కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 11/1 పేజీలు 13-18
  • లోకంలోనే ఉన్నా దాని సంబంధులుకారు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • లోకంలోనే ఉన్నా దాని సంబంధులుకారు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రపంచాధిపత్యాల ఎదుగుదల
  • రానైవున్న దేవుని రాజ్యపాలన
  • “మృగము” యొక్క “ముద్ర”ను వేయించుకొనకపోవడం
  • “మృగము” మరియు “కైసరు”
  • మనస్సాక్షిపూర్వక పౌరులు
  • అంత్యదినాల్లో తటస్థంగా ఉంటున్న క్రైస్తవులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • దేవుడు, కైసరు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • రెండు భయంకరమైన మృగాలతో పోరాడుట
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
  • ప్రకటన పుస్తకం దేవుని శత్రువులకు ఏమౌతుందని చెప్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 11/1 పేజీలు 13-18

లోకంలోనే ఉన్నా దాని సంబంధులుకారు

“మీరు లోకసంబంధులు కారు . . . అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.”—యోహాను 15:19.

1. క్రైస్తవులకు లోకంతో ఏ సంబంధంవుంది, అయినా లోకం వారినెలా దృష్టిస్తుంది?

తన శిష్యులతో గడిపిన తన చివరిరాత్రి యేసు వారితో ఇలా చెప్పాడు: “మీరు లోకసంబంధులు కారు.” ఆయన ఏ లోకాన్ని గురించి మాట్లాడుతున్నాడు? “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” అని ఆయన ఇంతకుముందు ఓ సందర్భంలో చెప్పలేదా? (యోహాను 3:16) నిత్యజీవం కొరకు యేసునందు విశ్వాసముంచిన వారిలో వాళ్లు మొదటివారు కాబట్టి వాళ్లు స్పష్టంగా ఆ లోకసంబంధులై ఉన్నారు. అయితే, తన శిష్యులు లోకం నుండి వేరైవున్నారని ఇప్పుడు యేసు ఎందుకు చెప్పాడు? “మీరు లోకసంబంధులు కారు . . . అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది” అని కూడా ఆయన ఎందుకు చెప్పాడు?—యోహాను 15:19.

2, 3. (ఎ) క్రైస్తవులు ఏ “లోకసంబంధులుకారు”? (బి) క్రైస్తవులు సంబంధులుకాని ‘లోకాన్ని’ గురించి బైబిలు ఏమి చెబుతుంది?

2 బైబిలు “లోకము” (గ్రీకు, కాస్మోస్‌) అనే పదాన్ని వివిధ రీతుల్లో ఉపయోగిస్తుండడమే దీనికి జవాబైవుంది. ముందు శీర్షికలో వివరించినట్లుగా, కొన్నిసార్లు బైబిల్లో “లోకము” అనే పదం సామాన్య మానవజాతిని సూచిస్తుంది. దేవుడు ప్రేమించిన లోకమదే. మరి దానికొరకే యేసు మరణించాడు. అయితే, ది ఆక్స్‌ఫర్డ్‌ హిస్టరీ ఆఫ్‌ క్రిస్టియానిటీ ఇలా తెలియజేస్తోంది: క్రైస్తవ వ్యవహారికంలో “‘లోకము’ అనేది దేవుని నుండి వేరైపోయిన, ఆయనకు శత్రువైన దాని కొరకు ఉపయోగించబడిన ఓ పదం కూడా.” ఇదెలా వాస్తవం? కాథొలిక్‌ గ్రంథకర్త రొలాన్‌ మినరాట్‌, లా క్రాట్యాన్‌యా ల మోన్డ్‌ (క్రైస్తవులు, లోకము) అనే తన పుస్తకంలో ఇలా వివరిస్తున్నాడు: “లోకము అనేది ఓ ప్రతికూలమైన భావంలో తీసుకొనబడి, తమ కార్యకలాపాన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వాలు దేవునికి శత్రువులుగా ఉండే ఒక అధికార పరిధి . . .గా చూడబడింది. అది క్రీస్తు విజయవంతమైన పరిపాలనను వ్యతిరేకించడం ద్వారా సాతాను ఆధీనంక్రింద ఉన్న ఓ శత్రు సామ్రాజ్యాన్ని రూపొందిస్తుంది.” ఈ “లోకము” అనేది దేవుని నుండి వేరైన విస్తారమైన మానవులే. నిజ క్రైస్తవులు ఈ లోకసంబంధులు కారు, మరి అది వారిని ద్వేషిస్తుంది.

3 మొదటి శతాబ్దాంతానికల్లా, యోహాను ఇలా రాసినప్పుడు ఈ లోకం ఆయన మనస్సులో ఉంది: “ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.” (1 యోహాను 2:15, 16) ఆయన ఇలా కూడా రాశాడు: “మనము దేవుని సంబంధులమనియు, లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము.” (1 యోహాను 5:19) సాతానును “ఈ లోకాధికారి” అని యేసు పిలిచాడు.—యోహాను 12:31; 16:11.

ప్రపంచాధిపత్యాల ఎదుగుదల

4. ప్రపంచాధిపత్యాలు ఏ విధంగా ఉనికిలోనికి వచ్చాయి?

4 దేవున్నుండి వేరుపర్చబడ్డ ప్రస్తుత మానవ లోకం, నోవహు కాలంలో జరిగిన జలప్రళయానంతరం కొద్దికాలానికే అంటే నోవహు సంతానంలోని అనేకులు యెహోవా దేవున్ని ఆరాధించడాన్ని విడనాడినప్పటి నుండీ అభివృద్ధిచెందడం ఆరంభించింది. ‘యెహోవాయెదుట పరాక్రమము గల వేటగాడూ’ నగర నిర్మాణకుడూ అయిన నిమ్రోదు, ఆ కాలంలో ప్రముఖుడు. (ఆదికాండము 10:8-12) ఆ కాలంలో ఈ లోకంలోని అధికభాగం, చిన్న చిన్న నగర రాజ్యాలుగా వ్యవస్థీకరించబడింది. అవి అప్పుడప్పుడూ సంకీర్ణ రాజ్యాలుగా రూపొందేవి, ఒకదానిపై మరొకటి యుద్ధం చేసేవి. (ఆదికాండము 14:1-9) ప్రాంతీయాధిపత్యాలుగా ఆవిర్భవించేందుకు కొన్ని నగర రాజ్యాలు ఇతర రాజ్యాలపై అధికారాన్ని సంపాదించేవి. కొన్ని ప్రాంతీయాధిపత్యాలు చివరకు గొప్ప ప్రపంచాధిపత్యాలయ్యేంతగా ఎదిగాయి.

5, 6. (ఎ) బైబిలు చరిత్రలోని ఏడు ప్రపంచాధిపత్యాలు ఏవి? (బి) ఈ ప్రపంచాధిపత్యాలు ఏవిధంగా సూచనార్థకమైనవి, వాటికి అధికారం ఎక్కడ నుండి వచ్చింది?

5 నిమ్రోదు మాదిరిని అనుసరిస్తూ, ప్రపంచాధిపత్యాల పాలకులు యెహోవాను ఆరాధించలేదు. ఆ వాస్తవం వారి క్రూరమైన, హింసాత్మక క్రియల్లో ప్రతిబింబించింది. ఈ ప్రపంచాధిపత్యాలు లేఖనాల్లో క్రూరమృగాలచే సూచించబడ్డాయి. శతాబ్దాలయందంతటా, యెహోవా ప్రజలపై శక్తిమంతమైన ప్రభావాన్ని కల్గివున్న ఆరు ప్రపంచాధిపత్యాలను బైబిలు గుర్తించింది. ఇవి ఏమిటంటే ఐగుప్తు, అస్సీరియా, బబులోను, మాదీయులు పారసీకులు, గ్రీసు, రోము. రోము తర్వాత, ఏడవ ప్రపంచాధిపత్యం వస్తుందని ప్రవచించబడింది. (దానియేలు 7:3-7; 8:3-7, 20, 21; ప్రకటన 17:9, 10) ఇది బ్రిటీషు సామ్రాజ్యంతోనూ దాని మిత్రదేశమైన అమెరికాతోనూ అంటే చివరకు బ్రిటన్‌కు అధికార గ్రహణాన్ని పట్టించిన అమెరికాతోనూ రూపొందించబడ్డ ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యంగా రుజువైంది. చివరకు రోమా సామ్రాజ్యపు ఆఖరి జాడ కూడా కనుమరుగైపోయిన తర్వాత బ్రిటీష్‌ సామ్రాజ్యం అభివృద్ధిచెందడం ఆరంభించింది.a

6 ఒకదాని వెంబడి ఒకటిగా వచ్చే ఏడు ప్రపంచాధిపత్యాలు, ప్రకటన గ్రంథంలో అల్లకల్లోలిత మానవజాతి సముద్రం నుండి పైకి వస్తున్న ఏడుతలల క్రూరమృగం యొక్క తలలుగా సూచించబడ్డాయి. (యెషయా 17:12, 13; 57:20, 21; ప్రకటన 13:1) పరిపాలించే ఈ మృగానికి ఆ అధికారాన్ని ఎవరు ఇస్తారు? బైబిలు ఇలా జవాబిస్తోంది: “దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను.” (ప్రకటన 13:2) అపవాదియైన సాతానే ఆ ఘటసర్పం.—లూకా 4:5, 6; ప్రకటన 12:9.

రానైవున్న దేవుని రాజ్యపాలన

7. క్రైస్తవులు దేనియందు నిరీక్షణను ఉంచుతారు, లోక ప్రభుత్వాలతో వారి సంబంధాన్ని ఇదెలా ప్రభావితం చేస్తుంది?

7 దాదాపు 2,000 సంవత్సరాలుగా, క్రైస్తవులు ఇలా ప్రార్థించారు: “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.” (మత్తయి 6:9) దేవుని రాజ్యం మాత్రమే భూమిపై నిజమైన శాంతిని తేగలదని యెహోవాసాక్షులు ఎరుగుదురు. బైబిలు ప్రవచనాన్ని అతి సన్నిహితంగా గమనించేవారిగా, ఈ ప్రార్థనకు త్వరలోనే జవాబు ఇవ్వబడుతుందనీ, ఆ రాజ్యం త్వరలోనే భూ వ్యవహారాల్ని అదుపు చేస్తుందనీ వాళ్లు ఒప్పించబడ్డారు. (దానియేలు 2:44) వారు ఈ రాజ్యానికి హత్తుకొని ఉండడం, ప్రపంచ ప్రభుత్వాల వ్యవహారాల్లో వాళ్లు తటస్థంగా ఉండేలా చేస్తుంది.

8. కీర్తన 2లో ప్రవచించబడినట్లుగా, దేవునిరాజ్య పరిపాలనకు ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయి?

8 మత సూత్రాల్ని పాటిస్తున్నట్టు కొన్ని దేశాలు చెప్పుకుంటాయి. అయితే, యెహోవాయే విశ్వాధిపతి అనే వాస్తవాన్నీ, భూమిపై అధికారంతో పరలోకపు రాజుగా యేసును ఆయన సింహాసనాసీనున్ని చేశాడనే వాస్తవాన్నీ అవి ఆచరణరీత్యా అలక్ష్యంచేస్తున్నాయి. (దానియేలు 4:17; ప్రకటన 11:15) ప్రవచనాత్మక కీర్తన ఒకటి ఇలా తెలియజేస్తోంది: “మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మనయొద్దనుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని [యేసుకును] విరోధముగా నిలువబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు.” (కీర్తన 2:2, 3) తాము చెలాయించే జాతీయ సార్వభౌమాధిపత్యాన్ని పరిమితం చేసే ఏ దైవిక ‘కట్లనూ’ లేక ‘పాశాలనూ’ ప్రభుత్వాలు అంగీకరించవు. అందుకే, తాను ఏర్పర్చుకున్న రాజైన యేసుతో యెహోవా ఇలా చెబుతున్నాడు: “నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగులగొట్టినట్టు వారిని ముక్కచెక్కలుగా పగులగొట్టెదవు.” (కీర్తన 2:8, 9) అయినప్పటికీ, యేసు ఏ లోకం కొరకైతే మరణించాడో ఆ మానవ లోకం పూర్తిగా ‘పగులగొట్టబడదు.’—యోహాను 3:17.

“మృగము” యొక్క “ముద్ర”ను వేయించుకొనకపోవడం

9, 10. (ఎ) ప్రకటన గ్రంథంలో మనం దేన్ని గురించి హెచ్చరించబడ్డాం? (బి) ‘మృగము యొక్క ముద్ర’ ధరించడం దేన్ని సూచిస్తుంది? (సి) దేవుని సేవకులు ఏ ముద్రలను అంగీకరిస్తారు?

9 దేవుని నుండి వైదొలగిన మానవ లోకం “కొద్దివారు గాని గొప్పవారుగాని, ధనికులుగాని దరిద్రులుగాని, స్వతంత్రులుగాని దాసులుగాని, అందరును తమ కుడిచేతిమీదనైనను తమ నొసటియందైనను ముద్ర వేయించుకొనునట్లును, ఆ ముద్ర . . . గలవాడు తప్ప, క్రయ విక్రయములు చేయుటకు మరి యెవనికిని అధికారము లేకుండునట్లును . . . వారిని బలవంతము” చేస్తూ, అది దాని అంతానికి కొంచెంకాలం ముందు అంతకంతకూ కోరికల్ని కోరుతుందని అపొస్తలుడైన యోహాను పొందిన ప్రకటన హెచ్చరించింది. (ప్రకటన 13:16, 17) దీని భావమేమిటి? కుడిచేతిమీదనున్న ముద్ర, చురుకైన మద్దతుకు తగిన సూచనగా ఉంది. నొసటియందున్న ముద్ర సంగతేమిటి? ది ఎక్స్‌పొజిటర్స్‌ గ్రీక్‌ టెస్ట్‌మెంట్‌ ఇలా తెలియజేస్తుంది: “ఈ విపరీతాలంకార వ్యంగ్యోక్తి ఏమిటంటే ప్రస్పుటంగా కనబడే పచ్చబొట్టుతోనో లేక వాతతోనో . . . సైనికులకూ, బానిసలకూ ముద్రవేసే అలవాటే; లేక, రక్షరేకుగా ఓ దేవత నామాన్ని ధరించే మతపరమైన ఆచారమే.” అనేకమంది మానవులు తమను తాము ఆ “మృగము” యొక్క “దాసులు”గానో లేక “సైనికులు”గానో గుర్తింపచేసుకుంటూ ఈ గుర్తును తమ క్రియలద్వారా, మాటల ద్వారా సూచనార్థకంగా ధరిస్తున్నారు. (ప్రకటన 13:3, 4) వారి భవిష్యత్తు గురించైతే, థియొలాజికల్‌ డిక్షనరీ ఆఫ్‌ ది న్యూ టెస్ట్‌మెంట్‌ ఇలా చెబుతోంది: “ఆ మృగము యొక్క [ముద్రనూ], దాని పేరు కల్గివున్న మర్మమైన సంఖ్యనూ దేవుని శత్రువులు తమ నొసళ్లపై, ఒక చేతిపై వేయించుకునేందుకు అనుమతిస్తారు. ఇది వారికి ఆర్థిక, వాణిజ్యపరమైన గొప్ప అవకాశాల్ని ఇస్తుంది కానీ వారిని దేవుని మహోగ్రతకు గురిచేసి, వెయ్యేండ్ల రాజ్యం నుండి మినహాయిస్తుంది, ప్రక. 13:16; 14:9; 20:4.”

10 ఆ “ముద్ర”ను వేయించుకొనమనే ఒత్తిడిని నిరోధించేందుకు అత్యంత ధైర్యమూ, తాళుకునేశక్తీ కావాలి. (ప్రకటన 14:9-12) అయితే, దేవుని సేవకులకు అలాంటి శక్తివుంది. దీనినిబట్టే, వాళ్లు తరచూ ద్వేషించబడి, దూషించబడుతున్నారు. (యోహాను 15:18-20; 17:14, 15) ఆ మృగము యొక్క ముద్రను కల్గివుండడానికి బదులు, వాళ్లు “యెహోవావాడనని” తమ చేతులపై సూచనార్థకంగా రాసుకుంటారని యెషయా తెలియజేశాడు. (యెషయా 44:5) అంతేగాక, భ్రష్ట మతం జరిగించిన హేయకృత్యాల్ని చూసి వాళ్లు ‘మూల్గులిడుచు ప్రలాపిస్తారు’ గనుక, యెహోవా తీర్పులు అమలు చేయబడినప్పుడు తప్పించబడేందుకు యోగ్యులైనవారిగా తమను గుర్తిస్తున్న తమ లలాటములపై ఓ సూచనార్థక గురుతును వారు పొందుతారు.—యెహెజ్కేలు 9:1-7.

11. దేవుని రాజ్యం భూపరిపాలనాధిపత్యాన్ని తొలగించేంతవరకూ పరిపాలించేందుకై మానవ ప్రభుత్వాలకు అనుమతిని ఎవరు ఇస్తున్నారు?

11 క్రీస్తు పరలోక రాజ్యం, ఈ భూ పరిపాలనాధిపత్యాన్ని పూర్తిగా తొలగించేందుకై సమయం ఆసన్నమయ్యేంత వరకూ దేవుడు మానవ ప్రభుత్వాల్ని పరిపాలించడానికి అనుమతిస్తున్నాడు. ది స్టేట్‌ ఇన్‌ ది న్యూ టెస్ట్‌మెంట్‌ అనే తన పుస్తకంలో ప్రొఫెసర్‌ ఆస్కార్‌ కుల్‌మాన్‌ రాజకీయ ప్రభుత్వాల ఎడలగల ఈ దైవిక సహనాన్ని ఉదహరించాడు. ఆయన ఇలా రాశాడు: “ప్రభుత్వం ఎడల మొదటి క్రైస్తవుల వైఖరి సంగతంగా కనబడక అసంగతంగా కనబడేందుకు గల కారణం, ప్రభుత్వం యొక్క ‘తాత్కాలిక’ స్వభావం అనే సంకీర్ణ భావనే. అది అసంగతంగానే కనబడుతుందని నేను ఉద్ఘాటిస్తున్నాను. ప్రభుత్వాన్ని అగాధంలో నుండి వచ్చిన క్రూరమృగంగా వర్ణించిన ప్రకటన 13వ అధ్యాయంతో పాటూ ‘ప్రతివాడును పై అధికారులకు లోబడియుండ వలెను . . . ’ అని రోమీయులు 13:1లో ప్రస్తావించబడ్డ విషయం మాత్రమే మనకు కావాలి.”

“మృగము” మరియు “కైసరు”

12. మానవ ప్రభుత్వాల ఎడల యెహోవాసాక్షులు ఏ సమతుల్యమైన దృక్పథాన్ని కల్గివున్నారు?

12 ప్రభుత్వాధికారంలో ఉన్న మానవులందరూ సాతాను ఉపకరణాలేననే నిర్ధారణకు రావడం సరియైందికాదు. “వివేకముగలవా[డు]” అని బైబిల్లో వర్ణించబడిన అధిపతియైన సెర్గిపౌలు వంటి అనేకమంది తమ్మును తాము సూత్రబద్ధంగా జీవించే ప్రజలుగా రుజువుపర్చుకున్నారు. (అపొస్తలుల కార్యములు 13:7) యెహోవాను గురించీ ఆయన సంకల్పాల్ని గురించీ తెలియకపోయినప్పటికీ, కొంతమంది పాలకులు దేవుడు తమకు అనుగ్రహించిన మనస్సాక్షిచే నడిపించబడినవారై అల్పసంఖ్యాకుల హక్కుల్ని ధైర్యంగా పరిరక్షించారు. (రోమీయులు 2:14, 15) గుర్తుంచుకోండి, బైబిలు “లోకము” అనే మాటను రెండు విభిన్నరీతుల్లో ఉపయోగిస్తుంది: దేవుడు ప్రేమిస్తున్న, మనం ప్రేమించాల్సిన మానవ లోకం. యెహోవా నుండి వైదొలగిపోయి సాతాను దేవుడుగా కల్గివున్న, మనం వేరైవుండాల్సిన మానవ లోకం. (యోహాను 1:9, 10; 17:14; 2 కొరింథీయులు 4:4; యాకోబు 4:4) ఆ విధంగా, యెహోవా సేవకులు మానవ పరిపాలనాధిపత్యం ఎడల సమతూకమైన వైఖరిని కల్గివున్నారు. మనం దేవుని రాజ్య రాయబారులుగా లేక ప్రతినిధులుగా సేవచేస్తున్నాం గనుకా, మన జీవితాల్ని దేవునికి సమర్పించుకున్నాం గనుకా రాజకీయ విషయాల్లో మనం తటస్థంగా ఉంటాం. (2 కొరింథీయులు 5:20) మరోవైపున, అధికారంలో ఉన్నవారి ఎడల మనం మనస్సాక్షినిబట్టి విధేయత చూపిస్తాం.

13. (ఎ) మానవ ప్రభుత్వాల్ని యెహోవా ఎలా దృష్టిస్తాడు? (బి) మానవ ప్రభుత్వాల ఎడల క్రైస్తవ విధేయత ఎంతమేరకు ఉంటుంది?

13 ఈ సమతుల్యమైన వైఖరి, యెహోవా దేవుని స్వంత దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రపంచాధిపత్యాలు లేదా చిన్న దేశాలు సహితం తమ అధికారాన్ని దుర్వినియోగపర్చి, తమ ప్రజల్ని అణగద్రొక్కినప్పుడు లేక దేవున్ని ఆరాధించేవారిని హింసించినప్పుడు, అవి భయంకరమైన క్రూరమృగాలు అనే వాటిని గూర్చిన ప్రవచనాత్మక వర్ణనకు కచ్చితంగా సరిపోతాయి. (దానియేలు 7:19-21; ప్రకటన 11:7) అయితే, శాంతిభద్రతల్నీ న్యాయాన్నీ కాపాడడంలో జాతీయ ప్రభుత్వాలు దేవుని సంకల్పాన్ని నెరవేర్చినప్పుడు, ఆయన వాటిని తన ‘సేవకులుగా’ పరిగణిస్తాడు. (రోమీయులు 13:6) మానవ ప్రభుత్వాల్ని గౌరవించాలనీ, వాటికి లోబడాలనీ యెహోవా తన ప్రజలనుండి అపేక్షిస్తున్నాడు కానీ వారి విధేయతకు పరిమితుల్లేకుండా పోలేదు. మనుష్యులు దేవుని చట్టం నిషేధించిన వాటిని అంటే దేవుని సేవకులకు చెందిన వాటిని కోరినప్పుడుగానీ, లేక తన సేవకులు చెయ్యాలని దేవుడు కోరుతున్న వాటిని వాళ్లు నిషేధించినప్పుడుగానీ “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను” అని అపొస్తలులు ఎంచుకున్న స్థానాన్ని దేవుని సేవకులు అనుసరిస్తారు.—అపొస్తలుల కార్యములు 5:29.

14. మానవ ప్రభుత్వాలకు చూపే క్రైస్తవ విధేయతను యేసుక్రీస్తు ఎలా వివరించాడు? పౌలు ఎలా వివరించాడు?

14 “కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని” యేసు ప్రకటించినప్పుడు, తన అనుచరులు ప్రభుత్వాల ఎడలా, దేవుని ఎడలా బాధ్యతల్ని కల్గివుంటారని యేసు తెలియజేశాడు. (మత్తయి 22:21) అపొస్తలుడైన పౌలు ప్రేరేపించబడి ఇలా రాశాడు: “ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను. . . . నీవు చెడ్డది చేసినయెడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు; కీడు చేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహభయమునుబట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడియుండుట ఆవశ్యకము. . . . ఇందుకే గదా మీరు పన్నుకూడ చెల్లించుచున్నారు?” (రోమీయులు 13:1-7) సా.శ. మొదటి శతాబ్దం నుండీ నేటి వరకూ, క్రైస్తవులు ప్రభుత్వం చేసిన తీర్మానాల్ని పరిగణనలోనికి తీసుకోవాల్సి వచ్చింది. ఆ తీర్మానాలకు విధేయత చూపించడం తమ ఆరాధనతో రాజీపడేలా చేస్తుందా లేక అలాంటి తీర్మానాలు న్యాయసమ్మతమైనవేనా, మరి అవి మనస్సాక్షిపూర్వకంగా అనుసరించదగినవేనా అని వివేచించాల్సిన అవసరం వాళ్లకుంది.

మనస్సాక్షిపూర్వక పౌరులు

15. తాము కైసరుకు రుణపడివున్న దాన్ని యెహోవాసాక్షులు ఎలా మనస్సాక్షిపూర్వకంగా చెల్లిస్తారు?

15 రాజకీయ “ఉన్నతాధికారులు” దేవుడు అంగీకరించిన తమ పాత్రను అంటే ‘దుర్మార్గులకు ప్రతిదండన చేయడం సన్మార్గులకు మెప్పు కలుగజేయడం’ అనేది చేరివున్న పాత్రను నెరవేర్చేటప్పుడు వాళ్లు దేవుని “పరిచారకులు.” (1 పేతురు 2:13, 14) పన్నుల రూపంలో న్యాయసమ్మతంగా కైసరు అడుగుతున్న వాటిని యెహోవాసాక్షులు మనస్సాక్షిపూర్వకంగా అతనికి చెల్లిస్తారు, ‘అధిపతులకును అధికారులకును [“పాలకులుగా,” NW] లోబడి విధేయులుగా ఉండడంలో, ప్రతి సత్కార్యం చేయడానికి సిద్ధపడి ఉండడంలో’ వాళ్లు బైబిలు తర్ఫీదునొందిన తమ మనస్సాక్షి అనుమతించినంత మేరకు వెళతారు. (తీతు 3:1) “సత్కార్యము” అనే దానిలో దుర్ఘటనలు వంటివి జరిగినప్పుడు ఇతరులకు సహాయపడడం చేరివుంది. ఈ పరిస్థితుల్లో తోటి మానవుల ఎడల యెహోవాసాక్షులు చూపించిన దయను అనేకులు కళ్లారా చూశారు.—గలతీయులు 6:10.

16. ప్రభుత్వాలకూ, తోటి మానవులకూ ఏ మంచిపనిని యెహోవాసాక్షులు మనస్సాక్షిపూర్వకంగా చేస్తారు?

16 యెహోవాసాక్షులు తమతోటి మానవుల్ని ప్రేమిస్తారు. నీతియుక్తమైన “క్రొత్త ఆకాశము[లు], క్రొత్త భూమి” వచ్చేలాచేసే దేవుని సంకల్పాల్ని గూర్చిన కచ్చితమైన జ్ఞానాన్ని పొందడానికి తోటి మానవులకు సహాయపడడమే తాము వాళ్లకు చేయగల్గే మరింత ప్రయోజనకరమైన పని అని భావిస్తారు. (2 పేతురు 3:13) బైబిల్లోని ఉన్నత నైతిక సూత్రాల్ని బోధించడం ద్వారా, ప్రకటించడం ద్వారా, వాళ్లు మానవ సమాజానికొక ఆస్థియై ఉన్నారు. అనేకమందిని తప్పు దారి పట్టకుండా వారు కాపాడుతూ ఉన్నారు. యెహోవా సేవకులు చట్టానికి లోబడే ప్రజలు. ‘ఘనతను కోరుకునే వారికి’ ఘనతనిస్తూ ప్రభుత్వ మంత్రుల ఎడలా, అధికారుల ఎడలా, న్యాయాధిపతుల ఎడలా, నగరాధికార్ల ఎడలా గౌరవం చూపిస్తారు. (రోమీయులు 13:7, NW) తమ పిల్లలు చదివే స్కూల్లోని ఉపాధ్యాయులతో సాక్షులైన తల్లిదండ్రులు సహకరించడానికి సంతోషిస్తారు, భవిష్యత్తులో తమ పిల్లలు సమాజానికో భారంగా గాక, బ్రతుకుతెరువును సంపాదించుకునేలా బాగా చదువుకునేందుకు వాళ్లకు సహాయపడతారు. (1 థెస్సలొనీకయులు 4:11, 12) తమ సంఘాల్లో, జాతి దురభిమాన, వర్గ వైషమ్యాలు తలెత్తకుండా వ్యతిరేకిస్తారు. వాళ్లు కుటుంబ జీవితాన్ని బలపర్చుకునేందుకు గొప్ప ప్రాముఖ్యతను ఇస్తారు. (అపొస్తలుల కార్యములు 10:34, 35; కొలొస్సయులు 3:18-21) కాబట్టి, కుటుంబ వ్యతిరేకులుగానో, సమాజానికి సహాయపడనివారిగానో వారిపై మోపిన నిందలు అబద్ధాలని వాళ్లు తమ క్రియలవల్ల చూపిస్తారు. ఆ విధంగా, అపొస్తలుడైన పేతురు మాటలు నిజమని రుజువౌతాయి: “ఏలయనగా మీరిట్లు యుక్తప్రవర్తనగలవారై, అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరుమూయుట దేవుని చిత్తము.”—1 పేతురు 2:15.

17. క్రైస్తవులు ‘వెలుపటి వారియెడల జ్ఞానము కలిగి’ ఎలా ‘నడుచుకుంటారు’?

17 కాబట్టి క్రీస్తు నిజమైన అనుచరులు “లోకసంబంధులు కారు” అయినా వాళ్లింకా మానవ సమాజ లోకంలోనే ఉన్నారు. వాళ్లు “వెలుపటి వారియెడల జ్ఞానము కలిగి నడుచు”కోవాలి. (యోహాను 17:16; కొలొస్సయులు 4:5) తన సేవకులుగా పనిచేసేందుకు ఉన్నతాధికారాల్ని యెహోవా అనుమతించినంత వరకూ, వాటి ఎడల సరియైన గౌరవాన్ని మనం చూపిస్తాం. (రోమీయులు 13:1-4) రాజకీయాలకు సంబంధించి తటస్థంగా ఉన్నప్పటికీ, “రాజు[లు] అధికారు[లు]” ఆరాధనా స్వాతంత్రాన్ని ప్రభావితం చేయగల్గే నిర్ణయాల్ని తీసుకునేందుకు పిలుపునిచ్చినప్పుడు వాళ్లని గౌరవిస్తూ మనం ప్రార్థిస్తాం. “మనుష్యులందరు రక్షణపొం[దేలా]” “మనము సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము” మనం దీనిని చేయడంలో కొనసాగుతాం.—1 తిమోతి 2:1-4.

[అధస్సూచీలు]

a వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! పుస్తకంలో 35వ అధ్యాయాన్ని చూడండి.

పునఃసమీక్ష కొరకైన ప్రశ్నలు

◻ క్రైస్తవులు ఏ “లోకసంబంధులు,” అయితే వారు ఏ “లోకసంబంధులు”గా ఉండలేరు?

◻ ఒక వ్యక్తి చేతిపైగానీ లేక నొసటిపైగానీ ఉన్న మృగం యొక్క “ముద్ర” దేనికి సూచనార్థకంగా ఉంది, యెహోవా నమ్మకమైన సేవకులు ఏ ముద్రలను కల్గివున్నారు?

◻ మానవ ప్రభుత్వాల ఎడల నిజ క్రైస్తవులు ఏ సమతుల్యమైన దృక్పథాన్ని కల్గివున్నారు?

◻ మానవ సమాజ శ్రేయస్సుకు యెహోవాసాక్షులు దోహదపడే కొన్ని మార్గాలేవి?

[16వ పేజీలోని చిత్రం]

బైబిలు మానవ ప్రభుత్వాల్ని క్రూరమృగాలుగానూ, దేవుని సేవకులుగానూ గుర్తిస్తుంది

[17వ పేజీలోని చిత్రం]

ఇతరుల ఎడల ప్రేమపూర్వకమైన శ్రద్ధ చూపిస్తున్నందున, యెహోవాసాక్షులు తమ సమాజాలకొక ఆస్థియై ఉన్నారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి