కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 11/1 పేజీలు 8-13
  • క్రైస్తవులు, మానవ లోకం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్రైస్తవులు, మానవ లోకం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసు చూపిన మాదిరి
  • “వెలుపటి” ప్రజల ఎడల పౌలు దృక్పథం
  • యూదులుకాని విశ్వాసులకు సహాయపడడం
  • “అవిశ్వాసుల” మధ్య ప్రకటించడం
  • నేడు ‘సమస్త మనుష్యులను’ కాపాడేందుకు ప్రయత్నించడం
  • లోకాన్నే మార్చిన ఒక బైబిలు అనువాదం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • పౌలును ఆదర్శంగా తీసుకొని క్రైస్తవులుగా ఎదగండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • మీరు ప్రజల్ని ఎలా చూస్తున్నారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • యెహోవా వాక్యము వ్యాపించుట!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 11/1 పేజీలు 8-13

క్రైస్తవులు, మానవ లోకం

“సంఘమునకు వెలుపటి వారియెడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి.”—కొలొస్సయులు 4:5.

1. తన అనుచరులకు సంబంధించీ, లోకానికి సంబంధించీ యేసు ఏమి చెప్పాడు?

తన పరలోకపు తండ్రికి చేసిన ప్రార్థనలో, యేసు తన అనుచరులను గురించి ఇలా తెలియజేశాడు: “నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును.” అటు తర్వాత ఆయనిలా అన్నాడు: “నీవు లోకములో నుండి వారిని తీసికొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను.” (యోహాను 17:14, 15) ఉదాహరణకు, క్రైస్తవులు సన్యాసి మఠాల్లో ఏకాకులుగా ఉంటూ లోకం నుండి భౌతికంగా వేరైవుండాలని కాదు. బదులుగా, “భూదిగంతముల వరకు” ఆయనకు సాక్షులుగా ఉండడానికి క్రీస్తు ‘వారిని లోకములోనికి పంపించాడు.’ (అపొస్తలుల కార్యములు 1:8; యోహాను 17:18) అంతేగాక, “ఈ లోకాధికారి” అయిన సాతాను క్రీస్తు నామాన్నిబట్టి వాళ్లపైకి ద్వేషాన్ని పురికొల్పాడు గనుక వాళ్లను కాపాడమని ఆయన దేవున్ని అర్థించాడు.—యోహాను 12:31; మత్తయి 24:9.

2. (ఎ) “లోకము” అనే మాటను బైబిలు ఎలా ఉపయోగిస్తుంది? (బి) లోకము ఎడల యెహోవా ఏ సమతుల్యమైన దృక్పథాన్ని చూపించాడు?

2 బైబిల్లో “లోకము” (గ్రీకు, కాస్మోస్‌) అనే మాట, తరచూ “దుష్టుని యందున్న” అవినీతితో కూడిన మానవ సమాజాన్ని సూచిస్తుంది. (1 యోహాను 5:19) క్రైస్తవులు యెహోవా ప్రమాణాలకు అనుగుణంగా ప్రవర్తించి, అలాగే లోకానికి దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలనే ఆజ్ఞను లక్ష్యపెడతారు గనుక, కొన్నిసార్లు వారికీ లోకానికీ మధ్య ఉన్న సంబంధం సంక్లిష్టంగా ఉంటుంది. (2 తిమోతి 3:12; 1 యోహాను 3:1, 13) అయితే, కాస్మోస్‌ అనే మాట, సాధారణంగా మానవజాతి కుటుంబాన్ని సూచించడానికి కూడా లేఖనాల్లో ఉపయోగించబడింది. ఈ భావంలో లోకాన్ని గూర్చి మాట్లాడుతూ యేసు ఇలా అన్నాడు: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు.” (యోహాను 3:16, 17; 2 కొరింథీయులు 5:19; 1 యోహాను 4:14) కాబట్టి సాతాను దుష్టవిధానాన్ని సూచించే వాటిని ద్వేషించినప్పటికీ, “మారుమనస్సు పొంద”బోయే వారందరినీ రక్షించేందుకు యెహోవా భూమిపైకి తన కుమారుని పంపించడం ద్వారా మానవజాతి ఎడల తనకుగల ప్రేమను చూపించాడు. (2 పేతురు 3:9; సామెతలు 6:16-19) లోకం ఎడల యెహోవా కల్గివున్న సమతుల్యమైన దృక్పథం, ఆయన ఆరాధికుల్ని నడిపించాలి.

యేసు చూపిన మాదిరి

3, 4. (ఎ) పరిపాలనాధిపత్యానికి సంబంధించి యేసుక్రీస్తు ఏ స్థానాన్ని అంగీకరించాడు? (బి) యేసు మానవ లోకాన్ని ఎలా దృష్టించాడు?

3 తన మరణానికి కొంచెం ముందు, పొంతి పిలాతుతో యేసు ఇలా చెప్పాడు: “నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు.” (యోహాను 18:36) ఈ మాటలకు పొందికగా, ఆయనకు లోక రాజ్యాలపై అధికారం ఇస్తానని సాతాను చేసిన ప్రతిపాదనను యేసు అంతకు మునుపు తిరస్కరించాడు, అలాగే తనను రాజుగా చేసేందుకు యూదుల్ని అనుమతించకుండా తిరస్కరించాడు. (లూకా 4:5-8; యోహాను 6:14, 15) కానీ, మానవ లోకం ఎడల యేసు గొప్ప ప్రేమను చూపించాడు. అపొస్తలుడైన మత్తయి దీనిని గూర్చిన మాదిరిని ఇలా నివేదించాడు: “ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరప[డ్డాడు.]” ప్రేమనుబట్టి, వారి పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ ప్రజలకు బోధించాడు. ఆయన వారికి బోధించి, వారి రోగాల్ని స్వస్థపర్చాడు. (మత్తయి 9:36) నేర్చుకోవడానికి తన దగ్గరకు వచ్చినవారి భౌతిక అవసరాల ఎడల కూడా ఆయన శ్రద్ధచూపించాడు. మనమిలా చదువుతాం: “యేసు తన శిష్యులను పిలిచి—ఈ జనులు నేటికి మూడు దినములనుండి నాయొద్దనున్నారు; వారికి తిననేమియు లేదు గనుక వారిమీద కనికరపడుచున్నాను; వారు మార్గములో మూర్చపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చె[ప్పెను.]” (మత్తయి 15:32) ఎంతటి ప్రేమపూర్వకమైన శ్రద్ధో కదా!

4 సమరయుల ఎడల యూదులు తీవ్రమైన దురభిమానాన్ని కల్గివుండేవారు. కానీ యేసు సమరయస్త్రీతో చాలాసేపు మాట్లాడి, సమరయుల పట్టణంలో సమగ్రమైన సాక్ష్యాన్ని ఇస్తూ రెండు రోజులు గడిపాడు. (యోహాను 4:5-42) “ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱెలయొద్దకే” దేవుడు ఆయనను పంపినప్పటికీ, యూదా మతేతర వ్యక్తులు కనుపరచిన విశ్వాసానికి యేసు అప్పుడప్పుడూ ప్రతిస్పందించాడు. (మత్తయి 8:5-13; 15:21-28) అవును, యేసు ‘లోకసంబంధి కాకుండానే’ మానవ లోకం ఎడల అంటే ప్రజల ఎడల ప్రేమను చూపించడం సాధ్యమేనని కనపర్చాడు. మనం నివసించే, పనిచేసే, లేక షాపింగ్‌చేసుకునే స్థలాల్లో ఉన్న ప్రజల ఎడల మనం అదే విధంగా కనికరాన్ని చూపిస్తామా? వారి క్షేమాభివృద్ధి ఎడల—ఆధ్యాత్మిక అవసరతల ఎడల మాత్రమేగాక మరితర అవసరతల ఎడల అంటే ఆ అవసరతలు సహేతుకమైనవై, మన శక్తికిమించినవికాకపోతే వాటి ఎడల కూడా మనం శ్రద్ధ చూపిస్తామా? యేసు శ్రద్ధ చూపించాడు, అలా చూపించడం ద్వారా ఆయన దేవుని రాజ్యాన్ని గూర్చి ప్రజలకు బోధించడానికి మార్గాన్ని తెరిచాడు. నిజమే, యేసు చేసినట్లుగా మనం అక్షరార్థమైన అద్భుతాల్ని చేయలేకపోవొచ్చు. కానీ చెప్పాలంటే దయగల పని పక్షపాతవైఖరిని నిష్ఫలంచేయడంలో తరచూ అద్భుతాల్ని సృష్టిస్తుంది.

“వెలుపటి” ప్రజల ఎడల పౌలు దృక్పథం

5, 6. “వెలుపటివా[రు]” అయిన యూదులతో అపొస్తలుడైన పౌలు ఎలా వ్యవహరించాడు?

5 అపొస్తలుడైన పౌలు తన అనేక పత్రికలలో “వెలుపలివా[రు]” లేక “వెలుపటి వారు” అని సూచించాడు, అంటే వాళ్లు యూదులైనా లేక అన్యులైనా సరే క్రైస్తవులుకాని వారని అర్థం. (1 కొరింథీయులు 5:12; 1 థెస్సలొనీకయులు 4:10-12; 1 తిమోతి 3:7) అలాంటి వారితో ఆయనెలా వ్యవహరించాడు? ఆయన ‘ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల’ వాడయ్యాడు. (1 కొరింథీయులు 9:20-22) ఆయన ఒక పట్టణంలోనికి వచ్చినప్పుడు, అక్కడ స్థిరపడిన యూదుల దగ్గరకు మొదట వెళ్లడమే ఆ ప్రచారకార్యక్రమ విధానం. ఆయన ఎలా ప్రారంభించేవాడు? మెస్సియా వచ్చి, బలి అర్పణగా మరణించి, పునరుత్థానుడయ్యాడని ఒప్పింపచేసే బైబిలు రుజువుల్ని ఆయన యుక్తిగానూ మర్యాదపూర్వకంగానూ చూపించాడు.—అపొస్తలుల కార్యములు 13:5, 14-16, 43; 17:1-3, 10.

6 యూదులకు మెస్సియాను గురించీ దేవుని రాజ్యాన్ని గురించీ బోధించేందుకు, ధర్మశాస్త్రాన్ని గూర్చీ ప్రవక్తల గ్రంథాల్ని గూర్చీ వాళ్లు కల్గివున్న జ్ఞానాన్ని పౌలు ఈ విధంగా ఉపయోగించుకున్నాడు. వారిలో కొందరిని ఒప్పించడంలో ఆయన సఫలీకృతుడయ్యాడు. (అపొస్తలుల కార్యములు 14:1; 17:4) యూదామత నాయకులు వ్యతిరేకించినప్పటికీ, “సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణపొందవలెనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునైయున్నవి. వారు దేవుని యందు ఆసక్తిగలవారని వారినిగూర్చి సాక్ష్యమిచ్చు చున్నాను; అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు” అని ఆయన రాసినప్పుడు తోటి యూదుల ఎడల పౌలు హృదయపూర్వకమైన అనురాగాన్ని చూపించాడు.—రోమీయులు 10:1, 2.

యూదులుకాని విశ్వాసులకు సహాయపడడం

7. పౌలు ప్రకటించిన సువార్తకు అనేకమంది యూదామత ప్రవిష్టులు ఎలా ప్రతిస్పందించారు?

7 యూదామతప్రవిష్టులు ఎవరంటే సున్నతిపొంది యూదామత ఆచారాల్ని అవలంభించినవారే. రోమాలో, సిరియన్‌ అంతియొకయలో, ఐతియోపియలో, పిసిదియలోనున్న అంతియొకయలో—నిజానికి, యూదా పరవాస ప్రాంతాలయందంతటా యూదామతప్రవిష్టులు ఉండేవారనే విషయం సుస్పష్టం. (అపొస్తలుల కార్యములు 2:8-10; 6:5; 8:27; 13:14, 43; మత్తయి 23:15 పోల్చండి.) అనేకమంది యూదుల పరిపాలకులవలెగాక, యూదామతప్రవిష్టులు అంత అహంకారులేమీ కాదు, అబ్రహాము సంతానమని గర్వంతో చెప్పుకోలేకపోయారు. (మత్తయి 3:9; యోహాను 8:33) బదులుగా, వాళ్లు యెహోవాను గూర్చిన ఆయన చట్టాల్ని గూర్చిన కొంత జ్ఞానాన్ని సంపాదించుకొని అన్య దేవుళ్లను విడనాడి, వినయంతో ఆయనవైపు తిరిగారు. మెస్సియా వస్తాడనే యూదుల నిరీక్షణను వాళ్లు అంగీకరించారు. సత్యం కొరకైన తమ అన్వేషణలో వాళ్ల జీవన విధానాన్నీ నమ్మకాల్నీ మార్చుకోవడానికి అప్పటికే సుముఖత చూపించినవారిగా, వారిలో అనేకులు మరిన్ని మార్పుల్ని చేసుకోవడానికీ, అపొస్తలుడైన పౌలు ప్రకటనా కార్యక్రమానికి ప్రతిస్పందించడానికీ సంసిద్ధులయ్యారు. (అపొస్తలుల కార్యములు 13:42, 43) ఒకప్పుడు అన్య దేవుళ్లను ఆరాధించిన యూదామతప్రవిష్టుడు క్రైస్తవునిగా మారినప్పుడు, ఆ దేవుళ్లను ఇంకా ఆరాధిస్తున్న ఇతర అన్యులకు సాక్ష్యమిచ్చేందుకై సాటిలేని రీతిలో అతడు సంసిద్ధుడయ్యేవాడు.

8, 9. (ఎ) యూదామత ప్రవిష్టులుగాక, అన్యులకు చెందిన ఏ తరగతి ప్రజలు యూదా మతంవైపు ఆకర్షితులయ్యారు? (బి) దేవునికి భయపడే సున్నతిపొందని అనేకులు సువార్తకు ఎలా ప్రతిస్పందించారు?

8 సున్నతి పొందిన యూదామతప్రవిష్టులేకాక యూదులుకాని ఇతరులూ యూదా మతానికి ఆకర్షించబడ్డారు. యూదామతప్రవిష్టుడు కాకపోయినా “దేవుని యందు భయభక్తులు గలవాడైయుండి”న కొర్నేలీ, వీరిలో మొదటిగా క్రైస్తవుడయ్యాడు. (అపొస్తలుల కార్యములు 10:2) అపొస్తలుల కార్యములపై తాను చేసిన వ్యాఖ్యానంలో, ప్రొఫెసర్‌ ఎఫ్‌. ఎఫ్‌. బ్రూస్‌ ఇలా రాశాడు: “అలాంటి అన్యులు, సామాన్యంగా ‘దేవునికి భయపడువారు’ అని పిలువబడ్డారు; ఇది ఓ సాంకేతిక పదంకానప్పటికీ, ఉపయోగించడానికి తగిన పదం. (సున్నతి పొందాలనే కట్టడ పురుషులకు ఓ ప్రత్యేకమైన ఆటంకమైనందున) యూదామతాన్ని పూర్తిగా స్వీకరించేందుకు సంసిద్ధులు కాకపోయినప్పటికీ, ఆ కాలంలో ఉన్న అన్యుల్లో అనేకమంది, యూదా సమాజపు ఆరాధన యొక్క సులభగ్రాహ్యమైన ఏకేశ్వరవాదానికీ, యూదులు జీవించిన జీవితవిధాన నైతిక ప్రమాణాలకూ ఆకర్షితులయ్యారు. వారిలో కొందరు సమాజ మందిరాలకు హాజరై, అక్కడ తాము విన్న ప్రార్థనలతోనూ చదువబడిన గ్రీకు భాషాంతర లేఖనపాఠాలతోనూ ఎంతోకొంత విషయపరిజ్ఞానంగలవారై ఉన్నారు.”

9 అపొస్తలుడైన పౌలు ఆసియా మైనరులోనూ, గ్రీసులో ఉన్న సమాజమందిరాల్లోనూ ప్రకటిస్తున్నప్పుడు, దేవునికి భయపడే వ్యక్తులైన అనేకమందిని కలుసుకున్నాడు. “ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడు ఇతరులారా” అని ఆయన పిసిదియలోనున్న అంతియొకయనందు సమాజమందిరంలో కూడుకున్న వారిని సంభోదించాడు. (అపొస్తలుల కార్యములు 13:17, 26, NW) థెస్సలొనీకలోని సమాజమందిరంలో పౌలు మూడు విశ్రాంతిదినములు ప్రకటించిన తర్వాత, “వారిలో [యూదులును] కొందరును, భక్తిపరులగు గ్రీసుదేశస్థులలో చాలమందియు, ఘనతగల స్త్రీలలో అనేకులును ఒప్పుకొని [క్రైస్తవులై] పౌలుతోను సీలతోను కలిసికొనిరి.” (అపొస్తలుల కార్యములు 17:4) బహుశా, గ్రీసుదేశస్థుల్లో కొందరు సున్నతిపొందకపోయినా దేవునికి భయపడే వ్యక్తులై ఉన్నారు. దేవునికి భయపడేవారైన అలాంటి అన్యుల్లో అనేకులు, యూదా సమాజాలతో సహవసించారనడానికి రుజువుంది.

“అవిశ్వాసుల” మధ్య ప్రకటించడం

10. లేఖనసంబంధమైన పరిజ్ఞానం ఏ మాత్రం లేని అన్యులకు పౌలు ఎలా ప్రకటించాడు, ఏ ఫలితంతో?

10 క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, “అవిశ్వాసులు” అనే పదం సాధారణంగా క్రైస్తవ సంఘానికి వెలుపలి జనాన్ని సూచించగలదు. తరచూ ఇది అన్యులను సూచిస్తుంది. (రోమీయులు 15:31; 1 కొరింథీయులు 14:22, 23; 2 కొరింథీయులు 4:4; 6:14) ఏథెన్సులో అనేకమంది అవిశ్వాసులు, లేఖనసంబంధమైన పరిజ్ఞానం ఏ మాత్రం లేకుండా గ్రీకు తత్త్వమందు ప్రవీణులయ్యారు. వారికి సాక్ష్యమివ్వడంలో పౌలును ఇది నిరుత్సాహపర్చిందా? లేదు. అయితే ఆయన దాన్ని తగిన విధంగా మలచుకున్నాడు. ఆయన ఏథెన్సు దేశస్థులకు అపరిచితమైన హెబ్రీ లేఖనాల్ని సూటిగా ఎత్తి చెప్పకుండా బైబిలు సంబంధమైన అభిప్రాయాల్ని నేర్పుగా అందించాడు. బైబిలు సత్యాలకూ ప్రాచీన స్తోయికు కవీశ్వరులు వ్యక్తపర్చిన నిర్దిష్టమైన అభిప్రాయాలకూ మధ్యనున్న సారూప్యాన్ని ఆయన నైపుణ్యవంతంగా చూపించాడు. మరణించి, పునరుత్థానుడైన ఓ మనుష్యుని ద్వారా నీతిననుసరించి తీర్పుతీర్చబోయే దేవుడొక్కడేనని అంటే సర్వమానవాళికీ సత్యదేవుడొక్కడేననే సిద్ధాంతాన్ని ఆయన తెలియజేశాడు. ఆ విధంగా, పౌలు ఏథెన్సువాసులకు క్రీస్తును గురించి నేర్పుగా ప్రకటించాడు. ఫలితం? అనేకులు ఆయన్ని బహిరంగంగానే అపహాస్యముచేయగా లేక సందేహించగా, “కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయొపగీతుడైన [“అరేయొపగ న్యాయసభ యొక్క న్యాయాధిపతి,” NW] దియొనూసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితోకూడ మరికొందరునుండిరి.”—అపొస్తలుల కార్యములు 17:18, 21-34.

11. కొరింథు ఏ రకమైన పట్టణం, అక్కడ పౌలు ప్రకటనా పని ఫలితమేమిటి?

11 కొరింథులో యూదుల సమాజం చెప్పుకోదగినంత పరిమాణంలో ఉంది గనుక ఆ సమాజమందిరంలో ప్రకటించడం ద్వారా అక్కడ పౌలు తన పరిచర్యను ప్రారంభించాడు. కానీ యూదులు వ్యతిరేకించినప్పుడు, పౌలు అన్యజనాంగం దగ్గరకు వెళ్లాడు. (అపొస్తలుల కార్యములు 18:1-6) ఎంత జనాంగమో కదా! కొరింథు జనసందడితో నిండిన, సర్వసమభావంగల, వాణిజ్య నగరం. అది దాని దుర్నీతినిబట్టి గ్రీస్‌-రోమన్‌ ప్రపంచమందంతటా పేరుగాంచింది. నిజానికి, “కొరింథీయులవ్వడం” అంటే దుర్నీతికరంగా ప్రవర్తించడం అని అర్థం. కానీ, పౌలు ప్రకటనా పనిని యూదులు తిరస్కరించిన తర్వాత క్రీస్తు ఆయనకు కనిపించి “భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము. . . . ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని” తెలియజేశాడు. (అపొస్తలుల కార్యములు 18:9, 10) క్రీస్తు చెప్పినట్లుగానే, పౌలు కొరింథులో ఓ సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘ సభ్యుల్లో కొందరు గతంలో “కొరింథీయుల” జీవన శైలిని గడిపినవారే.—1 కొరింథీయులు 6:9-11.

నేడు ‘సమస్త మనుష్యులను’ కాపాడేందుకు ప్రయత్నించడం

12, 13. (ఎ) పౌలు కాలంలోని ప్రచారపు ప్రాంతానికి నేడు మన ప్రాంతం ఎలా పోలివుంది? (బి) ఎంతోకాలం నుండి క్రైస్తవమత సామ్రాజ్యపు మతాలు పాతుకుపోయి ఉన్న ప్రాంతాల్లో లేక మతసంబంధమైన భ్రమలు తొలగిపోయిన వ్యక్తులు అనేకమంది ఉన్న ప్రాంతాల్లో మనమే వైఖరిని చూపిస్తాం?

12 నేడు, మొదటి శతాబ్దంలో ఉన్నట్లుగానే, ‘సమస్త మనుష్యులకు దేవుని కృప రక్షణ తెస్తుంది.’ (తీతు 2:11, 12) అన్ని ఖండాల్నీ, అనేక సముద్ర ద్వీపాల్నీ చుట్టుముట్టేందుకు సువార్త ప్రకటన కొరకైన ప్రాంతం విస్తరించింది. పౌలు కాలంలో వలెనే, “సమస్త మనుష్యుల”ను నిజంగా కలుసుకోవడమైంది. ఉదాహరణకు, మనలో కొందరు అనేక శతాబ్దాలుగా క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలున్న దేశాల్లో ప్రకటించారు. మొదటి శతాబ్దంలోని యూదులవలె, బహుశా వాటి సభ్యులు మత పారంపర్యాచారాలకు బలంగా కట్టుబడి ఉండవచ్చు. అయినప్పటికీ, సహృదయుల్నీ, తమకు తెల్సిన బైబిలు జ్ఞానంపై ఆధారపడే వ్యక్తుల్నీ అన్వేషించేందుకు మనం సంతోషిస్తాం. కొన్నిసార్లు వారి మతనాయకులు మనల్ని వ్యతిరేకించి హింసించినప్పటికీ మనం వారిని మాట్లాడనీయకుండా చేయం లేక ఏవగించుకోం. బదులుగా, కచ్చితమైన జ్ఞానంలేకపోయినప్పటికీ బహుశా వారిలో కొందరికి “దేవుని యందు ఆసక్తి” ఉండవచ్చని మనం గుర్తిస్తాం. యేసు, పౌలుల వలె, ప్రజల ఎడల యథార్థమైన ప్రేమను మనం చూపిస్తాం, వాళ్లు రక్షించబడాలనే ప్రగాఢమైన అభిలాష మనకుంది.—రోమీయులు 10:2.

13 మనం ప్రకటిస్తున్నప్పుడు, మత సంబంధమైన భ్రమలు తొలగిపోయిన వ్యక్తుల్ని మనలో అనేకులం కలుసుకుంటాం. అయితే, బహుశా వాళ్లు కొంతమేరకు దేవునియందు నమ్మకముంచుతూ, నీతియుక్తమైన జీవితాల్ని జీవించేందుకు ప్రయత్నిస్తూ ఇంకా దేవునికి భయపడేవారిగా ఉండవచ్చు. వక్రమైన, అంతకంతకూ భక్తిహీనమవుతున్న ఈ తరంలో దేవునియందు కొంత నమ్మకాన్ని కల్గివున్న ప్రజల్ని కలుసుకున్నందుకు మనం ఆనందించమా? వేషధారణలతోనూ అబద్ధాలతోనూ గుర్తించబడని ఆరాధనకు వారిని నడిపించేందుకు మనం ఆతురత కల్గివుండమా?—ఫిలిప్పీయులు 2:14, 15.

14, 15. సువార్తను ప్రకటించేందుకు ఓ పెద్ద గుంపు ఎలా లభ్యమయ్యింది?

14 వలను గూర్చిన తన ఉపమానంలో, ప్రకటనా పని కొరకు ఓ విస్తారమైన ప్రాంతం ఉంటుందని యేసు ప్రవచించాడు. (మత్తయి 13:47-49) ఈ ఉపమానాన్ని వివరిస్తూ, కావలికోట జూన్‌ 15, 1992, 22వ పేజీలో ఇలా తెలియజేసింది: “అనేక శతాబ్దాలుగా క్రైస్తవమత సామ్రాజ్య సభ్యులు దేవుని వాక్యమును అనువదించుటలో, నకలువ్రాయుటలో, పంచిపెట్టుటలో కీలకపాత్ర వహించిరి. ఆ తర్వాతి కాలములలో చర్చీలు, మారుమూల ప్రాంతముల భాషలలోనికి బైబిలును తర్జుమాచేసిన బైబిలు సొసైటీలను రూపొందించినవి లేక వాటికి మద్దతునిచ్చినవి. వారు వైద్యపరమైన మిషనరీలను, బోధకులను పంపించగా, వారనేకమందిని ఆహారవస్తువుల ఆశజూపి క్రైస్తవులుగా తయారుచేసిరి. ఈ విధముగా సమకూర్చబడిన విస్తారమైన చేపలకు, దేవుని గుర్తింపు లేకుండెను. అయితే అది కనీసము క్రైస్తవులుకాని లక్షలాదిమందికి బైబిలంటే ఏమిటో, కలుషితము నిండియున్ననూ క్రైస్తవత్వమంటే ఏమిటో తెలియునట్లు చేసినది.”

15 విశేషంగా దక్షిణ అమెరికా, ఆఫ్రికా ఖండాల్లో, కొన్ని సముద్ర ద్వీపాల్లో క్రైస్తవమత సామ్రాజ్యం మతమార్పిడిని ప్రతిభావంతంగా చేసింది. మన కాలంలో, ఈ ప్రాంతాల్లో దీనులైన అనేకమంది కనుగొనబడ్డారు. అపొస్తలుడైన పౌలు యూదామతప్రవిష్టుల ఎడల అనుకూలమైన ప్రేమపూర్వకమైన వైఖరిని కల్గివున్నట్లుగానే మనమూ అలాంటి దీనులైన ప్రజల ఎడల అదే వైఖరిని కల్గివుంటే మనం మరింత మంచిని చేస్తూనే ఉండగలం. మన సహాయం అవసరమైన వారిలో, యెహోవాసాక్షుల “సానుభూతిపరులు” అని పిలువబడే లక్షలాదిమంది ప్రజలు కూడా ఉన్నారు. మనం వారిని సందర్శించినప్పుడల్లా మనల్ని చూసేందుకు వాళ్లు ఎల్లప్పుడూ సుముఖత చూపిస్తారు. కొందరు మనతో బైబిల్ని అధ్యయనం చేశారు, మన కూటాలకూ మరి విశేషంగా క్రీస్తు జ్ఞాపకార్థదినానికీ హాజరయ్యారు. రాజ్యసువార్తను ప్రకటించేందుకు అటువంటి వారు ఒక పెద్ద గుంపు కాదంటారా?

16, 17. (ఎ) ఏ రకమైన ప్రజల్ని మనం సువార్తతో సమీపించాలి? (బి) వివిధ రకాల ప్రజలకు ప్రకటించడంలో మనం పౌలును ఎలా అనుకరించాలి?

16 అంతేగాక, క్రైస్తవమత సామ్రాజ్యానికి వెలుపటి సంస్కృతులనుండి వచ్చేవారు అంటే మనం వాళ్లని వాళ్ల స్వదేశాల్లో కలుసుకున్నా లేక పశ్చిమ దేశాలకు వలస వెళ్లివచ్చినవారైనా సరే, వారి విషయమేమిటి? మతాన్ని పూర్తిగా తిరస్కరించి, నాస్తికులుగానో అజ్ఞేయతావాదులుగానో మారుతున్న అనేక కోట్లాదిమంది సంగతేమిటి? అంతేగాక, పుస్తకాల షాపుల్లో దొరికే అనేక స్వయం-సహాయక పుస్తకాల్లో ప్రచురించబడిన ఇంచుమించు మతోద్రేకపూరిత ఆధునిక తత్త్వశాస్త్రాన్నో లేక జనసమ్మత మనస్తత్వ శాస్త్రాన్నో లక్ష్యపెట్టేవారి విషయమేంటి? విమోచనలేనివారిగా పరిగణించి అలాంటి వారినెవరినైనా నిర్లక్ష్యంచేయాలా? మనం అపొస్తలుడైన పౌలును అనుకరిస్తే నిర్లక్ష్యం చేయకూడదు.

17 ఏథెన్సులో ప్రకటిస్తున్నప్పుడు, తన ప్రేక్షకులతో తాత్విక విషయాల్ని చర్చించే ఉరిలో పౌలు చిక్కుకోలేదు. అయితే, బైబిలు సత్యాల్ని స్పష్టంగానూ, సకారణంగానూ తెలియజేస్తూ తాను వ్యవహరించే ప్రజలతో ఆయన తన తర్కవిధానాన్ని వారికి తగ్గరీతిలో మలుచుకున్నాడు. అదే విధంగా, మనం ప్రకటించే ప్రజలు అనుసరించే మతాల్లో లేక తత్త్వవిషయాల్లో మనం నిపుణులం కావాల్సిన పనిలేదు. అయితే, మనమిచ్చే సాక్ష్యం ప్రతిభావంతంగా ఉండేందుకు మనం వారితో మాట్లాడే విధానాన్ని వారికి తగ్గ విధంగా మలుచుకోవడం ద్వారా “అందరికి అన్నివిధముల” వారమవుతాం. (1 కొరింథీయులు 9:22) కొలొస్సిలో ఉన్న క్రైస్తవులకు రాస్తూ, అపొస్తలుడైన పౌలు ఇలా తెలియజేశాడు: “సమయము పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, సంఘమునకు వెలుపటి వారియెడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పువేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి.”—కొలొస్సయులు 4:5, 6.

18. మనమే బాధ్యతను కల్గివున్నాం, మరి దేన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు?

18 యేసు, అపొస్తలుడైన పౌలుల వలె, సమస్త మనుష్యుల ఎడల ప్రేమను చూపిద్దాం. రాజ్యసువార్తను ఇతరులతో పంచుకునేందుకు మనం ప్రయాసపడదాం. మరో వైపున, “వారును లోకసంబంధులు కారు” అని యేసు తన శిష్యులను గురించి చెప్పిన దానిని ఎన్నటికీ మర్చిపోకూడదు. (యోహాను 17:16) మన ఎడల దీని భావమేమైవుందో తర్వాతి శీర్షికలో చర్చించబడుతుంది.

పునఃసమీక్షించడం ద్వారా

◻ లోకం ఎడల యేసుకుగల సమతుల్యమైన దృక్పథాన్ని వివరించండి.

◻ యూదులకూ, యూదామతప్రవిష్టులకూ అపొస్తలుడైన పౌలు ఎలా ప్రకటించాడు?

◻ దేవునికి భయపడేవారినీ, అవిశ్వాసుల్నీ పౌలు ఎలా సమీపించాడు?

◻ మన ప్రకటనా పనిలో ‘అందరికి అన్ని విధాలా’ మనమెలా ఉండగలం?

[10వ పేజీలోని చిత్రం]

తమ పొరుగువారికి దయాపూర్వకమైన పనుల్ని చేయడం ద్వారా, క్రైస్తవులు తరచూ పూర్వనిర్ధారిత అభిప్రాయాన్ని క్రియారహితం చేస్తారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి