యెహోవా సేవలో సుదీర్ఘమైన జీవితాన్ని కలిగి ఉన్నందుకు కృతజ్ఞురాలిని
ఓటీలి మిడ్లన్ చెప్పినది
అది పందొమ్మిదవ శతాబ్దపు చివరిభాగం. ఆ కాలంలో పశ్చిమ నార్వేలోని కాపర్వీక్ యొక్క ఓడరేవులో ప్రయాణ ఓడలు ప్రక్కప్రక్కగా నిలిపి ఉండేవి. ఆ రోజుల్లో మనుష్యుల తోపుడుబండ్లు గుర్రపు బండ్లు వీధుల్లో పరుగులిడుతూ ఉండేవి. ప్రజలు వెలుగు కొరకు మైనపు దీపాలు ఉపయోగించే వారు, వెల్లవేయబడిన ఇళ్లలో వెచ్చదనం కొరకు చెక్క ముక్కలను, బొగ్గును ఉపయోగించేవారు. అక్కడ 1898 జూన్నెలలో నేను జన్మించాను, నేను ఐదుగురు పిల్లల్లో రెండవ దానిని.
అప్పుడు 1905లో నాన్నగారికి ఉద్యోగం లేనందున, ఆయన అమెరికాకు వెళ్లారు. మూడు సంవత్సరాల తర్వాత, ఆయన పిల్లలమైన మా కొరకు చక్కని బహుమతులనూ, అమ్మ కొరకు పట్టు వస్త్రాలనూ, ఇతర వస్తువులనూ సూట్‌కేస్ నిండా తీసుకుని వచ్చారు. అయితే ఆయనకు అత్యంత విలువైన సంపద చార్లెస్ టేజ్ రస్సెల్ వ్రాసిన లేఖనాల్లో అధ్యయనాలు (ఆంగ్లం) అనే పేరుగల సంపుటులే.
ఈ పుస్తకాల నుండి తాను నేర్చుకున్న విషయాలను నాన్నగారు తన స్నేహితులకూ బంధువులకూ చెప్పడం ప్రారంభించారు. ప్రాంతీయ చాపల్ మీటింగుల్లో, నరకాగ్ని లేదనే విషయాన్ని చూపేందుకు ఆయన బైబిలును ఉపయోగించారు. (ప్రసంగి 9:5, 10) నాన్నగారు అమెరికా నుండి తిరిగి వచ్చిన మరుసటి సంవత్సరమైన 1909లో, బ్రదర్ రస్సెల్ నార్వేను సందర్శించి బర్గన్ మరియు ఇప్పుడు ఆజ్లో అయిన క్రిష్ఛీయానీల్లో ప్రసంగాలు ఇచ్చారు. ఆయన చెప్పే విషయాలు వినేందుకు నాన్నగారు బర్గన్ వెళ్లారు.
నాన్నగారు అబద్ధ బోధలు చేస్తున్నారని ప్రజలు ఆయన్ను నిందించారు. నాకు ఆయన ఎడల జాలి కలిగింది, మరి పొరుగువారికి బైబిలు కరపత్రాలను అందించేందుకు నేను ఆయనకు సహాయం చేశాను. 1912లో నేను నరకాన్ని గురించిన ఒక కరపత్రాన్ని ఓ మతనాయకుని కుమార్తెకు అందించాను. ఆమె నన్నూ నాన్నగారినీ శాపనార్థాలు పెట్టింది. మత నాయకుని కుమార్తె అలా దుర్భాషలాడటం నాకు బాధ కలిగించింది.
ఇతర బైబిలు విద్యార్థులు—యెహోవాసాక్షులు అప్పట్లో అలా పిలువబడేవారు—కాపర్వీక్కి వచ్చి మమ్మల్ని సందర్శించారు, వారిలో సమర్థవంతంగా ప్రసంగించే థియోడర్ సిమోన్సన్ కూడా ఉన్నారు. మా ఇంట్లో ఆయన ఇచ్చే ప్రసంగాలకి నేను ప్రజలను ఆహ్వానించే దాన్ని. ప్రసంగం ఇచ్చే ముందు ఆయన జీథర్ వాయించి పాట పాడేవారు, తన ప్రసంగం తర్వాత ఆయన చక్కని ముగింపు పాట పాడేవారు. మాకు ఆయన ఎడల ప్రగాఢమైన గౌరవం ఉండేది.
మా ఇంటికి వచ్చే మరొక సందర్శకురాలు అన్నా ఆండర్సన్ అనే కాల్పొర్టర్ లేక పూర్తికాల పరిచారకురాలు. ఆమె నార్వే అంతటా ప్రజలకు బైబిలు సాహిత్యాలు అందిస్తూ నగర నగరానికీ తిరిగేది, ఆమె ఎక్కువగా తన సైకిలుపై వెళ్లేది. ఆమె ఒకప్పుడు సాల్వేషన్ ఆర్మీలో ఒక ఆఫీసరుగా పని చేసింది, కాబట్టి కాపర్వీక్ నందలి కొంతమంది సాల్వేషన్ ఆర్మీ ఆఫీసర్లు ఆమెకు తెలుసు. వారి కూటాలు జరిగే గృహంలో బైబిలు ప్రసంగం ఇచ్చేందుకు వారు ఆమెను అనుమతించారు, మరి ఆమె చెప్పేది వినేందుకు రమ్మని నేను ప్రజలను ఆహ్వానించాను.
కాపర్వీక్లో మమ్మల్ని సందర్శించిన మరొక కాల్పొర్టర్ కార్ల్ గాన్బర్. సాత్వికం, మృదుస్వభావంతో సరదాగా ఉండే ఈ వ్యక్తి, ఆజ్లో నందలి బ్రాంచి కార్యాలయంలో అనువాదకునిగా కూడా అప్పుడప్పుడూ సేవ చేసేవాడు. అనేక సంవత్సరాల తర్వాత మేమక్కడ కలిసి పని చేశాము.
మతపరమైన దృక్పథాల ద్వారా ప్రభావితం కావడం
ఆ కాలంలో, అనేకమంది ప్రజలకు దేవునియందూ బైబిలునందూ దృఢ విశ్వాసం ఉండటమే కాక, నరకాగ్నీ త్రిత్వం వంటి పాతుకుపోయిన నమ్మకాలు కూడా ఉండేవి. కాబట్టి ఈ సిద్ధాంతాలు బైబిలుకు అనుగుణంగా లేవని బైబిలు విద్యార్థులు బోధించినప్పుడు అదెంతో సంచలనం సృష్టించింది. మా నాన్నగారు మతభ్రష్టుడని మా పొరుగువారు తీవ్రంగా నిందించడం మూలంగా నేను ప్రభావితం చెందాను. నేను ఒకసారి ఆయనతో ఇలా కూడా అన్నాను: “మీరు బోధించేది సత్యం కాదు. అదంతా వితండవాదం!”
“ఓటీలి, ఇటువచ్చి బైబిలేం చెబుతుందో చూడమ్మా” అని ఆయన నన్ను ప్రోత్సహించారు. తర్వాత ఆయన నాకు లేఖనాల్లో నుండి చదివి వినిపించారు. దాని ఫలితంగా, ఆయన ఎడలా ఆయన చెప్పిన విషయాల ఎడలా నాకు నమ్మకం పెరిగింది. లేఖనాల్లో అధ్యయనాలు చదవమని ఆయన నన్ను ప్రోత్సహించారు, అలా 1914 వేసవి కాలంలో, నేను తరచూ పట్టణం బయట ఉన్న చిన్న కొండపై కూర్చుని చదివేదాన్ని.
మరి 1914లో ఆగష్టు నెలలో ప్రజలు, మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడాన్ని గురించి ప్రాంతీయ వార్తాపత్రిక ఆఫీసు బయట చదువుతూ గుమికూడారు. ఏం జరుగుతుందో చూసేందుకు నాన్నగారు అక్కడికి వచ్చారు. “దేవునికి కృతజ్ఞతలు!” అని ఆయన అన్నారు. యుద్ధం ప్రారంభం కావడంలో, తాను ప్రకటించిన బైబిలు ప్రవచనాల నెరవేర్పును ఆయన గుర్తించారు. (మత్తయి 24:7) తాము త్వరలోనే పరలోకానికి తీసుకు వెళ్లబడతామని అనేకమంది బైబిలు విద్యార్థులు అప్పట్లో విశ్వసించేవారు. అది సంభవించనప్పుడు, కొందరు నిరుత్సాహం చెందారు.
బైబిలు సత్యం కొరకు నేను స్థిరంగా నిలబడటం
నాకు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు అంటే 1915లో, నేను ప్రాథమికోన్నత పాఠశాల చదువు ముగించి ఒక కార్యాలయంలో పని చేయడం ప్రారంభించాను. అప్పుడు నేను కావలికోటను క్రమంగా చదవడం ప్రారంభించాను. అయితే 1918 వరకూ కూడా కాపర్వీక్లో క్రమంగా కూటాలు జరగడం మొదలుకాలేదు. మొదట్లో, కేవలం ఐదుగురమే హాజరయ్యాం. మేము లేఖనాల్లో అధ్యయనాలు వంటి వాచ్‌టవర్ సొసైటీ ప్రచురణలను చదివే వాళ్లం, ప్రశ్నాజవాబుల ద్వారా ఆ విషయాలను గురించి చర్చించే వాళ్లం. అమ్మ ఇతరులతో బైబిలు విద్యార్థులను గురించి ఉన్నతంగా మాట్లాడినప్పటికీ, ఆమె ఎన్నడూ మాలో ఒకరు కాలేదు.
నేను పని చేస్తున్న కార్యాలయంలో, 1918 ప్రారంభంలో, ఆంటన్ సార్ట్నెస్ అనే వ్యక్తితో నాకు పరిచయమైంది, అతను బైబిలు విద్యార్థి అయ్యేందుకు నేను అతనికి సహాయం చేయగలిగాను. ఆ సమయానికి నేను క్రమ ప్రచారకురాలినయ్యాను, మరి 1921లో బర్గన్లో జరిగిన సమావేశంలో నేను బాప్తిస్మం తీసుకున్నాను.
స్వీడన్ నందలి ఓరెబ్రోలో 1925లో, స్కాండినేవియాకు అంతటికీ కలిపి ఒక సమావేశం జరిగింది. 500 కంటే ఎక్కువమంది హాజరయ్యారు, అందులో వాచ్‌టవర్ సంస్థ అధ్యక్షుడైన జోసఫ్ ఎఫ్. రూథర్‌ఫోర్డ్ కూడా ఉన్నారు. దాదాపు 30 మందిమి ట్రైనులో మా కొరకు రిజర్వు చేయబడిన కంపార్టుమెంటులో ప్రయాణించి వెళ్లాము.
స్కాండినేవియా అంతటా మరియు బాల్టిక్ దేశాల్లో జరిగే ప్రకటనాపని ఎడల శ్రద్ధ వహించేందుకు డెన్మార్క్‌లోని కూపన్హాగన్లో ఒక ఉత్తర యూరోపియన్ కార్యాలయం స్థాపించబడుతుందని ఆ సమావేశంలో ప్రకటించారు. స్కాట్లాండ్కు చెందిన విలియమ్ డేను ప్రకటనాపనిని పర్యవేక్షించేందుకు నియమించారు. ఆయనంటే అందరికీ ఇష్టం అయ్యింది, మరి త్వరలోనే ఆయనను అందరూ బిగ్ స్కాట్మ్యాన్ అని పిలవనారంభించారు. మొదట్లో బ్రదర్ డేకు స్కాండినేవియన్ భాషలేవీ అసలు రావు, అందుకని ఆయన కూటాలూ సమావేశాల సమయంలో వెనక వైపు కూర్చుని, పిల్లలు గల వారు కార్యక్రమాన్ని శ్రద్ధగా వినేందుకు గానూ వారి పిల్లలను తాను చూచుకొనే వాడు.
1925 మార్చి 1 కావలికోట, ప్రకటన 12వ అధ్యాయాన్ని గురించి చర్చించింది మరియు ఈ అధ్యాయం దేవుని రాజ్య ఉద్భవంతో సంబంధాన్ని కలిగి ఉందనీ ఆ ఉద్భవం 1914లో పరలోకమందు సంభవించిందనీ వివరించింది. నేను దాన్ని అర్థం చేసుకోలేకపోయాను, అందుకని నేనా శీర్షికను పదే పదే చదివాను. నేను దాన్ని చివరకు అర్థం చేసుకున్నప్పుడు, నాకెంతో ఆనందం కలిగింది.
బైబిలు అంశాలను గురించిన మా అవగాహనలో సర్దుబాట్లు వచ్చినప్పుడు, కొందరు అభ్యంతరపడి దేవుని ప్రజలనుండి దూరమయ్యారు. అయితే అలాంటి సవరణను అర్థం చేసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు, అందులోని తర్కాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేందుకు నేను ఆ విషయాలను ఎల్లప్పుడూ పదే పదే చదివాను. నేను క్రొత్త వివరణను ఇంకా అర్థం చేసుకోలేకపోతే సవివరమైన వివరణ కొరకు నేను వేచి చూస్తాను. అలా ఓపికతో ఎదురు చూసినందుకు నేను అనేకసార్లు చక్కని ప్రతిఫలాన్ని పొందాను.
బేతేలు నందు సేవ
కొన్ని సంవత్సరాల వరకూ నేను బుక్‌కీపర్‌గా, సెక్రటరీగా మరియు కౌంటీ ఆడిటర్‌గా పని చేశాను. 1928లో సొసైటీ యొక్క ఆర్థిక విషయాలను చూసుకుంటున్న వ్యక్తి రోగగ్రస్తుడై, బేతేలు వదిలి వెళ్లిపోవలసి వచ్చింది. నాకు అలాంటి పనిలో అనుభవం ఉన్నందున, నన్ను ఆ పని చేపట్టమని అడిగారు. నేను 1928 జూన్‌లో బేతేలు సేవ ప్రారంభించాను. అప్పుడప్పుడూ బ్రదర్ డే మమ్మల్ని సందర్శించి నేను చేసిన అకౌంటు పనిని తనిఖీ చేసేవాడు. ఆజ్లోలో ప్రకటనాపనిలో మా బేతేలు కుటుంబం నాయకత్వం వహించింది, అక్కడ మాకు ఒక సంఘం మాత్రమే ఉండేది.
బేతేలులోని షిప్పింగ్ సేవకుడైన బ్రదర్ సాక్షామర్ గోల్డన్ ఏజ్ (ఇప్పుడు తేజరిల్లు!) పత్రికలను ప్యాక్ చేసి డిస్ప్యాచ్ చేసేందుకు మాలో కొంతమందిమి ఆయనకు సహాయం చేసే వాళ్లము. అలా సహాయం చేసిన వారిలో సిమోన్సన్ మరియు గాన్బర్ సహోదరులు ఉన్నారు. అలా పని చేస్తున్నప్పుడు తరచూ పాటలు పాడుతూ మేమెంతో ఆనందించాము.
రాజ్య నిరీక్షణలో దృఢ నమ్మకం
మరి 1935లో, “గొప్ప సమూహం” రెండవ స్థాయి పరలోక తరగతి కాదనే విషయాన్ని మేము అర్థం చేసుకున్నాము. బదులుగా, అది మహాశ్రమలను తప్పించుకుని భూమిపై పరదైసులో నిరంతరం జీవించే అవకాశాన్ని కలిగి ఉన్న మరొక తరగతికి ప్రాతినిధ్యం వహిస్తుందని మేము తెలుసుకున్నాము. (ప్రకటన 7:9-14) ఈ క్రొత్త అవగాహనతో, జ్ఞాపకార్థ చిహ్నాల్లో భాగం వహించిన కొందరు తాము భూ నిరీక్షణ కలిగి ఉన్నామనే విషయాన్ని గుర్తించి, ఇక వాటిలో భాగం వహించడం మానుకున్నారు.
నా పరలోక నిరీక్షణను గురించి నాకు ఎన్నడూ సందేహాలు రాకపోయినప్పటికీ, నేను తరచూ ఇలా ఆలోచించే దాన్ని, ‘దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు?’ అంత గొప్ప ఆధిక్యతకు నేను పాత్రురాలిని కాదని నేను భావించాను. ఒక చిన్న, బిడియస్థురాలైన ఒంటరి స్త్రీగా, పరలోకంలో క్రీస్తుతో పాటూ రాజుగా పరిపాలించడాన్ని ఊహించుకోవడం నాకు ఎంతో విచిత్రంగా అనిపించేది. (2 తిమోతి 2:11, 12; ప్రకటన 5:10) అయితే ‘ఘనులైన వారు’ పిలువబడలేదు గానీ, “బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు” అని అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటలను నేను మననం చేసుకున్నాను.—1 కొరింథీయులు 1:26, 27.
రెండవ ప్రపంచయుద్ధ కాలంలో కార్యకలాపం
మరి 1940 ఏప్రిల్ 9వ తేదీన, జర్మనీ సైన్యాలు నార్వేపై దండెత్తాయి, ఆ త్వరలోనే దేశం ఆక్రమించుకోబడింది. యుద్ధం కారణంగా, రాజ్య వర్తమానానికి అనేకులు ప్రతిస్పందించారు. 1940 అక్టోబరు నుండి 1941 జూన్ వరకూ మేము 2,72,000 కంటే ఎక్కువ పుస్తకాలనూ చిన్న పుస్తకాలనూ అందించాము. దాని అర్థం అప్పట్లో నార్వేలో ఉన్న 470 కంటే ఎక్కువమంది సాక్షుల్లో ప్రతి ఒక్కరూ సగటున, ఆ తొమ్మిది నెలల్లో 570 కంటే ఎక్కువ పుస్తకాలనూ చిన్న పుస్తకాలనూ అందించారని అర్థం!
మరి 1941 జూలై 8వ తేదీన, ప్రిసైడింగ్ ఓవర్సీయర్లను అందరినీ గెస్టపో కలిసి, ప్రకటనాపనిని ఆపుజేయకపోతే వారిని నిర్భంద శిబిరాలకు పంపిస్తామని చెప్పారు. ఐదుగురు జర్మనీ పోలీసు అధికారులు బేతేలుకు వచ్చి, వాచ్‌టవర్ సొసైటీ ఆస్తిలో అధిక శాతాన్ని జప్తు చేశారు. బేతేలు కుటుంబ సభ్యులను బయటకు తీసుకెళ్లి విచారణ చేశారు, అయితే మాలో ఎవరినీ నిర్భందించలేదు. తుదకు, 1941 జూలై 21వ తేదీన, సొసైటీ భవనాన్ని, ఇంకోగ్నిటోగేటేన్ 28 Bని వారు జప్తు చేశారు మరియు మా ప్రకటనాపనిని నిషేధించారు. నేను కాపర్వీక్కు తిరిగి వచ్చి నన్ను నేను పోషించుకునేందుకు ఉద్యోగం చేయడం ప్రారంభించాను.
ఆ సమయంలో నాన్నగారు పయినీరుగా సేవ చేస్తున్నారు. ఒకరోజు నాజీలు వచ్చి నాన్నగారి ఇల్లు సోదా చేశారు. ఆయన బైబిళ్లూ బైబిలు ఆకారాదిసూచికలతో సహా వారు ఆయన సాహిత్యాన్ని అంతటినీ తీసుకెళ్లారు. ఆ కాలమంతటిలో మాకు కేవలం కొద్దిగానే ఆధ్యాత్మిక ఆహారం దొరికేది. ఆధ్యాత్మికంగా దృఢంగా ఉండేందుకు, మేము ప్రభుత్వం (ఆంగ్లం) వంటి పాత పుస్తకాలను పదే పదే చదివేవాళ్లము, అలాగే మేము ప్రకటించడంలో కొనసాగాము.
విచారకరంగా, అనేక స్థలాల్లో సహోదరులు విభాగించబడ్డారు. మేము బహిరంగంగా ప్రకటించి ఇంటింటికీ వెళ్లాలని కొందరంటే, మరితరులు మన పనిని మరింత రహస్యంగా చేయాలనీ మరి ప్రజలను ఇతర మార్గాల్లో కలుసుకోవాలనీ అభిప్రాయపడ్డారు. అలా ప్రముఖులైన సహోదరులు, ముందు ఎంతో చక్కగా సహకరించిన వారూ, మరి మేము ఎంతో ప్రేమించిన వారు కూడా ఇప్పుడు ఒకరితోనొకరు మాట్లాడుకోవడం మానేశారు. అలా ఒక సాక్షిగా నేను నా జీవితంలో అనుభవించిన ఇతర ఏ పరిస్థితికన్నా కూడా వారి మధ్యన ఏర్పడిన విభజన నాకు ఎక్కువ దుఃఖాన్ని కలిగించింది.
యుద్ధం తర్వాత పునరుజ్జీవింపబడిన కార్యకలాపం
యుద్ధం తర్వాత, 1945 వేసవిలో, బ్రదర్ డే నార్వే సందర్శించి, ఆజ్లో, స్కీన్ మరియు బర్గన్లలో కూటాలను నిర్వహించాడు. వివాదాన్ని మర్చిపోమని ఆయన సహోదరులను వేడుకుని, అలా చేయాలని ఇష్టపడుతున్న వారందరినీ లేచి నిలబడమని అడిగాడు. అందరూ లేచి నిలబడ్డారు! మరి 1945 డిసెంబరులో అప్పటి సొసైటీ అధ్యక్షుడైన నేథన్ హెచ్. నార్ సందర్శించిన తర్వాత ఆ వివాదం శాశ్వతంగా పరిష్కరించబడింది.
ఇంతలో, 1945 జూలై 17న, బ్రాంచి కార్యాలయం నుండి నాకో టెలిగ్రామ్ అందింది, అందులో బ్రదర్ ఏనాక్ ఆమన్ ఇలా వ్రాశారు: ‘మీరు బేతేలుకు తిరిగి ఎప్పుడు రాగలరు?’ నేను వెళ్లకుండా ఇంటిదగ్గరే ఉండిపోయి, 70 కంటే ఎక్కువ సంవత్సరాల వయస్సులో ఉన్న నాన్నగారి ఎడల శ్రద్ధ తీసుకోవాలని కొందరు సాక్షులు అభిప్రాయపడ్డారు. అయితే నేను బేతేలు సేవను తిరిగి చేపట్టాలని నాన్నగారు నన్ను ప్రోత్సహించారు, నేను అలాగే తిరిగి వెళ్లాను. 1946లో మార్విన్ ఎఫ్. ఆండర్సన్ అనే అమెరికాకు చెందిన సహోదరుడు మా బ్రాంచి పైవిచారణకర్త అయ్యాడు, ఆయన ప్రకటనాపనిని తిరిగి సంస్థీకరించాడు.
వేసవి సెలవుల్లో నేను నా కుటుంబాన్ని చూసేందుకు కాపర్వీక్కు వచ్చేదాన్ని. నా ఇద్దరు సహోదరులు మరియు నా ఇద్దరు సహోదరీలు యెహోవాసాక్షులు కాలేదు, అయితే వారు నాతో నాన్నగారితో ఎల్లప్పుడూ స్నేహపూర్వకంగా ఉండేవారు. నా సహోదరుల్లో ఒకతను హార్బర్మాస్టర్ మరియు పైలెట్మాస్టర్ అయ్యాడు, మరి ఇంకొకతను అధ్యాపకుడయ్యాడు. నాకు వస్తురూపంగా చాలా తక్కువే ఉన్నప్పటికీ, నాన్నగారు వాళ్లతో ఇలా అనే వారు: “మీ కంటే ఓటీలి ఎంతో ధనవంతురాలు.” మరి అది సత్యమే! వారు సంపాదించుకున్నదంతా కూడా నేను ఆనందిస్తున్న ఆత్మీయ సంపదకు ఎంతమాత్రం సరిరాదు! నాన్నగారు 1951లో 78 సంవత్సరాల వయస్సులో మరణించారు. అమ్మ 1928లోనే మరణించింది.
న్యూయార్క్ నగరంలో 1953లో జరిగిన యెహోవా ప్రజల అంతర్జాతీయ సమావేశానికి హాజరవ్వడం నా జీవితంలోని అత్యంత గొప్ప విషయం. ఆ సంవత్సరం ప్రపంచంలో ప్రచారకుల సంఖ్య 5,00,000 పైగా దాటగా, 1,65,000 కంటే ఎక్కువమంది ఆ సమావేశానికి హాజరయ్యారు! 1953 సమావేశానికి ముందు, భూమిపై యెహోవా సంస్థ యొక్క ప్రధాన కార్యాలయమైన బ్రూక్లీన్ బేతేలులో నేను ఒక వారంపాటూ సేవ చేశాను.
నేను చేయగల సేవ చేయడం
ఇటీవలి సంవత్సరాల్లో కాటరాక్టు మూలంగా నా కంటిచూపు దెబ్బతిన్నది. శక్తివంతమైన కళ్లజోడు మరియు భూతద్దం సహాయంతో నేను ఇంకా పెద్ద అచ్చు కొంచెం చదవగలను. క్రైస్తవ సహోదరీలు వారానికి రెండుసార్లు నన్ను సందర్శిస్తారు మరియు నా కొరకు చదువుతారు, నేను అందునుబట్టి ఎంతో కృతజ్ఞురాలను.
నా ప్రకటనా కార్యకలాపం కూడా చాలా తక్కువగా ఉంటుంది. వేసవిలో క్రైస్తవ సహోదరీలు నన్ను నా చక్రాలకుర్చీలో బయటకు తీసుకుని వెళ్లారు, అక్కడ నేను కొంతమేరకు ప్రకటించగలిగాను. దాదాపు 100 సంవత్సరాల క్రితం నేను చదివిన ఒక ప్రాథమిక పాఠశాల వంటి కాపర్వీక్లోని అనేక పాఠశాలలకు నేను పత్రికలనూ బ్రోషూర్లనూ క్రమంగా పోస్టు ద్వారా పంపిస్తున్నాను. నేను ఇంకా క్రమ ప్రచారకురాలిగా ఉండగలుగుతున్నందుకు నేనెంతో ఆనందిస్తున్నాను.
బేతేలులో నా గది ఉన్న అంతస్థులోనే భోజనాలగదీ రాజ్య మందిరమూ ఉండటం ఎంతో సంతోషకరమైన విషయం, 1983 నుండి కూడా బేతేలు ఆజ్లోకు వెలుపల ఉన్న ఎట్లా ఎనేబాక్ వద్దనేవుంది. కాబట్టి నేను వాకర్ సహాయంతో ఉదయారాధనకు మరియు భోజనానికి రాగలుగుతున్నాను మరియు మన కూటాలకు వెళ్లగలుగుతున్నాను. నేను సభలకూ సమావేశాలకూ ఇంకా వెళ్లగలుగుతున్నందుకు నేనెంతో ఆనందంగా ఉన్నాను. నాకు అనేక సంవత్సరాలుగా తెలిసిన స్నేహితులనూ, అలాగే క్రొత్త సహోదర సహోదరీలనూ మరియు అనేకమంది చక్కని పిల్లలనూ కలవడం నాకెంతో ఇష్టంగా ఉంటుంది.
చివరి వరకూ విశ్వాసాన్ని కాపాడుకోవడం
బేతేలునందు చురుకైన, చక్కని మరియు ఆధ్యాత్మిక ప్రజల మధ్య ఉండగలగటం ఎంతో గొప్ప దీవెన. నేను నా బేతేలు సేవ ప్రారంభించినప్పుడు, పరలోక నిరీక్షణ ఉన్న వారు మాత్రమే ఆ కుటుంబంలో ఉన్నారు. (ఫిలిప్పీయులు 3:14) ఇప్పుడు నేను తప్ప బేతేలులో ఉన్న వారందరూ భూమిపై నిరంతరం జీవించే నిరీక్షణను కలిగి ఉన్నారు.
నిజమే, యెహోవా ఇంకా ముందే చర్య తీసుకుంటాడని మేము ఎదురు చూశాము. అయితే గొప్ప సమూహం ఇంకా ఇంకా పెద్దదౌతుండటాన్ని చూసి నేను ఆనందిస్తున్నాను. నేను ఎంతో అభివృద్ధిని చూశాను! నేను మొదటిసారి పరిచర్యలో భాగం వహించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కేవలం 5,000 మంది ప్రచారకులు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు 54,00,000 కంటే ఎక్కువమంది ఉన్నారు! ‘ఒంటరియైనవాడు వేయిమంది’ కావడం మరియు ‘ఎన్నికలేనివాడు బలమైన జనము’ కావడం నేను వాస్తవంగా చూశాను. (యెషయా 60:22) “అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును” అని ప్రవక్తయైన హబక్కూకు వ్రాసిన విధంగా మనం యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండవలసిన అవసరం ఉంది.—హబక్కూకు 2:3.