షూనేము—ప్రేమా దౌర్జన్యాల చేత గుర్తించబడింది
దక్షిణ గలిలయలో, యెజ్రెయేలు లోయ మైదానం యొక్క తూర్పు ప్రాంతం చివరన షూనేము నగరం నెలకొని ఉంది. ఈ చిన్న నగరం బైబిలు చరిత్రలోని అత్యంత గణనీయమైన రెండు పోరాటాలను చూసింది, అయితే యథార్థమైన ప్రేమ చూపడంలో మాదిరులుగా నిలిచిన ఇద్దరు స్త్రీలకు జన్మ స్థలంగా కూడా అది పేరుపొందింది.
షూనేము వెనక మోరే అని భావించబడుతున్న గుట్ట ఉంది, అయితే మైదానానికి అవతల దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరాన గిల్బోవ అనే పర్వతం నిలిచి ఉంది. ఆ రెండు గుట్టల మధ్య చక్కని నీటి పారుదలగల, ఫలవంతమైన భూమి ఉంది, అది ఇశ్రాయేలు అంతటిలోనూ అత్యంత ఫలవంతమైన ప్రాంతాలలో ఒకటి.
షూనేము చుట్టుప్రక్కల ఉన్న ఈ సుసంపన్నమైన ప్రాంతం, ఎంతో విలక్షణమైన ప్రేమ గాథల్లో ఒకటైన పరమగీతములకు కేంద్ర స్థానంగా ఉంది. ఈ గీతం, రాజైన సొలొమోను తన భార్యల్లో ఒక దానిగా ఆమెను చేసుకుంటానని ఇచ్చిన ఆహ్వానాన్ని నిరాకరించి గొర్రెల కాపరియగు తన సహవాసినే వివాహం చేసుకోవడానికి తీర్మానించుకున్న ఒక అందమైన పల్లె పడుచును గురించినది. ఆమె హృదయాన్ని గెలుచుకునేందుకు సొలొమోను తన జ్ఞానాన్నంతటినీ సంపదనంతటినీ ఉపయోగించాడు. “సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందముగలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలునుగలదై[న] . . . ఈమె ఎవరు?” అని అంటూ ఆయన ఆమెను పదే పదే పొగిడాడు. ఆమెకు అన్ని రకాలైన ఆభరణాలనూ తాను ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు.—పరమగీతము 1:11; 6:10.
రాజవైభవాన్ని ఆమెకు రుచి చూపేందుకు, తన సేవక సమూహంలో ఒక భాగంగా సొలొమోను ఆమెను యెరూషలేముకు తనతో పాటూ తీసుకెళ్లాడు, వారితోపాటూ ఆయన యొక్క అతి శ్రేష్ఠమైన 60 మంది సైనికులు కూడా వచ్చారు. (పరమగీతము 3:6-11) ఆయన ఆమెకు తన రాజభవనంలో నివాసం ఏర్పాటు చేశాడు, ఆ రాజభవనం ఎంత మహత్తరంగా ఉందంటే, షేబ దేశపు రాణి దాన్ని చూసినప్పుడు, ఆమె ‘విస్మయమొందినది.’—1 రాజులు 10:4, 5.
అయితే షూనేముకు చెందిన ఆ అమ్మాయి తన మందకాపరి ఎడల యథార్థంగా ఉంది. “అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు” అని ఆమె చెబుతుంది. (పరమగీతము 2:3) సొలొమోను తన వేయి ద్రాక్షతోటలతో ఆనందించును గాక. ఒక ద్రాక్షతోట, దానితో పాటు తన ప్రియుడు తనకు చాలు. ఆమె ప్రేమ చెదరదు.—పరమగీతము 8:11, 12.
షూనేములో మరో అందమైన స్త్రీ నివసించింది. ఆమె భౌతిక రూపాన్ని గురించి మనకేమీ తెలియదు, అయితే ఆమె హృదయం తప్పకుండా అందంగానే ఉంది. ఆమె ప్రవక్తయైన ఎలీషాకు క్రమంగా భోజనం పెట్టేందుకు, నివాసం ఏర్పాటు చేసేందుకు, ఎంతో “శ్రద్ధా భక్తులు” కనపర్చిందని, లేక తనను తాను కష్టపెట్టుకుందని బైబిలు చెబుతుంది.—2 రాజులు 4:8-13.
ఎలీషా సుదీర్ఘమైన, అలసట కలిగించే ప్రయాణం తర్వాత, ఆమె, ఆమె భర్త తన కొరకు సిద్ధం చేసి ఉంచిన ఆ చిన్న మేడ గదికి తిరిగి వస్తున్నప్పుడు ఎంత కృతజ్ఞతగా భావించి ఉంటాడో మనం ఊహించుకోగలం. ఆయన పరిచర్య 60 సంవత్సరాలపాటూ సాగింది గనుక ఆయన వారి ఇల్లు తరచూ సందర్శించి ఉంటాడు. ఎలీషా అటువైపు నుండి వెళ్తున్న ప్రతీసారి తన ఇంట బస చేయాలని షూనేమీయురాలైన ఆ స్త్రీ ఆయనను ఎందుకు పట్టుబట్టి ఉంటుంది? ఆమె ఎలీషా చేస్తున్న పనిని విలువైనదిగా భావించింది గనుకనే. దీనుడైన, నిస్వార్థపరుడైన ఈ ప్రవక్త జనాంగం యొక్క మనస్సాక్షిగా ప్రవర్తించాడు, ఆయన రాజుకు, యాజకులకు మరియు సామాన్య జనులకు యెహోవాను సేవించాల్సిన వారి బాధ్యతను జ్ఞాపకం చేశాడు.
“ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్తఫలము పొందును” అని యేసు చెప్పినప్పుడు ఆయన మదిలో ఉండిన ప్రజల్లో షూనేమీయురాలైన ఈ స్త్రీ కూడా చేరివుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. (మత్తయి 10:41) దేవునికి భయపడే ఈ స్త్రీకి యెహోవా ఒక ప్రత్యేకమైన ప్రతిఫలాన్ని ఇచ్చాడు. ఆమె అనేక సంవత్సరాలుగా గొడ్రాలై ఉండినప్పటికీ, చివరకు ఆమె ఒక కుమారునికి జన్మనిచ్చింది. చాలా ఏళ్ల తర్వాత, ఏడు సంవత్సరాల క్షామం దేశాన్ని సర్వనాశనం చేసినప్పుడు ఆమెకు దైవిక సహాయం లభించింది. దేవుని సేవకుల ఎడల మనం చూపించే కనికరాన్ని మన పరలోకపు తండ్రి ఎన్నడూ అలక్ష్యం చేయడనే విషయాన్ని ఈ ప్రేరణాత్మక వృత్తాంతం మనకు జ్ఞాపకం చేస్తుంది.—2 రాజులు 4:13-37; 8:1-6; హెబ్రీయులు 6:10.
నిర్ణయాత్మకమైన రెండు పోరాటాలు
షూనేము ఆ ఇద్దరు యథార్థపరులైన స్త్రీల పుట్టినిల్లుగా గుర్తుచేసుకోబడుతున్నప్పటికీ, ఇశ్రాయేలీయుల చరిత్రను మార్చివేసిన రెండు పోరాటాలను కూడా అది చూసింది. దానికి దగ్గర్లో పోరాటానికి అనువైన ప్రాంతం ఉంది, అది మోరే మరియు గిల్బోవ గుట్టల మధ్యనున్న మైదానం. బైబిలు కాలాల్లోని సైనికాధికారులు ఎల్లప్పుడూ పుష్కలమైన నీటి సదుపాయం, రక్షణ నిమిత్తం ఎత్తైన ప్రాంతం ఉన్న స్థలాల్లో బస చేసే వారు. ఒకవేళ వీలైతే తమ సైనికులను, గుర్రాలను మరియు రథాలను దండ్లుగా ఏర్పాటు చేసుకునేందుకు తగినంత లోయ ప్రాంతంగల ఎత్తైన స్థలం కొరకు చూసే వారు. షూనేము గిల్బోవలు అలాంటి అంశాలనే కలిగి ఉన్నాయి.
న్యాయాధిపతుల కాలంలో, 1,35,000 మంది సైనికులుగల మిద్యానీయుల, అమాలేకీయుల మరియు ఇతరుల దండ్లు మోరే ఎదుటనున్న మైదానంలో బస చేశాయి. వాళ్ల ఒంటెలు “సముద్రతీరమందున్న యిసుక రేణువులవలె లెక్క లేనివై యుండెను.” (న్యాయాధిపతులు 7:12) మైదానానికి అవతల వారికి ఎదురుగా, గిల్బోవ గుట్ట దిగువన హరోదు బావి ప్రక్కగా న్యాయాధిపతియైన గిద్యోను నాయకత్వంలో 32,000 మంది సైనికులు మాత్రమే ఉన్న ఇశ్రాయేలీయుల దండు ఉంది.
పోరాటానికి కొద్ది రోజుల ముందు, ప్రతి వైపు వారు అవతలి వారిని భయకంపితులను చేసేందుకు ప్రయత్నిస్తారు. పరిహసిస్తున్న గుంపుల సమూహాలు, యుద్ధ ఒంటెలు, రథాలు, మరియు గుర్రాలు పదాతిదళంలో భయం పుట్టించగలిగేవి. ఇశ్రాయేలీయులు ఇంకా సమకూడుతుండగా, అప్పటికే అక్కడికి వచ్చి చేరిన మిద్యానీయులు ఎంతో భయంకరమైన దృశ్యంగా ఉన్నారు. ‘ఎవడు భయపడి వణకుచున్నాడు?’ అని గిద్యోను అడిగినప్పుడు, ఆయన సైన్యంలోని మూడింట రెండు వంతుల వారు యుద్ధ భూమి వదిలి వెళ్లిపోయారు.—న్యాయాధిపతులు 7:1-3.
కేవలం 10,000 మంది ఇశ్రాయేలు సైనికులు మాత్రమే ఇప్పుడు మైదానం అవతల ఉన్న తమ 1,35,000 మంది శత్రు సైనికులను చూస్తున్నారు, మరి త్వరలోనే యెహోవా ఇశ్రాయేలీయుల సైనికుల సంఖ్యను 300లకు తగ్గించాడు. ఇశ్రాయేలీయుల అలవాటుకు అనుగుణంగా ఈ చిన్న దండును మూడు భాగాలుగా విభాగిస్తారు. ఆ రాత్రి వారు తమ శత్రువుల దండును మూడు వైపులా చుట్టుముడతారు. అప్పుడు గిద్యోను ఆజ్ఞాపించినప్పుడు, 300 మంది తమ కాగడాలను దాచిన తమ కుండలను పగులగొట్టి, ఆ కాగడాలను పైకెత్తి, “యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము” అని బిగ్గరగా అరుస్తారు. వారు తమ బూరలు ఊది అలాగే ఊదుతూ ఉండిపోతారు. ఆ చీకటిలో బిత్తరపోయిన సైనికులు 300 దండ్లు తమపై దాడి చేస్తున్నాయని ఊహించుకున్నారు. యెహోవా ప్రతి వాన్నీ మరొకనికి విరుద్ధంగా తిప్పగా “ఆ దండువారందరును పరుగెత్తుచు కేకలువేయుచు పారిపోయిరి.”—న్యాయాధిపతులు 7:15-22; 8:10.
రెండవ పోరాటం షూనేముకు దగ్గర్లో రాజైన సౌలు కాలంలో జరిగింది. “ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా,” చాలా సంవత్సరాల క్రితం గిద్యోను సైన్యం చేసినట్లుగానే “సౌలు ఇశ్రాయేలీయులందరిని సమకూర్చెను; వారు గిల్బోవలో దిగిరి” అని బైబిలు నివేదిస్తోంది. అయితే గిద్యోనువలె సౌలు యెహోవాయందు నమ్మకం కనపర్చలేదు, బదులుగా ఆయన ఏన్దోరులో కర్ణపిశాచాన్ని సంప్రదించాడు. ఫిలిష్తీయుల దండును ఆయన చూసినప్పుడు, ‘మనస్సునందు భయకంపితుడయ్యాడు.’ ఆ తర్వాత జరిగిన పోరాటంలో, ఇశ్రాయేలీయులు పారిపోయి, పూర్తిగా ఓడించబడ్డారు. సౌలు యోనాతానులు హతులయ్యారు.—1 సమూయేలు 28:4-7; 31:1-6.
అలా షూనేము యొక్క చరిత్ర ప్రేమ మరియు దౌర్జన్యం చేత గుర్తించబడింది, యెహోవా యందు నమ్మకాన్ని మరియు దయ్యాలపై ఆధారపడటాన్ని సూచించింది. ఈ మైదానపు లోయలో ఇద్దరు స్త్రీలు ప్రేమ మరియు ఆతిధ్యం చూపడంలో స్థిరంగా కొనసాగారు మరియు ఇద్దరు ఇశ్రాయేలు నాయకులు నిర్ణయాత్మక యుద్ధాలు చేశారు. ఈ నాలుగు ఉదాహరణలూ, తనను సేవించే వారికి ప్రతిఫలం ఇవ్వడంలో ఎన్నడూ విఫలంకాని యెహోవాపై ఆధారపడటం యొక్క ప్రాముఖ్యతను ఉదహరిస్తున్నాయి.
[31వ పేజీలోని చిత్రం]
ఆ వెనుకగా మోరేతో, ప్రాచీన షూనేమువున్న ప్రాంతంలో వెలసిన ఆధునిక సులామ్ గ్రామం
[క్రెడిట్ లైను]
Pictorial Archive (Near Eastern History) Est.