అబద్ధ బోధకులున్నారు జాగ్రత్త!
“మీలోను అబద్ధబోధకులుందురు.”—2 పేతురు 2:1.
1. యూదా దేని గురించి వ్రాయాలనుకున్నాడు, ఆయన తన అంశాన్ని ఎందుకు మార్చుకున్నాడు?
ఎంత భయంకరమైన విషయం! మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘంలో అబద్ధబోధకులా! (మత్తయి 7:15; అపొస్తలుల కార్యములు 20:29, 30) యేసు సహోదరుడైన యూదాకు ఈ పరిణామం తెలుసు. “మనకందరికి కలిగెడు రక్షణనుగూర్చి” తోటి విశ్వాసులకు వ్రాయాలనే ఉద్దేశం తనకు ఉందని ఆయన అన్నాడు. కానీ “బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసివచ్చెను” అని ఆయన వివరించాడు. యూదా ఎందుకు తన విషయాంశాన్ని మార్చాడు? ఎందుకంటే, “కొందరు [సంఘాల్లోకి] రహస్యముగా జొరబడి . . . మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు[న్నారు].”—యూదా 3, 4.
2. రెండవ పేతురు మరియు యూదా ఎందుకంతగా ఒకేలా ఉన్నాయి?
2 పేతురు తన రెండవ పత్రికను వ్రాసిన కొంతకాలానికే యూదా తన పత్రికను వ్రాశాడని స్పష్టమౌతుంది. యూదాకు ఈ పత్రిక గురించి నిస్సందేహంగా తెలుసు. కచ్చితంగా ప్రబోధనాత్మకమైన, శక్తివంతమైన తన పత్రికలో ఆయన అనేక పోల్చదగిన తలంపులను వ్యక్తపర్చాడు. కాబట్టి మనం పేతురు వ్రాసిన రెండవ పత్రికలోని రెండవ అధ్యాయాన్ని పరిశీలిస్తుండగా, అది యూదా వ్రాసిన పత్రికతో ఎంత సారూప్యత కల్గివుందో మనం గమనిద్దాము.
అబద్ధ బోధల పరిణామాలు
3. గతంలో సంభవించిన ఏది మళ్లీ సంభవిస్తుందని పేతురు చెబుతున్నాడు?
3 ప్రవచనానికి అవధానాన్నివ్వమని పేతురు తన సహోదరులను గట్టిగా కోరిన తర్వాత, ఆయనిలా చెబుతున్నాడు: “[ప్రాచీన ఇశ్రాయేలులో] అబద్ధ ప్రవక్తలు ఉండిరి. అటువలెనే మీలోను అబద్ధబోధకులుందురు.” (2 పేతురు 1:14–2:1) ప్రాచీన కాలాల్లోని దేవుని ప్రజలు నిజమైన ప్రవచనాన్ని పొందారు, కాని వాళ్లు అబద్ధ ప్రవక్తల కలుషిత బోధలను కూడా ఎదుర్కోవలసి వచ్చింది. (యిర్మీయా 6:13, 14; 28:1-3, 15) “యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని, వారు వ్యభిచారులు అసత్య వర్తనులు” అని యిర్మీయా వ్రాశాడు.—యిర్మీయా 23:14.
4. అబద్ధ బోధకులు ఎందుకు నాశనానికి అర్హులు?
4 క్రైస్తవ సంఘంలో అబద్ధ బోధకులు ఏమి చేస్తారో వివరిస్తూ, పేతురు ఇలా చెబుతున్నాడు: “వీరు తమ్మును కొనిన ప్రభువును [యేసుక్రీస్తును] కూడ విసర్జించుచు, తమకుతామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు.” (2 పేతురు 2:1; యూదా 4) అలాంటి మొదటి శతాబ్దపు మతవిభేదం యొక్క తుది ఫలితం నేడు మనం ఎరిగివున్న క్రైస్తవమత సామ్రాజ్యమే. అబద్ధ బోధకులు ఎందుకు నాశనానికి పూర్తిగా అర్హులో పేతురు ఇలా చూపిస్తున్నాడు: “అనేకులు వారి పోకిరిచేష్టలను అనుసరించి నడుతురు; వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును.”—2 పేతురు 2:2.
5. అబద్ధ బోధకులు దేనికి బాధ్యులు?
5 ఆలోచించండి! అబద్ధ బోధకుల ప్రభావం మూలంగా సంఘాల్లోని అనేకులు చెడు ప్రవర్తనలో నిమగ్నం కావచ్చు. “పోకిరి” అని అనువదించబడిన గ్రీకు పదం నీతిబాహ్యతను, అదుపులేనితనాన్ని, అసభ్యతను, అశ్లీలతను, సిగ్గులేని ప్రవర్తనను సూచిస్తుంది. క్రైస్తవులు “దురాశను అనుసరించుటవలన లోకమందున్న భ్రష్టత్వమును . . . తప్పించు”కున్నారని పేతురు మునుపు చెప్పాడు. (2 పేతురు 1:4) కాని కొందరు ఆ భ్రష్టత్వానికి తిరిగి వెళ్లబోతున్నారు, సంఘాల్లోని అబద్ధ బోధకులే దానికి ఎక్కువగా బాధ్యులై ఉంటారు! అలా సత్యమార్గం అపకీర్తి పాలవుతుంది. ఎంత దుఃఖకరం! కచ్చితంగా ఇది, యెహోవాసాక్షులందరూ ఈనాడు ఎంతో శ్రద్ధనివ్వవలసిన విషయం. మన ప్రవర్తన ఆధారంగా మనం యెహోవా దేవునికీ ఆయన ప్రజలకూ ఘనతనుగానీ లేక అవమానాన్ని గానీ తీసుకురాగలమని మనం ఎన్నడూ మరచిపోకూడదు.—సామెతలు 27:11; రోమీయులు 2:24.
అబద్ధ బోధలను ప్రవేశపెట్టడం
6. అబద్ధ బోధకులను ఏది పురికొల్పుతుంది, వారు తమకు కావలసినది సంపాదించుకోవడానికి ఎలా ప్రయత్నిస్తారు?
6 అబద్ధ బోధకులు తమ కలుషిత ఆలోచనావిధానాన్ని ఎలా ప్రవేశపెడతారనేది పరిశీలించడం జ్ఞానయుక్తమైనది. వాళ్లు దాన్ని రహస్యంగా, లేక మరుగైన రీతిలో, మోసకరంగా చేస్తారని పేతురు మొదట చెబుతున్నాడు. తర్వాత ఆయనింకా ఇలా చెబుతున్నాడు: “అధిక లోభులై, కల్పనావాక్యములు చెప్పుచు, మీవలన లాభము సంపాదించుకొందురు.” అబద్ధ బోధకులను స్వార్థపూరిత కోరిక పురికొల్పుతుంది, ది జెరూసలెమ్ బైబిల్ దాన్నీవిధంగా నొక్కి చెబుతుంది: “కపట ప్రసంగాల ద్వారా వారు మిమ్మల్ని తమకొరకు కొనడానికి ఆత్రంగా ప్రయత్నిస్తారు.” అదే విధంగా, జేమ్స్ మొఫెట్ అనువాదము ఇక్కడిలా చెబుతుంది: “వాళ్లు తమ కామాతురతయందు కపట వాదనలతో మిమ్మల్ని వంచిస్తారు.” (2 పేతురు 2:1, 3) ఆత్మీయంగా జాగరూకత కలిగిలేని వ్యక్తికి అబద్ధ బోధకుల మాటలు హేతుబద్ధమైనవిగానే అనిపించవచ్చు, కానీ వారి మాటలు, మోసగాళ్ల స్వార్థపూరిత ఉద్దేశాలను నెరవేర్చేలా ప్రజలను ప్రలోభపెడుతూ వారిని “కొనడానికి” జాగ్రత్తగా రూపొందించబడ్డాయి.
7. మొదటి శతాబ్దంలో ఏ తత్వం ప్రాచూర్యం పొందింది?
7 మొదటి శతాబ్దపు అబద్ధ బోధకులు ఆనాటి లోక ఆలోచనా విధానంచే ప్రభావితమయ్యారనడంలో సందేహం లేదు. పేతురు వ్రాసే కాలానికి, ఆత్మజ్ఞానవాదమనే తత్వం ప్రసిద్ధమౌతోంది. భౌతిక పదార్థమంతా చెడేనని, ఆత్మకు సంబంధించినది మాత్రమే మంచి అనీ ఆత్మజ్ఞానవాదులు నమ్మేవారు. కాబట్టి, ఒక వ్యక్తి తన భౌతిక శరీరంతో ఏమి చేసినా పరవాలేదని వారిలో కొందరు చెప్పేవారు. చివరికి మానవునికి ఈ శరీరం ఉండదని వాళ్లు వాదించేవారు. కాబట్టి, లైంగికపరమైన పాపాలతో సహా శారీరక పాపాలు ప్రాముఖ్యమైనవి కావనే ముగింపుకు వాళ్లు వచ్చారు. క్రైస్తవులమని చెప్పుకునే కొంతమందిని ఆ దృక్పథాలు ప్రభావితం చేయడం ప్రారంభించాయని స్పష్టమౌతుంది.
8, 9. (ఎ) కొంతమంది తొలి క్రైస్తవులను ఏ వంకర తర్కం ప్రభావితం చేసింది? (బి) యూదా ప్రకారం, సంఘాల్లోని కొందరు ఏమి చేస్తుండిరి?
8 “కృపామహదైశ్వర్యము” లేదా “కృప అనే సిద్ధాంతాన్ని తప్పుదోవపట్టించినవారు చర్చిలో ఉండేవారని” ఒక బైబిలు పండితుడు పేర్కొన్నాడు. (ఎఫెసీయులు 1:5-7) ఆయన చెప్పినదాని ప్రకారం, కొంతమంది వాదన ఇలా సాగింది: “దేవుని [కృపామహదైశ్వర్యము] ప్రతి పాపాన్నీ కప్పేంత విస్తారమైనదని మీరంటారా? . . . అలాగైతే మనం పాపం చేస్తూనే ఉందాము, ఎందుకంటే దేవుని [కృపామహదైశ్వర్యము] ప్రతి పాపాన్ని తుడిచివేయగలదు. వాస్తవానికి మనమెంతగా పాపం చేస్తే, దేవుని [కృపామహదైశ్వర్యము] పనిచేయడానికి అంత ఎక్కువ అవకాశాలు లభిస్తాయి.” అంతకంటే వక్రమైన తర్కాన్ని మీరెప్పుడైనా విన్నారా?
9 “కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా?” అని ప్రశ్నించడం ద్వారా అపొస్తలుడైన పౌలు దేవుని దయను గూర్చిన తప్పుడు ఆలోచనా విధానాన్ని వ్యతిరేకించాడు. ఆయనింకా ఇలా అడిగాడు: “కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగువారము కామని పాపము చేయుదుమా?” ప్రతీ ప్రశ్నకు పౌలు దృఢంగా ఇలా సమాధానమిచ్చాడు: “అదెన్నటికిని కూడదు.” (రోమీయులు 6:1, 2, 15) యూదా చెబుతున్నట్లుగా, కొంతమంది “దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ”పరుస్తున్నారని స్పష్టమౌతుంది. అయితే, అలాంటివారికి ‘నాశనము కునికి నిద్రపోదు’ అని పేతురు పేర్కొంటున్నాడు.—యూదా 4; 2 పేతురు 2:3.
హెచ్చరికా ఉదాహరణలు
10, 11. పేతురు ఏ మూడు హెచ్చరికా ఉదాహరణలను అందజేస్తున్నాడు?
10 ఉద్ధేశపూర్వకంగా తప్పు చేసేవారి ఎడల దేవుడు చర్య తీసుకుంటాడని నొక్కి చెప్పడానికి పేతురు లేఖనాల నుండి మూడు హెచ్చరికా ఉదాహరణలను ఇస్తున్నాడు. మొదట, ఆయనిలా వ్రాస్తున్నాడు: “దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్ట”లేదు. వీరు “తమ ప్రధానత్వమును నిలుపుకొనక,” పరలోకములోని “తమ నివాసస్థలమును విడిచి”పెట్టారని యూదా చెబుతున్నాడు. వారు జలప్రళయానికి ముందు భూమి మీదికి వచ్చి, మానవ కుమార్తెలతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడానికి భౌతిక శరీరాలను దాల్చారు. అసమంజసమైన, అసహజమైన వారి ప్రవర్తనకు శిక్షగా వారు “బిలము”లోకి పడద్రోయబడ్డారు లేక యూదా వృత్తాంతం చెబుతున్నట్లుగా, వారు “మహాదినమున జరుగు తీర్పువరకు కటికచీకటిలో నిత్యపాశములతో . . . బంధించి భద్రము” చేయబడ్డారు.—2 పేతురు 2:4; యూదా 6; ఆదికాండము 6:1-3.
11 తర్వాత, పేతురు నోవహు కాలంనాటి ప్రజల గురించి ప్రస్తావిస్తున్నాడు. (ఆదికాండము 7:17-24) నోవహు కాలములో “భక్తిహీనుల సమూహముమీదికి జలప్రళయమును రప్పించినప్పుడు,” దేవుడు “పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్ట”లేదని ఆయన చెబుతున్నాడు. చివరికి, “సొదొమ గొమొఱ్ఱాలను పట్టణములను భస్మము” చేయడం ద్వారా దేవుడు “ముందుకు భక్తిహీనులగువారికి వాటిని దృష్టాంతముగా” ఉంచాడని పేతురు వ్రాస్తున్నాడు. ఆ వ్యక్తులు “వీరివలెనే వ్యభిచారము చేయుచు, పరశరీరానుసారు”లయ్యారని యూదా అదనపు సమాచారాన్ని ఇస్తున్నాడు. (2 పేతురు 2:5, 6; యూదా 7) పురుషులు స్త్రీలతో దుర్నీతికరమైన లైంగిక సంబంధాలను కలిగివుండడమే కాదు గానీ ఇతర పురుషుల శరీరాలను మరియు బహుశా క్రూర జంతువుల శరీరాలను కూడా వాంఛించివుండవచ్చు.—ఆదికాండము 19:4, 5; లేవీయకాండము 18:22-25.
12. పేతురు ప్రకారం, నీతియుక్తమైన ప్రవర్తనకు ఎలా ప్రతిఫలం లభిస్తుంది?
12 అయినప్పటికీ, అదే సమయంలో, యెహోవా నమ్మకంగా తన సేవ చేసేవారికి ప్రతిఫలమిస్తాడని పేతురు పేర్కొంటున్నాడు. ఉదాహరణకు, దేవుడు జలప్రళయాన్ని రప్పించినప్పుడు, ‘నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని ఎలా కాపాడాడో’ ఆయన వివరిస్తున్నాడు. సొదొమ కాలంలో, యెహోవా “నీతిమంతుడైన లోతు”ను విడిపించడం గురించి కూడా చెబుతూ, ఆయన ఇలా ముగిస్తున్నాడు: “భక్తులను శోధనలోనుండి తప్పించుటకును, దుర్ణీతిపరులను . . . తీర్పుదినమువరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు [“యెహోవా,” NW] సమర్థుడు.”—2 పేతురు 2:5, 7-9.
శిక్షార్హమైన క్రియలు
13. ప్రాముఖ్యంగా ఎవరు తీర్పు కొరకు ఉంచబడ్డారు, వారు ఏ కలల్లో నిమగ్నమై ఉన్నారని స్పష్టమౌతుంది?
13 పేతురు ప్రాముఖ్యంగా దేవుని తీర్పు కొరకు నిర్ణయించబడినవారిని ప్రత్యేకపరుస్తూ, వారు “శరీరానుసారముగా నడుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు” ఉంటారని చెబుతున్నాడు. “వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప వెరవకయున్నారు” అని పేతురు చెబుతుండగా మనం ఆయన ఆగ్రహాన్ని ఇంచుమించు అవగతం చేసుకోవచ్చు. “వీరు . . . కలలు కనుచు, శరీరమును అపవిత్రపరచుకొనుచు, . . . మహాత్ములను దూషించుచు ఉన్నారు” అని యూదా వ్రాస్తున్నాడు. (2 పేతురు 2:9; యూదా 8) దుర్నీతికరమైన లైంగికానందాన్ని పొందాలనే వారి ప్రయత్నాన్ని ప్రోత్సహించే అశుద్ధ లైంగిక భావనలు కూడా వారి కలల్లో చేరివుండవచ్చు. అయితే, వారు ఏ భావంలో “ప్రభుత్వమును నిరాకరించుచు,” ‘మహాత్ములను దూషించుచు’ ఉంటారు?
14. అబద్ధ బోధకులు ఏ భావంలో ‘ప్రభుత్వమును నిరాకరిస్తారు,’ మరియు ‘మహాత్ములను దూషిస్తారు?’
14 దైవికంగా నియమింపబడిన అధికారాన్ని తృణీకరించడం ద్వారా వారలా చేస్తారు. క్రైస్తవ పెద్దలు మహిమగల యెహోవా దేవునికి, ఆయన కుమారునికి ప్రాతినిధ్యం వహిస్తారు, అందువల్ల, వారికీ కొంత మహిమ ప్రదానం చేయబడుతుంది. నిజమే, వాళ్లు పొరబాట్లు చేస్తారు, పేతురు కూడా పొరబాట్లు చేశాడు, కాని అలాంటి మహిమగల వారికి లోబడివుండమని లేఖనాలు సంఘ సభ్యులను కోరుతున్నాయి. (హెబ్రీయులు 13:17) వారి బలహీనతలు వారి గురించి చెడుగా మాట్లాడడానికి ఎంతమాత్రం కారణం కారాదు. అబద్ధ బోధకులు దూషణార్హులైననూ దేవదూతలు, “[అబద్ధ బోధకులను] దూషించి వారిమీద నేరము మోపవెరతురు” అని పేతురు చెబుతున్నాడు. “వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావసిద్ధముగా పుట్టిన వివేకశూన్యములగు మృగములవలె ఉండి, తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు, తమ దుష్‌ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు, తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు” అని పేతురు కొనసాగిస్తున్నాడు.—2 పేతురు 2:10-13.
“మీతోకూడ అన్నపానములు పుచ్చుకొనుచు”
15. అబద్ధ బోధకుల విధానాలు ఏవి, వారు తమ మోసాలను ఎక్కడ ప్రయత్నిస్తారు?
15 ఈ భ్రష్ట మనుష్యులు “ఒకనాటి సుఖానుభవము సంతోషమని యెంచు”కొంటూ, “కళంకములును నిందాస్పదములునై” ఉండడమేగాక, వాళ్లు మోసగాళ్లు కూడా. పేతురు మునుపు పేర్కొన్నట్లుగా, వాళ్లు “కల్పనావాక్యములు” ఉపయోగిస్తూ “రహస్యముగా” ప్రవర్తిస్తారు. (2 పేతురు 2:1, 3, 13) దేవుని నైతిక ప్రమాణాలను ఉన్నతపర్చాలనే పెద్దల ప్రయత్నాలను వారు స్పష్టంగా సవాలు చేయకపోవచ్చు లేక వారు తమ స్వంత లైంగికానందాన్ని బహిరంగంగా అనుభవించ ప్రయత్నించకపోవచ్చు. బదులుగా, వారు “ప్రేమవిందులలో మీతోకూడ అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములయందు సుఖించుదురు” అని పేతురు చెబుతున్నాడు. యూదా ఇలా వ్రాస్తున్నాడు: వారు “మీ ప్రేమవిందులలో దొంగమెట్టలుగా ఉన్నారు.” (యూదా 12) నీటి క్రింద దాగివుండే మెట్టలు ఎలాగైతే ఓడ అడుగు భాగాన్ని చీల్చివేసి, అజాగ్రత్తగా ఉన్న నావికులను మునిగిపోయేలా చేస్తాయో అలాగే అబద్ధ బోధకులు అజాగ్రత్తగా ఉన్న వారిని భ్రష్టులను చేస్తూ, “ప్రేమవిందుల” సమయంలో వారి ఎడల వేషధారణతో కూడిన ప్రేమను కనబరిచేవారు.
16. (ఎ) “ప్రేమవిందులు” ఏమైవుండినవి, నేడు దుర్నీతిపరులు అలాంటి పరిస్థితులలో ఏ కార్యకలాపాలు జరిగించవచ్చు? (బి) అబద్ధ బోధకులు తమ అవధానాన్ని ఎవరిపై కేంద్రీకరిస్తారు, కాబట్టి అలాంటివారు ఏమి చేయాలి?
16 ఈ “ప్రేమ విందులు,” మొదటి శతాబ్దపు క్రైస్తవులు భోజనాన్ని సహవాసాన్ని అనుభవించి ఆనందించడానికి కూడుకునే సామాజిక సందర్భాలని స్పష్టమౌతుంది. యెహోవాసాక్షులు కూడా నేడు కొన్నిసార్లు బహుశా వివాహ విందు సమయాల్లో, విహారయాత్రల సమయంలో లేక సాయంకాలాలు సామాజికంగా కూడుకుంటారు. బలికాగల వారిని మోసగించడానికి భ్రష్ట వ్యక్తులు అలాంటి సందర్భాలను ఎలా ఉపయోగించుకుంటారు? పేతురిలా వ్రాస్తున్నాడు: వారు “వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు . . . అస్థిరులైనవారి మనస్సులను మరులుకొల్పు”తారు. సత్యమును పూర్తిగా తమ స్వంతము చేసుకోవడంలో విఫలమై, ఆత్మీయంగా స్థిరంగాలేని వారిపై వారు “లోభిత్వమందు సాధకముచేయబడిన” తమ “హృదయము”ను కేంద్రీకరిస్తారు. కాబట్టి, పేతురు కాలంలో జరిగినదాన్ని బట్టి ముందే హెచ్చరింపబడినవారై, జాగ్రత్తగా ఉండండి! ఏ విధమైన అశుద్ధ ప్రవర్తననైనా ప్రతిఘటించండి, దుర్నీతికరమైన ప్రతిపాదనలు చేస్తున్నవారెవరైనా సరే వారి సమ్మోహక శక్తిని బట్టి లేక శారీరక ఆకర్షణను బట్టి మోసపోకండి.—2 పేతురు 2:14.
“బిలాము పోయిన మార్గము”
17. “బిలాము పోయిన మార్గము” ఏది, అది 24,000 మంది ఇశ్రాయేలీయులను ఎలా ప్రభావితం చేసింది?
17 ‘శాపగ్రస్తులైన’ వీరు కొంతకాలం నుండి సత్యమును ఎరిగినవారే. వారు సంఘంలో ఇంకా చురుకైనవారిగానే ఉన్నట్లు కనిపించవచ్చు. కాని పేతురిలా చెబుతున్నాడు: “తిన్ననిమార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమునుబట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను.” (2 పేతురు 2:14, 15) బిలాము మార్గం ఏమిటంటే, తన స్వంత వ్యక్తిగత లాభం కోసం, దుర్నీతికరమైన మోసాన్ని ఉపయోగించమని ఉపదేశించడం. ఇశ్రాయేలీయులు వ్యభిచరించేలా మోసగించగలిగితే దేవుడు వారిని శపిస్తాడని మోయాబు రాజైన బాలాకుతో ఆయన చెప్పాడు. ఫలితంగా, దేవుని ప్రజల్లో అనేకులు మోయాబు స్త్రీలచే మోసగించబడ్డారు, వారి దుర్నీతికరమైన ప్రవర్తనను బట్టి వారిలో 24,000 మంది హతులయ్యారు.—సంఖ్యాకాండము 25:1-9; 31:15, 16; ప్రకటన 2:14.
18. బిలాము ఎంత పట్టుదల కలిగివున్నాడు, దాని ఫలితం అబద్ధ బోధకులకు ఏమి సూచిస్తుంది?
18 బిలాము గాడిద అతనితో మాట్లాడి అతన్ని అడ్డగించింది. అయినప్పటికీ బిలాము “దుర్నీతివలన కలుగు బహుమానమును” ఎంతగా ‘ప్రేమించాడంటే’ అలా జరిగినప్పుడు కూడా అతడు తన “వెఱ్ఱితనము” విడిచిపెట్టలేదు. (2 పేతురు 2:15, 16) ఎంతటి దుష్టత్వం! బిలామువలే, దుర్నీతికి పాల్పడేలా శోధించడం ద్వారా దేవుని ప్రజలను కలుషితం చేయడానికి ప్రయత్నించే వారెవరికైనా శ్రమ తప్పదు! బిలాము తన దుష్టత్వాన్నిబట్టి మరణించాడు, అతని మార్గాన్ని అనుసరించేవారందరికీ ఏమి జరుగుతుందనేదానికి ఇది ముంగుర్తుగా ఉంది.—సంఖ్యాకాండము 31:8.
వారి పైశాచిక మోసాలు
19, 20. (ఎ) బిలాము వంటివారు దేనికి పోల్చబడ్డారు, ఎందుకు? (బి) వారు ఎవరిని ప్రలోభ పెడతారు, ఎలా? (సి) వారి మోసాలు పైశాచికమైనవని మనం ఎందుకు చెప్పవచ్చు, వారినుండి మనల్ని మనం ఎలా కాపాడుకోగలం మరియు ఇతరులను ఎలా కాపాడగలం?
19 బిలాము వంటివారిని వర్ణిస్తూ, పేతురిలా వ్రాస్తున్నాడు: “వీరు నీళ్లులేని బావులును, పెనుగాలికి కొట్టుకొనిపోవు మేఘములునైయున్నారు.” ఎడారిలో దప్పిగొనివున్న ప్రయాణికుడికి, ఎండిన బావి మరణకరంగా ఉండగలదు. అలాంటివాటిని పోలివుండేవారి కొరకు “గాఢాంధకారము భద్రము చేయబడి” ఉండడంలో ఆశ్చర్యం లేదు! పేతురింకా ఇలా కొనసాగిస్తున్నాడు: “వీరు వ్యర్థమైన డంబపుమాటలు పలుకుచు, తామే శరీరసంబంధమైన దురాశలుగలవారై, తప్పుమార్గమందు నడుచువారిలోనుండి అప్పుడే తప్పించుకొనినవారిని పోకిరిచేష్టలచేత మరలుకొల్పుచున్నారు.” వారు “తామే భ్రష్టత్వమునకు దాసులైయుండియు” అనుభవములేని వారికి “స్వాతంత్ర్యము ఇత్తుమని చెప్పు”చూ వారిని మోసగిస్తారని పేతురు చెబుతున్నాడు.—2 పేతురు 2:17-19; గలతీయులు 5:13.
20 అలాంటి భ్రష్ట బోధకుల మోసాలు పైశాచికమైనవి. ఉదాహరణకు, వారిలా చెప్పవచ్చు: ‘మనం బలహీనులమని, కోరికకు లొంగిపోతామని దేవునికి తెలుసు. కాబట్టి మనం ఇష్టానుసారంగా మన లైంగిక కోరికలను తీర్చుకున్నా, దేవుడు దయ చూపిస్తాడు. మనం మన పాపాన్ని ఒప్పుకుంటే, మనం మొదట సత్యంలోకి వచ్చినప్పుడు ఆయన మనల్నెలా క్షమించాడో అలాగే క్షమిస్తాడు.’ శిక్షలేకుండానే ఆమె పాపం చేయవచ్చునని వాగ్దానం చేస్తూ, అపవాది హవ్వ దగ్గర దాదాపు అలాంటి విధానాన్నే ఉపయోగించాడని గుర్తుంచుకోండి. హవ్వ విషయంలో, దేవునికి వ్యతిరేకంగా చేసే పాపం ఆమెకు జ్ఞానాన్నీ స్వేచ్ఛనూ ఇస్తుందని అతడు ఆరోపించాడు. (ఆదికాండము 3:4, 5) అలాంటి భ్రష్టుడైన వ్యక్తి సంఘంతో సహవసిస్తున్నట్లు మనం కనుగొంటే, క్రైస్తవ సంఘంలో బాధ్యతగల వారికి ఆ వ్యక్తి గురించి తెలియజేయడం ద్వారా మనల్ని మనం కాపాడుకోవలసిన, అలాగే ఇతరులను కాపాడవలసిన బాధ్యత మనకుంది.—లేవీయకాండము 5:1.
అనుభవ జ్ఞానము చేత కాపాడబడ్డారు
21-23. (ఎ) అనుభవ జ్ఞానాన్ని అన్వయించుకోవడంలో విఫలం కావడం యొక్క పరిణామాలు ఏవి? (బి) మనం తర్వాత పరిశీలించబోయే ఏ సమస్యను పేతురు చర్చించాడు?
21 “జీవమునకును భక్తికిని” ప్రాముఖ్యమైనదని ఆయన మునుపు చెప్పిన జ్ఞానాన్ని అన్వయించుకోవడంలో విఫలం కావడం యొక్క పరిణామాలను వర్ణిస్తూ పేతురు తన పత్రికలోని ఈ భాగాన్ని ముగిస్తున్నాడు. (2 పేతురు 1:2, 3, 8) ఆయనిలా వ్రాస్తున్నాడు: “వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానముచేత ఈ లోకమాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటిచేత జయింపబడినయెడల, వారి కడవరి స్థితి మొదటి స్థితికంటె మరి చెడ్డదగును.” (2 పేతురు 2:20) ఎంత దుఃఖకరం! పేతురు కాలంలో అలాంటివారు క్షణికమైన లైంగికానందం కొరకు అమర్త్యమైన పరలోక జీవితమనే అమూల్యమైన నిరీక్షణను వదులుకున్నారు.
22 కాబట్టి పేతురిలా చెబుతున్నాడు: “వారు నీతిమార్గమును అనుభవపూర్వకముగా తెలిసికొని, తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞనుండి తొలగిపోవుటకంటె ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక యుండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను.”—2 పేతురు 2:21, 22; సామెతలు 26:11.
23 స్పష్టంగా, తొలి క్రైస్తవులను ప్రభావితం చేయనారంభించిన మరో సమస్య, నేడు కొంతమందిని ప్రభావితం చేస్తున్నదాని వంటిదే. అప్పట్లో కొందరు, వాగ్దానం చేయబడిన క్రీస్తు ప్రత్యక్షత ప్రారంభం కావడం లేదన్నట్లు అనిపిస్తున్నదాని గురించి ఫిర్యాదు చేశారని స్పష్టమౌతుంది. ఈ విషయాన్ని పేతురెలా ప్రస్తావిస్తాడో మనం పరిశీలిద్దాము.
మీకు జ్ఞాపకమున్నాయా?
◻ పేతురు ఏ మూడు హెచ్చరికా ఉదాహరణలను పేర్కొన్నాడు?
◻ అబద్ధ బోధకులు ‘ప్రభుత్వమును ఎలా నిరాకరిస్తారు’?
◻ బిలాము పోయిన మార్గము ఏది, దాన్ని అనుసరించేవారు ఇతరులను మోసగించడానికి ఎలా ప్రయత్నిస్తారు?
◻ అనుభవ జ్ఞానాన్ని అన్వయించుకోవడంలో విఫలం కావడం యొక్క పరిణామాలు ఏవి?
[16, 17వ పేజీలోని చిత్రం]
బిలాము ఒక హెచ్చరికా ఉదాహరణగా ఉన్నాడు