అవసరాల్లో ఉన్న వారి ఎడల ప్రేమ చూపడం
అవసరాల్లో ఉన్న తమ సహోదర సహోదరీల ఎడల ప్రేమ చూపడం క్రైస్తవుల కర్తవ్యమూ బాధ్యతా కూడా. (1 యోహాను 3:17, 18) అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము.” (గలతీయులు 6:10) దాదాపు నాలుగు దశాబ్దాలుగా యెహోవాను సేవిస్తూవున్న ఒక సహోదరుడు, తన భార్య అనారోగ్యంగా ఉన్న సమయంలో తుదకు మరణించిన సమయంలో క్రైస్తవ సహోదరత్వపు ప్రేమను ఇటీవలనే అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. ఆయనిలా వ్రాస్తున్నాడు:
“నా భార్య అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను ఆమెను ఇంట్లోనే ఉంచి ఆమె ఎడల శ్రద్ధవహించాను గనుక, దాదాపు రెండు నెలలపాటూ నేను ఉద్యోగం చేయలేకపోయాను. సంఘంలోని స్నేహితులు ఇష్టపూర్వకంగా మా సహాయానికి వచ్చినప్పుడు నేనెంత ఉపశమనం పొందానో! డజన్ల కొద్దీ వచ్చిన ద్రవ్య రూప బహుమానాలు—వాటి వెంట వచ్చిన కార్డుల్లో ‘అదనపు ఖర్చులను తీర్చడానికి సహాయం’ అని ఉన్నట్టుగానే—మా నెలసరి ఖర్చులు, బిల్లులు మరియు ఇతర అవసరాలు తీర్చాయి.
“నా భార్య చనిపోయేందుకు రెండు వారాల ముందు, మా ప్రయాణ పైవిచారణ కర్త మమ్మల్ని సందర్శించి ప్రోత్సహించాడు. సంఘం ఆ వారం చివరలో చూడబోయే స్లైడులను కూడా ఆయన మాకు చూపించాడు. మేము టెలిఫోన్ ద్వారా మీటింగులను వినగలిగాము, అందులో ప్రాంతీయ పైవిచారణ కర్త నిర్వహించిన ప్రాంతీయసేవ కొరకైన కూటాలు కూడా చేరి ఉన్నాయి. అలాంటి ఒక కూటంలో ప్రాంతీయసేవ కొరకు వచ్చిన వారంతా కలిసి నా భార్యకు ‘హలో’ చెప్పేలా చేశాడాయన. అలా ఆమె భౌతికంగా దూరంగా ఉన్నా ఆమె ఎన్నడూ తాను ఒంటరిగా ఉన్నట్లు భావించలేదు.
“ఆమె మరణించిన తర్వాత ఒక గంట లోపే, దాదాపు మా సంఘ పెద్దలందరూ మా ఇంటికి వచ్చేశారు. కేవలం ఆ ఒక్క రోజులోనే వందకంటే ఎక్కువమంది సహోదరసహోదరీలు మా ఇంటికి వచ్చారు. అక్కడున్న వారంతా భుజించేలా ఆహారం ‘అద్భుత రీతిలో’ టేబుల్‌పైకి వచ్చేసింది. నా కొరకు వచ్చిన బహుమతులు, సానుభూతిని వ్యక్తం చేయడం, ఓదార్పుకరమైన మాటలు మరియు ప్రార్థనలు, ఇలా నేను వివరంగా చెప్పలేనన్ని ఉన్నాయి. అవి నన్ను ఎంతగానో బలపరిచాయి! నాకు ఆహారాన్నీ, ఇల్లు శుభ్రం చేసుకునే విషయంలో సహాయాన్నీ ఇవ్వడం ఇక ఆపుజేయండి అని నేను తుదకు సహోదరులకు చెప్పవలసి వచ్చింది!
“యెహోవా సంస్థలో కాక మరింకెక్కడ మనం దయ, శ్రద్ధ మరియు ప్రేమ యొక్క నిస్వార్థ వ్యక్తీకరణలను చూడగలం? తమకున్న వాస్తవమైన స్నేహితుల సంఖ్యను అనేకమంది ప్రజలు నేడు కేవలం చేతి వేళ్లపైనే లెక్కించగలరు. ఆధ్యాత్మిక సహోదరసహోదరీల విస్తృత కుటుంబాన్ని మనకిచ్చి యెహోవా మనలను దీవించాడు!”—మార్కు 10:29, 30.