యెహోవాదినాన్ని ఆశతో అపేక్షించుడి
‘అంత్యదినములలో అపహాసకులు వచ్చెదరు.’—2 పేతురు 3:3.
1. ఒక ఆధునికదిన క్రైస్తవునికి ఏ అత్యవసర భావం ఉంది?
అరవై ఆరుకంటే ఎక్కువ సంవత్సరాలుగా పూర్తికాల సేవలోవున్న ఒక పరిచారకుడు ఇలా వ్రాశాడు: “నేను ఎల్లప్పుడూ అత్యవసర భావంతోనే ఉన్నాను. అర్మగిద్దోను నా ఆలోచనలో ఎల్లప్పుడూ రేపోమాపో వస్తుందన్నట్లుగానే ఉంది. (ప్రకటన 16:14, 16) మా నాన్నగారిలా, ఆయనకు ముందు ఆయన నాన్నగారిలా, ‘యెహోవా దినపు రాకడ కొరకు ఆశతో అపేక్షించమని’ అపొస్తలుడైన [పేతురు] కోరినట్లుగానే నేను నా జీవితాన్ని గడిపాను. వాగ్దానం చేయబడిన నూతన లోకాన్ని నేను ఎల్లప్పుడూ ‘అదృశ్యమైనదే’ అయినప్పటికీ వాస్తవమైనదన్నట్లు దృష్టించాను.”—2 పేతురు 3:11, 12; హెబ్రీయులు 11:1; యెషయా 11:6-9; ప్రకటన 21:3, 4.
2. యెహోవా దినాన్ని ఆశతో అపేక్షించడమంటే ఏమిటి?
2 యెహోవా దినానికి సంబంధించి “ఆశతో అపేక్షించు”మన్న పేతురు మాటలకు, మనం దాన్ని మన మనస్సుల్లో నుండి తీసివేసుకోకూడదని భావం. యెహోవా తాను వాగ్దానం చేసిన నూతన ప్రపంచాన్ని స్థాపించడానికి ఒక ప్రారంభ చర్యగా ఈ విధానాన్ని నాశనం చేసే దినం ఎంతో సమీపంలో ఉందని మనం మరిచిపోకూడదు. అది మనకు ఎంతో సమీపంలో ఉందన్నంత స్పష్టంగా అది మనకు వాస్తవమైనదై ఉండాలి. ప్రాచీన కాలంనాటి దేవుని ప్రవక్తలకు అది అంత వాస్తవమైనదిగా ఉండేది, అది ఎంతో సమీపంగా ఉన్నట్లు తరచూ వాళ్లు దాని గురించి మాట్లాడారు.—యెషయా 13:6; యోవేలు 1:15; 2:1; ఓబద్యా 15; జెఫన్యా 1:7, 14.
3. యెహోవా దినాన్ని గురించి పేతురు ఆ ఉపదేశం ఇవ్వడానికి ఏది పురికొల్పి ఉంటుందని స్పష్టమౌతుంది?
3 సూచనార్థకంగా చెప్పాలంటే, యెహోవా దినం “రేపోమాపో” వస్తుందన్నట్లు మనం దృష్టించాలని పేతురు మనల్ని ఎందుకు కోరాడు? ఎందుకంటే తప్పిదస్థులు శిక్షించబడే, వాగ్దానం చేయబడిన క్రీస్తు ప్రత్యక్షతను గూర్చిన తలంపును కొందరు అపహసించడం ప్రారంభించారని స్పష్టమౌతుంది. (2 పేతురు 3:3, 4) కాబట్టి తన రెండవ పత్రికలోని మూడవ అధ్యాయంలో ఈ అపహాసకుల అపనిందలకు పేతురు సమాధానాలిస్తున్నాడు, దాన్ని మనం ఇప్పుడు పరిశీలిస్తాము.
జ్ఞాపకముంచుకొమ్మని వాత్సల్యపూరితమైన విజ్ఞప్తి
4. మనం ఏమి జ్ఞాపకముంచుకోవాలని పేతురు కోరుతున్నాడు?
4 ఈ అధ్యాయంలో పేతురు తన సహోదరులను పదే పదే “ప్రియులారా” అని సంబోధించడంలో వారి ఎడల ఆయనకున్న ప్రేమ వెల్లడవుతుంది. వారికి ఏమి బోధించబడిందో దాన్ని మరచిపోవద్దని వాత్సల్యపూరితంగా విజ్ఞప్తి చేస్తూ, పేతురు ఇలా ప్రారంభిస్తున్నాడు: “ప్రియులారా, . . . పరిశుద్ధ ప్రవక్తలచేత పూర్వమందు పలుకబడిన మాటలను, ప్రభువైన రక్షకుడు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకముచేసికొనవలెనను విషయమును మీకు జ్ఞాపకముచేసి, నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను.”—2 పేతురు 3:1, 2, 8, 14, 17; యూదా 17.
5. యెహోవా దినం గురించి కొంతమంది ప్రవక్తలు ఏమి చెప్పారు?
5 “పరిశుద్ధ ప్రవక్తలచేత పూర్వమందు పలుకబడిన” ఏ మాటలను జ్ఞాపకముంచుకొమ్మని పేతురు పాఠకులను కోరుతున్నాడు? అవి రాజ్యాధికారములో క్రీస్తు ప్రత్యక్షతను గూర్చిన, దైవభక్తి లేనివారి తీర్పును గూర్చిన మాటలే. పేతురు మునుపు ఈ మాటలవైపు అవధానాన్ని మళ్లించాడు. (2 పేతురు 1:16-19; 2:3-10) దుష్టులపైకి వచ్చే దేవుని ప్రతికూల తీర్పు గురించి హెచ్చరించినట్లు నమోదు చేయబడిన మొట్టమొదటి ప్రవక్తయైన హనోకును యూదా సూచిస్తున్నాడు. (యూదా 14, 15) ఇతర ప్రవక్తలు హనోకును అనుసరించారు, వాళ్లు వ్రాసినదాన్ని మనం మరచిపోకూడదని పేతురు కోరుతున్నాడు.—యెషయా 66:15, 16; జెఫన్యా 1:15-18; జెకర్యా 14:6-9.
6. క్రీస్తు మరియు అపొస్తలులు చెప్పిన ఏవి యెహోవా దినాన్ని గురించిన జ్ఞానాన్ని మనకు ఇస్తాయి?
6 దానికితోడుగా, “ప్రభువైన రక్షకుడు . . . ఇచ్చిన ఆజ్ఞను” గుర్తుంచుకోమని పేతురు తన పాఠకులకు చెబుతున్నాడు. యేసు ఆజ్ఞలో ఈ ప్రబోధనం కూడా ఉంది: “మీ హృదయములు . . . మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.” “జాగ్రత్తపడుడి; మెలకువగానుండి ప్రార్థనచేయుడి; ఆ కాలమెప్పుడు వచ్చునో మీకు తెలియదు.” (లూకా 21:34-36; మార్కు 13:33) అపొస్తలుల మాటలను వినమని కూడా పేతురు మనల్ని కోరుతున్నాడు. ఉదాహరణకు, అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: ‘రాత్రి వేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే యెహోవా దినము వచ్చును. కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము.’—1 థెస్సలొనీకయులు 5:2, 6.
అపహాసకుల కోరికలు
7, 8. (ఎ) దేవుని హెచ్చరికా సందేశాలను అపహసించేవారు ఎలాంటి పురుషులు? (బి) అపహాసకులు ఏమని ఆరోపిస్తారు?
7 మునుపు పేర్కొన్నట్లుగా, పేతురు సలహాకు కారణమేమిటంటే, ఇంకా మునుపటి కాలాల్లోని ఇశ్రాయేలీయులు యెహోవా ప్రవక్తలను వెక్కిరించినట్లుగానే, కొందరు అలాంటి హెచ్చరికలను అపహాస్యం చేయనారంభించారు. (2 దినవృత్తాంతములు 36:16) పేతురిలా వివరిస్తున్నాడు: “అంత్యదినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచు[కుంటారని] మొదట మీరు తెలిసికొనవలెను.” (2 పేతురు 3:3, 4) ఈ అపహాసకుల కోరికలు “భక్తిహీనమైన” వాటి కొరకైనవని యూదా చెబుతున్నాడు. ఆయన వారిని “ఆత్మీయతలేని పశుప్రాయులైన పురుషులు” అని పిలుస్తున్నాడు. (ఇటాలిక్కులు మావి.)—యూదా 17-19, NW.
8 బహుశా ఆత్మీయతలేని ఈ అపహాసకులలో, “మలినమైన దురాశకలిగి శరీరానుసారముగా నడుచు”కొనేవారు అని పేతురు చెప్పిన అబద్ధ బోధకులు చేరివుండవచ్చు. (2 పేతురు 2:1, 9, 10, 14) వారు నమ్మకమైన క్రైస్తవులను అపహాస్యం చేస్తూ ఇలా అడుగుతారు: “ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే?”—2 పేతురు 3:4.
9. (ఎ) దేవుని వాక్యంలో వ్యాపించివున్న అత్యవసర భావాన్ని అపహాసకులు ఎందుకు తక్కువ అంచనా వేయాలని ప్రయత్నిస్తారు? (బి) యెహోవా దినాన్ని ఆశతో అపేక్షించడం మనకు ఎలా భద్రతను చేకూర్చగలదు?
9 ఎందుకీ అపహాస్యం? క్రీస్తు ప్రత్యక్షత ఎన్నడూ సంభవించదనీ, దేవుడు ఎన్నడూ మానవ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని ఎన్నడూ చేసుకోడనీ ఎందుకు సూచించడం? దేవుని వాక్యంలో వ్యాపించివున్న అత్యవసర భావాన్ని తక్కువ అంచనా వేయడం ద్వారా పశుప్రాయులైన ఈ అపహాసకులు ఇతరులను ఆత్మీయ ఉదాసీనతాస్థితిలోకి పడద్రోయడానికి, తద్వారా వారిని స్వార్థపూరిత మోసాల్లో సుళువుగా చిక్కుకునేలా చేయడానికి ప్రయత్నిస్తారు. ఆత్మీయంగా మెలకువ కలిగివుండడానికి మనకది ఎంత శక్తివంతమైన ప్రోత్సాహమో కదా! మనం యెహోవా దినము కొరకు ఆశతో అపేక్షిస్తూ, ఆయన కన్నులు మనమీద ఉన్నాయని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకుందాము! అలా మనం ఆసక్తితో యెహోవా సేవచేయడానికి మన నైతిక స్వచ్ఛతను కాపాడుకోవడానికి పురికొల్పబడతాము.—కీర్తన 11:4; యెషయా 29:15; యెహెజ్కేలు 8:12; 12:27; జెఫన్యా 1:12.
ఉద్దేశపూర్వకమైనవి, నీచమైనవి
10. అపహాసకుల మాటలు తప్పు అని పేతురు ఎలా నిరూపించాడు?
10 అలాంటి అపహాసకులు ఒక ప్రాముఖ్యమైన వాస్తవాన్ని అలక్ష్యం చేస్తారు. వాళ్లు దాన్ని ఉద్దేశపూర్వకంగా అలక్ష్యం చేసి, ఇతరులు దాన్ని మరిచిపోయేలా చేయడానికి ప్రయత్నిస్తారు. ఎందుకు? ఎందుకంటే, అలాగైతే వాళ్లు మరింత సులభంగా వారిని మోసగించగలుగుతారు. ఆ వాస్తవాన్ని “వారు బుద్ధిపూర్వకముగా మరతురు” అని పేతురు వ్రాస్తున్నాడు. ఏ వాస్తవాన్ని? “పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలోనుండియు నీళ్ల వలనను [“మధ్యన,” NW] సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు. ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను.” (ఇటాలిక్కులు మావి.) (2 పేతురు 3:5, 6) అవును, నోవహు కాలంలోని జలప్రళయమప్పుడు యెహోవా భూమిపైనుండి దుష్టత్వాన్ని నిర్మూలించాడు, ఆ వాస్తవాన్ని యేసు కూడా నొక్కిచెప్పాడు. (మత్తయి 24:37-39; లూకా 17:26, 27; 2 పేతురు 2:5) కాబట్టి, అపహాసకులు చెప్పేదానికి భిన్నంగా, అన్ని విషయాలు కచ్చితంగా “సృష్టి ఆరంభముననున్నట్టే” ఏమీ కొనసాగడం లేదు.
11. తొలిక్రైస్తవుల ఏ అకాల అపేక్షలు కొంతమంది వారిని అపహసించేలా చేశాయి?
11 అపహాసకులు నమ్మకమైన క్రైస్తవులను అపహసించి ఉండవచ్చు, ఎందుకంటే వారు అపేక్షించినవి అప్పటికింకా నెరవేరకపోయి వుండవచ్చు. యేసు మరణించడానికి కొంతకాలం ముందు, ఆయన శిష్యులు “దేవుని రాజ్యము వెంటనే అగుపడునని” అనుకున్నారు. కాబట్టి, ఆయన పునరుత్థానం తర్వాత రాజ్యం వెంటనే స్థాపించబడుతుందా లేదా అని వారడిగారు. అంతేగాక, పేతురు తన రెండవ పత్రికను వ్రాయడానికి దాదాపు పది సంవత్సరాలు ముందు, కొంతమంది బహుశా అపొస్తలుడైన పౌలు నుండి లేక ఆయన సహచరుల నుండి వచ్చిన “మాట” వలన లేక “పత్రిక” వలన ‘యెహోవాదినమిప్పుడే వచ్చియున్నట్టుగా ఉత్తేజితులయ్యారు.’ (లూకా 19:11; 2 థెస్సలొనీకయులు 2:2; అపొస్తలుల కార్యములు 1:6) అయితే, యేసు అపొస్తలుల అలాంటి అపేక్షలు అబద్ధమైనవి కాదుగానీ కేవలం అకాలమైనవే. యెహోవా దినం తప్పక వస్తుంది!
దేవుని వాక్యం ఆధారపడదగినది
12. ‘యెహోవా దినమును’ గూర్చిన ప్రవచనాల విషయంలో దేవుని వాక్యం ఎలా ఆధారపడదగినదిగా నిరూపించబడింది?
12 మునుపు పేర్కొన్నట్లుగా, యెహోవా ఉగ్రత దినము సమీపంలో ఉందని క్రైస్తవపూర్వ ప్రవక్తలు తరచూ హెచ్చరించారు. యెహోవా తన దుష్టప్రజలపై ఉగ్రతను కుమ్మరించినప్పుడు సా.శ.పూ. 607లో ‘యెహోవా దినము’ స్వల్ప పరిమాణంలో వచ్చింది. (జెఫన్యా 1:14-18) తర్వాత, బబులోను ఐగుప్తులతో సహా ఇతర దేశాలు అదే రీతిలో ‘యెహోవా దినమును’ ఎదుర్కొన్నాయి. (యెషయా 13:6-9; యిర్మీయా 46:1-10; ఓబద్యా 15) మొదటి శతాబ్దపు యూదా విధానాంతము కూడా ప్రవచింపబడింది, రోమా సైన్యాలు సా.శ. 70లో యూదయను నాశనం చేసినప్పుడు అది సంభవించింది. (లూకా 19:41-44; 1 పేతురు 4:7) కాని పేతురు ఒక భవిష్యద్ ‘యెహోవా దినమును’ సూచిస్తున్నాడు, అది పరిమాణం విషయంలో విశ్వవ్యాప్త జలప్రళయాన్ని కూడా చిన్నదనిపించేట్లు చేస్తుంది!
13. ఈ విధానాంతం యొక్క కచ్చితత్వాన్ని ఏ చారిత్రక ఉదాహరణ తెలియజేస్తుంది?
13 “అదే వాక్యమువలన” అని చెబుతూ పేతురు, ఆ రాబోయే నాశనాన్ని గూర్చిన తన వివరణను పరిచయం చేస్తున్నాడు. జలప్రళయానికి మునుపటి భూమి “దేవుని వాక్యమువలన,” “నీళ్లలోనుండి” వేరుపర్చబడి, “నీళ్ల వలన [“మధ్యన,” NW]” ఉందని ఆయనిప్పుడే చెప్పాడు. బైబిలునందలి సృష్టి వృత్తాంతంలో వర్ణించబడిన ఈ స్థితివలన, దేవుని నడిపింపు ప్రకారం లేక మాట ప్రకారం నీళ్లు కుమ్మరింపబడినప్పుడు జలప్రళయం సాధ్యమయ్యింది. పేతురిలా కొనసాగిస్తున్నాడు: “ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, [దేవుని] అదే వాక్యమువలన భద్రముచేయబడియున్నవి.” (2 పేతురు 3:5-7; ఆదికాండము 1:6-8) దాని కొరకు మనకు యెహోవా యొక్క ఆధారపడదగిన వాక్యం ఉంది! ఆయన తన మహా దినపు తీవ్రమైన ఉగ్రతతో “ఆకాశమును భూమి”ని అంటే ఈ విధానాన్ని అంతం చేస్తాడు! (జెఫన్యా 3:8) కాని ఎప్పుడు?
అంతం రావాలనే ఆతురత
14. మనం ఇప్పుడు “అంత్యదినములలో” జీవిస్తున్నామని ఎందుకు నిశ్చయత కలిగివుండవచ్చు?
14 అంతము ఎప్పుడు వస్తుందో యేసు శిష్యులు తెలుసుకోవాలనుకున్నారు, అందుకే వారు ఆయననిలా అడిగారు: “నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి?” యూదా విధానం ఎప్పుడు అంతమౌతుందని వారడుగుతున్నారని స్పష్టమౌతుంది, కాని ప్రస్తుత ‘ఆకాశము మరియు భూమి’ ఎప్పుడు నాశనాన్ని ఎదుర్కొంటాయనేదానిపై యేసు సమాధానం ప్రాధమికంగా కేంద్రీకరింపబడింది. గొప్ప యుద్ధాలు, ఆహార కొరతలు, భూకంపాలు, వ్యాధి, నేరం వంటి వాటిని యేసు ప్రవచించాడు. (మత్తయి 24:3-14; లూకా 21:5-36) “యుగసమాప్తి” కొరకు యేసు ఇచ్చిన సూచన, అలాగే “అంత్యదినముల”ను గుర్తిస్తాయని అపొస్తలుడైన పౌలు చెప్పిన విషయాలు 1914వ సంవత్సరం నుండి నెరవేరడం మనం చూస్తున్నాము. (2 తిమోతి 3:1-5) నిజంగా, మనం ఈ విధానాంత సమయంలో జీవిస్తున్నామన్నదానికి నిదర్శనం ప్రబలంగా ఉంది!
15. యేసు హెచ్చరించినప్పటికీ క్రైస్తవులు ఏమి చేయడానికి మొగ్గుచూపారు?
15 యెహోవా దినము ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలని యెహోవాసాక్షులు ఆతురత కల్గివున్నారు. వారు ఆ ఆతురతతో, అదెప్పుడు వస్తుందో అంచనా వేయడానికి ప్రయత్నాలు చేశారు. కాని అలా చేయడం ద్వారా, “ఆ కాలమెప్పుడు వచ్చునో [మనకు] తెలియదు” అని తమ ప్రభువు చేసిన హెచ్చరికను వినడంలో వాళ్లు యేసు తొలి శిష్యుల్లానే విఫలమయ్యారు. (మార్కు 13:32, 33) అపహాసకులు నమ్మకమైన క్రైస్తవులను వారి అకాల అపేక్షలను బట్టి అపహసించారు. (2 పేతురు 3:3, 4) అయినప్పటికీ, యెహోవా కాలపట్టిక అనుసారంగా ఆయన దినం తప్పక వస్తుందని పేతురు నొక్కి చెబుతున్నాడు.
యెహోవా దృక్కోణాన్ని కలిగివుండవలసిన అవసరత
16. మనం ఏ ఉపదేశాన్ని జ్ఞానయుక్తంగా లక్ష్యపెడతాము?
16 ‘ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా యెహోవా దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి’ అని పేతురిప్పుడు మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా, మనం కాలం విషయంలో యెహోవా దృక్కోణాన్ని కలిగివుండవలసిన అవసరత ఉంది. 70 లేక 80 సంవత్సరాల మన జీవితాయుష్షు దానితో పోలిస్తే ఎంత అల్పమైనదో కదా! (2 పేతురు 3:8; కీర్తన 90:4, 10) కాబట్టి దేవుని వాగ్దానాల నెరవేర్పు ఆలస్యమౌతున్నట్లు అనిపిస్తే, మనం దేవుని ప్రవక్త ఇచ్చిన ఈ సలహాను అంగీకరించవలసిన అవసరం ఉంది: “[నియమిత కాలం] ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. జాగుచేయక వచ్చును.” (ఇటాలిక్కులు మావి.)—హబక్కూకు 2:3.
17. అంత్యదినాలు అనేకులు అపేక్షించినదానికన్నా ఎక్కువకాలం ఉన్నాయి గనుక, మనం దేని గురించి నిశ్చయత కలిగివుండవచ్చు?
17 ఈ విధానం యొక్క అంత్యదినాలు అనేకులు అపేక్షించిన దానికన్నా ఎక్కువకాలం ఎందుకు కొనసాగుతున్నాయి? దానికొక మంచి కారణం ఉంది, పేతురు తర్వాత దాన్నిలా వర్ణిస్తున్నాడు: ‘కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు యెహోవా తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు.’ (2 పేతురు 3:9) మానవజాతికంతటికీ ఏది శ్రేష్ఠమో యెహోవా దాన్ని పరిగణనలోకి తీసుకుంటాడు. “దుర్మార్గుడు మరణము నొందుటవలన నాకు సంతోషము లేదు; దుర్మార్గుడు తన దుర్మార్గతనుండి మరలి బ్రదుకుటవలన నాకు సంతోషము కలుగును” అని ఆయన చెబుతున్నట్లుగా, ప్రజల జీవితాల గురించి ఆయన శ్రద్ధ కల్గివున్నాడు. (యెహెజ్కేలు 33:11) కాబట్టి సంపూర్ణ జ్ఞానవంతుడైన, ప్రేమగల మన సృష్టికర్త సంకల్పం నెరవేర్చడానికి సరిగ్గా తగిన సమయంలో అంతం వస్తుందని మనం నిశ్చయత కల్గివుండవచ్చు!
ఏవి గతించిపోతాయి?
18, 19. (ఎ) ఈ విధానాన్ని నాశనం చేయాలని యెహోవా ఎందుకు నిశ్చయించుకున్నాడు? (బి) ఈ విధానాంతాన్ని పేతురు ఎలా వర్ణిస్తున్నాడు, వాస్తవంగా ఏవి నాశనం చేయబడుతాయి?
18 తన సేవ చేసేవారిని యెహోవా నిజంగా ప్రేమిస్తాడు గనుక, వారికి వేదన కలిగించే వారినందరినీ ఆయన నిర్మూలిస్తాడు. (కీర్తన 37:9-11, 29) ఈ నాశనం అనుకోని సమయంలో వస్తుందని మునుపు పౌలు పేర్కొన్నట్లుగానే పేర్కొంటూ, పేతురిలా వ్రాస్తున్నాడు: ‘యెహోవా దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.’ (2 పేతురు 3:10; 1 థెస్సలొనీకయులు 5:2) జలప్రళయంలో అక్షరార్థ ఆకాశములు, భూమీ నాశనమైపోలేదు, యెహోవా దినంలో కూడా అవి నాశనమైపోవు. అయితే మరి ఏవి ‘గతించిపోతాయి’ లేక నాశనం చేయబడతాయి?
19 “ఆకాశముల” వలె మానవజాతిపై ఆధిపత్యం వహిస్తున్న మానవ ప్రభుత్వాలు అంతమౌతాయి, అలాగే “భూమి” అంటే దైవభక్తిలేని మానవ సమాజం నాశనమౌతుంది. “మహా ధ్వని” బహుశా ఆకాశములు త్వరితంగా గతించిపోవడాన్ని సూచిస్తుండవచ్చు. ఈనాటి పతనావస్థకు చేరిన మానవసమాజాన్ని రూపొందించే “పంచభూతములు” ‘లయం చేయబడతాయి’ లేక నాశనం చేయబడతాయి. మరియు “భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును, [“బయల్పర్చబడును,” NW].” యెహోవా యావత్ ప్రపంచ విధానానికి తగిన నాశనాన్ని తీసుకుని వస్తూ, మానవుల దుష్ట కార్యాలను సంపూర్ణంగా బహిర్గతం చేస్తాడు.
మీ నిరీక్షణపై దృష్టి నిల్పండి
20. జరుగనైయున్న సంఘటనలను గూర్చిన మన జ్ఞానం మన జీవితాలను ఎలా ప్రభావితం చేయాలి?
20 ఈ నాటకీయ సంఘటనలు త్వరలోనే జరుగనై ఉన్నాయి గనుక, మనం ‘యెహోవా దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారమై’ ఉండాలని పేతురు చెబుతున్నాడు. దాని గురించి ఏవిధమైన సందేహమూ లేదు! ‘ఆకాశములు రవులుకొని లయమైపోవును, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవును.’ (2 పేతురు 3:11, 12) ఈ నాటకీయ సంఘటనలు రేపు ప్రారంభం కాగలవన్న వాస్తవం, మనం చేసే లేక చేయాలని పథకం వేసుకునే ప్రతీదాన్నీ ప్రభావితం చేయాలి.
21. ప్రస్తుత ఆకాశములు మరియు భూమి స్థానంలో ఏమి ఉంటాయి?
21 పాత విధానం స్థానంలోకి ఏమి వస్తుందో పేతురు మనకిప్పుడు, ఇలా చెబుతున్నాడు: “అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.” (2 పేతురు 3:13; యెషయా 65:17) ఆహా, ఎంతటి ఉపశమనం! “క్రొత్త” ప్రభుత్వ “ఆకాశములు” క్రీస్తు మరియు ఆయన 1,44,000 మంది సహపరిపాలకులతో రూపొందించబడుతాయి, ఈ ప్రపంచ అంతాన్ని తప్పించుకునే ప్రజలతో “క్రొత్త భూమి” రూపొందించబడుతుంది.—1 యోహాను 2:17; ప్రకటన 5:9, 10; 14:1, 3.
అత్యవసరతను, నైతిక స్వచ్ఛతను కాపాడుకోండి
22. (ఎ) ఏ ఆత్మీయ కళంకాన్నైనా లేక మచ్చనైనా నివారించేందుకు మనకు ఏది సహాయం చేస్తుంది? (బి) పేతురు ఏ ప్రమాదం గురించి హెచ్చరిస్తున్నాడు?
22 పేతురిలా కొనసాగిస్తున్నాడు: “ప్రియులారా, వీటికొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతముగలవారై, ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి.” ఆతురతతో ఎదురు చూడడం మరియు యెహోవా దినం ఆలస్యమౌతున్నట్లు అనిపిస్తే దాన్ని దైవిక సహనంగా దృష్టించడం ఏ ఆత్మీయ కళంకాన్నైనా లేక మచ్చనైనా నివారించడానికి మనకు సహాయం చేస్తుంది. అయినప్పటికీ, ప్రమాదం పొంచి ఉంది! “మన ప్రియ సహోదరుడైన పౌలు [వ్రాసిన] వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు.”—2 పేతురు 3:14-16.
23. పేతురు ముగింపు ఉపదేశమేమిటి?
23 దేవుని కృపాబాహుళ్యాన్ని గూర్చిన పౌలు వ్రాతలను అబద్ధబోధకులు చెడు ప్రవర్తనకు సాకుగా ఉపయోగిస్తూ వాటిని వక్రీకరించారని స్పష్టమౌతుంది. పేతురు తన వీడ్కోలు ఉపదేశాన్ని వ్రాస్తున్నప్పుడు బహుశా ఆయన మనస్సులో అది ఉండవచ్చు: “ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతివిరోధుల తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచుకొనియుండుడి.” ఆ తర్వాత ఆయనిలా కోరుతూ తన పత్రికను ముగిస్తున్నాడు: “మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధిపొందుడి.”—2 పేతురు 3:17, 18.
24. యెహోవా సేవకులందరూ ఏ దృక్పథాన్ని హత్తుకోవాలి?
24 పేతురు తన సహోదరులను బలపర్చాలని కోరుకున్నాడని స్పష్టమౌతుంది. “‘యెహోవా దినపు రాకడ కొరకు ఆశతో అపేక్షించమని’ అపొస్తలుడు [పేతురు] కోరినట్లుగానే నేను నా జీవితాన్ని గడిపాను. వాగ్దానం చేయబడిన నూతన లోకాన్ని నేను ఎల్లప్పుడూ ‘అదృశ్యమైనదే’ అయినప్పటికీ వాస్తవమైనదన్నట్లు దృష్టించాను” అని చెప్పిన 82 ఏళ్ల నమ్మకమైన సాక్షి వ్యక్తపర్చిన దృక్పథాన్నే అందరూ కలిగివుండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనమందరం మన జీవితాన్ని అలాగే గడుపుదాము.
మీరెలా ప్రతిస్పందిస్తారు?
◻ యెహోవా దినాన్ని ‘ఆశతో అపేక్షించడం’ అంటే ఏమిటి?
◻ అపహాసకులు దేన్ని ఉద్దేశపూర్వకంగా అలక్ష్యం చేస్తారు, ఎందుకు?
◻ అపహాసకులు నమ్మకమైన క్రైస్తవులను ఏ కారణాన్నిబట్టి అపహసించారు?
◻ మనం ఏ దృక్కోణాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉంది?
[23వ పేజీలోని చిత్రం]
యెహోవా దినాన్ని . . .
[24వ పేజీలోని చిత్రం]
. . . మరియు రానైయున్న నూతన లోకాన్ని ఆశతో అపేక్షించుడి