కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 9/15 పేజీలు 10-15
  • మీరు ఏలీయావలె నమ్మకంగా ఉంటారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు ఏలీయావలె నమ్మకంగా ఉంటారా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దైవత్వపు ఆశ్చర్యకరమైన పరీక్ష
  • “ప్రవక్తయగు ఏలీయా” ఇంకా రానున్నాడా?
  • వారికి ఏలీయా ఆత్మ ఉంది
  • పరీక్షయందునూ నమ్మకంగా ఉండటం
  • ఏలీయా వలె నమ్మకంగా ఉండండి
  • తన దేవుని వల్ల ఊరట పొందాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • తన దేవుని వల్ల ఊరట పొందాడు
    వాళ్లలా విశ్వాసం చూపించండి
  • మీకు ఎప్పుడైనా ఒంటరిగా, భయంగా ఉన్నట్టు అనిపించిందా?
    చిన్నారుల కోసం బైబిలు పాఠాలు
  • స్వచ్ఛారాధనను సమర్థించిన వ్యక్తి
    వాళ్లలా విశ్వాసం చూపించండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 9/15 పేజీలు 10-15

మీరు ఏలీయావలె నమ్మకంగా ఉంటారా?

“యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును.”—మలాకీ 4:5.

1. ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలో 500 సంవత్సరాలు ఉన్న తర్వాత ఏ సంక్షోభం సంభవిస్తుంది?

“పాలు తేనెలు ప్రవహించు దేశము.” (నిర్గమకాండము 3:7, 8) ఇశ్రాయేలీయులను సా.శ.పూ 16వ శతాబ్దంలో ఐగుప్తు దాసత్వం నుండి విడిపించిన తర్వాత యెహోవా దేవుడు వారికి అదే ఇచ్చాడు. అయితే ఇదిగో! ఐదు శతాబ్దాలు గడిచాయి, ఇప్పుడు ఇశ్రాయేలీయుల పది గోత్రాల రాజ్యం తీవ్రమైన క్షామాన్ని అనుభవిస్తోంది. పచ్చగడ్డి ఎక్కడా మచ్చుకైనా కనిపించడం లేదు. పశువులు చనిపోతున్నాయి, మరి మూడున్నర సంవత్సరాలుగా వర్షమే కురవలేదు. (1 రాజులు 18:5; లూకా 4:25) ఈ విపత్కర పరిస్థితికి కారణం ఏమిటి?

2. ఇశ్రాయేలీయుల జాతీయ సంక్షోభానికి కారణం ఏమిటి?

2 మతభ్రష్టత్వం ఈ సంక్షోభాన్ని కలిగించింది. దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తూ, రాజైన అహాబు కనానీయుల రాకుమారి అయిన యెజెబెలును వివాహం చేసుకుని, ఇశ్రాయేలులో బయలు ఆరాధనను ప్రవేశపెట్టేందుకు ఆమెను అనుమతించాడు. ఇంకా ఘోరంగా, రాజధాని నగరమైన షోమ్రోనులో ఈ అబద్ధ దేవతకు ఒక ఆలయాన్ని కూడా నిర్మించాడు. అంతెందుకు, బయలు ఆరాధన తమకు పుష్కలంగా పంటలు పండిస్తుందని విశ్వసించేలా ఇశ్రాయేలీయులు మోసగించబడ్డారు! అయితే యెహోవా హెచ్చరించిన విధంగా, వారిప్పుడు తమ ‘మంచి దేశమున ఉండకుండ శీఘ్రముగా నశించే’ ప్రమాదంలో ఉన్నారు.—ద్వితీయోపదేశకాండము 7:3, 4; 11:16, 17; 1 రాజులు 16:30-33.

దైవత్వపు ఆశ్చర్యకరమైన పరీక్ష

3. ఇశ్రాయేలీయుల వాస్తవమైన సమస్యపై ప్రవక్తయైన ఏలీయా ఎలా అవధానాన్ని నిలుపుతాడు?

3 క్షామం మొదలైనప్పుడు, దేవుని నమ్మకస్థుడైన ప్రవక్తయగు ఏలీయా రాజైన అహాబుకు ఇలా చెప్పాడు: “ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాటప్రకారము గాక, యీ సంవత్సరములలో మంచైనను వర్షమైననుపడ[దు].” (1 రాజులు 17:1) ఈ ప్రకటన యొక్క భయంకరమైన సత్యత్వాన్ని అనుభవించిన తర్వాత, ఏలీయా ఇశ్రాయేలీయులను శ్రమపెడుతున్నాడని రాజు ఆయనను నిందిస్తాడు. అయితే అహాబు మరియు అతడి కుటుంబం బయలు ఆరాధికులుగా కల్గించిన మత భ్రష్టతను బట్టి వారే నిందార్హులని ఏలీయా సమాధానమిస్తాడు. ఆ వివాదాన్ని పరిష్కరించేందుకు, యెహోవా యొక్క ప్రవక్త, 450 మంది బయలు ప్రవక్తలను మరియు దేవతాస్తంభం యొక్క 400 మంది ప్రవక్తలనూ కర్మెలు పర్వతం వద్ద సమకూర్చమని రాజైన అహాబును అడుగుతాడు. బహుశ ఈ సందర్భం క్షామాన్ని అంతం చేస్తుందనే నిరీక్షణతో అహాబు మరియు అతడి ప్రజలు అక్కడ సమావేశమౌతారు. అయితే ఏలీయా మరింత గంభీరమైన వివాదంపై అవధానాన్ని నిలుపుతాడు. “యెన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు?” అని ఆయన అడుగుతాడు. “యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాని ననుసరించు[డి].” ఏమనాలో ఇశ్రాయేలీయులకు అర్థంకాదు.—1 రాజులు 18:18-21.

4. దైవత్వాన్ని గురించిన వివాదాన్ని పరిష్కరించేందుకు, ఏలీయా ఏమి ప్రతిపాదిస్తాడు?

4 అనేక సంవత్సరాలుగా ఇశ్రాయేలీయులు యెహోవా ఆరాధనను బయలు ఆరాధనతో కలగలిపేందుకు ప్రయత్నించారు. దైవత్వాన్ని గురించిన వివాదాన్ని పరిష్కరించేందుకు ఏలీయా ఒక పోటీని ఇప్పుడు ప్రతిపాదిస్తాడు. ఆయన బలి నిమిత్తం ఒక ఎద్దును సిద్ధం చేస్తాడు, బయలు ప్రవక్తలు మరొక దాన్ని సిద్ధం చేయాలి. తర్వాత ఏలీయా ఇలా చెబుతాడు: “మీరు మీ దేవత పేరునుబట్టి ప్రార్థన చేయుడి; నేనైతే యెహోవా నామమునుబట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుటచేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము.” (1 రాజులు 18:23, 24) ప్రార్థనకు జవాబుగా ఆకాశం నుండి అగ్ని బయలు రావడాన్ని ఊహించుకోండి!

5. బయలు ఆరాధన యొక్క వ్యర్థత ఎలా బయల్పర్చబడింది?

5 బయలు ప్రవక్తలను ప్రారంభించమని ఏలీయా వారిని ఆహ్వానిస్తాడు. వాళ్లు దహన బలి నిమిత్తం ఎద్దును సిద్ధం చేసి దాన్ని బలిపీఠంపై ఉంచుతారు. తర్వాత వాళ్లు, “బయలా, మా ప్రార్థన వినుమని” ప్రార్థన చేస్తూ బలిపీఠం చుట్టూ గంతులు వేస్తారు. ఇది “ఉదయము మొదలుకొని మధ్యాహ్నమువరకు” కొనసాగుతుంది. “పెద్దకేకలు వేయుడి” అని అంటూ ఏలీయా వాళ్లను అవహేళన చేస్తాడు. బయలు ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో లేక “వాడు నిద్రపోవుచున్నాడేమో, . . . ఒకవేళ లేపవలసి యున్నదేమో!” కొంతసేపటికే బయలు ప్రవక్తలు ఆందోళనకు గురౌతారు. చూడండి! వాళ్లు కత్తులతో తమ దేహాలను కోసుకుంటున్నారు, వారి గాయాలనుండి రక్తం ధారగా స్రవిస్తుంది. ఆ 450 మందీ బిగ్గరగా కేకలేస్తుంటే ఆ శబ్దమెంత బిగ్గరగా ఉందోగదా! అయితే సమాధానం మాత్రం వచ్చింది కాదు.—1 రాజులు 18:26-29.

6. దైవత్వం యొక్క పరీక్షకు ఏలీయా ఏ ఏర్పాట్లు చేస్తాడు?

6 ఇప్పుడు ఏలీయా వంతు. ఆయన యెహోవా బలిపీఠాన్ని పునర్‌నిర్మిస్తాడు, దాని చుట్టూ పెద్ద కందకాన్ని త్రవ్వుతాడు, బలి పశువును దానిపై పెడతాడు. తర్వాత ఆయన కట్టెలపై మరియు బలి పశువుపై నీళ్లు పోయిస్తాడు. కందకం పూర్తిగా నిండిపోయేంతగా పన్నెండు పెద్ద తొట్లనిండా నీళ్లను బలిపీఠం పైనుండి పోయిస్తాడు. ఏలీయా ప్రార్థిస్తుండగా ఎంత ఉత్కంఠగా ఉంటుందో ఊహించుకోండి: “యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవైయున్నావనియు, నేను నీ సేవకుడనై యున్నాననియు, ఈ కార్యములన్నియు నీ సెలవుచేత చేసితిననియు ఈ దినమున కనుపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము; యెహోవావైన నీవే దేవుడవై యున్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగచేయుదువనియు ఈ జనులకు తెలియునట్లుగా నా ప్రార్థన అంగీకరించుము.”—1 రాజులు 18:30-37.

7, 8. (ఎ) ఏలీయా చేసిన ప్రార్థనకు యెహోవా ఎలా సమాధానమిస్తాడు? (బి) కర్మెలు పర్వతంపైన జరిగిన సంఘటనల ద్వారా ఏమి సాధించబడింది?

7 ఏలీయా ప్రార్థనకు జవాబుగా, ‘యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకంలో ఉన్న నీళ్లను ఆరిపోచేస్తుంది.’ ప్రజలు సాగిలపడి “యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు” అని కేకలువేస్తారు. (1 రాజులు 18:38, 39) ఏలీయా ఇప్పుడు నిర్ణయాత్మక చర్య గైకొంటాడు. ఆయనిలా ఆజ్ఞాపిస్తాడు: “ఒకనినైన తప్పించుకొనిపోనియ్యక బయలు ప్రవక్తలను పట్టుకొను[డి].” వాళ్లు కీషోను వాగు వద్ద వధింపబడిన తర్వాత ఆకాశం మేఘావృతమౌతుంది. తుదకు, జడివాన కురిసి క్షామాన్ని అంతమొందిస్తుంది!—1 రాజులు 18:40-45; ద్వితీయోపదేశకాండము 13:1-5 పోల్చండి.

8 ఎంత గొప్ప దినం! దైవత్వాన్ని గురించిన ఈ గణనీయమైన పరీక్షలో యెహోవా ఘనవిజయాన్ని పొందాడు. అంతే కాకుండా, ఈ సంఘటనలు అనేకమంది ఇశ్రాయేలీయుల హృదయాలను తిరిగి దేవుని వైపుకు మళ్లించాయి. ఈ విధంగా మరియు ఇతర విధాలుగా, ఏలీయా నమ్మకమైన ప్రవక్తగా నిరూపించబడతాడు, ఆయన వ్యక్తిగతంగా ప్రవచనార్థక పాత్ర వహిస్తాడు.

“ప్రవక్తయగు ఏలీయా” ఇంకా రానున్నాడా?

9. మలాకీ 4:5, 6 నందు ఏమి ప్రవచించబడింది?

9 తర్వాత, మలాకీ ద్వారా దేవుడిలా ముందుగానే చెప్పాడు: “యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును. నేను వచ్చి, దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును.” (మలాకీ 4:5, 6) ఆ మాటలు చెప్పబడుటకు దాదాపు 500 సంవత్సరాల ముందు ఏలీయా జీవించాడు. ఇది ఒక ప్రవచనం గనుక, సా.శ. మొదటి శతాబ్దం నాటి యూదులు దాన్ని నెరవేర్చేందుకు ఏలీయా వస్తాడనే నిరీక్షణలో ఉండిరి.—మత్తయి 17:10.

10. ప్రవచించబడిన ఏలీయా ఎవరు, మరియు మనకు ఎలా తెలుసు?

10 మరి ఆ రాబోయే ఏలీయా ఎవరు? ఆయనను గూర్చిన గుర్తింపు, “బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని యిప్పటి వరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరును ప్రవచించుచువచ్చిరి; ధర్మశాస్త్రము సహా ప్రవచించుచునుండెను. ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా యితడే” అని యేసుక్రీస్తు చెప్పినప్పుడు వెల్లడి చేయబడింది. అవును, బాప్తిస్మమిచ్చు యోహానే ప్రవచింపబడిన ఏలీయా యొక్క ప్రతిరూపం. (మత్తయి 11:12-14; మార్కు 9:11-13) యోహాను “ఏలీయా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై” ఉంటాడని ‘యెహోవా కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరుస్తాడని’ యోహాను తండ్రియైన జెకర్యాకు ఒక దేవదూత చెప్పాడు. (లూకా 1:17) యోహాను ఇచ్చిన బాప్తిస్మం, యూదులను క్రీస్తు వైపుకు నడుపవలసిన ధర్మశాస్త్రానికి విరుద్ధంగా వారు చేసిన పాపాల విషయంలో ఆయా వ్యక్తులు చూపే పశ్చాత్తాపానికి బహిరంగ సూచనగా ఉంది. (లూకా 3:3-6; గలతీయులు 3:24) అలా యోహాను చేసిన పని ‘యెహోవా కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపర్చింది.’

11. పెంతెకొస్తునాడు, ‘యెహోవా దినాన్ని’ గురించి పేతురు ఏమి చెప్పాడు, మరి అది ఎప్పుడు సంభవించింది?

11 “ఏలీయా”గా బాప్తిస్మమిచ్చు యోహాను చేసిన పని ‘యెహోవా దినం’ సమీపించిందనే విషయాన్ని చూపింది. తన శత్రువులకు విరుద్ధంగా యెహోవా చర్య తీసుకునే దినపు మరియు తన ప్రజలను కాపాడే దినపు సామీప్యతను గురించి అపొస్తలుడైన పేతురు కూడా సూచించాడు. సా.శ. 33 పెంతెకొస్తు నాడు జరిగిన అద్భుతమైన సంఘటనలు దేవుని ఆత్మ కుమ్మరింపబడడాన్ని గురించిన యోవేలు ప్రవచన నెరవేర్పని ఆయన సూచించాడు. “ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము” కంటే ముందే అది జరగాలని పేతురు చూపించాడు. (అపొస్తలుల కార్యములు 2:16-21; యోవేలు 2:28-32) తన కుమారున్ని నిరాకరించిన జనాంగంపై రోమా సైన్యాలు దైవిక తీర్పులను అమలుపర్చేలా చేయడం ద్వారా, సా.శ. 70లో యెహోవా తన వాక్యాన్ని నెరవేర్చాడు.—దానియేలు 9:24-27; యోహాను 19:15.

12. (ఎ) రాబోయే ‘యెహోవా దినం’ గురించి పౌలు పేతురులు ఏమి చెప్పారు? (బి) ఏలీయా యొక్క పని ద్వారా సూచించబడిన విధంగా ఏదో తప్పనిసరిగా ఎందుకు జరుగవలసి ఉంది?

12 అయితే సా.శ. 70 తర్వాత జరుగవలసింది ఇంకా ఎక్కువ ఉంది. అపొస్తలుడైన పౌలు రానైయున్న ‘యెహోవా దినాన్ని’ యేసుక్రీస్తు ప్రత్యక్షతతో జత చేశాడు. అంతే కాకుండా, అపొస్తలుడైన పేతురు ఆ దినాన్ని గురించి ఇంకా భవిష్యత్తులో రానైయున్న “క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి”కి సంబంధించి మాట్లాడాడు. (2 థెస్సలొనీకయులు 2:1, 2; 2 పేతురు 3:10-13) సా.శ. 70లో ‘యెహోవా దినం’ రాకముందు బాప్తిస్మమిచ్చు యోహాను ఏలీయా చేసినటువంటి పని చేశాడనే విషయాన్ని మదిలో ఉంచుకోండి. ఏలీయా చేసిన పని ద్వారా సూచించబడిన విధంగా మరేదో భవిష్యత్తులో జరుగనై ఉందని, ఈ విషయాలన్నీ కలిసి స్పష్టంగా సూచిస్తున్నాయి. అది ఏమిటి?

వారికి ఏలీయా ఆత్మ ఉంది

13, 14. (ఎ) ఏలీయా మరియు ప్రస్తుత దిన అభిషిక్త క్రైస్తవుల కార్యకలాపాల్లో ఎలాంటి సమాంతరం ఉంది? (బి) క్రైస్తవమత సామ్రాజ్యపు మతభ్రష్టులు ఏమి చేశారు?

13 ఏలీయా యొక్క పని బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క కార్యకలాపాలలో మాత్రమే కాక, రాబోయే ‘యెహోవా దినానికి’ నడుపుతున్న ఈ కష్టతరమైన కాలాల్లోని అభిషిక్త క్రైస్తవుల కార్యకలాపాలలో కూడా సమాంతరాన్ని కలిగివుంది. (2 తిమోతి 3:1-5) ఏలీయా యొక్క ఆత్మ మరియు శక్తి కలిగివున్న వీరు సత్యారాధనకు యథార్థమైన మద్దతునిచ్చే వారై ఉన్నారు. అది ఎంత ఆవశ్యకమైన విషయమై ఉండినదో కదా! ఏలీయా కాలంలో ఇశ్రాయేలులో బయలు ఆరాధన విస్తరించిన విధంగానే, క్రీస్తు అపొస్తలుల మరణం తర్వాత నిజ క్రైస్తవత్వం నుండి మత భ్రష్టత సంభవించింది. (2 పేతురు 2:1) క్రైస్తవులమని చెప్పుకునే వారు అబద్ధమత సిద్ధాంతాలూ అభ్యాసాలతో క్రైస్తవత్వాన్ని కలగలపడం ప్రారంభించారు. ఉదాహరణకు, మానవునిలో అమర్త్య ప్రాణము ఉంటుందనే అన్య మత సంబంధమైన మరియు లేఖనవిరుద్ధమైన బోధను వారు స్వీకరించారు. (ప్రసంగి 9:5, 10; యెహెజ్కేలు 18:4) క్రైస్తవమత సామ్రాజ్యపు మత భ్రష్టులు అద్వితీయ సత్య దేవుడైన యెహోవా నామాన్ని ఉపయోగించడాన్ని మానివేశారు. బదులుగా, వారు త్రిత్వాన్ని ఆరాధిస్తున్నారు. వారు యేసు యొక్క మరియు ఆయన తల్లి మరియ యొక్క ప్రతిమలకు వంగి నమస్కరించడం వంటి బయలు దేవతాచారాలను కూడా స్వీకరించారు. (రోమీయులు 1:23; 1 యోహాను 5:21) అయితే ఇది మాత్రమే కాదు.

14 క్రైస్తవమత సామ్రాజ్యం యొక్క చర్చి నాయకులు, 19వ శతాబ్దం నుండి, బైబిలులోని అనేక భాగాలను గురించి సందేహం వ్యక్తం చేయడం ప్రారంభించారు. ఉదాహరణకు, వారు సృష్టిని గురించిన ఆదికాండములోని వృత్తాంతాన్ని నిరాకరించి, పరిణామ సిద్ధాంతం “వైజ్ఞానికమైనదని” అంటూ దాన్ని స్తుతించారు. ఇది యేసుక్రీస్తు మరియు ఆయన అపొస్తలుల బోధలతో సూటిగా విభేదించింది. (మత్తయి 19:4, 5; 1 కొరింథీయులు 15:47) అయితే, యేసు మరియు ఆయన తొలి అనుచరుల వలె, ఆత్మచేత అభిషేకించబడిన క్రైస్తవులు నేడు సృష్టిని గురించిన బైబిలు వృత్తాంతాన్ని సమర్థిస్తారు.—ఆదికాండము 1:27.

15, 16. క్రైస్తవమత సామ్రాజ్యానికి భిన్నంగా, ఆత్మీయ ఆహారం యొక్క క్రమమైన సరఫరాను ఎవరు ఆస్వాదించారు, మరియు ఏ మాధ్యమం ద్వారా?

15 ప్రపంచం “అంత్యకాలము”లోకి ప్రవేశించినప్పుడు, క్రైస్తవమత సామ్రాజ్యాన్ని ఆత్మీయ క్షామం చుట్టుముట్టింది. (దానియేలు 12:4; ఆమోసు 8:11, 12) అయితే ఏలీయా కాలంనాటి క్షామ సమయంలో కూడా యెహోవా ఏలీయాకు భోజనాన్ని ఏర్పాటు చేసిన విధంగా, అభిషిక్త క్రైస్తవుల చిన్న గుంపు “తగినవేళ” క్రమంగా దేవుడిచ్చిన ఆత్మీయ ఆహారాన్ని అందుకుంది. (మత్తయి 24:45; 1 రాజులు 17:6, 13-16) ఒకప్పుడు అంతర్జాతీయ బైబిలు విద్యార్థులుగా పేరొందిన ఈ నమ్మకస్థులైన దేవుని సేవకులు ఆ తర్వాత యెహోవాసాక్షులనే లేఖనాధార నామాన్ని స్వీకరించారు.—యెషయా 43:10.

16 ఏలీయా “యెహోవా నా దేవుడు” అనే అర్థంగల తన పేరుకు తగిన విధంగా జీవించాడు. యెహోవా యొక్క భూ సంబంధ సేవకుల అధికారిక పత్రికగా, కావలికోట దేవుని నామాన్ని క్రమంగా ఉపయోగించింది. వాస్తవానికి, దాని రెండవ సంచిక (ఆగష్టు 1879) ఈ పత్రిక యెహోవాను తన మద్దతుదారుగా కలిగివుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ఈ పత్రికా మరియు వాచ్‌టవర్‌ సొసైటీ యొక్క ఇతర ప్రచురణలూ, దేవుని వాక్యమైన బైబిలు యొక్క సత్యసంధతను సమర్థిస్తూనే, క్రైస్తవమత సామ్రాజ్యం మరియు అబద్ధమత సామ్రాజ్యమైన మహా బబులోనులోని మిగతా భాగం యొక్క లేఖనవిరుద్ధమైన బోధలను బహిర్గతం చేస్తున్నాయి.—2 తిమోతి 3:16, 17; ప్రకటన 18:1-5.

పరీక్షయందునూ నమ్మకంగా ఉండటం

17, 18. బయలు ప్రవక్తలు వధింపబడినప్పుడు యెజెబెలు ఎలా ప్రతిస్పందించింది, అయితే ఏలీయాకు సహాయం ఎలా లభించింది?

17 వారి తప్పిదాలు బహిర్గతం చేయబడినప్పుడు మత గురువులు ప్రతిస్పందించిన రీతి, ఏలీయా బయలు ప్రవక్తలను చంపించాడనే విషయం తెలుసుకున్న తర్వాత యెజెబెలు ప్రతిస్పందించిన విధంగానే ఉంది. ఆయనను చంపిస్తానని ఒట్టుపెట్టుకున్నట్టుగా ఒక వర్తమానాన్ని ఆమె యెహోవా యొక్క నమ్మకమైన ప్రవక్తకు పంపింది. యెజెబెలు అప్పటికే దేవుని అనేకమంది ప్రవక్తలను హత్య చేయించింది గనుక ఇది మామూలు బెదిరింపు కాదు. భయంతో, ఏలీయా నైరుతి వైపుకు బెయేర్షెబాకు పారిపోయాడు. తన అనుచరున్ని అక్కడ వదిలి, ఆయన ఇంకా ముందుకు వెళ్లాడు, అక్కడ అరణ్యంలో చనిపోవాలని ప్రార్థించాడు. అయితే యెహోవా తన ప్రవక్తను విడనాడలేదు. ఒక దేవదూత ఆయనకు ప్రత్యక్షమై హోరేబు పర్వతం వద్దకు పోయే సుదీర్ఘ ప్రయాణానికి ఏలీయాను సిద్ధం చేశాడు. అలా ఆయన 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరమైన, 40 దినాల ప్రయాణం కొరకు కావలసిన పోషణను అందుకున్నాడు. హోరేబు వద్ద దేవుడు గొప్ప సుడిగాలి, భూకంపం, మరియు మెరుపుల మహా భయానక శక్తి ప్రదర్శన తర్వాత ఆయనతో మాట్లాడాడు. ఈ ప్రదర్శనల్లో యెహోవా లేడు. అవి ఆయన పరిశుద్ధాత్మ లేక చురుకైన శక్తి యొక్క వ్యక్తీకరణలు మాత్రమే. ఆ తర్వాత యెహోవా తన ప్రవక్తతో మాట్లాడాడు. ఈ అనుభవం ఏలీయాను ఎంతగా బలపర్చిందో ఊహించండి. (1 రాజులు 19:1-12) ఏలీయా వలె, సత్యారాధనకు శత్రువులైన వారి ద్వారా బెదిరింపబడినప్పుడు మనం కూడా కొంత మేరకు భయపడితే అప్పుడెలా? యెహోవా తన ప్రజలను విడనాడడనే విషయాన్ని గుర్తించేందుకు ఆయన అనుభవం మనకు సహాయం చేయాలి.—1 సమూయేలు 12:22.

18 ప్రవక్తగా ఏలీయా చేయవలసిన పని ఇంకా ఉందని దేవుడు స్పష్టం చేశాడు. అంతే కాకుండా, ఇశ్రాయేలులో సత్యదేవునికి తానొక్కడే ఆరాధికుడనని ఏలీయా భావించినప్పటికీ, బయలుకు వంగి నమస్కరించని ఇంకా 7,000 మంది ఉన్నారని యెహోవా ఆయనకు చూపాడు. దేవుడు ఆ తర్వాత ఏలీయాను ఆయన నియామకానికి పంపించాడు. (1 రాజులు 19:13-18) ఏలీయా వలె మనం కూడా సత్యారాధన యొక్క శత్రువులచేత వెంటాడబడవచ్చు. యేసు ప్రవచించిన విధంగా మనం తీవ్రమైన హింసకు గురి కావచ్చు. (యోహాను 15:17-20) కొన్నిసార్లు మనం భయపడిపోవచ్చు. అయితే, దైవిక నిశ్చయతను అందుకుని తర్వాత యెహోవా సేవలో నమ్మకంగా కొనసాగిన ఏలీయా వలె మనం ఉండవచ్చు.

19. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో అభిషిక్త క్రైస్తవులు ఏమి అనుభవించారు?

19 మొదటి ప్రపంచయుద్ధ కాలంలో తీవ్రమైన హింస మూలంగా, కొంతమంది అభిషిక్త క్రైస్తవులు భయానికి గురై ప్రకటించడాన్ని మానుకున్నారు. భూమిపై తమ పని ముగిసిందని తప్పుగా ఆలోచించారు. అయితే, దేవుడు వారిని నిరాకరించలేదు. బదులుగా, ఆయన ఏలీయాకు ఆహారాన్ని అందించిన విధంగానే ఆయన వారిని కనికరంతో సంరక్షించాడు. ఏలీయా వలె, నమ్మకస్థులైన అభిషిక్తులు దైవిక దిద్దుబాటును అంగీకరించి తమ నిష్ర్కియా స్థితినుండి కోలుకున్నారు. రాజ్య వర్తమానాన్ని ప్రకటించడమనే గొప్ప ఆధిక్యత విషయమై వారి నేత్రాలు తెరువబడ్డాయి.

20. నేడు, ఏలీయా వలె నమ్మకంగా ఉండే వారికి ఏ ఆధిక్యత ఇవ్వబడింది?

20 తన ప్రత్యక్షతను గురించిన తన ప్రవచనంలో, ఈ దుష్టవిధానాంతానికి ముందు జరుగవలసిన ఒక ప్రపంచవ్యాప్త పనిని గురించి యేసు సంక్షిప్తంగా వివరించాడు. (మత్తయి 24:14) నేడు, ఈ పని అభిషిక్త క్రైస్తవుల ద్వారా మరియు భూ పరదైసుపై జీవించేందుకు నిరీక్షిస్తున్న వారి లక్షలాదిమంది సహవాసుల ద్వారా జరుపబడుతుంది. రాజ్య ప్రకటనాపని ముగిసేంత వరకూ ఆ పనిని చేసే ఆధిక్యత, ఏలీయా వలె నమ్మకంగా ఉండే వారికి మాత్రమే ఇవ్వబడింది.

ఏలీయా వలె నమ్మకంగా ఉండండి

21, 22. (ఎ) నేడు అభిషిక్త క్రైస్తవులు ఏ పనిని ముందుకు తీసుకెళుతున్నారు? (బి) ప్రకటనాపని ఏ సహాయం ద్వారా జరుపబడుతుంది, అది ఎందుకు అవసరమై ఉంది?

21 ఏలీయా వంటి ఆసక్తితో, యథార్థమైన అభిషిక్త క్రైస్తవుల అల్ప శేషము, సింహాసనాసీనుడైన రాజగు యేసుక్రీస్తు యొక్క భూ సంపద ఎడల శ్రద్ధ వహించే తమ బాధ్యతను నెరవేర్చింది. (మత్తయి 24:47) భూపరదైసులో నిత్యం జీవించే అద్భుతమైన నిరీక్షణ అనుగ్రహించబడిన ఆ ప్రజలను శిష్యులనుగా చేసే పనిని ముందుకు తీసుకెళ్లేందుకు దేవుడు, ఇప్పటికే 60 కంటే ఎక్కువ సంవత్సరాలుగా ఈ అభిషిక్తులను ఉపయోగించుకుంటున్నాడు. (మత్తయి 28:19, 20) సాపేక్షికంగా సంఖ్యలో తక్కువగా ఉన్న అభిషిక్తులు తమ బాధ్యతలను నిర్వహించడంలో ఆసక్తితో మరియు నమ్మకంగా ఉన్నారని ఈ లక్షలాదిమంది, ఎంత కృతజ్ఞత కలిగి ఉండగలరో గదా!

22 ఈ రాజ్య ప్రకటనాపని అపరిపూర్ణ మానవుల ద్వారా జరుపబడుతుంది, అయితే కేవలం యెహోవాపై ప్రార్థనాపూర్వకంగా ఆధారపడే వారికి ఆయన ఇచ్చే శక్తి ద్వారా మాత్రమే అది జరుగుతుంది. నీతిమంతుని ప్రార్థనాశక్తిని చూపేందుకు ప్రవక్త యొక్క ప్రార్థనను ఉదాహరణగా సూచిస్తూ “ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే” అని శిష్యుడైన యాకోబు చెప్పాడు. (యాకోబు 5:16-18) ఏలీయా ఎల్లవేళలా ప్రవచించడం లేక అద్భుతాలు చేయడం వంటివి చేయలేదు. మనం కలిగి ఉన్న మానవ భావాలనూ మరియు బలహీనతలనూ ఆయన కలిగి ఉన్నాడు అయినప్పటికీ ఆయన దేవునికి నమ్మకంగా సేవ చేశాడు. మనకు కూడా దేవుని సహాయం ఉంది మరియు ఆయన మనకు బలాన్ని ఇస్తాడు గనుక, మనమూ ఏలీయా వలె నమ్మకంగా ఉండగలం.

23. నమ్మకంగా ఉండేందుకూ ఆశాభావాన్ని కలిగి ఉండేందుకూ మనకెందుకు చక్కని కారణం వుంది?

23 మనం నమ్మకంగా ఉండేందుకూ ఆశాభావాన్ని కలిగి ఉండేందుకూ చక్కని కారణం ఉంది. సా.శ. 70లో ‘యెహోవా దినం’ రాకమునుపు, ఏలీయా చేసిన పనినే బాప్తిస్మమిచ్చు యోహాను చేశాడని జ్ఞాపకం చేసుకోండి. ఏలీయా యొక్క ఆత్మతో మరియు శక్తితో, అభిషిక్త క్రైస్తవులు దేవుడిచ్చిన అదే విధమైన పనిని భూవ్యాప్తంగా చేశారు. ‘యెహోవా యొక్క గొప్ప దినం’ సమీపంగా ఉందనే విషయాన్ని ఇది స్పష్టంగా నిరూపిస్తుంది.

మీరు ఎలా ప్రత్యుత్తరమిస్తారు?

◻ కర్మెలు పర్వతంపై యెహోవా దైవత్వం ఎలా నిరూపించబడింది?

◻ ‘రానైయున్న ఏలీయా’ ఎవరు, ఆయన ఏమి చేశాడు?

◻ తమకు ఏలీయా యొక్క ఆత్మ ఉందనే విషయాన్ని ప్రస్తుతదిన అభిషిక్త క్రైస్తవులు ఎలా చూపారు?

◻ మనం ఏలీయా వలె నమ్మకంగా ఉండటం ఎందుకు సాధ్యమవుతుంది?

[15వ పేజీలోని బాక్సు]

ఏలీయా ఏ పరలోకానికి ఆరోహణమయ్యాడు?

“వారు [ఏలీయా మరియు ఎలీషా] ఇంక వెళ్లుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములును కనబడి వీరిద్దరిని వేరు చేసెను; అప్పుడు ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు [“పరలోకానికి,” NW] ఆరోహణమాయెను.”—2 రాజులు 2:11.

ఈ విషయంలో “ఆకాశము [“పరలోకము,” NW]” అనే పదానికి గల అర్థం ఏమిటి? హెబ్రీ భాషలో, దేవుని మరియు దేవదూతలైన ఆయన కుమారుల ఆత్మీయ నివాస స్థానాన్ని సూచించేందుకూ అలాగే భౌతిక విశ్వాన్ని నిర్వచించేందుకూ కూడా ఒకే పదం ఉపయోగించబడింది. (మత్తయి 6:9; 18:10; ద్వితీయోపదేశకాండము 4:19) దానికి తోడు, పక్షులు ఎగిరే, గాలి వీచే ప్రదేశాలైన భూపరిధిలోని వాతావరణాన్ని సూచించేందుకు కూడా బైబిలు ఈ పదాన్నే ఉపయోగిస్తుంది.—కీర్తన 78:26; మత్తయి 6:26.

వీటిలో ఎక్కడికి, ఆకాశానికా లేక పరలోకానికా ఏలీయా ఆరోహణమైంది? ఆయన భూమి యొక్క వాతావరణం గుండా భూగోళం యొక్క మరొక భాగం పైకి తరలించబడ్డాడని రుజువులు చూపుతున్నాయి. ఆ తర్వాతి సంవత్సరాల్లో కూడా ఏలీయా భూమిపైనే ఉన్నాడు, ఎందుకంటే ఆయన యూదా రాజైన యెహోరాముకు ఒక ఉత్తరం వ్రాశాడు. (2 దినవృత్తాంతములు 21:1, 12-15) యెహోవా దేవుని ఆత్మీయ నివాసానికి ఏలీయా ఆరోహణం కాలేదనే విషయం, “పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు” అని తర్వాత ఉద్ఘాటించిన యేసుక్రీస్తు ద్వారా నొక్కి చెప్పబడింది. (యోహాను 3:13) అపరిపూర్ణ మానవుల నిమిత్తం పరలోక జీవితానికి మార్గం యేసుక్రీస్తు మరణ పునరుత్థాన ఆరోహణాల తర్వాతే తెరువబడింది.—యోహాను 14:2, 3; హెబ్రీయులు 9:24; 10:19, 20.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి