కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 10/1 పేజీలు 25-29
  • ఈ లోకాత్మ మిమ్మల్ని విషపూరితం చేస్తుందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఈ లోకాత్మ మిమ్మల్ని విషపూరితం చేస్తుందా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • రాజ్యాన్ని మొదట వెదకడం
  • విరామాన్ని తగిన స్థానంలో ఉంచండి
  • ఆధ్యాత్మిక సౌందర్యం యెహోవాను ప్రీతిపరుస్తుంది
  • మనం లౌకికాత్మను ఎదిరించగలం!
  • విరామాన్ని సరైన స్థానంలో ఉంచండి
    మన రాజ్య పరిచర్య—2001
  • యెహోవా సేవలో మీరు చేయగలిగింది చేస్తున్నందుకు సంతోషించండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • ఆధ్యాత్మిక వ్యక్తిగా ఉండడం అంటే ఏమిటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • నమ్మకమైన క్రైస్తవ స్త్రీలు —దేవుని ప్రశస్త ఆరాధకులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 10/1 పేజీలు 25-29

ఈ లోకాత్మ మిమ్మల్ని విషపూరితం చేస్తుందా?

ఖజకస్తాన్‌ నందలి ఒక కర్మాగారంలో, గత 1990 సెప్టెంబరు 12వ తేదీన విస్ఫోటం జరిగింది. ఆ ప్రాంత నివాసులైన 1,20,000 మంది ఆరోగ్యాలకు ముప్పు కలిగేలా చేస్తూ ప్రమాదకరమైన రేడియో ధార్మికశక్తి వాతావరణంలోకి విడుదలయ్యింది, ఆ ప్రజల్లో అనేకులు ఆ మరణకరమైన విషానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ వీధుల్లోకి వెళ్లారు.

అయితే మరింత సమాచారం వెలుగులోకి రాగా, వారు దశాబ్దాలుగా ఆ విషపూరితమైన వాతావరణంలోనే జీవిస్తూ ఉండిరనే విషయం తెలియవచ్చింది. అనేక సంవత్సరాలుగా 1,00,000 టన్నుల రేడియో ధార్మిక వ్యర్థపదార్థం పర్యవేక్షించబడని బయలు ప్రదేశంలో పడేయబడుతూ వచ్చింది. ప్రమాదం వారి ఇంటి గడపమీదే ఉన్నా ఎవ్వరూ ఆ విషయాన్ని గంభీరంగా తీసుకోలేదు. ఎందుకు?

ప్రతిరోజూ స్థానిక క్రీడా స్టేడియంలో, రేడియేషన్‌ కౌంట్‌ను అధికారులు చూపించారు, ఎలాంటి ప్రమాదమూ లేదనే అభిప్రాయాన్ని అది వారికి కలిగించింది. ఆ లెక్కలు కచ్చితమైనవే, అయితే అవి గామా రేడియేషన్‌ను మాత్రమే సూచించాయి. కొలత వేయబడని ఆల్ఫా రేడియేషన్‌ కూడా అంతే మరణకరంగా ఉండగలదు. తమ పిల్లలు అంత రోగగ్రస్తులుగా ఎందుకుండే వారో అనేకమంది తల్లులు గుర్తించడం ప్రారంభించారు.

ఆధ్యాత్మిక భావంలో మనం కూడా అదృశ్యమైన కాలుష్యం ద్వారా విషపూరితం చేయబడవచ్చు. ఖజకస్థాన్‌నందలి అభాగ్యులైన ఆ ప్రజల వలె, జీవానికి ఎంతో ప్రమాదకరమైన ఈ ముప్పు గురించి అనేకులకు తెలియదు. అపవాదియగు సాతాను ద్వారా ప్రారంభించబడిన ఈ కాలుష్యాన్ని బైబిలు “లౌకికాత్మ” అని గుర్తిస్తుంది. (1 కొరింథీయులు 2:12) మన దైవ భక్తిని అణగార్చేందుకు, దేవుని శత్రువు ఈ ఆత్మను లేక ప్రచలితమైన ఈ దృక్పథాన్ని ఉపయోగిస్తాడు.

ఈ లౌకికాత్మ మన ఆధ్యాత్మిక బలాన్ని ఎలా పిండేయగలదు? నేత్రాశను ఉత్తేజపర్చడం ద్వారా మరియు మన సహజ అపరిపూర్ణతను ఉపయోగించుకోవడం ద్వారా. (ఎఫెసీయులు 2:1-3; 1 యోహాను 2:16) లౌకిక ఆలోచనావిధానం క్రమంగా మన ఆధ్యాత్మికతను విషపూరితం చేయగల మూడు విభిన్న ప్రాంతాలను మనం ఉదాహరణల ద్వారా పరిశీలిస్తాము.

రాజ్యాన్ని మొదట వెదకడం

‘రాజ్యమును దేవుని నీతిని మొదట వెదకమని’ యేసు క్రైస్తవులను పురికొల్పాడు. (మత్తయి 6:33) మరో వైపు, లౌకికాత్మ తమ స్వంత ఆసక్తికి మరియు సౌకర్యాలకు అనవసరమైన ప్రాముఖ్యతను ఇచ్చేలా నడిపిస్తుంది. మొదటి ప్రమాదం, ఆధ్యాత్మిక ఆసక్తిని పూర్తిగా విడనాడటంలో కాక వాటికి రెండవ స్థానాన్ని ఇవ్వడంలో పొంచి ఉంటుంది. ఖజకస్థాన్‌లోని ప్రజలు చేసిన విధంగా, అబద్ధ భద్రతా భావంతో మనం ప్రమాదాన్ని అలక్ష్యం చేయవచ్చు. ఎన్నో సంవత్సరాలుగా మనం చేసిన నమ్మకమైన సేవ మరియు మన క్రైస్తవ సహోదరసహోదరీల ఎడల మనకుగల మెప్పు, మనం ఎన్నడూ సత్యాన్ని విడనాడే పరిస్థితికి రామని మనం ఆలోచించేలా మనలను మభ్యపెట్టవచ్చు. బహుశ, ఎఫెసు సంఘంలోని అనేకులు అలానే భావించి ఉంటారు.

దాదాపు సా.శ. 96వ సంవత్సరంలో, “మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది” అని యేసు వారిని గద్దించాడు. (ప్రకటన 2:4) ఎంతో కాలంగా సేవ చేస్తున్న ఈ క్రైస్తవులు అనేక కష్టాలను సహించారు. (ప్రకటన 2:2, 3) వారు అపొస్తలుడైన పౌలుతో సహా నమ్మకమైన పెద్దల చేత బోధించబడ్డారు. (అపొస్తలుల కార్యములు 20:17-21, 27) అయితే, గత కొన్ని సంవత్సరాలుగా, యెహోవా ఎడల వారి ప్రేమ సన్నగిల్లింది, వారు తమ ఆధ్యాత్మిక గమనాన్ని కోల్పోయారు.—ప్రకటన 2:5.

బహుశ, ఎఫెసీయుల్లో కొంతమంది ఆ నగరంలోని వ్యాపారాసక్తి మరియు సంవర్థత చేత ప్రభావితం చెంది ఉండవచ్చు. విచారకరంగా, నేటి సమాజం యొక్క ఐశ్వర్యాసక్తి ప్రవాహం కొందరు క్రైస్తవులను తనతోపాటూ తీసుకెళ్లింది. సౌకర్యవంతమైన జీవన విధానం కొరకైన తీర్మానపూరిత ప్రయత్నం చివరకు మనలను మన ఆధ్యాత్మిక గమ్యాలనుండి నిశ్చయంగా ప్రక్కకు తీసుకెళ్తుంది.—మత్తయి 6:24 పోల్చండి.

ఈ ప్రమాదాన్ని గురించి హెచ్చరిస్తూ, యేసు ఇలా చెప్పాడు: “దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు వెలుగు మయమైయుండును. నీ కన్ను చెడినదైతే [“అసూయగలదైతే,” NW అథఃస్సూచి] నీ దేహమంతయు చీకటిమయమై యుండును.” (మత్తయి 6:22, 23) ‘తేటగా ఉండే’ కన్ను ఆధ్యాత్మిక విషయాలపై కేంద్రీకరించబడి ఉంటుంది, అంటే దేవుని రాజ్యంపై కేంద్రీకరించబడి ఉన్న కన్ను అన్న మాట. మరో వైపు, ‘చెడినదైన’ లేక “అసూయగల” కన్ను హ్రస్వదృష్టిగలది, అది అవ్యవహిత శరీరాశలపై మాత్రమే దృష్టినిల్పుతుంది. ఆధ్యాత్మిక గమ్యాలు మరియు భవిష్యత్‌ ప్రతిఫలాలు దాని పరిథి వెలుపల ఉంటాయి.

“నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును” అని యేసు అంతకు ముందు వచనంలో చెప్పాడు. (మత్తయి 6:21) మన హృదయం ఆధ్యాత్మిక విషయాలపై కేంద్రీకరించబడి ఉందా లేక వస్తుసంబంధ విషయాలపై కేంద్రీకరించబడి ఉందా అనే విషయాన్ని మనమెలా తెలుసుకోగలం? “హృదయము నిండియుండు దానినిబట్టి యొకని నోరు మాటలాడును” గనుక, అతి శ్రేష్ఠమైన మార్గదర్శకం బహుశ మన సంభాషణే. (లూకా 6:45) మనం వస్తు సంబంధమైన సంగతులు లేక ప్రాపంచిక సాఫల్యాలను గురించి మాట్లాడుతున్నామనే విషయాన్ని మనం కనుగొంటే, మన హృదయం విభాగించబడి ఉందనీ మరియు మన ఆధ్యాత్మిక దృష్టి తేటగా లేదనీ చెప్పేందుకు అది రుజువుగా ఉంటుంది.

కార్మిన్‌ అనే ఒక స్పానిష్‌ సహోదరి ఈ సమస్యతో పోరాడింది.a ఆమె ఇలా వివరిస్తుంది: “నేను సత్యంలోనే పెంచబడ్డాను, అయితే 18 ఏళ్ల వయస్సులో నేను నా స్వంత నర్సరీ పాఠశాలను ప్రారంభించాను. మూడు సంవత్సరాలు గడిచేసరికి నేను నలుగురు ఉద్యోగినులను పెట్టుకున్నాను, నా వ్యాపారం బాగా వర్థిల్లుతోంది, నేను ఎంతో ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతున్నాను. నేను ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నాను మరియు నేను ‘విజయవంతంగా’ ఉన్నాననే వాస్తవం బహుశ నాకు ఎక్కువ సంతృప్తికరంగా అనిపించింది. వాస్తవంగా చెప్పాలంటే, నా మనస్సు నా వ్యాపారంలో ఉంది, అదే నాకు అత్యంత ఇష్టమైన విషయంగా ఉంది.

“నా సమయంలో అత్యధిక భాగాన్ని నేను నా వ్యాపారాసక్తుల కొరకు వెచ్చిస్తూ కూడా నేను ఒక సాక్షిగా ఉండగలనని భావించాను. మరోవైపు, యెహోవాను సేవించేందుకు నేను ఎక్కువ చేయగలననే భావన కూడా నాకు లోలోన ఎడతెగక కలుగుతూ ఉండేది. రాజ్యాసక్తులను ముందుంచేందుకు నన్ను తుదకు పురికొల్పిన విషయం, పయినీర్లయిన నా ఇద్దరు స్నేహితుల మాదిరే. వారిలో ఒకామె హూలియానా, ఆమె మా సంఘంలోనే ఉండేది. నేను పయినీరింగ్‌ చేయాలని ఆమె నన్ను ఒత్తిడి చేయలేదు, అయితే ఆమె సంభాషణ మరియు ఆమె తన పరిచర్య ద్వారా పొందుతున్న స్పష్టమైన ఆనందం నేను నా ఆధ్యాత్మిక విలువలను పునఃపరిశీలించుకునేందుకు నాకు సహాయం చేశాయి.

“కొంత కాలం తర్వాత, నేను సెలవులకు అమెరికాకు వెళ్లినప్పుడు నేను ఒక పయినీరు సహోదరి అయిన గ్లోరీ వాళ్ల ఇంట్లో ఉన్నాను. ఆమె ఇటీవలనే తన భర్తను మరణమందు కోల్పోయింది, ఆమె తన ఐదేళ్ల పాపనూ మరి క్యాన్సర్‌ ఉన్న తల్లినీ చూసుకుంటూ ఉంది. అయినప్పటికీ ఆమె పయినీర్‌ సేవ చేస్తుంది. ఆమె మాదిరి మరియు పరిచర్య కొరకైన ఆమె మెప్పుదల నా హృదయాన్ని స్పర్శించాయి. ఆమె ఇంట్లో నేను గడిపిన నాలుగే నాలుగు దినాలు నేను యెహోవాకు ఇంకా శ్రేష్ఠమైన సేవ చేయాలని నేను తీర్మానించుకునేలా చేశాయి. మొదటిగా నేను ఒక క్రమ పయినీర్‌నయ్యాను, మరి కొన్ని సంవత్సరాల తర్వాత నేనూ నా భర్త బేతేలులో సేవ చేసేందుకు ఆహ్వానించబడ్డాము. నేను నా ఆధ్యాత్మిక పురోభివృద్ధికి అడ్డంకైన నా వ్యాపారాన్ని వదిలేశాను, మరి ఇప్పుడు నా జీవితం ముఖ్యంగా యెహోవా దృష్టిలో ఎంతో విజయవంతంగా ఉందని నేను భావిస్తున్నాను, మరి ముఖ్యమైన విషయం అదే.”—లూకా 14:33.

కార్మిన్‌ వలె ‘శ్రేష్ఠమైన కార్యాలను వివేచించడాన్ని’ నేర్చుకోవడం, మన ఉద్యోగం, విద్యాభ్యాసం, ఇల్లు మరియు జీవిత విధానానికి సంబంధించిన విషయాలను గురించి మంచి నిర్ణయాలు తీసుకునేందుకు మనకు సహాయం చేస్తుంది. (ఫిలిప్పీయులు 1:9) మరి వినోదం విషయానికొచ్చినప్పుడు కూడా మనం శ్రేష్ఠమైన కార్యాలను వివేచిస్తామా? లౌకికాత్మ తీవ్రమైన ప్రభావాన్ని చూపే మరో రంగం ఇది.

విరామాన్ని తగిన స్థానంలో ఉంచండి

విశ్రాంతి మరియు విరామం కొరకైన ప్రజల సహజ కోరికను లౌకికాత్మ వంచనతో ఉపయోగించుకుంటుంది. అనేకమంది ప్రజలకు భవిష్యత్తును గురించిన వాస్తవికమైన నిరీక్షణ లేదు గనుక, వారు ప్రస్తుతాన్ని వినోదం మరియు విశ్రాంతితో నింపాలని ప్రయత్నించడాన్ని అర్థం చేసుకోవచ్చు. (యెషయా 22:13; 1 కొరింథీయులు 15:32 పోల్చండి.) మనం విశ్రాంతికి మరింత ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నామని మనం కనుగొంటున్నామా? ఈ లౌకికాత్మ మన దృక్పథాన్ని మార్చివేస్తుందనేందుకు ఇది ఒక సూచన కాగలదు.

బైబిలు ఇలా హెచ్చరిస్తుంది: “సుఖభోగములయందు [“వినోదం,” లమ్‌సా] వాంఛగలవానికి లేమి కలుగును.” (సామెతలు 21:17) ఆనందించడం తప్పు కాదు, అయితే దాన్ని ప్రేమించడం, లేక దానికి ప్రాముఖ్యతను ఆపాదించడం ఆధ్యాత్మిక లేమికి దారితీయగలదు. మన ఆధ్యాత్మిక ఆకలి నిశ్చయంగా మందగిస్తుంది, మరియు సువార్తను ప్రకటించేందుకు మనం తక్కువ సమయాన్ని కలిగి ఉంటాము.

ఈ కారణం చేత, మనం మన “మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ధిగల”వారమై ఉండాలని దేవుని వాక్యం మనకు సలహా ఇస్తోంది. (1 పేతురు 1:13) మన విరామ సమయాన్ని సహేతుకమైన పరిమాణానికి నియంత్రించేందుకు నిబ్బరమైన బుద్ధి అవసరం అవుతుంది. పని చేసేందుకు నడుం కట్టుకోవడం అంటే ఆధ్యాత్మిక కార్యకలాపాల కొరకు అవి అధ్యయనం అయినా, కూటాలైనా లేక ప్రాంతీయ సేవ అయినా, వాటి కొరకు సిద్ధంగా ఉండటమని దాని భావం.

మరి అవసరమైన విశ్రాంతి సంగతేమిటి? మనం విశ్రాంతి తీసుకునేందుకు కొంత సమయాన్ని వెచ్చించినప్పుడు మనం తప్పు చేసినట్లు భావించాలా? ఎంత మాత్రం కాదు. విశ్రాంతి అవసరమే, ప్రాముఖ్యంగా ఒత్తిడితో నిండివున్న నేటి ప్రపంచంలో అది చాలా అవసరం. అయినప్పటికీ, సమర్పించుకున్న క్రైస్తవులుగా మనం మన జీవితం విశ్రాంతి చుట్టూ పరిభ్రమించేందుకు అనుమతించ కూడదు. మరీ ఎక్కువ విశ్రాంతి మరింత తక్కువ అర్థవంతమైన కార్యకలాపాలలోకి మనలను నెట్టివేయగలదు. అది మన అత్యవసర భావాన్ని తగ్గించి, స్వయం ప్రీతిని ప్రోత్సహించనూ గలదు. మరి విశ్రాంతి ఎడల మనం సమతూకమైన దృక్పథాన్ని ఎలా కలిగి ఉండగలము?

ప్రాముఖ్యంగా లౌకిక ఉద్యోగం అనవసరమైనప్పుడు అధికంగా కష్టపడే బదులు తగినంత విశ్రాంతి తీసుకోవాలని బైబిలు సలహా ఇస్తోంది. (ప్రసంగి 4:6) విశ్రాంతి మన శరీరాలు శక్తిని పుంజుకునేందుకు సహాయం చేస్తున్నప్పటికీ, మన ఆధ్యాత్మిక శక్తికి మూలం దేవుని చురుకైన శక్తే. (యెషయా 40:29-31) మన క్రైస్తవ కార్యకలాపాల విషయంలో మనం ఈ పరిశుద్ధాత్మను అందుకుంటాము. వ్యక్తిగత అధ్యయనం మన హృదయాలకు పోషణనిచ్చి సరైన కోరికలను ప్రేరేపిస్తుంది. కూటాలకు హాజరు కావడం మన సృష్టికర్త ఎడల మెప్పుదలను పుట్టిస్తుంది. క్రైస్తవ పరిచర్యలో పాలు పంచుకోవడం ఇతరుల ఎడల భావాత్మకంగా ఉండటాన్ని పురికొల్పుతుంది. (1 కొరింథీయులు 9:22, 23) పౌలు వాస్తవికంగా వివరించిన విధంగా, “బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు.”—2 కొరింథీయులు 4:16.

ఆరుగురు పిల్లల తల్లి మరియు ఒక అవిశ్వాసియైన భర్తగల ఇలియానా జీవితం ఎంతో పని రద్దీ గలది. ఆమె తన కుటుంబీకుల మరియు అనేక ఇతర బంధువుల బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది, అందుకని ఆమె ఎల్లప్పుడూ అన్ని చోట్లా పని తొందరలోనే ఉంటుంది. అయినప్పటికీ, ఆమె ప్రకటనాపని మరియు కూటాలకు సిద్ధం కావడం విషయంలో ఎంతో చక్కని మాదిరిని ఉంచుతుంది. ఆమె అన్ని పనులు ఎలా చేయగలుగుతుంది?

ఇలియానా ఇలా వివరిస్తుంది: “కూటాలు మరియు ప్రాంతీయసేవ నేను నా ఇతర బాధ్యతలను సరిగ్గా నిర్వహించేందుకు నాకు వాస్తవంగా సహాయం చేస్తాయి. ఉదాహరణకు, ప్రకటనాపని చేసిన తర్వాత నేను ఇంటి పని చేస్తున్నప్పుడు ఆలోచించేందుకు నేను ఎన్నో విషయాలను కలిగి ఉంటాను. నేను పని చేస్తున్నప్పుడు తరచూ పాటలు పాడతాను. మరో వైపు, నేను కూటానికి హాజరు కాకపోతే లేక ప్రాంతీయసేవలో ఎక్కువ చేయలేకపోతే, ఇంటి పనులు చేయడం మరీ కష్టంగా ఉంటుంది.”

విశ్రాంతికివ్వబడిన అధిక ప్రాముఖ్యతనుండి ఇదెంత భిన్నంగా ఉందో కదా!

ఆధ్యాత్మిక సౌందర్యం యెహోవాను ప్రీతిపరుస్తుంది

భౌతిక రూపం ఎడల విపరీతమైన ఆసక్తి చూపుతున్న లోకంలో మనం జీవిస్తున్నాము. తమ రూపాన్ని మెరుగుపర్చుకునేందుకూ వయస్సు పైబడటం యొక్క ప్రభావాలను తగ్గించేందుకూ రూపొందించబడిన చికిత్సల నిమిత్తం ప్రజలు ఎంతో ఎక్కువ డబ్బు వెచ్చిస్తారు. వాటిలో తల వెంట్రుకల ట్రాన్స్‌ప్లాంట్‌, వాటికి రంగు వేయడం, వక్షోజాల ఇంప్లాంట్‌ మరియు కాస్మటిక్‌ సర్జరీ వంటివి కూడా ఇమిడి ఉన్నాయి. కోట్లాదిమంది బరువు తగ్గించే కేంద్రాలకు, జిమ్‌లకూ అరోబిక్‌ తరగతులకూ వెళ్తారు, లేక వారు వ్యాయామ వీడియోలనూ ఆహార నియమ పుస్తకాలనూ కొనుక్కుంటారు. ఆనందానికి గల మార్గం మన భౌతిక రూపమనీ అంటే మన “రూపమే” సర్వస్వమనీ మనం విశ్వసించేలా ఈ లోకం మనలను నమ్మించగలదు.

అమెరికాలో, శ్వేత జాతీయులైన అమెరికన్‌ యువతలోని 90 శాతం, తమ శరీరాలను గురించి ఎంతో “అసంతృప్తి” కలిగి ఉన్నారని న్యూస్‌వీక్‌ పత్రిక ద్వారా ఉదహరించబడిన ఒక సర్వేక్షణ కనుగొన్నది. చక్కని ఆకృతి కొరకైన మన తీవ్ర అన్వేషణ మన ఆధ్యాత్మికతను ప్రభావితం చేయగలదు. డోరా అనే యౌవన యెహోవాసాక్షి తాను కాస్త ఎక్కువ బరువు ఉన్నందున తన భౌతిక రూపాన్ని బట్టి ఆమె ఎంతో సిగ్గుపడేది. ఆమె ఇలా వివరిస్తుంది: “నేను షాపింగ్‌కు వెళ్తే, నాకు సరిపోయే బట్టలను కనుగొనడం ఎంతో కష్టంగా ఉండేది. సన్నగా ఉండే యౌవనస్థుల కొరకే అందమైన బట్టలు తయారు చేస్తారేమోనని నాకు అనిపించేది. ఇంకా ఘోరంగా నా బరువును గురించి ప్రజలు చేసే అవమానకరమైన వ్యాఖ్యానాలు నాకు మరింత కలత కలిగించేవి, ప్రాముఖ్యంగా అవి నా ఆధ్యాత్మిక సహోదర సహోదరీల నుండి వచ్చినప్పుడు.

“దాని ఫలితంగా, నేను నా రూపాన్ని గురించి ఎక్కువగా చింతించడం ప్రారంభించాను, అది ఎంతగానంటే నా ఆధ్యాత్మిక విలువలు నా జీవితంలో రెండవ స్థానాన్ని వహించడం ప్రారంభించాయి. నా ఆనందం నా నడుం కొలతపైనే ఆధారపడి ఉందన్నట్లు ఉండేది. అనేక సంవత్సరాలు గడిచాయి, మరి ఇప్పుడు నేను ఒక స్త్రీగా మరియు ఒక క్రైస్తవురాలిగా కూడా పరిణతి చెందాను, మరి నేను విషయాలను మరో విధంగా దృష్టిస్తాను. నేను నా రూపం ఎడల శ్రద్ధ కలిగి ఉన్నప్పటికీ, ఆధ్యాత్మిక సౌందర్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఉందని నేను గుర్తిస్తున్నాను, మరి అదే నాకు చాలా గొప్ప సంతృప్తినిస్తుంది. నేను దాన్ని ఒకసారి అర్థం చేసుకున్న తర్వాత నేను ఆధ్యాత్మిక ఆసక్తులకు వాటి సరైన స్థానాన్ని ఇవ్వగలిగాను.”

ఈ విషయంలో సమతూకమైన దృక్పథాన్ని కలిగి ఉన్న ప్రాచీన నమ్మకమైన స్త్రీ శారా. ఆమె 60 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఆమె భౌతిక సౌందర్యాన్ని గురించి బైబిలు మాట్లాడుతున్నప్పటికీ, అది ప్రాముఖ్యంగా ఆమె చక్కని లక్షణాల వైపుకు అంటే అంతరంగ వ్యక్తిత్వం వైపుకు అవధానాన్ని మళ్లిస్తుంది. (ఆదికాండము 12:11; 1 పేతురు 3:4-6) ఆమె నెమ్మదైన మరియు దీనమైన స్వభావం చూపింది, మరి లోబడుతూ తన భర్తకు విధేయత చూపింది. తనను ఇతరులు ఎలా దృష్టిస్తారు అనే విషయాన్ని గురించి శారా అధికంగా చింతించలేదు. ఆమె ధనిక కుటుంబానికి చెందినదైనప్పటికీ, 60 కంటే ఎక్కువ సంవత్సరాలు ఆమె గుడారాల్లో జీవించింది. ఆమె దీనత్వంతో మరియు నిస్వార్థంగా తన భర్తకు మద్దతునిచ్చింది; ఆమె విశ్వాసం గల స్త్రీ. ఆమెను వాస్తవంగా సౌందర్యంగల స్త్రీగా చేసినది ఆ విషయమే.—సామెతలు 31:30; హెబ్రీయులు 11:11.

క్రైస్తవులముగా మనం, క్రమంగా వృద్ధి చేసుకుంటే వర్థిల్లి, నిలిచియుండగల సౌందర్యాన్ని అంటే మన ఆధ్యాత్మిక సౌందర్యాన్ని మెరుగుపర్చుకునే విషయం ఎడలనే మనం ఆసక్తి కలిగి ఉంటాము. (కొలొస్సయులు 1:9, 10) మనం మన ఆధ్యాత్మిక సౌందర్యం ఎడల రెండు మార్గాల్లో శ్రద్ధ వహించవచ్చు.

మనం జీవాన్ని కాపాడే మన పరిచర్యలో భాగం వహిస్తుండగా యెహోవా దృష్టిలో మరింత అందంగా తయారవుతాము. (యెషయా 52:7; 2 కొరింథీయులు 3:18–4:2) అంతేకాకుండా, క్రైస్తవ లక్షణాలను ప్రదర్శించడాన్ని మనం నేర్చుకుంటుండగా, మన సౌందర్యం ప్రగాఢమౌతుంది. మన ఆధ్యాత్మిక సౌందర్యాన్ని మెరుగుపర్చుకునే అవకాశాలు చాలా ఉన్నాయి: “సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై [ఉండుడి], ఘనతవిషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. . . . ఆత్మయందు తీవ్రతగలవారై [ఉండుడి]. . . . శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. . . . సంతోషించు వారితో సంతోషించుడి; ఏడ్చువారితో ఏడువుడి; . . . కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; . . . సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.” (రోమీయులు 12:10-18) అలాంటి దృక్పథాలను వృద్ధి చేసుకోవడం మనలను దేవునికీ మరియు తోటి మానవులకూ కూడా ప్రియమైన వారిగా చేస్తుంది, మరియు మనం సంతరించుకున్న పాపపు ప్రవృత్తుల వికృత రూపాన్ని అది తగ్గిస్తుంది.—గలతీయులు 5:22, 23; 2 పేతురు 1:5-8.

మనం లౌకికాత్మను ఎదిరించగలం!

అనేక మోసకరమైన మార్గాల్లో, విషపూరితమైన లౌకికాత్మ మన విశ్వాస్యతను బలహీనపర్చగలదు. మనం కలిగివున్న వాటి విషయంలో మనం అసంతృప్తి కలిగి ఉండేలా మరియు మన అవసరతలూ ఆసక్తులను దేవునికంటే ముందుగా ఉంచేలా చేయగలదు. లేదా విరామానికీ లేక భౌతిక రూపానికీ అనవసరమైన ప్రాముఖ్యతను ఆపాదిస్తూ మనం దేవుని తలంపులకంటే మానవుల తలంపులను ముందుంచేలా అది నడిపించవచ్చు.—మత్తయి 16:21-23 పోల్చండి.

సాతాను మన ఆధ్యాత్మికతను నాశనం చేయాలని తీర్మానించుకున్నాడు మరి లౌకికాత్మ అతని ముఖ్య అస్త్రాల్లో ఒకటి. అపవాది తన పన్నుగడలను మార్చి గర్జించు సింహం వలె కాకుండా సర్పం వలె కుయుక్తిని ఉపయోగించగలడనే విషయాన్ని గుర్తుంచుకోండి. (ఆదికాండము 3:1; 1 పేతురు 5:8) ఈ లోకం క్రూరమైన హింస ద్వారా ఒక క్రైస్తవున్ని కేవలం అరుదుగా మాత్రమే జయించగలదు, అయితే అతన్ని చాలా తరచుగా మెల్లిగా విషపూరితం చేస్తుంది. పౌలు ఆ రెండవ రకపు ప్రమాదాన్ని గురించి ఎక్కువ చింత కలిగి ఉన్నాడు: “సర్పము తన కుయుక్తిచేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులును చెరుపబడి, క్రీస్తు ఎడలనున్న సరళతనుండియు పవిత్రతనుండియు ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను.”—2 కొరింథీయులు 11:3.

మనలను మనం సర్పం యొక్క కుయుక్తుల నుండి కాపాడుకునేందుకు, మనం “లోకసంబంధమైన” ప్రచారాన్ని గుర్తించ వలసిన మరియు దాన్ని దృఢంగా తిరస్కరించవలసిన అవసరం ఉంది. (1 యోహాను 2:16) లౌకిక ఆలోచనావిధానం నిరపాయకరమైనదని నమ్మేలా మనం మోసగించబడ కూడదు. సాతాను విధానపు విషపూరితమైన గాలి విపరీతమైన స్థాయికి చేరిపోయింది.—ఎఫెసీయులు 2:2.

ఒకసారి లౌకిక ఆలోచనావిధానాన్ని గుర్తించిన వెంటనే, మనం మన మనస్సులనూ హృదయాలనూ యెహోవా యొక్క స్వచ్ఛమైన బోధతో నింపుకోవడం ద్వారా దాన్ని ఎదురాడవచ్చు. రాజైన దావీదు వలె, మనం కూడా ఇలాగే చెబుదాము: “యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము నీత్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము.”—కీర్తన 25:4, 5.

[అధస్సూచీలు]

a ప్రత్యామ్నాయ పేర్లు ఉపయోగించబడ్డాయి.

[26వ పేజీలోని చిత్రం]

సౌకర్యవంతమైన జీవిత విధానం కొరకైన ప్రయత్నం మనలను మన ఆధ్యాత్మిక గమ్యాలనుండి ప్రక్కకు తీసుకెళ్లగలదు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి