కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 9/1 పేజీలు 25-28
  • నా హృదయం కృతజ్ఞతాభావంతో పొంగిపోతోంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నా హృదయం కృతజ్ఞతాభావంతో పొంగిపోతోంది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మంచి మాదిరులనుబట్టి కృతజ్ఞత
  • సత్యం కొరకు నా తీర్మానం
  • నా పరిచర్యనుబట్టి కృతజ్ఞత
  • నమ్మకమైన సహచరిని సంపాదించుకోవడం
  • మా వైవాహిక జీవితాన్ని బట్టి కృతజ్ఞత
  • ‘ఒక యూదుని చెంగు పట్టుకొని’ డెబ్బై ఏళ్లు గడిపాను
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • సరైన ఎంపికలు చిరకాల ఆశీర్వాదాలను తెచ్చాయి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • నేర్చుకోవడమనే అంతులేని ప్రయాణాన్ని ఎన్నడూ ఆపలేదు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • 80 ఏళ్లప్పుడు నియామకంలో మార్పు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 9/1 పేజీలు 25-28

నా హృదయం కృతజ్ఞతాభావంతో పొంగిపోతోంది

జాన్‌ విన్‌ చెప్పినది

యెహోవాసాక్షుల కూటాలకు వెళ్లడానికి నేను ఎంతగా నిరాకరించేవాడినో! కూటాలకు వెళ్లడాన్ని తప్పించుకునేందుకు నేను ఏదైనా చేసేవాడిని అంటే, కడుపునొప్పి అనో తలనొప్పి అనో సాకు చెప్పేవాడిని. కాని మా అమ్మ పట్టుదల ఆ జబ్బులన్నీ త్వరగా మటుమాయమయ్యేలా చేసేది, వెంటనే నేనూ ఆమెతోపాటు రాజ్యమందిరానికి వెళ్లడానికి మూడు కిలోమీటర్లు నడవడం మొదలెట్టేవాడిని, దారిలో తనతోపాటు నడుస్తున్న వృద్ధ సహచరితో ఆమె దేవుని వాక్యం గురించి చర్చిస్తుండగా నేనూ వింటుండేవాడిని.

ఇది నాకొక విలువైన పాఠాన్ని నేర్పింది: దేవుని దృష్టికి సరైనది చేయడంలో ప్రేమపూర్వకమైన పట్టుదల కలిగివుండడాన్ని తలిదండ్రులు ఎన్నడూ మానకూడదు. (సామెతలు 29:15, 17) ‘సమాజముగా కూడుట మానకూడదని’ ఇవ్వబడిన దైవిక ఆజ్ఞను వారెన్నడూ మరువకూడదు. (హెబ్రీయులు 10:24) నేను వెనుదిరిగి నా జీవితం గురించి ఆలోచించినప్పుడు, మా అమ్మ నాకేది మంచిదో అదే నేను చేసేలా చేసినందుకు నేనెంత కృతజ్ఞత కల్గివున్నానో!

మంచి మాదిరులనుబట్టి కృతజ్ఞత

మా నాన్న అవిశ్వాసి అయినప్పటికీ, మా అమ్మ బైబిలు విద్యార్థి అయినప్పుడు ఆయన ఆమె నమ్మకాలను సహించేవాడు, అప్పట్లో యెహోవాసాక్షులు బైబిలు విద్యార్థులని పిలువబడేవారు. ఆమె 1913లో, వాచ్‌ టవర్‌ సొసైటి మొదటి అధ్యక్షుడైన చార్లెస్‌ టి. రస్సెల్‌ ఇచ్చిన “సమాధికి అవతల” అనే ప్రసంగాన్ని వినడానికి వెళ్లింది. అయితే ఆమె ఆలస్యంగా వెళ్లడంతో, సీట్లన్నీ నిండిపోయాయి. కాబట్టి ఆలస్యంగా వచ్చిన ఇతరులతోపాటూ వేదిక చుట్టూ, పాస్టర్‌ రస్సెల్‌ సమీపంలో కూర్చోడానికి ఆమె ఆహ్వానింపబడింది. ఆ ప్రసంగం ఆమెను ఎంతగానో ప్రభావితం చేసింది. అది తర్వాతి రోజు స్థానిక వార్తాపత్రికలో ప్రచురించబడింది, ఆమె దాని ప్రతినొకదాన్ని ఉంచుకుని పదే పదే చదివింది.

కూటము ముగిసిన తర్వాత అమ్మ తన పేరు ఒక కాగితం మీద వ్రాసిచ్చింది, త్వరలోనే ఒక బైబిలు విద్యార్థి ఆమెను సందర్శించాడు. కొంతకాలానికి, ఇంగ్లాండులోని మా స్వస్థలమైన గ్లోసెస్టర్‌లో ఆమె బైబిలు కరపత్రాలను ఇంటింటికి పంచిపెట్టనారంభించింది. నేనూ, నా ఇద్దరు అక్కలు చాలా చిన్న వయస్సునుండే అమ్మతోపాటు ప్రకటనా పనిలో భాగం వహించేవాళ్లము.

హారీ ఫ్రాన్సిస్‌ అనే ఆసక్తిగల బైబిలు విద్యార్థి గ్లోసెస్టర్‌కు వచ్చినప్పుడు, అమ్మ ఆయనను సాదరంగా ఆహ్వానించింది. త్వరలోనే, ఆయన నా ఎడల వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకున్నాడు, నేను ఆ తర్వాత పయినీరు కావడానికి ఆయన ప్రోత్సాహం ఒక ముఖ్య కారణమయ్యింది, పూర్తికాల పరిచారకులను పయినీర్లని పిలుస్తారు. బ్రదర్‌ ఫ్రాన్సిస్‌ ఉదాహరణ నాకు ఈ ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్పింది: చిన్నవారిని ప్రోత్సహించడానికి పెద్దవారు ఎప్పుడూ మార్గాల కొరకు వెదకాలి.

మా అమ్మ బైబిలు విద్యార్థి అయినప్పుడు, గ్లోసెస్టర్‌లోని ఇతరులు కూడా బైబిలు విద్యార్థులయ్యారు. అయితే, సంఘంలోని కొంతమంది పెద్దలు తమ గురించి తాము ఉన్నతంగా భావించుకోనారంభించారు, తరగతిలోని సభ్యులు—అప్పట్లో సంఘాన్ని తరగతి అని పిలిచేవారు—వ్యక్తులను అనుసరించడం మొదలెట్టారు. ఒక కూటములో, ఫలానా పెద్దలకు మద్దతుగా చెయ్యి పైకెత్తమని చెబుతూ కొంతమంది మా అమ్మను వెనుక నుండి గుచ్చసాగారు. కానీ వాళ్లు సరైన మాదిరినుంచడం లేదని అమ్మకు తెలుసు, ఆమె ధైర్యంగా అలా ఉండిపోయింది. ఆ కాలంలో, 1920వ దశాబ్దపు చివరిభాగంలో, చాలామంది సంఘం నుండి వెళ్లిపోయి, సత్యమార్గంలో నడవడం మానుకున్నారు. (2 పేతురు 2:2) అయినప్పటికీ, సంస్థకు యథార్థంగా మద్దతునివ్వడం నుండి అమ్మ ఎన్నడూ వైదొలగలేదు, అలా ఆమె నాకొక మంచి మాదిరినుంచింది.

సత్యం కొరకు నా తీర్మానం

చివరికి, 1939 జూన్‌లో, నాకు 18 సంవత్సరాలున్నప్పుడు, నేను సెవెర్న్‌ నదిలో బాప్తిస్మం పొందాను. ఆ సంవత్సరమే నేను సౌండ్‌ సిస్టమ్‌ చూసుకునే పరిచారకునిగా కూడా నియమించబడ్డాను. ఆ రోజుల్లో మేము పెద్ద ట్రాంస్క్రిప్షన్‌ మెషీన్‌ను ఉపయోగించేవాళ్లము, అది బహిరంగ స్థలాల్లో, “మతం ఒక ఉరి మరియు ఒక కుంభకోణం” అనే సందేశాన్ని ప్రతిధ్వనింపజేసేది. ఆ కాలంలో క్రైస్తవమత సామ్రాజ్యం యొక్క వేషధారణను, అబద్ధ బోధలను బహిర్గతం చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు.

“మతం ఒక ఉరి మరియు ఒక కుంభకోణం” అని ఒక వైపున, “దేవునికీ, రాజైన క్రీస్తుకూ సేవ చేయండి” అని మరో వైపున వ్రాసివున్న బ్యానరు పట్టుకుని వెళుతున్న ఊరేగింపుకు ముందుగా నేను నడుస్తున్నాను. బహిరంగ ప్రసంగాన్ని ప్రచారం చేస్తున్న పోస్టర్లు రెండు వైపులావున్న ఒక గుఱ్ఱంపిల్ల మమ్మల్ని అనుసరిస్తోంది. ఎంతో మతాసక్తిగల నగరమైన గ్లోసెస్టర్‌లో ఆ ఊరేగింపు ఎలాంటి దృశ్యమై ఉందో ఊహించుకోండి!

ఇంట్లో ఆర్థిక కష్టాలున్నప్పటికీ, పయినీరు కమ్మని అమ్మ నన్ను ప్రోత్సహించింది. ఆ విధంగా, రెండవ ప్రపంచ యుద్ధారంభ సమయంలో, 1939 సెప్టెంబరులో, వార్‌విక్‌షైర్‌లోని ఒక చిన్న పట్టణమైన లీమింగ్‌టన్‌లో నేను నా మొదటి పయినీరు నియామకానికి వెళ్లాను. ఆ పట్టణంలో, ఉద్యోగవిరమణ పొందిన మతనాయకులనేకులు నివసించేవారు.

మేము మా పరిచర్యలో, అప్పటి వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ అధ్యక్షుడైన జోసెఫ్‌ ఎఫ్‌. రూథర్‌ఫోర్డ్‌ ప్రసంగాలను వినిపించడానికి, తక్కువ బరువున్న ఫోనోగ్రాఫ్‌ను ఉపయోగించేవాళ్లం. మరో వైపున, మా ట్రాంస్క్రిప్షన్‌ మెషీన్‌ (దీన్ని ఎక్కువమంది ప్రేక్షకుల కొరకు ఉపయోగించవచ్చు) ఎంతో బరువుండేది, మేము దాన్ని ఒక చిన్న తోపుడు బండిలో లేదా బేబీ క్యారేజీలో తీసుకెళ్లేవాళ్లం. కొన్నిసార్లు, అబద్ధ మతాన్ని బహిర్గతం చేస్తున్న సందేశాన్నిబట్టి ఉగ్రులైన మతనాయకులు మమ్మల్ని తమ ప్రాంగణాలలో నుండి వెళ్లగొట్టేసేవాళ్లు. కాని మేము నిరుత్సాహపడలేదు. యెహోవా మా సేవను ఆశీర్వదించాడు, నేడు లీమింగ్‌టన్‌లో వందకంటే ఎక్కువమంది సాక్షులున్న సంఘాన్ని చూడవచ్చు.

1941లో, రెండవ ప్రపంచ యుద్ధం ఉద్ధృతమౌతుండగా, నేను వేల్స్‌కు వెళ్లి, అక్కడ హవెర్‌ఫోర్ట్‌వెస్ట్‌, కార్‌మార్‌తెన్‌, మరియు వ్రెక్సామ్‌ పట్టణాల్లో పయినీరు సేవచేశాను. పూర్తికాల పరిచారకునిగా, నాకు సైనిక సేవ నుండి మినహాయింపు లభించింది, కాని ప్రజలు మా తటస్థ స్థానాన్ని మెచ్చుకునేవారు కాదు. అందుకే, నేనూ నా భాగస్వామి ఇద్దరమూ గూఢచారులమని లేకపోతే పంచమాంగ దళసభ్యులమని నిందించబడ్డాము. ఒక రాత్రి, పోలీసులు మా ట్రైలర్‌ను చుట్టుముట్టారు. బొగ్గు త్రవ్వే తన పని నుండి అప్పుడే తిరిగివచ్చిన నా భాగస్వామి, బయట ఉన్నది ఎవరో అని చూడ్డానికి తలుపు తెరిచి తన తల బయటపెట్టి చూశాడు. ఆయన ముఖం మీద బొగ్గు మసి ఉంది, ఆయన కమెండో దాడికి సిద్ధపడుతున్నవాడిలా పోలీసులకు కనిపించాడు. మేము విషయం వివరించవలసి వచ్చింది!

మా నియామకాల్లో మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. ఒకసారి మేము కార్‌మార్‌తెన్‌లో ఉండగా, లండన్‌లోని బ్రాంచి కార్యాలయం నుండి జాన్‌ బార్‌ (ఇప్పుడాయన పరిపాలక సభ సభ్యుడు) మమ్మల్ని సందర్శించి ప్రోత్సహించాడు. ఆ సమయంలో, కార్‌మార్‌తెన్‌లో కేవలం ఇద్దరే ప్రచారకులున్నారు; ప్రస్తుతం అక్కడ వందకంటే ఎక్కువమంది ఉన్నారు. వ్రెక్సామ్‌లో ప్రస్తుతం మూడు సంఘాలున్నాయి, హావెర్‌ఫోర్డ్‌వెస్ట్‌లో ఒక చక్కని రాజ్యమందిరాన్ని ప్రతిష్టించే ఆధిక్యత ఇటీవలనే నాకు లభించింది.—1 కొరింథీయులు 3:6.

నా పరిచర్యనుబట్టి కృతజ్ఞత

మేము సౌత్‌వేల్స్‌ నందలి స్వాన్‌సీలో ఉండగా, నా భాగస్వామి డాన్‌ రెండెల్‌కు సైనిక మినహాయింపు దొరకలేదు. ఇతర దేశాల్లోవున్న తోటి క్రైస్తవులకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి తన మనస్సాక్షి అంగీకరించదని ఆయన వివరించినా ఆయనను చెరసాలలో వేశారు. (యెషయా 2:2-4; యోహాను 13:34, 35) ఆయనను ప్రోత్సహించడానికి, అలాగే పొరుగువారికి సాక్ష్యమివ్వడానికి, నేను ట్రాంస్క్రిప్షన్‌ మెషీన్‌ను చెరసాలకు దగ్గరలో ఉంచి, బైబిలు ప్రసంగాలు వినిపించనారంభించాను.

అయితే, స్థానిక స్త్రీలకు ఇది నచ్చలేదు, నన్నూ నా భాగస్వామినీ కొట్టడానికి సైనికులకు ఇచ్చేందుకు, వాళ్లు ఒక టోపి తీసుకుని దానిలో అందరి దగ్గరి నుండి డబ్బు పోగుచేసారు. రాజ్యమందిరంలో దాక్కోవచ్చని, మేము వీలైనంత వేగంగా పరుగెత్తుతూ అక్కడి నుండి పారిపోనారంభించాము, నేనైతే ట్రాంస్క్రిప్షన్‌ మెషీన్‌ ఉన్న ప్రామ్‌ను కూడా లాక్కుంటూ వెళ్లాను. కానీ మేము రాజ్యమందిరానికి చేరుకునే సరికి అది తాళం వేసివుంది! సమయానికి పోలీసులు వచ్చి జోక్యం చేసుకోవడంతో మాకు తీవ్రమైన దెబ్బలు తప్పాయి.

ఆ సంఘటన అందరికీ బాగా తెలిసిపోయింది. కొంతకాలం తర్వాత నేను స్వాన్‌సీ దగ్గర గ్రామంలో ప్రకటిస్తుండగా, ఒక వ్యక్తి అంగీకారంగా నాతో ఇలా చెప్పాడు: “స్వాన్‌సీలోని ఒక యౌవనస్థునిలా మీరు క్రైస్తవత్వానికి మద్దతునిస్తారు, ఆయన తాను నమ్మినదాన్ని ధైర్యంగా ప్రకటించి భద్రత కొరకు పారిపోవలసి వచ్చింది.” ఆ యౌవనస్థున్ని నేనే అని తెలుసుకుని ఆయన ఎంత ఆశ్చర్యపోయాడో!

ఆ యుద్ధ సంవత్సరాల్లో పయినీరు సేవచేయడం అంత సులభంగా ఉండేది కాదు. మాకు లోకసంబంధంగా ఎక్కువ ఆస్తిపాస్తులు ఉండేవికావు, కాని మాకున్నదాని ఎడల మేము మెప్పుదల కలిగివుండి, ఆనందించేవాళ్లం. మేము ఎల్లప్పుడూ ఆత్మీయాహారాన్ని క్రమంగా పొందేవాళ్లం, మేము కేవలం అనారోగ్యంగా ఉన్నప్పుడు తప్ప ఎన్నడూ ఒక్క కూటానికి కూడా హాజరవ్వకుండా ఉండలేదు. నేను ఒక పాత సైకిలు కొన్నాను, ఫోనోగ్రాఫ్‌ను, బైబిలు సాహిత్యాన్ని మోసుకువెళ్లడానికి మేము దాని మీద పెద్ద బుట్టలు పెట్టేవాళ్లం. కొన్నిసార్లు నేను సైకిలు మీద రోజుకు దాదాపు 50 మైళ్లు ప్రయాణించేవాడిని! నేను దాదాపు ఏడు సంవత్సరాలపాటు పయినీరు సేవ చేశాను, ఆ రోజుల్ని నేను ప్రియంగా జ్ఞాపకం చేసుకుంటాను.

1946లో, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, బేతేలులో పనిచేయడానికి నన్ను ఆహ్వానించారు, ఆయా దేశాల్లోవున్న యెహోవాసాక్షుల ముఖ్య భవనసముదాయాలను బేతేలు అని పిలుస్తారు. అప్పుడు మా బేతేలు 34 క్రావెన్‌ టెర్రెస్‌ వద్ద అంటే, లండన్‌ టాబర్నకల్‌ ప్రక్కనే ఉండేది. అక్కడ ఆలిస్‌ హార్ట్‌ వంటి పెద్దవయస్కుల సహవాసాన్ని నేను ఆనందించాను, ఆలిస్‌ హార్ట్‌ తండ్రియైన టామ్‌ హార్ట్‌ ఇంగ్లాండులోని మొదటి సాక్షి అని విశ్వసించబడుతుంది.

నమ్మకమైన సహచరిని సంపాదించుకోవడం

1956లో, ఏటీని వివాహం చేసుకోవడానికి నేను బేతేలు విడిచి వెళ్లాను, ఎటీ ఒక పయినీరు, ఆమె అప్పట్లో లండన్‌లో నివసిస్తున్న తన అక్కను దర్శించడానికి నెదర్లాండ్స్‌ నుండి వచ్చినప్పుడు నాకు ఆమెతో పరిచయమైంది. యుద్ధం ముగింపుకొస్తున్న సమయంలో, దక్షిణ నెదర్లాండ్స్‌లోని టిబర్గ్‌లోని ఒక వాణిజ్య కళాశాలలో ఎటీ టైపు, షార్టుహాండు నేర్పించేది. ఒక రోజు ఆమె క్షేమంగా ఇల్లు చేరేలా మరో టీచరు ఆమెకు తోడుగా సైకిలు మీద వస్తానన్నాడు. ఆయన ఒక రోమన్‌ కాథోలిక్‌. వాళ్లు ఇల్లు చేరినప్పుడు, ప్రొటెస్టంట్లయిన ఏటీ తలిదండ్రులతో చర్చ జరిగింది. స్నేహం పెరిగింది, ఆ టీచరు తరచూ వాళ్లింటికి వస్తూండేవాడు.

యుద్ధం ముగిసిన వెంటనే ఈ టీచరు, “నేను సత్యం తెలుసుకున్నాను!” అని బిగ్గరగా చెబుతూ ఏటీ ఇంటికి వచ్చాడు.

“నీవు రోమన్‌ కాథోలిక్‌గా ఉన్నప్పుడు కూడా నీ దగ్గర సత్యం ఉందని చెప్పినట్లు గుర్తు!” అని ఏటీ తండ్రి సమాధానమిచ్చాడు.

“లేదు!” ఆయన ఆనందంగా సమాధానమిచ్చాడు. “సత్యం ఉన్నది యెహోవాసాక్షుల దగ్గరే!”

ఆ సాయంకాలం, అలాగే అనేక సాయంకాలాలు తీవ్రమైన బైబిలు చర్చలతో గడిచాయి. తర్వాత త్వరలోనే ఏటీ పయినీరు అయ్యింది. ఆమె కూడా తన పరిచర్యలో తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంది, ఆ వ్యతిరేకత నెదర్లాండ్స్‌లో రోమన్‌ కాథోలిక్‌ చర్చి నుండి వచ్చింది. ప్రీస్టులచే ఉసిగొల్పబడిన పిల్లలు ఆమె ఇంటింటికి వెళుతుండగా ఆమె సంభాషణలకు ఆటంకం కలిగించేవాళ్లు, ఒకసారి వాళ్లు ఆమె సైకిలును పాడుచేశారు. ఆమె తన సైకిలును రిపేరు చేసే వ్యక్తి దగ్గరికి తీసుకు వెళ్లింది, అతడు గతంలో ఆమె దగ్గర ఒక చిన్నపుస్తకం తీసుకున్నాడు. “చూడు పిల్లలేమి చేశారో!” అని ఆమె కన్నీళ్లతో చెప్పింది.

“మీరిప్పుడు విడువకండి, మీరు మంచి పని చేస్తున్నారు. ఏమీ తీసుకోకుండానే నేను మీ సైకిలు రిపేరు చేసిస్తాను” అని ఆయన దయగా చెప్పి, అలాగే రిపేరు చేసిచ్చాడు.

తాను వారితో బైబిలు పఠించడం మొదలుబెట్టేంత వరకు ప్రీస్టులు తమ మందల ఎడల ఏ మాత్రం శ్రద్ధ కలిగిలేకుండిరని ఏటీ తెలుసుకుంది. ఆ తర్వాత ప్రీస్టులు, నన్‌లు బైబిలునందూ యెహోవాయందూ ప్రజలకున్న విశ్వాసాన్ని తగ్గించడానికి వచ్చేవాళ్లు. ఇలా జరిగినప్పటికీ, ఆమెకు ఎన్నో ఫలవంతమైన బైబిలు పఠనాలు లభించాయి.

మా వైవాహిక జీవితాన్ని బట్టి కృతజ్ఞత

మా వివాహం తర్వాత, నన్నూ, ఏటీని ఇంగ్లాండులో ప్రయాణపని కొరకు నియమించారు, దాదాపు ఐదు సంవత్సరాలపాటు మేము సంఘాలను ఆత్మీయంగా బలపర్చడానికి వాటిని దర్శించాము. తర్వాత నేను 36వ గిలియడ్‌ తరగతికి హాజరయ్యేందుకు ఆహ్వానాన్ని అందుకున్నాను, అది న్యూయార్క్‌ నందలి బ్రూక్లిన్‌లో యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయంలో జరిగింది. పది నెలల ఆ తరగతి 1961 నవంబరులో ముగిసింది, అది ప్రాముఖ్యంగా యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాలలో పని నిర్వహణలో తర్ఫీదు ఇచ్చేందుకు రూపొందించబడింది. నేను అక్కడికి వెళ్లినప్పుడు, ఏటీ ఇంగ్లాండులోనే, లండన్‌ బేతేలులో ఉంది. నేను పట్టభద్రుడినైన తరువాత మా ఇద్దరిని అక్కడే నియమించారు.

తర్వాతి 16 సంవత్సరాలు, నేను సేవా విభాగంలో పని చేస్తూ, సంఘ కార్యకలాపాలకు సంబంధించిన పనులను చూసుకున్నాను. 1978లో, బేతేలు హోమ్‌ ఓవర్‌సీయర్‌ అయిన ప్రైస్‌ హ్యూజ్‌ మరణించిన తర్వాత, నన్ను ఆయన స్థానంలో నియమించారు. పెరుగుతున్న మా బేతేలు కుటుంబ సభ్యుల క్షేమాన్ని గూర్చి శ్రద్ధ తీసుకోవలసిన బాధ్యత ఈ అనేక సంవత్సరాల్లో ప్రతిఫలదాయకమైన నియామకంగా ఉంది, ఇప్పుడు మా బేతేలు కుటుంబంలో 260 కంటే ఎక్కువమంది ఉన్నారు.

1971లో ప్రియమైన మా అమ్మ 85 ఏళ్ల వయస్సులో మరణించింది. ఏటీ నేను అంత్యక్రియలకు గ్లోసెస్టర్‌కు తిరిగి వచ్చాము, అక్కడ ఒక సహోదరుడు, అమ్మకుండిన పరలోక నిరీక్షణను గూర్చి చక్కగా చర్చించాడు. (ఫిలిప్పీయులు 3:14) నేను ఏటీ పూర్తికాల పరిచర్యలో కొనసాగగలిగేలా, మా అక్కలు డోరిస్‌ మరియు గ్రేస్‌ వృద్ధాప్యంలో అమ్మ ఎడల తీసుకున్న ప్రేమపూర్వక శ్రద్ధను బట్టి నేను కృతజ్ఞత కలిగివున్నాను.

ఏటీ నేను తరచూ మా తలిదండ్రుల గురించి, వాళ్లు మమ్మల్ని ఎలా ప్రేమపూర్వకమైన, దృఢమైన పద్ధతిలో పెంచారనేదాని గురించి ఆలోచిస్తుంటాము. వారికి మేమెంతో ఋణపడివున్నాము! ప్రాముఖ్యంగా మా అమ్మ నాకు మా అక్కలకు మంచి మాదిరినుంచి, మాలో యెహోవా ఎడల ఆయన సంస్థ ఎడల మెప్పు పెంపొందేలా చేసింది.

వాస్తవానికి, మన పరలోక తండ్రియైన యెహోవా సేవలో ఒక్కో క్రొత్త రోజు గురించి ఎదురు చూస్తుండగా మా హృదయాలు కృతజ్ఞతతో పొంగిపోతాయి. ఆయనెంతటి అద్భుతమైన, ప్రేమగల దేవుడో కదా! బైబిలు కీర్తనల రచయిత ఇలా వ్రాసినప్పుడు మా భావాలనే వ్యక్తం చేశాడు: “రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము నీ నామమును స్తుతించెదను.”—కీర్తన 145:1, 2.

[26వ పేజీలోని చిత్రం]

నా భార్య ఏటీతో

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి