రాజ్య ప్రచారకుల నివేదిక
దేవుని వాక్యానికున్న శుభ్రపరిచేశక్తి
మాదకద్రవ్యాలకు అలవాటుపడిన అనేకులు పునరావాస కేంద్రాల నుండి వచ్చేసిన తర్వాత, మళ్లీ తమ పూర్వపు అలవాట్లకు లొంగిపోతారని నివేదించబడుతుంది. కానీ, సాధారణంగా ఆ కేంద్రాలు సాధించలేని దానిని దేవుని వాక్యం సాధించగలదు. (హెబ్రీయులు 4:12) మాదకద్రవ్యాల అలవాటును మానుకుని, “దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తిచేసి కొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము” అనే ఉపదేశాన్ని అన్వయించుకునేందుకు దేవుని వాక్యం మరియు దేవుని ఆత్మ అనేకులకు సహాయం చేశాయి.—2 కొరింథీయులు 7:1.
మ్యాన్మార్లోని ఒక అనుభవం దీనిని ఉదహరిస్తోంది. అనేక సంవత్సరాలపాటు మాదకద్రవ్యాల అలవాటుతో పోరాడిన ఒక వ్యక్తి ఇలా చెబుతున్నాడు: “నేను యౌవనంలో ఉండగానే మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డాను. ఆ అలవాటు మానుకోవాలని నేను చాలాసార్లు ప్రయత్నించాను, కానీ సాధ్యం కాలేదు. మాదకద్రవ్యాల కోసం, నేను దొంగతనం చేయడం మొదలుపెట్టాను. ఫలితంగా, 1988లో, నన్ను ఒక సంవత్సరం పాటు జైల్లో వేశారు.
“జైలు నుండి విడుదలైన తర్వాత నేను మళ్లీ నా మునుపటి స్నేహితులతో సహవాసం మొదలెట్టాను. ఆ తర్వాత త్వరలోనే నేను మళ్లీ మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డాను. స్వనాశనానికి దారితీసే ఈ చర్య మూలంగా నా కుటుంబ సభ్యులు నాతో సహవసించడం మానుకున్నారు. అంతేగాక, నా తిరుగుబాటు ధోరణి వల్ల సమాజంలోని అనేకులు నేనంటే భయపడేవారు, వాళ్లు కూడా నన్ను తప్పించుకుని తిరగడం మొదలెట్టారు.
“అప్పుడు ఒకరోజు అనివార్యమైనది జరిగింది—నేను మాదకద్రవ్యాలు ఎక్కువ మోతాదులో తీసేసుకున్నాను. నన్ను మళ్లీ జైలుకు పంపారు, ఈసారి మూడేళ్ల కొరకు. జైల్లో జీవితం ఎంతో కఠినంగా ఉన్నప్పటికీ, నేనెలాగో బ్రతికి బయటపడ్డాను.
“జైలు నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, నా గత పొరబాట్లను క్షమించమని నేను నా కుటుంబ సభ్యులను కోరాను. వాళ్లు నన్ను దయతో తిరిగి స్వీకరించారు, కానీ మళ్లీ ఒకసారి, నేను నా మునుపటి మార్గాలకు మళ్లేలా స్నేహితులు నన్ను ప్రలోభపెట్టారు.
“చివరికి, నేను ఫలానా బైబిలు పాఠశాలకు హాజరవ్వాలని మా నాన్నమ్మ ఒక స్థానిక పాస్టరుకు సిఫారసు చేసింది. పాస్టరు అంగీకరించాడు. అయితే, నేను హాజరుకానారంభించక ముందే, ఒకవేళ నాకు నిజంగా బైబిలు గురించి తెలుసుకోవాలనుంటే నేను సాక్షులతో పఠించాలని యెహోవాసాక్షియైన మా అత్తమ్మ చెప్పింది.
“నేను రాజ్యమందిరానికి వెళ్లాను, అక్కడ నన్ను ఒక వ్యక్తికి పరిచయం చేశారు, ఆయన నాతో బైబిలు పఠించడానికి అంగీకరించాడు. అక్కడున్న చాలామంది నన్ను వాత్సల్యంగా పలకరించి, నేను ఆహ్వానింపబడినట్లు భావించేలా చేశారు.
“నేను బైబిలు పఠించనారంభించి, క్రైస్తవ కూటాలకు హాజరుకావడం మొదలెట్టిన తర్వాత, మాదకద్రవ్యాల కొరకైన తపనకన్నా, దేవునికి సన్నిహితం కావాలనే కోరిక ఎక్కువయ్యింది. ఒక సంవత్సరం తర్వాత, నేను నా జీవితాన్ని యెహోవా దేవునికి సమర్పించుకునేంతగా అభివృద్ధి సాధించాను, నేను నా సమర్పణను నీటి బాప్తిస్మం ద్వారా సూచించాను.
“ఇటీవలనే, ఇంటింటికి వెళుతుండగా, నేను నా మునుపటి మాదకద్రవ్యాల సహవాసులలో ఒకరిని కలిశాను. నాలో వచ్చిన విశేషమైన మార్పులను ఆయన నమ్మలేకపోయాడు. ఇది, సాక్ష్యమిచ్చేందుకు అవకాశాన్నేర్పరచింది, నేను ఆయనతో రాజ్య నిరీక్షణ గురించి మాట్లాడగలిగాను.
“చివరికి నేను జీవితంలోని నిజమైన సంకల్పాన్ని, అర్థాన్ని కనుగొన్నాను. దేవుని సహాయం, ఆయన వాక్య ఉపదేశం మూలంగా నేనిప్పుడు మాదకద్రవ్యాల దురలవాటు నుండి విముక్తి పొందడానికి ఇతరులకు సహాయం చేయగలుగుతున్నాను.”