వ్యక్తిత్వమున్న దేవున్ని మీరు నమ్మగలరా?
“క్రైస్తవునిగా ఉండడానికి మీరు దేవున్నే నమ్మనవసరం లేదు . . . మనం ఇప్పుడు భావమార్పిడిలో భాగమైయున్నాము, అయితే 21వ శతాబ్దంలో చర్చి సాంప్రదాయభావంలో దేవున్ని లేకుండా ఉంటుంది,” అని ఒక అనుభవజ్ఞుడైన బ్రిటీషు విశ్వవిద్యాలయ మతగురువు వివరించాడు. ఆయన సీ ఆఫ్ ఫెయిత్ ఉద్యమం తరపున మాట్లాడుతున్నాడు, దీనికి కనీసం వందమంది బ్రిటీషు మతగురువులు మద్దతునిస్తున్నారు. ఈ “క్రైస్తవ నాస్తికులు” మతము మానవ సృష్టియని, దేవుడు కేవలం ఒక “అస్పష్టమైన నమ్మకం” మాత్రమేనని నొక్కిచెబుతారని ఒక వ్యక్తి తెలియజేసాడు. ఒక మానవాతీతమైన దేవుడున్నాడనే విషయం వారి ఆలోచనా విధానంతో ఏమాత్రం పొందిక కలిగిలేదు.
“దేవుడు మృతుడు” అనే నినాదం 1960వ దశాబ్దంలో పేరుగాంచింది. ఇది 19వ శతాబ్దపు జర్మన్ తత్వవేత్త అయిన ఫ్రెడ్రిక్ నైట్సకే ఉద్దేశాలను ప్రతిబింబించింది మరియు అనేకమంది యౌవనస్థులు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి, యధేచ్ఛ లైంగిక సంబంధాలు కలిగివుండడానికి, నైతిక అడ్డంకి లేకుండా మత్తుపదార్థాలు దుర్వినియోగం చేయడానికి ఇది అవకాశాన్నిచ్చింది. అలాంటి స్వేచ్ఛ హిప్పీలని పేరుపొందిన వారిని మరింత సంతృప్తికరమైన సంతోషకరమైన జీవితానికి నడిపించిందా?
అదే దశాబ్దంలో, ఆంగ్లికన్ బిషప్ అయిన జాన్ ఎ. టి. రాబిన్‌సన్ దేవుని ఎడల నిజాయితీ అనే తన వివాదాస్పదమైన పుస్తకాన్ని ప్రచురించాడు. దేవుడు “మానవ అనుభవపు అగాధంలోని ఓ అంశం కంటే ఎక్కువేమి కాదనే” ఆయన ఆలోచనా విధానాన్ని బట్టి ఆయన తోటి మతగురువులనేకులు విమర్శించారు. “దేవునియందు విశ్వాసం, ఇప్పుడు జ్ఞానులచే విసర్జింపబడిన ఒక పాతబడిన మూఢవిశ్వాసం లాంటిదా?” అని వేదశాస్త్ర పండితుడైన కెయిత్ వార్డ్ అడిగాడు. తన సొంత ప్రశ్నకు జవాబిస్తూ ఆయన ఇలా అన్నాడు: “దేవుని గూర్చిన సాంప్రదాయబద్దమైన ఆలోచనకు సంబంధించిన జ్ఞానాన్ని తిరిగి సంపాదించుకోవడం కంటే నేడు మతంలో ఏదీ ప్రాముఖ్యం కాదు.”
బాధ మరియు వ్యక్తిత్వమున్న దేవుడు
వ్యక్తిత్వమున్న దేవున్ని నమ్మే అనేకులు తాము చూసే విషాదాల విషయమై బాధ విషయమై తమ నమ్మకమేమై ఉందో వివరించడం కష్టంగావున్నట్లు కనుగొంటున్నారు. ఉదాహరణకు, 1996 మార్చిలో, స్కాట్‌లాండ్ నందలి డన్‌బ్లెన్‌లో 16 మంది పిల్లలు, వారితో పాటు వారి టీచరు తుపాకీతో కాల్చి చంపబడ్డారు. “దేవుని చిత్తం ఏమిటో నాకు అసలు అర్థం కావట్లేదు” అని వ్యాకులత చెందిన ఒక స్త్రీ అన్నది. ఆ దుర్ఘటనను గురించి బాధ వ్యక్తపర్చబడిన ఒక కార్డు పువ్వులతో పాటు పిల్లల స్కూలు వెలుపల ఉంచబడింది. అందులో “ఎందుకు?” అనే ఒక పదం మాత్రమే ఉంది. దానికి జవాబుగా డన్‌బ్లెన్ కెథడ్రల్ పరిచారకుడు ఇలా అన్నాడు: “ఏ వివరణా లేదు. ఇలా ఎందుకు జరిగిందో మనం చెప్పలేము.”
తరువాత అదే సంవత్సరంలో, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు చెందిన ఒక పేరు పొందిన యౌవనస్థుడైన మతగురువు క్రూరంగా చంపబడ్డాడు. లివర్‌పూల్‌కు చెందిన ఒక ప్రధానమతాధికారి “ఎందుకు? ఎందుకు? అని దేవున్ని పదే పదే ప్రశ్నించడం” సంఘస్థులు ఆశ్చర్యంగా విన్నారని చర్చ్ టైమ్స్ నివేదించింది. ఈ మతాధికారి కూడా వ్యక్తిత్వమున్న దేవుని నుండి ఓదార్పుకరమైన సందేశమేదీ చెప్పలేదు.
కాబట్టి, మనం దేనిని నమ్మాలి? వ్యక్తిత్వమున్న దేవున్ని నమ్మడం సహేతుకమైనది. పైన లేవదీయబడిన గాఢాసక్తి కల్గించే ప్రశ్నలకు జవాబివ్వడానికి ఇది కీలకం. తరువాతి శీర్షికలో ఇవ్వబడిన రుజువులను పరిశీలించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.
[3వ పేజీలోని చిత్రం]
“ఎందుకు?” అని ఆ కార్డు ప్రశ్నించింది
[క్రెడిట్ లైను]
NEWSTEAM No. 278468/Sipa Press