“ఎపికూరీయులు” ఉన్నారు జాగ్రత్త
“ఆయనెంత మంచి వాడో! ఆయన ఉన్నతమైన నైతిక ప్రమాణాల ప్రకారం జీవిస్తాడు. ఆయన పొగత్రాగడు, మత్తు పదార్థాలు తీసుకోడు, అసభ్యమైన పదజాలం ఉపయోగించడు. వాస్తవానికి, ఆయన క్రైస్తవులమని చెప్పుకునే కొందరికన్నా ఎంతో మంచివాడు!”
తాము కల్గియున్న అనుచితమైన స్నేహాలను సమర్థించుకోవడానికి కొంతమంది ఆవిధమైన తర్కాన్ని ఉపయోగించడం మీరు విన్నారా? లేఖనాధార పరిశీలనలో అది నిలుస్తుందా? తొలి క్రైస్తవ సంఘంలోని ఒక ఉదాహరణ ఈ విషయంపై వెలుగును ప్రసరింపజేస్తుంది.
మొదటి శతాబ్దంలో, అపొస్తలుడైన పౌలు కొరింథు సంఘాన్ని ఇలా హెచ్చరించాడు: “మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.” బహుశా, ఎపికూరీయులతో సహా గ్రీకు తత్వంచే ప్రభావితమైన వ్యక్తులతో కొంతమంది క్రైస్తవులు సన్నిహిత సహవాసం కలిగివుండవచ్చు. ఎపికూరీయులు ఎవరు? వారు కొరింథు సంఘంలోని క్రైస్తవులకు ఎందుకు ఆధ్యాత్మిక ప్రమాదాన్ని కలిగించగలరు? మనం జాగ్రత్త కలిగివుండ వలసినటువంటి ప్రజలు నేడూ ఉన్నారా?—1 కొరింథీయులు 15:33.
ఎపికూరీయులు ఎవరు?
ఎపికూరీయులు సా.శ.పూ. 341 నుండి 270 వరకు జీవించిన గ్రీకు తత్వవేత్తయైన ఎపికూరస్ అనుచరులు. జీవితంలోని అసలైన లేక ముఖ్యమైన మంచి, ఆనందమేనని ఆయన బోధించాడు. అంటే ఎపికూరీయులు మంచి సమయాన్ని ఎల్లప్పుడూ వెదికే దృష్టితో హీనమైన ఆచారాలను అనుసరిస్తూ, ఏ కట్టడలూ లేకుండా విచ్చలవిడి జీవితాన్ని జీవించేవారని దాని భావమా? ఆశ్చర్యకరంగా, ఎపికూరస్ అలాంటి జీవితాన్ని గడపమని తన అనుచరులకు బోధించలేదు! బదులుగా, వివేకం, ధైర్యం, ఆశానిగ్రహం, న్యాయానుసారంగా జీవించడం ద్వారా ఆనందాన్ని చక్కగా కనుగొనవచ్చని ఆయన బోధించాడు. తక్షణ, క్షణిక ఆనందాన్ని కాదుగాని జీవితాంతం నిలిచే ఆనందాన్ని అన్వేషించమని ఆయన సిఫారసు చేశాడు. కాబట్టి ఘోర పాపాలు చేస్తున్నవారితో పోల్చినప్పుడు ఎపికూరీయులు నీతిమంతులుగా కనిపించి ఉండవచ్చు.—తీతు 1:12 పోల్చండి.
క్రైస్తవత్వాన్ని పోలినదా?
మీరు తొలి కొరింథు సంఘంలో ఒక సభ్యులైతే, ఎపికూరీయుల వల్ల మీరు ప్రభావితమై ఉండేవారా? ఎపికూరీయుల నైతికతలు ఉన్నతమైనవిగా కనిపించేవి గనుక క్రైస్తవులు వారితో సహవసించడంలో ప్రమాదమేమీ లేదని కొందరు తర్కించివుండవచ్చు. కొరింథీయులు తమ తర్కాన్ని కొనసాగిస్తూ, ఎపికూరీయుల ప్రమాణాలకు దేవుని వాక్యంలోని ప్రమాణాలకు పోలికగా ఉన్నవాటిని సూచించివుండవచ్చు.
ఉదాహరణకు, ఎపికూరీయులు ఆనందాన్వేషణలో మితం కలిగి ఉండేవారు. వాళ్లు శారీరక ఆనందాల కంటే మానసిక ఆనందాలను విలువైనవిగా ఎంచేవారు. ఒక వ్యక్తి ఏమి తిన్నాడు అనేది ప్రాముఖ్యం కాదుగానీ ఆ వ్యక్తి ఎవరితో కలిసి దాన్ని తింటాడు అనేది ప్రాముఖ్యం. ఎపికూరీయులు చివరికి రాజకీయాల్లో భాగం వహించడం, రహస్యంగా తప్పు చేయడం వంటివి కూడా నివారించేవారు. “వాళ్లు మనలానే ఉన్నారు” అనుకోవడం ఎంత సుళువై ఉండేదో కదా!
అయితే, ఎపికూరీయులు నిజంగానే తొలి క్రైస్తవులలాగానే ఉండేవారా? ఎంతమాత్రం కాదు. సరైన విధంగా సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు గలవారు గమనార్హమైన తేడాలను కనుగొనగలిగేవారు. (హెబ్రీయులు 5:14) మీరు కనుగొనగలరా? ఎపికూరస్ బోధలను మనం నిశితంగా పరిశీలిద్దాము.
ఎపికూరీయుల తత్వం యొక్క చీకటి కోణం
దేవతల భయాన్ని, మరణ భయాన్ని అధిగమించడానికి ప్రజలకు సహాయం చేసేందుకు ఎపికూరస్, దేవుళ్లకు మానవజాతి ఎడల ఆసక్తి లేదని, వాళ్లు మానవుల విషయాల్లో జోక్యం చేసుకోరని బోధించాడు. ఎపికూరస్ ప్రకారం, దేవుళ్లు విశ్వాన్ని సృష్టించలేదు, జీవం ప్రమాదవశాత్తు ఉనికిలోకి వచ్చింది. సృష్టికర్తయైన “ఒక్కడే దేవుడు” ఉన్నాడని, ఆయన తన మానవ ప్రాణుల గురించి శ్రద్ధ కలిగివున్నాడని బైబిలు చేస్తున్న బోధకు ఇది స్పష్టంగా వ్యతిరేకంగా లేదా?—1 కొరింథీయులు 8:6; ఎఫెసీయులు 4:6; 1 పేతురు 5:6, 7.
మరణం తర్వాత జీవితం ఉండదని కూడా ఎపికూరస్ బోధించాడు. అయితే ఇది పునరుత్థానాన్ని గూర్చిన బైబిలు బోధకు విరుద్ధంగా ఉంది. వాస్తవానికి, అపొస్తలుడైన పౌలు అరేయొపగు వద్ద మాట్లాడినప్పుడు, పునరుత్థాన సిద్ధాంతాన్ని గూర్చి పౌలుతో ఏకీభవించనివారిలో ఎపికూరీయులు కూడా ఉండివుండవచ్చు.—అపొస్తలుల కార్యములు 17:18, 31, 32; 1 కొరింథీయులు 15:12-14.
ఎపికూరస్ తత్వంలోని అత్యంత ప్రమాదకరమైన అంశం బహుశా అత్యంత కుయుక్తితో కూడినదై ఉండవచ్చు. మరణం తర్వాతి జీవితాన్ని గూర్చిన ఆయన నిరాకరణ, మానవుడు భూమిపై జీవించే స్వల్ప కాలంలో సాధ్యమైనంత సంతోషంగా జీవించాలనే ముగింపుకు ఆయన వచ్చేలా చేసింది. మనం చూసినట్లుగా, ఆయన ఉద్దేశం పాపపు జీవితాన్ని గడపాలన్నది కాకపోవచ్చు గానీ, మరణం తరువాతి జీవితం లేదు గనుక ప్రస్తుతాన్ని పూర్తిగా ఆనందించాలన్నదే.
కాబట్టి, ప్రస్తుత ఆనందానికి కచ్చితమైన ముప్పును అంటే, దొరికిపోతామేమోననే భయాన్ని తప్పించుకోవడానికి ఎపికూరస్ రహస్యంగా తప్పులు చేయడాన్ని నిరుత్సాహపరిచాడు. ప్రస్తుత ఆనందానికి మరో అడ్డంకైన స్వేచ్ఛావిహారం యొక్క పరిణామాలను తప్పించుకోవడానికి ఆయన మితాన్ని ప్రోత్సహించాడు. పరస్పర సహకారం ప్రయోజనకరమైనది గనుక ఆయన ఇతరులతో మంచి సంబంధాలు కలిగివుండడాన్ని కూడా ప్రోత్సహించాడు. నిజమే, రహస్యంగా తప్పు చేయడాన్ని నివారించడం, మితాన్ని పాటించడం, స్నేహాలను వృద్ధిచేసుకోవడం మెచ్చుకొనదగినవే. అయితే మరి ఎపికూరస్ తత్వం ఒక క్రైస్తవునికి ఎందుకు ప్రమాదకరమైనది? ఎందుకంటే ఆయన ఉపదేశం “రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము” అనే అవిశ్వాసపు దృక్కోణంపై ఆధారపడివుంది.—1 కొరింథీయులు 15:32.
నిజమే, ప్రజలు ఇప్పుడు ఆనందంగా ఎలా జీవించవచ్చో బైబిలు చూపిస్తుంది. అయితే, అదిలా ఉపదేశిస్తుంది: “నిత్యజీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరముకొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని యుండుడి.” (యూదా 20) అవును, క్షణికమైన ప్రస్తుతం కొరకు కాదుగానీ నిరంతర భవిష్యత్తుకు బైబిలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. ఒక క్రైస్తవునికి, దేవుని సేవ చేయడం ప్రాముఖ్యమైనది, దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు అతడు ఆనందాన్ని, సంతృప్తిని పొందుతాడు. అదేవిధంగా, యేసు తన స్వంత వ్యక్తిగత విషయాల్లో నిమగ్నమై ఉండే బదులు, నిస్వార్థంగా యెహోవా సేవ చేయడంలోనూ ప్రజలకు సహాయం చేయడంలోనూ తన శక్తిసామర్థ్యాలను వెచ్చించాడు. ప్రతిఫలంగా తిరిగి ఏదో పొందుతామనే ఆశతో కాదుగానీ ఇతరుల ఎడల నిజమైన ప్రేమతో వారికి మంచి చేయమని ఆయన తన శిష్యులకు బోధించాడు. స్పష్టంగా, ఎపికూరీయుల తత్వం, క్రైస్తవత్వం యొక్క మూల దృక్పథాలకు పూర్తిగా భిన్నమైనది.—మార్కు 12:28-31; లూకా 6:32-36; గలతీయులు 5:14; ఫిలిప్పీయులు 2:2-4.
ఒక మోసకరమైన అపాయం
ఆనందంగా ఉండడానికి ఎపికూరీయులు అంత ప్రాధాన్యతనిచ్చినప్పటికీ, వాళ్లు ఎక్కువ సంతోషాన్ని పొందలేదన్నది హాస్యాస్పదం. “యెహోవాయందు ఆనందించుట” కొరవడినందున, జీవితం ఒక “చేదు బహుమానం” అని ఎపికూరస్ అన్నాడు. (నెహెమ్యా 8:10) పోల్చిచూస్తే, తొలి క్రైస్తవులు ఎంత ఆనందంగా ఉండేవారో కదా! యేసు, లేమితో దుఃఖకరమైన జీవితాన్ని గడపాలని సిఫారసు చేయలేదు. వాస్తవానికి, ఆయన విధానాన్ని అనుసరించడం గొప్ప ఆనందానికి మార్గం.—మత్తయి 5:3-12.
ఎపికూరీయుల ఆలోచనా విధానంచే ప్రభావితమైనవారితో సహవసించగలమని, అందువల్ల తమ విశ్వాసం పాడవ్వదని కొరింథు సంఘంలోని కొంతమంది సభ్యులు తలంచివుంటే, వారు పొరపాటు పడినట్లే. పౌలు కొరింథీయులకు తన మొదటి పత్రికను వ్రాసే సమయానికి, వారిలో కొందరు అప్పటికే పునరుత్థానంలో విశ్వాసాన్ని కోల్పోయారు.—1 కొరింథీయులు 15:12-19.
నేడు ఎపికూరీయులు ఉన్నారా?
ఎపికూరస్ తత్వం సా.శ. నాలుగవ శతాబ్దంలోనే అంతర్ధానమైనప్పటికీ, ప్రస్తుతం కొరకే జీవించడం వంటి దృక్పథాన్నే నేడు అలవర్చుకునేవారు ఉన్నారు. ఈ ప్రజలు నిత్యజీవాన్ని గూర్చిన దేవుని వాగ్దానమందు అతి తక్కువ విశ్వాసాన్ని ఉంచుతారు లేక అసలే విశ్వసించరు. అయినప్పటికీ, వారిలో కొందరు ఎంతో ఉన్నతమైన ప్రవర్తనా ప్రమాణాలను కలిగివున్నారు.
బహుశా, వారిలోని మంచి లక్షణాలను బట్టి వారితో స్నేహం చేయడం సహేతుకమైనదేనని తర్కించడం ద్వారా ఒక క్రైస్తవుడు అలాంటివారితో సన్నిహిత సంబంధం ఏర్పరచుకోవడానికి శోధింపబడవచ్చు. అయితే, మనల్ని మనం ఉన్నతమైనవారిగా పరిగణించుకోకుండా—ఎంతో మోసకరమైన ప్రభావం గలవారితో సహా—అన్ని రకాలైన ‘చెడు సహవాసాలూ మంచి నడవడిని చెరుపుతాయని’ మనం మనస్సులో ఉంచుకోవాలి.
ప్రస్తుతం కొరకు జీవించడమనే తత్వం కొన్ని వ్యాపార సమావేశాల్లో, స్వయం సహాయక పుస్తకాల్లో, నవలల్లో, చలనచిత్రాల్లో, టీవీ కార్యక్రమాల్లో, సంగీతంలో కూడా తలెత్తుతుంది. ఈ అవిశ్వాస దృక్పథం పాపభరిత ప్రవర్తనను సూటిగా పెంపొందింప జేయక పోయినప్పటికీ, ఇది మోసకరమైన మార్గాల్లో మనల్ని ప్రభావితం చేయగలదా? ఉదాహరణకు, యెహోవా సర్వాధిపత్య వివాదాంశాన్ని మరిచిపోయేంతగా మనం స్వయం సంతృప్తిలో మునిగిపోగలమా? ‘ప్రభువు కార్యాభివృద్ధియందు ఆసక్తి’ కల్గివుండే బదులు మనం ‘పరిచర్య ఎక్కువగా చేయకపోవడమనే’ తప్పుమార్గం పట్టగలమా? లేక యెహోవా ప్రమాణాల కచ్చితత్వాన్ని, ప్రయోజనాలను సందేహించేలా మోసగించబడగలమా? పూర్తి అవినీతి, హింస, అభిచారం వంటివాటి ప్రభావాన్ని మరియు లోకసంబంధ దృక్పథాలచే ప్రభావితమైనవారి ప్రభావాన్ని నివారించడం గురించి మనం జాగ్రత్త కలిగివుండవలసిన అవసరం ఉంది.—1 కొరింథీయులు 15:58; కొలొస్సయులు 2:8.
కాబట్టి, యెహోవా నడిపింపును పూర్ణహృదయంతో అనుసరిస్తున్నవారితో మనం ప్రాథమికంగా సహవాసాన్ని ఏర్పరచుకుందాము. (యెషయా 48:17) ఫలితంగా, మన ఉపయోగకరమైన అలవాట్లు బలపర్చబడతాయి. మన విశ్వాసం దృఢపర్చబడుతుంది. నిత్యజీవాన్ని దృష్టిలో ఉంచుకుని, మనం ఇప్పుడు ఆనందంగా జీవిస్తాము.
[24వ పేజీలోని చిత్రం]
దేవుళ్లకు మానవజాతి ఎడల ఆసక్తిలేదని ఎపికూరస్ బోధించాడు
[క్రెడిట్ లైను]
Courtesy of The British Museum