: “కూటసాక్షి శిక్ష నొందకపోడు.”

12. (ఎ) త్వరలో ధ్వంసం చేయబడు మానవ “ఆకాశము” మరియు “భూమి” ఏమైయున్నవి? (బి) ఈ దుష్టలోకము మీదికి రాబోవు నాశనమునుండి మనమేమి నేర్చుకొందుము?

12 మనము 2 పేతురు 3:10లో ఇట్లు చదువుదుము: “ప్రభువు (యెహోవా, NW) దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.” మానవజాతిపై ఆకాశమువలె పరచుకొనియున్న అవినీతికర పరిపాలనలు, వాటితోపాటు ఈనాటి కుళ్లిన మానవ సమాజపు కృత్యములన్నియు, దేవునియొక్క ఈ భూమినుండి తుడిచివేయబడును. ప్రళయదినపు ఆయుధములను తయారుచేయువారు, వ్యాపారులు, వంచకులు, వేషధారులైన మతస్థులు వారి మతనాయకులు, భ్రష్టాచారమును, హింసను, నేరమును ప్రోత్సహించువారు—వీరందరు లేకుండా పోవుదురు. వారు యెహోవా కోపాగ్నిచే కరిగిపోవుదురు. అయితే 11, 12 వచనములలో పేతురు క్రైస్తవులకు ఈ హెచ్చరిక చేయుచున్నాడు: “ఇవన్నియు ఇట్లు లయమైపోవునవి గనుక . . . దేవుని (యెహోవా NW) దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.”

మిఖాయేలు చర్య గైకొనుట

13, 14. యెహోవా పరిపాలనను గొప్పగా మహిమపరచువాడు ఎవరు, మరియు ఆయన 1914 నుండి ఎట్లు చురుకుగా పనిచేయుచున్నాడు?

13 యెహోవా తీసికొనివచ్చు అట్టి “ఆపదకాలమున” ఎవరు తప్పించుకొందురు? “దేవునివలె ఎవరున్నారు?” అను అర్థముగల ప్రధానదూతయగు మిఖాయేలు, దేవుని ప్రతినిధిగా తప్పించుకొను ఆ ఏర్పాటుచేయును. కావున సరియైన రీతిలో ఆ మిఖాయేలు, యెహోవాయే సత్యదేవుడని, విశ్వమంతటిలో హక్కుగల సార్వభౌమాధిపతి ఆయనేయని సమర్థించుచు, యెహోవా పరిపాలనను మహిమపరచును.

14 పందొమ్మిది వందల పధ్నాలుగునుండి ఆరంభమయిన “ప్రభువు దినమును” గూర్చి ఎటువంటి అసాధారణమైన సంఘటనలను ప్రకటన 12వ అధ్యాయము 7 నుండి 17 వచనములు వర్ణించుచున్నవో! (ప్రకటన 1:10) ప్రధాన దూతయగు మిఖాయేలు, విశ్వాసఘాతకుడైన సాతానును పరలోకమునుండి భూమికి పడద్రోయును. ఆ తర్వాత, ప్రకటన 19వ అధ్యాయము 11 నుండి 16 వచనములలో వర్ణింపబడినట్లుగా, “నమ్మకమైనవాడును సత్యవంతుడు” అను పేరుగలవాడు, ‘సర్వశక్తిగల దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును.’ బలాఢ్యుడైన ఈ పరలోక యోధునికి “రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును” అను పేరు పెట్టబడెను. చివరగా, ప్రకటన 20వ అధ్యాయము 1, 2 వచనములు సాతానును అగాధములో పడవేసి వానిని వెయ్యి సంవత్సరములపాటు అక్కడే బంధించిన ఒక గొప్ప దేవదూతను గూర్చి చెప్పుచున్నది. స్పష్టముగా, ఈ లేఖనములన్నియు యెహోవా సార్వభౌమాధిపత్యమును మహిమపరచిన వానిని, అనగా ప్రభువైన యేసుక్రీస్తును సూచించుచున్నవి. ఈయనను యెహోవా 1914లో తన మహిమగల సింహాసనము మీద కూర్చుండబెట్టెను.

15. త్వరలో ఏ ప్రత్యేకమైన రీతిలో మిఖాయేలు “వచ్చును”?

15 దానియేలు 12:1లో చెప్పబడినట్లు, 1914లో రాజుగా నియమించబడిన దగ్గరనుండి మిఖాయేలు యెహోవా ప్రజల పక్షముగా ‘నిలుచున్నాడు.’ అయితే త్వరలోనే ఒక ప్రత్యేకభావమందు—భూమినుండి సమస్త దుష్టత్వమును తొలగించు యెహోవా ప్రతినిధిగా, దేవుని ప్రజల భూవ్యాప్త సమాజమునకు విడుదల తెచ్చువానిగా మిఖాయేలు “వచ్చును.” మత్తయి 24:21, 22లో యేసు మాటలు సూచించినట్లుగా అట్టి “ఆపదకాలము” ఎంత ఘోరముగా ఉండును: “లోకారంభమునుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడక పోయినయెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును.”

16. మహాశ్రమల కాలములో ఎవరు తప్పించుకొందురు?

16 ఆ సమయములో కొందరు తప్పించబడుదురను విషయమై మనమెంతగా సంతోషించగలము! సా.శ. 70లో యెరూషలేమునందు తిరుగుబాటుదారులైన యూదులను చెరబట్టి, వారిలోని కొందరిని రోమాకు బానిసలుగా తీసుకొనివెళ్లిన రీతిలో తప్పింపబడుట కాదు. బదులుగా, “అంత్యకాలమందు” తప్పించబడువారు, చివరి ముట్టడి ఆరంభమయినప్పుడు అప్పటికే యెరూషలేము వదిలి పారిపోయిన క్రైస్తవ సంఘమును పోలియుందురు. ఇంకా భూమిపై ఎవరైనా మిగిలియుంటే అట్టి అభిషక్తులతో కలిసి లక్షలాదిమందిగా యున్న గొప్పసమూహపు వారు దేవుని స్వంత ప్రజలై యుందురు. (దానియేలు 12:4) గొప్పసమూహపు వారు “మహాశ్రమలనుండి” వచ్చినవారై యుందురు. ఎందుకు? ఎందుకనగా, “వారు గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.” వారు చిందింపబడిన యేసు రక్తముయొక్క విమోచన శక్తియందు విశ్వాసముంచి, దేవునికి యథార్థమైన సేవచేయుటద్వారా ఆ విశ్వాసమును ప్రదర్శింతురు. ఇప్పుడు సహితము “సింహాసనాసీనుడైన” యెహోవా వారిపై రక్షణ గుడారమును కప్పుచుండగా, గొర్రెపిల్లయైన యేసుక్రీస్తు వారిని కాయుచు జీవజలముల బుగ్గలయొద్దకు నడుపుచున్నాడు.—ప్రకటన 7:14, 15.

17. రానైయున్న ఆపదకాలములో దాచబడునట్లు చర్యగైకొనుటకు గొప్పసమూహము ఎట్లు ప్రత్యేకముగా ప్రోత్సహించబడుచున్నది?

17 యెహోవాను, నీతిని, దీనత్వమును వెదకుటలో, లక్షలాదిమందిగా యున్న గొప్పసమూహపు వారు ఎన్నటికిని తమ మొదటి ప్రేమ చల్లారిపోకుండా జాగ్రత్తపడాలి. గొర్రెవంటి వారిలో నీవును ఒకడవైనట్లయిన, నీవేమి చేయాలి? కొలొస్సయులకు 3వ అధ్యాయము 5 నుండి 14 వచనములలో చెప్పబడినట్లుగా, నీవు సంపూర్ణముగా “ప్రాచీన స్వభావమును దాని క్రియలతోకూడ పరిత్యజించ” వలెను. దైవిక సహాయమును వెదకుచు, ‘కచ్ఛితమైన జ్ఞానముపై ఆధారపడిన నవీన స్వభావమును ధరించుకొనుటకు’ కృషిచేయుము. యెహోవాను స్తుతించుటలో, ఇతరులకు ఆయన దివ్యసంకల్పములను తెలియజేయుటలో దీనస్వభావముతో ఆసక్తిని పెంపొందించుకొని దానిని కాపాడుకొనుము. ఆ విధముగా, నీవు “ఆపదకాలమున” అనగా “యెహోవా ఉగ్రత” దినమున ఒకవేళ దాచబడవచ్చును.

18, 19. రక్షణ కొరకు సహనము ఏ విధముగా ఒక ప్రాముఖ్యమైనదిగా తయారయ్యెను?

18 ఆ దినము సమీపమైయున్నది! అది మనవైపు వేగముగా వచ్చుచున్నది. ఇప్పటికి దాదాపు 57 సంవత్సరముల నుండి గొప్పసమూహపు సభ్యులు సమకూర్చబడుచున్నారు. వీరిలో అనేకులు మృతిచెంది పునరుత్థానము కొరకు వేచియున్నారు. అయితే ఒక గుంపుగా గొప్ప సమూహము “క్రొత్తభూమి” సమాజపు కేంద్ర బిందువుగా మహాశ్రమలు దాటుకొనివత్తురని ప్రకటన మనకు అభయమిచ్చుచున్నది. (ప్రకటన 21:1) నీవు అక్కడ వుందువా? అలా వుండుట సాధ్యమే, ఎందుకనగా యేసు మత్తయి 24:14లో ఇట్లు చెప్పుచున్నాడు: “అంతమువరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును.”

19 యెహోవా ప్రజలు ఈ పాత విధానములో అనుభవించు వత్తిడులు ఇంకా పెరగవచ్చును. మరియు విపత్కర మహాశ్రమలు విరుచుకుపడినప్పుడు, నీవు కష్టాలను అనుభవించవచ్చును. అయితే యెహోవాకు ఆయన సంస్థకు సన్నిహితముగా ఉండుము. మెలకువగా ఉండుము! “యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా—నాకొరకు కనిపెట్టుడి, నేను లేచి యెరపట్టుకొను దినము కొరకు కనిపెట్టియుండుడి, నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారిమీద కుమ్మరించుటకై అన్యజనులను పోగుచేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని; నా రోషాగ్నిచేత భూమియంతయు కాలిపోవును.”—జెఫన్యా 3:8.

20. క్రితమెన్నటికంటె ‘ఆపదకాలపు’ చివరిదశ వేగముగా సమీపించుచుండగా, మనమేమి చేయవలెను?

20 మన రక్షణ కొరకు, ప్రోత్సాహము కొరకు, యెహోవా కనికరముతో తన ప్రజలకు ఒక ‘స్వచ్ఛమైన భాషను’ దయచేసెను. “జనులందరు యెహోవా నామమునుబట్టి యేక మనస్కులై ఆయనను సేవించునట్లు” ఆయన రానైయున్న రాజ్యముయొక్క గొప్ప వర్తమానము ఆ భాషలో ఇమిడియున్నది. (జెఫన్యా 3:9) క్రితమెన్నటికంటె ‘ఆపదకాలపు’ చివరిదశ వేగముగా సమీపించుచుండగా, రక్షణ కొరకు ‘యెహోవా నామమునుబట్టి ప్రార్థనచేయుటకు’ దీనులైన ఇతరులకు సహాయముచేస్తూ, మనము ఆసక్తితో సేవచేయుదము గాక. (w92 5/1)

మీకు గుర్తున్నవా?

◻ ఈ భూమికి సమాధానము తెచ్చుటకు ముందు యెహోవా తీసికొను ఏ చర్య సంభవించును?

◻ యోవేలు ప్రకారము, రక్షింపబడుటకు ఒకడు ఏమిచేయవలెను?

◻ జెఫన్యా ప్రకారము, యెహోవా కోపాగ్నినుండి దీనులెట్లు కాపాడబడవచ్చును?

◻ “పాపపురుషుడు” ఎవరు, అతడెట్లు రక్తాపరాధమును పోగుచేసెను?

◻ రక్షణ విషయములో సహనమెంత ప్రాముఖ్యమై యున్నది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి