కోత పండుగలు దేవున్ని ప్రీతిపరుస్తాయా?
తియ్యని పళ్లు, తాజా కూరగాయలు మరియు ఏపుగా పెరిగిన మొక్కజొన్న కంకుల పనలు, వీటన్నిటినీ గుట్టగా పోసి ఉంచినప్పుడు అది చూడచక్కని దృశ్యంగా ఉంటుంది. కోతకాలంలో అట్టి దృశ్యాలు ఇంగ్లండ్ అంతటా ఉన్న చర్చీల దైవపీఠాలను, ప్రసంగపీఠాలను అలంకరిస్తాయి. ఇతర ప్రాంతాల్లో వలెనే, యూరప్‌లో కూడా కోతకాలపు ప్రారంభాన్నీ అలాగే దాని ముగింపునూ సూచించే అనేక ఉత్సవాలు జరుగుతాయి.
తమ జీవనోపాధి విషయమై మట్టిపై ఆధారపడే వారు భూమి ఇచ్చిన పంటను గురించి ప్రత్యేకంగా కృతజ్ఞులై ఉంటారు. వాస్తవానికి, పంటల కోతతో దగ్గర సంబంధం కలిగివున్న మూడు సాంవత్సరిక పండుగలను జరుపుకోవాలని దేవుడు ప్రాచీన ఇశ్రాయేలు జనాంగాన్ని కోరాడు. తొలి వసంత కాలంలో, పులియని రొట్టెల పండుగప్పుడు ఇశ్రాయేలీయులు యవల కోతలోని మొదటి కాపునుండి తీసిన కంకుల కట్టను దేవునికి సమర్పించే వారు. వసంత రుతువు చివరలో వారాల పండుగ (లేక, పెంతెకొస్తు) సమయమందు, గోధుమల తొలి కోతలో నుండి తీసిన ధాన్యంతో చేసిన రొట్టెలను వారు అర్పించేవారు. ఆకురాలే కాలంలో ఇశ్రాయేలీయుల వ్యవసాయ సంవత్సర ముగింపును సూచించే ఫలసంగ్రహపు పండుగ వచ్చేది. (నిర్గమకాండము 23:14-17) ఈ పండుగలు “పరిశుద్ధసంఘములుగా కూడ” వలసిన మరియు ఆనందించవలసిన సమయాలు.—లేవీయకాండము 23:2; ద్వితీయోపదేశకాండము 16:16.
మరి ఆధునిక దిన కోత పండుగల సంగతేమిటి? అవి దేవున్ని ప్రీతిపరుస్తాయా?
అన్య మత సంబంధాలు
కోతకాలంలో పారంపర్యంగా జరిగే విందు లౌకిక స్వభావాన్నీ మరియు ఆ ఉత్సవంలో మితిమీరి మద్యం సేవించడాన్నీ బట్టి కలత చెందిన, ఇంగ్లాండ్‌లోని కార్న్‌వెల్‌కు చెందిన ఒక ఆంగ్లికన్ మత గురువు 1843లో మధ్యయుగాల నాటి కోతకాల ఆచారాన్ని పునరుద్ధరించాలని తీర్మానించుకున్నాడు. అతడు తొలి కోతలోని కొంత ధాన్యాన్ని తీసుకుని దానితో తన చర్చిలో ప్రభురాత్రి భోజన ఆచరణ కొరకు రొట్టెను తయారు చేశాడు. అలా చేస్తూ, అతడు లమ్మాస్ పండుగను అంటే, సెల్ట్ జాతీయుల దేవతైన లుగ్ యొక్క ప్రాచీన ఆరాధన నుండి ప్రారంభమైనదని కొందరు చెప్పే ఒక “క్రైస్తవ” పండుగను శాశ్వతంగా ప్రవేశపెట్టాడు.a అలా ఆధునిక ఆంగ్లికన్ కోత పండుగకు అన్య మత సంబంధాలు ఉన్నాయి.
కోత సమయపు ముగింపులో జరిగే ఇతర ఉత్సవాల విషయం ఏమిటి? ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం, ఈ ఉత్సవ కాలాన్ని గుర్తించే అనేక ఆచారాలు అనగా “మొక్కజొన్న [కంకి] ప్రేతం లేక మొక్కజొన్న మాత యందుగల సర్వప్రేత విశ్వాసానికి” సంబంధించిన ప్రారంభాలను కలిగి ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో, కోత కోసే చివరి కంకులపనలో ప్రేతం నివసిస్తుందని వ్యవసాయదారులు విశ్వసిస్తారు. ప్రేతాన్ని పారద్రోలేందుకు వాళ్లు కంకులను నేలకేసి బాదుతారు. మరికొన్ని ప్రాంతాల్లో ధాన్యపు ఆకులను కొన్నిటిని తీసుకుని “మొక్కజొన్న బొమ్మ”గా దాన్ని అల్లి, దాన్ని తర్వాతి సంవత్సరం విత్తనాలు విత్తే కాలం వరకూ “అదృష్టం” కొరకు జాగ్రత్తగా ఉంచుతారు. అది క్రొత్త పంటను దీవిస్తుందనే ఆశతో తర్వాత వాళ్లు ఆ ధాన్యపు వెన్నును మళ్లీ నేలలో నాటుతారు.
కొన్ని పురాణాలు కోతకాలాన్ని ఫలవృద్ధి దేవతైన ఇష్తార్‌కు భర్త అయిన బబులోనీయుల దేవుడగు తమ్మూజు ఆరాధనతో జత చేస్తున్నాయి. కోతకొచ్చిన వెన్నును కోయడం తమ్మూజు అకాల మరణాన్ని సూచించింది. ఇతర పురాణాలు కోతకాలాన్ని మానవ బలితో కూడా జత చేశాయి, ఆ ఆచారం యెహోవా దేవునికి అసహ్యమైనది.—లేవీయకాండము 20:2; యిర్మీయా 7:30, 31.
దేవుని అభిప్రాయం ఏమిటి?
ప్రాచీన ఇశ్రాయేలీయులతో దేవుని వ్యవహారాలు, జీవాధారుడూ సృష్టికర్తా అయిన యెహోవా తన ఆరాధికుల సంపూర్ణ భక్తిని కోరాడనే విషయాన్ని స్పష్టంగా బయల్పరిచాయి. (కీర్తన 36:9; నహూము 1:2) యెహెజ్కేలు ప్రవక్త కాలంలో, తమ్మూజు దేవుని కొరకు విలపించే అలవాటు యెహోవా దృష్టిలో ‘అత్యధికమైన హేయకృత్యంగా’ ఉంది. ఇదీ, ఇతర అబద్ధ మతాచారాలు కూడా, ఆ అబద్ధ ఆరాధికుల ప్రార్థనలను వినకుండా దేవుడు తన చెవులు మూసుకునేలా చేసింది.—యెహెజ్కేలు 8:6, 13, 14, 18.
కోతకాలానికి సంబంధించి యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన దానికిది భిన్నంగా ఉంది. ఫలసంగ్రహపు పండుగప్పుడు, ఇశ్రాయేలీయులు పండుగ సమావేశాన్ని ఏర్పాటు చేసి, అక్కడ పెద్దలూ పిన్నలూ, బీదా గొప్పా అందరూ చూడచక్కని చెట్లనుండి తెచ్చిన గుబురు కొమ్మలతో అలంకరించబడిన తాత్కాలిక పర్ణశాలల్లో నివసించేవారు. వారు ఎంతో ఆనందించవలసిన సమయమది, అయితే అదే సమయంలో ఐగుప్తు నుండి తరలి వస్తున్నప్పుడు తమ పూర్వీకులకు దేవుడు అనుగ్రహించిన విడుదలను గురించి వారు జ్ఞాపకం చేసుకోవలసి ఉన్నారు.—లేవీయకాండము 23:40-43.
ఇశ్రాయేలీయుల పండుగల సమయంలో, అద్వితీయ సత్య దేవుడైన యెహోవాకు మాత్రమే అర్పణలు చెల్లించబడేవి. (ద్వితీయోపదేశకాండము 8:10-20) అయితే ఇంతకు ముందు ప్రస్తావించబడిన సర్వాత్మ విశ్వాసాల విషయానికొస్తే, గోధుమల వెన్ను వంటి ఉత్పత్తులకు ప్రాణము ఉన్నట్లుగా బైబిలు ఎక్కడా ప్రస్తావించడం లేదు.b విగ్రహాలు నిర్జీవమైనవనీ, మాట్లాడటం, చూడటం, వినటం, వాసన చూడటం మరియు స్పర్శించడం వంటివి చేయలేవనీ లేక అవి తమ ఆరాధికులకు ఎలాంటి సహాయాన్నీ అందించలేవనీ లేఖనాలు స్పష్టంగా చూపుతున్నాయి.—కీర్తన 115:5-8; రోమీయులు 1:23-25.
నేటి క్రైస్తవులు, ప్రాచీన ఇశ్రాయేలు జనాంగముతో దేవుడు ఏర్పాటు చేసిన ధర్మశాస్త్ర నిబంధన క్రింద లేరు. వాస్తవానికి, దేవుడు ‘దాన్ని మేకులతో హింసామ్రానుకు కొట్టి, మనకు అడ్డములేకుండ దానిని ఎత్తివేశాడు.’ (కొలొస్సయులు 2:13, 14) యెహోవా ఆధునిక దిన సేవకులు “క్రీస్తు నియమము” ప్రకారం జీవిస్తారు, మరియు దేవుడు దయచేయు వాటన్నింటి ఎడలా మెప్పుదలతో ప్రతిస్పందిస్తారు.—గలతీయులు 6:2.
అపొస్తలుడైన పౌలు, యూదా పండుగలు “రాబోవువాటి ఛాయయే” అని “నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది” అని స్పష్టంగా చెప్పాడు. (కొలొస్సయులు 2:16, 17) కాబట్టి, నిజ క్రైస్తవులు “అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నా[రు] . . . మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు” అనే ఈ లేఖనాల తర్కాన్ని అంగీకరిస్తారు. (1 కొరింథీయులు 10:20, 21) అంతేకాకుండా, క్రైస్తవులు “అపవిత్రమైనదానిని ముట్టకుడని” ఇవ్వబడిన ఉపదేశాన్ని వింటారు. మీ ప్రాంతంలో జరిగే కోత పండుగలు అన్య మత లేక అబద్ధ మత సంబంధాలు కలిగి ఉన్నాయా? ఒకవేళ అదే వాస్తవమైతే, నిజ క్రైస్తవులు అలాంటి కలుషితమైన ఆరాధనలో ఏ విధంగానూ భాగం వహించకుండా ఉండడం ద్వారా యెహోవాకు అప్రీతి కలిగించరు.—2 కొరింథీయులు 6:18.
మెప్పుదలగల ఒక పిల్లవానికి తన తండ్రినుండి ఒక బహుమతి లభిస్తే అతడు ఎవరికి ధన్యవాదాలు చెబుతాడు? పూర్తిగా అపరిచితుడైన వ్యక్తికా లేక తన తండ్రికా? హృదయపూర్వకమైన ప్రార్థన ద్వారా దేవుని ఆరాధికులు తమ పరలోక తండ్రియైన యెహోవా యొక్క విస్తారమైన ఉదారత విషయమై ఆయనకు అనుదినం ధన్యవాదాలు తెలుపుతారు.—2 కొరింథీయులు 6:18; 1 థెస్సలొనీకయులు 5:17, 18.
[అధస్సూచీలు]
a “లమ్మాస్” అనే పదం, “లోఫ్-మాస్” అనే అర్థంగల పాత ఆంగ్ల పదం నుండి ఉద్భవించింది.
b లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) ఇలా పేర్కొంటుంది: “మొక్కలు రక్త రహితమైనవి గనుక మూడవ సృష్టి ‘దినాన’ (ఆది 1:11-13) వృక్షసంపదను సృష్టించడానికి సంబంధించి లేక ఆ తర్వాత కూడా నెఫేష్ (ప్రాణము) ఉపయోగించబడలేదు.”—వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ న్యూయార్క్ ప్రచురించినది.