యెహోవాను తెలుసుకోండి ఆయన వ్యక్తిత్వమున్న దేవుడు
భారతదేశానికి చెందిన డా. ఎస్. రాధాకృష్ణన్ దేవుని గురించిన హైందవ సిద్ధాంతాన్ని ఇతర మత విధానాలతో పోలుస్తూ, ఇలా అభిప్రాయపడ్డాడు: “హెబ్రీయుల దేవుడు భిన్నమైనవాడు. ఆయన వ్యక్తిత్వమున్నవాడై, చరిత్రలో క్రియాశీలుడైయున్నాడు మరియు అభివృద్ధిచెందుతున్న ఈ ప్రపంచ మార్పుల ఎడల సంఘటనల ఎడల ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆయన మనతో సంభాషించే వ్యక్తిగావున్నాడు.”
బైబిల్లో దేవుని హెబ్రీ నామము יהוה, ఇది సాధారణంగా “యెహోవా” అని అనువదించబడుతుంది. ఆయన ఇతర దేవుళ్లందరి కంటే ఉన్నతమైనవాడు. ఆయన గురించి మనకేమి తెలుసు? బైబిలు కాలాల్లో ఆయన మానవులతో ఎలా వ్యవహరించాడు?
“ముఖాముఖిగా” యెహోవా మరియు మోషే
అక్షరార్థంగా మోషే దేవున్ని చూడకపోయినప్పటికీ, యెహోవాకు ఆయన సేవకుడైన మోషేకు మధ్యన “ముఖాముఖి” సన్నిహితత్వం ఉంది. (ద్వితీయోపదేశకాండము 34:10; నిర్గమకాండము 33:20) ఇశ్రాయేలీయులు ఐగుప్తునందు దాసత్వంలోవున్న కాలమందు యౌవనుడైన మోషేకు వారియెడల ఎంతో ప్రేమ ఉండేది. “దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట” కోసం ఆయన ఫరో గృహంలో సభ్యునిగా ఉండే జీవితాన్ని నిరాకరించాడు. (హెబ్రీయులు 11:25) దాని ఫలితంగా, యెహోవా మోషేకు అనేకమైన ప్రత్యేక ఆధిక్యతలను దయచేశాడు.
ఫరో గృహంలోని ఒక సభ్యునిగా, ‘మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించాడు.’ (అపొస్తలుల కార్యములు. 7:22) కాని ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి ఆయన వినయం, సహనం, సాత్వికం అనే లక్షణాలు కూడా వృద్ధిచేసుకోవలసిన అవసరత ఉంది. మిద్యానులో మందకాపరిగా ఉన్న 40 సంవత్సరాల కాలంలో ఆయన వాటిని వృద్ధిచేసుకున్నాడు. (నిర్గమకాండము 2:15-22; సంఖ్యాకాండము 12:3) యెహోవా, అదృశ్యంగానే ఉన్ననూ మోషేకు తనను తాను బయల్పర్చుకున్నాడు తన సంకల్పాల గురించి తెలియజేశాడు. మరియు దేవదూతల ద్వారా దేవుడు పది ఆజ్ఞలను ఆయనకు అప్పగించాడు. (నిర్గమకాండము 3:1-10; 19:3–20:20; అపొస్తలుల కార్యములు 7:53; హెబ్రీయులు 11:27) “మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను” అని బైబిలు మనకు చెబుతున్నది. (నిర్గమకాండము 33:11) వాస్తవానికి, “ముఖాముఖిగా అతనితో మాటలాడుదును” అని యెహోవా తానే చెప్పాడు. అదృశ్యునిగా ఉన్నప్పటికీ వ్యక్తిత్వమున్న దేవునితో మోషే ఎంత అమూల్యమైన, సన్నిహిత సంబంధాన్ని ఆనందించాడో కదా!—సంఖ్యాకాండము 12:8.
మోషే ఇశ్రాయేలు జనాంగము యొక్క తొలి చరిత్రతో పాటు, ధర్మశాస్త్రపు అన్ని భాగాలను నమోదు చేశాడు. ఆయనకు మరో అమూల్యమైన ఆధిక్యత అప్పగింపబడింది—అది ఆదికాండము అనే పుస్తకాన్ని వ్రాయడం. ఆ పుస్తకం యొక్క తరువాతి భాగములోని చరిత్ర ఆయన సొంత కుటుంబంలోని వారికి కచ్చితంగా తెలుసు కాబట్టి నమోదు చేయడం కొంతమేరకు సులభమయ్యింది. అయితే మానవుని తొలి చరిత్ర యొక్క వివరాలు మోషేకు ఎక్కడ నుండి లభించాయి? మూల సమాచారంగా ఉపయోగించడానికి, తన పితరుల ద్వారా జాగ్రత్త చేయబడిన పురాతన వ్రాతప్రతులు మోషే వద్ద ఉండే సాధ్యత ఉంది. మరో ప్రక్క, వాగ్రూపముగా పొందడం ద్వారా, యెహోవా నుండి వచ్చిన దైవీక ప్రకటన ద్వారా ఆయన వివరాలను పొంది ఉండవచ్చు. ఈ విషయంలో మోషే తన దేవునితో ఆనందించిన వ్యక్తిగత సంబంధాన్ని అన్ని కాలాల్లోని దైవభక్తిగల ప్రజలు ఎంతోకాలం క్రితమే అంగీకరించారు.
యెహోవా—ఏలీయాకు తెలిసిన వ్యక్తిత్వమున్న దేవుడు
యెహోవా వ్యక్తిత్వమున్న దేవుడని ప్రవక్త అయిన ఏలీయాకు కూడా తెలుసు. కనానీయుల సర్వదేవతాలయానికి ముఖ్య దేవత అయిన బయలు ఆరాధికుల వ్యతిరేకతకు, తీవ్రమైన ద్వేషానికి గురైనప్పటికీ ఏలీయా స్వచ్ఛారాధన ఎడల ఆసక్తి కలిగియుండి యెహోవా సేవచేశాడు.—1 రాజలు. 18:17-40.
ఇశ్రాయేలీయుల రాజైన అహాబు, అతని భార్యయైన యెజెబెలు ఏలీయాను చంపడానికి ప్రయత్నించారు. ప్రాణభయంతో ఏలియా మృత సముద్రానికి పశ్చిమానున్న బెయేర్షెబాకు పారిపోయాడు. అక్కడ ఆయన అరణ్యంలో సంచరిస్తూ మరణించడానికి ప్రార్థించాడు. (1 రాజులు 19:1-4) యెహోవా ఏలీయాను విడిచిపెట్టేశాడా? తన నమ్మకమైన సేవకుని ఎడల ఆయనకు ఇక ఎంత మాత్రం ఆసక్తి లేదా? ఏలీయా అలా అనుకొని ఉండవచ్చు, కాని ఆయన ఎంత పొరబాటుపడ్డాడో కదా! ఆ తరువాత, యెహోవా నెమ్మదిగా మాట్లాడుతూ ఆయనను ఇలా అడిగాడు: “ఏలీయా, యిచ్చట నీవేమి చేయుచున్నావు?” సహజాతీతమైన శక్తికి సంబంధించిన ఓ నాటకీయమైన ప్రదర్శన తరువాత, “అతనికి ఒక స్వరము వినబడెను . . . ఏలీయా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని యొకడు పలికిన మాట అతనికి [మరలా] వినబడెను.” తన విశ్వసనీయమైన సేవకుడిని ప్రోత్సహించడానికి యెహోవా ఏలీయా ఎడల ఈ వ్యక్తిగత శ్రద్ధను కనపర్చాడు. దేవుని కొరకు ఆయన చేయవలసిన పని ఎంతో ఉంది, మరి ఏలీయా ఆ పిలుపుకు ఆసక్తితో ప్రతిస్పందించాడు! వ్యక్తిత్వమున్న తన దేవుడైన యెహోవా నామాన్ని పరిశుద్ధపరుస్తూ, తనకు నిర్దేశించబడిన పనులను ఏలీయా నమ్మకంగా నెరవేర్చాడు.—1 రాజులు 19:9-18.
ఇశ్రాయేలు జనాంగమును తాను తిరస్కరించిన తరవాత, యెహోవా భూమి మీద ఉన్న తన సేవకులతో ఇక ఎన్నడూ వ్యక్తిగతంగా మాట్లాడలేదు. అంటే వారి ఎడల ఆయనకున్న వ్యక్తిగత ఆసక్తి క్షీణించిపోయిందని దీని భావం కాదు. తన పరిశుద్ధాత్మ ద్వారా, ఆయన ఇంకా తన సేవలో వారికి నడిపింపునిస్తూ వారిని బలపరుస్తున్నాడు. ఉదాహరణకు, పూర్వం సౌలు అని పిలువబడిన అపొస్తలుడైన పౌలును తీసుకోండి.
పరిశుద్ధాత్మ పౌలును నడిపించడం
సౌలు కిలికియ ముఖ్య పట్టణమైన తార్సుకు చెందినవాడు. ఆయన తలిదండ్రులు హెబ్రీయులు, కాని ఆయన రోము పౌరునిగా జన్మించాడు. అయితే, సౌలు పెంపకము పరిసయ్యుల కచ్చితమైన సిద్ధాంతాల ప్రకారం జరిగింది. తరువాత, యెరూషలేములో ధర్మశాస్త్ర ప్రముఖ ఉపదేశకుడైన “గమలీయేలు పాదములవద్ద” విద్యను అభ్యసించే అవకాశము ఆయనకు లభించింది.—అపొస్తలుల కార్యములు 22:3, 26-28.
యూదా సాంప్రదాయం ఎడల సౌలుకుగల తప్పుదారిపట్టిన ఆసక్తి మూలాన ఆయన, యేసు క్రీస్తు అనుచరులకు వ్యతిరేకంగా సాగిన హానికరమైన ఉద్యమంలో భాగంవహించాడు. మొదటి క్రైస్తవ హతసాక్షియైన స్తెఫను హత్యను కూడా ఆయన ఆమోదించాడు. (అపొస్తలుల కార్యములు 7:58-60; 8:1, 3) ఆ తరువాత, పూర్వం తాను దూషకునిగా, హింసకునిగా మరియు హానికరునిగా ఉన్నప్పటికీ కూడా, ‘తాను తెలియక అవిశ్వాసమువలన చేసినందున కనికరింపబడ్డానని’ ఒప్పుకున్నాడు.—1 తిమోతి 1:13.
దేవుని సేవించాలనే యథార్థమైన కోరిక సౌలును పురికొల్పింది. దమస్కుకు వెళ్లే దారిలో సౌలు యొక్క పరివర్తనం తరవాత యెహోవా ఆయనను అసాధారణ రీతిలో ఉపయోగించుకున్నాడు. తొలి క్రైస్తవ శిష్యుడైన అననీయ, ఆయనకు సహాయం చేయడానికి, పునరుత్థానుడైన క్రీస్తు ద్వారా నడిపించబడ్డాడు. ఆపిమ్మట పౌలు (క్రైస్తవునిగా మారిన తరువాత సౌలుకు కలిగిన రోమన్ పేరు) యూరపు, ఆసియా మైనరు ప్రాంతాల్లో సుదీర్ఘమైన ఫలవంతమైన పరిచర్యను నెరవేర్చడానికి యెహోవా పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపు పొందాడు.—అపొస్తలుల కార్యములు 13:2-5; 16:9, 10.
పరిశుద్ధాత్మ ద్వారా అదేవిధమైన నడిపింపును నేడు కనుగొనవచ్చా? అవును, కనుగొనవచ్చు.
నాస్తికత్వం యెహోవా వ్యక్తిగత ఆసక్తిని ఏమాత్రం అడ్డగించదు
జోసఫ్ ఎఫ్. రూథర్‌ఫోర్డ్ వాచ్‌టవర్ సంస్థ యొక్క రెండవ అధ్యక్షుడు. ఆయన బైబిలు విద్యార్థిగా—అప్పట్లో యెహోవా సాక్షులు అలా పిలవబడేవారు—1906లో బాప్తిస్మం తీసుకున్నాడు, ఆ మరుసటి సంవత్సరంలో ఆయన సంస్థ యొక్క చట్టబద్ధ సలహాదారుగా నియమించబడ్డాడు, 1917 జనవరిలో దాని అధ్యక్షుడయ్యాడు. అయినప్పటికీ, యౌవనస్థుడైన ఈ న్యాయవాది ఒకప్పుడు నాస్తికుడు. ఆయన యెహోవా యొక్క స్ఫూర్తిదాయక క్రైస్తవ సేవకుడెలా అయ్యాడు?
1913 జూలైలో, అమెరికానందలి మసాచుసెట్స్‌లోని స్ప్రింగ్ఫీల్డ్లో జరిగిన అంతర్జాతీయ బైబిలు విద్యార్థుల సమాఖ్య సమావేశానికి అధ్యక్షునిగా సేవచేశాడు. ది హోమ్స్డెడ్ అనే స్థానిక వార్తాపత్రిక విలేఖరి రూథర్‌ఫోర్డ్‌ను ఇంటర్వ్యూ చేశాడు, ఆ వృత్తాంతం సమావేశము యొక్క సోవినీర్ నివేదికలో తిరిగి ముద్రించబడింది.
తాను వివాహం చేసుకునే సమయానికి, తన మతసంబంధమైన అభిప్రాయాలు బాప్టిస్టు మతశాఖకు చెందినవని, కాని తన కాబోయే భార్య అభిప్రాయాలు ప్రెస్బిటేరియన్ మతశాఖకు చెందినవని రూథర్‌ఫోర్డ్ వివరించాడు. రూథర్‌ఫోర్డ్ పాస్టరు చెప్పినదేమిటంటే, “అతడు బాప్తిస్మం తీసుకున్నాడు గనుక తిన్నగా పరలోకానికి వెళతాడు కాని ఆమె బాప్తిస్మం తీసుకోలేదు గనుక ఆమె నరకాగ్నికి వెళుతుంది. దానితో ఆయన తార్కికమైన మనస్సు ఎదురుతిరిగింది, ఆయన ఒక నాస్తికుడయ్యాడు.”
వ్యక్తిత్వమున్న దేవుని మీద తన విశ్వాసాన్ని తిరిగి వృద్ధిచేసుకోవడానికి రూథర్‌ఫోర్డ్ అనేక సంవత్సరాలపాటూ శ్రద్ధగా పరిశోధించవలసి వచ్చింది. “మనసును సంతృప్తి పరచలేనిది హృదయాన్ని సంతృప్తి పరచలేదు” అనే భావం ఆధారంగా ఆయన తర్కించాడు. క్రైస్తవులు “తాము నమ్ముతున్న లేఖనాలు నిజమైనవని నిశ్చయత కలిగియుండాలి, వారు తాము నిలుచున్న పునాది గురించి తెలుసుకోవాలి” అని చెబుతూ రూథర్‌ఫోర్డ్ వివరించాడు.—2 తిమోతి 3:16, 17 చూడండి.
అవును, నేడు సహితం యెహోవా దేవునితో దృఢమైన వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోవడానికి మరియు విశ్వాసాన్ని వృద్ధిచేసుకోవడానికి నాస్తికునికి లేక అజ్ఞాతవాదికి సాధ్యమే. ఒక యౌవనస్థుడు, వాచ్‌టవర్ ప్రచురణ అయిన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తక సహాయంతో జాగ్రత్తగా బైబిలు పఠనం చేసిన తరువాత, ఇలా ఒప్పుకున్నాడు: “ఈ పఠనం ప్రారంభించినప్పుడు నేను దేవున్ని నమ్మేవాడిని కాదు, కాని ఇప్పుడు బైబిలు యొక్క జ్ఞానము నా ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చివేసినట్లు నేను కనుగొన్నాను. యెహోవాపై నమ్మకముంచి ఆయన గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను.”
“మూర్ఖుడు” మరియు దేవుడు
“దేవుని ఉనికిని గురించి వాదించడం లేక రుజువుపరచడం గురించి పా.ని. (హెబ్రీ లేఖనాలు) యొక్క ఏ గ్రంథకర్త కూడా తలంచలేదు” అని ఎ డిక్షనరి ఆఫ్ ది బైబిల్లో డా. జేమ్స్ హెస్టింగ్స్ అన్నాడు. “దేవుని ఉనికిని నిరాకరించడం, లేక దాన్ని నిరూపించడానికి వాదనలను ఉపయోగించడం సాధారణంగా ప్రాచీన లోకం యొక్క ఉద్దేశం కాదు. ఆ నమ్మకము మానవుని మనసుకు సహజమైనది మరియు ప్రతి ఒక్కరికి సర్వసాధారణమైనది.” దీని అర్థం, ఆ కాలంలో ఉన్న జనులందరు దైవభయం ఉన్నవారని కాదు. అది ఎంత మాత్రం నిజం కాదు. కీర్తన 14:1 మరియు 53:1 ఈ రెండూ, “దేవుడు లేడని” తమ హృదయంలో అనుకొనే ‘బుద్ధిహీనుని’ గురించి, లేక కింగ్ జేమ్స్ వర్షన్ చెబుతున్నట్లు ‘మూర్ఖుని’ గురించి ప్రస్తావిస్తున్నాయి.
దేవుని ఉనికిని నిరాకరించే ఈ మూర్ఖుడు, ఎటువంటి వ్యక్తియైయున్నాడు? అతడు మేధాపరంగా అజ్ఞాని కాడు. బదులుగా, హెబ్రీ పదమైన నావెల్ నైతిక కొరతను సూచిస్తుంది. ప్రొఫెసర్ ఎస్. ఆర్. డ్రయ్వర్, ది పార్లల్ సాల్టర్కు వ్రాసిన తన వ్యాఖ్యానంలో ఇలా తెలియజేశాడు, ఆ లోపం “సహేతుకతా బలహీనత కాదు గాని నైతిక మరియు మతసంబంధమైన ఉదాసీనత, జ్ఞానం యొక్క లేక భావస్ఫూర్తి యొక్క సంపూర్ణ లోపం.”
అలాంటి దృక్పథం యొక్క ఫలితమైన నైతిక పతనాన్ని కీర్తనల రచయిత ఇంకా ఇలా వర్ణిస్తున్నాడు: “వారు చెడిపోయినవారు, అసహ్యకార్యములు చేయుదురు. మేలుచేయువాడొకడును లేడు.” (కీర్తన 14:1) డా. హెస్టింగ్స్ క్లుప్తీకరించి ఇలా చెబుతున్నాడు: “లోకంలో దేవుడు లేకపోవడం, శిక్షా భయం లేకపోవడం ఆధారంగా, మనుష్యులు చెడిపోయినవారై దుష్క్రియలు చేస్తారు.” వారు దైవభక్తి లేని సూత్రాలను బహిరంగంగా అంగీకరిస్తారు మరియు లెక్క ఒప్పచెప్పడానికి తమకు ఇష్టంలేనందున, వ్యక్తిత్వమున్న దేవున్ని నిర్లక్ష్యం చేస్తారు. కాని, 3,000 సంవత్సరాల క్రితం కీర్తనల రచయిత తన మాటలను వ్రాసినప్పుడు అలాంటి ఆలోచనా విధానం ఎంత అవివేకంగా, తెలివితక్కువతనంగా ఉండినదో నేడూ అలాగే ఉంది.
వ్యక్తిత్వమున్న మన దేవుని నుండి హెచ్చరికలు
మనం ఇప్పుడు మన ప్రారంభ శీర్షికలో లేవదీయబడిన ప్రశ్నలను పరిశీలిద్దాము. నేటి లోకంలో వ్యాపించివున్న బాధను వ్యక్తిత్వమున్న దేవునితో ఎందుకు అనేకమంది ప్రజలు సమన్వయపర్చలేక పోతున్నారు?
“పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికి”న మనుష్యుల ద్వారా వ్రాయబడిన వ్రాతపూర్వక సమాచారము బైబిలులో ఉంది. (2 పేతురు. 1:21) అది మాత్రమే వ్యక్తిత్వమున్న దేవుడైన యెహోవాను మనకు వెల్లడిచేస్తుంది. మానవులకు కనిపించని, ఒక దుష్ట వ్యక్తిత్వమున్న వ్యక్తి గురించి కూడా అది మనల్ని హెచ్చరిస్తుంది, అతడు మానవ ఆలోచనా విధానాన్ని నిర్దేశించడంలో, అదుపు చేయడంలో ఎంతో శక్తిమంతుడైన అపవాదియగు సాతాను. సహేతుకంగా, వ్యక్తిత్వమున్న దేవునియందు మనకు నమ్మకం లేనట్లయితే వ్యక్తిత్వమున్న అపవాది లేక సాతాను కూడా ఉన్నాడని మనమెలా నమ్మగలం?
అపొస్తలుడైన యోహాను ప్రేరేపించబడినవాడై ఇలా వ్రాశాడు: ‘అపవాదియనియు సాతాననియు పేరుగలవాడు సర్వలోకమును మోస పుచ్చుచున్నాడు.’ (ప్రకటన 12:9) ఆ తరువాత యోహాను ఇలా చెప్పాడు: “మనము దేవుని సంబంధులమనియు, లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము.” (1 యోహాను 5:19) ఈ వ్యాఖ్యానాలు యేసు మాటలను ప్రతిబింబిస్తాయి, యోహాను తానుగా తన సువార్తలో వాటినిలా వ్రాశాడు: “ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి సంబంధమేమియు లేదు.”—యోహాను 14:30.
ఇప్పుడు ప్రజలు నమ్ముతున్న దానికి ఈ లేఖన బోధకు ఎంత తేడా! “నేడు అపవాది గురించి మాట్లాడడం స్పష్టంగా అనాగరీకమైనది. మన సంశయాత్మకమైన, వైజ్ఞానికపరమైన యుగం సాతానును తొలగించివేసింది” అని కథోలిక్ హెరాల్డ్ చెబుతుంది. అయినప్పటికీ, తనను హతమార్చాలని అనుకుంటున్న మనుష్యులతో యేసు గట్టిగా ఇలా అన్నాడు: “మీరు మీతండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు.”—యోహాను 8:44.
సాతాను శక్తిని గురించి బైబిలు ఇచ్చిన వివరణ సహేతుకమైనది. ఎక్కువమంది ప్రజలు శాంతి, సామరస్యాలతో జీవించాలని కోరుకుంటున్నప్పటికీ (3, 4 పేజీలలో ప్రస్తావించబడినట్లు) డన్బెల్లో జరిగినట్లుగా, లోకమంతా ఎందుకు ద్వేషంతో, యుద్ధాలతో, అర్థరహితమైన దౌర్జన్యంతో నాశనం అవుతుందో అది స్పష్టపరుస్తుంది. అంతేకాకుండా, మనం పోరాడవలసింది కేవలం ఒక్క సాతానుతోనే కాదు. మానవజాతిని మోసగిస్తూ తప్పుదారి పట్టించడంలో ఎంతోకాలం క్రితమే సాతానుతో చేతులు కలిపిన దుష్టాత్మల గురించి లేక దయ్యాల గురించి బైబిలు అదనపు హెచ్చరికలనిస్తుంది. (యూదా 6) ఈ ఆత్మల శక్తిని యేసుక్రీస్తు ఎన్నోసార్లు ఎదుర్కొన్నాడు, ఆయన వాటిని జయించగలిగాడు.—మత్తయి 12:22-24; లూకా 9:37-43.
సత్య దేవుడైన యెహోవా, భూమి మీద నుండి దుష్టత్వాన్ని తీసివేసి చివరకు సాతాను అతని దయ్యముల కార్యకలాపాలను నిర్మూలించడానికి సంకల్పించాడు. యెహోవా గురించి మనకు తెలిసినదాని ఆధారంగా, మనం ఆయన వాగ్దానాల ఎడల దృఢమైన విశ్వాసాన్ని మరియు నమ్మకాన్ని కలిగియుండవచ్చు. “నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును నుండడు. నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు” అని ఆయన చెబుతున్నాడు. యెహోవాను తెలుసుకొని, ఆరాధించి, సేవించేవారందరికి ఆయన నిజంగా వ్యక్తిత్వమున్న దేవుడు. మన రక్షణ కొరకు మనం కేవలం ఆయన వైపు మాత్రమే చూడగలము.—యెషయా 43:10, 11.
[7వ పేజీలోని చిత్రం]
మోషే ప్రేరేపింపబడి ఆదికాండము 1:1ని వ్రాయడాన్ని చూపిస్తున్న 18వ శతాబ్దపు చిత్రం
[క్రెడిట్ లైను]
From The Holy Bible by J. Baskett, Oxford
[8వ పేజీలోని చిత్రం]
యేసుక్రీస్తు ఎన్నోసార్లు దయ్యాలను జయించాడు