బీదవారు అయినా ధనవంతులే—అదెలా సాధ్యం?
శతాబ్దాల క్రిందట ఒక జ్ఞాని తాను బీదవాడు కాకూడదని ప్రార్థించాడు. అటువంటి కోరిక ఎందుకు కోరాడు? ఎందుకంటే దేవునితో తనకుగల సంబంధాన్ని పాడుచేసే వైఖరుల్నీ, చర్యల్నీ బీదరికం పురికొల్పవచ్చని ఆయన భయపడ్డాడు. ఇది ఆయన మాటల్లో స్పష్టమౌతుంది: “తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము . . . బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో.”—సామెతలు 30:8, 9.
అంటే ఒక బీదవాడు విశ్వసనీయంగా దేవునికి సేవచేయడం అసాధ్యమనా దీనర్థం? ఎంతమాత్రం కాదు! చరిత్రంతటిలో లెక్కలేనంతమంది యెహోవా దేవుని సేవకులు బీదరికం తీసుకొచ్చే కష్టనష్టాల్ని ఓర్చి దేవునిపట్ల తమ యథార్థతను కాపాడుకున్నారు. దానికి ప్రతిఫలంగా, యెహోవా తనయందు నమ్మకం ఉంచేవారిని ప్రేమించి వారిని పోషిస్తాడు.
విశ్వసనీయులైన పూర్వికులు
అపొస్తలుడైన పౌలు తానే అవసరతలో ఉన్న సమయాలను ఎదుర్కొన్నాడు. (2 కొరింథీయులు 6:3, 4) విశ్వసనీయులైన క్రైస్తవపూర్వ సాక్షుల ‘గొప్ప మేఘమును’ కూడా ఆయన వర్ణించాడు, వారిలో కొందరు “గొఱ్ఱెచర్మములను మేకచర్మములను వేసికొని, దరిద్రులైయుండి . . . అడవులలోను కొండలమీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి.”—హెబ్రీయులు 11:37, 38; 12:1.
ఈ విశ్వసనీయులలో ఒకరు ప్రవక్తయైన ఏలీయా. మూడున్నర సంవత్సరాల అనావృష్టి కాలంలో యెహోవా ఆయనకు క్రమంగా ఆహారాన్ని అందించాడు. మొదట, దేవుడు ఈ ప్రవక్తకు కాకోలములు రొట్టె, మాంసము తెచ్చేలా చేశాడు. (1 రాజులు 17:2-6) ఆ తర్వాత, యెహోవా ఒక విధవరాలి తొట్టిలోని పిండిని, బుడ్డిలోని నూనెను అద్భుతరీతిలో తరగకుండా చేశాడు, ఆమె వాటితో ఏలీయాను పోషించింది. (1 రాజులు 17:8-16) ఆ ఆహారం చాలా మామూలుదే, కానీ అది ఆ ప్రవక్తనూ, ఆ స్త్రీనీ, ఆమె కుమారున్నీ సజీవంగా ఉంచింది.
విశ్వసనీయమైన ప్రవక్త అయిన యిర్మీయాను ఆర్థిక కష్టాల సమయాల్లో యెహోవా అదే విధంగా పోషించాడు. యెరూషలేముపైన బబులోనీయులు చేసిన ముట్టడి నుండి యిర్మీయా సజీవంగా బయటపడ్డాడు, ఆ కాలంలో ప్రజలు ‘తూనికె ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజించారు.’ (యెహెజ్కేలు 4:16) చివరికి, ఆ పట్టణంలో కరవు ఎంత తీవ్రమయ్యిందంటే కొంతమంది స్త్రీలు తమ స్వంత పిల్లల మాంసాన్నే తిన్నారు. (విలాపవాక్యములు 2:20) యిర్మీయా నిర్భయంగా ప్రకటించడంవల్ల బందీగృహంలో ఉన్నప్పటికీ, “పట్టణములో రొట్టెలున్నంత వరకు” ప్రతిదినం నిశ్చయంగా “ఒక రొట్టె” ఆయనకు అందేలా యెహోవా చేశాడు.—యిర్మీయా 37:21.
ఏలీయాకు వలెనే యిర్మీయాకు కూడా తినడానికి కొంచెమే ఉంది. యెరూషలేములో రొట్టెలు అయిపోయిన తర్వాత యిర్మీయా ఏమి తిన్నాడో లేదా ఎంత తరచుగా తిన్నాడో లేఖనాలు మనకు చెప్పడం లేదు. అయినా, యెహోవా ఆయనను పోషించాడనీ, ఆ భయంకరమైన కరవుకాలం నుండి సజీవంగా బయటపడ్డాడని మనకు తెలుసు.
నేడు, ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో పేదరికం ఉంది. ఐక్యరాజ్య సమితి ప్రకారం, అన్ని ప్రాంతాల్లో కన్నా ఆఫ్రికాలో పేదరికం ఎక్కువగా ఉంది. 1996లో ఐక్యరాజ్య సమితి చేసిన ఒక పత్రికా ప్రకటన ఇలా ఉంది: “ఆఫ్రికా వాసుల్లో దాదాపు సగంమంది పేదరికంలో మ్రగ్గుతున్నారు.” ఆర్థిక పరిస్థితులు మరింత కఠినతరం అవుతున్నప్పటికీ, అంతకంతకు ఎక్కువగా ఆఫ్రికాలోని అనేకమంది బైబిలు సూత్రాలను తమ జీవితాల్లో అన్వయించుకుంటూ, దేవుడు తమను పోషిస్తాడన్న నమ్మకంతో వారు ఆయన్ను విశ్వసనీయంగా సేవిస్తున్నారు. మన కల్లోలభరిత లోకంలోని ఒక ప్రాంతంలోని కొన్ని ఉదాహరణలను పరిశీలించండి.
నిజాయితీని కాపాడుకోవడం
నైజీరియాలో నివసించే మైకేల్a ఒక వ్యవసాయదారుడు, ఆయన ఆరుగురు పిల్లల్ని పోషించాలి, “కుటుంబాన్ని పోషించడానికి డబ్బులు లేకపోతే నిజాయితీగా ఉండడం కష్టం” అంటున్నాడాయన. “అయితే, నిజాయితీని గాలికి వదిలేయాలన్న శోధనలో నేను పడినప్పుడు, ‘దొంగిలువాడు ఇకమీదట దొంగిలక . . . తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను,’ అని చెబుతున్న ఎఫెసీయులు 4:28వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. కాబట్టి నేను శోధించబడినట్లయితే, ‘నేను ఈ డబ్బు కొరకు పనిచేశానా?’ అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను.”
మైకేల్ ఇంకా ఇలా కొనసాగించాడు: “ఉదాహరణకు, నేను ఒక రోజు దారివెంట వెళ్తున్నప్పుడు ఒక మోటర్‌సైకిల్ మీదినుండి ఒక సంచి పడిపోవడం చూశాను. నేను ఆ మోటర్‌సైకిల్ వ్యక్తిని ఆపలేకపోయాను, అందుకని ఆ సంచి చేతిలోనికి తీసుకున్నాను, దాన్నిండా డబ్బుంది! ఆ సంచి మీదున్న గుర్తుల ఆధారంగా నేను దాని యజమానిని కనుక్కొని దాన్ని ఆయనకు తిరిగి అందజేశాను.”
క్రుంగుదలతో పోరాడడం
ఉత్తర ఆఫ్రికాలోని ఒక వ్యక్తి ఇలా అభిప్రాయపడ్డాడు: “బీదరికం ఒక లోతైన గుంటలో ఇరుక్కుపోవడం వంటిది, పైన వెలుతురు కన్పిస్తుంది, ప్రజలు కూడా అటూ ఇటూ స్వేచ్ఛగా తిరుగుతూ కనబడతారు, కానీ సహాయం కోసమో లేక పైకి ఎక్కడానికి ఒక నిచ్చెన అందించమనో కేక వేయడానికి సాధ్యం కాదు.” బీదరికం తరచూ క్రుంగుదలను, నిరాశానిస్పృహలను తెస్తుందనడంలో ఆశ్చర్యం లేదు! దేవుని సేవకులు కూడా ఇతరుల సిరిసంపదలు చూసి యథార్థంగా జీవించడం వ్యర్థమని ఆలోచించడం మొదలెట్టవచ్చు. (కీర్తన 73:2-13 పోల్చండి.) అటువంటి తలంపులను ఎలా త్రిప్పికొట్టవచ్చు?
పశ్చిమ ఆఫ్రికాలోని పీటర్, 19 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసిన తర్వాత పదవీ విరమణ చేశాడు. ఆయనిప్పుడు కేవలం కొద్దిపాటి పెన్షనుతో జీవనం సాగిస్తున్నాడు. “నేను నిరుత్సాహపడినప్పుడల్లా, బైబిలులోనూ వాచ్ టవర్ సొసైటీ ప్రచురణల్లోనూ ఏమి చదివానో గుర్తుకు తెచ్చుకుంటాను” అని అంటూ, పీటర్ ఇంకా ఇలా జతచేస్తున్నాడు, “ఈ పాత విధానం గతించిపోనైయుంది, మనం మరింత శ్రేష్ఠమైన విధానం కొరకు వేచివున్నాము.
“నేను 1 పేతురు 5:9 గురించి కూడా ఆలోచిస్తాను, అక్కడ, ‘లోకమందు మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి, విశ్వాసమందు స్థిరులై [సాతానును] ఎదిరించుడి’ అని ఉంది. కాబట్టి కష్టాల్ని అనుభవిస్తున్నది నేనొక్కడినే కాదు. ఈ జ్ఞాపికలు నిరుత్సాహకరమైన, క్రుంగుదలను కలిగించే తలంపులను నా మనస్సు నుండి పారద్రోలడానికి నాకు సహాయం చేస్తాయి.”
“అంతేకాదు, యేసు భూమి మీదనున్నప్పుడు ఎన్నో అద్భుతాలను చేశాడు, అయినా ఆయనెవర్నీ ధనవంతుల్ని చేయలేదు. నన్ను ధనవంతునిగా చేస్తాడని నేనెందుకు ఎదురుచూడాలి?” అంటున్నాడు పీటర్.
ప్రార్థనా శక్తి
ప్రార్థనలో యెహోవా దేవునికి చేరువకావడం ప్రతికూల తలంపుల్ని త్రిప్పికొట్టడానికైన మరొక మార్గం. మేరీ 1960లో యెహోవాసాక్షి అయినప్పుడు, ఆమె కుటుంబం ఆమెను విడనాడింది. అవివాహితగా ఉన్న ఆమె ఇప్పుడు 50వ పడిలో ఉంది, శారీరకంగా బలహీనురాలు. ధన సంపదల రీత్యా చూస్తే ఆమెకు ఉన్నది చాలా తక్కువే. అయినప్పటికీ, ఆమె క్రైస్తవ పరిచర్యలో చాలా ఆసక్తికల్గివుంది.
మేరీ ఇలా అంటుంది: “నేను నిరుత్సాహపడినప్పుడు, నేను ప్రార్థన ద్వారా యెహోవాను సమీపిస్తాను. ఆయనకన్నా ఎక్కువగా ఎవ్వరూ నాకు సహాయం చేయలేరని నాకు తెలుసు. మనం యెహోవా యందు నమ్మకముంచినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడని నేను నేర్చుకున్నాను. నేనెప్పుడూ రాజైన దావీదు మాటల్ని మనస్సులో ఉంచుకుంటాను, ఆయన కీర్తన 37:25లో ఇలా అన్నాడు, ‘నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని, వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి యుండలేదు.’
“కావలికోటలో వచ్చే వృద్ధ సహోదర సహోదరీల అనుభవాల నుండి కూడా నేను ప్రోత్సాహాన్ని పొందుతుంటాను. యెహోవా దేవుడు వారికి సహాయం చేశాడు, అందుకని ఆయన నాకు కూడా ఎడతెగక సహాయం చేస్తాడని నాకు తెలుసు. ఫుఫు [ఒక రకమైన కాసావా భోజనం] అమ్ముతూ నేను చేసే నా చిన్న వ్యాపారాన్ని ఆయన ఆశీర్వదిస్తున్నాడు, నేను నా అనుదిన అవసరాల్ని తీర్చుకోగల్గుతున్నాను. కొన్నిసార్లు నా దగ్గర డబ్బు అసలు లేనప్పుడు ఏమి చేయాలో తోచనప్పుడు, యెహోవా ఎవరినో ఒకరిని పంపుతాడు. వారు వచ్చి, ‘దయచేసి ఇది తీసుకోండి సిస్టర్’ అంటారు. యెహోవా నన్నెన్నడూ నిరుత్సాహపర్చలేదు.”
బైబిలు పఠనం విలువ
యెహోవాసాక్షులు దేవుని వాక్యమైన బైబిలును పఠించడాన్ని అమూల్యమైనదిగా ఎంచుతారు, దీని విషయంలో వారిలోని బీదవారికి కూడా మినహాయింపు లేదు. అరవై సంవత్సరాల జాన్ పయినీరుగా (ఒక పూర్తికాల రాజ్య ప్రచారకునిగా), సంఘంలో పరిచర్య సేవకునిగా సేవ చేస్తున్నాడు. శిథిలావస్థలోవున్న రెండంతస్థుల భవనంలో ఆయన ఇతర 13 కుటుంబాలతో కలిసి నివసిస్తున్నాడు. మొదటి అంతస్థులోని నడవాలో ఒక ప్రక్కన ఆయన ఉంటాడు, దాన్ని చెక్కలతో రెండు విభాగాలుగా చేశారు. అందులో రెండు పాత కుర్చీలూ, బైబిలు-పఠన సహాయక పుస్తకాలు పేర్చివున్న ఒక టేబులూ ఉన్నాయి. ఆయన గడ్డి చాపమీద పడుకుంటాడు.
జాన్ బ్రెడ్డు అమ్ముతూ రోజుకి దాదాపు ఒక డాలర్ సంపాదించేవాడు, కానీ గోధుమల దిగుమతి నిషేధించబడినప్పుడు ఆయన ఈ జీవనాధారాన్ని కోల్పోయాడు. ఆయనిలా అంటున్నాడు: “కొన్నిసార్లు జీవితం చాలా కష్టంగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ నేను పయినీరు సేవలో కొనసాగుతున్నాను. నన్ను పోషించేది యెహోవాయే. నేను చేయగల్గే ఏ పనైనా చేస్తాను, సంఘంలోని సహోదరులు చాలా సహాయపడుతున్నప్పటికీ, మద్దతుకోసమూ, ఆహారంకోసమూ నేను ఏ మానవునిపైనా ఆధారపడను. నేను పని వెతుక్కోవడానికి వారు నాకు సహాయపడతారు, కొన్ని సార్లు డబ్బు కానుకగా ఇస్తారు.
“నేను బైబిలునూ, వాచ్ టవర్ సొసైటీ ప్రచురణలనూ చదవడానికి సమయం తీసుకుంటాను. తెల్లవారు జామున ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటుంది గనుక అప్పుడే నేను నా పఠనాన్ని చేస్తాను, కరెంటు ఉన్నప్పుడల్లా రాత్రి పూట కూడా చదువుతాను. నా వ్యక్తిగత పఠనాన్ని నేను కొనసాగించాలని నాకు తెలుసు.”
నిత్యజీవం కొరకు పిల్లలకు శిక్షణనివ్వడం
డాన్యెల్కి ఆరుగురు పిల్లలు, భార్య చనిపోయింది. 1985లో తాను 25 సంవత్సరాలుగా చేసిన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు, కానీ ఆ తర్వాత ఆయనకు స్టోర్‌కీపర్ పని దొరికింది. “ఆర్థికంగా కుటుంబమంతటికీ చాలా కష్టంగా ఉంది” అంటున్నాడాయన. “మేమిప్పుడు రోజుకి ఒక్కసారే తింటున్నాము. ఒకసారి, మేము మూడు రోజుల వరకు ఏమీ తినలేదు. నీళ్లు మాత్రమే త్రాగాము.”
డాన్యెల్ సంఘంలో పెద్దగా సేవ చేస్తున్నాడు. “క్రైస్తవ కూటాలకు నేనెప్పుడూ హాజరవ్వకుండా ఉండలేదు, దైవపరిపాలనా నియామకాలతో నేనెప్పుడూ బిజీగా ఉంటాను” అంటున్నాడాయన. “రాజ్య మందిరంలో ఎక్కడైనా ఏదైనా పని చేయాల్సివుంటే, నేనక్కడ ఉండేలా నా ఇతర పనుల్ని సర్దుబాటు చేసుకుంటాను. పరిస్థితులు మరీ కఠినంగా తయారైనప్పుడు యోహాను 6:68లో పేతురు, ‘ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము?’ అని యేసుతో చెప్పిన మాటల్ని నాకు నేను గుర్తు చేసుకుంటాను. నేను యెహోవాను సేవించడం మానుకుంటే, నేను ఎక్కడికని వెళ్లేది? రోమీయులు 8:35-39లో మనకు కనబడే పౌలు మాటలు కూడా నన్ను కృత నిశ్చయంతో నింపుతాయి, ఎందుకంటే దేవుని ప్రేమ నుండి, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏదీ వేరు చేయలేదని ఆ మాటలు మనకు చూపిస్తాయి. ఈ దృక్పథాన్నే నేను నా పిల్లల మనస్సుల్లో నాటాను. మనం యెహోవాను ఎన్నడూ విడిచి పెట్టకూడదని నేను వారికి నిరంతరం చెబుతూనే ఉంటాను.” డాన్యెల్కి ఉన్న అత్యంతాసక్తి, దానితోపాటు క్రమమైన కుటుంబ బైబిలు పఠనం, ఆయన పిల్లలపై అనుకూల ప్రభావాన్ని చూపించాయి.
ఇచ్చే స్వభావం
కడు పేదరికంలో జీవించేవారు రాజ్యాసక్తుల్ని పెంపొందించడానికి ఆర్థికంగా ఏమాత్రం దోహదపడగలరని ఒకరు అనుకోవచ్చు. కానీ వాస్తవం అది కాదు. (లూకా 21:1-4 పోల్చండి.) ఘనాలో, వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న కొందరు సాక్షులు, దేవుని రాజ్యాసక్తుల్ని పెంపొందించడానికి తమ వ్యవసాయ భూమిలోని కొంత భాగాన్ని వేరుగా ఉంచుతారు. ఆ భూభాగంలో పండించిన పంటను అమ్మగా చేతికి వచ్చిన డబ్బును కేవలం దానికోసమే ఉపయోగిస్తారు, ఇందులో యెహోవాసాక్షుల స్థానిక రాజ్య మందిరంలో చందాలు వేయడం కూడా ఇమిడివుంది.
మధ్య ఆఫ్రికాలో నివసించే జోన్ ఒక పయినీరు. పక్షవాతం వచ్చిన తన భర్తను చూసుకోవడానికీ, తనపైన ఆధారపడే మరితర నలుగురిని పోషించడానికీ ఆమె బ్రెడ్డు అమ్ముతుంది. తాను వెళ్లే సంఘ రాజ్య మందిరంలో బల్లలు కావల్సివస్తే, జోన్ కుటుంబం తమ ఇంట్లో ఉన్న డబ్బంతా విరాళంగా ఇవ్వాలని నిశ్చయించింది. దాంతో వారి దగ్గర ఏమీ లేకుండాపోయింది. అయితే, ఆ తర్వాతి రోజు ఒకరు ఎంతోకాలంగా తీర్చాల్సివున్న అప్పును అనూహ్యంగా తీర్చేశారు, తమకు అసలు తిరిగి రాదని ఆశలు వదిలేసుకున్న డబ్బు తిరిగి వచ్చింది!
జోన్ ఉల్లాసవంతంగా ఉంటుంది, డబ్బును గురించి అవసరానికి మించి చింతించదు. “నేను నా పరిస్థితి గురించి యెహోవాకు ప్రార్థనలో వివరిస్తాను, ఆ తర్వాత నేను ప్రాంతీయ సేవకు వెళ్లిపోతాను. ఈ విధానంలో మంచి కాలాలు ఉంటాయన్న ఆశ లేదని మాకు తెలుసు. అయినా, మా అవసరాలను యెహోవా తీరుస్తాడని మేము గ్రహిస్తాము.”
పరిశ్రమను ప్రదర్శించడం
ఒకరిపట్ల మరొకరు కలిగివుండే ప్రేమను బట్టి యెహోవాసాక్షులు గుర్తించబడతారు. (యోహాను 13:35) డబ్బున్నవారు అవసరతలో ఉన్న తమ తోటి క్రైస్తవులకు సహాయం చేస్తారు. ఈ సహాయం తరచూ ఒక కానుక రూపంలో వస్తుంది, కొన్నిసార్లు సహాయం ఉద్యోగ అందించడం రూపంలో వస్తుంది.
కాంగోలో నివసించే మార్క్‌కు కుష్ఠురోగం. ఆ వ్యాధి ఆయన కాలివ్రేళ్లనూ, చేతివ్రేళ్లనూ తినేసింది. అందుకని ఆయన నడవడానికి చేతికర్రలపై ఆధారపడతాడు. యెహోవాను సేవించాలని మార్క్ నిర్ణయించుకున్నప్పుడు, ఆయన తన జీవితంలో గొప్ప మార్పులు చేసుకోనారంభించాడు. ఇంతకు ముందులాగా భిక్షమెత్తడానికి బదులుగా ఇప్పుడాయన తన ఆహారం తనే పండించుకోనారంభించాడు. ఆయన ఎండబెట్టిన ఇటికల్ని అమ్మేవాడు కూడాను.
మార్క్ వికలాంగుడైనప్పటికీ శ్రమించి పనిచేయడంలో కొనసాగాడు. ఆయన చివరికి ఒక చిన్న స్థలం కొనుక్కుని దానిలో మంచి ఇల్లు కట్టుకున్నాడు. నేడు మార్క్ ఒక సంఘ పెద్దగా సేవ చేస్తున్నాడు, తాను నివసించే పట్టణంలో ఆయనకు మంచి గౌరవమర్యాదలు ఉన్నాయి. ఇప్పుడాయన అవసరతలో ఉన్న ఇతరులకు సహాయం చేస్తున్నాడు.
నిజమే, కొన్ని ప్రాంతాల్లో పని సంపాదించడం దాదాపు అసాధ్యం. మధ్య ఆఫ్రికాలోని వాచ్ టవర్ సొసైటీ బ్రాంచి కార్యాలయాల్లో పని చేసే ఒక క్రైస్తవ పెద్ద ఇలా వ్రాశాడు: “ఇక్కడ చాలామంది సహోదరులకు ఉద్యోగాల్లేవు. కొంతమంది తమ స్వంతగా ఉద్యోగాల్ని సృష్టించుకోవాలని ప్రయత్నిస్తున్నారు, కానీ ఇది చాలా కష్టం. కొంతమంది తాము ఏమి చేసినా కష్టాల్ని అనుభవించక ఎలాగూ తప్పదు గనుక, పయినీరు పరిచారకులుగా సేవ చేస్తూ వస్తుదాయక ప్రయోజనాల్ని త్యాగం చేద్దామన్న నిర్ధారణకు వచ్చారు. ఆ విధంగా చేయడం ద్వారా, తాము ఒకవేళ ఉద్యోగం చేసినట్లైతే సంపాదించే ఏ కొద్దిపాటి డబ్బుకన్నా తాము ఇప్పుడు మరింత సమృద్ధిగా ఆశీర్వదించబడినట్లు కనుగొన్నారు.”
యెహోవా తన ప్రజల్ని సంరక్షిస్తాడు
యేసుక్రీస్తు తనను గురించి ఇలా అన్నాడు: “నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లే[దు].” (లూకా 9:58) అదేవిధంగా, అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ఈ గడియవరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము; పిడిగుద్దులు తినుచున్నాము; నిలువరమైన నివాసములేక యున్నాము.”—1 కొరింథీయులు 4:11.
యేసు, పౌలు ఇద్దరూ తాము తమ పరిచర్యను సంపూర్తిగా నెరవేర్చగల్గేలా, ఆర్థికంగా పరిమితమైన వనరులు కలిగివున్న జీవితాన్ని గడపాలని ఎంపిక చేసుకున్నారు. ప్రస్తుతదిన క్రైస్తవులు అనేకమంది బీదవారే ఎందుకంటే వారికి మరో ఎంపిక లేదు. అయినప్పటికీ, వారు తమ జీవితాల్లో బైబిలు సూత్రాలను అన్వయించుకుని, అత్యంతాసక్తితో దేవున్ని సేవించాలని కోరుకుంటున్నారు. యేసు ఇచ్చిన ఈ హామీ యొక్క సత్యసంధతను వారు అనుభవిస్తుండగా, తాము యెహోవాచే అత్యంత ప్రీతిపాత్రంగా ప్రేమించబడుతున్నామని వారికి తెలుసు: “మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు [వస్తుదాయక విషయాలు] మీకనుగ్రహింపబడును.” (మత్తయి 6:25-33) అంతేగాక, దేవుని సేవకులైన ఈ బీదవారు, “యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును” అన్నదానికి నిదర్శనాన్ని కలిగివున్నారు.—సామెతలు 10:22.
[అధస్సూచీలు]
a ఈ శీర్షికలో ప్రత్యామ్నాయ పేర్లు ఉపయోగించబడ్డాయి.
[6వ పేజీలోని బాక్సు]
“వాక్యప్రకారము ప్రవర్తించువారు” ఎవరు?
1994లోని ఒక గ్యాలప్ పోల్ ప్రకారం తేలిందేమంటే, అమెరికన్లలో 96 శాతంమంది “దేవునిలోను లేకపోతే ఒక విశ్వాత్మలోను నమ్మకముంచుతారు.” “భూమిమీద ఏ ఇతర దేశంలోకన్నా అమెరికాలో తలసరిన ఎక్కువ చర్చీలు” కూడా ఉన్నాయి అని యు.ఎస్.న్యూస్ & వరల్డ్ రిపోర్ట్ అంది. అటువంటి మతాసక్తి కనబడుతున్నప్పటికీ, అనుభవజ్ఞుడైన ప్రజాభిప్రాయ సేకరణకర్త జార్జ్ గ్యాలప్ జూ. ఇలా అంటున్నాడు: “స్పష్టమైన వాస్తవం ఏమంటే, తాము దేన్ని నమ్ముతున్నారో లేక ఎందుకు నమ్ముతున్నారో చాలామంది అమెరికన్లకు తెలియదు.”
చాలామంది ప్రజల మతపర విశ్వాసాలకూ వాళ్ల చర్యలకూ మధ్య ఒక పెద్ద అగాధం ఉందని కూడా గణాంకాలు సూచిస్తున్నాయి. ఉదాహరణకు, “దేశంలోని అత్యధిక నేరస్థలాల్లో కొన్ని ఏవంటే మతపర నమ్మకాలూ, వాటి ఆచరణా అత్యంత శక్తివంతంగా ఉన్న ప్రాంతాల్లోనేనని సమాజశాస్త్రజ్ఞులు చెబుతున్నారు” అని జెఫ్రీ షెలర్ అనే రచయిత అంటున్నాడు.
ఇది మనల్ని ఆశ్చర్యపర్చకూడదు. ఎందుకు? ఎందుకంటే, “దేవుని ఎరుగుదుమని . . . చెప్పుకొందురు గాని . . . తమ క్రియలవలన ఆయనను ఎరుగమన్నట్టు” ఉండేవారి విషయంలో జాగ్రత్తగా ఉండమని మొదటి శతాబ్దంలోనే అపొస్తలుడైన పౌలు తన తోటి క్రైస్తవులను హెచ్చరించాడు. (తీతు 1:16) దానికితోడు, “పైకి భక్తిగల వారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై” ఉండే ప్రజలచే “అంత్యదినము[లు]” గుర్తించబడతాయని పౌలు యౌవనుడైన తిమోతికి చెప్పాడు.—2 తిమోతి 3:1, 5.
అయితే, “వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అని యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞను పాటించడానికి నిజ క్రైస్తవులు తమ శక్తిమేరకు కృషి చేస్తారు. (మత్తయి 28:19) ఈ విధంగా వారు, “వినువారు మాత్రమై[యుండక] . . . వాక్యప్రకారం ప్రవర్తించువారునై[యుంటారు.]”—యాకోబు 1:22.
[7వ పేజీలోని చిత్రం]
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు బైబిలు పఠనాన్ని అమూల్యమైనదిగా ఎంచుతున్నారు