‘విశ్వాసము నిమిత్తము గట్టి పోరాటాన్ని పోరాడండి’!
“పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ [“విశ్వాసము,” NW] నిమిత్తము . . . [“గట్టి పోరాటము,” NW] పోరాడవలె[ను].”—యూదా 3.
1. నేడు నిజ క్రైస్తవులు ఏ భావంలో యుద్ధం చేస్తున్నారు?
యుద్ధంలో సైనికుల జీవితమార్గం ఎల్లప్పుడూ కష్టంగానే ఉంటుంది. ఆయుధ సామాగ్రినంతటినీ ధరించుకొని, ఎండనకా వాననకా వేలాది కిలోమీటర్లు కవాతుచేయడాన్నీ, ఆయుధాల్ని ఉపయోగించడంలో కఠినమైన శిక్షణను పొందడాన్నీ లేక, పెద్ద పెద్ద ఉపద్రవాల్ని తెచ్చిపెట్టే హింసాత్మక పరిస్థితులన్నింటి నుండీ మిమ్మల్ని మీరు కాపాడుకోవడాన్నీ ఊహించుకోండి. అయినా, దేశాలమధ్య జరిగే యుద్ధాల్లో నిజ క్రైస్తవులు భాగం వహించరన్నది నిజం. (యెషయా 2:2-4; యోహాను 17:14) అయినప్పటికీ, ఆధ్యాత్మిక భావంలో చూస్తే, మనమంతా యుద్ధంలో ఉన్నామనే విషయాన్ని మనమెన్నటికీ మర్చిపోకూడదు. యేసుక్రీస్తు ఎడలా, భూమిపై ఉన్న ఆయన అనుచరుల ఎడలా సాతానుకు పూర్తి ద్వేషం ఉంది. (ప్రకటన 12:17) నిజానికి, యెహోవా దేవుని సేవ చేయాలని నిశ్చయించుకొనే వారందరూ ఆధ్యాత్మిక యుద్ధాన్ని సాగించే సైనికులుగా చేర్చుకోబడుతున్నారు.—2 కొరింథీయులు 10:4.
2. యూదా క్రైస్తవ యుద్ధాన్ని ఏ విధంగా వర్ణిస్తున్నాడు, దాన్ని తాళుకోవడానికి యూదా పత్రిక మనకెలా సహాయపడగలదు?
2 యేసు మారుటి సహోదరుడైన యూదా ఇలా రాస్తున్నాడు: “ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణనుగూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తిగలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ [“విశ్వాసము,” NW] నిమిత్తము మీరు [“గట్టి పోరాటము,” NW] పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను.” (యూదా 3) ‘మంచి పోరాటం పోరాడాలని’ యూదా క్రైస్తవులకు ఉద్బోధిస్తున్నప్పుడు, “వేదన” కోసం ఉపయోగించే మాటకు సంబంధించిన ఓ పదాన్ని ఆయన ఉపయోగిస్తున్నాడు. అవును, ఈ పోరాటం కష్టంగానూ, వేదన కల్గించేదిగానూ ఉండవచ్చు! ఈ యుద్ధంలో తాళుకోవడం కష్టంగా ఉన్నట్టు మీకు కొన్నిసార్లు అన్పించిందా? చిన్నదే అయినా శక్తివంతమైన యూదా పత్రిక మనకు సహాయపడగలదు. ఆ పత్రిక అనైతికతను నిరోధించమనీ, దైవికంగా ఏర్పాటుచేయబడిన అధికారాన్ని గౌరవించమనీ, దేవుని ప్రేమలో మనం నిలిచివుండాలనీ ఇది మనకు ఉద్బోధిస్తోంది. ఈ సలహాను ఎలా అన్వయించుకోవాలో చూద్దాం.
అనైతికతను నిరోధించడం
3. యూదా కాలంలోని క్రైస్తవ సంఘం ఏ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంది?
3 సాతానుపై సాగించే పోరాటంలో తన తోటి క్రైస్తవులందరూ విజయాన్ని సాధించడం లేదన్న విషయాన్ని యూదా గ్రహించగలిగాడు. అత్యవసరమైన పరిస్థితిని మంద ఎదుర్కొంది. భ్రష్టులు “జొరబడి యున్నారు” అని యూదా రాస్తున్నాడు. వీళ్లు వంచనాత్మకంగా అనైతికత్వాన్ని పెంపొందిస్తున్నారు. వీళ్లు “దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు” తమ క్రియల్ని సమర్థించుకుంటూ వంచనతో తెలివిగా వాదించారు. (యూదా 4) ప్రాచీనకాలపు అజ్ఞేయతావాదుల వలే, బహుశా వాళ్లు ఒకడు ఎంతగా పాపంచేస్తే వాడంతగా దేవుని కృపను పొందుతాడు కాబట్టి పాపాన్ని అధికంగా చేయడం మరింత ప్రయోజనకరమైనదని తర్కించి ఉండవచ్చు! లేకపోతే కృపగల దేవుడు తమను ఎన్నటికీ శిక్షించడనే నిర్ధారణకు బహుశా వాళ్లు వచ్చి ఉంటారు. ఏదియేమైనప్పటికీ, వాళ్ల ఆలోచనా ధోరణి సరియైనది కాదు.—1 కొరింథీయులు 3:19.
4. గత కాలాల్లో యెహోవా దేవుని తీర్పులను గూర్చిన ఏ మూడు ఉదాహరణలను యూదా ఉటంకించి చెప్పాడు?
4 గత కాలాల్లో యెహోవా దేవుని తీర్పులను గూర్చిన మూడు ఉదాహరణల్ని అంటే “నమ్మకపోయిన” ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా; స్త్రీలతో సంబంధం పెట్టుకుని పాపం చేసేందుకు “తమ ప్రధానత్వమును నిలుపుకొన[ని] . . . దేవదూతల”కు వ్యతిరేకంగా; “వ్యభిచారము చేయుచు, పరశరీరానుసారులైన” సొదొమ గొమొఱ్ఱాలకు వ్యతిరేకంగా దేవుడు తీర్చిన తీర్పులను ఎత్తి చెప్పడం ద్వారా వారి దుష్ట తర్కనల్ని యూదా ఖండిస్తున్నాడు. (యూదా 5-7; ఆదికాండము 6:2-4; 19:4-25; సంఖ్యాకాండము 14:35) ప్రతీ సందర్భంలోనూ యెహోవా పాపులపై తిరుగులేని తీర్పును అమలుచేశాడు.
5. ప్రాచీనకాలంలోని ఏ ప్రవక్త చెప్పిన ప్రవచనాన్ని యూదా ఎత్తి రాశాడు, మరి ఆ ప్రవచనం దాని నెరవేర్పు యొక్క సంపూర్ణ ఖచ్చితత్వాన్ని ఎలా వ్యక్తపర్చింది?
5 అటు తర్వాత, యూదా మరింత విస్తృతమైన ప్రభావాన్ని కల్గివున్న తీర్పును సూచిస్తున్నాడు. ఆయన హనోకు ప్రవచనాన్ని అంటే ప్రేరేపిత లేఖనాల్లో వేరే ఎక్కడా కన్పించని ఓ ప్రకరణాన్ని ఎత్తి చెబుతున్నాడు.a (యూదా 14, 15) భక్తిహీనులందరినీ వారి భక్తిహీన క్రియలతోపాటూ యెహోవా తీర్పుతీర్చబోయే సమయాన్ని గురించి హనోకు ప్రవచించాడు. ఆసక్తికరంగా, హనోకు భూతకాలంలో మాట్లాడాడు, ఎందుకంటే దేవుని తీర్పులు ఎంత ఖచ్చితమైనవంటే, అవి అప్పటికే నెరవేరిపోయినట్లుగా ఆయన భావించాడు. ప్రజలు హనోకునూ, అటు తర్వాత నోవహునూ అపహాస్యంచేసి ఉండొచ్చు గానీ, ఆ అపహాసకులందరూ భూ వ్యాప్తంగా సంభవించిన జలప్రళయంలో కొట్టుకుపోయారు.
6. (ఎ) యూదా కాలంలోని క్రైస్తవులకు దేన్ని గురించి గుర్తు చేయాల్సి వచ్చింది? (బి) యూదా జ్ఞాపికల్ని మనం హృదయంలోనికి ఎందుకు తీసుకోవాలి?
6 ఈ దైవిక తీర్పుల్ని గురించి యూదా ఎందుకు రాశాడు? గత తీర్పుల్లో తీర్పుతీర్చబడిన వాళ్ల పాపాల్లాగే తన కాలంలో క్రైస్తవ సంఘాలతో సహవసించిన కొందరు చేసిన పాపాలు నికృష్టమైనవిగానూ, నిందార్హమైనవిగానూ ఉన్నాయని ఆయనకు తెలుసు గనుకనే ఆయన రాశాడు. కొన్ని ప్రాథమిక ఆధ్యాత్మిక సత్యాల్ని గూర్చి సంఘాలకు జ్ఞాపకం చేయడం అవసరమని యూదా ఆ విధంగా రాస్తున్నాడు. (యూదా 5) వాళ్లు చేస్తున్నవాటిని యెహోవా దేవుడు చూశాడనే విషయాన్ని వాళ్లు మర్చిపోయినట్టు స్పష్టమౌతుంది. అవును, తన సేవకులు తన చట్టాల్ని బాహాటంగా ఉల్లంఘిస్తూ, తమ్మును తామూ, ఇతరుల్నీ మలినపర్చుకుంటున్నపుడు ఆయన చూస్తాడు. (సామెతలు 15:3) అలాంటి చర్యలు ఆయన్నెంతగానో నొప్పిస్తాయి. (ఆదికాండము 6:6; కీర్తన 78:40) మానవమాత్రులమైన మనం విశ్వాధిపతి భావాల్ని ప్రభావితం చేయగలమనేది విస్మయాన్ని కల్గించే తలంపే. ఆయన మనల్ని అనుదినమూ గమనిస్తాడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు అడుగుజాడల్ని అనుసరించేందుకు మనం చేయగల్గినంతా మనం చేస్తున్నప్పుడు, మన ప్రవర్తన ఆయన హృదయాన్ని సంతోషపరుస్తుంది. కాబట్టి యూదా అలాంటి జ్ఞాపికల్ని దయచేస్తున్నప్పుడు వాటినిబట్టి ఎన్నడూ ఉక్రోషాన్ని ప్రదర్శించక లక్ష్యపెడదాం.—సామెతలు 27:11; 1 పేతురు 2:21.
7. (ఎ) గంభీరమైన తప్పిదంలో చిక్కుకున్నవారు సహాయాన్ని సత్వరమే అర్థించడం ఎందుకు ప్రాముఖ్యం? (బి) మనమంతా అనైతికతను ఎలా విడనాడగలం?
7 యెహోవా చూడడం మాత్రమేగాక చర్య తీసుకొంటాడు. న్యాయదేవునిగా, ఆయన దుష్టులపైకి శిక్షను తన నిర్ణీత కాలంలో తీసుకొస్తాడు. (1 తిమోతి 5:24) ఆయన తీర్పులు కేవలం గతించిన చరిత్ర మాత్రమేననీ, తాము చేసే దుష్టత్వాన్ని ఆయన పట్టించుకోడనీ తర్కించేవాళ్లు తమను తాము మోసపుచ్చుకుంటున్నారు. నేడు అనైతికతలో ఉన్న వారెవరైనా సరే, వాళ్లు క్రైస్తవ పెద్దల దగ్గరనుండి సహాయాన్ని సత్వరమే అర్థించడం ఎంత ప్రాముఖ్యమో కదా! (యాకోబు 5:14, 15) మన ఆధ్యాత్మిక యుద్ధంలో అనైతికత తీసుకురాగల ముప్పు విషయమై మరింత అప్రమత్తంగా మనమంతా ఉంటాం. మన మధ్య నుండి వెళ్లగొట్టబడిన వ్యక్తులు అంటే క్షతగాత్రులు ప్రతీ సంవత్సరమూ ఉంటూనే ఉన్నారు, వారిలో అత్యధిక శాతం మంది పశ్చాత్తాపపడకుండా అనైతిక క్రియల్ని చేస్తున్నందుననే వెళ్లగొట్టబడ్డారు. అలాంటి త్రోవలోనికి మనల్ని నడిపించ మొదలుపెట్టే ఏ శోధనల్నైనా సరే, వాటిని నిరోధించేందుకు దృఢంగా తీర్మానించుకోవాలి.—మత్తయి 26:41 పోల్చండి.
దైవికంగా ఏర్పాటు చేయబడిన అధికారాన్ని గౌరవించడం
8. యూదా 8వ వచనంలో ప్రస్తావించబడిన ‘మహిమాన్వితులు’ ఎవరు?
8 దైవికంగా ఏర్పాటు చేయబడిన అధికారం ఎడల గౌరవం కొరవడడమనేది యూదా పేర్కొన్న మరొక సమస్య. ఉదాహరణకు, ఆ దుష్టులు “మహాత్ములను [“మహిమాన్వితులను”, NW] దూషించుచు ఉన్నారు” అని 8వ వచనంలో వారిపై నిందమోపుతున్నాడు. ఈ ‘మహిమాన్వితులు’ ఎవరు? వాళ్లు అపరిపూర్ణ మానవులే అయినా యెహోవా పరిశుద్ధాత్మ ద్వారా వారికి అప్పగించబడిన బాధ్యతలు వాళ్లకుండేవి. ఉదాహరణకు, దేవుని మందను కాసే పని అప్పగించబడిన పెద్దలు సంఘంలో ఉండేవారు. (1 పేతురు 5:2) అపొస్తలుడైన పౌలు వంటి ప్రయాణ పైవిచారణకర్తలు కూడా ఉండేవారు. క్రైస్తవ సంఘమంతటినీ ప్రభావితంచేసే నిర్ణయాల్ని తీసుకొంటూ పరిపాలక సభగా పనిచేసిన పెద్దల సమూహం యెరూషలేములో ఉండేది. (అపొస్తలుల కార్యములు 15:6) సంఘాల్లోని కొందరు అలాంటి పురుషులను దూషిస్తూ, లేక నిందిస్తూ మాట్లాడుతున్న విషయమై యూదా ఎంతగానో కలతచెందాడు.
9. అధికారం ఎడల అగౌరవం చూపించిన ఏ ఉదాహరణల్ని యూదా ఉల్లేఖిస్తున్నాడు?
9 యూదా అలా అమర్యాదపూర్వకంగా మాట్లాడడాన్ని ఖండించడానికి, 11వ వచనంలో మరి మూడు ఉదాహరణలను జ్ఞాపికలుగా ఉల్లేఖిస్తున్నాడు: కయీను, బిలాము, కోరహు. కయీను యెహోవా దేవుని ప్రేమపూర్వకమైన సలహాను నిర్లక్ష్యపెట్టి, హత్యచేయాలనే ఉద్దేశంతో కూడిన ద్వేషపూరితమైన తన పనిని ఇష్టపూర్వకంగా వెంబడించాడు. (ఆదికాండము 4:4-8) నిస్సందేహంగా మానవాతీత మూలం నుండి వచ్చిన హెచ్చరికలను బిలాము పలుమార్లు పొందాడు—ఆయన సొంత గాడిద కూడా ఆయనతో మాట్లాడింది ! అయినా బిలాము దేవుని ప్రజలకు వ్యతిరేకంగా కుట్ర పన్నడంలో స్వార్థపూరితంగా ముందుకే సాగాడు. (సంఖ్యాకాండము 22:28, 32-34; ద్వితీయోపదేశకాండము 23:5) కోరహుకు బాధ్యతాయుతమైన స్థానం ఉన్నప్పటికీ, ఆయన దానితో సంతృప్తిచెందలేదు. భూమ్మీద నున్నవారిలో మిక్కిలి సాత్వికుడైన మోషేపై తిరుగుబాటు బావుటాను ఎగరవేశాడు.—సంఖ్యాకాండము 12:3; 16:1-3, 32.
10. ‘మహిమాన్వితులను దూషిస్తూ’ మాట్లాడే ఉరిలో నేడు కొందరెలా చిక్కుకున్నారు, అలా మాట్లాడడాన్ని ఎందుకు విడనాడాలి?
10 బాధ్యతాయుతమైన స్థానాల్లో యెహోవా ఉపయోగిస్తున్న వారిచ్చే సలహాను వినాలనీ, వారిని గౌరవించాలనీ ఈ ఉదాహరణలు మనకెంత స్పష్టంగా బోధిస్తున్నాయో కదా! (హెబ్రీయులు 13:17) నియమించబడిన పెద్దలు కూడా మనలాగే అపరిపూర్ణులే గనుక వారిలో తప్పుల్ని పట్టుకోవడం ఎంతో సలభం. కానీ మనం వారి తప్పుల పైనే మనస్సును లగ్నం చేస్తే, వారికి గౌరవం చూపించే విషయంలో చిన్నచూపు చూస్తే, మనం ‘మహిమాన్వితులను దూషిస్తున్నట్టు’ కాదా? 10వ వచనంలో NW, “తమకు నిజంగా తెలియని వాటిని గురించి దూషణకరంగా మాట్లాడుతున్న” వాళ్లను గురించి యూదా ప్రస్తావించాడు. పెద్దల సమూహంగానీ లేక న్యాయనిర్ణయ కమిటీగానీ తీసుకొన్న ఓ నిర్ణయాన్ని కొంతమంది కొన్నిసార్లు విమర్శిస్తారు. కానీ, ఓ నిర్ణయానికి రావడానికి ముందు పెద్దలు పరిశీలించాల్సిన వివరాలన్నిటిని గురించి వాళ్లకు తెలియదు. కాబట్టి తమకు నిజంగా తెలియని వాటిని గురించి దూషణకరంగా ఎందుకు మాట్లాడాలి? (సామెతలు 18:13) అలా అదేపనిగా ప్రతికూలంగా మాట్లాడే వాళ్లు, సంఘంలో విభజనలకు కారణం కాగలరు. బహుశ వారిని తోటి సహవాసుల సమావేశాల్లో అపాయకరమైన “దొంగ మెట్టలు”గా పోల్చవచ్చు. (యూదా 12, 16, 19) ఇతరులకు ఆధ్యాత్మిక అపాయాన్ని తెచ్చిపెట్టాలని మనమెన్నటికీ అనుకోకూడదు. బదులుగా, దేవుని మంద విషయంలో బాధ్యతగల పురుషులు పడిన కష్టాన్నిబట్టీ, చూపిన అంకితభావాన్ని బట్టీ వారిని ప్రశంసించాలని మనమంతా తీర్మానించుకుందాం.—1 తిమోతి 5:17.
11. సాతానుకు వ్యతిరేకంగా దూషణకరమైనరీతిలో తీర్పుతీర్చడానికి మిఖాయేలు ఎందుకు తెగించలేదు?
11 యుక్తమైన రీతిలో ఏర్పాటు చేయబడిన అధికారాన్ని గౌరవించినవాని మాదిరిని యూదా ఎత్తి చెబుతున్నాడు. ఆయనిలా రాస్తున్నాడు: “ప్రధానదూతయైన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషేయొక్క శరీరమునుగూర్చి తర్కించినప్పుడు, దూషించి తీర్పుతీర్చ తెగింపక—ప్రభువు [“యెహోవా,” NW] నిన్ను గద్దించును గాక అనెను.” (యూదా 9) ప్రేరేపిత లేఖనాల్లో యూదా మాత్రమే రాసిన ఈ ఆకట్టుకొనే వృత్తాంతం, రెండు భిన్నమైన వేర్వేరు గుణపాఠాల్ని బోధిస్తోంది. ఒక వైపున అది, తీర్పుతీర్చడాన్ని యెహోవాకు విడిచిపెట్టమని మనకు బోధిస్తోంది. అబద్ధ ఆరాధనను పెంపొందింపజేయాలనే ఉద్దేశంతో విశ్వాసియైన మోషే శరీరాన్ని దుర్వినియోగం చేయాలని సాతాను కోరుకున్నాడన్నది స్పష్టం. ఎంత దుర్మార్గపు ఆలోచనో కదా! అయితే, తీర్పు తీర్చే అధికారం యెహోవాకు మాత్రమే ఉంది గనుక మిఖాయేలు వినయంతో తీర్పుతీర్చడానికి తెగించలేదు. యెహోవా సేవ చేయడానికి ప్రయత్నిస్తున్న విశ్వాసులైన పురుషులకు తీర్పుతీర్చే విషయంలో మనం ఇంకెంతగా తెగించకుండా ఉండాలి.
12. క్రైస్తవ సంఘంలో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న వ్యక్తులు మిఖాయేలు మాదిరినుండి ఏమి నేర్చుకోవచ్చు?
12 మరో వైపున, క్రైస్తవ సంఘంలో తగినంత అధికారాన్ని కల్గివున్న వాళ్లు కూడా మిఖాయేలు నుండి ఓ గుణపాఠాన్ని నేర్చుకోవచ్చు. మిఖాయేలు దేవదూతలందరికీ ముఖ్యుడైన “ప్రధానదూత” అయినప్పటికీ, ఆయన రెచ్చగొట్టబడుతున్నా సరే తన అధికార స్థానాన్ని దుర్వినియోగపర్చలేదు. విశ్వాసులైన పెద్దలు తమ అధికారాన్ని దుర్వినియోగపర్చడమంటే యెహోవా సర్వాధిపత్యాన్ని అగౌరవపర్చడమేనని గుర్తిస్తూ ఆ నమ్మకమైన మాదిరిని సన్నిహితంగా అనుసరించాలి. క్రైస్తవ సంఘాల్లో గౌరవ స్థానాల్ని కల్గివున్నా తమ అధికారాన్ని దుర్వినియోగపర్చేవారిని గురించి చెప్పడానికి యూదా పత్రికలో ఎంతో ఉంది. ఉదాహరణకు యూదా, “తమ్మునుతాము నిర్భయముగా పోషించుకొం[టున్న కాపరులను]” తీవ్రంగా అధిక్షేపిస్తూ 12 నుండి 14 వచనాల్లో రాశాడు. (యెహెజ్కేలు 34:7-10 పోల్చండి.) వేరే మాటల్లో చెప్పాలంటే, యెహోవా మంద ప్రయోజనంగాక తమ ప్రయోజనమే వారి ప్రథమాసక్తియై ఉంది. అలాంటి ప్రతికూలమైన మాదిరులనుండి పెద్దలు నేడెంతో నేర్చుకోవాల్సి ఉంది. నిజానికి, మనమెలా కాకూడదు అనే విషయాన్ని యూదా మాటలు ఇక్కడ తెలియజేస్తున్నాయి. మనం స్వార్థానికి లొంగిపోయినప్పుడు, మనం క్రీస్తు సైనికులం కాము; వ్యక్తిగత ఆశల నిమిత్తం పోరాటాన్ని సల్పడంలో మనమెంతో బిజీగా ఉంటాం. దానికి బదులుగా, మనమంతా యేసు మాటలకు అనుగుణంగా జీవిద్దాం: “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.”—అపొస్తలుల కార్యములు 20:35.
‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
13. మనమంతా దేవుని ప్రేమలో నిలిచి ఉండాలని మరింత ఆసక్తిగా ఎందుకు కోరుకోవాలి?
13 ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’ అని హృదయాన్ని ఉత్తేజపర్చే సలహాను యూదా తన పత్రిక ముగింపులో ఇస్తున్నాడు. (యూదా 20) క్రైస్తవ యుద్ధాన్ని సాగించేందుకు యెహోవా దేవుని ప్రేమలో నిలిచి ఉండడంతప్ప మనకు మరేది సహాయపడలేదు. ప్రేమ, యెహోవా దేవుని లక్షణాల్లో ప్రధానమైనది. (1 యోహాను 4:8) రోములో ఉన్న క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు ఇలా రాస్తున్నాడు: “మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.” (రోమీయులు 8:38, 39) అయితే, ఆ ప్రేమలో మనమెలా నిలిచి ఉంటాం? యూదా చెప్పిన ప్రకారంగా, మనం తీసుకోగల మూడు చర్యల్ని గమనించండి.
14, 15. (ఎ) మనల్ని మనం ‘అతిపరిశుద్ధమైన విశ్వాసంపై’ కట్టుకోవడం అంటే అర్థమేమిటి? (బి) మన ఆధ్యాత్మిక కవచపు స్థితిగతుల్ని మనమెలా పరిశీలించుకోవచ్చు?
14 మొదటిగా, మన “అతిపరిశుద్ధమైన విశ్వాసం”పై మనల్ని మనం కట్టుకోవడంలో కొనసాగాలని యూదా మనకు చెబుతున్నాడు. (యూదా 20, NW) దీనికి ముందున్న శీర్షికలో చూసినట్లుగా, ఇది నిరంతరమూ కొనసాగే ప్రక్రియ. వాతావరణశక్తుల తీక్షణమైన దాడులను తట్టుకొని నిలబడడానికి అంతకంతకూ మరింతగా పటిష్టపర్చాల్సిన కట్టడాల లాంటి (ఇళ్లలాంటి) వారం మనం. (మత్తయి 7:24, 25 పోల్చండి.) కాబట్టి మనమెన్నటికీ అతినమ్మకాన్ని కలిగివున్నవారంగా ఉండకూడదు. బదులుగా, అంతకంతకూ పటిష్టపర్చబడుతూ, మరింత విశ్వాసాన్ని కలిగివున్న క్రీస్తు సైనికులుగా తయారౌతూ మనల్ని విశ్వాసపు పునాదిపై ఎక్కడ కట్టుకోవాలో మనం గమనిద్దాం. ఉదాహరణకు, ఎఫెసీయులు 6:11-18 వచనాల్లో వర్ణించబడిన ఆధ్యాత్మిక కవచం యొక్క భాగాల్ని మనం పరిశీలించవచ్చు.
15 మన సొంత ఆధ్యాత్మిక కవచం యొక్క పరిస్థితి ఏమిటి? మన “విశ్వాసమను డాలు” అది ఉండాల్సినంత బలంగా ఉందా? ఇటీవల గడిచిపోయిన సంవత్సరాల్ని మనమోసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, కూటాలకు హాజరుకావడం తగ్గిపోవడమూ, పరిచర్య కొరకైన ఆసక్తి కోల్పోవడమూ, లేక వ్యక్తిగత పఠనం విషయంలో ఉత్సాహం సన్నగిల్లిపోవడమూ వంటి మందగిల్లే సూచనలను కొన్నింటిని మనం గుర్తిస్తున్నామా? అలాంటి సూచనలు అపాయకరమైనవి ! సత్యమందు మనల్ని మనం కట్టుకునేందుకూ, బలపర్చుకునేందుకూ మనం ఇప్పుడు చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.—1 తిమోతి 4:15; 2 తిమోతి 4:2; హెబ్రీయులు 10:24, 25.
16. పరిశుద్ధాత్మలో ప్రార్థించడం అంటే అర్థమేమిటి, యెహోవాను మనం క్రమంగా అడగాల్సిన ఒక విషయమేమిటి?
16 దేవుని ప్రేమలో నిలిచి ఉండడానికి గల రెండవ మార్గం ఏమిటంటే “పరిశుద్ధాత్మలో ప్రార్థన” చేయడమే. (యూదా 20) యెహోవా ఆత్మ ప్రభావం క్రింద, ఆయన ఆత్మ ప్రేరేపిత వాక్యానుసారంగా ప్రార్థించడమని దాని అర్థం. యెహోవా చెంతకు వ్యక్తిగతంగా సమీపించడానికీ, ఆయన ఎడలగల మన భక్తిని వ్యక్తపర్చడానికీ ప్రార్థన అనేదొక ప్రాముఖ్యమైన మాధ్యమం. ఈ అద్భుతకరమైన ఆధిక్యతను మనమెన్నటికీ అలక్ష్యం చేయకూడదు! మనం ప్రార్థించినప్పుడు, మనం పరిశుద్ధాత్మ కోసం అడుగవచ్చు, నిజానికి అడుగుతూ ఉండవచ్చు. (లూకా 11:13) మనకు అందుబాటులో ఉన్న అత్యంత బలమైన శక్తి అదే. అలాంటి సహాయంతో, మనం ఎల్లప్పుడూ దేవుని ప్రేమలో నిలిచి ఉండి, క్రీస్తు సైనికులవలే తాళుకోవచ్చు.
17. (ఎ) కనికరం విషయంలో యూదా చూపించిన మాదిరి ఎందుకంత విశిష్టమైనది? (బి) కనికరాన్ని చూపించడంలో మనలో ప్రతి ఒక్కరమూ ఎలా కొనసాగగలం?
17 మూడవదిగా, కనికరాన్ని ఎడతెగకుండా చూపుతూ ఉండమని యూదా మనకు ఉద్బోధిస్తున్నాడు. (యూదా 22) ఈ విషయంలో ఆయన చూపించిన సొంత మాదిరి విశిష్టమైనది. క్రైస్తవ సంఘంలోనికి చొరబడుతున్న అవినీతి, అనైతికత్వం, భ్రష్టత్వం వంటివాటి విషయంలో ఆయన కలతచెందడం సమంజసమే. అయినా, ఆయన కనికరం వంటి “మృదువైన” గుణాన్ని చూపించలేనంతగా పరిస్థితులు అపాయకరంగా ఉన్నాయనే దృక్పథాన్ని అలవర్చుకుంటూ భయానికి లోనైపోలేదు. కానీ, సందేహాలతో కొట్టుమిట్టాడుతున్న వారితో దయాపూర్వకంగా తర్కిస్తూ, గంభీరమైన పాపంలో కూరుకుపోబోయే వారిని ‘అగ్నిలోనుండి లాగుతూ’ సాధ్యమైనప్పుడల్లా దయను చూపించడంలో ముందుకుసాగమని ఆయన తన సహోదరులకు ఉద్బోధించాడు. (యూదా 23; గలతీయులు 6:1) ఈ కష్టకాలాల్లో పెద్దల కొరకు ఎంత శ్రేష్ఠమైన ఉద్బోధనో కదా! వాళ్లు కూడా అవసరమైనచోట స్థిరంగా ఉంటూనే, కనికరాన్ని చూపించడానికి ఆధారమున్న ప్రతీచోటా దాన్ని చూపించడానికి కృషి చేస్తారు. అదే విధంగా, మనమంతా ఒకరి ఎడల మరొకరం కనికరాన్ని చూపించాలనుకుంటాం. ఉదాహరణకు, చిన్న చిన్న విషయాలపై ఉక్రోషాన్ని పెంపొందించుకోవడానికి బదులుగా, మన క్షమాగుణంతో మనం ఉదారులంగా ఉండగలం.—కొలొస్సయులు 3:13.
18. మన ఆధ్యాత్మిక పోరాటమందు విజయం పొందే విషయంలో మనమెందుకు నిశ్చయంగా ఉండగలం?
18 మనం చేసే పోరాటం సులభమైనదేమీ కాదు. యూదా చెబుతున్నట్టుగా అది “గట్టి పోరాటము.” (యూదా 3, NW) మన శత్రువులు శక్తిమంతులు. సాతాను మాత్రమేగాక అతని దుష్ట లోకమూ, మన సొంత అపరిపూర్ణతలూ అన్నీ కలసి మూక్కుమ్ముడిగా మనకు వ్యతిరేకంగా మొహరించి ఉన్నాయి. కానీ, మనం విజయాన్ని సాధిస్తామనే విషయంలో సంపూర్ణ నమ్మకాన్ని కలిగి ఉండవచ్చు! ఎందుకు? ఎందుకంటే మనం యెహోవా పక్షాన ఉన్నాం. యెహోవా “మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును” పొందుటకు అర్హుడనే జ్ఞాపికతో యూదా తన పత్రికను ముగిస్తున్నాడు. (యూదా 24) అది భక్తిపూర్వక భయాన్ని కల్గించే తలంపు కాదా? అయితే, ఇదే దేవుడు ‘తొట్రిల్లకుండ మిమ్మును కాపాడ’గలడా అనే విషయంలో సంశయమేమైనా ఉందా? (యూదా 24) ఎంతమాత్రమూ లేదు! అనైతికతనూ నిరోధించడంలో, దైవికంగా ఏర్పాటుచేయబడిన అధికారాన్ని గౌరవించడంలో, మనల్ని మనం దేవుని ప్రేమలో ఉంచుకొనడంలో మనలో ప్రతి ఒక్కరమూ ముందుకు కొనసాగాలని నిశ్చయించుకుందాం. ఆ విధంగా, మనమంతా సమష్టిగా మహిమకరమైన విజయాన్ని అనుభవిస్తాం.
[అధస్సూచి]
a అప్రమాణిక హనోకు గ్రంథం నుండి యూదా ఎత్తి రాస్తున్నాడని కొంతమంది పరిశోధకులు నొక్కి చెబుతున్నారు. అయినా, “‘అతుకుల బొంతయైన హనోకు గ్రంథమునకు మూలాధారమేమిటి?’ అని మనం అడుగుతాం. ఈ గ్రంథమొక చేర్పు మాత్రమే, దానిలోని వివిధ భాగాల యొక్క తారీఖుల్ని గురించి కచ్చితంగా ఎవరికీ తెలియవు . . . ; దీనిలో కొన్ని వ్యక్తీకరణలు యూదా నుండే తీసుకొనబడి ఉండవచ్చు” అని ఆర్. సి. హెచ్. లిన్స్కే అంటున్నాడు.
పునఃసమీక్ష కొరకైన ప్రశ్నలు
◻ అనైతికతను నిరోధించమని యూదా పత్రిక మనకెలా బోధిస్తుంది?
◻ దైవికంగా ఏర్పాటుచేయబడిన అధికారాన్ని గౌరవించడం ఎందుకంత ప్రాముఖ్యం?
◻ సంఘ అధికారాన్ని దుర్వినియోగం చేయడం విషయంలో అంత గంభీరమైనది ఏమిటి?
◻ దేవుని ప్రేమలో నిలిచివుండేలా మనమెలా కృషిచేయవచ్చు?
[15వ పేజీలోని చిత్రం]
రోమా సైనికులు చేసిన యుద్ధంలా గాక, క్రైస్తవులు చేసే యుద్ధం ఆధ్యాత్మికమైనది
[18వ పేజీలోని చిత్రం]
క్రైస్తవ కాపరులు స్వార్థంతో గాక ప్రేమతో సేవచేస్తారు