విశ్వాసం మనలను ఓర్పుగలవారిగానూ, ప్రార్థనాపరులుగానూ చేస్తుంది
“ప్రభువురాక [“ప్రత్యక్షత,” NW] సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి.”—యాకోబు 5:8.
1. యాకోబు 5:7, 8 వచనాలను మనమెందుకు ధ్యానించాలి?
ఎంతోకాలం నుండి ఎదురుచూసిన యేసుక్రీస్తు “ప్రత్యక్షత” ఇప్పుడు ఒక వాస్తవం. (మత్తయి 24:3-14, NW) దేవునియందూ క్రీస్తునందూ మాకు విశ్వాసం ఉందని చెప్పుకొనే వాళ్లు శిష్యుడైన యాకోబు చెప్పిన ఈ క్రింది మాటలపై ధ్యానం ఉంచేందుకు ఇంతకు మునుపెన్నటికన్నా ఇప్పుడు మరింత కారణాన్ని కల్గివున్నారు: “సహోదరులారా, ప్రభువు రాకడవరకు [“ప్రత్యక్షతవరకు,” NW] ఓపిక కలిగి యుండుడి; చూడుడి; వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దానికొరకు కనిపెట్టును గదా ప్రభువురాక [“ప్రత్యక్షత,” NW] సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి.”—యాకోబు 5:7, 8.
2. యాకోబు ఎవరికి రాశాడో ఆ వ్యక్తులు ఎదుర్కొన్న కొన్ని సమస్యలు ఏవి?
2 తన ప్రేరేపిత పత్రికను యాకోబు ఎవరికి రాశాడో వాళ్లు ఓపిక కల్గివుండాల్సిన, వివిధ సమస్యల్ని పరిష్కరించుకోవాల్సిన అవసరముంది. దేవునియందు విశ్వాసం ఉందని చెప్పుకొనే వ్యక్తుల నుండి అపేక్షించబడిన దానికి భిన్నంగా అనేకులు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఉదాహరణకు, కొంతమంది హృదయాల్లో పెరిగిపోయిన కొన్ని దురాశల్ని తొలగించడానికి సత్వరమైన చర్య ఏదో ఒకటి తీసుకోవాల్సి ఉంది. ఆ తొలి క్రైస్తవుల్లో ప్రశాంతతను పునరుద్ధరించాల్సి ఉంది. ఓర్పుగలవారిగానూ, ప్రార్థనాపరులుగానూ ఉండడం విషయంలో వారికి సలహా కూడా అవసరమైంది. యాకోబు వారికి చెప్పిన దాన్ని మనం పరిశీలిస్తుండగా, మనం మన జీవితాల్లో ఆయన మాటల్ని ఎలా అన్వయించుకోగలమో చూద్దాం.
దురాశలు వినాశనకరమైనవి
3. సంఘంలోని పోరాటాలకు కారణాలు ఏమిటి, దీని నుండి మనమేం నేర్చుకోగలం?
3 క్రైస్తవులమని చెప్పుకున్న కొందరిలో సమాధానం కొరవడింది. ఈ పరిస్థితికి దురాశలే మూల కారణం. (యాకోబు 4:1-3) విభేదాలకు వివాదమే కారణమైంది, మరి కొందరు ప్రేమలేనితనంతో తమ సహోదరులకు తీర్పుతీర్చారు. భోగేచ్ఛలు తమ అవయవాల్లో పోరాడుతున్నందువల్లే ఇలా జరిగింది. సంఘంలో సమాధానాన్ని మనం పాడుచేయకుండా ఉండేలా ప్రతిష్ట కొరకైన, అధికారం కొరకైన, ఆస్తుల కొరకైన శరీరేచ్ఛల్ని నిరోధించేందుకు సహాయాన్ని పొందే నిమిత్తం మనకోసం ప్రార్థించాల్సిన అవసరం ఉండొచ్చు. (రోమీయులు 7:21-25; 1 పేతురు 2:11) మొదటి శతాబ్దంలోని కొంతమంది క్రైస్తవులలో విద్వేషపూరితమైన స్వభావాన్నీ, హత్యలు చేసే స్వభావాన్నీ కనుపర్చేంత స్థాయికి మత్సరం ఎదిగిపోయింది. దేవుడు వారి దురాశల్ని నెరవేర్చడు గనుక వాళ్లు తమ లక్ష్యాల్ని సాధించే ప్రయత్నంలో పోరాటం సాగిస్తూ ఉండేవారు. మనకూ అలాంటి దురాశలే ఉంటే, పరిశుద్ధుడైన మన దేవుడు అలాంటి ప్రార్థనలకు జవాబివ్వడు గనుక మనం అడిగినా వాటిని పొందలేం.—విలాపవాక్యములు 3:44; 3 యోహాను 9, 10.
4. యాకోబు కొంతమంది క్రైస్తవుల్ని “వ్యభిచారిణులారా” అని ఎందుకు పిలుస్తున్నాడు, ఆయన వ్యాఖ్యానం మనపై ఏ విధమైన ప్రభావాన్ని చూపించాలి?
4 కొంతమంది తొలి క్రైస్తవుల్లో లౌకికతత్వమూ, మత్సరమూ, గర్వమూ ఉండేవి. (యాకోబు 4:4-6) కొంతమంది క్రైస్తవులు లోకంతో స్నేహం చేసి, ఆ విధంగా ఆధ్యాత్మిక వ్యభిచార నేరస్థులైనందున వాళ్లను “వ్యభిచారిణులారా” అని యాకోబు పిలుస్తున్నాడు. (యెహెజ్కేలు 16:15-19, 25-45) దృక్పథాల్లోనూ, మాటల్లోనూ, క్రియల్లోనూ లోకరీతిగా ఉండడం మనల్ని దేవునికి శత్రువులుగా చేస్తుంది గనుక నిశ్చయంగా మనం అలా ఉండకూడదని కోరుకుంటాం. ‘మత్సరపడునంతగా అపేక్షించడం’ [“మత్సరపడు ప్రవృత్తి,” NW] అనేది పాపభరితులైన మానవుల్లో ఉన్న దురాలోచన లేక “ఆత్మ” అయివున్నది. (ఆదికాండము 8:21; సంఖ్యాకాండము 16:1-3; కీర్తన 106:16, 17; ప్రసంగి 4:4) కాబట్టి మనం మత్సరానికీ, గర్వానికీ లేక మరితర దురాలోచనలకూ వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరాన్ని మనం గుర్తిస్తే, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సహాయాన్ని మనం వెదకుదాం. దేవుని కృపనుబట్టి ఇవ్వబడుతున్న పరిశుద్ధాత్మ “మత్సరపడు ప్రవృత్తి”కన్నా గొప్పది. యెహోవా అహంకారుల్ని ఎదిరిస్తాడు. మనం పాపభరిత ప్రవృత్తులకు వ్యతిరేకంగా పోరాడినట్లైతే ఆయన మన ఎడల కృప చూపుతాడు.
5. దేవుని కృపను అనుభవించాలంటే మనం ఏ కట్టడలు పాటించాలి?
5 దేవుని కృపను మనమెలా పొందగలం? (యాకోబు 4:7-10) యెహోవానుండి వచ్చే కృపను అనుభవించాలంటే మనం ఆయనకు విధేయత చూపించి, ఆయన చేసిన ఏర్పాట్లను అంగీకరించాలి అలాగే ఆయన తన చిత్తానుసారంగా చేయాలనుకున్న ప్రతీ దానికీ లోబడాలి. (రోమీయులు 8:28) మనం అపవాదిని ‘ఎదిరించాలి’ లేక వాడికి ‘వ్యతిరేకంగా నిలబడాలి.’ యెహోవా విశ్వ సర్వాధిపత్యానికి మద్దతునిచ్చేవారిగా మనం స్థిరంగా ఉంటే, వాడు ‘మన యొద్దనుండి పారిపోతాడు.’ మనకు శాశ్వతమైన హానిని ఏదీ కలుగజేయకుండా ఉండేలా లోకానికి చెందిన దుష్ట సంస్థలను అదుపులో ఉంచే యేసు సహాయం మనకు ఉంది. ప్రార్థన చేయడం ద్వారా, విధేయత చూపించడం ద్వారా, విశ్వాసాన్ని కల్గివుండడం ద్వారా మనం దేవున్ని సమీపించగలమనే మరి ఆయన మనకు సమీపంగా ఉన్నట్టు రుజువుపర్చుకుంటాడనే విషయాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదు.—2 దినవృత్తాంతములు 15:2.
6. కొంతమంది క్రైస్తవుల్ని “పాపులు” అని యాకోబు ఎందుకు పిలుస్తున్నాడు?
6 దేవునియందు విశ్వాసం ఉందని చెప్పుకుంటున్న కొంతమందికి “పాపులు” అనే పదాన్ని యాకోబు ఎందుకు అన్వయిస్తున్నాడు? ఎందుకంటే వాళ్లు ‘యుద్ధాలు చేసిన,’ హత్యకు నడిపించే విద్వేషాన్ని కల్గివున్న అపరాధులు. ఇవి క్రైస్తవులకు తగని వైఖరులై ఉన్నాయి. (తీతు 3:3) వాళ్ల ‘చేతులు’ చెడుక్రియలతో నిండిపోయాయి, వాటిని శుభ్రం చేసుకోవాలి. ప్రేరణకు పీఠాలైన తమ ‘హృదయాల్ని’ కూడా వాళ్లు పరిశుద్ధపరచుకోవాలి. (మత్తయి 15:18, 19) ‘ద్విమనస్కులైన’ వాళ్లు దేవునితో స్నేహానికీ లోక స్నేహానికీ మధ్య ఊగిసలాడారు. వాళ్లు చూపిన చెడ్డ మాదిరి ద్వారా హెచ్చరించబడినవారమై, అలాంటి విషయాలు మన విశ్వాసాన్ని బద్ధలు చెయ్యకుండా ఉండేలా ఎల్లవేళలా మెలకువగా ఉందాం.—రోమీయులు 7:18-20.
7. “దుఃఖపడుడి, యేడువుడి” అని యాకోబు కొంతమందికి ఎందుకు చెబుతున్నాడు?
7 “వ్యాకులపడుడి, దుఃఖపడుడి, యేడువుడి” అని యాకోబు తన పాఠకులకు చెబుతున్నాడు. వాళ్లు దైవచిత్తానుసారమైన దుఃఖాన్ని చూపిస్తే, అది పశ్చాత్తాపానికి తగిన రుజువై ఉంటుంది. (2 కొరింథీయులు 7:10, 11) నేడు, తమకు విశ్వాసం ఉందని చెప్పుకునే కొందరు లోకస్నేహాన్ని వెదుకుతున్నారు. మనలో ఎవరైనా అలాంటి స్నేహాన్ని వెంబడిస్తున్నట్లైతే, మన బలహీన ఆధ్యాత్మిక స్థితినిబట్టి దుఃఖించి, దాన్ని సరిదిద్దుకునేందుకు సత్వర చర్యల్ని తీసుకోవద్దా? అవసరమైన సర్దుబాట్లు చేసుకొని, దైవిక క్షమాపణను పొందడమనేది పరిశుభ్రమైన మనస్సాక్షినిబట్టీ నిత్యజీవాన్ని గూర్చిన ఆనందమయ ఉత్తరాపేక్షనుబట్టీ హెచ్చించబడ్డామనే భావాన్ని కలుగజేస్తుంది.—కీర్తన 51:10-17; 1 యోహాను 2:15-17.
ఒకనినొకడు తీర్పుతీర్చకుడి
8, 9. ఎందుకు తోటి విశ్వాసికి విరోధముగా మాటలాడకూడదు లేక ఒకరినొకరు తీర్పుతీర్చుకోకూడదు?
8 తోటి విశ్వాసికి విరోధంగా మాటలాడడం పాపమవుతుంది. (యాకోబు 4:11, 12) అయినా, బహుశా తమ స్వనీతితో కూడిన వైఖరి మూలంగానో లేక ఇతరుల్ని చులకనగా చూడడం ద్వారా తమ్మును తాము హెచ్చించుకోవాలనే తమ కోరికను బట్టో కొంతమంది తమ తోటి క్రైస్తవులను విమర్శించేవారిగా ఉన్నారు. (కీర్తన 50:20; సామెతలు 3:29) ‘విరోధంగా మాట్లాడడం’ అని అనువదించబడిన గ్రీకు పదం శత్రుత్వాన్ని సూచించి, గోరంతల్ని కొండంతలు చేయడమనే లేక అబద్ధ నిందను మోపడమనే భావాన్ని ఇస్తుంది. ఒక సహోదరున్ని కఠినంగా తీర్పు తీర్చడంతో ఇది సమానం. ఈ చర్య ఏ విధంగా ‘ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాటలాడి ధర్మశాస్త్రాన్ని తీర్పుతీర్చడంతో’ సమానం అవుతుంది? శాస్త్రులు, పరిసయ్యులు ‘నైపుణ్యవంతంగా దేవుని ఆజ్ఞను విడిచి,’ తమ స్వంత ప్రమాణాల ఆధారంగా తీర్పుతీర్చేవారు. (మార్కు 7:1-13) అదే విధంగా, యెహోవా తృణీకరించని ఒక సహోదరున్ని మనం తృణీకరించినట్లైతే, మనం ‘దేవుని ధర్మశాస్త్రాన్ని తీర్పుతీర్చి,’ దాన్ని అయోగ్యమైనదని పాపభరితంగా సూచించమా? మన సహోదరున్ని అన్యాయంగా విమర్శించడం ద్వారా, మనం ప్రేమ నియమాన్ని నెరవేర్చని వారమౌతాం.—రోమీయులు 13:8-10.
9 యెహోవా “ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు” అని మనం గుర్తుంచుకుందాం. ఆయన ధర్మశాస్త్రం లోపభూయిష్టమైనదిగాక ‘పరిపూర్ణమైనది.’ (కీర్తన 19:7; యెషయా 33:22) రక్షణ కొరకు ప్రమాణాల్నీ సూత్రాల్నీ నిర్ణయించే హక్కు దేవునికి మాత్రమే ఉంది. (లూకా 12:5) కాబట్టి “పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు?” అని యాకోబు అడుగుతున్నాడు. ఇతరులకు తీర్పుతీర్చి, తృణీకరించే ప్రత్యేకమైన హక్కు మనకులేదు. (మత్తయి 7:1-5; రోమీయులు 14:4, 10) దేవుని సర్వాధిపత్యాన్నీ, నిష్పక్షపాత స్వభావాన్నీ, మన స్వంత పాపతత్వాన్నీ ధ్యానించడం, స్వనీతితో ఇతరులను తీర్పుతీర్చకుండా ఉండేలా మనకు సహాయపడుతుంది.
డంబమైన స్వీయ నమ్మకాన్ని విడనాడండి
10. యెహోవాను మన ప్రతిదిన జీవితాల్లో ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి?
10 యెహోవానూ, ఆయన ధర్మశాస్త్రాన్నీ మనం అన్నివేళలా పరిగణనలోకి తీసుకోవాలి. (యాకోబు 4:13-17) దేవున్ని నిర్లక్ష్యపరుస్తూ, ‘ఈ రోజైనా రేపైనా ఒకానొక పట్టణానికి పోయి అక్కడ ఒక సంవత్సరం గడిపి వ్యాపారంచేసి లాభాన్ని సంపాదిద్దాం’ అని స్వీయ నమ్మకంగల వ్యక్తి అనుకుంటాడు. మనం ‘దేవుని ఎడల ధనవంతులంగాక మన కోసమే సమకూర్చుకొంటే’ మన జీవితం రేపే ముగిసిపోయి, యెహోవాను సేవించే అవకాశం మనకు దొరకకపోవచ్చు. (లూకా 12:16-21) యాకోబు చెబుతున్నట్లుగా, మనం “కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరివంటి” వారం. (1 దినవృత్తాంతములు 29:15) యెహోవాయందు విశ్వాసాన్ని ఉంచుతూ ఉండడం ద్వారా మాత్రమే మనం శాశ్వతమైన ఆనందం కొరకూ, నిత్యజీవితం కొరకూ నిరీక్షించగలం.
11. ‘యెహోవా చిత్తమైతే’ అని అనడంలో దాని భావమేమిటి?
11 డంబంగా దేవున్ని నిర్లక్ష్యపర్చడానికి బదులు, ‘యెహోవా చిత్తమైతే మనం బ్రదికియుండి ఇది చేద్దాం, అది చేద్దాం అని చెప్పే’ స్థానాన్ని మనం తీసుకోవాలి. ‘యెహోవా చిత్తమైతే’ అని చెప్పడం, మనమాయన చిత్తానికి అనుగుణంగా పనిచేయడానికి ప్రయత్నిస్తున్నామని సూచిస్తుంది. మన కుటుంబానికి మద్దతును ఇవ్వడం, రాజ్య పనిలో ప్రయాణ ఖర్చులు వగైరా వంటివాటి కొరకు వ్యాపారం చేయడం అవసరమై ఉండవచ్చు. అయితే మనం ప్రగల్భాలు పల్కకుండా ఉందాం. ‘ఇలా అతిశయించడం’ దేవునిపై ఆధారపడడాన్ని నిర్లక్ష్యం చేస్తుంది గనుక అది ‘చెడ్డదైవుంది.’—కీర్తన 37:5; సామెతలు 21:4; యిర్మీయా 9:23, 24.
12. యాకోబు 4:17 వచనంలోని మాటల భావమేమిటి?
12 స్వీయ నమ్మకాన్ని గూర్చిన, ప్రగల్భాల్ని గూర్చిన తన మాటల్ని ముగిస్తూ యాకోబు ఇలా చెబుతున్నాడు: “మేలైనదిచేయనెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును.” తాను దేవునిపై ఆధారపడే అవసరాన్ని ప్రతీ క్రైస్తవుడూ వినయంతో గుర్తించాలి. అతడలా చేయనట్లైతే, ‘అది అతనికి పాపం అవుతుంది.’ దేవునియందలి విశ్వాసం మననుండి కోరే వాటిలో దేనిని చేయకపోయినా వర్తించే సూత్రమదే.—లూకా 12:47, 48.
ధనాన్ని గూర్చిన హెచ్చరిక
13. తమ ఐశ్వర్యాన్ని దుర్వినియోగపర్చే వారిని గురించి యాకోబు ఏమి చెబుతున్నాడు?
13 కొంతమంది తొలి క్రైస్తవులు భౌతికవాదులు అయ్యారు లేక ఐశ్వర్య ధ్యాసలో పడిపోయారు గనుక అలాంటి ధనవంతుల్ని గురించి యాకోబు తీవ్రంగా వ్యాఖ్యానించాడు. (యాకోబు 5:1-6) తమ ధనాన్ని తగని రీతిలో ఉపయోగిస్తున్న లోకసంబంధమైన వ్యక్తులకు వారి క్రియల చొప్పున దేవుడు వారికి తిరిగి చెల్లించినప్పుడు, వాళ్లు ‘తమమీదికి రాబోయే ఉపద్రవాల్ని గూర్చి ప్రలాపించి ఏడుస్తారు.’ ఆ కాలంలో, అనేకమంది ప్రజల సంపద వస్త్రాలూ ధాన్యమూ ద్రాక్షారసం వంటి వాటి రూపాల్లో ముఖ్యంగా కూర్చబడేది. (యోవేలు 2:19; మత్తయి 11:8) వీటిలో కొన్ని చెడిపోగలవు లేక ‘చిమ్మెటలు కొట్టివేస్తాయి’ కానీ సంపదకున్న పాడైపోయే గుణాన్ని గురించిగాక దాని నిరుపయోగాన్నే యాకోబు నొక్కిచెబుతున్నాడు. వెండి బంగారాలకు తుప్పుపట్టకపోయినా మనం వాటిని కూడబెట్టినట్లైతే, తుప్పు పట్టినవి ఎంత విలువలేనివిగా ఉంటాయో అవీ అంతే విలువలేనివవుతాయి. “తుప్పు” అనేది వస్తుదాయక ఐశ్వర్యాన్ని సరిగా ఉయోగించుకోలేదనే విషయాన్ని సూచిస్తుంది. కాబట్టి, దేవుని కోపం వారిపైకి వచ్చినప్పుడు, “అంత్యదినములయందు” తాము ‘కూర్చుకున్న’ తమ వస్తుదాయక ఆస్తులయందు నమ్మకం ఉంచడమనేది “అగ్నివలె” ఉంటుందనే విషయాన్ని మనమంతా గుర్తుంచుకోవాలి. మనం “అంత్యకాలము”లో జీవిస్తున్నాం గనుక అలాంటి మాటలు మనకు ప్రత్యేకమైన భావాన్ని కల్గివున్నాయి.—దానియేలు 12:4; రోమీయులు 2:5.
14. ధనవంతులు తరచూ ఎలా ప్రవర్తిస్తారు, మరి ఆ విషయంలో మనమేమి చెయ్యాలి?
14 ధనవంతులు తమ చేలు కోసిన పనివారికివ్వకుండా వారిని తరచుగా మోసంచేసి బిగపట్టిన కూలి ప్రతీకారం కొరకు ‘మొఱ్ఱపెడుతుంది.’ (ఆదికాండము 4:9, 10 పోల్చండి.) లోకసంబంధమైన ధనవంతులు ‘సుఖముగా జీవించారు.’ భోగలాలసత్వమందు మితిమీరిపోయి, వాళ్లు క్రొవ్వుపట్టి ప్రతిస్పందించని హృదయాల్ని పోషించుకుంటున్నారు. వాళ్లు తమ వధ కొరకు నిర్ణయించబడిన ‘దినం’ వరకూ అలాగే పోషించుకుంటూ ఉంటారు. వాళ్లు ‘నీతిమంతుడైనవానికి శిక్షవిధించి చంపుతారు.’ యాకోబు ఇలా అడుగుతున్నాడు: “నీతిమంతు[డు] . . . మిమ్మును ఎదిరించడు.” కానీ “[ధనవంతుడు] మిమ్మల్ని ఎదిరించడా?” అని మరొక అనువాదం చెబుతోంది. విషయమేదైనా, ధనవంతుల ఎడల మనం పక్షపాతం కల్గివుండకూడదు. మన జీవితంలో ఆధ్యాత్మిక ఆసక్తుల్ని మొదటి స్థానంలో ఉంచుకోవాలి.—మత్తయి 6:25-33.
ఓపిక కల్గివుండడానికి విశ్వాసం సహాయపడుతుంది
15, 16. ఓపిక కల్గివుండడం ఎందుకు అంత ప్రాముఖ్యం?
15 లోకంలో క్రూరులైన ధనవంతుల్ని గూర్చి వ్యాఖ్యానిస్తూ, అణచివేతకు గురైన క్రైస్తవుల్ని ఓపిక కల్గివుండమని యాకోబు ప్రోత్సహిస్తున్నాడు. (యాకోబు 5:7, 8) విశ్వాసులు ఓపికతో తమ కష్టాల్ని భరించినట్లైతే, తమను అణగద్రొక్కినవారి పైకి తీర్పు వచ్చినప్పుడు క్రీస్తు ప్రత్యక్షత కాలంలో విశ్వాసాన్నిబట్టి వాళ్లు ప్రతిఫలం పొందుతారు. (మత్తయి 24:37-41) తాను విత్తనాలు నాటగల్గే శరదృతువులో పడే తొలకరి వర్షం కొరకూ ఆ తర్వాత పంట పండడానికి వసంత ఋతువులో పడే కడవరి వర్షం కొరకూ ఓపికతో కనిపెట్టే రైతువలె ఆ తొలి క్రైస్తవులు ఉండాల్సిన అవసరం ఉంది. (యోవేలు 2:23) విశేషంగా ‘ప్రభువైన యేసుక్రీస్తు రాకడ [“ప్రత్యక్షత,” NW]’ సమీపించింది గనుక ఓపిక కలిగి ఉండి మన హృదయాలను స్థిరపర్చుకోవాల్సిన అవసరం మనకు కూడా ఉంది!
16 మనమెందుకు ఓపిక కల్గివుండాలి? (యాకోబు 5:9-12) మనతోటి విశ్వాసులు మనల్ని వేధించినప్పుడు మన అసమ్మతి తెలుపుతూ ముక్కుతూ మూలగకుండా లేక సణగకుండా ఉండేందుకు మనకు ఓపిక సహాయపడుతుంది. మనం హానికరమైన స్వభావంతో ‘ఒకనిమీద నొకడు సణగుకొన్నట్లైతే’ న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు మనకు తీర్పుతీరుస్తాడు. (యోహాను 5:22) ఇప్పుడు ఆయన “ప్రత్యక్షత” ఆరంభమైంది, ఆయన “వాకిట నిలిచియున్నాడు” గనుక విశ్వాససంబంధమైన అనేక పరీక్షల్ని ఎదుర్కుంటున్న మన సహోదరులతో ఓపికకల్గి ఉండడం ద్వారా మనం శాంతిని పెంపొందిద్దాం. యోబు ఓపికతో తనకు వచ్చిన శోధనల్ని సహించినందున దేవుడు ఆయనకు ప్రతిఫలాన్ని దయచేశాడని మనం జ్ఞాపకం చేసుకొన్నప్పుడు మన స్వంత విశ్వాసం బలపడుతుంది. (యోబు 42:10-17) మనం విశ్వాసాన్నీ, సహనాన్నీ కల్గివున్నట్లైతే, యెహోవా “ఎంతో జాలియు కనికరమును గలవాడని” తెలుసుకుంటాం.—మీకా 7:18, 19.
17. ‘ఒట్టుపెట్టుకొన వద్దు’ అని యాకోబు ఎందుకు చెబుతున్నాడు?
17 మనకు సహనం లేకపోతే, ఒత్తిళ్లలో ఉన్నప్పుడు మనం మన నాలుకను దుర్వినియోగపర్చవచ్చు. ఉదాహరణకు, తొందరపాటుతో ప్రమాణాలు చేయవచ్చు. తీవ్రంగా ఆలోచించకుండా చేసే ప్రమాణాలను గూర్చి హెచ్చరిస్తూ ‘ఒట్టుపెట్టుకొన వద్దు’ అని యాకోబు చెబుతున్నాడు. పదే పదే ఒట్టుపెట్టుకుంటూ విషయాల్ని ధృవపర్చడం వేషధారణగా కూడా కన్పిస్తుంది. అందుకే, అవునంటే అవును కాదంటే కాదు అని మనం సత్యాన్నే మాట్లాడాలి. (మత్తయి 5:33-37) న్యాయస్థానంలో సత్యాన్ని చెప్పడానికి ప్రమాణం చేయడం తప్పని యాకోబు చెప్పడంలేదు.
విశ్వాసమూ, మన ప్రార్థనలు
18. ఏ పరిస్థితుల్లో మనం ‘ప్రార్థనచేయాలి,’ ‘కీర్తనలు పాడాలి’?
18 మనం మన సంభాషణను అదుపులో ఉంచుకొని, సహనాన్ని కలిగివుండి దేవునియందు హితకరమైన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే మన జీవితంలో ప్రార్థన ఓ ప్రముఖమైన పాత్రను నిర్వహించాలి. (యాకోబు 5:13-20) విశేషంగా మనం శోధనల్లో ఉన్నప్పుడు, ‘ప్రార్థనచేయాలి.’ మనం సంతోషంగా ఉంటే, యేసుక్రీస్తు తన మరణదిన జ్ఞాపకార్థ ఆచరణను ఏర్పాటుచేసినప్పుడు ఆయనా ఆయన అపొస్తలులు ‘కీర్తనలను’ పాడినట్లే మనమూ పాడాలి. (మార్కు 14:26, అధఃసూచి NW) కొన్నిసార్లు, మన హృదయాల్లో సహితం దేవుని కీర్తించేంతగా ఆయన ఎడల కృతజ్ఞతాభావంతో మనం నింపబడవచ్చు. (1 కొరింథీయులు 14:15; ఎఫెసీయులు 5:19) క్రైస్తవ సంఘాల్లో పాడుతూ యెహోవాను స్తుతించడం ఎంత ఆనందకరమైన విషయమో కదా!
19. మనం ఆధ్యాత్మికంగా రోగగ్రస్థులమైతే మనమేం చెయ్యాలి, ఎందుకు అలాంటి చర్యను తీసుకోవాలి?
19 బహుశా తప్పుడు ప్రవర్తననుబట్టో లేక యెహోవా బల్లవద్ద క్రమంగా తినకపోవడం వల్లనో మనం ఆధ్యాత్మిక రోగపీడితులమైతే మనకు పాటలు పాడాలని అన్పించకపోవచ్చు. మనం ఆ స్థితిలో ఉంటే సంఘ పెద్దలు మన ‘కొరకు ప్రార్థన’ చేసేలా వారిని మనం వినయంతో పిలుద్దాం. (సామెతలు 15:29) వాళ్లు మనకు ‘యెహోవా నామమున నూనె రాస్తారు’ కూడా. గాయంపై రాసిన నూనె ఉపశమనం కల్గించినట్లుగానే, ఓదార్పునిచ్చే వారి మాటలూ, లేఖనాలపై ఆధారపడిన సలహాలూ కృంగుదలను పోగొట్టి సందేహాన్ని నివృత్తిచేసి మనకు భయంలేకుండా చేస్తాయి. మన స్వంత విశ్వాసంచే సమర్ధించబడిన ‘విశ్వాససహితమైన ప్రార్థన మనల్ని స్వస్థపరుస్తుంది.’ మన ఆధ్యాత్మిక రోగం గంభీరమైన పాపం మూలంగా కల్గినదని పెద్దలు కనుగొంటే, వాళ్లు దయాపూర్వకంగా మనం చేసిన పాపం ఏమిటో చెప్పి, సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. (కీర్తన 141:5) మనం మారుమనస్సు పొందితే, దేవుడు వారి ప్రార్థనలు విని మనల్ని క్షమిస్తాడనే విశ్వాసాన్ని మనం కల్గివుండగలం.
20. మనం మన పాపాల్ని ఎందుకు ఒప్పుకొని ఒకరికొరకు మరొకరు ప్రార్థన చేయాలి?
20 ‘మన పాపాల్ని ఒకరితోనొకరు బహిరంగంగా ఒప్పుకోవడం’ మనం మరలా పాపం చేయకుండా అదుపు చేస్తుంది. అది ‘ఒకరికొరకు మరొకరం ప్రార్థించేందుకు’ మనల్ని ప్రేరేపించే లక్షణమైన దయను పరస్పరం చూపించుకొనేలా ప్రోత్సహిస్తుంది. విశ్వాసాన్ని కల్గివుండి, దేవునిచే నిజాయితీపరునిగా దృష్టించబడిన ‘నీతిమంతుని’ ప్రార్థన యెహోవా దగ్గర ఎంతో సాధించగలదు గనుక ఇది ప్రయోజనకరమైనదనే విశ్వాసాన్ని మనం కల్గివుండగలం. (1 పేతురు 3:12) ప్రవక్తయైన ఏలీయా కూడా మనవంటి బలహీనతలుగలవాడే, అయినా ఆయన ప్రార్థనలు ప్రభావవంతమైనవి. ఆయన ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాల వరకు వర్షం కురవలేదు. ఆయన మరల ప్రార్థనచేయగా వర్షం కురిసింది.—1 రాజులు 17:1; 18:1, 42-45; లూకా 4:25.
21. తోటి క్రైస్తవుడు ‘సత్యములో నుండి తొలగిపోయినట్లైతే’ మనమేమి చేయవచ్చును?
21 సంఘంలో ఒక సభ్యుడు సరియైన బోధనా ప్రవర్తనల నుండి ప్రక్కకు మళ్లిపోయి ‘సత్యంలో నుండి తొలగిపోయినట్లైతే’ అప్పుడేమి చెయ్యాలి? బైబిలు సలహాలు ఇచ్చి, ప్రార్థనా, మరితర సహాయాలు చేయడం ద్వారా మనం అతనిని వెనుకకు మళ్లించవచ్చు. మనం మళ్లించగల్గినట్లైతే, ఇది అతనిని క్రీస్తు విమోచన క్రయధనం క్రిందవుంచి, అతన్ని ఆధ్యాత్మిక మరణం నుండీ, నాశనానికిపోయే తీర్పునుండీ రక్షిస్తుంది. తప్పుచేసిన వానికి సహాయం చేయడం ద్వారా, అతని అనేక పాపాల్ని మనం కప్పివేస్తాం. గద్దించబడిన పాపి తన తప్పుడు మార్గం నుండి మళ్లి, పశ్చాత్తాపపడి క్షమాపణను వెదికినట్లైతే, అతని పాపాల్ని కప్పివేసేందుకు మనం పాటుపడ్డామని మనం సంతోషిస్తాం.—కీర్తన 32:1, 2; యూదా 22, 23.
మనందరికీ ప్రయోజనకరమైనది ఎంతో ఉంది
22, 23. యాకోబు మాటలు మనపై ఎలాంటి ప్రభావం చూపాలి?
22 మనందరికీ ఎంతో ప్రయోజనకరమైన దానిని యాకోబు పత్రిక కల్గివుందనే విషయం సుస్పష్టమే. ఇది శోధనల్ని ఎలా ఎదుర్కోవాలో మనకు చూపిస్తుంది, పక్షపాతాన్ని చూపించడానికి వ్యతిరేకంగా మనకు సలహాల్ని ఇస్తుంది, నీతియుక్తమైన పనుల్లో పాల్గొనాలని మనకు ఉద్బోధిస్తుంది. నాలుకను అదుపులో ఉంచుకోమనీ, లోకసంబంధమైన ప్రభావాన్ని ఎదుర్కోమనీ, శాంతిని పెంపొందించమనీ మనకు యాకోబు ఉద్బోధిస్తున్నాడు. ఆయన మాటలు మనల్ని సహనమూర్తులుగానూ, ప్రార్థనాపరులుగానూ కూడా చేస్తున్నాయి.
23 యాకోబు పత్రిక మొదట అభిషిక్త తొలి క్రైస్తవులకు పంపబడిందనేది వాస్తవమే. అయినా, మనం మన విశ్వాసానికి హత్తుకునేలా మనకు తోడ్పడడానికి దాని సలహాలను మనమంతా అనుమతిద్దాం. దేవుని సేవలో నిర్ణయాత్మక చర్యను తీసుకునేందుకు మనల్ని ప్రేరేపించే విశ్వాసాన్ని యాకోబు మాటలు మరింత బలపర్చగలవు. దైవికంగా ప్రేరేపించబడిన ఈ పత్రిక, ‘ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షతా’ కాలంలో అంటే నేడు మనల్ని యెహోవా దేవుని ప్రార్థనాపరులైన సహనం కల్గిన సాక్షులుగా చేసే శాశ్వత విశ్వాసాన్ని పెంపొందిస్తోంది.
మీరు ఎలా జవాబిస్తారు?
◻ కొంతమంది తొలి క్రైస్తవులు తమ ప్రవర్తననూ దృక్పథాల్నీ మార్చుకోవాల్సిన అవసరం ఎందుకుంది?
◻ ధనవంతులకు యాకోబు ఏ హెచ్చరికను ఇస్తున్నాడు?
◻ మనం ఎందుకు ఓర్పును చూపాలి?
◻ మనం ఎందుకు క్రమంగా ప్రార్థించాలి?
[19వ పేజీలోని చిత్రసౌజన్యం]
Pictorial Archive (Near Eastern History) Est.
[23వ పేజీలోని చిత్రం]
కొంతమంది తొలి క్రైస్తవులు తోటి విశ్వాసులతో మరింత ఓర్పుగా ఉండాల్సిన అవసరంవుంది
[24వ పేజీలోని చిత్రం]
క్రైస్తవులు ఓపికకల్గి, ప్రేమపూర్వకంగానూ, ప్రార్థనాపూర్వకంగానూ ఉండాల్సిన అవసరంవుంది