రాజ్య ప్రచారకుల నివేదిక
సవాళ్లను అధిగమిస్తామని “ఎదురుచూడని దేశంలో” వాటిని అధిగమించడం
కొరింథులో ఉన్న మొదటి శతాబ్ద క్రైస్తవుల్ని అపొస్తలుడైన పౌలు ఇలా అడిగాడు: “బూర స్పష్టముకాని ధ్వని ఇచ్చునప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును? ఆలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనేగాని పలికినది ఏలాగు తెలియును?”—1 కొరింథీయులు 14:8, 9.
సవాళ్లను అధిగమిస్తామని ఎదురుచూడని దేశమని కొన్నిసార్లు పిలువబడిన పాపువా న్యూ గినియాలో, స్పష్టమైన బైబిలు సందేశాన్ని ప్రకటించడంలో యెహోవాసాక్షులు అత్యంత క్లిష్టమైన ఆటంకాల్ని ఎదుర్కుంటున్నారు. 700కన్నా ఎక్కువ భాషల్ని మాట్లాడే, రకరకాల ఆచారాల్ని కల్గివున్న ప్రజలకు వాళ్లు ప్రకటిస్తారు. రోడ్లు సరిగ్గాలేని, నేరాలు పెరుగుతున్న పర్వతప్రాంతంలో సాక్షులు ఎదురాడవల్సి వస్తుంది కూడా. ఈ క్లిష్టపరిస్థితులన్నిటికి తోడుగా, కొన్ని మతగుంపుల నుండీ, మరి కొన్నిసార్లు స్కూలు అధికారుల నుండి కూడా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.
అయినప్పటికీ, ఓ స్పష్టమైన బూరధ్వనిలా సువార్తను తెలియజేయడానికి మంచి ఆధ్యాత్మిక ఉపదేశమూ, స్థానిక భాషల్లో అంతకంతకూ పెరుగుతున్న బైబిలు అధ్యయన సహాయకాల గ్రంథాలయమూ సాక్షుల్ని సన్నద్ధుల్ని చేస్తూ ఉన్నాయి. ఈ క్రింది నివేదికలు చూపిస్తున్నట్లుగా తరచూ ప్రతిస్పందన అనుకూలంగా ఉంటుంది:
• పాఠశాల కొత్త సంవత్సరారంభంలో, యెహోవాసాక్షుల పిల్లలు ఎందుకు జెండా వందనం చెయ్యరు లేక జాతీయ గీతాన్ని ఆలపించరు అనే విషయాన్ని ఓ ఉపాధ్యాయుడు తెల్సుకోవాలని అనుకున్నాడు. బాప్తిస్మం తీసుకున్న 13 ఏళ్ల విద్యార్థినియైన మోయ్లావైపు ఆయన తన ప్రశ్న సంధించాడు. మోయ్లా స్పష్టమైన, లేఖనాధారిత వివరణను ఇచ్చింది. ఆమె బైబిలు నుండి వివరించింది గనుక ఆమె వాదనను ఆ ఉపాధ్యాయుడు అంగీకరించాడు. ఆమె ఇచ్చిన వివరణను మిగతా స్కూలు సిబ్బంది కూడా విన్నారు.
ఆ తర్వాత, వ్యాసాల్ని రాయమని విద్యార్థులకు చెప్పబడినప్పుడు, మోయ్లా త్రిత్వమనే అంశాన్ని ఎంచుకుంది. ఆమె రాసిన వ్యాసానికి తరగతిలో అత్యధిక మార్కులు వచ్చాయి, ఆ సమాచారాన్ని ఆమె ఎక్కడ కనుగొందనే విషయాన్ని ఆ ఉపాధ్యాయుడు అడిగాడు. ఆంగ్లభాషలో మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని ఆమె ఆయనకు చూపించింది. తరగతి అంతటికీ ఆ ఉపాధ్యాయుడు ఆ పుస్తకాన్ని ప్రతిపాదించగా, అనేకమంది తమకూ ఒక ప్రతి కావాలని అడిగారు. ఆ మరుసటి రోజు, మోయ్లా తన తోటి విద్యార్థులకు 14 పుస్తకాల్నీ, 7 పత్రికల్నీ అందించింది. వారిలో ముగ్గురితో ఆమె బైబిలు పఠనాల్ని ప్రారంభించింది. పూర్తికాల పరిచారకురాలు కావాలనేదే మోయ్లా లక్ష్యం.
• మోరెస్బీ ఓడరేవుకు సమీపాన ఉన్న ఓ తీరప్రాంతపు గ్రామంలో యెహోవాసాక్షుల ఐసోలేటెడ్ గుంపొకటి 1970 తొలిభాగం నుండీ వ్యతిరేకతను ఎదుర్కొనేది. అయితే, ఇటీవలనే వాళ్లు ఎదురుచూడని ఓ మూలం నుండి సహాయాన్ని పొందారు. విదేశాల్లో చదువుకున్న పాపువా న్యూ గినియాకు చెందినవాడైన ఆ ప్రాంతపు యునైటెడ్ చర్చి బిషప్, ఓ రోజు చర్చిలో ఉన్న ప్రేక్షకుల నుండి ప్రశ్నల్ని ఆహ్వానించాడు. “యునైటెడ్ చర్చి, యెహోవాసాక్షులు అనే రెండు మతాలు మన గ్రామంలో ఉన్నాయి. మన ఇంటికి యెహోవాసాక్షులు వచ్చినప్పుడు మనమేం చెయ్యాలి?” అని ఓ వ్యక్తి అడిగాడు. చాలాసేపు మౌనంగా ఉన్న తర్వాత, ఆ బిషప్ ఇలా ప్రత్యుత్తరమిచ్చాడు: “మీకు ఏమి చెప్పాలో నిజంగా నాకు తెలియడం లేదు. ఈ మధ్యనే ఇద్దరు యౌవన సాక్షులు మా ఇంటికి వచ్చారు. వాళ్లు నన్నో ప్రశ్న అడిగారు, నేనింత యూనివర్శిటీ శిక్షణపొందినా దానికి జవాబు నాకు తెలియలేదు. కానీ వాళ్లు బైబిల్లో నుండి సునాయాసంగా నాకు జవాబిచ్చారు. కాబట్టి ఏం చెయ్యాలో నేను మీకు చెప్పబోవడం లేదు—దాన్ని మీకే విడిచి పెడుతున్నాను. మీరు వినకూడదనుకుంటే వినొద్దుగానీ వారి ఎడల హింసాత్మకంగా ప్రవర్తించకండి.”
ఈ గుంపును ఆ తర్వాత సందర్శించిన వాచ్ టవర్ ప్రయాణ ప్రతినిధి ఇలా నివేదించాడు: “సాక్షులు ప్రకటించడానికి వెళ్లినప్పుడు, దాదాపుగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ విన్నారు. కొంతమంది వారిని తమ గృహాలలోనికి కూడా ఆహ్వానించారు. అదిప్పుడు ప్రకటించడానికి ఒక పరదైసులా ఉంది.”