‘ఎన్నికలేనివాడు బలమైన జనమవ్వడాన్ని’ నేను చూశాను
విలియం డింగ్మాన్ చెప్పినది
అది 1936వ సంవత్సరము; స్థలం సాలెమ్, ఓరెగాన్, అమెరికా. నేను యెహోవాసాక్షుల కూటానికి హాజరయ్యాను. “గొప్ప సమూహము ఎక్కడ?” అనే ప్రశ్న అడగడం జరిగింది. (ప్రకటన 7:9) నేను ఒక్కడినే క్రొత్త వాడిని, కాబట్టి వారందరు నన్ను ఉద్దేశిస్తూ ఇలా అన్నారు, “అదిగో ఆయనే!”
పరదైసు భూమిపై నిరంతరం జీవిస్తాము అనే బైబిలు నిరీక్షణ 1930వ దశాబ్ద మధ్య కాలంలో యెహోవాసాక్షుల్లో చాలా తక్కువమందికి మాత్రమే ఉంది. (కీర్తన 37:29; లూకా 23:43) అప్పటినుండి పరిస్థితులు త్వరితగతిని మారిపోయాయి. కాని సాలెమ్, ఓరెగాన్‌లో ఆ కూటానికి హాజరవ్వడానికి నన్ను నడిపించిన సంఘటనలను గూర్చి చెప్పనివ్వండి.
పూర్వం గోల్డన్ ఏజ్ అని పిలువబడిన తేజరిల్లు!కు నా తండ్రి చందాదారుడు. నేను యౌవనస్థునిగా ఉన్నప్పుడు, నేను దాన్ని చదవడంలో ఆనందించేవాడిని, మరియు అది ముఖ్యమైన బైబిలు సత్యం కలిగి ఉందని నాకు నమ్మకం కలిగింది. గోల్డన్ ఏజ్ వెనుక పేజీపైవున్న ఒక కూపన్‌ను నేను ఒకరోజు పంపించాను. అందులో దగ్గరలో ఉన్న యెహోవాసాక్షుల సంఘం యొక్క పేరు, ఒక పుస్తకం, 20 చిన్న పుస్తకాలు పాఠకునికి ఇస్తున్నట్లు వ్రాయబడి ఉంది. సాహిత్యం అందుకున్న తరువాత, నేను ఇంటింటికి వెళ్లి పుస్తకంతో పాటు అన్ని చిన్నపుస్తకాలను అందించాను.
ఆ సమయంలో ఎవరూ నాతో బైబిలు పఠించలేదు. నిజానికి, యెహోవాసాక్షుల్లో ఏ ఒక్కరితోను నేను ఎన్నడూ మాట్లాడలేదు. కాని ఇప్పుడు, దగ్గరలో ఉన్న రాజ్య మందిరం యొక్క అడ్రస్ తీసుకొని, సాలెమ్లో ఉన్న ఓరెగాన్‌లో జరిగే కూటానికి హాజరవ్వడానికి నేను 40 కిలోమీటర్లు వాహనం నడుపుకుంటూ వెళ్లాను. అక్కడే నేను, కేవలం 18 సంవత్సరాలవాడిగా ఉన్నప్పుడే, నేనొక్కడనే “గొప్ప సమూహము” అని పిలువబడ్డాను.
పరిచర్యకొరకు నాకే సిద్ధపాటులేకపోయినప్పటికీ, సాలెమ్ సంఘంతో కలిసి ప్రకటించడం మొదలుపెట్టాను. సాక్ష్యమిచ్చే నా పనిలో మూడు ప్రధాన అంశాలను చేర్చడానికి నేను ప్రోత్సహించబడ్డాను. మొదటిది, యెహోవా దేవుడని; రెండవది, యేసుక్రీస్తు ఆయన నియమించిన రాజని; మూడవది, లోకానికి ఏకైక నిరీక్షణ రాజ్యమేనని. ప్రతి ఇంటి వద్ద ఆ సందేశాన్ని పంచుకోవడానికి నేను ప్రయత్నించాను.
సాలెమ్లో రెండు సంవత్సరాలు యెహోవా సాక్షులతో సహవసించిన తరువాత, 1938 ఏప్రిల్ 3న, బాప్తిస్మం పొందాను. “గొప్ప సమూహము”కు చెందిన అనేకమందిమి బాప్తిస్మం తీసుకోవడం చూసి సాలెమ్లోని స్నేహితులు ఆనందించారు. 1939 ఫిబ్రవరిలో నేను పయినీరును లేక పూర్తి కాల పరిచారకుడినయ్యాను. ఆ సంవత్సరం డిసెంబరులో, రాజ్య ప్రచారకుల గొప్ప అవసరత ఉన్న అరిజోనాకు వెళ్లడానికి ఇవ్వబడిన ఆహ్వానాన్ని నేను అంగీకరించాను.
అరిజోనాలో పయినీరు సేవ
అరిజోనాలో యెహోవా సాక్షుల పని క్రొత్త. మా గురించి చాలా తప్పుడు అభిప్రాయం ఉండేది, కాబట్టి అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నప్పుడు మేము ఎక్కువ హింసను అనుభవించాము. ఉదాహరణకు, 1942లో, నేను అరిజోనా యందలి స్టాఫోర్డ్లో సేవచేస్తున్నప్పుడు మార్మోన్ల గుంపు ఒకటి మాపై దాడిచేయబోతుందని తెలిసింది. నా తోటి పయినీరు సేవకులు, నేను, మమ్మల్ని గౌరవించే ఒక మార్మోను బిషప్పు గృహానికి సమీపంలో నివసించేవాళ్లం, ఆ బిషప్పు ఇలా అన్నాడు: “సాక్షులు ఉన్నంత చురుకుగా మార్మోను మిషనరీలు ఉంటే, మార్మోను చర్చి అభివృద్ధిచెందియుండేది.” కాబట్టి ఆయన చర్చిలో మాట్లాడుతూ ఇలా అన్నాడు: “సాక్షులైన అబ్బాయిలపై దాడిజరుగబోతుందని విన్నాను. ఈ అబ్బాయిలకు దగ్గరలోనే నేను నివసిస్తున్నాను, అక్కడేమైనా అల్లరి జరిగితే, ప్రహారీ మీదుగా ఒక తుపాకీ గురిపెట్టబడివుంటుంది. ఆ తుపాకీ ఉపయోగించబడుతుంది—కాని సాక్షులవైపు కాదు. అది అల్లరిమూక వైపుకి ఉపయోగించబడుతుంది. కాబట్టి మీరు అల్లరి పెట్టాలనుకుంటే ఏమి జరుగబోతుందో మీకు తెలుసు.” అంతే అల్లరిమూక ఇక రాలేదు.
అరిజోనాలో నేనున్న మూడు సంవత్సరాల్లో, మమ్మల్ని అనేకసార్లు నిర్భంధించి జైల్లో వేశారు. ఒకసారి నన్ను 30 రోజులు అందులో ఉంచారు. మా పరిచర్యలో పోలీసుల హింసను తప్పించుకోవడానికి, మేము ఫ్లయింగ్ స్క్వాడ్ అని పిలిచిన దానిని ఏర్పాటుచేసుకున్నాము. సాక్ష్యపు పనిలో నాయకత్వం వహిస్తున్న సహోదరుడు ఇలా చెప్పాడు: “మన పేరుకు తగినట్లుగా మనముండాలి.” ఉదయం 5 లేక 6 గంటలకు మేము మొదలు పెట్టి, ప్రతీ ద్వారం దగ్గరా కరపత్రం లేక చిన్నపుస్తకం ఉంచి, తొందరగా వెళ్లిపోయేవాళ్లము. మా “ఫ్లయింగ్ స్క్వాడ్” అరిజోనా రాష్ట్రాన్ని కొంతవరకు పూర్తిచేయగలిగింది. అయితే, దాన్ని చివరికి రద్దుచేశారు ఎందుకంటే ఆవిధమైన ప్రకటన వల్ల ఆసక్తిగల వారికి సహాయాన్ని అందించడానికి వీలయ్యేదికాదు.
గిలియడ్ పాఠశాల మరియు ప్రత్యేక సేవ
1942 డిసెంబరులో, అరిజోనాలో యెహోవాసాక్షులు స్థాపించబోయే క్రొత్త మిషనరీ పాఠశాలకు ఆహ్వానలేఖ అందుకున్న అనేకమంది పయినీర్లలో నేనూ ఉన్నాను. మొదట్లో ఆ పాఠశాల వాచ్‌టవర్ బైబిల్ గిలియడ్ కళాశాల అని పిలువబడేది. తరువాత ఆ పేరు వాచ్‌టవర్ బైబిల్ గిలియడ్ పాఠశాల అని మార్చారు. ఈ పాఠశాల దాదాపు 4,800 కిలోమీటర్ల దూరంలో, న్యూయార్క్‌కు ఉత్తర ప్రాంతంలోని ఇతాకా పట్టణానికి దగ్గరలో నెలకొల్పబడింది.
ఒరేగాన్ను ఒకసారి సందర్శించిన తరువాత, 1943 జనవరిలో, పయినీర్లలో అనేకులం గ్రేహౌండ్ బస్సులో, అరిజోనా ఎడారివేడిని వదలి వెళ్లిపోయాము. కొన్ని రోజుల తరువాత మా గమ్యానికి అంటే న్యూయార్క్ ఉత్తర ప్రాంతంలోని చలికాలపు మంచుకు చేరుకున్నాము. 1943 ఫిబ్రవరి 1న, పాఠశాల అధ్యక్షుడైన నేథన్ హెచ్. నార్, ప్రారంభోత్సవ ప్రసంగంలో వందమంది విద్యార్థులను ఉద్దేశిస్తూ ఇలా చెప్పినప్పుడు పాఠశాల ప్రారంభమయ్యింది: “ఈ కళాశాల యొక్క ఉద్దేశం మిమ్మల్ని నిర్దేశిత ప్రచారకులుగా సిద్ధంచేయడం కాదు. మీరు ఇప్పటికే ప్రచారకులు మరియు సంవత్సరాలుగా పరిచర్యలో చురుకుగా ఉన్నారు. . . . కళాశాలలో ఈ పఠనం యొక్క సమగ్రమైన ఉద్దేశం మీరు వెళ్లే ప్రాంతాలలో మీరు మరింత సమర్థవంతమైన పరిచారకులుగా ఉండేలా మిమ్మల్ని సిద్ధపరచడమే.”
నేను కొద్దిగానే చదువుకున్నందు వల్ల, మొదట్లో గిలియడ్ పాఠశాలలో ఇబ్బందిగా ఉండేది. కాని బోధకులు నా ఎడల సానుభూతి చూపించారు, నేను నా పఠనాలను ఎంతో ఆనందించనారంభించాను. ఐదు నెలల తీవ్రమైన శిక్షణ తరువాత మా తరగతి స్నాతకోత్సవం జరిగింది. ఆ తరువాత, మాలో కొంతమందిని న్యూయార్క్ నందలి బ్రూక్లిన్‌లో ఉన్న యెహోవాసాక్షుల ప్రపంచ ముఖ్య కార్యాలయానికి పంపించారు, అక్కడ ప్రయాణ పనిలో ప్రాంతీయ పైవిచారణకర్తలుగా సేవ చేయడానికి మమ్మల్ని సిద్ధపరిచేందుకు మాకు మరింత శిక్షణ ఇవ్వబడింది. ఉత్తర, దక్షిణ కరోలినాలో నాకు మొట్టమొదటి నియామకం లభించింది.
ఆ తొలి రోజుల్లో, ప్రాంతీయ పైవిచారణకర్త ఇంచుమించు ఎప్పుడూ ప్రయాణంలోనే ఉండేవాడు. సంఘం చిన్నదైతే మేము ఒక రోజు ఉండేవాళ్లం లేక సంఘం పెద్దదైతే రెండు రోజులు ఉండేవాళ్లం. అప్పుడున్న సంఘాలు చాలామట్టుకు చిన్నవే. కాబట్టి తరచూ దాదాపు అర్థరాత్రి వరకు సందర్శిస్తూ, ప్రశ్నలకు జవాబిస్తూ, రోజంతా వారితో గడిపిన తరువాత, తరవాతి సంఘానికి ప్రయాణించడానికి నేను మరుసటి ఉదయం ఐదు గంటలకే లేచేవాడిని. నేను ప్రాంతీయ పనిలో ఒక సంవత్సరం పాటు సేవచేశాను, తరువాత కొంతకాలం నేను టెన్నిస్సే మరియు న్యూయార్క్‌లలో పయినీరు సేవ చేశాను.
క్యూబాకు ఆ తరువాత ప్యూర్టోరికోకు
1945 మేలో ఇతరులనేకులతో పాటు, నా మొదటి విదేశీ మిషనరీ నియామకానికి, క్యూబాకు పంపించారు! ఆ సాయంకాలం క్యూబా ముఖ్యపట్టణమైన హవానా చేరిన తరువాత, మేము పత్రికలు పంచే పనిలో భాగం వహించాము. మేము సాంటా క్లారాలో ఇల్లు చూసుకొనేవరకు హవానాలోనే ఉండిపోయాము. ఆహారం, అద్దెలతో పాటు అన్ని అవసరతలకు మా నెలసరి భృతి ఒకొక్కరికి కేవలం 25 డాలర్లు మాత్రమే. అందుబాటులో ఉన్న వస్తువులతో ఫర్నిచర్‌ను మరియు మంచాలను తయారుచేసుకున్నాము, ఆపిల్ పళ్ల బాక్సులను సొరుగులుగా ఉపయోగించుకొనేవాళ్లము.
ఆ తరువాతి సంవత్సరంలో నన్ను ప్రాంతీయ పనికి నియమించారు. ఆ సమయంలో క్యూబా అంతా ఒకే సర్క్యూట్‌గా ఉండేది. నా కంటే ముందు అక్కడ పైవిచారణకర్తగా ఉన్న సహోదరుడు మంచి ఎత్తరి గనుక ఆయనకు నడక ఇష్టముండేది అందుచేత సహోదర సహోదరీలు ఆయనతోపాటు నడవడానికి నిజంగా పరుగెత్తవలసివచ్చేది. నిజంగా నేను కూడా అలానే ఉంటాననుకొని, వాళ్లు నా సందర్శనానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఒకే రోజు అందరూ పరిచర్యకు రాకుండా వారు గుంపులుగా విడిపోయి నాతో పనిచేయడానికి వంతులు తీసుకున్నారు. మొదటి రోజు ఒక గుంపు నన్ను దూర ప్రదేశానికి తీసుకువెళ్లింది; తరువాతి రోజున మరో గుంపు అలాగే మరో దూర ప్రదేశానికి తీసుకువెళ్లింది. సందర్శనం చివరలో నేను చాలా అలసిపోయాను, కాని నేను ఆనందించాను. ఆ సంఘానికి సంబంధించి నాకు తీపి జ్ఞాపకాలు ఉన్నాయి.
1950 కల్లా క్యూబాలో 7,000మంది రాజ్య ప్రచారకులున్నారు, మెక్సికోలో కూడా సుమారు అంతమందే ఉన్నారు. ఆ సంవత్సరం జూలైలో, న్యూయార్క్ పట్టణమందలి యాంకీ స్టేడియంలో జరిగిన దైవపరిపాలనా అభివృద్ధి అంతర్జాతీయ సమావేశానికి నేను హాజరయ్యాను. ఆ తరువాత, ప్యూర్టోరికోకు కొత్త మిషనరీ నియామకాన్ని నేను అందుకున్నాను. గిలియడ్ 12వ తరగతికి చెందిన కొత్త మిషనరీలలో, ప్యూర్టోరికోకు నాతో కలిసి విమానంలో ప్రయాణించిన వారిలో ఎస్టెల్లా మరియు తెల్మా వేక్లే ఉన్నారు.
ఎనిమిది సంవత్సరాల తరువాత ప్యూర్టోరికా నందలి బయామోన్లో జరిగిన ప్రాంతీయ సమావేశ విరామ సమయంలో అదే వేదికపైన ఎస్టెల్లా, నేను నిరాడంబరంగా వివాహం చేసుకున్నాము. వివాహానికి ముందు, తరువాత కూడా నేను ప్రాంతీయ పనిలో సేవ చేశాను. ప్యూర్టోరికోలో మేము ఉన్న పది సంవత్సరాల కంటే ఎక్కువ కాలంలో, ఎస్టెల్లా, నేను గొప్ప అభివృద్ధిని అంటే 500ల లోపేవున్న ప్రచారకులు 2,000 కంటే ఎక్కువకావడం చూశాము. మేము చాలామందికి సమర్పణా బాప్తిస్మాల వరకు సహాయం చేయగలిగాము, అనేక కొత్త సంఘాలను స్థాపించడంలో మేము భాగం వహించాము.
1960 డిసెంబరులో, న్యూయార్క్ నందలి బ్రూక్లిన్‌లో ఉన్న యెహోవాసాక్షుల ప్రపంచ ముఖ్యకార్యాలయం నుండి మిల్టన్ హెన్షెల్ వచ్చి ప్యూర్టోరికోను సందర్శించి, మిషనరీలతో మాట్లాడాడు. ఇతర నియామకానికి ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు రాగలరా అని అడిగాడు. అలా ముందుకు వచ్చిన వారిలో నేను ఎస్టెల్లా ఉన్నాము.
డొమినికన్ రిపబ్లిక్లో మా గృహం
మా కొత్త నియామకం డొమినికన్ రిపబ్లిక్లో, 1961 జూన్ 1న అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నాము. మే 30న, డొమినికన్ నియంత, రఫాయెల్ ట్రూజిల్లో హత్య చేయబడ్డాడు, ఆ దేశానికి విమాన రాకపోకలు రద్దుచేయబడ్డాయి. విమాన రాకపోకలు త్వరలోనే పునఃప్రారంభమవ్వడంతో, పథకం ప్రకారంగానే మేము జూన్ 1న డొమినికన్‌కు ప్రయాణించ గలిగాము.
మేము చేరుకొనేసరికి దేశం అల్లకల్లోలంగా ఉంది, సైనిక కార్యకలాపం ఎక్కువగా జరుగుతుంది. తిరుగుబాటు భయం ఉంది కనుక సైనికులు ప్రధాన రహదారిలో ప్రతీ ఒక్కరిని తనిఖీ చేస్తున్నారు. మమ్మల్ని అనేక చెక్పాయింట్ల దగ్గర ఆపారు, ప్రతీ చెక్‌పాయింట్ వద్ద మా సామాను తనిఖీ చేశారు. చిన్న వస్తువులతో సహా మా సూట్‌కేసులలో నుండి ప్రతీది బయటికి తీసారు. అలా డొమినికన్ రిపబ్లిక్ మాకు పరిచయం చేయబడింది.
లా రొమానాలో మా మొదటి నియామకానికి వెళ్లక ముందు, మేము ముఖ్యపట్టణమైన సాంటో డొమింగొలో కొన్ని వారాలు ఉన్నాము. ట్రుజిల్లో యొక్క నియంతృత్వ కాలంలో, యెహోవాసాక్షులు కమ్యూనిస్టులనీ, వాళ్లు ఎంతో చెడ్డ వాళ్లనీ ఆ ప్రజలకు చెప్పబడింది. దాని ఫలితంగా, సాక్షులు తీవ్రంగా హింసింపబడ్డారు, అయితే మేము కొద్దికొద్దిగా ఆ అభిప్రాయాన్ని తొలగించగలిగాము.
కొంతకాలం లా రొమానాలో పని చేసిన తరువాత, మేము మళ్లీ ప్రాంతీయ పనిలో సేవచేయడం మొదలు పెట్టాము. తరువాత, 1964లో, మమ్మల్ని శాంటియాగో పట్టణానికి మిషనరీలుగా నియమించారు. ఆ తరువాతి సంవత్సరంలో డొమినికన్ రిపబ్లిక్ తిరుగుబాటు జరిగింది, మళ్లీ దేశంలో అల్లకల్లోల పరిస్థితి ఏర్పడింది. ఆ యుద్ధ సమయంలో రాజకీయ కార్యాలకు పేరు పొందిన శాన్ ఫ్రాన్సిస్కో డి మాకొరిస్కు మమ్మల్ని బదిలీ చేశారు. ఏమైనప్పటికీ, ఏ ఆటంకం లేకుండా మేము స్వేచ్ఛగా ప్రకటించాము. రాజకీయ అస్థిరత ఉన్నప్పటికీ మేము కొత్త సంఘాన్ని కూడా ఏర్పరచాము. తరువాతి సంవత్సరాల్లో, శాంటియాగోలోని మా ప్రస్తుత గృహానికి తిరిగి నియమించబడక ముందు మా నియామకంలో ఎన్నో మార్పులను చవిచూశాము.
ఇక్కడ డొమినికన్ రిపబ్లిక్లో జరిగిన పనికి యెహోవా ఆశీర్వాదాలను మేము నిస్సందేహంగా చూశాము. 1961లో మేము వచ్చినప్పుడు, ఇక్కడ దాదాపు 600 మంది సాక్షులున్నారు మరియు 20 సంఘాలున్నాయి. ఇప్పుడు ఇంచుమించు 20,000 మంది ప్రచారకులు 300 కంటే ఎక్కువ సంఘాలలో దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నారు. 1997లో క్రీస్తు మరణ జ్ఞాపకార్ధానికి 81,277 మంది హాజరవ్వడం, మరింత అభివృద్ధికి గల అద్భుతమైన ఉత్తరాపేక్షలకు నిదర్శనంగా ఉంది. అది ప్రచారకుల సంఖ్యకు దాదాపు మూడున్నర రెట్లు ఎక్కువ!
ఇప్పుడు బలమైన జనాంగము
ఈ లోకపు నటన గతించుచున్నప్పటికి కూడా, యెహోవాసాక్షులు ప్రకటించే బైబిలు సందేశంలో మార్పులేదు. (1 కొరింథీయులు 7:31) యెహోవా ఇంకా దేవుడే, క్రీస్తు ఇంకా రాజే, మునుపెన్నటికన్నా స్పష్టంగా లోకానికి ఏకైక నిరీక్షణ రాజ్యమే.
అదే సమయంలో, దాదాపు 60 సంవత్సరాల క్రితం ఓరెగాన్ నందలి సాలెమ్లో ఆ కూటానికి నేను హాజరైనప్పటి నుండి ఇప్పటికి యెహోవా ప్రజలమధ్య అద్భుతమైన మార్పు వచ్చింది. గొప్ప సమూహము నిజంగా గొప్పదయ్యింది, వారు 50 లక్షలకంటే ఎక్కువమంది ఉన్నారు. “వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును” అని యెహోవా తన ప్రజల గురించి చెప్పినట్లుగానే అది జరిగింది.—యెషయా 60:22.
పూర్తికాల పరిచర్యలో దాదాపు 60 సంవత్సరాలు గడిపిన తరువాత, నా మిషనరీ నియామకంలో ప్రకటించడంలోనూ, బోధించడంలోనూ కొనసాగడమందున్న ఆనందాన్ని పొందడానికి నేను సంతోషిస్తున్నాను. ఆ పనిలో భాగం వహించడం, “ఎన్నికలేనివాడు బలమైన జనమ”వ్వడాన్ని చూడడం ఎంతటి గొప్ప ఆధిక్యత!
[21వ పేజీలోని చిత్రం]
డొమినికన్ రిపబ్లిక్లో నా భార్యతో